Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

నవ వసంతం

[కానాల సుమంగళి గారు రచించిన ‘నవ వసంతం’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]

చిత్రమైనదీ చైత్రమాసం, వసంతాన్ని తెచ్చే ప్రారంభ కాలం
మోడులైన వృక్ష రాజాలని చిగురింపజేసే పుణ్యకాలం

గత జ్ఞాపకాల పరంపరలను మరిపిస్తూ కొత్తదనానికి ఆహ్వానం
ఆశావాదంతో నిరాశా నిస్పృహలకు తిలోదకాలిచ్చే తరుణం

మనో బలంతో సాగుతూ ఒడుదొడుకులను ఎదురొడ్డి సాధించాలి స్థిరత్వం
సుఖ సంతోషాలతో కాలాన్ని గడుపుతూ పెంపొందించుకోవాలి వ్యక్తిత్వం

షడ్రుచుల ఉగాది పచ్చడి మన జీవన విధానానికి సంకేతం
సమయస్ఫూర్తితో నడుచుకుంటూ జీవితాన్ని పండించుకోవటమే ప్రధానం

అరిషడ్వర్గాలను అదుపు చేస్తే జీవితం కాదా ఆనందమయం
పరమాత్మ అనుగ్రహం తోడైతే మనోచింతన మటుమాయం

పులుపు, చేదు, తీపి, వగరు, ఉప్పు, కారం, షడ్రుచుల కదంబం
ఏ రుచి అధికమైనా మనిషికి వెగటు పుట్టటం సహజం

మావి చిగురులు భక్షించి చేసిన కోయిలల గాన మాధుర్యం
వీనుల విందుగా ఆనందం పంచుతున్న ఋతు ధర్మం

సుఖదుఃఖాలను మనోవ్యథలను మరిపించే వసంతం
మనసులోని ఆలోచనా పరంపరలకు పలికే చరమ గీతం

శాశ్వతానందానికి సంధానం చేస్తూ సాగాలి అన్వేషణం
వర్తమానాన్ని ఆస్వాదిస్తూ కొనసాగించాలి జీవం యానం

స్థితప్రజ్ఞతతో నిలిచినచో ఏ పరిస్థితి నైనా ఎదుర్కునే ధైర్యం
భవిష్యత్తును తీర్చిదిద్దుకునేందుకు లభించు సులువైన మార్గం

ప్రకృతిలో కోకిల గానంతో చిన్నా పెద్దా హర్షించే కాలం
రెట్టిస్తే మరింతగా మారుపలికే కుహూ కుహూలు మనోహరం

విరబూసిన మోదుగ పుష్పాలు వనాలకు తెస్తాయి అందం
వసంతకేళిలో ఆ పుష్ప కషాయాలు ఆరోగ్యకరం ఆనందకరం

ప్రకృతిని ఆరాధిస్తూ ఆస్వాదిస్తూ పరిరక్షిస్తూ సాగాలి మనం
భగవద్ప్రసాదమైన ప్రకృతిని నాశనం చేస్తే మనుగడ శూన్యం

క్రొంగొత్త ఆశలతో ఆశయాలతో విశ్వావసును స్వాగతిద్దాం
విలువలనెఱిఁగి భవిష్యత్తును దిగ్విజయంగా మలుచుకుందాం

ఈ శుభ సందర్భంలో ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలుపుకుందాం
ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు పొందాలని కోరుకుందాం

Exit mobile version