మహా కవితా ప్రస్థానం
భావ కవిత్వపు కలల సౌధాల్లోంచి వాస్తవిక మైదానాల వైపు కవితా సరస్వతిని ప్రవహింప జేసిన వాళ్లలో మొదటి వాడు శ్రీశ్రీ. జలసూత్రం రుక్మిణీ నాథ శాస్త్రి ‘అశ్వాశాంతం’ అనే గేయంలో ఆ రోజుల్లోని కవితా స్వరూపాన్ని చెప్పకనే చెప్పుకొచ్చాడు.
‘‘విత్తనాలు పడే వున్నాయి. అదునుకు వర్షం పడింది. ఇక పంటకేం కొదవ?’’ అన్నాడు. అభ్యుదయ రచయితల సంఘం స్థాపించిన తరువాత ‘‘పదండి ముందుకు.. ’’ అంటూ ముందుకు పరుగులు పెట్టిన కవులు ఎందరెందరో.. ఆనాడూ.. ఈనాడూ.. ఏనాడైనా అభ్యుదయ కవిత్వానికి అతనొక్కడే నాయకుడు. 1932-33లో బరంపురంలో అఖిలాంధ్ర కవిపండిత సభ జరిగింది. దీనికి శ్రీశ్రీ, కొంపల్లె ఇద్దరూ వెళ్లారు. అక్కడ శ్రీశ్రీ తన కవిత్వాన్ని చింతా దీక్షితులుకు వినిపించాడు. అది విని ఆయన ఆనందభరితుడైపోయాడు. సంతోషంగా ‘‘వచ్చేసిందిదిగో కొత్త కవిత్వపు వరద’’ అని అద్భుతంగా మెచ్చుకున్నాడు.
శ్రీశ్రీ ఎత్తిన అగ్గిబావుటా వెలుగులోకి అభ్యుదయ సాహిత్యం కదం తొక్కుతూ పదం పాడుతూ.. నయాగరా జలపాతం లాగా ఎగిసెగిసి పడుతూ ప్రవహించింది. ‘రాబోయే యుగం నాది’ అని తానే చెప్పుకున్నాడు. ఇరవయ్యో శతాబ్దపు తెలుగు కవిత్వం మీద తిరుగులేని నియంతృత్వం చలాయించాలని నిశ్చయించుకున్నాడు. అదే లక్ష్యంతో జీవితమంతా కృషి చేశాడు. చివరకు అదే నిజమైంది. కవిత్వం వాడుక భాషలనే ఉండాలనే నిర్ణయానికి వచ్చిన తరువాత కానీ, శ్రీశ్రీ భావకవిత్వపు బాహువుల్లోంచి బయటపడలేకపోయాడు. అప్పటి వరకు ఆయన మీద తీవ్రంగా ఉన్న విశ్వనాథ, కృష్ణశాస్త్రిల ప్రభావం నుంచి ప్రయత్న పూర్వకంగా బయటపడాల్సి వచ్చింది. ఆ తరువాత ఆయనలో ధిక్కార స్వరం వినిపించింది. అప్పటిదాకా కల్పనాలోకంలో విహరిస్తున్న కవిత్వాన్ని వాస్తవ ప్రపంచంలోకి తీసుకువచ్చాడు. అందమైన అబద్ధాల నుంచి నిష్ఠూరమైనా సరే నిజం వైపు కవిత్వాన్ని మళ్లించాడు. ఏదో కొత్తదనం కోసం నిరంతరం అన్వేషిస్తూ సాగాడు.
ఆ విధంగా కవిత్వంలో ప్రజాప్రస్థానం వైపు కదిలాక శ్రీశ్రీకి దగాపడిన తమ్ముళ్లూ, బాధా సర్పదష్టులూ.. కష్టం చాలక కడుపుమంటలో కుమిలిపోయేవాళ్లూ.. అనాథలూ.. అభాగ్యులూ.. కళ్ల ఎదుట కనిపించారు. గత చరిత్ర అంతా ఘోరంగా కనిపించింది. అందుకే అన్నాడు..
ఏ దేశ చరిత్ర చూసినా
ఏమున్నది గర్వకారణం..
నరజాతి చరిత సమస్తం
పరపీడన పరాయణత్వం
జెంఘీజ్‌ఖాన్, తామర్లేనూ..
నాదీర్షా, ఘజ్నీ, ఘోరీ,
సికిందరో ఎవడైతేనేం?
ఒక్కొక్కడూ మహా హంతకుడు.
నైకింగులు, శ్వేత హూణులూ
సిథియన్లూ, పారశీకులూ
పిండారులు, థగ్గులు కట్టిరి
కాలానికి కత్తుల వంతెన…
గత శతాబ్దంలో సగభాగం శ్రీశ్రీ ప్రాసక్రీడలతో నిండిపోయిన యుగమే.. కొత్త కవిత్వానికి ఆయన అనేక సొబగులు తొడిగాడు. ముడిసరుకులు అందించాడు.. ‘‘సింధూరం, రక్త చందనం, బందూకం, సంధ్యారాగం, పులి చంపిన లేడినెత్తురు’’ వంటివి సప్లై చేశాడు. విప్లవ కవిత్వంలో ఇవన్నీ సమపాళ్లలో కలిపితే ఎంత చక్కని చిక్కని కవిత్వం వస్తుంది?
