Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

నరేంద్ర ఐ యామ్ విత్ యు-8

[శ్రీ బివిడి ప్రసాదరావు రచించిన ‘నరేంద్ర ఐ యామ్ విత్ యు’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]

[ఇంటికి వెళ్ళిన అప్పలనర్సయ్య కూతురు వస్తోందని భార్య అన్నపూర్ణకి చెప్తాడు. ఆమె కూతురుకి ఫోన్ చేస్తుంది. అమ్మమ్మవాళ్ళెలా ఉన్నారో కనుక్కుంటుంది. మర్నాడు సాయంత్రం గుడి వద్ద శ్యామలను కలుస్తాడు నరేంద్ర. తాను ట్రాక్టర్ కొనాలనుకుంటున్న విషయం చెప్తాడు. పట్నంలో అగ్రికల్చర్ ఎక్స్‌పర్ట్స్‌ను వారి సలహాలు తీసుకుని మంచి ట్రాక్టర్ కొనమంటుందామె. కొందరిని కలుపుకుని పోతున్నాడు కాబట్టి, లెక్కలవి పక్కగా రాసుకుని ఉంచుకోమని నరేంద్రకు చెబుతుందామె. ఆమె ఫోన్ నెంబర్ అడిగి తీసుకుంటాడు నరేంద్ర. మర్నాడు ఉదయం ఏడున్నర కల్లా ఇంటికి చేరుతాడు. అమ్మానాన్నలని పలకరించి, రిఫ్రెష్ అయి వస్తాడు. టిఫిన్ తిని ట్రాక్టర్ కొనడానికి వెళ్తాడు. అమ్మాజీ ఊరుకి వస్తుంది. రెండో బ్యాంక్ పరీక్ష వాయిదా పడడంతో, కాస్త సమయం చిక్కిందనీ, అందుకని ఊరికి వచ్చానని తండ్రికి చెప్తుంది అమ్మాజీ. అన్నపూర్ణ ఏమో కూతురికి పెళ్ళి చేసేయాలని అంటుంది, అప్పలనరయ్య ఏమో, తొందరలేదు చదువుకోనీ అంటాడు. నరేంద్ర గురించి వాకబు చేస్తుంది అమ్మాజీ. ట్రాక్టర్ కొనుగోలు చేసిన నరేంద్ర, ఓ డ్రైవర్‍ని నెల రోజుల జీతంతో కుదుర్చుకుంటాడు. సాయంత్రం శ్యామల ఫోన్ చేస్తుంది. మర్నాడు బయల్దేరుతున్నానని అంటాడు నరేంద్ర. మరో రోజు ఉండి అమ్మానాన్నలతో గడిపి రమ్మంటుంది. ఆ రాత్రికి ఇంట్లో తృప్తిగా భోంచేసి, తల్లిదండ్రులతో కబుర్లు చెప్పి, హాయిగా నిద్రపోతాడు నరేంద్ర. – ఇక చదవండి.]

మర్నాడు.. పల్లెలో..

ఉదయం తొమ్మిదవుతోంది..

డ్రయివర్ కోటి సాయంతో ఫుల్ ఎక్యూప్మెంట్స్ తో కొత్త ట్రాక్టర్ ను తీసుకు వచ్చి.. నేరుగా అప్పలనర్సయ్య ఇంటి ముందున పెట్టించాడు నరేంద్ర.

అప్పలనర్సయ్య ట్రాక్టర్ ను చూస్తూనే ఉబ్బితబ్బిబ్బైయ్యాడు.

నరేంద్రను కౌగలించుకున్నాడు.

“మా ఊరికి తొలి ఇంజన్ బండిని తెచ్చావు.” అన్నాడు ఆత్మీయంగా.

“పసుపు రాసి బొట్లు పెట్టానా.” చొరవగా అడిగింది అన్నపూర్ణ.

“లేదమ్మా. మంచి ముహూర్తంన పూజ చేయిద్దాం.” చెప్పాడు నరేంద్ర.

“ఈ రోజుల్లో కూడానా.” కలగచేసుకుంది అమ్మాజీ.

అమ్మాజీని వింతగా, ఎగాదిగా చూస్తున్నాడు నరేంద్ర.

“బాబూ.. తను నా కూతురు. చెప్పాగా వస్తుందని.” కలగచేసుకున్నాడు అప్పలనర్సయ్య.

ఆ వెంబడే, నరేంద్రను, అమ్మాజీని ఒకరికి ఒకరిని పరిచయం చేసాడు.

అక్కడే ఉన్న బైక్ ను చూస్తూ..

