Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

నరేంద్ర ఐ యామ్ విత్ యు-18

[శ్రీ బివిడి ప్రసాదరావు రచించిన ‘నరేంద్ర ఐ యామ్ విత్ యు’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]

[రెడ్డప్పనాయుడు కోరిక మేరకు, అప్పలనర్సయ్య సూచనలతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి రెడ్డప్పనాయుడి తరఫు రైతులతోనూ 75:25 పద్ధతిలో కలిసి పనిచేయడానికి నరేంద్ర అంగీకరిస్తాడు. వాణిజ్య పంటలను మాత్రం అమ్మాజీతో కలిసి తానే మార్కెట్ రేట్లకే కొంటాననీ చెప్తాడు. భవిష్యత్తులో తాము డయిరీ కేంద్రం కూడా ఏర్పాటు చేస్తామని, ఆసక్తి ఉన్నవారు చేరవచ్చనీ చెబుతుంది. నరేంద్ర తరఫున తాను పూచీకత్తుగా ఉంటానని అప్పలనర్సయ్య అంటాడు. శ్యామల అందరూ కలిసి సదాశయంతో ముందుకు వెళ్ళాలని అంటుంది. కొద్ది రోజులయ్యాకా, పంటలు బాగా పండుతాయి. రైతులందరూ ఎంతో సంతోషిస్తారు. తాను చేపట్టదలచిన అంశాల గురించి అమ్మాజీ శ్యామలతోనూ, నరేంద్ర తోనూ సంప్రదిస్తుంది. ఓ రోజు ఉదయాన్నే శ్యామల ఫోన్ చేసి, తన తండ్రికి ఆరోగ్యం మళ్ళీ పాడయ్యిందనీ, తాను ఊరు వెళ్ళాలని చెప్తుంది. కోటి సూచన మేరకు ఆమెను తన బైక్ మీద జంక్షన్ వద్ద దింపుతాడు నరేంద్ర. రాత్రి ఫోన్ చేసి, తండ్రి ఆరోగ్యం కాస్త మెరుగయిందనీ, డిశ్ఛార్జ్ చేశారని చెప్తుంది నరేంద్ర. కోటి అడగటంతో, ఆ విషయమే చెప్తాడు నరేంద్ర. కొన్ని నిముషాల తేడాలో ఇద్దరూ నిద్రపోతారు. – ఇక చదవండి.]

కొద్ది వారాల తర్వాత.. ఆదివారం.. సాయంకాలం మూడు..

శ్యామల ఇంటిన నరేంద్ర ఉన్నాడు. పద్దుల పుస్తకం మూసేస్తూ..

“వరి పంట మీది కంటే ఈ మారు పంటల మీది మీ వాటా మొత్తం గణనీయంగా ఉంది. మంచి ఇంప్రూవ్‍మెంట్. గో ఎహెడ్ లైక్ దిస్ ప్లీజ్.” చక్కగా చెప్పింది శ్యామల. తిరిగి తన చేతిలోని పద్దుల పుస్తకాన్ని నరేంద్రకి ఇచ్చింది.

“ఇంతటి ఘనతకు కారణం మీ..” చెప్పుతున్న నరేంద్రకు అడ్డై..

“చాలు చాలు. అవాపండి.” అంది శ్యామల.

ఆ వెంబడే.. “మిగులు కనపడుతోంది.. మీ ఫ్రెండ్స్‌లో ఒకరి అప్పు తీర్చేయవచ్చు.” చెప్పింది.

“అలా చేయనా.” అడిగాడు నరేంద్ర.

“ఊఁ. ఒక పని చేయండి. ఇద్దరికీ పూర్తి వడ్డీలు చెల్లిస్తూ.. ఇద్దరికి చెరో ఏభై వేలు చొప్పున వెనుక్కు ఇచ్చేయండి. ఆ పై ఏభై వేలు చొప్పున అసలు ఉంటుందని చెప్పండి. బాగుంటుంది.” చెప్పింది శ్యామల.

“అలాగే చేస్తాను. ఇప్పుడే ఈ విషయం చెప్పి ఆ డబ్బులు వాళ్లకి పంపించేస్తాను.” చెప్పాడు నరేంద్ర. జేబులోంచి ఫోన్ తీసాడు.

“ఆగండి. అడిగి చేయకండి. గత సారి అసలు ఉంచి వడ్డీలు కట్టించుకున్నారుగా. ఇప్పుడు అదే అంటే..” ఆగింది శ్యామల.

