Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

నరేంద్ర ఐ యామ్ విత్ యు-17

[శ్రీ బివిడి ప్రసాదరావు రచించిన ‘నరేంద్ర ఐ యామ్ విత్ యు’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]

[ఆ మధ్యాహ్నం తెలుగు మాస్టారింటి ఫంక్షన్‌కి వెళ్తాడు నరేంద్ర. ఆయన నరేంద్రను ఆహ్వానించి, కూర్చోబెట్టి కొబ్బరి బొండాం ఇప్పించి వెళ్తాడు. శ్యామల ఇంకా రాలేదు. అప్పటికే కొంతమంది భోంచేస్తూ ఉంటారు. వారిలో అప్పలనర్సయ్య కుటుంబం కూడా ఉంది. వాళ్ళు నరేంద్రని చూడలేదు. కాసేపయ్యాకా శ్యామల వచ్చి నరేంద్రని పలకరిస్తుంది. మరో కుర్చీ తెచ్చుకుని నరేంద్ర పక్కన వేసుకుని కూర్చుంటుంది. కాసేపు మాట్లాడుకుంటారు. ఆమె తెచ్చిన కవర్ చూసి, బట్టలు పెడుతున్నారా అని అడుగుతాడు నరేంద్ర. అవునంటుంది. ముందుగా చెప్తే, తానూ బట్టలు పెట్టేవాడినని అంటాడు. నరేంద్రని కూడా ఫంక్షన్‍కి పిలుస్తారని అప్పటికి తనకి తెలియదని అంటుంది శ్యామల. కొంతసేపయ్యాకా, ఓ వ్యక్తి వచ్చి తన పేరు రెడ్డప్పనాయుడు అని పరిచయం చేసుకుని నరేంద్రతో మాట్లాడాలని అంటాడు. కాస్త దూరంగా ఉన్న ఓ బల్లని చూపించి, అటు కదులుతాడు. ఆయన ఊరి పంచాయతి ప్రెసిడెంట్ సయ్యమ్మ భర్త అని చెప్తుంది శ్యామల. వెళ్ళి ఆయన్ని కలుస్తాడు నరేంద్ర. అప్పలనర్సయ్య తదితరులతో నరేంద్ర చేస్తున్న వ్యవసాయం గురించి తాము విన్నామనీ, తాము కూడా వాళ్ళతో కలుద్దామని అనుకుంటున్నామని అంటాడు రెడ్డప్పనాయుడు. నరేంద్ర శ్యామల వైపు చూస్తాడు. మీరు వాళ్ళకెలా ఇస్తున్నారో మాకూ అలానే ఇవ్వండి అంటాడు రెడ్డప్పనాయుడు. ఇంతలో తెలుగు టీచర్ వచ్చి ఆయనని పలకరించి, భోజనానికి వస్తారా అని అడిగితే, తమ వాళ్ళు రావాలి, తర్వాతి పంక్తిలో తింటామని అంటాడు. శ్యామల, నరేంద్ర భోజనానికి వస్తారు. వాళ్ళు భోజనానికి వెళ్తుంటే, అప్పలనర్సయ్య ఎదురై, రెడ్డప్పనాయుడితో ఏం మాట్లాడారు అని అడుగుతాడు. మనతో కలుస్తామని అంటున్నాడని చెప్తాడు నరేంద్ర. తర్వాత మాట్లాడుకుందామని చెప్పి భోజనానికి వెళ్తాడు నరేంద్ర. ఆ సాయంత్రం శ్యామల, నరేంద్ర అప్పలనర్సయ్య ఇంటికి వెళ్తారు. అమ్మాజీ చేయాల్సిన పనుల గురించి ఆమెకి అర్థమయ్యేలా చెప్తారు. తరువాత మాటల్లో రెడ్డప్పనాయుడి ప్రస్తావన వస్తుంది. అతని గురించి చెప్తాడు అప్పలనర్సయ్య. విభేదాలు తొలగించుకుని అందరూ కలిసి పనిచేద్దామని ప్రతిపాదిస్తాడు నరేంద్ర. దారిలో తనని శివాలయానికి తీసుకువెళ్ళమని అడుగుతుంది శ్యామల. గుడికి వెళ్ళి దండం పెట్టుకుని ఎవరిళ్ళకి వారు వెళ్తారు. – ఇక చదవండి.]

