[శ్రీ నల్ల భూమయ్య రచించిన ‘నసీబు’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]
అది పెద్ద కాలేరు. పెద్ద పెద్ద కంపిన్లు వున్నందున గా వూరు పెద్ద కాలేరైంది. గా పెద్ద పెద్ద కంపిన్ల మూలంగ గక్కడ ‘దేశదేశా’ల నుంచి అచ్చిన మంది, గా కంపిన్లల్ల జీతం జేసుటానికి.. తీరు తీరు మంది. పట్నమోళ్ళు, పల్లెలోళ్ళు.. కంపిన్ల జీతగాండ్లు, ఎవుసందార్లు, కాపుదనపోళ్ళు.. పొట్టకు బట్టకు మా వోళ్ళే కంపిన్ల జీతగాండ్లూ వున్నరు, పొద్దుంటే మాపుండది, మాపుంటే రేపుండది అనే అసుంటి కాపుదనపొళ్ళున్నరు. పీనుగు మీద ముగ్గేసుటానికి కుండల జొన్నపిండి వుండని కాపుదనపు యిండ్లు గూడ వున్నయి గంత పెద్ద కాలేర్ల.
కంపిని జీతగాండ్లకు కంపిని ‘కోటర్సు’ వున్నయి. గా కోటర్సులల్ల కరెంటు బుగ్గలున్నై. దుకాణందార్లకు పెట్రోమాక్సులున్నై. వూర్లె ‘మంటినూన’ కందీలలు, సిమ్నీలు వున్నై. ఆముదం దీపైదలు ఎలిగే యిండ్లు గూడ వున్నై. అన్నితీర్ల బతుకులు, అన్నితీర్ల మనసులు.
సోల్పుగ – కావల్సినంత జాగాలున్న కంపిని కోటర్సులున్నై. వూర్లె గోన్ని వాడలల్ల యిండ్లంటె, గుడిసె మీద గుడిసెనే. గా గుడిసె మీద గుడిసె వున్న వాడలకు జొస్తె, కొత్తోళ్ళకు వూపిరి సలుపది. గుడిసెకు గుడిసెకు నడుమ ఎడుము.. తొవ్వ ఒక్కమనిషి పట్టెటంతగనే.. గదిగూడ సీద తొవ్వ గాదు. మలుకలు తిరుక్కుంట.. కొత్తోళ్ళు గండ్ల సొచ్చిండ్రంటె, బాయిలర్ ఔజుల దిగినట్టుగనే. బాయిలర్ ఔజుల దిగుతె, వుడుకుడే గని, వూపిరి మా ఆడుతది. గీ గుడిసెలల్ల జొస్తె వుడుక ఏం వుండది గని, వూపిరి మట్టుకు నిల్సి పోతదన్నట్టుగనే.. గీ వాడల జొస్తె, కానని అడివిల పడ్డట్టే..
గీ వూర్లె కడుమ యిండ్ల తీరు – తీరు తీరుగ. కొంగ వారం ఎక్కడనన్న ఒగ బంగ్ల. బంగ్ల అంటే డాంగు సున్నం, యిటుక తొటా లేసిన గోడలు, కుమ్మరిగూన కప్పు.. గోన్ని యిండ్లు మన్ను గోడలు – గూనకప్పు, ఎక్కో యిండ్లు మన్నుగోడలు – పొరుకకు మన్ను మెత్తిన గోడలు, గడ్డికప్పులు, గంతకన్న ఎక్కోగూడ తడుక, గడ్డిగుడిసెలు.. దుకాణందార్ల యిండ్లు మట్టుకు బవంతులు..