అంతే కాదు.. ‘వికసించిన విద్యుత్ తేజం, చెలరేగిన జనసమ్మర్ధం, రాబందుల రెక్కల చప్పుడు’లతో వెలువడే కవిత్వం ఎలా ఉంటుందంటే.. ‘కదిలేదీ, కదిలించేదీ, మారేదీ, మార్పించేదీ, పెను నిద్దుర వదిలించేదీ, మును ముందుకు సాగించేదీ, సంపూర్ణ బ్రతుకిచ్చేదీ’గా ఆవతరిస్తుంది.
శ్రీశ్రీ కవిత్వం అంటే ఇది.
మహా ప్రస్థానం
శ్రీశ్రీ పేరు చెప్పగానే ఎవరి నోటైనా మొదట వినిపించేది.. మరో ప్రపంచం మరో ప్రపంచం పిలిచింది గేయం.. జనాల నాలుకలపై 75 సంవత్సరాలుగా లయబద్ధంగా నాట్యం చేస్తున్న గేయమిది. శ్రీశ్రీని మహాకవిగా యుగయుగాల పాటు నిలబెట్టిన మహా కావ్యం మహా ప్రస్థానం. శ్రీశ్రీ మిత్రుడొకరు చేసిన వైద్య సహాయంతో 1950లో మహాప్రస్థానం మొదటిసారి అచ్చయింది. మహా ప్రస్థానం కవరు పేజీలు స్వయంగా శ్రీశ్రీయే దగ్గరుండి డిజైన్ చేశాడు. కవరుపేజీపై టైటిల్ అక్షరాలు రాసిన వాడు ఆర్టిస్టు తేజోమూర్తుల కేశవరావు. పుస్తకంపై శ్రీరంగం శ్రీనివాసరావు అన్న సంతకం తయారీకి పాపం ఆయన పడ్డ కష్టం అంతా ఇంతా కాదు.. పసుపు పచ్చని కాగితాలపై నీలి పెన్సిలుతో యాభై సార్లు రాసి అందులో ఒకదాన్ని ఎంచుకున్నట్టు తానే అనంతంలో చెప్పుకున్నాడు.
మహా ప్రస్థానం రాస్తున్న కాలంలో అధివాస్తవికోద్యమం శ్రీశ్రీని బలంగా ఆకర్షించింది. అయితే అందులో పూర్తిగా కూరుకుపోకుండా అభ్యుదయ భావాలు అడ్డుకున్నాయి. ఇందుకూ కారణం ఏమంటే లూయీ ఆరగో.. తన నాయకుడైన ఆంద్రే చైతాతో గొడవ పడి లూయీ అరగో కమ్యూనిస్టు పార్టీలో సభ్యుడయ్యాడు. అధివాస్తవికతను కేవలం ప్రయోగాత్మకంగానే ఉంచాలన్నాడు చైతా.. కానీ, ఆ వాదంతో లూయీ ఏకీభవించలేదు. ‘‘మనకు కావలిసింది అధివాస్తవికుల స్వాతంత్య్రం కాదు. ఆకలి బాధలతో ఏడుస్తున్న పసిపిల్లలకు పాలు’’ అన్నాడు. శ్రీశ్రీ మహా ప్రస్థానం ఈ నేపథ్యంలోంచి వెలువడింది. అందులోని మాటలు అడుగడుగునా ఈ మహా లక్ష్యాన్ని ధ్వనింపజేస్తాయి.
‘‘మాటలు మాట్లాడుతాయి.. మనసులతో కొట్లాడుతాయి. మనుష్యులతో చీట్లాడతాయి..
మాటలు నిద్రపోతాయి. నిద్రలో కలలు కంటాయి. నిద్ర పోతున్న వాళ్లందర్నీ మేలుకొమ్మంటాయి.
నిద్ర పోతున్న మాటల్ని నిద్ర పోతూనే ఉండండి.. అవసరం వస్తే మేలు కొల్పుతానన్నాను.. ’’ అన్నాడు..
ఇదిగో మహా ప్రస్థానం సమయంలో ఆ అవసరం వచ్చింది. అలా మేలుకొన్న మాటలు మహా కవిత్వంగా రూపొందాయి.
