[శ్రీ పవన్ సంతోష్ సూరంపూడి గారి ‘నేడే చూడండి’ పుస్తకాన్ని సమీక్షిస్తున్నారు డా. కాళిదాసు పురుషోత్తం.]
తెలుగోళ్ళూ – సినిమాలూ – ఒక చరిత్ర పేరుతో యువ మిత్రులు శ్రీ పవన్ సంతోష్ రచించిన పుస్తకం తెలుగు సినిమాలంటే ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరూ తప్పక చదవదగిన పుస్తకం. రెండేళ్ళ క్రితం టైపు ప్రతి పంపి అభిప్రాయం చెప్పమన్నారు. ఎంతో శ్రద్ధా, పరిశోధన తర్వాత రాసిన పుస్తకం.
తెలుగు సినిమా చరిత్ర, సినిమాలలో భిన్న ‘జాండ్రలు’ వెలువడడం, పరిశ్రమగా, కళా మాధ్యమంగా, గొప్ప వినోద సాధనంగా రూపొందిన చరిత్రనంతా ఆసక్తికరంగా వివరించారు.
సినిమా అంటే అదొక మహాసముద్రం, తెలుగు సినిమా ఆవిర్భావం నుంచి రంగుల సినిమాల ప్రవేశం వరకు ఈ పుస్తక రచనకు పరిమితమయ్యారు. పుస్తకం ఎత్తుగడే పెళ్ళిచూపుల్లో “కనీసం సినిమాలకు కూడా వెళ్ళని వాడు పిల్ల సరదాలేం తీరుస్తాడు?” అని అమ్మాయి తల్లి చేత అనిపిస్తాడు, నిజమే! వర్గం, స్త్రీ పురుష భేదాలు ఏవీ లేకుండా తెలుగు వాళ్ళకు, ‘తెలుగోళ్ళ’కు ఏకైక వ్యసనం సినిమాలు.
తెలుగు చలన చిత్రకళ పరిశ్రమగా ఎదగడానికి దోహదం చేసిన అన్ని అంశాలను ఈ పుస్తకంలో పవన్ సంతోష్ లోతుగా పరిశీలించారు. ఇంగ్లీషులో భారతీయ సినిమా కళ మీద అనేక పుస్తకాలు అందుబాటులో ఉన్నా, తెలుగులో పుస్తకాలు లేని లోటును, తను కొంతయినా తీర్పారు.
తాను సామాజిక, రాజకీయ చరిత్ర నేపథ్యంలో తెలుగు నలుపు తెలుపు సినిమాల ఆవిర్భావ వికాసాలను పరిశీలించి, ఆ చరిత్రను గ్రంథస్థం చేసినట్లు రచయిత పుస్తకం మొదట్లోనే వివరించారు.
దేశంలో, రాష్ట్రంలో జరిగిన అనేక సాంఘిక, రాజకీయ ఉద్యమాలను ప్రస్తావిస్తూ, ఆ ప్రభావాలలో తెలుగు సినిమా పురోగతిని వివరంగా పాఠకుల ముందు పెట్టారు. 300 పేజీల ఈ పరిశోధనను పాపులర్ గ్రంథరూపంలో సమర్పించారు. ఈ కృషిలో పవన్ సంతోష్ ఎన్నెన్నో ఆకరాల నుంచి విషయసేకరణ చేసిన వైనం మనకు స్ఫురిస్తుంది. నా వయస్సు, ఆరోగ్య కారణాల వల్ల రచనకు దూరంగా ఉన్నా, సినిమా కళ మీది ఇష్టం వల్ల ఈ నాలుగు మాటలు రాయడానికి ప్రయత్నం చేశాను.
సినిమాను నాటకాలకు కొనసాగింపుగా భావించినవారు, సినిమాను ప్రత్యేకమైన కళారూపంగా భావించిన వర్గం – రెండు ధోరణులను సమన్వయం చేసుకొంటూ, దృశ్యమాధ్యమానికి అనుగుణంగా దర్శకులు కమలాకర కామేశ్వరరావు స్క్రీన్ ప్లేను తయారు చేసుకొన్నారని, సినిమాలో సంభాషణల రూపంలో కాక, దృశ్యాల ద్వారా విజువల్‌గా కథాకథనం నిర్వహించినట్లు పవన్ సంతోష్ గుర్తించారు. హాలీవుడ్ చిత్రాన్ని ఆధారం చేసుకుని తీసిన ‘స్వర్గసీమ’ గొప్ప విజయాన్ని సాధించడంతో పాటుగా చిత్రనిర్మాణానికి స్టూడియో అవసరం ఎంత ప్రాథమికమో నిర్మాతలకు తెలిసేట్టు చేసింది.