కంపిని కోటర్సులోల్లని, సావుకార్లని తప్పిదిస్తె వూర్లె కాళ్ళకు సెప్పులున్నోళ్ళు మా తక్కోమంది. మేకలు గాసెటోళ్ళకు మట్టుకు కాళ్ళకు సెప్పులు మా వుండేటియి కాళ్ళకు దంతె ముండ్లు దిగకుంట – గని, ముడ్డికి బుడ్డగోసి దప్ప యిగ పెయ్యి మీద ఏం వుండేటిది గాదు, వానకాలంల ముసుర్లల్ల కప్పుకున్న గొంగడి తప్ప సెప్పులున్న కాల్లోళ్ళు వుంటే, వానకాలంల సెప్పులు సేతవట్టుక పోకటనే, బురుద, అండు.. వూర్లె తోవలల్ల.. పాకురువట్టిన జారుడు బండల తొవ్వలు.. వాడల బురదల కాలు వడకుంట జంగకొక బండ ఏసిన కాలిబాటలు..
గప్పట్ల గిక్కడ దోమలున్నాయి యినుడేగని సూసినోళ్ళు లేరు. గని, వానకాలంల, ఈగలు మట్టుకు – జొబ్బున.. మున్సిపాలిటోళ్ళు వానకాలంల ఎప్పుడన్న ఒకసారి ఈగలమందు మా సల్లెటోళ్ళు – యింటింటికి తిరిగి.. మందుగొట్టిన రొండు రోజులైనంక మళ్ళ ఈగలు ఎప్పటి వారమే – యిండ్లనిండ అరుగుల నిండ.. వానకాలంల కురిసే గడ్డికప్పులు, వురిసే మంటి గోడలు.. ఇండ్లన్ని బురుద బురుద.. మీదినుంచి కురిసే నీళ్ళు, కింది నుంచి వాననీళ్ళు.. ఇండ్లలోపల అయితే బురుద, కాకుంటె పదను.. వుర్లతుండే మంటిగోడలు..
గిసుంటి వాడల గిన్నన్ని కాపోల్ల యిండ్లు.. గిన్నన్ని సాలె, వడ్ల, కమ్మరి, అవుసలి, కంచరి, చాకలి.. మంగలి, గాండ్ల గౌండ్ల – గొల్ల.. అయ్యోరు, జంగం, బుక్క.. పూసవేర్ల, కూనెపెల్లి.. ఆరె, బారె, కటికె.. యిండ్లు.
గీ కాపోల్ల గడ్డి గుడిసెలల్ల ఒగ సిన్న గుడిసె కాపులింగయ్య సిన్నక్కది.. పెండ్లాం, మొగుడు యిద్దరే.. పెండ్లైనంక, కొంగుముడి వేసుకుని కొత్త దంపతులు, కొడుకు పుట్టాలని కోరుకున్నారని అన్నట్టుగ మా కోరుకున్నరుగని, ఆళ్ళు పాతవడ్డా గూడ, కొడుకులు, బిడ్డెలు పుట్టనేలేదు.. గా గుడిసెల ఆలుమొగలు దప్ప యింకెవ్వరు లేరు. గా ఆలుమొగలు పల్లెల్నుంచి గీ కాలేరు కచ్చిండ్రు బతుకు దెరువు వుండక పోతదా అని.. గది గూడ కాలేర్ల కంపిన్ల పనిమీద గాదు ఎవుసం మీద కైకిలి బతుకే..
సిన్నక్క ఎడ్డిది. ఎ ఎ ఏ అనుకుంట సైగలు జేసుడే. లింగయ్య మామూలి మనిసే.. సిన్నక్క మనిసి తెల్లగ.. గని, మొకం నిండ అమ్మవారి గుంటలు.. గా అమ్మవారి మూలంగనే గావచ్చు సిన్నక్కకు మాటపడి పొయ్యి ఎడ్డిదైంది.. లింగయ్య – సిన్నక్క పెండ్లి ఐదేండ్ల ఈడుల అయ్యివుంటది. పెండ్లైనంకనే సిన్నక్కకు అమ్మవారొచ్చి సిన్నక్క మాటను తీసుకపొయ్యివుంటది.
పెండ్లాం ఎడ్డిదైనా గుడ్డిదైనా, కుంటిదైనా, గూనిదైనా, గాపెండ్లి ముడిమట్టుకు యిచ్చుక పోదుగద.. మామూలి మనిసి లింగయ్యకు – ఎడ్డిపెండ్లాం సిన్నక్క..
