Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

నీ కౌగిలిలో తలదాచీ!

[వేలూరి ప్రమీలా శర్మ గారు రచించిన ‘నీ కౌగిలిలో తలదాచీ!’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]

వెచ్చని నిట్టూర్పుల సెగను చల్లార్చడానికి వెన్నెల చినుకుల తడిని మోసుకువస్తున్న మలయమారుతం చల్లగా తాకుతోంది. డాబా మీదకు అల్లుకున్న తీగల్లోని సన్నజాజుల సువాసన మరులు రేకెత్తిస్తుంటే.. తమకంతో మూసుకున్న నిషిత కనురెప్పలపై పెదవుల తడిని అద్దుతూ మెల్లగా యుద్ధానికి సిద్ధం చేస్తున్నాడు ఆర్యన్. ఆకుల మధ్యనుంచి నక్షత్ర కాంతులు లోతైన ఆమె నాభి చుట్టూ దోబూచులాడుతూ మెరుస్తూ కవ్విస్తున్నాయి. నిభాయించుకోలేక ఆత్రంగా ఆక్రమించుకుంటున్న ఆతని వీపు చుట్టూ ఆమె చేతులు బిగసుకుంటున్నాయి.

“నేనొచ్చి వారం రోజులు కూడా కాలేదు.. అప్పుడే ఇంత బెంగొచ్చేసిందే అయ్యగారికి? సెలవు పెట్టుకుని మరీ వచ్చి వాలిపోయారు” చెదిరిన వస్త్రాలు సరిచేసుకుంటూ కళ్ళతో కొంటెగా నవ్వుతూ అడిగింది నిషిత.

ఆమె ఒడిలో పడుకుని మునిపంట పట్టివుంచిన పైటను ముఖంపైకి లాక్కుని మబ్బు తెరలవెనుక దాగిన చంద్రుడిలా తృప్తిగా ఆనందంతో కళ్ళు మూసుకున్నాడు ఆర్యన్. ఇద్దరిమధ్యా కాస్సేపు నిశ్శబ్దం.

“వేసవి సెలవుల పేరుతో నన్నొదిలి ఇలా పుట్టింటికి వచ్చెయ్యడం నీకేమైనా న్యాయంగా ఉందా? పిల్లల్నీ, నిన్నూ ఎంత మిస్సవుతున్నానో తెలుసా? ఇంట్లో ఒక్కడినే ఉండలేక ఎక్కువసేపు ఆఫీసులోనే గడుపుతున్నాను. నావల్ల కావట్లేదు నిషితా! వచ్చెయ్యకూడదా? ప్లీజ్!!” దిగాలుగా మెహం పెట్టి అడుగుతున్న భర్త జుత్తులోకి వేళ్లు పోనిచ్చి.. కళ్ళతోనే కుదరదన్నట్టు సమాధానమిచ్చింది.

“హైస్కూల్ చదువులకు వచ్చేవరకూ సమ్మర్ వెకేషన్‌లో ఇంట్లో పిల్లల అల్లరి భరించడం చాలా కష్టం ఆర్యన్. ఇక్కడుంటే నాన్నగారు రోజూ దగ్గరుండి సమ్మర్ క్లాసెస్‌కి తీసుకెళ్లి తీసుకొస్తారు. మన అపార్ట్మెంట్లో గట్టిగా గెంతడానికి కూడా లేదు. ఇక్కడైతే చుట్టుపక్కల పిల్లలతో ఓపెన్ ప్లేస్‌లో చక్కగా ఆడుకుంటున్నారు. నాక్కూడా అమ్మకి పనుల్లో సాయం చేస్తూ, పచ్చళ్ళవీ పెట్టడం నేర్చుకున్నట్టు ఉంటుంది. ఏమంటావ్?” నవ్వుతూ కన్విన్స్ చేసే ప్రయత్నం చేసింది నిషిత.