తొలితరం ఔత్సాహిక సినిమా నిర్మాణ చరిత్రలో మూగ సినిమాలు లేక మూకీల ప్రదర్శన సమయంలో కథను వివరించే వ్యాఖ్యాతలను గురించి, రఘుపతి వెంకయ్య, ఆయన కుమారుడు చొరవతో మద్రాసులో స్టూడియోల ఆవిర్భావం, మొదటి ప్రపంచ యుద్ధకాలంలో బ్రిటిష్ సినిమా పరిశ్రమ వెనకబడి అమెరికాలో సినీ పరిశ్రమ వృద్ధిలోకి రావడం, మన దేశంలో హాలీవుడ్ సినిమాల ప్రదర్శన వంటి అనేక విషయాలు – ఈ చరిత్రకు అవసరమైన నేపథ్యాన్ని కూడా పవన్ సంతోష్ స్పృశించారు.
పి. పుల్లయ్య నిర్మించిన లవకుశ (1934) తెలుగు సినిమా చరిత్రలోనే సంచలనాన్ని సృష్టించిన సినిమా. ఆర్.ఎస్. ప్రకాశ్ సినిమా నిర్మాణానికి అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని గ్రహించి అనుభవజ్ఞుడుగా ఎదగడం నుంచి తెలుగు సినిమా పరిశ్రమ నిలబడడానికి తోడ్పడిన ఎన్నెన్నో అంశాలను సమన్వయిస్తూ ఈ తొలినాటి చరిత్రను చక్కగా మన ముందు ప్రదర్శించారు పవన్ సంతోష్. బి.ఎన్. రెడ్డి, గూడవల్లి రామబ్రహ్మం వంటి దర్శకులపైన బెంగాలీ సినిమా ప్రభావాలను కూడా మన ముందుంచుతారు.
బి.ఎన్. రెడ్డి గృహలక్ష్మి సినిమాకు ‘రంగూన్ రౌడి’ నాటకం స్ఫూర్తి అని చాలామందికి తెలియకపోవచ్చు. ఆ నాటకానికి, సినిమాకు ఉన్న పోలికలు, సినిమాను అనుకరణ లేకుండా కళాత్మకంగా తీర్చిదిద్దిన పద్ధతిని సవివరంగా ఈ పుస్తకం తెలియజేస్తుంది. ఆయా సందర్భాలను ఉపయోగించుకొని తెలుగు సినిమా ‘పయోనీర్’లని చెప్పదగిన గూడవల్లి, బి.ఎన్ వంటి వారికి సంబంధించిన వివరాలు ఆసక్తికరంగా ఈ ప్రస్తకంలో పేర్కొనబడ్డాయి. రామబ్రహ్మం సంఘసంస్కరణ, సమాజంలో రావలసిన మార్పులను వివరించడానికి సినిమా మాధ్యమాన్ని వాహికగా వాడుకొన్నారు. 1930 దశాబ్దంలో మీర్జాపురం, పిఠాపురం వంటి జమీందార్లు తెలుగు చిత్రనిర్మాతలుగా పాత్ర పోషించారని; సంఘసంస్కరణ, జాతీయోద్యమం ప్రభావాలతో, తెలుగులో ‘మాలపిల్ల’ వంటి సినిమాలు వచ్చినట్లు, మాలపిల్ల సినిమా ప్రకటనల్లో ‘పిలక ధరించిన సంప్రదాయ బ్రహ్మణులకు ప్రవేశం ఉచితం’ అని ఆ సినిమా దర్శకులు ప్రకటన కూడా వేయించారట! ఆనాటి బ్రాహ్మణ సమాజం సినిమాను ఎంతగా వ్యతిరేకించి ఉంటుందో ఎవరి ఊహకు అందనిది కాదు. సినిమా చూసి కొందరు బ్రాహ్మణులు వ్యతిరేకించవలసిన సినిమా కాదని అభిప్రాయ పడ్డారట! అలనాటి పత్రికా సంపుటాలలో జొరబడి ఎంత పరిశ్రమ, సమయం వెచ్చింది ఇన్ని వివరాలు సేకరించారో అని ఆశ్చర్యం కలుగుతుంది. ఇప్పటి ‘మనోభావాలు దెబ్బతిన్నా’యనే అల్ట్రా సెన్సిటివ్ లతో పోలిస్తే, ఆనాటి ప్రేక్షకులు మహా ఉదారులనే అనిపిస్తుంది. గూడవల్లి సమకాలిక రాజకీయాలను భారతీయ సినిమాలో ప్రవేశపెట్టి, అసాధారణ కార్యం సాధించారని పవన్ సంతోష్ ప్రశంసిస్తారు.