లింగయ్య మనిసి మామూలు మనిసే, బైటికి, గని, మనిసి లోపట కనిపియ్యని బీమారి వున్నట్టే.. గందుకేనేమో లింగయ్య ఎప్పటికి మంచాల పండివుంటడు.. గందుకని, యింట్ల ఏం వుండనందుకు గావచ్చు- పొద్దుగాల లేస్తేనే, నడుమ నడుమ సిన్నక్క వూరి పిసుక వారం లొల్లి.. సిన్నక్క వుండుడు గూడ వూరి పిసుక వారమే బక్కగ, కురుసగ, మోకాళ్ళ మీదికి గట్టిన దొడ్డునేత సీరె, సేతికుట్టు రైక.. సెవులకు పోగులు, కాళ్ళకు కడాలు.. మొగడు కట్టిన పుత్తె నల్లపూసలు.. ఆమెకున్న సొమ్ములు గవ్వే.. వుంటాన్న గుడిసె గూడ కులపోల్ల జాగల ఏసుకోని వుంటన్నదే.. తెలువని బీమారి తోటి మంచన సిక్కుతున్న లింగయ్య గప్పట్ల దావుకాన్లు అంటే గింతంత కంపిని జీతగాళ్ళకు ఎరుకనేమోగని, వూరిమందికి, గా దావుకాన్ల మందులేం తెలువయి. తెలుస్తె సేతి వైదిగమే.. గా సేతి వైదిగం గూడ గింతంత వున్నోళ్ళకే ఎరుక.. ఏం లేనోళ్ళకు వైదిగం గిట్ట ఏం వుండది.. బీమారి తనకు తాను అచ్చి, పొయ్యేదైతే తనేపోతది ఎరుక.. ఏం లేనోళ్ళకు వైదిగం గిట్ట ఏం వుండది.. బీమారి తనకు తాను అచ్చి, పొయ్యేదైతే తనేపోతది – గట్ల గాకుంట, అచ్చిన మనిసిని తీసుకపొయ్యేదైతే మనిసినే తీసుకపోతది… గది అచ్చిన బీమారి మనుసు, దయ తప్పిస్తె, అచ్చిన మనిసిది, మందుదిగాదు.. గీ మనిసి పాణం గాలిల దీపం… ఎలుగుతె ఎలుగుతది ఆముదెం వున్నంత దనుక, లేకుంటె మలిగిపోతది – ఆముదెం వున్నా, గాలి గోంత ఎక్కో అయితె.. గీ ఆముదెం దీపైదకి అడ్డం గిట్ట ఏం లేదు – మంటినూనె కందీలలకు వున్నట్టుగ.. ఎక్కో అంటె సెయ్యడ్డం తప్పిడిస్తె..
జరిగేది తెలియదు..
వ్యాధులు, బాధలు ముసిరేవేళ..
లింగయ్య సిన్న ఈడులనే, కాలంగాని కాలంలనే కాలం జేసిండు.. గింతపెద్ద బూమిల, గింతమందివున్న బూమ్మీద సిన్నక్కను ఒంటిదాన్ని జేసి.. సిన్నక్క ఎనుక ముందు ఎవ్వరు లేని ఒంటిది.. కన్నోళ్ళ కన్నీళ్ళు, కడుపు తీపిదీవెనలు అసుంటియి ఏమిలేని ఒంటిది – తన కండ్ల కడువలు తప్పిడిస్తె.. పెనుకున్న చీకట్లు, గరళాల జడివానలు.. నిప్పులు మింగి..
