[శ్రీ బివిడి ప్రసాదరావు రచించిన ‘నరేంద్ర ఐ యామ్ విత్ యు’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]


[నరేంద్ర చక్కని ఉద్యోగం చేసుకుంటున్న యువకుడు. చేస్తున్న ఉద్యోగం మీద ఎందుకో విరక్తి కలిగి, పట్నానికి దూరంగా ఓ పల్లెటూరిలో సాగుభూములు కొని వ్యవసాయానికి చేయాలని నిశ్చయించుకుంటాడు. తల్లిదండ్రులు అభ్యంతరం చెప్పినా, వారిని ఒప్పించి, పల్లెబాట పడతాడు. ఇద్దరు మిత్రులు కామేశం, శ్రీకర్ కూడా హెచ్చరించినా, తన లక్ష్యం స్పష్టంగా ఉందని చెప్తాడు. పల్లెలో కనీస సౌకర్యాలతో ఉన్న ఇంటిని అద్దెకు తీసుకుంటాడు. అప్పలనర్సయ్య అనే పెద్దమనిషి అతనికి అన్ని రకాలుగా సాయంగా ఉంటాడు. వ్యవసాయానికి అన్ని ఏర్పాట్లు చేసుకుని, వచ్చే గురువారం పూజ రోజుకి అమ్మానాన్నల్ని రమ్మనిమని చెప్పడానికి పురం బయల్దేరుతాడు నరేంద్ర. రెండు రోజులు అమ్మానాన్నల దగ్గరుండి, వాళ్ళ భయాలు దూరం చేసి, తన ఆశయం గురించి నమ్మకంగా చెప్తాడు. పెళ్ళి చేసుకోమని తల్లి ఒత్తిడి చేస్తే, కొంత సమయం కావాలని అంటాడు. తనకి కావల్సినవన్నీ తీసుకుని పల్లెకి చేరుకుంటాడు. తనకి భూములు అమ్మిన వారితో సమావేశమవుతాడు నరేంద్ర. ఎప్పటిలానే, ఎవరి భూముల్లో వారిని వ్యవసాయం చేసుకోమని చెప్పి, ఖర్చు మాత్రం తనదని, వచ్చే ఫలితాన్ని 75:25 లెక్కన అంటే డెబ్బై ఐదు శాతం పంట వాళ్లకి.. ఇరవై ఐదు శాతం పంట తనకని చెప్తాడు. అందరూ ఆశ్చర్యపోయినా, సమ్మతిస్తారు. గురువారం నుంచి పనులు మొదలుపెడదామని, త్వరలోనే బ్యాంకు లోను తీసుకుని బోరు, ట్రాక్టర్ లాంటి సౌకర్యాలు సమకూరుస్తానని అంటాడు. అప్పలనర్సయ్యని తనకి చేదోడువాదోడుగా ఉండమంటాడు. భోజనానికి తమ ఇంటికి రమ్మని అప్పలనర్సయ్య పిలిస్తే, తాను సామాగ్రి తెచ్చుకున్నాననీ, తాను వండుకోగలని చెప్తాడు నరేంద్ర. మర్నాడు ఉదయాన్నే చెరువు గట్టున మార్నింగ్ వాక్ చేసి వచ్చేసరికి అప్పలనర్సయ్య పాలేరు పాలు తీసుకువచ్చి ఇస్తాడు. కాసేపటి అప్పలనర్సయ్య ఏర్పాటు చేసిన పనావిడ వచ్చి, ఇల్లు శుభ్రం చేసి వెళ్ళింది. – ఇక చదవండి.]
మధ్యాహ్నం భోజనం ఐయ్యేక.. నేల మీద బొంత పర్చుకొని నడుము వాల్చాడు నరేంద్ర.
నిజానికి అతడు పగటి పూట పడుకోడు. ఉదయం పొలాలు పరిశీలించి వచ్చేక కాస్తా నలతయ్యాడు. దాంతో నడుము వాల్చాడు.
ఐదు నిముషాలు గడవక ముందే.. నారాయణరావు ఫోన్ చేసాడు.