“అదీ పాయింటే.” అనేసాడు నరేంద్ర.

“నిక్కచ్ఛిగా.. పైగా బాగా.. వడ్డీ ముడుతుంటే.. అసలు ఎందుకు వెనుక్కు తీసుకుంటారు. కనుక.. నేను చెప్పినట్టు ఆ డబ్బులను వాళ్లకి ట్రాన్స్‌ఫర్ చేసేసి.. అప్పుడు చెప్పండి ఇద్దరికి విడివిడిగా.. అసలుగా ఏభై వేలే ఉంటుందని. దానికే వడ్డీ ఇస్తానని.” చెప్పింది శ్యామల.

ఆ వెంబడే.. “వచ్చే పంటల వాటా వచ్చేక.. ఆ అప్పును కూడా తీర్చేయండి. బ్యాంక్ లోన్ నెమ్మదిగా తీర్చొచ్చు. సాధ్యమైనంత వరకు అప్పు వద్దు.” చెప్పింది.

నరేంద్ర తలాడించాడు.

అర నిముషం పిమ్మట..

“వాట్ నెక్స్ట్.” శ్యామల చిన్నగా నవ్వుతోంది.

“ఏముంది. కొత్త సాగును చేపట్టాలి. మరింత చేవతో పని చేయాలి.” నరేంద్ర చెప్పాడు.

“కొత్తవారు కలవబోతున్నారు. అలానే అమ్మాజీ మరి ఆగదు. తన పనిని ఒక వంక చూస్తుండాలి. మరి తప్పదు. దిగేక వెనుక్కు తగ్గకూడదు. ముందుకు శ్రద్ధతో నడవడమే. అనుకున్నది సాధించి చూపాలి.” శ్యామల ఉత్తేజపరుస్తోంది.

‘చేసి చూపుతాను’ అన్నట్టు తన కుడి చేతి పిడికిలిని బిగించి కదిపాడు నరేంద్ర.

“మీ పట్ల నాకు ఆ విశ్వాసం ఉంది.” చెప్పింది శ్యామల.

“థాంక్స్. బట్.. మీ కో-ఆపరేషన్ ఇలానే నాకు అందుతుండాలి.” అన్నాడు.

“నాదేముందండీ. అంతా మీ కృషి.. మీ చేవ.. అంతే.” అనేసింది శ్యామల.

“నేను అలా అనుకోలేను.” చెప్పాడు నరేంద్ర. చిన్నగా నవ్వేసింది శ్యామల.

“అన్నట్టు. ఈ పంట బాగా ఉంటే.. కోటికి సైకిల్ కొనిస్తానని చెప్పాను.” అప్పుడే గుర్తు వచ్చినట్టు చెప్పాడు నరేంద్ర.

“అవునా. సైకిలేగా.. మోటర్ సైకిల్ కాదుగా.” వెటకారం అగుపర్చింది శ్యామల.

“లేదు లేదు. మామూలు సైకిలే.” తడబడ్డాడు నరేంద్ర.

“ఎంతవుతుందేమిటి.” శ్యామల పెడసరం చూపింది.

సుమారు ఖరీదు చెప్పగలిగాడు నరేంద్ర.

“అన్నారుగా. ఇచ్చేయండి.” అంది శ్యామల. అప్పుడు తను నరేంద్రని సూటిగా చూస్తోంది.

ఆ వెంబడే.. “ఇలాంటివి ఇకపై తగ్గించండి. కూడబెట్టుకొనే ఒబ్బిడిని చేపట్టండి.” చెప్పింది.

నరేంద్ర.. ‘సరే’ అన్నట్టు తలాడించేసాడు.

“మనం ఒక సమావేశం ఏర్పర్చుకోవాలనుకున్నాం. అది ఒకటి, రెండు రోజుల్లో నిర్వహిద్దాం. మనం అనుకున్నవి పొలందారులందరికీ చెప్పండి. అది వాళ్లని ఉత్తేజపరుస్తోంది. తద్వారా మీ ధ్యేయం వాళ్లకి అర్ధమవుతోంది. వాళ్లు తప్పక మీకు సహకరిస్తారు. మీతో కలిసి నడుస్తారు.” చెప్పింది శ్యామల.

“అప్పలనర్సయ్యగారితో మాట్లాడి వెంటనే సమావేశం నిర్వహిస్తాను.” చెప్పాడు నరేంద్ర.