ఆకలి బాధలు ఎక్కువగా ఉన్న 1930 ప్రాంతాల్లో ఆర్థిక విధానాలు ప్రపంచాన్ని దారుణంగా జనాల్ని వెన్నుపోటు పొటిచిన కాలంలో మహాప్రస్థాన కావ్యం వెలువడింది. 1934-1940 మధ్య కాలంలో మహాప్రస్థానం గేయసంపుటిగా అత్యున్నత కావ్యంగా వెలువడింది. ప్రపంచవ్యాప్తంగా ప్రజానీకం అసాధారణంగా ఎదుర్కొంటున్న బాధల్ని ప్రధాన వస్తువును చేసుకుని ఈ గేయ సంపుటి వెలువడింది. శ్రీశ్రీ మిగతా కవితలన్నీ ఒక ఎత్తైతే.. మహా ప్రస్థానం శిఖరం. తెలుగు సాహిత్యంలో లక్ష కాపీలకు పైగా అమ్మకానికి నోచుకున్న రెండు గ్రంథాలలో ఒకటి మహా ప్రస్థానం. ఈ మహాద్భుతమైన సాహిత్య గేయ రూపాన్ని విస్తృతంగా చర్చించకపోతే శ్రీశ్రీని సంపూర్ణంగా అధ్యయనం చేయనట్టే అవుతుంది. ఇందులో మొత్తం 40 కవితలు ఉన్నాయి. ఇది కాక చివరలో ముందుగానే చెప్పుకున్నట్టు కొంపల్లె జనార్ధనరావుకు అంకితమిచ్చిన పద్యం ఒకటుంది. తెలుగు సాహిత్యలోకం యావత్తూ ప్రేమించి.. ఆరాధించి.. అభిమానించిన గేయాలు ఎన్నెన్నో ఇందులో ఉన్నాయి.
కాకినాడలో కమ్యూనిస్టు యువకుల మహాసభలో శ్రీశ్రీ చదివిన గేయం ఈ సంపుటిలో కనిపిస్తుంది. జరుక్ శాస్త్రి (జలసూత్రం రుక్మిణీ నాధశాస్త్రి) చదివి వినిపించగా చలం కన్నీళ్లు పెట్టుకున్న చేదుపాట ఇందులో కనిపిస్తుంది.
‘మనమంతా బానిసలం
గానుగలం, పీనుగులం
వెనుక దగా, ముందు దగా
కుడియెడమల దగా, దగా
మనదీ ఒక బ్రదుకేనా?
కుక్కల వలె, నక్కల వలె
మనదీ ఒక బ్రదుకేనా?
సందులలో పందుల వలె’ (చేదుపాట)
కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ విని, పులకరించి, లేచి కౌగిలించుకుని కన్నీళ్లు పెట్టుకుని, మహా ప్రస్థానాన్ని నేనే ప్రచురిస్తానని వాగ్దానం చేయటానికి కారణమైన ‘కవితా ఓ కవితా’ గేయం కూడా ఇందులో ప్రధాన కవితగా ఉంది.
‘నాలో కదిలే నవ్య కవిత్వం
కార్మిక లోకపు కల్యాణానికి, శ్రామిక లోకపు సౌభాగ్యానికి
సమర్పణంగా, సమర్చనంగా, త్రికాలాలలో, త్రికాలాలలో
శ్రమైక జీవన సౌందర్యానికి, సమానమైనది లేనే లేదని
కష్ట జీవులకు, కర్మ వీరులకు
నిత్యమంగళం నిర్దేశిస్తూ, స్వస్తి వాక్యములు సంధానిస్తూ
వ్యథార్త జీవిత యథార్థ దృశ్యం పునాదిగా ఇక జనించబోయే
భావి వేదముల జీవనాదములు జగత్తుకంతా చవులిస్తానోయ్..
కమ్మరి కొలిమీ, కుమ్మరి చక్రం, జాలరి పగ్గం, సాలెల మగ్గం
శరీర కష్టం స్ఫురింపజేసే, గొడ్డలి, రంపం, కొడవలి, నాగలి
సహస్ర వృత్తుల సమస్త చిహ్నాలు
నా వినుతించే, నా వినిపించే నవీనగీతికి
నా విరచించే నవీన రీతికి భావం, భాగ్యం, ప్రాణం, ప్రణవం’.
ఈ మహా కావ్యానికి గుడిపాటి వెంకట చలం ఇచ్చిన యోగ్యతా పత్రం మరో అద్భుతం. దీని గురించి తరువాత చర్చించుకుందాం. ముందుగా మహా ప్రస్థానాన్ని పల్లవిద్దాం. పలకరిద్దాం..
ఇందులో మొదటి గేయానికి ఉన్న పేరు మహాప్రస్థానం. ఇదే పేరు పుస్తకానికీ ఉంచాడు. ఎడ్గార్ అలాన్‌పో రాసిన ది బెల్స్ గేయాన్ని చదివి ఆవేశపడి రాసిన గేయం ఇది.
ఎగిరి ఎగిరి ఎగిరి పడుతున్నవి
ఎనభై లక్షల మేరువులు
తిరిగి తిరిగి తిరిగి సముద్రాల్ జల ప్రళయ నాట్యం చేస్తున్నవి
సలసల క్రాగే చమురా కాదిది
ఉష్ణ రక్త కాసారం…..
పదండి ముందుకు
పదండి తోసుకు
మరో ప్రపంచపు కంచునగారా
విరామమెరుగక మోగింది.
త్రేతాగ్నులు, ప్రళయ ఘోషలు, మేరువులు, జలప్రళయాలు, ధనంజయుడు, హోమజ్వాల.. ఇలాంటి పదాలతో కవాతు చేశాడు.
మహా ప్రస్థానంలో మూడోది జయభేరి..
నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిస్తాను అన్నాడు. అదే గేయం చివరకు వచ్చేసరికి నేను సైతం ప్రపంచాబ్జపు తెల్లరేకై పల్లవిస్తాను అన్నాడు. అదే విధంగా విశ్వ సృష్టికి అశ్రువొక్కటి ధారపోస్తానన్నవాడు చివరకు వచ్చేసరికి విశ్వవీణకు తంత్రినై మూర్ఛనలు పోతానన్నాడు. భువన ఘోషకు వెర్రి గొంతుకలిచ్చిన మోసిన శ్రీశ్రీ తుదికొచ్చేసరికి భువనభవనపు బావుటానై పైకి లేస్తానన్నాడు.
భవిష్యత్ అభ్యుదయాన్ని సంకేతార్థంలో చెప్పిన గేయం ఇది.
రెండో ప్రపంచ యుద్ధం సమయంలో రాసిన గేయం నాలుగోది. దాని శీర్షిక అభ్యుదయం.
నేడే ఈనాడే జగమంతా బలివితర్థి
నరజాతికి పరివర్తన
నవజీవన శుభ సమయం, అభ్యుదయం..
ఆ తరువాతి గేయం అంతా పౌరాణిక ప్రతీకలతో సాగుతుంది. దాని పేరు అవతారం..
యముని మహిషపు లోహ ఘంటలు మబ్బు చాటున ఖణేల్ మన్నాయంటూ ఎలుగెత్తాడు..
సప్తహయములు, కనకదుర్గ, చండ సింహం, ఇంద్రదేవుని మదపుటేనుగు, నందికేశుడు, ఆదిసూకరుడు, వేదవేద్యుడు.. ఇలా ఇందులో అన్నీ పౌరాణిక సంకేతాలే..
ఇక నవకవితను అభివర్ణించే తరువాతి గేయం అందుకు తగిన ముడిసరుకుల్ని అందించింది. ముందే చెప్పుకున్నట్లు సింధూరం, రక్త చందనం, బందూకం, రుద్రాలికనయన జ్వాలిక, ఘాటెక్కిన గంధక ధూమం, రగులుకొనే రాక్షసిబొగ్గు.. ఇలా.. ఎన్నెన్నో సరుకులు భావితరానికి అందించాడు. ఈ గేయంతో శ్రీశ్రీ ఆధునిక కవితా పథ నిర్దేశకుడయ్యాడు.
అతని అభివ్యక్తి విధానంలోని ఆవేశం
అతను ప్రయోగించిన పదజాలం
అతని శబ్ద మాధుర్యం
చరణాల్లోని గాఢ గాంభీర్యం
20వ శతాబ్దపు తెలుగు సాహిత్యాన్ని అప్రతిహతంగా శాసించాయి.
ఇక విశ్వనాథను కదిలించిన కవితా ఓ కవితా అనే గేయం నిశ్చయంగా శ్రీశ్రీ గేయాల్లో అద్భుతమైంది. ఈ కవిత ద్వారా తన కవితా విశ్వరూపాన్ని శ్రీశ్రీ సాక్షాత్కరింపజేశాడు. శ్రీశ్రీ కవితను స్మరిస్తే అగ్నిసరస్సున వికసించిన వజ్రం, ఎగిరే లోహ శ్యేనం, ఫిరంగిలో జ్వరం ధ్వనించే మృదంగ నాదం, రోగార్తుని రక్తనాళ స్పందన, ఆకటి చీకటి చిచ్చుల హాహాకారం అన్నీ వినిపిస్తాయి. శ్రీశ్రీ పదాలు నిఘంటువులను దాటి, వ్యాకరణాల సంకెళ్లు విడిచి, ఛందస్సుల సర్ప పరిష్వంగం వదిలి వడిగా, వడివడిగా పరిగెడుతూ.. పరిగెత్తిస్తూ వెళఉ్తంది.
‘‘నా గీతం గుండెలలో ఘూర్ణిల్లగ నాజాతి జనం పాడుకోవాలని నానుడి నీ గుడి కావాలని, నా గీతం నీకు నైవేద్యం కావాలని కవితనుద్దేశించి నివేదించాడు. తన అభిరుచులను, అభిలాషలను, ఆదర్శాలను, బలహీనతలను సమాహార ద్వంద్వంగా లక్షించి ఈ విధంగా కవిత్వాన్ని నిర్వచించటం శ్రీశ్రీకి మాత్రమే సాధ్యపడింది.
మహా ప్రస్థానంలోని మరో కవిత ప్రతిజ్ఞ. లండన్ అభ్యుదయ రచయితల మేనిఫెస్టోను చదివి 1937లో రాసిన గేయమిది. మేనిఫెస్టోలోని అంశాలు సంపూర్ణంగా ఈ గేయంలో ప్రతిఫలించాయి. కార్మిక ధీరుల విలాపాగ్నులకు, విషాదాశ్రువులకు ఖరీదు కట్టే షరాబు లేనేలేడంటూ తేల్చి చెప్పాడు. అభాగ్యులంతా, అనాధలంతా, అశాంతులంతా, దీర్ఘ శ్రుతిలో, తీవ్రధ్వనితో విప్లవ శంఖం పూరిస్తారన్నాడు.
