Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

నరేంద్ర ఐ యామ్ విత్ యు-19

[శ్రీ బివిడి ప్రసాదరావు రచించిన ‘నరేంద్ర ఐ యామ్ విత్ యు’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]

[కొన్ని వారాలయ్యాకా, మళ్ళీ పద్దుల పుస్తకం తీసుకుని శ్యామల ఇంటికి వెళ్తాడు నరేంద్ర. ఆమె వాటిని చూసి, అన్ని సరిగానే ఉన్నాయంటుంది. ఇదంతా మీ ప్రోత్సాహమే అనబోతున్న నరేంద్రని ఆపుతుంది. నరేంద్రకు మిత్రులిచ్చిన అప్పులో చెరో యాభైవేలు తీర్చేసి, వడ్డీ మిగిలిన యాభైవేలకే ఇవ్వమని చెబుతుంది. కొత్త పంటల విషయంలో, ఇతర ఖర్చుల విషయంలో కొన్ని సూచనలు చేస్తుంది. మర్నాడు కోటిని ఎక్కించుకుని పట్నం వెళ్ళి, అతనికి నచ్చిన సైకిల్ కొనిచ్చి, తాను తల్లిదండ్రుల వద్దకు వస్తాడు నరేంద్ర. ఇంట్లో ఓ పూట గడిపి, తిరిగి పల్లెకి వచ్చేస్తాడు. ఓ సాయంత్రం పూట రైతులందరినీ సమావేశపరచి తన ప్రణాళికలు వివరిస్తాడు. క్రాప్ ఇన్సూరెన్స్ చేయిస్తానంటాడు. అందరినీ తనతో కలిసి రమ్మంటాడు. అప్పలనర్సయ్య, రెడ్డప్పనాయుడు తమ తమ రైతుల పక్షాన హామీ ఇస్తారు. సమావేశం ముగుస్తుంది. భోగి పండుగతో సంక్రాంతి వేడుకలు మొదలవుతాయి. పట్నం నుంచి నరేంద్ర తల్లిదండ్రులు, శ్యామల అమ్మానాన్నలు పల్లెకి వస్తారు. పరిచయాలు అయ్యాకా, సంక్రాంతి పండుగ రోజున అందరూ కలిసి భోం చేస్తారు. ఓ పది రోజులయ్యాకా, శివాలయంలో కలిసిన శ్యామల తనకి వేరే ఊరికి బదిలీ అయిందని చెప్తుంది. కాస్త గుంజాటన తర్వాత, తాను ఆమెని ప్రేమిస్తున్నట్టు, పెళ్ళి చేసుకోవాలని అనుకుంటున్నట్టు చెప్పేస్తాడు నరేంద్ర. మంచి రోజు చూసి పెద్దలతో మాట్లాడుదామంటుంది శ్యామల. – ఇక చదవండి.]

రోజులు గడుస్తున్నాయి.

నరేంద్ర పరివేక్షణలో వ్యవసాయ పనులు నిండుగా సాగుతున్నాయి.

అందరిలో ఒకేలా ఉత్సాహం ఉరకలు వేస్తోంది.

ఇక, నరేంద్ర, శ్యామల విషయంకి వస్తే..

ఇద్దరూ ఒకే సమ్మతిన ఏక వచన మాటలకు మారారు. ఇది వరకటి కంటే ఒక ధీమాన మూవ్ అవుతున్నారు.

***

నరేంద్ర శివాలయం వెనుక భాగాన రకరకాల మల్లెలు సాగును ప్రత్యేకంగా చేపట్టాడు. శ్యామల మురిపాలను అనురాగంగా జుర్రుకుంటున్నాడు.

***

మంచి జోష్‌న ఉన్న శ్యామల, నరేంద్ర కూడపలుక్కొని..

అమ్మాజీ చేత తొలుతగా మధ్యస్థ రీతిన మేలి జాతి గేదెలు, ఆవులుతో డయిరీ కేంద్రం మొదలెట్టించారు.

అందుకు అప్పలనర్సయ్య ఒక షెడ్‌ను సమకూర్చి పెట్టాడు.

నరేంద్ర తగు నిపుణుల సహకారం తీసుకున్నాడు.

మొదటగా.. పురంలోని ఒక పాల మార్కెటింగ్ ఏజన్సీతో తమ డయిరీ కేంద్రం పాలు కొనుగోళ్లకు నేరుగా ఒప్పందం కుదుర్చుకున్నాడు.

