[డా॥ చెళ్లపిళ్ల సూర్య లక్ష్మి గారు రచించిన ‘ఎన్‌సీయే’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]
‘ఆఫీసులో మొదటిరోజు ఎలా గడిచిందిరా?’ అని మా ఇంట్లో వాళ్ళడిగితే ఏం జవాబివ్వాలో పాలుపోవడం లేదు. ప్రభుత్వోద్యోగం గనుక అది మామూలు గుమాస్తాగిరే అయినా కట్నం రేటు పెంచేద్దామనుకునే తల్లిదండ్రులు, ఎలాగూ సర్కారీ ఉద్యోగమే కదా అందుకని నేను ‘పని’ చేయకుండా అమ్మాయిలకు లైన్ వేస్తానని అనుకునే చెల్లెలు ఏం అడుగుతారు? ఏం ప్రోత్సహిస్తారు?
నా ముందు నడుస్తున్న బైక్ నిలిచిపోవడంతో ఒక్కసారిగా స్పృహలోకి వచ్చాను. ఇంచుమించు ఆ బండిని గుద్దినంత పని చేశాను. ఆఫీసులు వదిలే టైమ్‌లో పీక్ ట్రాఫిక్ ఉంటుంది కదా! అందుకని, సిగ్నల్ రావడానికి చాలా వెనుకే బండి ఆపవలసివచ్చింది. రెండు మూడుసార్లు సిగ్నల్ పడేవరకూ దాన్ని దాటే ప్రసక్తి ఉండదనిపించింది.
ఆఫీసులో అందరినీ పరిచయం చేసుకున్నాను. ఒకావిడ రాలేదు. అదేమిటోగాని, అందరూ ఆవిడ గురించే చెప్పారు. ఆవిడెవరో తెలియదు గానీ, ఆవిడ మాత్రం నా మనసును పూర్తిగా, నా ప్రమేయం లేకుండా దురాక్రమణ చేసేసింది. పేరు మృదుభాషిణి అట. ఎంత మంచిపేరు! అయినా ఆవిడకి ఒక ము(గు)ద్దుపేరు ఉంది. అందరూ దాన్నిమాత్రమే ప్రస్తావించి ఆవిడ గురించి మాట్లాడుతారు. నాకు తలాతోకా అర్థం కాలేదు.
ఇంతలోనే నా వెనుకనుండి ఒక కరుకుస్వరం వినిపించింది, “ఏయ్ అబ్బాయ్, సిగ్నల్ నాలుగుసార్లు ముందుకు పోలేక ఇప్పుడు అవకాశం వచ్చింది. నీ ప్రేయసి గురించి తర్వాత ఆలోచిద్దువు గానీ, ముందు కదులు, ఊఁ, ఊఁ!” అని. ఎంత సమయం గడిచిందో అప్పుడు తెలిసింది. ఆ మృదుభాషిణి గురించి ఆలోచిస్తుంటే, ఈ కర్కశభాషిణి ఎవరబ్బా, అని మనసులోనే విసుక్కుని, బండి స్టార్ట్ చేసి, మరో అరగంటకి ఇల్లు చేరుకున్నాను.
***
మరుసటి రోజు ఆఫీసుకి ఆ మృదుభాషిణి వస్తుందేమో అని ఎదురుచూశాను. అబ్బే! అలాంటిదేదీ జరుగలేదు. “హమ్మయ్య! ఆ ఎన్‌సీయే రెండు వారాలు సెలవు పెట్టిందట. మన ఆఫీసుకి అంతవరకూ ప్రశాంతత దొరుకుతుందోచ్,” అని ఎవరో, ఎవరితోనో చెప్తూంటే వినపడింది నాకు. ఇది ఆవిడని గేలిచేయడానికి వాడే పదమని నాకు తెలుసు. కానీ, ముందూ-వెనుకా ఏమీ తెలియదు.