“రెడ్డప్పనాయుడును కలవండి. వాళ్లే ముఖ్యంగా రావాలి.” చెప్పింది శ్యామల.

‘సరే’ అన్నాడు నరేంద్ర.

పిమ్మట..

ఆ కబుర్లు.. ఈ కబుర్లు అయ్యేక.. నరేంద్ర ఇంటికి బయలు దేరాడు పద్దుల పుస్తకంతో.. బైక్ మీద.

***

మర్నాడు.. నరేంద్ర.. కోటిని వెనకెక్కించుకొని.. బైక్ మీద పురం వెళ్లాడు. కోటి ఎంపిక చేసుకున్న సైకిల్‌నే కొనుగోలు చేసి అతడికి అందించాడు. కోటి సంబరపడ్డాడు.

సైకిల్‌ని బస్సు మీదకెక్కించి.. కోటిని తిరిగి పల్లెకు అదే బస్సులో పంపించేసాడు. తను.. తన తల్లిదండ్రులని కలిసి.. తిరిగి బైక్‌తో పల్లెకు పయినమయ్యాడు.

ఆ రాత్రి.. శ్యామలతో ఈ విషయాలను ఫోన్ ద్వారా చక్కగా ముచ్చటించాడు.

***

మర్నాడు.. సాయంకాలం ఐదింటికి.. హైస్కూలు ముందు స్థలంలో అప్పలనర్సయ్య చొరవతో, రెడ్డప్పనాయుడు సహకారంతో.. నరేంద్ర ఆ ఊరి వారిని రప్పించుకొని ఒక సమావేశం నిర్వహిస్తున్నాడు.

హెడ్ మాస్టార్ పర్మిషన్ తీసుకొని శ్యామల హాజరై ఉంది. ఆమెతో పాటు అమ్మాజీ ఉంది. కోటి సరేసరి. అతడే అంతటా కలయ తిరుగుతూ ఉన్నాడు.

నరేంద్ర మాట్లాడుతున్నాడు..

“మేలైన పంట సాగుకై ఇప్పటి వరకు నాతో కలిసి వచ్చిన వారు చక్కగా సహకరించారు.. శ్రమించారు.. ఉభయత్రా మేలుకై నేను సాయపడ్డాను.. పరిశ్రమించాను. కలిసి మంచి ఫలితాలు పొందాం. మీరు వాటన్నింటినీ చూసారు కూడా.

నేను చక్కని అభివృద్ధిని ఇలానే మరింత మందిని కలుపుకుంటూ.. మీ అందరితో కలిసి సాధించాలని ఆశిస్తున్నాను.

పంటలపై అనుభవం ఉన్న వాళ్లని, మన ఊరి పొలాలు తెలిసిన వాళ్లని, నిపుణులను కలిసి కూలంకషంగా మాట్లాడేను. మనకు చెరువు నీళ్లు, బోరు నీళ్లు అందుబాటున ఉన్నాయి. నీళ్లు వృథా పోకూడదని కాలువల ద్వారా కాకుండా ప్లాస్టిక్ పైపులు ప్రస్తుతానికి కొనుగోలు చేస్తున్నాను. అలాగే మరిన్ని పొలాలు చేరుతున్నాయి కనుక.. మరో బోరు అవసరమైన చోట వేయిస్తాను.

చెప్పాగా. కొత్త కొత్త విధాలను ప్రవేశపెడుతూ మనం సమిష్టిగా అభివృద్ధి అవుదామని. నేను బాగా తర్కించుకొనే ఈ కొత్త కొత్త పంటలు వైపు మొగ్గాను. ఇవి మనకు మంచి మొత్తాలను అందిస్తాయని గట్టిగా నమ్ముతున్నాను.

నాది మరో భరోసా.. రాబోవు పంటల లగాయితు మన పంటలను క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్‌లో పెడుతున్నాను. పంట భీమా అనేది వ్యవసాయ ఉత్పత్తిదారులకు ఒక గొప్ప భరోసా. అనావృష్టి.. అతివృష్టి లాంటి ప్రకృతి వైపరీత్యాలతో కలిగిన నష్టాల్ని ఇది పూడ్చుతోంది. వ్యవసాయ ఉత్పత్తిదారులైన మనలాంటి వారికి ఇది దన్నుగా నిలుస్తోంది. పంట ఫలితం చేతికి అందించే వరకు ఇది మనకు ఒక రక్షణగా నిలుస్తోంది.