“బాబూ.. మోటర్ సైకిల్ ని తెచ్చేసుకున్నారా.” అడిగాడు అప్పలనర్సయ్య కళ్లింతలేసి చేసి.

“అవునండీ. నేను బైకు మీద.. కోటి ట్రాక్టర్ మీద వచ్చాం.” చెప్పాడు నరేంద్ర.

ఆ వెంబడే.. “మీరు లుంగీలో ఉన్నారు. బట్టలు మార్చుకొని రండి. పంతులు గారిని కలిసి వద్దాం.” చెప్పాడు అప్పలనర్సయ్యతో.

“అలాగే వెళ్దాం. ఇంట్లోకి రా బాబూ. కాఫీ తాగుదురు.” అన్నాడు.

“వద్దు వద్దు. దార్లో టిఫిన్, కాఫీ తీసుకున్నాం.” చెప్పాడు నరేంద్ర.

అప్పలనర్సయ్యతో పాటు అన్నపూర్ణ, అమ్మాజీ ఇంట్లోకి నడిచారు.

“ఇక్కడ రోడ్ మధ్యన ఐపోతోంది.  ట్రాక్టర్ ని కొంచెం వెడల్పైన చోట పెట్టుకుంటే బాగుంటుంది.” చెప్పాడు కోటి.

“అలా ఐతే నా ఇంటి ముందు కూడా ఇరుకే అవుతోంది. మరెక్కడ పెట్టాలబ్బా.” యోచిస్తున్నాడు నరేంద్ర.

అప్పుడే అప్పలనర్సయ్య బట్టలు మార్చుకొని వచ్చాడు.

తమ ఇబ్బందిని చెప్పాడు నరేంద్ర.

“హైస్కూలు ముందు ఖాళీ ఉంటుంది. కానీ పిల్లల తిరుగుళ్లు ఉంటాయి. మరి.. ఆఁ. శివాలయం దగ్గరైతే ఎట్టి ఇబ్బంది రాదు.” చెప్పాడు అప్పలనర్సయ్య.

“సరైతే.” అనేసాడు నరేంద్ర.

“పూజారిగారు ఇప్పుడు అక్కడే ఉంటారు. ట్రాక్టర్ ని తీసుకొని మనం అక్కడికి వెళ్దాం.” చెప్పాడు అప్పలనర్సయ్య.

కోటి ట్రాక్టర్ ఎక్కాడు.

నరేంద్ర తన బైక్ వెనుక అప్పలనర్సయ్యని ఎక్కించుకున్నాడు.

వాళ్లు శివాలయం వైపు కదిలారు.

***

సాయంకాలం తొందరగానే పొలాల వైపు నుండి తనుంటున్న ఇంటికి వచ్చాడు నరేంద్ర.. బైక్ తో.

తలుపు కొట్టాడు.

కొద్ది సమయం లోపునే లోపల ఉన్న కోటి తలుపు తీసాడు.

తనింటిలో కోటిని తను ఉన్నన్నాళ్లు ఉండమని చెప్పాడు నరేంద్ర.

టీ కలిపాడు. ఇద్దరూ తాగారు.

నరేంద్ర మొహం కడుక్కొని శివాలయం వైపుకు బయలుదేరాడు.. బైక్ తో.

కోటి ఇంటినే ఉండిపోయాడు.

నరేంద్ర కాస్తా ముందుగానే శివాలయం చెంతకు వచ్చేసాడు.

అప్పటికి శ్యామల ఇంకా రాలేదు.

బైక్ కు స్టాండ్ వేసి ఓ పక్కగా నిలిపాడు నరేంద్ర.

శ్యామలకై ఎదురు చూస్తూ ఉన్నాడు.

పది నిముషాల పిమ్మటకి శ్యామల అక్కడికి వచ్చింది.

ట్రాక్టర్ ను చూస్తూనే.. నరేంద్రకు.. “కన్గ్రాట్యులేషన్స్.” చెప్పింది.

“థాంక్యూ వెరీ మచ్.” అన్నాడు నరేంద్ర.

“లంచ్ టైంలో మీ నుండి ఫోన్ వచ్చిన లగాయితు ఇప్పటి వరకు కుతూహలంగానే ఉన్నాను. కలర్ బాగుంది. అబ్బో.. అవసరమైన పని ముట్లు అన్నీ కొనేసినట్టేనా.” అడిగింది శ్యామల.. ట్రాక్టర్ తొట్టెలోని సామాన్లను చూస్తూ.