“ఏదో ఒకటి చెప్పి నా చేత ‘ఊ’ అనిపించేస్తావు. సరేలే.. ఈ నెలా వీలు కుదిరినప్పుడల్లా నేనే వచ్చిపోతుంటాను. దేవీకటాక్షం కోసం ఆ మాత్రం చెయ్యలేనా? కానీ నువ్వే.. నీకోసం నేను అంత దూరంనుంచి వచ్చినా నా కోసం కొంచెం టైమ్ కూడా కేటాయించట్లేదు” చిన్నపాటి అలక నటిస్తూ చెప్పాడు ఆర్యన్.

“ఏం చెయ్యను చెప్పు? ఇది చిన్న ఇల్లు. నలుగురూ ఉన్నచోటే మనమూ సర్దుకుపోవాలి. తప్పదు.”

“కనీసం ఈ రాత్రికైనా ఇలా డాబా మీద ఆకాశంలోని నక్షత్రాలను చూస్తూ ఇక్కడే నిద్రపోదాం. పిల్లలు మీ అమ్మ దగ్గర పడుకున్నారుగా. ఈ రెండు రోజులూ నాతోనే ఉండవా ప్లీజ్! ఎందుకో నిన్ను చాలా మిస్సవుతున్నాను నిషితా!” చిన్నపిల్లాడిలా అల్లుకుపోతున్నాడు ఆర్యన్.

గాఢ పరిష్వంగంతో తన చుబుకాన్ని భర్త భుజంపై ఆన్చి, సరేనన్నట్టు చెవిలో చిన్నగా ముద్దుపెట్టి లాలనగా దగ్గరకు తీసుకుంది నిషిత.

***

పెళ్లిచూపుల పేరుతో నిషితని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేని ఆర్యన్.. మొదట ఆమెతో వీడియో కాల్ లోకి వచ్చాడు. చాలా సింపుల్‌గా కాటన్ శారీతో కాల్‌కి కనెక్ట్ అయిన ఆమె రూప లావణ్యాన్ని చూసి ముగ్ధుడైపోయాడు.

తనకైతే భార్య ఉద్యోగం చేయాల్సిన అవసరం లేదనీ, ఉద్యోగం అనేది ఆప్షనల్ అనీ.. అంతగా చెయ్యాలనుకుంటే, పిల్లలకి ఐదేళ్లు వచ్చిన తర్వాత జాయిన్ అవ్వచ్చనడంతో ఆర్యన్‌ను పెళ్లి చేసుకోవడానికి సరేనంది నిషిత.

ఎంబీఏ చేసిన నిషిత పెళ్లయిన మొదట్లో కాలక్షేపానికి ఉద్యోగంలో చేరింది. ఇద్దరే ఉండడంతో ఇంటిపనినీ, ఉద్యోగాన్నీ బ్యాలెన్స్ చేయటం ఆమెకు పెద్దగా కష్టం కాలేదు. కానీ రెండేళ్ల తర్వాత ఓకే కాన్పులో కవల పిల్లలు పుట్టడంతో ఉద్యోగం మానేయాలన్న దిగులు పట్టుకుంది ఆమెకు. ప్రసూతి సెలవులు ఆరు నెలలూ పూర్తయ్యాక, పిల్లల్ని చూసుకోవడానికి ఎవరైనా కేర్ టేకర్‌ని మాట్లాడుకుని తిరిగి ఉద్యోగానికి వెళ్లిపోదామనుకుంది.

