[శ్రీ బివిడి ప్రసాదరావు రచించిన ‘నరేంద్ర ఐ యామ్ విత్ యు’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]
[పట్నంలో తమ ఇంటికి వస్తాడు నరేంద్ర. ఆ రాత్రి అమ్మానాన్నల కలసి భోం చేస్తుంటే, వ్యవసాయ పనులకు సంబంధించిన ఖర్చుల వివరాలన్నీ జాగ్రత్తగా రాసి పెట్టుకోమని, లెక్కల విషయంలో అజాగ్రత్తగ ఉండొద్దని తండ్రి సూచిస్తాడు. తాను అన్నీ లెక్కలు రాసి ఉంచుతున్నానని చెప్తాడు నరేంద్ర. వెళ్ళి నెల రోజులయింది కదా, వ్యవసాయం పనుల అనుభవం ఎలా ఉందని అమ్మ అడిగితే, బావుందనీ, అంతా తాను అనుకున్నట్టుగానే సాగుతోందని చెప్తాడు. ఏదైనా బ్యాంక్ లోన్ తీసుకున్నావా అని తండ్రి అడిగితే, లేదని చెప్పి, మిత్రులిద్దరు చెరో లక్షా సర్దారని చెప్తాడు. ప్రస్తుతానికీ ఆ డబ్బు, తన దగ్గరున్న మరికొంత సరిపోతాయని, ట్రాక్టర్ కొనాల్సి వచినప్పుడు బ్యాంక్ లోన్ అవసరం అవుతుందని చెప్తాడు. మర్నాడు పట్నంలో పనులు పూర్తి చేసుకుని ఊరెళ్ళిపోతాడు నరేంద్ర. ఓ రోజు సాయంత్రం పొలం పనులు ముగించుకుని అప్పలనర్సయ్య ఇంటికి వెళ్తాడు. మాటల సందర్భంలో నరేంద్రలో తన చనిపోయిన కొడుకుని చూసుకుంటున్నాని చెప్తాడాయన. ఆ రాత్రి తమ ఇంట్లోనే భోం చేయమని అడిగితే, సరేనంటాడు నరేంద్ర. తన వ్యవసాయాన్ని ఇంకా విస్తృతం చేయాలనుకుంటున్నట్టు, అందుకు తన పొలాల చుట్టూ ఉన్న వారి పొలాలు కూడా వాడుకుందామని, వాళ్ల పంటకి అయ్యే మదుపులు అన్నీ తానే పెడతాననీ, ఫలసాయం 75:25 పంచుకుందామని అంటాడు. ఆ పొలాల యజమానులతో మాట్లాడమని అప్పలనర్సయ్యకి చెప్తాడు. వాళ్లతో ఒక సమావేశం ఏర్పాటు చేయామని, ఆయన సమక్షంలో వాళ్లతో మాట్లాడి అన్నీ వివరంగా చెప్పి, వాళ్ల సమ్మతితోనే కొత్త పోకడలతో సమిష్టిగా వ్యవసాయం చేద్దామని అంటాడు నరేంద్ర. అందరి ఆదాయాలు తప్పక మెరుగు పడతాయనీ, తనను నమ్మమని చెప్తాడు. ఒకట్రెండు రోజుల్లో సమావేశం ఏర్పాటు చేస్తానంటాడు అప్పలనర్సయ్య. ఆ సాయంత్రం శివాలయానికి వెళ్ళి దర్శనం చేసుకుని, మండపం అంచున కూర్చుంటాడు నరేంద్ర. ఇంతలో అక్కడికి వచ్చిన శ్యామల అతన్ని పలకరిస్తుంది. పూజారి అనుమతితో తాను రోజూ గుడిలోని మల్లెపూలు కోసుకోడానికీ రోజు వస్తానని చెబుతుంది. ఆమెతో మాట్లాడుతూ, తన వివరాలు ఆమెకి చెప్పి, ఆమె వివరాలు తాను తెలుసుకుంటాడు. స్కూల్లోని తన కొలీగ్స్ అంతా నరేంద్రని కొనియాడుతుంటారని అంటుంది. నరేంద్ర మీద ఉన్న సదభిప్రాయం మరింత బలపడిందని చెబుతుంది శ్యామల. చీకటి పడడంతో ఇద్దరూ అక్కడ్నించి ఇళ్ళకు బయల్దేరుతారు. – ఇక చదవండి.]
పట్నంలో..
శ్యామల కన్నవారింటిలో..
రాత్రి.. ఏడవుతోంది.