ఆ కాల్ కు కనెక్ట్ ఐ.. “చెప్పండి నాన్నా.” అన్నాడు నరేంద్ర.
“మేము మీ ఊరి ఫస్ట్ బస్సుకు గురువారం ఉదయం బయలుదేరుతున్నాం. ఏమైనా తీసుకు రావాలా.” అడిగాడు నారాయణరావు.
“ఏమీ వద్దు నాన్న. అన్నీ ఇక్కడే దొరుకుతున్నాయి. పంతులు గారికే పూజా సామాగ్రి పనులను అప్పగించాను. ఆయనే చూసుకుంటానన్నారు. మీరు, అమ్మ రండి. చాలు.” చెప్పాడు నరేంద్ర.
“అలానే. ఇదిగో అమ్మతో మాట్లాడు.” చెప్పాడు నారాయణరావు.
భర్త నుండి ఫోన్ అందుకొని.. “నాన్నా.” అంది పద్మావతి.
“చెప్పు అమ్మా.” అన్నాడు నరేంద్ర.
“భోజనం ఐందా.” అడిగింది పద్మావతి.
“ఆఁ అమ్మా.” చిన్నగా నవ్వుకున్నాడు నరేంద్ర.
“ఏం వండుకున్నావు.” అడిగింది పద్మావతి.
అప్పుడే అటు.. “అమ్మవి అనిపించుకున్నావు.” నారాయణరావు నసగడం నరేంద్రకు వినిపించింది.
“అమ్మా. అన్నం, పప్పుచారు వండుకున్నాను. నువ్వు పెట్టిన ఆవకాయ నంజుకొన్నాను.” చెప్పాడు నరేంద్ర.
“ప్చ్.” నొచ్చుకుంటుంది పద్మావతి.
“పర్వాలేదమ్మా. నాకు బాగుంది. నేను బాగున్నాను.” వెంటనే చెప్పాడు నరేంద్ర.
ఆ వెంబడే.. “ఇటు ఏమీ ఆలోచించ వద్దు. మీ ఆరోగ్యాలు జాగ్రత్తగా చూసుకోండి. నాకు చాలు.” చెప్పాడు.
తర్వాత.. కొన్ని ముచ్చట్ల తర్వాత.. తల్లిదండ్రుల అనుమతితోనే నరేంద్ర కాల్ కట్ చేసాడు.
ఆ పిమ్మట.. అప్పుడే గుర్తొచ్చినట్టు.. శ్రీకర్కు ఫోన్ చేసాడు.
అటు శ్రీకర్ ఫోన్ ఎత్తాడు.
“పొలం నుండి ఇంటికి వచ్చేసావా.” అడిగాడు.
“ఆఁ. లంచ్ కూడా చేసాను.” చెప్పాడు నరేంద్ర.
“ఉదయం నీతో మాట్లాడాలనే చేసాను. నువ్వు పొలంలో ఉన్నావు. తర్వాత నువ్వే ఫోన్ చేస్తానన్నావు. నీ ఫోన్ కోసమే చూస్తున్నాను.” చెప్పాడు శ్రీకర్.
“అవునవును. అందుకే తీరిక కాగానే నీకు ఇప్పుడు చేసాను. బిజీయా.” అడిగాడు నరేంద్ర.
“నేను లంచ్ అవర్లో ఉన్నానులే. చెప్పు.” అన్నాడు శ్రీకర్.
“నేను కాదు. నువ్వే చెప్పాలి. ఉదయం ఫోన్ చేసి ఏదో మాట్లాడాలని నువ్వే అన్నావు.” నరేంద్ర గుర్తు చేసాడు.
“అదే. నీ ఐడియాలజీకి నా పరోక్ష సాయం కోరావుగా. నేను ఆలోచించుకున్నాను.” ఆగాడు శ్రీకర్.
అప్పుడే.. “నిన్నే కాదు. కామేశంని అడిగాను.” చెప్పాడు నరేంద్ర.
“కామేశం ఏమన్నాడు.” టక్కున అడిగాడు శ్రీకర్.