ఇదే కాదు.. ఇట్టివి నాతో పాటుగా మీకు కూడా.. నాతో కలిసి వస్తున్నందుకు మీకు పరిచయం చేస్తుంటాను. మీకు ఒక అండగా నిలుస్తుంటాను. అందుకు నాకు మీ చేయూత అవసరం.

నాది స్వార్థం లేని సేవ. ముందు ముందు మీరే అది గ్రహిస్తుంటారు.

మనం సమిష్టిగానే ఎన్నెన్నో సాధిద్దాం. చక్కగా అభివృద్ధి మార్గాన పయినిద్దాం. అందుకు నా సాయం మీకు పక్కా సముచితంగా అందిస్తుంటాను.

అవసరార్ధం మన మేలుకు కావలసినవి నేను సమకూర్చగలను. నా సాంకేతికతతో నేను.. మీ శ్రమదానంతో మీరు.. ఒకరికి ఒకరంగా కలిసి నడుద్దాం. ప్రగతి సాధిద్దాం.

అప్పలనర్సయ్యగారింటిన జరిగిన సమావేశంలో చెప్పినవి చెప్పినట్టు చేసి పెడతాను.

దయచేసి రండి.. నాతో కలిసి పనిచేయండి.

మనం కలిసి కట్టుగా సామూహిక ఫలితాలు ఎంత గొప్పవో చేసి చూపుదాం. ఆదర్శంగా నిలుద్దాం.”

నరేంద్ర చెప్పడం ముగిసాక.. రెడ్డప్పనాయుడు లేచి మాట్లాడేడు.

“నేను ప్రత్యేకంగా మాట్లాడేది ఏమీ లేదు. నరేంద్ర బాబుతో కలిసి పని చేయడానికి మేము సిద్ధం. మా పొలాల్లో సాగు కూడా బాబు పద్ధతిలోనే సాగాలని కోరుకుంటున్నాం. ప్రతి దానికి బాబు మాటతోనే ఉంటాం. ఇది మా గ్రామ దేవత సాక్షిగా మా అందరి తరపున చెప్పుతున్నా.. మీ అందరి మధ్య మాట ఇస్తున్నాను.”

అప్పలనర్సయ్య లేచాడు.

“మేము నరేంద్ర బాబు పనితనం కళ్లారా చూసాం. ఇన్నాళ్లూ మనం పండించ లేనిది బాబు రెండు పంటలతో ఘనంగా చేసి చూపించారు. వీరితో కలిసి పని చేస్తే రాబోవు కాలంలో మనం ఎంతో.. ఎంతెంతో ఎదిగి తీరుతాం. ఇది నా గట్టి నమ్మకం. రండి.. గతాన్ని మరిచి.. బాబుతో కలిసి నడుద్దాం. బాబు మీద గురి ఏర్పడింది. వీరు చెప్పింది తప్పక చేసి చూపగలరు.” చెప్పాడు.

ఆ తర్వాత.. ‘రేపటి నుండే పనులు మొదలెడదాం’ అని అంతా అనుకున్నాక.. ఆ  సమావేశం సాఫీగా ముగిసింది.

***

నరేంద్ర పట్టు మేరకు.. భోగి పండుగతో సంక్రాంతి వేడుకలు ఆ ఊరిలో మూకుమ్మడిగా మొదలయ్యాయి.

నరేంద్ర కోరిక మేరకు.. అతడి తల్లిదండ్రులు అతడింటికి వచ్చారు. శ్యామల  తన తల్లిదండ్రులును తనింటికి రప్పించుకుంది.

నరేంద్ర.. తన తల్లిదండ్రులుకు, తనకు, కోటికి కొత్త బట్టలు కొన్నాడు. శ్యామల సుతిమెత్తని వారింపుతో ఆమెకు కొత్త బట్టలు ఇచ్చే ఆలోచన విరమించుకున్నాడు నరేంద్ర.

భోగి నాడు ఎవరి ఇళ్లల్లో వాళ్లు భోజనాలు కానిచ్చేసారు. సంక్రాంతి నాడు అప్పలనర్సయ్య సౌజన్యముతోను..

కనుము నాడు రెడ్డప్పనాయుడు సౌజన్యముతోను.. హైస్కూలు ప్రాంగణంన మధ్యాహ్నం పూట ఊరందరికీ వేడుకగా భోజన కార్యక్రమాలు నిర్వహింపబడ్డాయి.