‘కొత్తొక వింత’న్న చందాన ఆవిడమీద పెరిగిన కుతూహలం వల్ల నాకు దేనిమీదా మనసు లగ్నమవడంలేదు. ఒకప్పుడు ఏకాగ్రత అంటే, నాలాగ అని మా చుట్టాలూ-స్నేహితులూ అనేవారు. ఇప్పుడు అలాంటివాణ్ణి, నేను, చూడని ఒక ఆడమనిషి కోసం తెగ ఆరాటపడిపోతున్నాను – ఇదేమి మాయరోగమో! నన్ను నేనే తిట్టుకుని, ఆరోజు చేయాల్సిన పనిని అనుకున్న సమయం కన్నా ముందే కానిచ్చేసి, నా ‘అంకితభావాని’కి మా సూపర్వైజర్ మెప్పు పొందాను. అంకితభావమా, నా బొందా! అసలు నేను నా రేంజ్‌లో పనిచేసుంటే, వచ్చే వారానికి పూర్తవాల్సిన పనులు కూడా చకచకా జరిగిపోయుండేవేమో!
పనైపోయింది. ఇంటికి వెళ్ళలేను. అప్పుడు ఇద్దరు స్త్రీల సంభాషణ నా చెవిని పడింది. “కొత్త ఊరూ, కొత్త ఆఫీసూ, కొత్త సెక్షన్‌లోనూ పనెలా ఉందోయ్?” అని మొదటి ఆవిడ రెండో ఆవిణ్ణి ఆడిగింది. “అన్నప్రాశన రోజే ఆవకాయ తినరుగా ఎవరూను! ఇంకా కొత్తగానే ఉంది! అయినా ఆ ఎన్‌సీయేకి ఆ పేరు ఎలా వచ్చింది? నాక్కాస్త వివరంగా చెప్పవూ?” అని అంది రెండో ఆవిడ.
నేను నవ్వుకున్నాను. ఇదేదో వ్రతకథలో ఆ వ్రతం యొక్క ప్రాశస్త్యాన్ని ప్రస్తావించేటప్పుడు అడిగిన ప్రశ్నలా అనిపించింది. కానీ, వెతుకబోయిన తీగ కాలికి తగిలినట్టు, నన్ను వేధిస్తున్న ప్రశ్నకి జవాబు దొరకబోతున్నందుకు ఒకసారి మనసులోనే నిట్టూర్చేశాను. “ఆవిడా, ఆ మహాతల్లి అచ్చోసిన ఆంబోతులాంటిది. దానికి సరిపడే ఆడసామెత ఉంటే దాన్ని అన్వయించుకో! ఎటువంటి భేదభావమూ లేకుండా అందరినీ బండభాషలో తిడుతూ ఉంటుంది.”
“ఎన్‌సీయే అంటే నోరు చెడ్డ ఆడది. ఒక పాతసినిమాలోని పాటని ఆవిడకి మారుపేరుగా పెట్టారు కొందరు మగాళ్ళు,” అంది మొదటి స్త్రీ. రెండవ మనిషి అడ్డు తగిలి, “మరే, అర్థమయ్యింది. అయితే ఏ సూర్యకాంతమనో, ఛాయాదేవనో, పోనీ లేటెస్ట్‌గా ‘తెలంగాణా’ శకుంతలనో పిలవచ్చు కదా!” అని అడిగింది.
“అప్పట్లో ఓ పెద్దాయనుండేవాడట. పాటల పిచ్చోడు. ఆయన రిటైర్ అయ్యే ఓ రెండు-మూడు ఏళ్ళ ముందు ఎన్‌సీయే జాయినయ్యిందట. నేను చేరేసరికి ఆయన రిటైరైపోయారు. ఇవన్నీ శుకుడు శౌనకాది మహర్షులకు చెప్పినట్టు, ఆ మహర్షులు మిగిలినవారికి చెప్పారనుకుందాం. అటువంటి శౌనకాది సీనియర్‌ల నుండి నేను విన్న విషయాలివి,” అంది మొదటామె.