తరువాతి గేయాలు చిన్నవి.. ఇందులో అణగారిన అట్టడుగు వర్గాల భాధాసర్ప జీవితాలను అభివ్యక్తీకరించాడు. వీటి తరువాత గేయం బాటసారి.. ఇది చాలా ప్రసిద్ధమైన గేయం.
కూటి కోసం.. కూలి కోసం
పట్టణంలో బ్రతుకుదామని
తల్లిమాటలు చెవిని పెట్టక
బయలు దేరిన బాటసారికి
ఎంత కష్టం.. ఎంత కష్టం..
ఇంత అద్భుత గేయాన్ని తెలుగు సాహిత్యలోకంలో శ్రీశ్రీ కాకుండా మరెవరైనా రాయగలిగితే ఆనాడు భూగోళం బద్దలయినట్టే..
పొట్ట చేతపట్టుకుని పట్నానికి వచ్చిన బాటసారిని వేగుచుక్క వెక్కిరించిందే కానీ, సానుభూతి చూపలేదు.
ఆ తరువాత భిక్షూవర్షీయసి, అటు పిమ్మట ఉన్మాది.. అనంతరం చేదుపాట.. మూడూ దగాపడుతున్న జీవితాలను కళ్ల ముందు కఠినంగా చూపిస్తాయి.
వీటి తరువాత గేయాల్లో రకరకాల అనుభూతులు ప్రస్ఫుటిస్తాయి. దేనికొరకు అన్న గేయంలో ప్రపంచం అంతా నిద్రపోతుంటే తానెందుకు పరితపిస్తున్నానని ఆవేదన చెందుతాడు. కేక అనే గేయంలో తన చుట్టూ ఉన్న దౌర్భాగ్యాలను తలచుకుంటాడు. తరువాత ఒకరాత్రి అతణ్ణి భయపెడుతుంది. ఆకాశపుటెడారిలో ఇసుక తుఫాను రేగింది. గడుసు దయ్యాలు గాలిలో ఈదుతున్నాయి. సాగరం క్షోభిస్తున్నది. కొండ ఏనుగు కళేబరంలా కదలదు. జాబిల్లి కాళ్లు తెగిన ఒంటరి ఒంటెలా కనిపిస్తుంది. వెన్నెల విశ్వమంతా నిండి వెలిబూడిదలాగుంది.
ఒక్క గేయంలో.. ఒకే ఒక్క గేయంలో ఇన్ని రూపకోత్ప్రేక్షలు ప్రయోగించటం సాటిలేనిది.
ఆకాశదీపం లో.. ఉదయం ఆరున్నరకు ఆరిపోయాడు ఒక దురదృష్ట జీవి. ఆ రాత్రికి దీపమూ ఆరిపోయి తారగా మారిపోయింది. సామాన్యుడి మరణం ఎవరికీ పట్టదనటానికి ఇదిఒక తార్కాణం. అవతలి గట్టు, పరాజితులు, ఒక్క క్షణం వంటి గేయాల్లో మనుషుల కలలు చెదిరిపోవటం, దుఃఖం, క్షణికానుభూతులు.. ఇలా అన్నింటినీ అభివర్ణిస్తాడు.
మహా ప్రస్థానంలోని తరువాతి శీర్షికల్లో శ్రీశ్రీ సంపూర్ణంగా మానవతా వాద భావాలను వ్యక్తీకరించాడు. పసిపిల్లలల అమాయకత్వాన్నీ, ఆటపాట్లను, భావి భాగ్య విధాతలైన వాళ్లు ప్రకృతి శోభను గమనించాల్సిన అవసరాన్ని చెప్తాడు.
పాపం, పుణ్యం ప్రపంచ మార్గం
కష్టం, సౌఖ్యం, శ్లేషార్థాలు
ఏమీ ఎరుగని పూవుల్లారా
అయిదారేడుల పాపల్లారా..
ఆ తరువాత పేదలు అనే గేయం బెల్జియన్ కవి ఎమిలీ వెర్ హారన్ రాసిన లేస్ పావెర్స్‌కు అనువాదం.
తరువాతది గంటలు.. ఇది ఎడ్గార్ అలాన్ పో రచించిన ది బెల్స్‌కు అనువాదం కాదని శ్రీశ్రీయే స్పష్టీకరించాడు. ఇక అద్వైతం.. ఇది బహుళంగా జనాదరణ పొందిన గేయం. తనకు అత్యంత ప్రియమైన ఎసి స్విన్‌బర్న్ తన రచనలలో ముఖ్యంగా ఎ మ్యాచ్ అనే గీతంలో చూపిన మార్గానికి కృతజ్ఞతలతో అని శ్రీశ్రీ ఈ గేయాంతంలో రాశాడు. ఈ గేయం తరువాతి కాలంలో ఒక నృత్యనాటికగా ప్రసిద్ధి చెందింది.
ఆనందం అర్ణవమైతే
అనురాగం అంబరమైతే
అనురాగపుటంచులు చూస్తాం..
ఆనందపు లోతులు తీస్తాం..
