[సత్యగౌరి మోగంటి గారు రచించిన ‘నవజీవన రాగం..!!’ అనే కవిత పాఠకులకి అందిస్తున్నాము.]
అదేంటో..
ఈ ప్రేమ —
కాలంతో పాటు,
మరింత చిక్కబడుతూ ఉంటుంది
మొగ్గలా వికసించి —
పరిమళాలు వెదజల్లినట్టు!
రెండు హృదయాలదీ
ఒకటే శబ్దం.. ఒకటే గానం ,
ఓ భావోద్వేగం.. అందమైన ఆశ్చర్యం
చల్లని మలయ సమీరమే..!
ప్రతి క్షణం మూటకట్టిన –
గంధపు పరిమళం.
గుప్పెడంత గుండెకు అదే ప్రాణం
అనుక్షణం పిలిచే నీ పిలుపే
నాకు జీవన సాఫల్యం..!
నీ కళ్లు నా కలల వాకిళ్లు,
అణువణువూ నవజీవన రాగం,
నీ మృదుమధురమైన స్పర్శే-
నాలో ఊపిరైన నవ చైతన్యం!
నేనెక్కడ అలసిపోతానోననే నీ భయం,
నేను ఎక్కడున్నా నిలబెట్టే ధైర్యం!
సూర్యుడి ప్రకాశంలా.. తారకల మెరుపులా,
మన ప్రేమ నిరంతరం ఊరే నీటిచలమనే..!!
కవయిత్రి సత్యగౌరి మోగంటి వృత్తి రీత్యా ఉపాధ్యాయురాలు. ఎమ్.ఎ; బి.ఎడ్, బి.ఎల్. చదువుకున్నారు. కాకినాడకు చెందిన వీరు ప్రభుత్వ పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్‌గా పదవీ విరమణ చేశారు. తెలుగు సాహిత్యం లోనూ, రచనావ్యాసంగంలోను అభిరుచి వున్న శ్రీమతి సత్యగౌరి, రేడియో ప్రసంగాలు, అడపాదడాపా వివిధ ప్రక్రియల్లో రచనా వ్యాసంగం చేస్తూ ప్రస్తుతం హైదరాబాదులో విశ్రాంత జీవితం గడుపుతున్నారు.