వంట గదిలో స్టవ్ మీద కుక్కర్ పెట్టి తిరిగి హాలు లోకి వచ్చింది శ్యామల తల్లి పార్వతి. అక్కడ ట్యూషన్ పిల్లులు ఉన్నారు.
స్టూల్ మీద కూర్చుంది పార్వతి.
పిల్లలు రాత పనిలో ఉన్నారు.
“టీచర్.. రాసేసాను. చూడండి.” ఒక అమ్మాయి లేచి వచ్చి.. తన చేతిలోని పుస్తకాన్ని పార్వతికి అందించింది.
పార్వతి చూసింది.
“గుడ్. బాగా రాసావు.” తిరిగి ఆ పుస్తకాన్ని ఆ అమ్మాయికి ఇచ్చేసింది పార్వతి.
ఆ వెంబడే.. “మిగతా వారు ఎంత వరకు రాసారు.” అడిగింది.
అంతలోనే కుక్కర్ విజిల్ వినిపించగా.. ‘ఒకటి.’ అనుకుంది.
మిగతా పిల్లలు ఒక్కొక్కరిగా వచ్చి.. తాము రాసింది పార్వతికి చూపి.. తిరిగి వెళ్లి కూర్చుంటున్నారు.
కుక్కర్ మూడో విజిల్ వినిపించేక.. లేచి అటు వెళ్లింది పార్వతి. కుక్కర్ కట్టి తిరిగి ట్యూషన్ పనిని మొదలు పెట్టింది.
పావుగంట గడుస్తోంది.. అంతలోనే వీధి వైపు తమింటి గుమ్మం డోర్ బెల్ మోగింది.
చేస్తున్న పనాపి పార్వతి అటు వెళ్లింది. తలుపు తీసింది.
తన భర్త అప్పారావు వచ్చాడు. తాగి ఉన్నాడు.
పార్వతి పక్కకు తప్పుకుంది.
భర్త ఇంట్లోకి వచ్చేక.. తలుపు మూసేసి.. లోపలి గడియ వేసింది.
తిరిగి ట్యూషన్ పనిని కొనసాగించింది.
అప్పారావు నేరుగా గదిలోకి వెళ్లి పోయాడు.
బట్టలు మార్చుకున్నాడు. బాత్రూం లోకి దూరాడు.
పది నిముషాలకి బయటికి వచ్చాడు. టవల్ తో ముఖం తుడ్చుకుంటూ.. హాలున చేరాడు.
“వంటయ్యిందా.” అడిగాడు.
పార్వతి లేచింది. వెళ్లి వంట గదిలోని సింక్‌న చేతులు కడుక్కుంది. ఒక పళ్లెంలో అన్నం, కూర వడ్డించింది. ఒక కప్పున చారు పోసింది. వాటిని తెచ్చి డైనింగ్ టేబుల్ మీద పెట్టింది. పిమ్మట ఒక సీసాన నీళ్లు నింపి తెచ్చి పెట్టింది.
“పెట్టాను. తినండి.” అంది చాలా మామూలుగా.
అప్పారావు భోజనంకై కదిలాడు.
అర గంట తర్వాత.. ట్యూషన్ ముగిసింది. పిల్లలు వెళ్లిపోయారు.
పార్వతి వంట గదిలోకి వెళ్లింది. ఒక ప్లేట్‌లో భోజనం వడ్డించుకొని డైనింగ్ టేబులు వద్దకు వచ్చింది. తను భోంచేసింది.
అప్పటికే భోజనం చేసి గదిలోకి వెళ్లిపోయాడు అప్పారావు.
పనులు చక్కపెట్టుకొని.. గదిలోకి వచ్చింది పార్వతి.
అప్పారావు పడుకుండిపోయాడు.
అతడి మంచంకి చెంతనే మరో మంచం మీద పార్వతి నడుము వాల్చింది.
***
మర్నాడు.. సాయంకాలమవుతోంది.
నరేంద్ర ఉన్న పొలాల వైపు అప్పలనర్సయ్య వచ్చాడు.
ఉదయం నుండి జరుగుతున్న పనులు గురించి ఇద్దరూ కొద్ది సేపు ముచ్చటించు కున్నారు.
తర్వాత.. “బాబూ. మీరు చెప్పినట్టే నేను చేసాను. ఈ చుట్టు పక్కల పొలాల వాళ్లు సమావేశంకు సమ్మతించారు. రేపు వాళ్లని పోగుపర్చనా.” అడిగాడు అప్పలనర్సయ్య.