“ఆహాఁ, ఈవిడ కారెక్టర్ భలే పసందుగా ఉందే! మరింకేం విన్నావో చెప్పమ్మా!” అంది రెండో స్త్రీ. “ఓ, తప్పకుండా! ఆ పాటలో ఒక పేడిగానం ఉంటుందట, ‘అక్కాయో అక్కాయా,’ అని. అందుకని ఆమెను ‘నోరు చెడ్డ ఆడది,’ అని పిలుస్తే, వెంటనే, ఆమె వెరవకుండా ‘ఓహో నాకిక్కడ అక్కాయిలున్నారే!’ అని ఆయన పెద్దరికాన్ని కూడా పట్టించుకుండా జవాబిచ్చేసిందట. ఇవి మీ ఇంట్లో నీళ్ళేనా?” అంటూ టేబుల్ మీదున్న స్టీల్ వాటర్‌బాటిల్లోంచి నీళ్ళు గటగటా తాగేసింది మొదటి స్త్రీ.
“అమ్మో అమ్మో, ఆడదై ఉండి ఇలా నోరు జారుతుందా?” అడిగింది రెండో ఆవిడ. “అదే కదా, అసలు విషయం! ఆవిడన్న మాట ప్రస్తావిస్తే, ‘ఏం, నోరుజారడం మీ మగవాళ్ళ మోనోపొలీ అనుకున్నారా?’ అని ఎదురు సమాధానం ఇచ్చిందట. ఇంకేమీ చేయలేక, అలా అని అక్కసు వదులుకోలేక, అప్పటినుంచి ఆవిణ్ణి ఆ మూడు పొడి అక్షరాలతో ఎన్‌సీయే అని మాత్రం పిలుచుకుంటున్నారు!” అంది మొదటి స్త్రీ.
“ఆవిడ ఆడవాళ్ళతో కూడా అలాగే ప్రవర్తించేదా? ఆవిడ బూతులు తిడుతుందా?” అడిగింది రెండవ స్త్రీ. “ఆవిడ పద్ధతి చూసి, కొంతమంది లేడీ సీనియర్లు ఆవిడకి హితబోధ చేయడానికి ప్రయత్నించి, మట్టి కరచారని విన్నాను. ఏం జరిగిందో ఏమో, ఆవిడతో అణకువగా ఉండని వాళ్ళకి బ్యాండు బజాయించేస్తుంది. బూతులు తిట్టదు. కానీ ఆవిడ తిట్లు తిడితే ఎవరూ తట్టుకోలేరు. అందుకే, అందరూ అంటీ ముట్టనట్టుంటారు,” అని ముగించింది మొదటి ఆవిడ.
ఈలోగా ఆఫీసు సమయం అయిపోయింది. ఇంటిదారి పట్టాను.
***
కొన్నాళ్ళ తరువాత, నేను బైక్‌ను పార్క్ చేస్తుండగా, నా పక్క స్లాట్‌లో ఒక స్కూటీ వచ్చి ఆగింది. దానిమీద ఉండే ఆవిడ నా బైక్ వెనుక తెగ కళ్ళార్పకుండా చూస్తోంది. తెలుగు సినిమాలు చూసి పెరిగిన నేను అపార్థం చేసుకోబోయాను. “ఏమిటయ్యా, కలలు కనకుండా డ్రైవ్ చేస్తున్నావా, లేకపోతే ఇంకా సిగ్నల్స్ దగ్గరాగినప్పుడు ఊహించుకున్న డ్రీమ్ సీక్వెన్స్‌లలోకి వెళ్ళిపోయావా?” అంది ఆవిడ.
నేను షాక్ అయ్యి, “మే… మేడమ్, మీరు నా మొహం చూడలేదు క… కదా! మ..మ..మరి ఎలా?” అని అడిగాను. ఆవిడ నవ్వి, “ఓ అదా! నాకు నెంబర్‌ప్లేట్లు గుర్తుపెట్టుకునే అలవాటుంది. సబ్‌కాంషస్‌గా ఈ ప్లేట్లో నెంబర్లూ కూడితే ఏ సంఖ్య వస్తుంది, వగైరా వగైరా లెక్కలు వేయడం అలవాటైపోయింది.
నువ్వు మరోలా అనుకోనంటే ఓ మాట- లోపాలు లేనివాళ్ళకే లోపాలెంచుతుంది ఈ లోకం. నత్తి విషయంలో ఇంతవరకూ ఏంచేశావో తెలియదు. ఈరోజుల్లో బోలెడు ట్రీట్మెంట్లున్నాయి. నీకు ఏది సూటయితే అది చేయించుకో,” అని చెప్పింది ఆవిడ.
