Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

నరేంద్ర ఐ యామ్ విత్ యు-7

[శ్రీ బివిడి ప్రసాదరావు రచించిన ‘నరేంద్ర ఐ యామ్ విత్ యు’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]

[రెండు రోజుల తరువాత అప్పలనర్సయ్యతో కలిసి బ్యాంకుకు వెళ్ళి మేనేజర్‍ని కలిసి సంబంధిత డాక్యుమెంట్స్ అన్నీ అందజేసి లోన్ శాంక్షన్ చేయమని కోరుతాడు నరేంద్ర. మేనేజర్ సరేనంటాడు. ఆ సాయంకాలం గుడి దగ్గర శ్యామలని కలుస్తాడు. ఆమె పూలు కోసుకోవడం అయ్యాకా, మండపంలో కూర్చుని మాట్లాడుకుంటారు. బ్యాంక్ లోన్ తీసుకుని ట్రాక్టర్ కొనబోతున్నట్టు చెప్తాడు. త్వరలో అప్పలనర్సయ్య పొలం పేపర్స్‌తో కూడా లోన్ తీసుకుని ఆయన పొలం పరిసరాల్లో బోరు వేయిస్తానని చెప్తే, అంత హడావిడి వద్దంటుంది శ్యామల. అతనికిది లెర్నింగ్ స్టేజ్ అనీ, ముందు చిన్న స్థాయిలో చేసి, అనుభవం సాధించాకా, పెద్దస్థాయిలో చేపట్టవచ్చని చెబుతుంది. ప్రస్తుతానికి ట్రాక్టర్‌తో ఆపమని, వచ్చేది వర్షాకాలం, చెరువు నిండుతుంది కాబట్టి బోర్ అవసరం లేదని చెబుతుంది. తొలుత వరి పంటను.. తర్వాత మినుములు, పెసలు లాంటి స్థానిక వాడుక పంటలు వేయమంటుంది. అతని ద్వారా మొదటి వ్యవసాయ సాగు ఫలితం వచ్చేవరకు ఆగమంటుంది. తద్వారా నరేంద్రకు.. అతనితో కలిసిన వాళ్లకి ఒక నమ్మకం ఏర్పడుతుందని అంటుంది శ్యామల. ఆమె చెప్తున్నది అర్థం చేసుకుంటాడు నరేంద్ర. ఆమె సూచనలు నచ్చాయని, వాటిని పాటిస్తానని చెప్తాడు. ఇద్దరూ ఎవరిళ్ళకు వారు చేరుతారు. మర్నాడు పొలం దగ్గర అప్పలనర్సయ్యతో మాట్లాడుతూ బోర్ విషయంలో కొంత కాలం ఆగుదామని, ప్రస్తుతం అతని పొలం మీద లోన్ వద్దని చెప్తాడు నరేంద్ర. మర్నాడు తాను ఊరు వెళ్ళి ట్రాక్టర్ కొనుగోలు చేసుకుని వస్తానని చెప్తాడు. సోములు తెచ్చిన కొబ్బరిబోండాలు తాగి ఇంటికి బయల్దేరుతారు. దారిలో అప్పలనర్సయ్యకి వాళ్ళ కూతురు అమ్మాజీ ఫోన్ చేస్తుంది. ఆమె చెప్పేది విని, సంతోషిస్తాడాయన. తన కూతురు ఇంటికి వస్తోందని, ఆమె అమ్మమ్మ గారింట ఉండి బ్యాంకు పరీక్షలకు కోచింగ్ తీసుకుంటోందని చెప్తాడు. అక్కడ్నించి ఎవరింటికి వారు చేరుతారు. – ఇక చదవండి.]

ప్పలనర్సయ్య ఇంటిని చేరేసరికి ఉదయం పదకొండున్నర కావస్తోంది.

కాళ్లు, చేతులు కడుక్కున్నాక..

“అమ్మాజీ ఫోన్ చేసింది. రేపు వస్తోందట.” చెప్పాడు భార్యతో.

అన్నపూర్ణ తెగ ఇదైపోతోంది.

“ఒక్కర్తె వస్తోందా.” అడిగింది.