“తప్పక. రేపు రాత్రికి కలుద్దాం. అప్పుడైతే అందరూ పనులు నుండి తెమిలి ఉంటారుగా.” అన్నాడు నరేంద్ర.
“సరే. రేపు పొద్దు పోయేక మీ ఇంటి ముందు కూర్చుందామా. అప్పటికి నేను బల్లలు తెప్పించి వేయిస్తాను.” చొరవయ్యాడు అప్పలనర్సయ్య.
“అలానే.” అన్నాడు నరేంద్ర.
ఆ వెంబడే.. “నాది మరో ఆలోచన.” అన్నాడు.
“చెప్పు బాబు.” తలాడించాడు అప్పలనర్సయ్య.
“మనం చేపట్టిన విధం గురించి నలుగురూ ఆసక్తిగా మాట్లాడుకుంటున్నారు..” చెప్పుతున్నాడు నరేంద్ర.
అడ్డై.. “భలే బాబూ. నలుగురు ఏం కర్మ. చాలా మంది మంచిగా మాట్లాడుకుంటున్నారు.” చెప్పాడు అప్పలనర్సయ్య.
“అదదే.. కావచ్చు. ఈ ఊరు హైస్కూలు టీచర్ శ్యామల గారితో మాట్లాడగలిగే అవకాశం నాకు కుదిరింది. ఆమె నుండి నాకు తెలిసింది. స్కూల్‌లో మాస్టార్లును మన పనులు ప్రేరేపిస్తున్నాయట.” సరదాగా చెప్పాడు నరేంద్ర.
ఆ వెంబడే.. “నాకు అనిపిస్తోంది. రేపటి మన సమావేశంకి వాళ్లని ఆహ్వానిస్తే బాగుంటుందనిపిస్తోంది. వాళ్ల సలహాలు, సూచనలు మనకు ఉపయోగపడవచ్చేమో.” అన్నాడు.
“అలా అంటారా బాబూ. సరే ఐతే.” అనేసాడు అప్పలనర్సయ్య.
“అబ్బే. మీ ఆలోచన కూడా నాకు కావాలి.” కోరాడు నరేంద్ర.
“అయ్యో. ఎప్పటికప్పటివే కానీ నాకు దూరాలోచనలు చేతనవ్వవు బాబూ.” నసిగాడు అప్పలనర్సయ్య.
ఆ వెంబడే.. “మీరు చదువు ఉన్న వాళ్లు. మీరు ఆలోచిస్తున్నారంటే అందులో ఏదో మంచే ఉంటుంది. పైగా మీరు మంచోలు. మీ ఆలోచనలూ అలానే ఉంటాయి. మీరు అన్నట్టే కానిద్దాం.” అన్నాడు.
“ఐతే.. నేను రేపుదయం స్కూల్ కు వెళ్లి శ్యామల గారి ద్వారా వాళ్లని కలిసి రమ్మంటాను.” చెప్పాడు నరేంద్ర.
“అలానే.” అనేసాడు అప్పలనర్సయ్య.
ఆ వెంబడే.. “కొన్ని కుర్చీలు కూడా ఏర్పాటు చేస్తాను.” చెప్పాడు.
తర్వాత.. ఇద్దరూ కలిసే ఊరిలోకి మాట్లాడుకుంటూ వస్తున్నారు.
***
ఆ రాత్రి..
పురంలో..
నరేంద్ర కన్నవారింటిన..
పద్మావతి పనులు కానిచ్చేసి.. పడకకై గదిలోకి వచ్చింది.
అప్పటికే నారాయణరావు మంచం మీద నడుము వాల్చి ఉన్నాడు.
అతడి పక్కనే మంచం మీద నడుము వాల్చి.. భర్త వైపు ఒత్తిగిల్లి..
“ఇదాంక నరేంద్ర ఫోన్‌లో చెప్పింది విన్నాక.. మీరు అలానే కానీయు అనేసారు. అది సబబేనా.” అడిగింది పద్మావతి.
“తప్పేముంది. వాడి ఆలోచనలు అమలు పర్చడానికి వాడు సాహసిస్తున్నాడు. తను తలో చేయి ఆసరా ఆశిస్తున్నాడు. తనతో పాటు చుట్టూ వాళ్లని స్తిమితంగా స్థిరపర్చగలననుకుంటున్నాడు. సాగని. మనం అడ్డు పడడం మంచిదా.” అడిగాడు నారాయణరావు.. భార్య వైపుకు తిరుగుతూ.
“ఏదైనా తేడా జరిగితే.. మనోడే చెడ్డ కావచ్చుగా.” పద్మావతి బెదురుతోంది.