సంక్రాంతి రోజు సాయంకాలంన నరేంద్రను ఇంటికి రప్పించుకొని అప్పలనర్సయ్య కొత్త బట్టలు పెట్టాడు, అమ్మాజీతో పాటుగా. మొదటి భోజన కార్యక్రమం రోజున తన తల్లిదండ్రులకు శ్యామలని.. ఆమె తల్లిదండ్రులను పరిచయం చేసాడు నరేంద్ర. అంతకు ముందు అప్పలనర్సయ్య కుటుంబాన్ని తన తల్లిదండ్రులకు పరిచయం చేసాడు.

శ్యామల కోరిక మేరకు.. కనుము రోజు సాయంకాలం.. నరేంద్ర తన తల్లిదండ్రులను తీసుకొని శ్యామల ఇంటికి వెళ్లాడు.

పండుగ మూడు రోజులతో ముందు వెనుక రోజులు కలుపుకుంటే.. ఐదు రోజుల పాటు ఆ ఊరు కళకళ లాడింది.

ఆ తర్వాత గాలి తీసిన బెలూన్‌లా సదా పనుల్లో పడింది.

***

పది రోజుల తర్వాత.. ఆదివారం.

శ్యామల సూచన మేరకు.. సాయంకాలం ఐదింటికి.. శివాలయం వద్దకు వచ్చాడు నరేంద్ర. అంతలోనే శ్యామల కూడా వచ్చింది.          మండపంన.. ఆ ఇద్దరూ కూర్చున్నారు.

“ఫోన్‌లో కాదు. ముఖాముఖీగా మాట్లాడాలి అన్నారు. ఏంటంటా.” అడిగాడు నరేంద్ర.

“నాకు రాబోవు విద్యా సంవత్సరంన బదిలీ రావచ్చు.” చెప్పింది శ్యామల.

“అంటే..” నరేంద్ర నొసలు చిట్లించాడు.

“ఈ హైస్కూలు నుండి మరో హైస్కూలుకు నన్ను ట్రాన్స్‌ఫర్ చేయవచ్చు.” చెప్పింది శ్యామల.

“అంటే.. ఊరు మారిపోవాలా.” నరేంద్ర అయోమయమవుతాడు.

“ఆఁ. అవును.” అనేసింది శ్యామల.

చప్పబడ్డ నరేంద్ర తేరుకోడానికి కొంత సమయం పట్టింది. ఆ లోపున శ్యామల.. అతడినే చూస్తూ ఉంది.

తెములుకుంటూ.. “వద్దు. వెళ్లకండి. ఇక్కడే ఉండిపోండి.” చెప్పాడు నరేంద్ర.

“అలా ఐతే నేను ఉద్యోగం వదులుకోవాలి.” చిన్నగా చెప్పింది శ్యామల.

“ఇక్కడ ఉండిపోండి.” నరేంద్ర గందికయ్యాడు.

“ఇక్కడ.. ఎలా ఎక్కడ ఉండేది.” శ్యామల ప్రశ్నించగలిగింది.

నరేంద్ర ఏమీ చెప్పలేక పోతున్నాడు.

“ఉద్యోగం లేకుండా ఇక్కడ ఉండడం నాకు కుదరదుగా.” చెప్పింది శ్యామల. ఆమె అతడ్నే చూస్తోంది.

“మీరు లేకపోతే.. నేను.. నేను ఏమీ చేయలేనేమో.. ఏమో ఏంటి. చేయలేను.” నరేంద్ర జావ మాదిరీ ఐపోతున్నాడు.

శ్యామల అతడినే చూస్తోంది.

“ప్లీజ్.” నరేంద్ర బతిమలాట మొదలెట్టాడు.

శ్యామల కల్పించుకుంటూ..

“ఫోన్‌లు ఉన్నాయి. మనం మాట్లాడుకోవచ్చు.” మెల్లిగా చెప్పింది.

“లేదు. అలా వద్దు.” నరేంద్ర గుణుస్తున్నాడు. శ్యామల వెంటనే ఏమీ అనలేదు. అతడినే చూస్తోంది.

నరేంద్ర కళ్లల్లో నీళ్ల తచ్చాటను తను గమనించాక.. ‘అతడి అవస్థని చక్క పెట్టాలి’ అనుకుంది.

“నన్ను మీరు ప్రేమిస్తున్నారా.” అడిగేసింది.