“అదేమీ చెప్పలేదు. నేనూ అడగలేదు.” చెప్పాడు అప్పలనర్సయ్య.

“ఫోన్ చేసి ఇవ్వండి. అమ్మాజీతో మాట్లాడి అడుగుతాను.” చెప్పింది అన్నపూర్ణ.

అప్పలనర్సయ్య అలానే చేసాడు.

అన్నపూర్ణ కూతురుతో మాట్లాడుతోంది.

“అమ్మమ్మ రానందా. సరే. అమ్మమ్మ, తాతయ్య బాగున్నారా. మీ మామ, అత్త ఎలా ఉన్నారు.” అడిగింది అన్నపూర్ణ.

అప్పుడే.. “వాళ్లతో గత వారమే కదా మాట్లాడించాను.” కలగచేసుకున్నాడు అప్పలనర్సయ్య.

అన్నపూర్ణ పట్టించుకోలేదు. కూతురు చెప్పుతోందే వింటుంది.

“సరే. రా. రెండు బస్సులు మారాలిగా. జాగ్రత్త.” చెప్పింది అన్నపూర్ణ.

అటు అమ్మాజీ ఫోన్ కాల్ కట్ చేయడంతో.. తన చేతిలోని ఫోన్‌ను భర్తకి ఇచ్చేసింది అన్నపూర్ణ.

అది మొదలు.. అన్నపూర్ణ అవి సర్దడం, ఇవి సర్దడంలో మునిగిపోయింది.

అప్పలనర్సయ్య ముసి ముసిగా నవ్వుకుంటున్నాడు.

***

సాయంకాలం ఐదు దాటింది.

నరేంద్ర పొలాల వైపు నుండి తిన్నగా శివాలయంకు వెళ్లాడు.

శ్యామలని కలిసాడు.

ఇద్దరూ పూలు కోస్తూ మాట్లాడుకుంటున్నారు.

“రేపు ఊరు వెళ్తున్నాను. ట్రాక్టర్ తీసుకుంటాను.” చెప్పాడు నరేంద్ర.

“అలానా. ట్రాక్టర్‌ల మీద అవగాహన ఉందా.” అడిగింది శ్యామల.

“ముందుగా తెలుసుకోవాలనే అనుకున్నాను. ఈ ఊరిలో కానీ, చుట్టు పక్కల ఊళ్లలో కానీ ట్రాక్టర్ వినియోగమే లేదట.” నొచ్చుకున్నాడు నరేంద్ర.

“నేనూ గుర్తించాను. ఇటు గ్రామాలకు సాంకేతికత ఇంకా పరిచయం కాలేదు.” అంది శ్యామల.

ఆ వెంబడే.. “మీరు ముందు అవ్వండి. అభిరుచి ఉంటే ఏదీ అసాధ్యం కాదు. మీరు మీ ఊరిలో లేదా పట్నంలో అగ్రికల్చర్ ఎక్స్‌పర్ట్స్‌ను కోరి కలవండి. వారిని కలిస్తే చాలా సమాచారం లభిస్తోంది. ఇటు పక్క పొలాల్లో ఎట్టివి మన్నికవుతాయో తెలుసుకోండి. మంచి ట్రాక్టర్‌ను ఎంపిక చేసుకొనే వీలు మీకు లభిస్తోంది.” ఈజీగా చెప్పింది శ్యామల.

“అవునవును. మీతో మాట్లాడగలిగితే చాలు. చాలా పరిజ్ఞానం మీ నుండి లభిస్తోంది.” నిండుగా అన్నాడు నరేంద్ర.

“చాల్లెండి. అదునైతే చాలు ప్రతి దానికి నా ప్రస్తావనే మీకు. అంతేమీ లేదు. మీ ఆశయం నచ్చేక.. మీ చొరవ వలన.. మీ కోసమై నేను ఆలోచిస్తున్నాను. మీకు నేనెలా సాయపడవచ్చో యోచిస్తున్నాను. అంతే.” పొందికగా మాట్లాడింది శ్యామల.

“థాంక్స్ శ్యామలగారూ.” నిండుగా చెప్పాడు నరేంద్ర.

ఇద్దరూ పూలు కోస్తూనే ఉన్నారు.

