Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

నవనీతపు.. తరంగం

[మరింగంటి సత్యభామ గారి ‘నవనీతపు.. తరంగం’ అనే భక్తి కవితను అందిస్తున్నాము.]

హాహ.. కన్నయ్య.. నల్లనిస్వామీ..!
చల్లనిస్వామి.. అన్నన్నా.. వెన్న దొంగ..!
అల్లరివాడే.. కన్నయ్య నల్లనివాడే!
ఆమని కందువలో, వనాలలో చేరితివ!
సుషిర రవళిలో లేమలను కట్టెదవ!
ఆ మధుర రాగ తరంగములలో
ఓలలాడించెదవ!

ఓగితమే.. కృష్ణయ్య.. మహిమలన్నియూ!,
ఎన్నెన్నో.. మాయలను మహిని.. చూపెనే!
ఏడేడు భువనాలు అమ్మకు చూపించితివ!
ఓజస్సు గల దైవము! గోపాల బాలుడే!
ఒహో! ఒహో! మా కన్నులలో మెరుపులు,
వెలుగులన్ని.. వెన్నునివేలే!
భళీ భళీ కన్నయ్య.. తాండవమాడే!
కాళీయుని గర్వమణచి తాండవమాడే!
భళా.. భళా.. గోవర్ధనగిరి నెత్తెనే!
ఆహాహా గోకులమును కాచిన సామీ!
ఔరౌరా! రాసలీల సలిపిన కరివేలుపువే!
ఔలే! గొల్లెతల మదిలోన నిలచిన దేవరవే!
భళిర! భళిర! సంద్రమున నగరమును
నిలిపిన గోవిందుడే! గోకులమును
ద్వారకకు చేర్చిన నామాల స్వామి!
హేహరీ.. అళుకులను రాకుండా కాచు దేవరా!
దండమయా దండమయా దండము కృష్ణా!
ఓ హటము లేలయ్య! మము వీడిపోకయ్య!
వల్లవలను కావుమయ్య..!
నీ భక్తుల బ్రోవుమయ్య!

ఒరపరీ హారి, హరీ.. నీవే దిక్కయ్య మాకు!
ఓ అయ్యా, నీవు లేక జీవించగలేము
హల్లీసకముల నాడు రమణులార! రండు!
వంశినాళమునూదు గోవింద.. గోవింద!
నీ మురళీరవము విని గోకులమే వచ్చెనయ్య!
ఎలరుపులను ఈవయ్య!
హే.. ప్రభూ.. ఇగిరికలివి నీ కయ్య!
ఇహము.. పరము.. నీవయ్య!
నీ పదములె మాకు దిక్కు!
గోవులకొడయడివి! గొబ్బిళ్ళు! గొబ్బిళ్ళు!
గోపికాలోలునివి. గోపాలా! గోవిందా!
గరుటినెక్కి తిరుగువాడ!
పదునాలుగు లోకాలు కొలిచితివ!
విశ్వరూపమే చూపితివా!
దేవతలను.. కాచితివ!
బలి అహము.. అణచితివ!
కేల్మోడ్చి.. మొక్కెదము!
హరి! హరి! నీ సరి వేరెవరయ్య
ఒక వంక శ్రీదేవి.. ఒక పక్క భూదేవీ
మధ్యన.. నీవే హరీ
నీలమోహనాకారా!
పరమపదము నీయవయ్య!
శరణు! శరణు! మురహరీ!
పరంధామము చేర్చే నరహరీ
నీ భక్తులము. పరమేశ్వరా, హరీ!

🙏
~
• కందువ=ఋతువు
• కేల్మోడ్చు=రెండు చేతులు ఎత్తి నమస్కరించు
• ఒడయడు= యజమాని, భర్త
• ఇగిరిక=హవిస్సు
• ఎలరుపు=సంతోషము
• ఒరపరి=సౌందర్యవంతుడు
• ఓహటము=వెనుదీయుట
• వల్లవులు=గొల్లవారు
• అళుకులు=భయము, వెరపు
• కరివేల్పు=నల్లని స్వామి, కృష్ణుడు
• సుషిర రవళి= ఒక రకం వేణువు నాదం
• గరుడుడు=వైనతేయుడు
• హల్లీసకం=కోలాటం

Exit mobile version