నరేంద్ర త్రుళ్ళిపడ్డాడు. శ్యామలని చూసాడు. ఆమె అతడినే చూస్తోంది. నరేంద్రే చూపు మార్చుకుంటూ.. “మిమ్మల్ని ఆరాధిస్తున్నాను.” చెప్పాడు.

ఎంతకీ శ్యామల మాట్లాడక పోయేసరికి.. తలెత్తి.. ఆమెను చూసాడు నరేంద్ర.

అప్పుడే.. “ఆరాధన ప్రేమ కాదా.” శ్యామల కనుబొమలు ఎగరవేసింది.

నరేంద్ర తడబడిపోతున్నాడు.

“చెప్పండి.” రెట్టించింది శ్యామల.

నరేంద్ర గుటకేసి చెప్పాడు “మీరంటే.. భయం.”

“నేను దెయ్యాన్నా.” శ్యామల అడిగింది.

“అయ్యో. కాదు కాదు. మీరు దేవత.” గబుక్కున చెప్పాడు నరేంద్ర.

“మరి భయం ఏమిటి.” శ్యామల గమ్మత్తుగా అడిగింది.

“అదే. అదే. అబ్బ. భయం కాదు. భక్తి.” నరేంద్ర తడబడిపోతున్నాడు.

శ్యామల రెచ్చకొట్టేలా.. “భక్తి ప్రేమే కదా.” అంది.

నరేంద్ర తల గొక్కుంటాడు.

అప్పుడే.. “చెప్పండి.” శ్యామల మళ్లీ రెట్టించింది.

“ప్రేమే.” నరేంద్ర అనేసాడు.

“అంటే.. మీరు నన్ను ప్రేమిస్తున్నారు.” అనేసింది శ్యామల.

నరేంద్ర తల్లకిందులవుతున్నాడు.

శ్యామల ‘హర్ట్ అవుతుందా.’ ప్రశ్నించుకున్నాడు.

“సరే. మీరు చెప్పలేరు కానీ.. నేనే చెప్పేస్తాను.” శ్యామల ఆగింది. నరేంద్ర ఆమెను చూస్తున్నాడు.

“నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. నేను మీతో ఉండగలను.” చెప్పేసింది శ్యామల.

“అవునా. థాంక్సండీ.” భళ్లున అనేసాడు నరేంద్ర.

“అందుకు మనం పెళ్లి చేసుకోవాలి.” చెప్పింది శ్యామల.

“అది నా భాగ్యం అనుకుంటాను.” చెప్పాడు నరేంద్ర.

“అంటే.. నా అభిప్రాయాలతో నేను మీకు భాగ్యం కాదా.” శ్యామల చిరు కోపం అగుపరుస్తోంది.

“అరె. అది కాదు. అలా కాదు.” నరేంద్ర తంటాలు పడుతున్నాడు.

“అయ్యో.. మెతక మారాజా.” బయటికే అంది శ్యామల. నెత్తికి ఇరువైపుల అర చేతులు మడిచి పెట్టి మెటికలు విరుచుకొంది.

నరేంద్ర దూదిలా తేలిపోతున్నాడు.

“చీకటి పడుతోంది. వెళ్దాం పదండి.” లేచింది శ్యామల.

నరేంద్ర కూడా కదిలాడు.

బైక్‌ని చేరారు.

దార్లో.. “ట్రాన్స్‌ఫర్ వస్తే.. ఉద్యోగం వదిలేస్తాను.” చెప్పింది శ్యామల.

“ఇప్పుడే మానేయవచ్చుగా.” చెప్పాడు నరేంద్ర.

“ఇప్పుడే పెళ్లి చేసుకోవచ్చుగా.” తమాషాగా అంది శ్యామల.

“వైనాట్. పెద్దలతో మాట్లాడేద్దామా.” నరేంద్ర హుషారయ్యాడు.

“మంచి రోజున మాట్లాడేద్దాం.” చెప్పింది శ్యామల.

“ఆ మంచి రోజు మీరే చెప్పాలి.” అన్నాడు నరేంద్ర.

“చిత్తం. మీరు నాకు కావాలిగా.” సరదాపడుతోంది శ్యామల.

నవ్వుకున్నాడు నరేంద్ర.

ఆ బైక్ శ్యామల ఇంటి వైపుకు పోతోంది.

(ముగింపు వచ్చే వారం)

Exit mobile version