“అక్కడి పేమెంట్స్ అన్నీ చెక్ రూపానే కదా.” అడిగింది శ్యామల.

“అవును.” అన్నాడు నరేంద్ర.

“గుడ్. అన్నీ పక్కాగా ఉండేలా చూసుకోండి. మీరు కొందరిని కలుపుకు నడుస్తున్నారు. మీరే జవాబుదారి. అలసత్వం వద్దు.” హెచ్చరికలా చెప్పింది శ్యామల.

నరేంద్రలో శ్యామల మీద గురి పెరిగిపోతోంది.

“బాగా చెప్పారు. నేను మొదటి నుండి అన్నింటినీ రాస్తూనే ఉన్నాను.” చెప్పాడు నరేంద్ర.

“అది అవసరం.” అంది శ్యామల.

పూలు కోయడం కాగానే ఇద్దరూ ఆలయం ముందుకు వచ్చారు.

“కొద్ది సేపు కూర్చుందామా.” అడిగాడు నరేంద్ర.

“ఈ రోజు కాదు. నేను ఉదయమే బట్టలు నాన పెట్టి వదిలేసాను. వాటి పని చూడాలి.” నవ్వుతోంది శ్యామల.

“సరి సరే. అలానే. పదండి.” అక్కడ నుండి కదిలాడు నరేంద్ర.

అతడి పక్కనే నడుస్తోంది శ్యామల.

“శ్యామలగారూ.. ఒకటి ఇవ్వగలరా.” సడన్‌గా అడిగాడు నరేంద్ర.

శ్యామల తల తప్పి.. నరేంద్రను మామూలుగానే చూస్తోంది. నడుస్తూనే ఉంది.

“ఊరిలో ఐతే మిమ్మల్ని కలవగలను. వేరే చోట నుండి నేను మీతో మాట్లాడవలసి వస్తే.. మీకు అభ్యంతరం లేకపోతే.. మీ ఫోన్ నెంబర్ ఇవ్వగలరా.” ముక్క ముక్కలా మాట్లాడేడు నరేంద్ర. అప్పుడు మాత్రం అతడి చూపులు దారి వెంబడే ఉన్నాయి.

శ్యామల చిన్నగా నవ్వుతూనే.. “తప్పక. ఇస్తాను. మీకు ఇవ్వడానికి అభ్యంతరం ఎందుకు.” చకచకా అంది.

ఆ తర్వాత.. శ్యామల తన ఫోన్ నెంబర్ చెప్పగా.. నరేంద్ర దానిని తన ఫోన్‌లో నోట్ చేసుకున్నాడు. వెంటనే ఆ నెంబర్‌కు కాల్ చేసాడు.

శ్యామల ఫోన్ మోగుతోంది.

“నా నెంబర్ మీకు కూడా తెలుస్తోంది.” చెప్పాడు నరేంద్ర.

ఆ సమయంలోనే శ్యామల తన ఎడమ అర చేతిని తన గుండె కేసి అదుముకుంటుంది.

ఆ చేతికి తన జాకెట్టు లోని ఫోన్ వైబ్రేషన్ సన్నగా తాకి గిలిగింతలు పెడుతోంది.

చిన్నగా నవ్వుకుంటుంది శ్యామల.

ఈ తతంగం నడుమనే వాళ్ల ఇళ్ల దారులు రావడంతో.. ఆ ఇద్దరూ అసలు దారిని వదిలి చెరో దారి వైపుకు మారిపోయారు.

***

మర్నాడు..

పురంలో..

ఉదయం ఏడున్నర ప్రాంతంలో తమ ఇంటికి వచ్చిన నరేంద్రను చూస్తూనే ఆనందమయ్యారు అతడి తల్లిదండ్రులు.

“కొద్దిగా చిక్కేవురా.” అన్నాడు నారాయణరావు. కొడుకును ఎగాదిగా చూస్తున్నాడు.

“రాత్రి తిండే అనుకుంటా. రా. టిఫిన్ తిందువు.” అంది పద్మావతి.

నరేంద్ర రిఫ్రెషై వచ్చాడు.

టిఫిన్ చేస్తున్నాడు.