“మేడమ్, థాంక్ యూ. కానీ, నాకు నత్తి లేదండీ. మీ జ్ఞాపకశక్తికి మాటలు తడబడ్డాయి అంతే!” అని జవాబిచ్చాను.
నేను కూడా ఆవిడతో కలిసి నడుస్తూండడం చూసి, “సరే కానీ, మా ఆఫీసులో నువ్వున్నావేమిటి? బిల్స్ గురించో, పెన్షన్ గురించో పనుందా?” అని అడిగింది ఆవిడ. “నేను ఈమధ్యనే ఈ ఆఫీసులో చేరానండీ. జూనియర్ అసిస్టెంట్‌గా!” అన్నాను. వెంటనే ఆవిడ, “సరే, నువ్వెళ్ళు. నేను అయిదు నిముషాల్లో వస్తాను. ఇంకా ఆఫీసు టైమ్‌కి పది నిముషాలున్నాయి కదా!” అని, పక్కకు వెళ్ళింది.
నేను ఆఫీసుకు వెళ్ళగానే అక్కడుండే పురుషపుంగవులందరూ నాచుట్టూ మూగి, “ఆ ఎన్‌సీయే నీతో ఏం మాట్లాడింది? కొంపదీసి, భయపెట్టలేదు కదా!” అని ఒకరు, “నిన్ను అక్కాయా అని గాని పిలిచిందా?” అని మరొకరు- ఇలా ప్రశ్నలవర్షంలో నన్ను ముంచెత్తారు. “ఆవిడ చాలా పొలైట్‌గా మాట్లాడారు,” అని నేను నిజాన్ని వెలిబుచ్చాను.
“చూసుకో బాబూ, అసలే ఎర్రగా, బుర్రగా ఉన్న పెళ్ళికాని యువకుడివి. ఆ ఆంటీ నీమీద కన్నేస్తోందేమో! ముందుగా హెచ్చరించలేదని తర్వాత అనొద్దు. కొన్నాళ్ళలో ‘నీమీద నాకు ఇదయ్యో,’ అని పాడినా పాడేస్తుంది. ఆవిడకు దూరంగా మసలుకో!” అంటూ వాళ్ళలో ఓ పెద్దాయన నాకో ఉచితసలహా పడేశాడు.
నేను మారుమాట్లాడలేదు గాని, నా మనసు అయోమయమయ్యింది. ఆవిడ గురించి ఆ ఆడవాళ్ళు చెప్పుకున్నదొకటి, ఈ మగవాళ్ళు చెప్తున్నది మరొకటి. ఆవిడ నాతో మృదుభాషిణిలాగే ప్రవర్తించింది కదా! కానీ, వీళ్ళు చెప్పింది వింటూ ఉంటే, భయమేస్తోంది. ఆవిడ అందమైన వాళ్ళనిలా ట్రాప్ చేస్తుందా? ఒకపక్క ఆవిడ పేరేమిటి, మరోపక్క ఆవిడకుండే బిరుదేమిటి? అయినా, అనువుగాని చోట అధికులమని అనరాదు గనుక మెజారిటీ అభిప్రాయాన్ని అవలంబించ దలచి, ఆవిడతో దూరం పాటించాను.
కానీ, ఆవిడ నన్ను చెడ్డతిట్లు తిడితేనో? అవి శాపాలై నాకు తగిలితేనో? చేసిన పాపానికి పర్యవసానం అనుభవించాలి కదా! కానీ, నాకు మాత్రం ఆవిడ వీళ్ళు అంటున్నంత చెడ్డమనిషి కాదనిపిస్తోంది. లేకపోతే, పొద్దున్న మేమిద్దరం మాట్లాడుకున్నప్పుడు, పేరుకు తగ్గట్టు మృదువుగా నాతో మాట్లాడి ఉండేది కాదు కదా! పైగా, ‘నత్తి’ అంటే నగుబాటు దృష్టితో చూడకుండా, దాన్ని ఎలా అధిగమించవచ్చో స్నేహపూర్వక సలహా ఇచ్చింది. ఆవిడ పరోపకారిణిలాగే నాకు అనిపించింది. బహుశః ఆవిడే గనుక మంచావిడ అయితే, ఒక మంచి సీనియర్‌తో స్నేహభాగ్యాన్ని పోగొట్టుకున్న వాణ్ణవుతాను.