ఆ రోజుల్లో, సినిమా నిర్మాతలు ఎదుర్కొన్న సెన్సార్ నిబంధనల ఇబ్బందులు, వాటిని ఎంతో నేర్పుతో అధిగమించి తీసిన చిత్రాలు, మహాత్మా గాంధీ పేరెత్తితేనే నేరమనే కాలంలో “కొల్లాయి గట్టితేనేమి, మా గాంధీ మాలడై తిరిగితే నేమి” అని శ్లాఘిస్తూ ‘మాలపిల్ల’ సినిమా పూర్తిగా గాంధి నామంతో మార్మోగిందని – మాలపిల్ల, రైతుబిడ్డ సినిమాలను ప్రస్తావిస్తూ కథనం సాగుతుంది.
జమిందారి ప్రాంతాల్లోని రైతుల దుర్భర పరిస్థితులను గూడవల్లి ‘రైతుబిడ్డ’లో చిత్రించారు. వెంకటగిరి జమిందారు గూడూరు డివిజన్‌లో సినిమా ప్రదర్శన జరగకుండా ప్రభుత్వం నుంచి ఆర్డరు తెచ్చుకోడం వంటి విషయాలు; గూడవల్లి రామబ్రహ్మం సినిమాలను గురించి చాలా విషయాలు ఈ పుస్తకంలో ఆసక్తికరంగా పొందుపరిచారు.
వాహిని వారు చలన చిత్ర మాధ్యమాన్ని బాగా బోధపరచుకొని, 1939లో ‘వందేమాతరం’ సినిమా తీశారు. రామనాధ్, శేఖర్‌లు వాహిని బృందంలో చేరి గొప్ప కళాత్మక చిత్రాలు తీయడంలో సహకారం అందించారు. ఈ సినిమా చరిత్రంలో పవన్ సంతోష్ పిట్ట మండలం సీతాపతి (పి.వి.పతి) కృషిని కూడా వివరించారు. సీతాపతి తండ్రిగారికి నెల్లూరులో ఫోటో స్టూడియో ఉండేది. అతని తల్లిగారు కొంచెం పేరున్న పెయింటర్. సీతాపతి మద్రాసు, అక్కణ్ణించి పేరిస్ వెళ్ళి సారబాన్ విశ్వవిద్యాలయంలో చదివారు. గురజాడ కన్యాకుల్కం నాటకం మీద ఒక మోనోగ్రాఫ్ కూడా ఆ విశ్వవిద్యాలయంలో సమర్పించినట్లు గ్రంధస్థం అయింది,
‘వందేమాతరం’ సినిమా తీసేనాటికి సెన్సార్ నిబంధనలు కూడా కఠినంగా మారడంతో సినిమా యూనిట్ అనేక విషయాలు చర్చించి సినిమా నిర్మాణానికి పూనుకొనేవారట! ‘వందేమాతరం’ సినిమాకు పోటీగా సి.ఎస్.రావు ‘మళ్ళీ పెళ్ళి’ సినిమా తీశారు. ‘వందేమాతరం’ ఆర్ధికంగా నష్టపోయినట్లు, పోటీగా తీసిన సినిమా విజయవంతం అయినట్లు ఆ చరిత్రనంతా ఈ పుస్తకంలో చదువుకోవచు. 1940 దశకంలో సినిమా రంగానికి సంబంధం లేని వ్యక్తులు లాభాపేక్షతో నిర్మాతలుగా సినిమా నిర్మాణంలో ప్రవేశించారు.
సినిమా కథానాయక పాత్రధారి, నాయిక పాత్రధారుల చుట్టూ పరిభ్రమింప చేయడంతో, స్టార్ వాల్యూ యుగం ఆరంభమైంది. అనామకులుగా సినిమా రంగంలోకి వచ్చి స్టార్లుగా ఎదిగి ఊరూపేరు లేకుండా కనుమరుగైన వారు కొందరు. కాంచనమాల అతిశయం, అహంకారం ఆమెను సినిమాలకు దూరం చేశాయని, స్టూడియోల యాజమానుల గుప్పెట్లోకి సినీపరిశ్రమ ఈ దశలో వెళ్ళిపోయిందని, ఆనాటి పరిస్థితులను పవన్ సంతోష్ ఆసక్తికరంగా వివరించారు. 1942 కల్లా రెండో ప్రపంచ యుద్ధ సమయంలో సినీ పరిశ్రమ ఒడుదుడుకులు కూడా ఈ గ్రంథంలో వివరంగా చర్చకు వచ్చాయి.