అతడి ఎదుట అతని తల్లిదండ్రులు కూర్చుని ఉన్నారు.

ఆ ముగ్గురి మధ్య డైనింగ్ టేబుల్ ఉంది.

ముచ్చటించుకుంటున్నారు.

“లోన్ పూర్తిగా వచ్చిందా.” అడుగుతున్నాడు నారాయణరావు.

“వచ్చింది. అమౌంట్ నా బ్యాంక్ అకౌంట్‌న జమై ఉంది.” చెప్పాడు నరేంద్ర.

“ట్రాక్టర్ కొనుగోలుకు సరిపోతోందా.” తిరిగి అడిగాడు నారాయణరావు.

“ఇంకా మిగిలేలానే లోన్ తీసుకున్నాను.” చెప్పాడు నరేంద్ర.

“వాడిని తిన్నీయండి.” చిరాకవుతోంది పద్మావతి.

“తింటున్నాడుగా.” నసిగాడు నారాయణరావు.

రమారమీ రెండు నిముషాల తర్వాత..

“నీకు ట్రాక్టర్ డ్రయివింగ్ రాదుగా. అక్కడ అట్టి డ్రయివర్స్ ఉన్నారా.” నారాయణరావే మాట్లాడేడు.

“అక్కడ ఇదే మొదటి ట్రాక్టర్ అవుతోంది. సో. ఇక్కడి నుండే ఒక డ్రయివర్‌ని కుదుర్చుకొని తీసుకు పోతాను. నేను డ్రయివింగ్ నేర్చుకుంటాను.” చెప్పాడు నరేంద్ర.

“మరి ఆయిల్ వగైరాలు.” అడిగాడు నారాయణరావు.

“అక్కడికి ఇక్కడికి ఎంత దూరమేమిటి. ప్రీక్వెంట్‌గా బస్సులు తిరుగుతున్నాయాయే. పైగా నిల్వలు సదుపాయం చేపడతానులే. అట్టివేం అడ్డుకావు.” తేలికగా చెప్పేసాడు నరేంద్ర.

ఆ తర్వాత.. అర గంట లోపే.. ఆయా పనులకై ఇంటి నుండి బయటికి వెళ్లిపోయాడు తన బైక్‌తో.

ముందుగా ఫోన్ చేసి చెప్పడంతో.. తను బయలుదేరే సమయం లోపే తన బైక్‌ను తన ఇంటికి తీసుకువచ్చి అప్పగించాడు అతడి ఫ్రెండ్.

***

పల్లెలో..

ఉదయం పదకొండు అవుతోంది.

ఇంటిని చేరిన కూతురుతో తీరిగ్గా కూర్చోని మాట్లాడుతోంది అన్నపూర్ణ.

అంతలోనే పొలాల వైపు నుండి అప్పలనర్సయ్య ఇంటిని చేరాడు.

తండ్రి, కూతురుల పలకరించుకోవడాలయ్యాక ఆ ముగ్గురు ముచ్చట్లులో పడ్డారు.

“ఎందుకమ్మా రెండో బ్యాంక్ పరీక్ష వాయిదా పడింది.” అడిగాడు అప్పలనర్సయ్య కూతురుని.

“ఏమో నాన్నా. నోటిఫికేషన్ ప్రకారం ఈ పాటికి ఐపోవాలి. మొదటి బ్యాంక్ పరీక్ష అనుకున్నట్టే ఐంది. ఒక్కమారున నెల రోజులు ఖాళీ దొరకడంతో వచ్చేసాను. పైగా కోచింగ్ క్లాసులు ముగిసాయి.” చెప్పింది అమ్మాజీ.

“అంటే.. మళ్ళీ నెల రోజుల్లో వెళ్లాలా.” అన్నపూర్ణ కలగచేసుకుంది.

“అమ్మా. ఈ మధ్య జరిగిన బ్యాంక్ ఎగ్జామ్ బాగా రాసాను. నేను సెలెక్ట్ అవుతాను. రెండో పరీక్ష రాసే లోగా మొదట రాసిన బ్యాంక్ ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చేస్తాయి. సో, ఇక రెండో బ్యాంక్ ఎగ్జామ్ రాయను. మొదటి బ్యాంక్ వాళ్లు చూపిన జాబ్ లో జాయిన్ కావడానికి ఇక్కడి నుండి నేరుగా వెళ్లి పోవడమే. అందుకే కూడా ఈ ఖాళీలో మిమ్నల్ని చూడడానికి వచ్చేసాను.” చక్కగా నవ్వుతోంది అమ్మాజీ.