మగని కాలమందు మగువ కష్టించిన, సుతులకాల మందు సుఖము జెందు అన్నడు తత్త్వం జెప్పినోడు.. గని, సిన్నక్క మొగడు లేని, మొగడు పొయ్యిన – సుకము జెందే సుతులు గూడ లేని బతుకది.. లోకంల మందే తప్ప తన నావోళ్ళు ఎవ్వరులేని ఒంటిది సిన్నక్క.. మొగడు – మూడుదినాల ముచ్చటయే ఈ లోకంలో మన కలిమి అన్నట్టుగైంది సిన్నక్క బతుకుల.. బతుకు సీకట్ల మనుగడ చీకటి మయమైపోయె.. లేరెవరూ నీకెవరూ.. గని, ఘటము పోవువెనుక గగనంబు పోవునా? మొగని పాణం పొయ్యిందిగని, తన పెయ్యి పాణంతోనే వున్నదిగద! బతుకు.. పేదవాని బాధ పెనుభూతమైయుండు..
సిన్నక్క బతుకుటానికి పనిజెయ్యవట్టింది. కంపిన్ల కోటర్సులల్ల పాసి పని గిట్ట సెయ్యవట్టింది. కోటర్సులల్ల వుండే కంపిన్ల జీతగాండ్లు దేశ దేశాలనుంచి అచ్చినోళ్ళు.. ఎంట పెండ్లాం, పిల్లగండ్లని పెట్టుకునే హైసతులేని బతుకులోళ్ళు గూడ వున్నరు.
సిన్నక్క బతుకు – సాగేను జీవితనావ.. కాలం నడుస్తాంది – బతుకుగిట్ల గడుస్తోంది..
సిన్నక్క – లింగయ్యలు గక్కడ వుండెటోళ్ళు అన్నముచ్చట గా వాడకట్టోళ్ళ మతుల నుంచి మసుగై పొయ్యింది.
గప్పుడు, గావాడ కట్టోళ్ళకు ఐతారం అంగడి నాడు ఎప్పుడన్న ఎప్పుడన్న ఒకపారి అంగట్ల సిన్నక్క కన్పిస్తాంటది. గిప్పుడు సిన్నక్క మునుపటి సిన్నక్క గాదు. మనిసిగా సిన్నక్కనే గని, రూపం మట్టుకు ఎవ్వరు గూడ అనుకోని వుండనసువంటి సిన్నక్క – సిన్నెలు.. గప్పటి సిన్నక్క – దొడ్డునేతసీరె గోసిపెట్టి మోకాళ్ళు దిగని నిడువుదైతే – గిప్పటి సిన్నక్క సిన్నెలు – సిలకు గోల్సాడి లోపట – సేతికుట్టు రైక జాగల మిసినికుట్టు జాకిట్టు… పాపెట నిలువున కుంకుమ – నొసుట మెరుపుల బొట్టు.. గీ సిన్నక్క – సెంప సెంపన కెంపుపొదిగి.. ఈ సింగారం.. సిగ్గుచేత ఎర్రబడ్డ బుగ్గలదే అందము.. తెలుపక తెలిపే ఆ చిరునవ్వులు..
సిన్నక్కను – ఒగ ‘పరిదేశి’ – కంపిని జీతగాడు పెండ్లి జేసుకున్నడు.. గా పరిదేశి సంగతులు తెలువయిగని, సిన్నక్క, సుకంగ, ఆనందంగనే వున్నదని సూసినోళ్ళకు అన్పిస్తది.. నీడగ నిల్చే తోడొకరుండిన – అదే భాగ్యము అన్నది సిన్నక్కకు దక్కిందనే సుబూతైంది.. తెలియక వచ్చింది తెగిపోని బంధం.. ఆనాటి కలవరింత ఈనాటి కౌగిలింత..
మ్రుచ్చుగుడికి పోయి ముడివిప్పుడే గాని అన్నసువంటి లోకంల.. నాలిగన్నయపుడు నీతి తగదు అనుకునే అసువంటి లోకంల.. సిన్నక్కను, నోరులేని ఎడ్డి ఆడిదాన్ని, అవుసురం, దీర్సుక అవుతలికి పారెయ్యకుంట, పెండ్లి జేసుక – సిన్నక్కకు అనుకోని, ఆనందపు, కొత్త బతుకునందించిన ఆ పరిదేశిని వాడకట్టోళ్ళు నిండ దీవించిండ్రు – సిన్నక్క నసీబు మీదగూడ అచ్చెంత లేసిండ్లు.