“సంశయాలు వెనుక్కు లాగుతాయి. వాటిని దాటి సరైన ప్రణాళికతో ముందు పడడమే తెలివైన లక్షణం. వాడిని ఆపొద్దు. నాకు వాడి విధం మీద నమ్మకం ఉంది.” సరళంగా మాట్లాడేడు నారాయణరావు.
పద్మావతి భర్తనే చూస్తూ ఉంది.
“నువ్వు ప్రశాంతమవ్వు. మంచే జరగాలని కోరుకుందాం.” చిన్నగా నవ్వుతూ చెప్పాడు నారాయణరావు.
పద్మావతి ఏమీ అనలేదు.
అర నిముషం తర్వాత..
“గుడ్‌నైట్.” చెప్పాడు నారాయణరావు. గోడ వైపుకు ఒత్తిగిల్లిపోయాడు.
చిన్నగా తలాడించేసింది పద్మావతి. వెంబడే వెల్లికిలుగా సర్దుకుంది.
***
మర్నాడు..
పల్లెలో..
ఉదయం..
ఆ ఊరి హైస్కూలుకు వెళ్లాడు నరేంద్ర.
అక్కడ అప్పుడే ప్రయర్ సెషన్ ముగుస్తోంది.
దూరాన శ్యామల అగుపించింది. తను ఆ చోటు నుండి వెడలతోంది.
వడివడిగా నడిచి ఆమె వెనుకకు చేరాడు నరేంద్ర.
“శ్యామల గారూ.” పిలిచాడు.
శ్యామల ఆగింది. వెను తిరిగింది.
అక్కడ నరేంద్రను చూస్తూనే విస్మయమయ్యింది.
“మీరు.. ఇలా.. ఇక్కడ..” అంటోంది. చిన్నగా నవ్వేందుకు యత్నిస్తోంది.
“యా. మిమ్మల్ని కలవాలనే వచ్చాను. కొద్ది సేపు ఆగగలరా.” అడిగాడు నరేంద్ర.
“అయ్యో. చెప్పండి.” ఆత్రమవుతోంది శ్యామల.
“అదే. కొద్దిమందితో ఈ రోజు సమావేశమవ్వబోతున్నాను. అందులోకి మిమ్మల్ని ఆహ్వానించడానికి ఇలా వచ్చాను.” చెప్పాడు నరేంద్ర.
“నన్నా..” మరో మారు విస్మయమయ్యింది శ్యామల.
“మిమ్మల్నే కాదు. మీలా ఇక్కడి నా విధానికి మంచి పలుకుతున్న మీ టీచింగ్ స్టాపులోని ఇంటరెస్టు పర్సన్స్‌ను కూడా ఆహ్వానించుటకు వచ్చాను. నా విధం విస్తృతకు మీ సలహాలు, సూచనలు ఆశిస్తున్నాను.” చెప్పాడు నరేంద్ర.
కాస్తా తికమకయ్యినా.. శ్యామల వెంటనే తేరుకుంది.
“నాకు వ్యవసాయం పట్ల అవగాహన శూన్యం. మరి మా వాళ్లలో ఏ మాత్రం ఉంటుందో నాకు తెలియదు. మేము మీకు ఎలా సాయపడగలమో.” మెల్లి మెల్లి అంది శ్యామల.
“అయ్యో. వ్యవసాయం అంశం కాదు. అభివృద్ధి, అభ్యుదయము, సమిష్టి, సంఘీభావం ల్లాంటి అంశాల పట్ల నేను చేపట్టబోతున్న వాటిపై మీ అభిప్రాయాలు ఎట్టివో తెలుసుకోవాలని అనుకుంటున్నాను. మీది టీచింగ్ సైడ్ కనుక.. మీ నుండి మంచి ఫలితాలు అందుతాయని అనుకుంటున్నాను. ప్లీజ్. సహకరించండి.” చెప్పాడు నరేంద్ర.
శ్యామల చుట్టూ చూస్తోంది.
ఆ గ్రౌండ్‌న ఆ ఇద్దరే ఉన్నారు.
అప్పటికే మిగతా వారు తమ తమ స్థానాలకు వెళ్లిపోయారు.
“రండి.” అంది నరేంద్రతో శ్యామల.
నరేంద్రను నేరుగా స్టాఫ్ రూంకి తోడ్చుకు వెళ్లింది.
అక్కడ ఉన్న టీచర్స్‌కి నరేంద్రను పరిచయం చేసింది.