“ఆల్మోస్ట్ ఆల్.” చెప్పాడు నరేంద్ర.

ఆ వెంబడే.. “ఇదిగో నా బైక్.” తన బైక్ చూపాడు.

“అరె. రెండూ సేమ్ కలర్. మీకు బ్లూ అంటే ఇష్టామా.” అంది సరదాగా శ్యామల.

‘అవును.’ అన్నట్టు తలాడించాడు నరేంద్ర.

“నాక్కూడా.” సన్నగా చెప్పింది శ్యామల.

“నిజమా.” గట్టిగానే అన్నాడు నరేంద్ర.

ఆగి.. “బ్లూ ఈజ్ యాన్ ఐ-క్యాచింగ్ కలర్.” మృదువుగా అంది శ్యామల.

“థట్స్ నాట్ ఆల్. లైక్ ద అన్ క్లౌడెడ్ స్కై.” తమకంగా చెప్పగలిగాడు నరేంద్ర.

అప్పుడే అతడిని చూసింది శ్యామల.

నరేంద్ర చాలా కూల్ గా తోచాడు. మెత్తగా నవ్వుకుంది.

అంతలోనే.. “రేపే ట్రాక్టర్ ఓపెనింగ్. ఉదయం ఏడింటికి. ఇక్కడే.” చెప్పాడు నరేంద్ర.

ఆ వెంబడే.. “కావలసినవారందరినీ రమ్మన్నాను..” చెప్పుతున్నాడు.

అడ్డై.. “మధ్యాహ్నం ఫోన్ లో నన్నూ ఆహ్వానించారుగా. తప్పక నేనూ వస్తాను.” చక్కగా చెప్పింది శ్యామల.

ఆ వెంబడే.. “మీ తల్లిదండ్రులను పిలిచారా.” అడిగింది.

“లేదు. ముహూర్తం రేపటికే కుదిరింది. ఇప్పుడు పిలిస్తే వాళ్లని శ్రమ పెట్టడమే అవుతోంది. వాళ్లు ట్రాక్టర్ ని చూసారు. అమ్మ దీనిని తాకింది. సో. ఐ యాం హ్యపీ.” చెప్పాడు నరేంద్ర.

ఆ వెంబడే.. “మరి మీరు పూలు కోసుకొని ఇంటికి వెళ్తారా. నేను బజారుకు వెళ్లాలి. పూజా సామాగ్రిని తీసుకోవాలి.” చెప్పాడు నెమ్మదిగా.

“ఓ. షూర్.” అనేసింది శ్యామల.

నరేంద్ర బైక్ తో బయలు దేరాడు.

“రేపుదయం కలుద్దాం.” చక్కగా నవ్పుతూ చెప్పేసి.

అతడు మలుపు తిరిగేక.. శ్యామల ఆలయం వెనుక పక్కకు కదిలింది.. మల్లెలకై.

***

మర్నాడు.. ఉదయం..

సమయంకి ట్రాక్టర్ పూజా కార్యక్రమాలు చక్కగా జరిగిపోయాయి.

అప్పలనర్సయ్యతో పాటుగా ఆయన కుటుంబ సభ్యులు.. నరేంద్రతో కలిసి పని చేస్తున్న వాళ్లు.. శ్యామల హాజరయ్యారు.

శ్యామలకు అప్పలనర్సయ్య, అన్నపూర్ణలతో పాటు.. అమ్మాజీని పరిచయం చేసాడు నరేంద్ర.

నరేంద్ర అందరికీ స్వీట్స్ పంచిపెట్టాడు.

అందరూ ఆనందమయ్యారు.

***

శివాలయం నుండి ఇంటికి వచ్చేక.. తన తల్లిదండ్రులతో నరేంద్ర ఫోన్ లో మాట్లాడేడు.   వాళ్ల దీవెనలు పొందాడు.

***

పది రోజులు గడిచాయి.

కోటి చక్కటి విధంతో.. నరేంద్ర ట్రాక్టర్ డ్రయివింగ్ తో పాటుగా.. దానిని ఎలా వినియోగించుకోవాలో కూడా త్వరగానే నేర్చుకోగలిగాడు.

తను బాగా తర్ఫీదు పొందానన్న విశ్వాసం కలిగాక.. శ్యామల అభిప్రాయం తెలుసుకుందామని.. సాయంకాలం కాగానే..  కోరి ఆమెను కలిసాడు నరేంద్ర.

అప్పటికి ఆమె పూలు కోసుకుంటుంది.

నరేంద్రను చూస్తూనే.. “మీరు ఇటు వస్తున్నారని నేను గుర్తించాను.” నవ్వింది.