చిత్తూరు నాగయ్య తెలుగులో ‘స్టార్ హీరో’ అని, ‘భక్త పోతన’గా ఆయన ఖ్యాతిని హాలీవుడ్ నటుడు పాల్ ముని (గుడ్ ఎర్త్ – సినిమా కధానాయక పాత్రధారి) తో పోలుస్తూ, ఆయన నట జీవితంలోని ఒడుదుడుకులను వివరంగా ఇందులో చూపించారు.
తొలి మహిళా నిర్మాతగా భానుమతిని అభివర్తిస్తూ, ఆమె వైవిధ్యభరితమైన సినీజీవితం మీద ప్రత్యేకంగా రాస్తూ, ఆవిడ సినిమాలను ‘కారా మసాలా’ వినోదంగా వర్ణించారు పవన్ గారు. 1945-65 మధ్య కాలాన్ని తెలుగు సినిమా చరిత్రలో స్వర్ణయుగం అని, సంగీత దర్శకులు, కె.వి. రెడ్డి, మధుసూదనరావు వంటి దర్శకులు, అన్నపూర్ణ స్టూడియో ఆవిర్భావం, సినిమా మరింత శ్రద్ధగా నిర్మించే విధివిధానాలు, స్క్రిప్టు, సంభాషణలు బాగా చదివి మనసుకు తెచ్చుకొని నటించే నటీనటులు కొత్త కొత్త తారల రాక.. అన్నీ తెలుగు సినిమా ఔన్నత్యానికి తోడ్పడ్డాయి. ఈ కాలంలోనే కమ్యూనిస్టులు కూడా సినిమారంగంలోకి ప్రవేశించారు.
1936లో లక్నోలో ప్రొగ్రెసివ్ రైటర్స్ అసోసియేషన్ ఆరంభమైంది. ఆంధ్రదేశంలోనూ అభ్యదయ రచయితల సంఘం, ఇండియన్ పీపుల్స్ థియటర్ అసోసియేషన్ (IPTA) డా. గరికపాటి రాజారావు వంటి వారి నాయకత్వంలో ఏర్పడ్డాయి. సుంకర, వాసిరెడ్డి ‘మా భూమి’ నాటకాన్ని ఆంధ్రదేశమంతా ప్రదర్శించారు. 1944-48 మధ్య ప్రజానాట్యమండలి ఒక వెలుగు వెలిగింది. రాజారావు ‘పుట్టిల్లు’ (1952) సినిమా తీశారు.
ఈ ప్రస్తకంలో కొన్ని సరదాకు చదువుకొనే సంగతులు కూడా ఉన్నాయిు, ఎన్.టి.ఆర్ – నాగిరెడ్డి మధ్య వివాదం, ఎఎన్‌ఆర్ – భానుమతి మధ్య అపార్థాలు, రాజీపడడం, విజయా స్టూడియో సంగతులు.. స్టూడియోల యుగంలో ‘గుండమ్మకథ’ కళాఖండంగా ప్రజల అభిమానాన్ని చూరగొన్న విధానం, ఆదుర్తి సుబ్బారావు తొలుత ఎడిటర్‌గా చిత్ర రంగప్రవేశం, సినిమా పాటల పరిణామం, పరివర్తన, సినీ సంగీత చరిత్ర వంటి అనేక విషయాలు – దేన్నీ రచయిత విస్మరించలేదు. జయసింహ, పాతాళభైరవి, స్వపసుందరి వంటి జానపద సినిమాల విజయం వెనక మతలబు, పౌరాణిక చిత్రయుగంలో నర్తనశాల వంటి సినిమాలను గురించి సమగ్రంగా ఈ పుస్తకంలో పవన్ సంతోష్ శ్రద్ధగా చర్చించారు. సినిమా, సినిమా నీ కథేమిటి? ప్రశ్నకు ఈ పుస్తకం సమాధానం. మరచిపోయా, ఈ గ్రంథాన్ని పవన్ అమ్మానాన్నలకు అంకితం ఇచ్చారు.
***
రచన: పవన్ సంతోష్ సూరంపూడి
పేజీలు: 306
వెల: ₹ 300.00
ప్రతులకు:
నవోదయ బుక్ హౌస్, కాచీగుడా, హైదరాబాద్,
ఇతర ప్రముఖ పుస్తక కేంద్రాలు
శ్రీ పవన్ సంతోష్ – Ph: 96406 56411, 63603 59959,
ఆన్‌లైన్‍లో:
https://www.amazon.in/Nede-Choodandi-Telugollu-Cinimalu-charitra/dp/9334149175
డా. కాళిదాసు పురుషోత్తం గారిది ప్రకాశం జిల్లా తూమాడు అగ్రహారం. వీరి తండ్రిగారు గొప్ప సంస్కృత పండితులు. నెల్లూరులో స్థిరపడ్డారు. జననం 1942 మే. ముగ్గురు అక్కలు, ఒక అన్నయ్య. పెద్దక్క, రచయిత మిగిలారు. పెద్దక్క 97వ ఏట ఏడాది క్రితం స్వర్గస్తులయ్యారు.