మహా ప్రస్థానంలో మరో ప్రసిద్ధ గేయం దేశ చరిత్రలు. జర్మన్ కవి బెర్ట్రాండ్ బ్రెఖ్ట్ ప్రభావానికి లోబడి మార్క్స్ చరిత్రకు చేసిన వ్యాఖ్యానాన్ని కవితారూపంలో పెట్టిన గీతం దేశ చరిత్రలు. శతాబ్దాల చరిత్ర కాలగతిలో మనిషి తనకు తానుగా తెచ్చి పెట్టుకున్న పరమ దౌర్భాగ్యాలను వెతికి వెతికి ఈ గీతంలో చేర్చాడు శ్రీశ్రీ. ఇందుకోసం ఆయన ఎంచుకున్న భాష, శైలి, ఛందస్సు ఎలాంటి విమర్శకుణ్ణయినా ఇట్టే వశపరచుకుంటుంది.
ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం. నరజాతి చరిత సమస్తం పరపీడన పరాయణత్వమనీ కుండబద్దలు కొట్టినట్టు చెప్పుకొచ్చాడు. గత చరిత్ర మొత్తం కూడా రణరక్త ప్రవాహసిక్తమనీ, దరిద్రులను కాల్చుకు తినడమేనని తేల్చాడు. ఈ ప్రపంచాన్ని ఏలిన రాజ్యాలన్నీ కూడా నరహంతకులదనీ అన్నాడు. కాలానికి వీళ్లంతా కత్తుల వంతెన కట్టారని అన్నాడు. పరస్పరం సంఘర్శించుకున్న రకరకాల శక్తులతోనే చరిత్ర పుట్టిందని స్పష్టం చేశాడు. సామాన్యుడి జీవనం, సాహసం తెలిసే, తెలిపే చరిత్ర కావాలన్నాడు. ఇతిహాసపు చీకటి కోణం మాటున అట్టడుగున పడి కాన్పించని కథలన్నీ ఇప్పుడు బహిర్గతం కావాలని కాంక్షించాడు.
ఈ కవితకు మాచిరాజు దేవీ ప్రసాద్ రహదారుల చరిత్ర అంటూ పేరడీ రాశాడు. ఇంకానా ఇకపై సాగదు అన్న గీతపంక్తి ఇప్పటికీ అన్ని రాజకీయ సమావేశాల్లో సభల్లో మార్మ్రోగుతూనే ఉంటుంది.
వందలాది ప్రజల శ్రమను ఒక్కడు దోచుకుని లాభపడితే, లాభపడే వాణ్ణే సమర్థించే వ్యవస్థను, సిద్ధాంతాన్ని సమర్థించే వాళ్లపై ఎక్కుపెట్టిన గేయం ‘నాడు’. ఇతరుల బాధను పట్టించుకోకపోవటం, జీవనాధారం కోసం ఓ ఉపాధి కావాలని వెంపర్లాడే కార్మికుడిని హింసించే అమానుషత్వాన్ని ఇది ప్రశ్నిస్తుంది.
మిథ్యావాదిలో దోపిడీ దారులను, మిథ్యావాదులను నిరసించాడు. వ్యత్యాసంలో ఉన్నోడికి లేనోడికి మధ్యనున్న తేడాను విప్పి చూపాడు. స్వప్రయోజనాలను పరిరక్షించుకోడానికి ధనికులు ఎన్నో దారుణాలు చేస్తున్నారన్నాడు. శ్రీశ్రీ పరిభాషలోనే చెప్పాలంటే సామాన్యుడికి అన్నీ కష్టాలే.. సమస్యలే.. అనుమానాలే.. నిరంతరం అలజడే.. అసలు వాళ్ల జీవితమే ఓ అలజడి.. మహా ప్రస్థానంలోని చివరి గీతం జగన్నాథ రథచక్రాలు. దేశంలోని దళిత, తాడిత పీడిత ప్రజానీకానికి ధైర్యం నూరిపోయే గేయమిది. చైతన్య జ్వాలను రగిలించే ప్రేరణ ఇది. వస్తున్నాయ్ వస్తున్నాయ్ జగన్నాథ రథచక్రాలు వస్తున్నాయంటూ ఇక భయమే అక్కర్లేదంటూ స్పష్టం చేశాడు. పతితులార భ్రష్ఠులార.. బాధా సర్ప ద్రష్టులార ఏడవకండి ఏడవకండి అని ఓదార్చాడు. జగన్నాథుడి రథచక్రాలుకదిలి వస్తున్నాయని, వాటి తాకిడికి హిమాలయాలు కరిగిపోయాయన్నాడు. సింహాచలం కదిలిందన్నాడు. వింధ్య పర్వతం పగిలిపోయిందన్నాడు. దగాపడిన తమ్ములందరినీ ఈ రథచక్రాలు వచ్చి కాపాడతాయన్నాడు. ఈ మహా సంగ్రామ విజయంతో స్వాతంత్య్రం, సమభావం, సౌబ్రాత్రం, సౌహార్దం పునాదులుగా ఏర్పడి నూతన రాజ్యం ఆవిర్భవిస్తుందన్నాడు.
ఈ గేయంతో మహా ప్రస్థానం పరిసమాప్తమవుతుంది.