“ఎలా.” విస్మయంలో ఉన్నాడు నరేంద్ర.

“మీ బైక్ శబ్దం బట్టి.” చలాకీలో ఉంది శ్యామల.

“అవునా.” చక్కగా ముచ్చటయ్యాడు నరేంద్ర.

“మీ కోసమే వచ్చాను.” చెప్పాడు.

“తెలుసు.” చిన్నగా అంది శ్యామల.

‘సంగతి ఏమిటి’ అన్నట్టు చూసింది.

“నాకు ట్రాక్టర్ మీద పట్టు బాగా కుదిరింది. కోటిని పంపించేయాలని అనుకుంటున్నాను.” చెప్పాడు నరేంద్ర.

ఆ వెంబడే.. “వాట్ డు యు సే.” అడిగాడు.

“తొందరేం ఉంది. మీరు అతడికి నెల జీతం.. పైగా డిమాండ్ చేసినంత చెల్లించనున్నారు. సో. మధ్యన పంపించేయడం ఎందకు.” నిదానంగా చెప్పింది శ్యామల.

“అంతే అంటారా.” అన్నాడు నరేంద్ర.

“ముమ్మాటికి.” అనేసింది శ్యామల.

ఆ వెంబడే.. “మీరు నాకు చెప్పి ఉన్నారు. తనకే కాకుండా మీకు కూడా కోటి వండి పెడుతున్నాడని. అదొక సర్దుబాటుగా మీకు అందుతోందిగా. సో.. పూర్తి రోజుల వరకు తిప్పుకోండి.” అంది.

“సరే ఐతే.” అనేసాడు నరేంద్ర.

ఇద్దరూ పూలు కోస్తున్నారు.

“మల్లె మొగ్గలు పూత తగ్గుతోంది.” అంది శ్యామల.

నరేంద్ర ఏమీ అనలేదు.

ఆ తర్వాత.. ఇద్దరూ మండపంలోకి వచ్చి కూర్చున్నారు.

“అవునూ.. నేను అబ్జర్వ్ చేస్తున్నాను. మీరు నా మాటకు ఎంతగానే వేల్యూ ఇస్తున్నారు. నా మీద మీకు అంత నమ్మకం ఏమిటి.” నవ్వుతోంది శ్యామల.

“ఏమో అనను కానీ.. మీరు చెప్పింది చేపడితే.. నేను ఆనందం పడగలుగు తున్నాను. మీ మాట అంతటిది. అది నా అదృష్టం.” చక్కగా చెప్పాడు నరేంద్ర.

శ్యామల ఏమీ అనలేదు.

కానీ నరేంద్ర అన్నాడు.. “మీ నుండి నాకు ఈ మేలు ఎప్పటికీ అందుతుండాలి.”

ఆగి అంది శ్యామల.. “సాధ్యమా.”

వెంటనే నరేంద్ర ఏమీ అనలేక పోయాడు. కానీ ఆమెనే చూస్తున్నాడు.

ఆ చూపు నుండి తన చూపుని తిప్పుకుంటూ..

“ఏమిటో. ఇంతకు ముందు మనం ఎవరిమో. ఇప్పుడు ఇలా ఎందుకు కలుసు కుంటున్నామో.” మూసి ఉన్న శివాలయం ముఖ ద్వారం వైపు చూస్తోంది  శ్యామల.

ఆ వెంబడే.. “మన మధ్య ఇంతగా ట్యూనింగ్ పెరుగుతుండడం దేనికో.” అంది.

“నాకు మాత్రం తెలుస్తోంది. మీ మూలంగా నేను మరింత సైన్ కాగలనని.” స్పేస్ తీసుకున్నాడు నరేంద్ర.

“అది నా మీద మీలో ఏర్పడిన నమ్మకం అనను కానీ.. ఇదంతా మీలో ఉన్న మంచి నడవడే అంటాను.” చెప్పింది శ్యామల.

“ఏమో. కానీ మీ మీద నాకు మంచి గురి ఏర్పడింది. దానిని విస్మరించను. మిమ్మల్ని విడవను.” ట్రాన్స్ లో ఉన్నాడు నరేంద్ర.

“వాట్.. వాట్ ఆర్ యు సేయింగ్.” సర్రున అడిగింది శ్యామల.

ఆమె గొంతుకకు తుళ్ళి పడ్డట్టు కదిలిపోయాడు నరేంద్ర.

ఆమెనే చూస్తూ ఉండిపోయాడు.