ప్పలనర్సయ్యకు చెప్పి.. మొదట సోములును తీసుకొని వెళ్లి.. రెడ్డప్పనాయుడుని కలిసాడు నరేంద్ర.

అలా రెండు దఫాలు వాళ్లిద్దరూ కలిసి మాట్లాడుకున్నాక..

రెడ్డప్పనాయుడు కోరిక మేరకు.. సయ్యమ్మతోనూ నరేంద్ర సమావేశమయ్యాడు.

ఆ పిమ్మట.. ఒక రోజున..

నరేంద్ర సూచన మేరకు.. అప్పలనర్సయ్య ముందస్తు చొరవతో.. రెడ్డప్పనాయుడు తన మనుషులతో కలిసి అప్పలనర్సయ్య ఇంటికి తుది మాటలకై వచ్చాడు.

దానికి శ్యామల, అమ్మాజీ హాజరై ఉన్నారు.

నరేంద్ర సూచన మేరకు.. కోటి కూడా అక్కడ కూర్చున్నాడు.

ఎట్టి తర్జనభర్జనలకు తోవివ్వక.. 75:25 పద్ధతినే నరేంద్రతో కలిసి తన వాళ్ల పొలాలతో పాటు.. తన పొలాలను కలుపుకు పని చేయుటకు రెడ్డప్పనాయుడు ఒప్పుకోవడయ్యింది.

ప్రస్తుత పెసలు, మినుములు పంటల తర్వాత.. రాబోవు పంటల నుండి వాళ్లని కలుపుకొని పని చేయుటకు నరేంద్ర సిద్ధమయ్యాడు. ఇప్పటి వారికి తన నుండి అందేవే అప్పటి నుండి రెడ్డప్పనాయుడు వాళ్లకి తన నుండి అందుతాయని చెప్పాడు.

వాణిజ్య పంటలను మాత్రం పూర్తిగా అమ్మాజీతో కలిసి తానే అప్పటి మార్కెట్ రేట్లకే పారదర్శకతన కొనుగోలు చేసుకుంటానని, ఆ పంట వాటాలను డబ్బు రూపానే ఆయా పొలందారులకు ఒప్పంద ప్రకారం అందిస్తానని చెప్పాడు.

అమ్మాజీ మాట్లాడుతూ.. రాబోవు రోజుల్లో తాము డయిరీ కేంద్ర నిర్వహణ కూడా చేపడతామని.. సమ్మతి తెల్పిన వారిని దానిలో సరైన రీతి ప్రకారం భాగస్వాములుగా చేర్చుకుంటామని చెప్పింది.

అప్పలనర్సయ్య మాట్లాడుతూ.. తన పెద్దరికాన్ని, వీటన్నింటికీ తాను పూచీదారుడని గట్టిగా ప్రకటించాడు.

చివరిగా శ్యామల మాట్లాడుతూ.. నన్ను, అమ్మాజీని కలుపుకుంటూ అప్పలనర్సయ్యగారితో సావధానంగా చర్చించేకునే నరేంద్ర గారు వీటన్నింటికి సిద్ధపడ్డారు. అతను మంచి ఆశయంతో ముందుకు వెళ్తున్నారు. మీరు అతనితో కలవండి. రాబోవు కొద్ది రోజుల్లోనే మీరు ఊహించలేని ఫలితాలను అందుకుంటూ ఉంటారు. ఇది ఒక బాధ్యత ఎరిగిన మనిషిగా నేను హామీ ఇస్తున్నాను. కలిసి నడిస్తేనే అవలీలగా సుఖం పొందగలమని చెప్పింది.

ఆ తర్వాత.. ఆ సమావేశం చక్కటి తేనీటి విందుతో సరదాగా ముగిసింది.

***

కొద్ది వారాల తర్వాత..

తన సహచరులును కలుపుకొని గట్లు వెంబడి పొలాల చుట్టూ తిరుగుతున్నాడు నరేంద్ర.

చిక్కటి పాల మీగడ కప్పినట్టు వాళ్లకి తమ పొలాలు కనిపిస్తున్నాయి.