మామూలుగా ఏ గ్రంథానికైనా ముందు అంకితంతో ప్రారంభం అవుతుంది. కానీ మహా ప్రస్థానంలో మాత్రం అంకిత గేయం చివరలో ఉంది. కొంపల్లె జనార్ధనరావు కోసం. ముందుగానే చెప్పినట్లు ఈ ఇద్దరూ శరీరాలు వైరైన ఏకాత్మ స్వరూపాలు. అందుకే కొంపల్లె చనిపోయినప్పుడు శ్రీశ్రీ చాలా బాధపడిపోయాడు. విచిత్రమేమో కానీ.. ఈ ఇద్దరూ భిన్న ధృవాలు. ఇద్దరి మార్గాలు వేరు.. సిద్ధాంతాలు వేరు. అయినా.. ఒకరికొకరు ప్రాణం కన్నా ఎక్కువగా ఇష్టపడ్డారు. కొంపల్లె సనాతన వాది. ఛాందసుడు. శ్రీశ్రీ ఇందుకు పూర్తి విరుద్ధం. అయినా సరే ఇద్దరూ మద్రాసు వీధుల్లో కలిసి తిరిగారు. ఇరుగుపొరుగున కాపురాలు చేశారు. సాహితీ సభలకు కలిసి వెళ్లారు. ఉదయిని పత్రికను కొంపల్లె ఆరు నెలల పాటు నడిపించాడు. ముద్రణా వ్యయం భరించలేక ఏడో సంచికను చిత్తు కాగితాల కింద అమ్మేశాడు. సాహితీ పత్రికలు ఏనాటికైనా అమ్ముడు పోవాలని ఆశిస్తూనే దీనస్థితిలో క్షయ వ్యాధితో కన్నుమూశాడు. అనాదరణతో, అలక్ష్యంతో సాహితీ ప్రపంచం కొంపల్లెను వేధించిందని, బాధించిందని బాధపడ్డాడు.
ఇంతటి మహా కావ్యానికి మహారచయిత గుడిపాటి వెంకటచలం యోగ్యతాపత్రాన్ని అందించాడు. సులభంగా, సూటిగా చెప్పేసి కాసింత ధ్యానానికి, మౌనానికి వ్యవధినివ్వవచ్చు కదా అన్నాడు. ఆ పనిని స్త్రీలు, దేశనాయకులు, కవులు చేయరట. కానీ, శ్రీశ్రీ, ఎంకి మాత్రం చేస్తారట. కృష్ణశాస్త్రి బాధ ప్రపంచానికి బాధ అయితే.. ప్రపంచపు బాధ అంతా శ్రీశ్రీ బాధ అని వ్యాఖ్యానించాడు. కొద్ది రోజుల్లో నేడు విర్రవీగుతున్న కవులంతా శ్రీశ్రీ నీడ కింద నుంచుని తమ ఉనికిని సమర్థించుకోవలసి వస్తుందని భవిష్యత్తు చెప్పాడు. ఆ తరువాత జరిగింది. అదే. గొండెల్లోంచి పొంగుకొచ్చిన రక్తాన్ని.. హృదయంలోంచి పొర్లి వచ్చిన కన్నీళ్లను కలిపి కొత్త ఇంక్‌ను కవితాలోకానికి అందించాడు శ్రీశ్రీ. రాబందుల రెక్కల చప్పుడు, పయోధర ప్రచండ ఘోష, ఝంఝానిల షడ్జధ్వానం విని తట్టుకోగల చావ వుంటేనే ఈ పుస్తకం తెరవండని కూడా చలం హెచ్చరించాడు. తెలుగు సాహిత్యం గర్వించదగ్గ మహాకావ్యం మహా ప్రస్థానం.
ఇతర రచనలు
శ్రీశ్రీ కవితా ప్రయాణంలో మహా ప్రస్థానం శిఖరమైతే.. ఇతర రచనలు ఆయన్ను ఆ శిఖరంపైకి చేర్చటానికి ఉడతాభక్తి తోడ్పడ్డవే. మహాప్రస్థానం కాకుండా శ్రీశ్రీకి సంబంధించిన కవితా సంకలనం ఖడ్గసృష్టి 1966లో అచ్చయింది. రకరకాల సందర్భాల్లో శ్రీశ్రీ రాసిన చాలా కవితలు, అనువాదాలను ఇందులో చేర్చి సంకలనంగా కూర్చారు. వీటిలో ఎక్కువ కవితలు 1940-45 మధ్య కాలంలో రాసినవి. ఇందులోని కవితల్ని మహా ప్రస్థానంతో పోల్చి చూడలేం. అసలు శ్రీశ్రీ మిగతా రచనల్లోని ఏ కవితల్నీ కూడా మహాప్రస్థానంతో సరితూచలేం. తనకు తాను కూడా అందుకోలేని అత్యున్నత స్థాయిలో మహాప్రస్థానం వెలువడింది.
అహింస ఒక ఆశయమే కానీ,
ఆయుధం ఎప్పుడూ కాదు
ఆశయం సాధించాలంటే
ఆయుధం అవసరమే మరి..