అలా అనుకుని, అనుకోకుండా ఆవిడకేసి చూశాను- జాగ్రత్తగా, ఆవిడకి తెలియకుండా! “దమ్ముంటే నాకేసి నేరుగా చూసి మాట్లాడు. ఆ ఓరచూపులేమిటి?” అన్న మాటలు వినపడి, ఒక్కసారి ఉలికిపడి, ఆవిడకేసి చూశాను. నిప్పులురుముతున్నాయి ఆ కళ్ళు. తల దించుకుని, “క్షమించండి మేడమ్,” అని టీ తాగడానికి కాంటీన్ వైపు నడిచాను.
నా వెనుకే ఇద్దరు ముగ్గురు సీనియర్ మగవాళ్ళు పెద్ద పనున్నట్టు కాంటీన్‌లో చాయ్ తెచ్చుకుని నా ముందు కూర్చుని, “ఆ ఎన్‌సీయే అన్నది పట్టించుకోకు. ఇంకా నయం, నిన్ను నపుంసకుణ్ణి చేయలేదు సంతోషించు,” అని ఒకరు చెప్పారు. “ఆవిడకి ఎంత దూరముంటే అంత నీకు మంచిది,” అన్నారు మరొకరు.
“ఆవిడ అన్నదాంట్లో తప్పేమీలేదు. నేనే అలా ఆవిణ్ణి చూడకుండా ఉండుండాల్సింది. ఆ తరువాత, మీకు చెప్పేటంత వాణ్ణి కాదనుకోండి, కానీ, పేడివాళ్ళని మీరు దయచేసి గేలిచేయవద్దు. వాళ్ళ గురించి మానసిక శాస్త్రజ్ఞులు రాసిన కొన్ని విషయాలు చదివాను. స్త్రీ-పురుషులతో పాటు వాళ్ళూ సమానమే!
నేను వచ్చినప్పటినుంచీ చూస్తున్నాను, ఆవిడంతటావిడ ఎవరినీ ఏమీ అనడంలేదు. నాకేమీ ఇండీసెంట్ ప్రపోజల్ చేయలేదు. అందుకని, ఆవిణ్ణి నాముందు కించపరచకండి. ఇది నా మనవి. మీపై గౌరవంతోనే చెప్తున్నాను,” అని, నేను తాగుతున్న చాయ్ కప్పు పట్టుకుని, కుర్చీలోంచి లేచాను.
“ఆవిడో మగరాయుడూ, ఇతనో ఆడంగివాడూ,” అని వాళ్ళలో ఒకరు అన్నారు. నడుస్తున్న నేను వెనుకకు చూసి, “మళ్ళీ అదేమాట అంటున్నారు. వాళ్ళకి సమాన హక్కులున్నాయి. అనకూడదు గానీ, మన సమాజంలో ఆడతనం, మగతనం అనే అంశాలమీద నిర్దిష్టమైన అభిప్రాయాలు ఏర్పడి, వాటిని అనుసరించని వాళ్ళని లోకువ చేయడం మనకి అలవాటైపోయింది. అర్ధనారీశ్వర తత్వాన్ని మనం ఆరాధించే పరమశివుడే బోధించాడు.
ఇప్పుడు మీరు ప్రస్తావించే అంశాలకు మూలకారణం ఆవిడ ఎప్పుడో ఎవరో పురుషుణ్ణి ‘అక్కాయా’ అని సంబోధించింది అన్న భావన. అప్పుడు మనం ఎవరమూ లేము. విన్నవాటిపై మనుషులపై అభిప్రాయం ఏర్పరచుకుని, వాళ్ళ శీలాన్ని, గుణగణాలను అంచనా వేయడం మంచి ఆలోచన కాదని నా అభిప్రాయం. వస్తా,” అని అక్కడినుండి చకచకా బయటికి వచ్చేశాను.