“పిల్లలు పుట్టాక ఈ అందాల భరిణ అందం రెట్టింపయ్యింది. నిండుగా ఎంత అందంగా ఉన్నావో అద్దం ముందు నుంచుని చూసుకో.. నువ్వు కాలు బయటపెట్టి కందిపోవడం నాకిష్టం లేదు. నేను నెలకి రెండు లక్షలకి పైగా సంపాదిస్తున్నాను. మనకి లోటేముంది చెప్పు. నువ్వు ఇంటిపట్టున ఉండి పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటే చాలు. ఇక ఉద్యోగం చెయ్యొద్దు నిషితా. ప్లీజ్ రా!” పిల్లల్ని పడుకోబెట్టిన స్టాండ్ ఉయ్యాల తాడుని చేత్తో పట్టుకొని మెల్లగా ఊపుతూనే మంచం మీద కూచున్న ఆమె ఒడిలో తలపెట్టుకుని మెత్తని ఆమె నడుమును తడుముతూ అల్లరి చేస్తున్నాడు ఆర్యన్.

“నాకు ఎనర్జీనిచ్చే టానిక్ నువ్వేనోయ్. ఒక్కరోజు డోసు పడకపోయినా నాకు నీరసం వచ్చేస్తుంది” అంటూ వెచ్చగా ఒదిగిపోయే భర్త పంచే ప్రేమానురాగాల ముందు ఎంత డబ్బు కుమ్మరించినా వేస్ట్ అనే అనిపించేది నిషితకి. పిల్లలకి స్నానం చేయించడం దగ్గర్నుంచీ వంటపని వరకూ అన్నింటిలోనూ నిషితకి సాయం చేసాకే ఆఫీస్‌కి వెళ్ళేవాడు ఆర్యన్. ఒక్కొక్క రూపాయీ పిల్లల భవిష్యత్తు కోసం ఎలా దాచాలో ప్లాన్ చేస్కుని చెబుతుంటే.. కళ్ళు పెద్దవి చేసుకుని వినేది.

***

చూస్తుండగానే ఎనిమిదేళ్లు గడిచిపోయాయి.

“ఇదేమిటి? జీడిపప్పు, బాదం పప్పు కిలో కిలో తెచ్చేసావు. ఒక్కోటీ అరకిలోయేగా నేను లిస్ట్‌లో రాసినది?” అంటున్న భార్యతో.. “సగం ఇంట్లో వాడకానికీ, సగం నా శ్రీమతి బలంగా ఉండడానికీ. కవర్లో పిస్తా కూడా ఉంది చూడు” నవ్వుతూ దానిమ్మపండు రంగులో మెరుస్తున్న ఆమె చెక్కిళ్లను వేలి కొనలతో చిన్నగా స్పృశించి వదిలాడు ఆర్యన్. ఆ స్పర్శకు ముత్యాల్లాంటి పలువరుస కనీ కనిపించనట్టుగా విచ్చుకున్న ఆమె పెదవులు.. సంధ్య చీకట్లను చీల్చుతూ విరిసిన మల్లెలను తన కౌగిట్లో బంధించాలని ఆశపడుతున్న సన్నని కాంతి కిరణాల్లా అనిపించి చిన్నగా నవ్వుకున్నాడు. ఆ జ్ఞాపకాలే.. ఎంత దూరాన ఉన్నా, ఇద్దరి మనసుల్నీ దగ్గరగా ఉంచుతున్నాయి.

పుట్టింటికి వచ్చిన దగ్గర్నుంచీ భర్తనే తలుచుకుంటూ పరాకుగా ఉన్న కూతురితో..

“నువ్వు చాలా అదృష్టవంతురాలివి నిషితా! మీ చిన్నప్పుడు మీ ఆలనా పాలనా చూడ్డానికి మేమెంత కష్టపడేవాళ్ళమో నీకు తెలీదు. అప్పట్లో మా గురించి మాకు పట్టించుకునే తీరిక కానీ స్థోమత కానీ మాకు ఉండేది కాదు. ఉన్నదాంట్లో సర్దుకుని తింటూ ఆశల మీద నీళ్లు చల్లుకుని బ్రతికేవాళ్ళం. అల్లుడుగారికి ముందుచూపుతో పాటు, నీమీద ప్రేమ కూడా చాలా ఎక్కువ. ఇంత బాగా చూసుకునే భర్త దొరకడం చాలా అదృష్టం.” తల దువ్వుతూ కూతురి అదృష్టానికి మురిసిపోతోంది శైలజ.