“అతడి నుండి ఇంకా స్పందన అందలేదు. నువ్వు ఏం ఆలోచించుకున్నావో చెప్పు.” అడిగాడు నరేంద్ర.
“నా పెట్టుబడికి ఫైవ్ పర్సంట్ ప్రాఫిట్ చూపుతానన్నావు. సంవత్సరం తర్వాత అడిగిన వెంటనే నా పెట్టుబడిని కూడా చెల్లించేయగలనన్నావు.” చెప్పుతున్నాడు శ్రీకర్.
అడ్డై.. “అవును. అంతే. పక్కా.” చెప్పాడు నరేంద్ర.
“సర్లే. నేను లక్ష మదుపు పెట్టగలను.” చెప్పాడు శ్రీకర్.
“వెల్కమ్. నేను నికరమవ్వగలను. మరో ఆలోచన చేయకు.” నరేంద్ర హామీలా చెప్పాడు.
శ్రీకర్ నిబ్బరమవుతున్నాడు.
“నీ బ్యాంక్ డిటయిల్స్ పంపు. నేను అమౌంట్ ట్రాన్సఫర్ చేస్తాను.” చెప్పాడు.
“నీకు మెసేజ్ పెడతాను.” చెప్పాడు నరేంద్ర.
“అండ్ వాట్ ఎబౌట్ కామేశం.” అడిగాడు శ్రీకర్.
“నిన్నడిగినట్టే కామేశంని అడిగి ఉన్నాను. చెప్పాగా. ఇంకా అటు నుండి స్పందన లేదు.” చెప్పాడు నరేంద్ర.
“మరి. నేను కదప వచ్చా.” అడిగాడు శ్రీకర్.
“వద్దు వద్దు. ఎవరికి ఒత్తిడి వద్దు. తనకే వదిలేస్తున్నాను.” చెప్పాడు నరేంద్ర.
“సరే. టేక్ కేర్.” చెప్పాడు శ్రీకర్.
“నీకు నా బ్యాంకు వివరాలు ఇప్పుడే పంపతాను.” చెప్పాడు నరేంద్ర.
“తప్పక.” అనేసాడు శ్రీకర్.
నరేంద్ర ఫోన్ కట్ చేసేసాడు.
***
సాయంకాలం.. సమావేశం ముగిసేక.. తనను కలిసిన పొలం అమ్మిన వాళ్లు.. అప్పలనరసయ్య తిరిగి వాళ్ల వాళ్ల ఇళ్లకు వెళ్లిపోగా.. నరేంద్ర ఇంటిలోకి వెళ్లాడు. తలుపు మూసుకున్నాడు.
ఎలక్ట్రిక్ స్టౌ మీద రైస్ కుక్కర్ పెట్టాడు.
అంతలోనే అతడి ఫోన్ మోగింది.
కామేశం ఫోన్ చేస్తున్నట్టు గుర్తించి.. కాల్ కలిపి.. “చెప్పు కామేశం.” అన్నాడు.
“నువ్వు ఈ రోజులోగా చెప్పమన్నావుగా. దాని గురించి మాట్లాడదామని.” చెప్పాడు కామేశం.
“చెప్పు.” అన్నాడు నరేంద్ర.
“శ్రీకర్కు ఫోన్ చేసాను. మాట్లాడేను. వాడు లక్ష సర్దుతున్నాడటగా.” ఆగాడు కామేశం.
“అవును.” పొడిగా చెప్పాడు నరేంద్ర.
“నేను అంతే సర్దగలను.” చెప్పాడు కామేశం.
“వెల్కమ్. శ్రీకర్కు లాగే నీకు కూడా రిటర్న్స్ అందిస్తాను.” చెప్పాడు నరేంద్ర.
“సరే. శ్రీకర్ ఆ వివరాలు చెప్పాడు. అలానే కానీ. వాడి నుండి నీ బ్యాంక్ డిటేల్స్ తీసుకున్నాను. నేను ఇప్పుడే లక్ష ట్రాన్స్ఫర్ చేస్తాను.” చెప్పాడు కామేశం.