***
ఆవిడ మీద కుతూహలం మానుకున్నప్పటి నుండీ నాకు బోలెడు మనశ్శాంతి లభించింది. కాకుల్లాంటి లోకులు ఆవిడ గురించి మాట్లాడడం మానేశారని కాదు. నేను వాటికి ప్రాధాన్యతనివ్వడం మానేశాను. అలా కొన్నాళ్ళయ్యాక ఒకనాడు..
లంచ్ బ్రేక్ అయ్యాక ఆఫీసులోకి అడుగుపెట్టబోతున్న నాకు ఒక అమ్మాయి ఏడుపు, మృదుభాషిణి గారి గొంతుక వినిపించాయి. “మీ ప్రేమాయణం ఎంతదూరం వచ్చింది? హద్దు మీరావా?” అని అడుగుతోంది ఆవిడ. ఆమె నాతోబాటే ఉద్యోగంలో చేరినమ్మాయి. ఏదో లవ్ ఫైల్యూర్ విషయమని అర్థమయ్యింది. గుమ్మానికి ఇవతలే ఆగిపోయాను.
“చూడు దివ్యా, ‘మనుషులని, ముఖ్యంగా మగాళ్ళని నమ్మకు,’ అని చెప్పను గాని వాళ్ళతో జాగ్రత్త పడమంటాను. నీ వయసులో ప్రపంచం పచ్చగా, అందమైన పూలతో కనిపిస్తుంది. ముళ్ళు కనబడవు. అలా అని అవి మనలని వదలవు; ఎప్పుడో అప్పుడు గుచ్చుతాయి. నమ్మితేనే ద్రోహం జరుగుతుంది. నమ్మకపోతే ఏదీ ఉండదు. అయితే, ఎవరినీ నమ్మలేకపోవడం ఒక దుర్భరమైన విషయం.
నమ్మాలి, దెబ్బలు తినాలి, ఎదగాలి. పైగా నువ్వు హద్దు మీరలేదు. నీలాంటి మంచి అమ్మాయి భార్యగా లభించే అదృష్టం ఆ దుష్టుడికి లేదు. వదిలేయి. చెప్పినంత సుళువు కాదిది పాటించడం. ఒక హాబీ అలవరచుకో. అన్నీ నెమ్మదిగా సద్దుకుంటాయి,” అంటోంది ఆవిడ.
“వాణ్ణి ఉత్తినే వదిలేయాలా, శిక్ష పడకుండా?” అని అడుగుతోంది దివ్య. “ఆ పనికిమాలినవాడికి మనసివ్వడమే పెద్ద టైమ్ వేస్ట్. ఇంకా వాడికి శిక్ష పడేదాకా సమయాన్ని వృథా చేయకు. మంచి పనులకు వాడుకో! నీకొక సంగతి చెప్తాను. మా అక్క ఫ్రెండ్ ఇలా ప్రేమలో ఎదురుదెబ్బ తింది. అయినా, వాడి మీద పిచ్చి ప్రేమ చంపుకోలేక, వాళ్ళ పెద్దవాళ్ళ దగ్గరకు వెళ్ళి, వాణ్ణి పెళ్ళి చేసుకుంది. పెళ్ళయిన రెండు నెలల్లోనే గ్యాస్ సిలిండర్ పేలిపోయి చనిపోయింది.
ఆమె మరణం అనుమానాస్పదంగా ఉన్నా, ఆమె చరిత్ర అలా ముగిసిపోయింది. ఆమె జీవితం నేర్పిన గుణపాఠం వల్ల మా అక్కా, నేనూ పెళ్ళి చేసుకోలేదు. అలాగని జీవితం సజావుగా సాగదు సుమీ! ఆ రోజుల్లో ఆడవాళ్ళు ఎక్కువమంది ఉద్యోగం చేసేవారు కాదు. పెళ్ళికాని యువతి ఉద్యోగానికి వస్తే ఆమె ‘లైన్ వేయించుకోవడానికి రెడీ,’ అనుకునేవారు వీళ్ళు.