“ఇక వెళ్దామా.” లేచిపోయింది శ్యామల. కదలబోయింది.

“శ్యామల గారూ.. పూలు.” అంటూ ఆమె కింద పెట్టిన పూలు కవర్ ని తీసి ఆమెకు అందించాడు నరేంద్ర.

ఆ వెంటనే.. “మీరు అన్ కాన్సియస్ న ఉన్నారు.” అన్నాడు.

“మీరు కూడా.” అనేసింది శ్యామల.

ఇద్దరూ మండపం దాటి నడుస్తున్నారు.

“ఈ మధ్య మీ తలంపు నన్ను నిలవరిస్తోంది.” నెమ్మదిగా చెప్పాడు నరేంద్ర.

వెంటనే చెప్పక పోయినా.. ఆ తర్వాత..

“అతిగా మీరు ఆలోచించుకోవద్దు.” చెప్పింది శ్యామల.

“లేదు శ్యామల గారు. యువర్ కంపెనీ ఈజ్ వెరీ ప్రిసియస్ టు మి. దట్ షుడ్ బి లెప్ట్ టు మి.” చెప్పేయగలిగాడు నరేంద్ర.

శ్యామల ఏమీ అనలేదు. అలానే నడక వేగాన్ని పెంచలేదు.

“శ్యామల గారూ..  మీ సాంగత్యం నాకు అతి విలువైనది. అది నాకే మిగలాలి.” చెప్పాడు.

అర నిముషం లోపునే.. “నాకు ఇంగ్లీష్ వచ్చు.” చెప్పింది శ్యామల.

ఆ వెంబడే.. “మీరు చెప్పింది నాకు బోధ పడింది. కానీ సడన్ గా మనం ఎటో పోతున్నామేమో.” అంది.

“లేదు. మనం ఇప్పుడే సరైన తోవన పడుతున్నాం.” అన్నాడు నరేంద్ర.

“మీరు ఒకటి గమనించడం లేదు.” చిన్నగా అంది శ్యామల.

“ట్రాక్ ని మార్చకండి.” చెప్పాడు నరేంద్ర.

“అరె. నేను కాదు. మీరే ట్రాక్ లో లేరు.” అంది శ్యామల. నడక ఆపలేదు.

ఆ వెంబడే.. “మీరు మీ బైక్ ని వదిలి నాతో వచ్చేస్తున్నారు.” కిసుక్కున నవ్వింది శ్యామల. ఇప్పుడు ఆమె ఆగింది.

“అరె. ష్.” నొసలు కూడ తీసుకున్నాడు నరేంద్ర. ఆగిపోయాడు.

“వెళ్లి తెచ్చుకోండి.”  అంది.

ఆ వెంబడే.. “కాస్తా నిమ్మళం పడండి. తొందర వద్దు. నేను వెళ్తున్నా.” కదలింది శ్యామల.

“ప్లీజ్. నా విన్నపం వినండి.” వెంట పడ్డాడు నరేంద్ర.

శ్యామల నడుస్తూనే.. “ఆప్టర్ నైన్ పియం.” అంది.

“ఏంటి.” కంగారయ్యాడు నరేంద్ర.

“మీ విన్నపం వినేది.” చెప్పింది శ్యామల.

“ఎలా.” గందికయ్యి పోతున్నాడు నరేంద్ర.

నెమ్మదిగా నడక నాపింది శ్యామల.

ఆమె దరినే ఆగిపోయాడు నరేంద్ర.

శ్యామల తన కుడి అరచేతి మధ్య మూడు వేళ్లని ముడిచి.. మిగతా రెండు వేళ్లని సాగతీసి.. చిటికన వేలును తన పెదాలకి ఆన్చీ.. బొటన వేలును తన కుడి చెవిని తాకేలా పెట్టింది. చిన్నగా నవ్వుతోంది.

నరేంద్ర తన రెండు అర చేతులును అటు ఇటు ఆడిస్తున్నాడు. అయోమయంగా ఆమెనే చూస్తున్నాడు.

“బై.” అంటూ కదిలింది శ్యామల.

ఆ వెంబడే.. “ఇప్పటికి మీరు వెనుక్కు పోయి మీ బైకు తెచ్చుకోండి.” చక్కగా చెప్పింది. కాస్తా నడక వేగం పెంచింది.

నరేంద్ర ఆగిన చోటనే ఉండి పోయాడు.

శ్యామల తన ఇంటి దారిన తిరిగేక..

నరేంద్ర భారంగా కదిలాడు తన బైక్ వైపుకు.

(ఇంకా ఉంది)

Exit mobile version