కొన్నాళ్లు పోయేక తామే స్వంతంగా ఒక పాలు మార్కెటింగ్ ఏజన్సీని నెలకొల్పుకోవాలని.. తమ డయిరీ కేంద్రంని మరింత విస్తృత పర్చుకోవాలని నరేంద్ర గట్టిగా తలచి ఉన్నాడు.

***

నెల రోజుల గడిచాక..

ఓ శుభ ముహూర్తాన..

శివాలయంలో.. ఇరు కుటుంబాల పెద్దలతో పాటు, తమ తమ బంధుమిత్రుల సమక్షంలో.. అప్పలనర్సయ్య, రెడ్డప్పనాయుడు పరివేక్షణలో.. శ్యామల, నరేంద్రల పెళ్లి మహా వేడుగ్గా జరిగింది.

అ తర్వాత..

నరేంద్ర ఉన్న ఇంటిలో కోటి ఉండిపోయాడు.

శ్యామల ఉన్న ఇంటిలోకి నరేంద్ర మారిపోయాడు.

***

శ్యామల ట్రాన్స్‌ఫర్ వచ్చేంత వరకు ఉద్యోగం చేసింది. పిమ్మట.. ఉద్యోగిగా రాజీనామా చేసి నరేంద్ర సహచరిగా పూర్తి స్థాయిన అతడికి తన చేదోడువాదోడుని చేపట్టింది.

***

శ్యామల సూచనల మేరకు..

నరేంద్ర.. ఈ వరసన..

మూడో పంట తర్వాత.. తన ఫ్రెండ్స్ అప్పులను తీర్చేసాడు.

ఐదవ పంట తర్వాత.. తన బ్యాంక్ లోన్‌ని క్లియర్ చేసేసాడు.

మరో బోరు అవసరం లేకుండా అవసరం మేరకు సామాన్య వ్యయాలతో వాన నీటిని ఒడిసి పట్టి.. వాటర్ బ్యాంక్‌లు (నీటి కుంటలు) ను పొలాల చుట్టూ నిర్మించి నిర్వహిస్తున్నాడు.

నీటి పొదుపుకు మరియు కరెంట్ వాడకంకు ప్రత్యేక ఏర్పాట్లును దశల వారీగా ఏర్పర్చుకున్నాడు.

***

క్రమ క్రమంగా అప్పు ప్రమేయం లేని, రాని ఆర్థిక పుష్టిని నరేంద్రకు అలవాటు చేసింది శ్యామల.

***

నరేంద్రతో క్రమ క్రమంగా పల్లె పొలందారులు కలుస్తున్నారు. అతడితో కలిసి పని చేస్తున్నారు.

శ్యామలతో మాట్లాడి..  అవసరాల మేరకు అన్నింటినీ నరేంద్ర చక్కపర్చుకుంటున్నాడు.

పల్లె వాడుక పంటలతో పాటు.. దశలవారీగా తను అనుకున్న కొత్త కొత్త పంటల సాగును చేపడుతున్నాడు నరేంద్ర.

అట్టి కొత్త పంటలను నిల్వాలు చేస్తూ.. మంచి మార్కెట్ రేటు వచ్చేక.. వాటిని అమ్మి.. తను చెప్పిన 75:25 విధంను ట్రాన్స్‌పరెంట్‌గా అమలు పరుస్తున్నాడు. పొలందారుల మన్ననలు పెంచుకుంటున్నాడు.

చిరు ధాన్యాలు సాగును మొదలు పెట్టిన సంవత్సరంలోనే.. వాటిని అమ్మాజీతో కలిసి నరేంద్రే మార్కెట్ రేటుకే కొనుగోలు చేసుకొని.. శ్యామల పరివేక్షణలో.. నిపుణుల సహకారంతో వాటిని ఆరోగ్యకరమైన ఆహార రీతుల్లోకి మారుస్తూ.. సక్రమమైన వ్యవస్థతో  మార్కెటింగ్ చేయుస్తున్నాడు.

***

ముచ్చటగా ఆరేళ్లు గడిచాయి.

ఈ గడిచిన కాలంలో..

నరేంద్ర.. శ్యామల ఓ మగ బిడ్డకు తల్లిదండ్రులయ్యారు. వాడికి ఇప్పుడు రెండేళ్ళ మూడు మాసాలు.

అప్పలనర్సయ్య కోరిక మేరకు.. నరేంద్ర చొరవతో.. తాము మూడేళ్ల క్రితం నెలకొల్పి నిర్వహిస్తున్న ‘ఫుడ్ ప్రోసెసింగ్ యూనిట్’లో పని చేస్తున్న ఇంజనీర్ తో అమ్మాజీకి సంవత్సరం క్రితం పెళ్లయ్యింది.  ప్రస్తుతం అమ్మాజీ నాలుగు నెలల గర్భవతి.

