Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

మనసుకు హత్తుకునే ఒక నటి జీవనగమనం

[శ్రీమతి అత్తలూరి విజయలక్ష్మి గారి ‘నటి’ అనే నవలని సమీక్షిస్తున్నారు అల్లూరి గౌరీలక్ష్మి.]

ళారంగంపై అభిమానంతో, ముఖ్యంగా నటన మీద గౌరవంతో, నటించాలన్న ఉత్సుకతతో, తనలోని కళాపిపాసను తీర్చుకోవాలన్న తపనతో జీవితాన్ని పణంగా పెట్టిన ఎందరో జీవిత గాథల్ని మనం విన్నాం. పాకుడురాళ్లు వంటి నవలలు చదివాం. శివరంజని, ది డర్టీ పిక్చర్ లాంటి సినిమాలు చూసాం. రంగస్థలం కానీ, సినిమా రంగం కానీ, నేటి బుల్లితెర రంగంకానీ.. అక్కడ ముఖ్యంగా స్త్రీల నటనా ప్రస్థానం అంత సులువైన కేక్ వాక్ కాదు.

సినిమా నటి కావాలన్న కోరికతో, తన అందంపై తనకు గల నమ్మకంతో ఒక ప్రియుడి మాటలు నమ్మి అతన్ని పెళ్ళాడి, సినిమా రంగంలో ప్రవేశించి అక్కడ నిలదొక్కుకోలేక అతను ఒంటరిగా విడిచి వెళ్ళాక, రంగస్థల నటిగా స్థిరపడిన పద్మిని అనే ఒకమ్మాయి కథ ‘నటి’ నవల. అద్భుతమైన నటనాకౌశలం గల ఆమె ఏ పాత్రలోనైనా అవలీలగా ఒదిగిపోయేది. ప్రేక్షకులు నీరాజనాలు పట్టేవారు. ఆమె మంచి నటిగా తనను తాను నిరూపించుకున్నాక కూడా ఆమె జీవితం నల్లేరు బండి మీద నడక కాలేదు. ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ తన కూతుర్ని ఆ రంగంలోనికి రానివ్వకూడదు అనుకుంటూ సాగిన ఆ నటి ఒంటరి పోరాటం ఈ నవల.

ఆమె గెలిచి ఓడిందా? ఓడి గెలిచిందా? అన్న విషయమే ఈ నవలా ప్రయాణం. ఎన్నో ఒడుదుడుకులను, నిత్య సంఘర్షణలను, ఎదుర్కొంటూ సాగిన జీవిత కథ ఇది. ఈ రచయిత కథనంలోని నిపుణత మనల్ని ఆగకుండా నవలను చదివేలా చేస్తుంది. ఈ థీమ్ మనం వింటూ వచ్చిందే అయినా నేటికీ నటనా రంగంలోని స్త్రీలు ఎలాంటి ఒత్తిడిని ఎదుర్కొంటున్నారన్నది నిత్య నూతన విషయమే! నటన వృత్తిగా స్వీకరించిన స్త్రీలు, తమ కళా ప్రతిభపై తమకున్న నమ్మకంతో, నటనారంగంపై మమకారంతో, అందులోకి దూకి సమస్యల్ని ఎదుర్కొంటూ వారు చూపే పోరాటపటిమ మనల్ని ఆశ్చర్యచకితుల్నిచేస్తుంది. ఇక ఒక తరం మారాక స్త్రీలు తమను తాము, మారిన పరిస్థితులకు అనుగుణంగా మలచుకుంటూ తగిన శక్తి సామర్థ్యాలను ఎలా సమకూర్చుకుంటా రో చెప్పిన నవల ఇది.

నటనారంగంలోని స్త్రీల ప్రయాణంలో వారికి కలిగే చికాకులను అణచుకుంటూ, పురుషాధిక్యతతో ప్రవర్తించే సహనటులతో సమన్వయం చేసుకుంటూ ఎలా ముందుకు సాగక తప్పదో రచయిత స్వయంగా పరిశోధన చేసి రాసిన నవల కావడంతో ఎక్కడా అతిశయోక్తులూ, అవాస్తవిక, ఊహాజనిత సమస్యలూ కాకుండా ప్రాక్టికల్‌గా వచ్చే వారి ఇబ్బందులూ, మానసిక సంఘర్షణా వంటి విషయాలు పఠితల హృదయాలను కుదుపుతాయి.మరింత సానుభూతితో వారిని అర్ధం చేసుకునే ప్రయత్నం చేయిస్తాయి.

పాతికకి పైగా చక్కని నవలలు రాసి చెయ్యి తిరిగిన రచయిత అత్తలూరి విజయలక్ష్మిగారు, ఈ నవలను అవలీలగా నడిపించారు. లోకం పోకడ లోతుగా తెలీని అమాయకపు అమ్మాయిలు ఎంత సులువుగా పరపురుషుడి ఆకర్షణలో పడతారు! అన్న సంగతి కళ్ళకు కట్టినట్టు రాశారు. వివిధ పరిస్థితుల్లో ప్రధాన పాత్ర పద్మిని ఇంకా మిగిలిన పాత్రల భావోద్వేగాల చిత్రణ అత్యంత సహజంగా ఉంది. ఎక్కడా కృత్రిమత్వం లేదు. ప్రతి ఒక్కరూ చదవాల్సిన నవల ఇది.

***

నటి (నవల)
రచన: అత్తలూరి విజయలక్ష్మి
పేజీలు: 232
వెల: ₹ 150/-
ప్రతులకు:
సాహితి ప్రచురణలు
#33-22-2, చంద్రం బిల్డింగ్స్,
సి.ఆర్.రోడ్,
చుట్టుగుంట
విజయవాడ – 520 002.
ఫోన్: 0866-2436642/43,
సెల్: 8121098500

Exit mobile version