[శ్రీ విడదల సాంబశివరావు రచించిన ‘నీ జ్ఞాపకాల మత్తులో సేదదీరనీ!’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
ఆ రోజు..
నీ కౌగిలి వసంతంలో
వాన చినుకలు భూమిని తాకినంతనే
గుప్పుమన్నది మట్టి సుగంధం..
నీ పలుకులు నా చెవి సోకగనే
విచ్చుకున్నది నా హృదయద్వారం..
తీగ సంపంగుల నుండి జాలువారిన
వాన చినుకులు పూల తేనియలు కాగా..
వలపు భావాల మధువులు
నీ మదిలో చేరి..
నీ అధరాలు పలికిన అక్షరాలు
అమృత ధారలై నన్ను అలరించాయి!
ఈ రోజు..
నువ్వు పంచి ఇచ్చిన
జ్ఞాపకాల మధువు తాగేశాను!
గుండెలోతుల్లోని దుఃఖం మత్తుగా మారింది!!
నీ వియోగ వేదనతో
మనసు గదిలో..
పెద్ద మంటలే అంటుకున్నాయి!
మనో వేదనా మంటల్లో కాలిపోతోన్న వేళ..
మధువు తాగితే నేరమెలా అవుతుంది?
ఈ మధువు సేవనలో
హృదయ వేదన మరుగై పోయింది!
మధువు మైకంలో
భావోద్వేగాల అంతరంగం..
తన ఉనికినే కోల్పోయింది!
మధువు మత్తులో
విరహాగ్ని వేదనలన్నీ
మత్తిల్లి పడుకున్నాయి!
అదేమి చిత్రమో గానీ
ప్రేయసీ..
మత్తులో సేద దీరిన బాధలన్నీ
మధువు మత్తు దిగిన వెంటనే..
గుండెలోతుల్లో గునపాలు దింపాయి!
అందుకే.. ప్రియసఖి..
నీ జ్ఞాపకాల మత్తులోనే
నా శేష జీవితానికి
శాశ్వత శాంతిని ప్రసాదించు!
శ్రీ విడదల సాంబశివరావు గారు 22 జనవరి 1952 న గుంటూరు జిల్లా, చిలకలూరిపేట పురపాలక సంఘం పరిధిలో ఉన్న పురుషోత్తమపట్నం గ్రామంలో ఓ మధ్య తరగతి ‘రైతు’ కుటుంబంలో జన్మించారు. శ్రీమతి సీతమ్మ, రాములు వీరి తల్లిదండ్రులు. స్వగ్రామంలో ప్రాథమిక విద్య, చిలకలూరిపేటలో ప్రాథమికోన్నత విద్య, తెనాలిలో బి.ఎస్.సి. పూర్తి చేశారు.
బాల్యం నుంచి నటనపై అభిరుచి ఉంది. అనేక నాటికలలోనూ, నాటకాలలోనూ నటించి ప్రశంసలందుకొన్నారు. వివిధ సంస్థల నుండి పతకాలు పొందారు. రాష్ట్రస్థాయిలో ఉత్తమ నటుడిగా బహుమతులు పొందారు. వీరు రచించిన ‘పుణ్యభూమి నా దేశం’ (నాటకం), ‘తలారి తీర్పు’ (నాటిక) ప్రసిద్ధమయ్యాయి. టివి ధారావాహికల్లోనూ, కొన్ని సినిమాల్లోనూ ముఖ్య పాత్రలు పోషించారు.
సాంబశివరావు గారు వెయ్యికి పైగా కవితలు రాశారు. వాస్తవిక జీవితాలని చిత్రిస్తూ అనేక కథలు రాశారు. కవితలు, నాటకాలు, కథలు కలిపి 14 పుస్తకాలు ప్రచురించారు. పలు పత్రికలలో ఫీచర్లు నిర్వహిస్తున్నారు.
నాటకరంగలోనూ, రచన రంగంలోనూ ఉత్తమ పురస్కారాలు అందుకొన్నారు. నీహారిక పౌండేషన్ అనే సంస్థని స్థాపించి సమాజ సేవ చేస్తున్నారు.