“థాంక్స్” చెప్పాడు నరేంద్ర.
“సరే.” అనేసాడు కామేశం.
నరేంద్ర కాల్ కట్ చేసేసాడు.
***
గురువారం..
ఉదయం తొమ్మిది పది..
తన తల్లిదండ్రుల చేత భూమి పూజా కార్యక్రమం.. అప్పలనర్సయ్య మరియు తనకు పొలాలు అమ్మిన అసామిల సమక్షంలో క్రమ పద్ధతిన నిర్వహించాడు నరేంద్ర.
ఆ తర్వాత.. అందరికీ మధ్యాహ్నం భోజనాలు పెట్టాడు.. ఆ గ్రామ వంటవాళ్ల సాయంతో.
నరేంద్ర తల్లిదండ్రులు తిరిగి వెళ్తూ.. అక్కడి వారికి తన కొడుకును అప్పగిస్తున్నట్టు మాట్లాడి.. తిరిగి పురం బయలుదేరారు భారంగానే.. బస్సు రాగా.
***
పది రోజులు గడిచాయి.
నరేంద్ర వ్యవసాయం పనులు ఇబ్బడిముబ్బడిగా కొనసాగుతున్నాయి.
అందుకు తను నియమించుకున్న వారంతా ఉత్సాహంగా సహకరిస్తున్నారు.
నరేంద్ర ముందు ముందు అవసరాలకై ముమ్మరంగా పరిశ్రమిస్తున్నాడు. అతడికి అప్పలనర్సయ్య అండ మెండుగా అందుతోంది.
***
ఉదయం.. ఆరు దాటింది..
నారాయణరావు ఫోన్ చేసాడు.
నరేంద్ర ఆ కాల్కి కనెక్ట్ అయ్యాడు.
“చెప్పు నాన్నా.” అన్నాడు.
“నీ మార్నింగ్ వాక్ ఐందా. స్నానం చేసావా.” అడుగుతున్నాడు నారాయణరావు.
“ఇప్పుడే మార్నింగ్ వాక్ ఐంది. స్నానం ఇంకా లేదు.” చెప్పాడు నరేంద్ర.
“పల్లెలో శివాలయం ఉందిగా. వెళ్లి నీ పేరున అభిషేకం చేయించుకో. ఈ రోజున నీ జాతక రీత్యా అభిషేకం జరిపితే మంచిది. ఇది మా విన్నపం.” వేడుకోలులా చెప్పాడు నారాయణరావు.
“అయ్యో నాన్నా. మీరు అంతగా చెప్పాలా. తప్పక చెయ్యించుకుంటాను.” ఒప్పుకున్నాడు నరేంద్ర.
“వ్యవసాయ పనులు ఎలా సాగుతున్నాయి.” అడిగాడు నారాయణరావు.
“అనుకున్న దానికంటే బాగానే కావస్తున్నాయి. ఇక్కడి వారి సహకారం బాగుంది.” చెప్పాడు నరేంద్ర.
“సంతోషం. నువ్వు మాత్రం ఆచి తూచి వ్యవహరిస్తుండు.” చెప్పాడు.
“అలాగే నాన్నా.” ఒప్పుకున్నాడు నరేంద్ర.
“సరే. స్నానం చేసుకో. గుడికి వెళ్లు. పంతులు గారితో ఆ పూజకు కావలసిన వాటిని సమకూర్చుకో.” తొందర పెడుతున్నాడు నారాయణరావు.
“అలాగే. పూజ ముగిసాక నేను ఫోన్ చేస్తాను. సరేనా.” చెప్పాడు నరేంద్ర.
“అప్పుడు అమ్మతో మాట్లాడు వచ్చులే.” చెప్పి.. నారాయణరావు కాల్ కట్ చేసేసాడు.
***
అభిషేకం పూర్తయ్యింది. ప్రసాదంతో గుడి బయటికి వచ్చాడు నరేంద్ర.
చెప్పులు తొడుక్కుంటుండగా..