అణకువతో వ్యవహరించుకుంటే అడ్డదిడ్డమైన వాగుడు వాగే మగాడిదలు, మృగాళ్ళు- ఎలా పిలిచినా సరే- కొంచెం బోల్డ్‌గా జవాబిస్తే, తోక ముడిచి పారిపోతారు. నా యుక్త వయసులో సత్యమూర్తి గారు అనే కార్టూనిస్ట్ గీసే ‘బోల్డ్ టైపు’ కార్టూన్స్ తెగ చదివేదాన్ని. అందులోని బోల్డ్ కారెక్టర్‌ని అవహింపజేసుకుని, ఆమెని అయిపోయి, నా నోట్లోంచి ఎప్పుడు ఏమొస్తుందో తెలియని పరిస్థితి సృష్టించాను. ఆపద్ధర్మం, ఏం చేస్తాం?
మనవాళ్ళు నా గురించి ఏమని మాట్లాడుకున్నా సరే, అంటే ఎన్‌సీయే, ‘నోరు చెడ్డ ఆడది,’ వగైరాలు – నా జోలికి మాత్రం రారు. వీళ్ళిచ్చే ఫ్రీ పబ్లిసిటీ వల్ల మిగిలిన వాళ్ళు కూడా ఒళ్ళు దగ్గరుంచుకుని మాట్లాడుతారు. ఓ.. ఓ.. అనవసరంగా నా స్వీయచరిత్ర గురించి ఎక్కువ చెప్పాను. నువ్వు త్వరలోనే ఆ దుష్టుణ్ణి మరచిపోయి, కొత్తజీవితం మొదలుపెట్టు,” అంటోంది మృదుభాషిణి గారు.
బయటున్న నేను, ఆవిణ్ణి సరిగ్గానే అంచనా వేసినా, ఇన్నాళ్ళూ ‘నలుగురితో నారాయణ’లాగా ప్రవర్తించినందుకు గాను సిగ్గుపడి, లోపలికి రాగానే ఆవిడకి క్షమాపణ చెప్పుకుని, ఆవిడ శిష్యరికం చేసే అవకాశం నాకివ్వమని కోరాను. ఏ కళనుందో ఏమో, ఆవిడ ‘ఊఁ’ అనేశారు.
ఇంత మెచ్యూరిటీ ఉన్న ఆవిడ, ఇన్ని పాజిటివ్ ఆలోచనలున్నావిణ్ణి ‘ఎన్‌సీయే,’ అని పిలిచిన వాళ్ళ అజ్ఞానమేపాటిదో అర్థమయ్యి, నవ్వుకున్నాను. నా దృష్టిలో కూడా ఆవిడ ఎన్‌సీయేనే. కానీ, వాళ్ళనుకున్నట్టు కాదు, ‘నోబుల్, ఛారిటబుల్, అడ్మిరబుల్.’ అంటే ఉన్నతమైన, ఉదారబుద్ధి గల ఆవిడ, సహాయానికి వెనుకాడని ఆవిడ, అందరిచే కొనియాడదగ్గ ఆవిడ, అని. ఎంత బాగుందో కదా!
డా॥ చెళ్లపిళ్ల సూర్య లక్ష్మి గారి సాహితీ ప్రస్థానం 2015లో తెలుగు భాషలో మొదలయింది. అరవైకి పైగా రచనలు ప్రచురితమయ్యాయి; వాటిలో ఒక నవల కూడా ఉంది.
సమాజానికి ఉన్నత విలువలుండే సాహిత్యాన్ని అందివ్వడం కోసమే వీరు రచనలు చేస్తారు. ఆఖరికి హాస్య కథ వ్రాసినా సరే, దానిలో ఒక విలువ పొంచి ఉంటుంది. వీరి రచనలలో స్త్రీకి ఉన్నతమైన స్థానం, తనదంటూ ప్రత్యేక వ్యక్తిత్వం ఉంటాయి. వీరి కథలు పలు ప్రింట్, వెబ్ పత్రికలలో ప్రచురింప బడ్డాయి.
మూస రచనలను చేయడానికి ఇష్టపడని సూర్య లక్ష్మి విభిన్న ఇతివృత్తాలు, విభిన్న కోణాల నుండి మానవ ప్రవర్తనని అర్థం చేసుకునేందుకు ప్రయత్నిస్తారు, అది ఫలితాన్ని ఇచ్చినా, ఇవ్వక పోయినా కూడా!