ఆశయం ఉండడం మంచిదే కానీ,
అన్ని ఆశయాలూ మంచివి కావు
ఆశయాలు సంఘర్షించే వేళ ఆయుధం అలీనం కాదు.. (ఖడ్గ సృష్టి)
శ్రీశ్రీ లోని వామపక్ష భావజాలాన్ని విస్పష్టంగా వెల్లడించిన రచన ఖడ్గసృష్టి. అప్పటికి శ్రీశ్రీలో సంప్రదాయం చచ్చిపోయింది. ప్రజాపోరాటం వైపు దూసుకు రావటం మొదలెట్టాడు. కమ్యూనిజాన్ని సంపూర్ణంగా అవగతం చేసుకున్నాడు. ప్రపంచ బాధను తనదిగా చేసుకుని కవిత్వ శంఖారావం చేశాడు.
అమెరికాల కాలు విరిగె
ఆఫ్రికాకు నోరు తిరిగె
ఆసియాకు ఆశ రగిలె
ఆస్ట్రో ఆఫ్రో ఏష్యన్
కాస్ట్రోలకు కనులు విరిసె
ఏమంటావ్ కెన్నడీ
ఈ శ్రీశ్రీ సన్నిధి..
అణు శక్తి కంటే మానవ శక్తి మిన్న అని సూత్రీకరించాడు. అంతమందికీ అన్నీ తెలుసు.. అదే మన అజ్ఞానం అంటూ ఎద్దేవా చేశాడు. ఎవడికీ ఏదీ తెలియకపోవటమే నిజమని.. తెలుసని చెప్పే వాడిని అసలు నమ్మరాదని కుండబద్దలు కొట్టాడు. ఈ సంపుటిలో అద్భుతమైన ఉత్ప్రేక్షలను శ్రీశ్రీ ప్రయోగించాడు. జాబిల్లికి మబ్బుతునకలు జేబు రుమాలని వర్ణించాడు. అంతే కాదు. జాబిల్లి సముద్రం మీద చేసిన సంతకాన్ని కాలం కాపలా కాసి మరీ కాపాడుతుందన్నాడు.
ఖడ్గసృష్టిలోని మరి కొన్ని కవితలు ఆయనలోని విప్లవ కవిత్వానికి బీజాలుగా వెలువడ్డాయి. ఈ విశాల విశ్వం నుంచి ఏమిటి నే కోరినాను.. ఒక జానెడు సానుభూతి.. ఒక దోసెడు తిరుగుబాటు. అన్నాడు.
ఇందులో గాంధీజీ అన్న కవిత ఉంది. మరచిపోయిన సామ్రాజ్యాలకు చిరిగిపోయిన జెండా చిహ్నం అని అన్నాడు. మంచి ముత్యాల సరాలు అన్న గేయంలో తాను కవితా రంగంలోకి అడుగు పెట్టినప్పటి నుంచి భావకవిత్వం తెరమరుగై, విప్లవ కవిత్వం ఉద్భవించిందన్నాడు.
‘‘నేను వెళ్లిన నాటి నుంచి నీడ లోపలి మేడ దిగదట, కోడి గ్రుడ్డు ప్రమాణకంగా కృష్ణశాఅస్తిని చదవలేదట, నన్ను తిట్టిన తిట్లతోనే, మల్లెపూవుల మాల కట్టెను, నీకు రాసిన ప్రణయ లేఖలు పోస్టు వేయుట మానివేసేను’’
‘‘ఇలా తే నీ మనీ పర్స్‌ని, ఆంధ్రపత్రిక కప్పుకొని కారడవికేగిందా రివాల్వర్..’’ అని విప్లవకారుల అరణ్యవాసానికి సూచనగా చెప్పుకొచ్చాడు.
‘‘ఏవి తల్లీ నిరుడు కురిసిన హిమసమూహములు’’ అన్న ప్రసిద్ధ రాజకీయ గేయం ఖడ్గసృష్టిలోనిదే. బొమ్మలాంతరు అన్న గేయంలో తన చుట్టూ తాను తిరుగుతూ, సూర్యుని చుట్టూ పరిభ్రమించే భూమిలాగా ఆశయం చుట్టూ తిరుగుతోంది ఆవేశం అన్నాడు.
ఇదే సంపుటిలో దాదాపు పదమూడు మంది పాశ్చాత్య కవుల కవితల అనువాదాలు ఉన్నాయి. సమకాలిక సాహిత్య ప్రపంచంలో వచ్చిన ధోరణులను, ప్రయోగాలను చాలా వరకు తాను కొత్తగా సృష్టించటం ద్వారానో.. లేక అనువాదంగానో, అనుసరించటం ద్వారాలో తెలుగు సాహిత్యానికి పరిచయం చేసింది శ్రీశ్రీనే.
1959లో శ్రీశ్రీ సదసత్సంశయం రాశాడు. దీన్ని పూర్తి చేయలేదు. అసంపూర్ణంగా ఉండగానే ఖడ్గసృష్టి సంపుటంలో దాన్నీ చేర్చాడు. 1972లో దానికే సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది.
(ఇంకా ఉంది)
కోవెల సుప్రసన్నాచార్య గారి తనయుడు జర్నలిస్టు కోవెల సంతోష్ కుమార్. చక్కని రచయిత. వీరి టీవీ సీరియల్ పుస్తకం దేవ రహస్యం అమ్మకాలలో రికార్డ్ సృష్టించింది.