“నమస్కారం సార్.” అన్న మాటలు తనకు వెనుక మారు నుండి వినిపించగా.. చిన్నగా తల తిప్పి అటు చూసాడు నరేంద్ర.
ఎవరో? ఆమె!
ఆమె తననే చూస్తూ చిన్నగా నవ్వుతోంది.
చెప్పులు పని కాగానే.. ఆమె వైపు పూర్తిగా తిరిగాడు నరేంద్ర.
“నమస్కారం.” అన్నాడు.
“నేను శ్యామల. ఈ ఊరి హైస్కూలుల్లో పదవ తరగతి స్టూడెంట్స్కు మాథ్స్ టీచర్ని.” చక్కగా పరిచయం చేసుకుంది ఆమె.
“ఓ. అలానా.” అనేసాడు నరేంద్ర.
“మీ గురించి మా స్కూల్లో మాట్లొచ్చాయి.” చిన్నగా చెప్పింది శ్యామల.
సన్నగా నవ్వేడు నరేంద్ర.
“మంచి ఉద్యోగం వదిలి వ్యవసాయం చేపట్టారని అనుకుంటున్నారు.” అంది శ్యామల.
ఆ వెంబడే.. “కల్టివేషన్ మీ పాషనా.” ఆసక్తిగా నవ్వుతోంది శ్యామల.
“అట్టిదే.” పొడిగా చెప్పాడు నరేంద్ర.
“ఈ మధ్యనే మిమ్మల్ని చూడగలిగాను. అప్పటి నుండి మిమ్మల్ని కలవాలనుకుంటున్నాను. ఇప్పుడు ఇలా కుదిరింది.” చెప్పుతోంది శ్యామల.
నరేంద్ర అప్పుడు ఆమెను పరిశీలనగా చూసాడు. ఆమె చేతిలోని బుట్ట.. పూలు, ఇతరములతో నిండుగా కనిపించగానే..
“గుడికి వస్తున్నారా.” అడిగాడు.
“అవునవును. మా అమ్మ ఫోన్ చేసి చెప్పింది. ఈ రోజున నా జాతక రీత్యా అభిషేకం చేసుకుంటే నాకు మంచిదట. అందుకే ఇలా వచ్చాను. మీరు కనిపించారు.” కలివిడిగా చెప్పింది శ్యామల.
“అలానా. నేను అందుకే వచ్చాను. నా అభిషేకం ముగిసింది. మీరు వెళ్లండి మరి. వేళ మించుతోంది.” చొరవగా చెప్పాడు నరేంద్ర.
చిన్నగా తలాడించి.. “అవునవును. నేను ఇంకా హైస్కూలుకు వెళ్లాలి.” శ్యామల మెత్తగా నవ్వుతూ అంది.
అక్కడి నుండి గుడి లోకి కదిలింది.
నరేంద్ర కూడా అక్కడ నుండి కదిలాడు నేరుగా తన పొలాల వైపుకు.
***
సాయంకాలం..
వ్యవసాయ పనులు కాగానే.. అప్పలనర్సయ్యను కలిసాడు నరేంద్ర.
తను తనూరు వెళ్తున్నానని, రేపటికి తిరిగి వస్తున్నట్టు చెప్పాడు.
ఆ వెంబడే.. “నేను మీకు ఫోన్ చేసి చెప్తాను. నేను బస్సు దిగేసరికి ఇద్దరు, ముగ్గురు మనుషుల్ని బస్సు దగ్గర ఉన్నట్టు చేయండి. పని సరుకులు కొనుక్కు వస్తాను.” చెప్పాడు.
అప్పలనర్సయ్య ఒప్పుకున్నాడు.
“బాబూ.. రేపు ఆ బోరు పని వాళ్లని కలిసి వస్తారుగా.” వెంటనే అడిగాడు.
“తప్పక. ఆ పని కూడా చక్కపెట్టి వస్తాను.” చెప్పాడు నరేంద్ర.
అప్పలనర్సయ్య గొప్పవుతున్నాడు.
బస్సులాగే చోటు వైపుకు కదిలాడు నరేంద్ర.
(ఇంకా ఉంది)