నరేంద్ర కోరిక మేరకు.. అప్పలనర్సయ్య చొరవతో కోటికి పదమూడు నెలల క్రితం పల్లె అమ్మాయితో పెళ్లయ్యింది.

అప్పలనర్సయ్య శివాలయం తోవలో ఉన్న తన స్థలంని ఇవ్వగా.. అందులో తమ అవసరాలకు అనుగుణంగా  ఓ బిల్డింగ్‌ని.. నరేంద్ర.. అమ్మాజీ సమపాళ్ల మొత్తంతో గత యేడాది మొదటిలో నిర్మించుకున్నారు. దాని బేస్‌మెంట్‌ని పార్టిషన్ చేసి.. ఓ భాగంలోకి.. అప్పటి వరకు ఓ షెడ్‌లో ఉన్న తమ  ‘మిల్క్ పేకింగ్ యూనిట్’ని.. రెండో భాగంలోకి.. అప్పటి వరకు అదే షెడ్‌న ఉన్న.. తమ ‘ఫుడ్ ప్రోసెసింగ్ యూనిట్’ని షిప్ట్ చేసుకున్నారు. మెదటి అంతస్తున నరేంద్ర ఫామిలీ.. రెండవ అంతస్తున అమ్మాజీ ఫామిలీ చేరారు. ఆ బిల్డింగ్ దరినే కట్టించబడ్డ ఒన్ పాయింట్ ఫైవ్ బెడ్ రూం హౌస్‌న కోటీ ఫామిలీ చేరింది. ఇది వరకటి చోటునే తమ డయిరీ కేంద్రంను దశల వారీగా విస్తృత పర్చుకుంటున్నారు.

***

శ్యామల సూచన మేరకు..

తొలిసారిగా మీడియా ముందుకు నరేంద్ర రావడంతో..

నరేంద్ర పనితనం.. నరేంద్ర తలంపు గొప్పతనం.. పతాక స్థాయిన ఓ వార్తగా ఉదయం లగాయతు హల్ చల్ చేస్తోంది..

ఆ వార్త..

నరేంద్ర అనే చదువుకున్న ఓ యువకుడు.. ఆరంకెల జీతం అందించే ఉద్యోగంని వదులుకొని.. పల్లె వచ్చి.. మట్టిన కాలు పెట్టాడు. వ్యవసాయం చేపట్టి.. అనతి కాలంలోనే సాగును ఘనంగా, ఆదర్శంగా చేసి చూపుతున్నాడు. పల్లె రైతులను కలుపుకొని సంఘటితత్త్వం చేవ కనపరుస్తున్నాడు. లాభాపేక్ష లేకుండా తనతో కూడిన అందరూ లాభాలార్జించేలా చేసి చూపుతున్నాడు. కొత్త కొత్త మార్పిడి పంటలను, సేంద్రీయ ఎరువులతో, సహజ చీడ నివారణ పద్ధతులతో, ఆరోగ్యకరమైన ఆహ్లాదకరమైన రీతిన మెప్పు పొందే విధాన పండించి చూపుతున్నాడు. వివిధ దశలలో సాంకేతికతని చక్కగా వాడి చూపుతున్నాడు. కరెంట్‌కై సోలార్ సిష్టమ్‌ని.. నీటి వృథాని తగ్గించుకొనుటకు మైక్రో ఇరిగేషన్ పద్ధతిని వినియోగిస్తూ వాటి అవస్యకతని చాటుతున్నాడు. తన పంటలతోనే బలవర్థకమైన ఆహారం రూపొందించి అందుబాటు ధరలతో మార్కెటింగ్ చేయిస్తున్నాడు. చిక్కటి స్వచ్ఛమైన పాలు అందించుటకు తను ఓ డయిరీని నిర్వహిస్తూ.. నాణ్యమైన రీతిన మార్కెటింగ్ చేస్తున్నాడు. అభ్యుదయ అభివృద్ధి బాటలు వేసి చూపుతున్న నరేంద్ర అసామాన్యుడు.. అభినందనీయుడు అని పల్లె సందర్శకులు కొనియాడుతున్నారు. నరేంద్ర చేవ అభిలషణీయం అంటున్నారు.. నరేంద్ర చేత స్వాగతనీయం అంటున్నారు.

(సమాప్తం)

Exit mobile version