“ఈ ఎనిమిదేళ్లలో మా మధ్య మాట తేడా అనేది అస్సలు రాలేదమ్మా. తను నన్ను అర్థం చేసుకున్నంతగా ఎవ్వరూ అర్థం చేసుకోలేదనిపిస్తుంది. నోరు తెరిచి అడక్కుండానే అన్నీ అమర్చిపెడతాడు. నాపట్ల తనకి చాలా కన్సర్న్ ఉంది. పిల్లల కన్నా ఎక్కువగా నన్ను ప్రేమగా చూసుకుంటాడు. ఐ లవ్ హిమ్ సో మచ్. పిల్లల కోసం ఇక్కడికి వచ్చి ఉన్నానే కానీ.. ఆర్యన్ ని చాలా మిస్సవుతున్నాను.” చెబుతుంటే ఆమె మాట భారమయ్యింది.

“పిచ్చిపిల్లా! అనవసరంగా బెంగ పెట్టుకోకు. ఇంకెంత? వారం రోజులేగా.. సెలవులు అయిపోగానే అల్లుడిగారి దగ్గరకి వెళ్ళిపోదువుగాని” సముదాయిస్తున్న తల్లి మాటలకి కొంత ఊరటగా అనిపించింది నిషితకి.

***

ఆ మర్నాడే ఆఫీసునించి వస్తూ ఆర్యన్ బైక్ స్కిడ్ అయి పడిపోయాడని తెలిసి, పిల్లల్ని తీసుకుని, గాభరాగా భర్త దగ్గరకి పరిగెత్తింది నిషిత.

తల్లీ తండ్రీ కూడా వెనకనే బయల్దేరి వెళ్లారు. వారం రోజులు కొంచెం నుంచోడానికి ఇబ్బంది పడినా, కాలి మడమకి వేసిన కట్టుతో మెల్లగా లేచి నడవడం మొదలుపెట్టాడు ఆర్యన్. పిక్కలో మజిల్ గట్టిపడి రక్తప్రసరణ సరిగ్గా లేకపోవడంతో కాలు కిందపెట్టడం కష్టమయ్యింది. భర్తని చంటిపిల్లాడిలా చూసుకుంటూ సేవలు చేస్తోంది నిషిత. మూడు వారాలపాటు ఆఫీస్ కి వెళ్లకుండా రెస్ట్ లో ఉండమని డాక్టర్ చెప్పడంతో ఇంటిపట్టునే ఉన్నాడు ఆర్యన్. భార్య భుజం మీద చెయ్యివేసి మెల్లగా ఇంట్లోనే బాత్రూమ్ వరకూ నడుస్తున్నాడు.

“ఇంట్లో ఉన్నా రెస్ట్ లేకుండా ఇలా లాప్టాప్ ముందేసుకుని, ఆఫీస్ వర్క్ చేస్తుంటే ఎలా? బీపీ మారకుండా చూసుకోమని డాక్టర్ గారు చెప్పారు. వినవుకదా!” అన్నం కలిపి, ముద్దలు తినిపిస్తూ చిరుకోపం ప్రదర్శించింది నిషిత.

 “నాకు బీపీ వస్తున్నది వర్క్ వల్ల కాదు.. నీకు దూరంగా ఉండడం వల్ల. ఇప్పుడు కొంచెం నడవగలుగుతున్నాను కదా! ప్లీజ్ రా.. ఇంక మీ అమ్మా వాళ్ళనీ పంపించెయ్యకూడదూ. చుట్టూ ఇలా ఇంతమంది ఉంటుంటే నీతో కనీసం మనస్ఫూర్తిగా మాట్లాడుకోవడానికి కూడా వీలుపడట్లేదు. నీతో నాక్కొంచెం ప్రైవసీ కావాలనిపిస్తోంది నిషితా! నోరు తెరిచి చెప్పలేకపోతున్నాను. అర్థం చేసుకోరా! ప్లీజ్!” ఆర్యన్ నోటివెంట వచ్చిన ఆ మాటలు ఆమెను చాలా ఆలోచింపజేసాయి.