రచయిత బాల్యంలో నాయనగారి వద్ద సంస్కృతం కొద్దిగా చదువుకున్నారు. నెల్లూరు వి.ఆర్.హైస్కూలు, కాలజీలో విద్యాభ్యాసం, యం.ఏ. తెలుగు ఉస్మానియాలో ఫస్ట్ క్లాసులో, యూనివర్సిటీ ఫస్ట్ గానిలిచి, గురజాడ అప్పారావు స్వర్ణ పురస్కారం ఆందుకున్నారు. హైదరాబాద్, స్టేట్ ఆర్కైవ్సు వారి జాతీస్థాయి స్కాలర్షిప్ అందుకొని వెంకటగిరి సంస్థాన సాహిత్యం మీద పరిశోధించి 1971 సెప్టెంబర్‌లో డాక్టరేట్ అందుకున్నారు. 1972లో నెల్లూరులో శ్రీ సర్వోదయ డిగ్రీ కళాశాలలో చేరి, ఆ కళాశాల ప్రిన్సిపల్‌గా రిటైరై నెల్లూరులో విశ్రాంత జీవితం గడుపుతున్నారు. ఫొటోగ్రఫీ, సినిమాలు, పర్యటనలు ఇష్టం. 15 సంవత్సరాలు మిత్రులతో కలిసి కెమెరా క్లబ్, ఫిల్మ్ సొసైటీ ఉద్యమం, దాదాపు పుష్కరకాలం నడిపారు. సాహిత్యం, సినిమా, యాత్రానుభవాలు వ్యాసాలు భారతినుంచి అన్ని పత్రికలలో అచ్చయ్యాయి.
2007లో దంపూరు నరసయ్య – ఇంగ్లీషు లో తొలి తెలుగు వాడిమీద పరిశోధించి పుస్తకం. 1988లో గోపినాథుని వెంకయ్య శాస్త్రి జీవితం, సాహిత్యం టిటిడి వారి సహకారంతో. డాక్టర్ మాచవోలు శివరామప్రసాద్ గారితో కలిసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాచ్య పరిశోధన శాఖ వారికోసం పూండ్ల రమకృష్ణయ్య అముద్రిత గ్రంథచింతామణి సంపుటాలనుంచి మూడువందల పుటల “అలనాటి సాహిత్యం” గ్రంథానికి సంపాదకత్వం, 2011లో కనకపుష్యరాగం పొణకా కనకమ్మ స్వీయచరిత్ర ప్రచురణ. మనసు ఫౌండేషన్ సహకారంతో AP Sate Archives లో భద్రపరచిన గురజాడ వారి రికార్డు పరిశీలించి స్వర్గీయ పెన్నేపల్లి గోపాలకృష్ణ, మనసు రాయుడు గారితో కలిసి “గురజాడ లభ్య సమగ్ర రచనలసంకలనం” వెలువరించారు. మనసు ఫౌండేషన్ వారి జాషువ సమగ్ర రచనల సంకలనంకోసం పనిచేశారు. 2014లో “వెంటగిరి సంస్థాన చరిత్ర సాహిత్యం” గ్రంథ ప్రచురణ.
2021లో పెన్నేపల్లి గోపాలకృష్ణతో కలిసి అనువదించిన”letters from Madras During the years 1836-39″ గ్రంథం ‘ఆమె లేఖలు’ పేరుతో అనువాదం. (ఆంధ్రప్రదేశ్ చరిత్ర కాంగ్రెస్-ఎమెస్కో సంయుక్త ప్రచురణ).
పూండ్ల రామకృష్ణయ్య అముద్రిత గ్రంథచింతామణి ఆనాటి సాహిత్య దృక్పథాలు మీద మాచవోలు శివరామప్రసాద్, అల్లం రాజయ్య నవలలు, కథలు మీద కుమారి ఉభయ భారతి పిహెచ్.డి పరిశోధనలకు పర్యవేక్షణ. ఆంధ్రప్రదేశ్ హిస్టరీ కాంగ్రెస్ సంస్థాపక సభ్యులు, ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ సభ్యత్వం.