“ఏమిటో నీ గోల. నీ ఈడు పిల్లలకు పెళ్లిళ్ళై అత్త వారిళ్లకు పోయారు.” అసహనంగా చెప్పింది అన్నపూర్ణ.

“లేదు లేదు. నాకు అప్పుడే పెళ్లి వద్దు.” గట్టిగానే చెప్పింది అమ్మాజీ.

ఆ వెంబడే.. “నువ్వు ఏమీ అనవేం నాన్నా.” తండ్రిని చూస్తోంది.

“నీ మాటే నా మాట. నువ్వు ఎలా అంటే అలానే. సరేనా.” చెప్పాడు అప్పలనర్సయ్య.

“మా మంచి నాన్నా.” అంది అమ్మాజీ.

“ఆఁ. మీరు ఇంకా వెనుకేసుకు రాకండి. ఏ వయస్సు ముచ్చట ఆ వయస్సున చేస్తూ పోవాలి.” విసురుగా అంది అన్నపూర్ణ.

“చాల్లేవే. ఇక్కడ ఉన్న ఆడపిల్లలే పెళ్లిళ్లు అయి వెళ్లిపోతున్నారు. చదువుకున్నవాళ్లు పెళ్లిళ్లకు తొందరవ్వడం లేదు.” చెప్పాడు అప్పలనర్సయ్య.

ఆ వెంబడే.. “హైస్కూలు టీచర్ శ్యామల, పంచాయితీ క్లర్క్ రామరాజ్యం వయస్సు వచ్చిన వాళ్లే. వాళ్లకే పెళ్లిళ్లు కాలేదింకా.” చకచకా మాట్లాడేడు అప్పలనర్సయ్య.

“అలా చెప్పు నాన్నా. అమ్మా నా పెళ్లి ఊసు వదిలేయ్.” తేలికవుతోంది అమ్మాజీ.

అన్నపూర్ణ మరి మాట్లాడక.. లేచి అక్కడి నుండి వెళ్లిపోయింది విసురుగా.

“అదంతేలే తల్లీ. పెనం మీది నీళ్లలాగే దాని గుణుపు. చూడు అదే తిరిగి వస్తోంది.” నవ్వేడు అప్పలనర్సయ్య.

“నాన్నా..  ఎవరో అతను మన ఊరు వచ్చి ఏదో కొత్త కొత్త వ్యవసాయం చేస్తున్నాడని చెప్పారుగా. అతడి వ్యవహారం ఎలా ఉంది.” అడిగింది అమ్మాజీ.

నరేంద్ర సంగతులు.. అప్పలనర్సయ్య కూతురుకు వరసగా చెప్పాడు.

“అవునా. అతనితో నువ్వూ కలిసావా.” అంది అమ్మాజీ.

“నేను కలవడం కాదు తల్లీ. నన్నే కలుపుకొని అతడు పని చేస్తున్నాడు.” చెప్పాడు అప్పలనర్సయ్య.

“ఏదోలే. అతడూ ఇక్కడ పొలాలు కొనుక్కొని ఉంటున్నాడు కనుక.. అతడు బోర్డ్ తిప్పే బాపతు కాకపోవచ్చు.” అంది అమ్మాజీ.

“ఆ బాబు చాలా మంచోడు. ఊరు వెళ్లాడు. వచ్చేక నీతో మాట్లాడిస్తా. అప్పుడు నీకే తెలుస్తోంది అతడి వాటం.” గొప్పగా చెప్పాడు అప్పలనర్సయ్య.

అప్పుడే..  “రండి భోజనాలకు.” చక్కగా పిలిచింది అన్నపూర్ణ, అక్కడికి వచ్చి.

“చూసావా తల్లీ.. మీ అమ్మ అంతే. ఆకు మీది నీటి చుక్క లాంటిది. లే తల్లీ.” లేచాడు అప్పలనర్సయ్య.