“సరే! నెమ్మదిగా మాట్లాడి రేపే మా వాళ్ళని ఊరికి పంపించేస్తానులే. నువ్వు కొంచెం కోలుకున్నావు కాబట్టి ధైర్యంగా వెళ్ళగలరు.” టీవీ ఆన్ చేసి రిమోట్ భర్త చేతికి ఇచ్చి వంటింట్లోకి వెళ్ళింది నిషిత.

పది నిముషాల తర్వాత ఏదో కింద పడిన శబ్దం అవ్వడంతో గబగబా హాల్లోకి వచ్చి చూసింది. కుర్చీలో ఓ పక్కకి వాలిపోయి తలవాల్చేసిన ఆర్యన్ చేతిలోంచి రిమోట్ జారి కిందపడిపోయి ఉంది.

“అయ్యో! ఏమయ్యింది? ఆర్యన్! ఆర్యన్!! లే.. ఇలా చూడు” అంటూ పట్టుకుని గట్టిగా కుదుపుతుంటే ఇంక సెలవంటూ కిందకి వాలిపోయిన కనురెప్పలు మరి తెరుచుకోలేదు.

ఏం జరిగిందో అర్థంకాక గుండె పగిలేలా ఏడుస్తున్న నిషిత అరుపులకి అందరూ పరిగెత్తుకుని వచ్చారు. గబగబా వెళ్లి అదే అపార్ట్మెంట్ లో ఉంటున్న డాక్టర్ సంజీవిని తీసుకువచ్చాడు నిషిత తండ్రి.

ఆర్యన్ చెయ్యి పట్టుకుని చూసి.. “సారీ! హార్ట్ ఫెయిల్ అయిపోయింది. హి ఈజ్ నో మోర్” అని చెప్పడంతో.. ఒక్కసారిగా ప్రపంచం ఆగిపోయినట్టయి పిచ్చిదానిలా చూస్తూ ఉండిపోయింది నిషిత.

“నో! ఇప్పుడేగా నాతో మాట్లాడాడు. అలా ఏమీ జరగదు. నా ఆర్యన్ బ్రతికే ఉన్నాడు. అందరూ దూరంగా వెళ్లిపోండి..” కీచుమంటున్న ఆమె గొంతు ఆ నాలుగ్గోడల మధ్యా ప్రతిధ్వనిస్తోంది.

భర్త ముఖాన్ని గుండెలకి అదుముకుని పిచ్చిదానిలా ముద్దు పెట్టుకుంటూ, ఆత్రంగా తడుముతూ కన్నీరుమున్నీరవుతున్న నిషితను పట్టుకోవడం ఎవరివల్లా కాలేదు.

“ప్లీజ్ కాల్ ద అంబులెన్స్.. నా ఆర్యన్ బ్రతికే ఉన్నాడు. హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి” గట్టిగా ఏడుస్తోంది.

“చూడమ్మా! అతని నాడి అందట్లేదు. తిరిగి లేచే అవకాశం కనపడడం లేదు. నేను డాక్టర్నే.. పరీక్షించే చెబుతున్నాను. నా మాట నమ్మండి.”

“నమ్మలేకపోతున్నాం డాక్టర్! ఏదో కాలుకి చిన్న దెబ్బ తగిలిందే తప్ప వేరే ఆరోగ్య సమస్యలేవీ లేవు. పైగా ముప్పై ఏడేళ్ళకే ఇలా హార్ట్ అటాక్ వచ్చే అవకాశముందంటారా?” నిషిత తండ్రి మాటలకి తల పంకించి, ఆర్యన్ ఛాతీపై ఒత్తిడి తెస్తూ సీపీఆర్ చేయసాగాడు డాక్టర్ సంజీవి.