వాళ్లు లేచి నరేంద్రను ‘విష్’ చేసారు.
“మీ గురించి విన్నాం. మీరు మంచి విధంని చేపట్టారు. కంగ్రాట్స్.” అన్నాడు తెలుగు టీచర్.
నరేంద్ర తృప్తిగా నవ్వేడు.
నరేంద్ర రాకకు కారణాన్ని శ్యామల వివరించగలిగింది.. అక్కడ ఉన్న మిగతా టీచర్స్‌కు.
వాళ్లలో ఎక్కువ మంది సమ్మతించారు.
“మీటింగ్ ఎక్కడ.” అడిగాడు తెలుగు టీచర్.
నరేంద్ర ఆనవాలు లెక్కన తను ఉంటున్న ఇంటి అడ్రస్ చెప్పగలిగాడు.
“అటా. ఆ పక్క నాకు తెలుసు.” చెప్పాడు డ్రిల్ టీచర్.
“దయచేసి రండి. మీ సహకారం నాకు ఉపయోగ పడవచ్చు.” చెప్పాడు నరేంద్ర.
శ్యామలతో పాటు.. మిగతా కొందరు నరేంద్ర ఏర్పర్చబోతున్న సమావేశంకి రావడానికి సమ్మతి తెలిపారు.
“థాంక్స్.” చెప్పాడు నరేంద్ర.
ఆ వెంబడే.. “మీ పనులకు ఆటంకమయ్యాను. సారీ.” అన్నాడు.
“నో నో.” అన్నారు వాళ్లు కోరస్‌లా.
“సమావేశంలో కలుద్దాం.” అనేసి.. అక్కడ నుండి నేరుగా పొలాల వైపు కదిలాడు నరేంద్ర.
శ్యామల మెత్తగా నవ్వుకుంటోంది.
***
పొలాలలో..
“మోటర్ ఆగింది. ఆయిల్ కావాలి. నీళ్లు పెట్టాలి.” చెప్పాడు పొలం పనులు చేస్తున్న సోములు.
“అరె. అత్యవసరమా. లేదా నేను మధ్యాహ్నం భోజనంకి వెళ్లినప్పుడు తేవచ్చా.” అడిగాడు నరేంద్ర.
“ఇప్పుడు నీళ్ల తడి తగిలిస్తే సాయంకాలంకి ఆ మేర కలుపు మొక్కల్ని వేరులతో సహా పీకేయవచ్చు.” నసిగాడు సోములు.
“అలా అంటావా. సరే. నీకు సైకిల్ ఉందిగా. ఇవిగో తాళాలు. నా ఇంటికి వెళ్లి ఐదు లీటర్ల ఆయిల్ డబ్బా ఒకటి తీసుకురా.” చెప్పాడు నరేంద్ర.. తాళాల రింగ్ సోములకు అందించి.
సోములు ఆ పనికై బయలుదేరాడు తన సైకిల్‌తో.
మిగతా పనివాళ్లు పొలల్లో మిగతా పనులు చేస్తున్నారు.
నరేంద్ర గట్ల వెంబడి నడుస్తూ పరిశీలిస్తున్నాడు.
“తమరికి సైకిల్ ఉంటే బాగోంటోంది బావూ. రోజున నాలుగు మార్లు నడుచుకు తిరుగుతున్నారు.” నొచ్చుకుంటున్నాడు పని చేస్తున్న జోగులు.
“అదదే అనుకుంటున్నాను. ఈ సారి మా ఊరు వెళ్లి నప్పుడు నా బైక్ తెచ్చుకుంటాను. ఇక్కడ గట్ల మీద తిరగలేమనుకొని నా బైక్‌ను నా ఫ్రెండ్‌కు ఇచ్చి ఉన్నాను.” చెప్పాడు నరేంద్ర.
“చూసారు కదా బావూ. ఇక్కడి గట్లు నాటు బళ్లు తిరిగే అంతటివి బావూ.” గొణిగాడు జోగులు.
“అవునవును.” అనేసాడు నరేంద్ర.
ఆ వెంబడే.. “మోటర్‌కు కరెంట్ కనెక్షన్ రాగానే ఇక్కడే షెడ్‌లాగా రూం ఒకటి కట్టిస్తాను. అలా ఐతే పనికి అవసరమైనవన్నీ ఇక్కడే అందుబాటులో ఉంచుకోవచ్చు.” చెప్పాడు.
“అంతే బావూ.” అనేసాడు జోగులు.
పనులు సాగుతున్నాయి.
(ఇంకా ఉంది)