ఆ ముగ్గురూ భోజనాలకై డైనింగ్ టేబుల్ చెంత చేరారు.

***

సాయంకాలం నాలుగు అవుతోంది.

తన ఊరు పురంలోనే.. సరైన వాళ్ల సహకారంతో.. ట్రాక్టర్ కొనుగోలు చేసాడు నరేంద్ర.

పైగా వాళ్ల మాట ఊతంతోనే.. ఒక డ్రయివర్‌ను.. కొద్ది రోజుల వినియోగంకైనా నెల జీతంకు.. ఎక్కువకైనా కుదుర్చుకున్నాడు.

ఈ రెండింటిన శ్యామల అభిప్రాయాలను ఫోన్ కాల్స్ ద్వారా కోరి మరీ తీసుకున్నాడు.

ఆ పనులు ముగిసాక ఇంటిని చేరాడు.

తల్లి చేతి వంటను ఆబగా తింటున్నాడు.

తండ్రిని కలుపుకొని.. తల్లితో మాట్లాడుతున్నాడు.

***

సాయంకాలం ఐదున్నర..

మంచం మీద నడుము వాల్చి దొర్లుతున్నాడు నరేంద్ర.

అప్పుడే అతడి ఫోన్ మోగింది.

శ్యామల కాల్ చేస్తోంది. ఆమె శివాలయం వెనుక పూలు కోసుకుంటుంది.

చలాకీ అయ్యాడు నరేంద్ర.

లైన్ కలిపి.. “హలో శ్యామల గారూ.” అన్నాడు.

“హలో. ఎక్కడ.” అటు నుండి అడుగుతోంది శ్యామల.

“ఉదయం అంతా తిరిగాగా. బడలికగా ఉంది. మంచం ఎక్కా.” ఇటు నుండి చెప్పాడు నరేంద్ర.

“అయ్యో. పడుకుంటున్నారా.” అడిగింది శ్యామల.

“అబ్బే. లేదు లేదు. జస్ట్ మంచం మీద దొర్లుతున్నా.” కంగారయ్యాడు నరేంద్ర.

ఆ వెంబడే.. “మాట్లాడండి.” అన్నాడు.

“మీ ఊరిలోనే ట్రాక్టర్ సాధించగలిగారు. గుడ్. సర్వీసింగ్ బెడద పెద్దగా ఉండదు. మీ ఊరు ఇక్కడికి దగ్గరే అన్నారుగా.” మాట్లాడుతోంది శ్యామల.

“అవునవును.” అన్నాడు నరేంద్ర.

ఆ వెంబడే.. “నేను రేపే వచ్చేస్తున్నాను.” చెప్పాడు.

“మీ తల్లిదండ్రులు వద్ద ఒక రోజైనా ఉండండి. వాళ్ల భ్రాంతి తీరుతోందిగా. ఐనా ఇక్కడ అంత ఎకాఎకీ పనులు ఏమున్నాయి.” అంది శ్యామల.

“కానీ రేపు వచ్చేస్తా. పంతులు గారిని కలవాలి. మంచి ముహూర్తంన ట్రాక్టర్‌ను పొలం మీదికి తేవాలి. నేను త్వరగా డ్రయివింగ్ నేర్చుకోవాలి.” గబగబా మాట్లాడేడు నరేంద్ర.

చిన్నగా నవ్వుకుంటూ.. “మీరు పని రాక్షసుడు మాదిరిలా ఉన్నారే.” అంది.

నరేంద్ర ఏమీ అనలేదు.

“సరే. నా పూలు కోసుకోవడం ఐంది. నేను ఇంటికి వెళ్తున్నాను.” చెప్పింది శ్యామల.

“బైబై శ్యామల గారూ.” అన్నాడు నరేంద్ర.

“బైబై. టేక్ కేర్ ప్లీజ్.” అటు నుండి చెప్పింది శ్యామల. ఆ వెంబడే ఆ కాల్ కట్ చేసింది.

ఇటు వైపు నరేంద్ర కూలయ్యాడు.

(ఇంకా ఉంది)

Exit mobile version