ఆయన అలసిపోతున్నాడు గానీ ఆర్యన్‌లో కదలిక లేదు. ఎంత ప్రయత్నించినా లాభం లేదనిపించి పెదవి విరిచెయ్యడంతో అక్కడున్న అందరిలోనూ దుఃఖం కట్టలు తెంచుకుంది. భర్త మరణాన్ని జీర్ణించుకోలేని నిషిత పిచ్చిదానిలా అరుస్తూ ఏడుస్తోంది.

“ఆగండి! తనని కటిక నేల మీద పడుకోబెట్టడానికి వీల్లేదు. నన్ను విడిచి ఆర్యన్ ఎక్కడికీ వెళ్ళిపోలేదు. నాతోనే ఉన్నాడు..” ఒకే శ్వాసగా ఉన్న ఆ జంట పరిస్థితికి అక్కడున్నవారందరూ కంటతడి పెట్టారు.

“చివరి ప్రయత్నంగా నువ్వు ఓసారి నోటి ద్వారా ఆక్సిజన్ అందించు నిషితా!” లేచి కొంచెం దూరంగా నుంచున్నాడు డాక్టర్ సంజీవి.

భర్త ముఖాన్ని గుండెలకి హత్తుకుని “నువ్వు లేకపోతే నేనుండలేను ఆర్యన్! లే ఆర్యన్ లే..” గట్టిగా పట్టి కుదుపుతూ నోటి ద్వారా ఆక్సిజన్ ఇవ్వడం మొదలుపెట్టింది. రెండు నిముషాలు శ్వాస అందించేటప్పటికి ఆశ్చర్యంగా ఒక్కసారిగా బలంగా శ్వాస తీస్కుని కళ్ళు తెరిచాడు ఆర్యన్. ఆనందంతో ఆమెకు నోట మాటరాలేదు. తనను మరింత దగ్గరగా హత్తుకున్న నిషిత కళ్ళలో తన ప్రతిబింబం కొత్తగా కనపడుతుంటే, ఏం జరిగిందో అర్థం కాక చుట్టూ మూగిన జనం వైపు ఆశ్చర్యంగా చూసాడు ఆర్యన్.

“ఇంకెప్పుడూ నన్ను వదిలి వెళ్ళనని మాటివ్వు” కన్నీటితో అభిషేకిస్తూ చెయ్యి ముందుకి చాచిన ఆమె చేతిని గట్టిగా పట్టుకుని గుండెలకి అదుముకున్నాడు ఆర్యన్.

పిల్లలిద్దరి వైపూ చూసి దగ్గరకి రమ్మన్నట్టు కళ్ళతోనే సైగ చేసాడు. అంతవరకూ బేలగా దూరంగా నుంచుని ఏడుస్తూ చూస్తున్న పిల్లలు బలంగా తండ్రిని అల్లుకుపోయారు.

“మిరాకిల్.. రియల్లీ ఇట్స్ ఎ మిరాకిల్!!” గట్టిగా చప్పట్లు కొడుతూ అన్నాడు డాక్టర్ సంజీవి.

“నీ నమ్మకం, ప్రేమే నీ భర్తను బ్రతికించింది నిషితా! నీ స్పర్శ తిరిగి అతనికి ఊపిరిపోసింది” కూతురి ప్రేమ కోసం మృత్యువుతో పోరాడి జయించిన ఆర్యన్‌ను చూసి, కళ్ళు తుడుచుకుంది నిషిత తల్లి.

అక్కడున్న అందరూ చేతులెత్తి ఆ జంటను మనస్ఫూర్తిగా దీవించారు.

(సమాప్తం)

Exit mobile version