“విత్తనం మంచిది. ఏపైన మొక్క వచ్చింది. పూలు చూస్తుంటే పొడుగాటి బలమైన కాయలే వస్తాయి. పొల్లు లేని గింజే దక్కుతోంది.” చెప్పాడు కోటి.

అంతా మరింత పొంగారు.

“నిపుణుల సూచనలు ఫలించాయి. వరికి కొద్ది మొత్తంగానైనా రసాయనిక ఎరువులు వాడించారు. ఈ పెసలు, మినుములు పంటకు పూర్తిగా సేంద్రీయ ఎరువులే వాడించారు. పైగా వీటికి ఎట్టి మందులు పిచికారి ఇంత వరకు కానీయలేదు.” నరేంద్ర వివరించాడు.

“మరే. మావన్నీ ఆకాశం చూసి పండించే పంటలే. ఇప్పుడు సరైన నాథుడిలా మీరు మాకు దక్కారు.” అప్పలనర్సయ్య గొప్పైపోతున్నాడు.

“అవునవును. నరేంద్ర బాబు ఘటికులు.. ఘనులు.” మిగతా పొలందారులు సంతోషంగా వంతు పాడారు.

ఈ గడిచిన కొద్ది వారాల్లోనే..

అప్పుడప్పుడు అనుకొని శివాలయం వద్ద నరేంద్ర, శ్యామల ప్రత్యక్షంగానూ.. పరోక్షంగా ఫోన్‌ల ద్వారా పొందికగా ముచ్చట్లాడుకున్నారు.

రెండు మార్లు విడి విడిగా నరేంద్రతోను, శ్యామలతోను.. ఒక మారు కాన్ఫరెన్స్ కాల్ తోనూ అమ్మాజీ తాము చేపట్ట తలచిన అంశాల గురించి చర్చించింది.

ఎలక్ట్రికల్ లైన్ ఒకటి నరేంద్ర వేయించిన బోరు చోటు వరకు వచ్చింది. ఈ చర్యకు కోటి పట్టుదలతో పాటు సయ్యమ్మ చొరవ కూడా తోడయ్యింది.

***

ఉదయం..

ఏడు నలభైమూడవుతోంది.

అప్పుడే శ్యామల నుండి ఫోన్ కాల్ వస్తోంది.

ఆ కాల్‌కి కనెక్టై . “ఏంటీ ఈ వేళప్పుడు. ఆల్ ఆర్ ఓకే.” నరేంద్ర ఆత్రమవుతున్నాడు.

“ఇప్పుడే ఇంటి నుండి ఫోన్ వచ్చింది. నాన్నకి మళ్లీ బాగోలేదట. రాత్రి హాస్పిటల్‌లో పెట్టారట. నన్ను అమ్మ రమ్మంటుంది.” శ్యామల హైరాన పడుతోంది.

“అరె. గాభరా వద్దు. పదిన్నర వరకు బస్సు రాదు. ఎలా.” కంగారవుతున్నాడు నరేంద్ర.

కాఫీ కలుపుతున్న కోటి.. నరేంద్ర వాలకం గుర్తించాడు.

“ఆలోగా స్కూలుకు పోయి లీవ్ లెటర్ ఇచ్చి.. నేను వెళ్లడానికి సిద్ధమవుతాను.” చెప్పుతోంది శ్యామల.

“ఊఒం. అలానే చేయాలి.” అనేసాడు నరేంద్ర.

ఆ కాల్ కట్ అయ్యింది.

అప్పుడే.. “ఏమైంది సార్.” కోటి అడిగాడు.

నరేంద్ర చెప్పాడు.

“మేడమ్ ఊరు ఇక్కడికి ఎంత దూరం.” కోటి అడిగాడు.

“తెలియదు.” నరేంద్ర బేలయ్యాడు.

“మీ ఊరు దూరమైతే బైక్ మీద వెళ్లొచ్చు.” సలహాలా అన్నాడు కోటి.

“అవునా. కానీ ఇంకా దూరంలా ఉంది.” అనేసి.. శ్యామలకి వెంటనే నరేంద్ర ఫోన్ చేసాడు.

అటు శ్యామల కాల్‌కి కనెక్టు కాగానే..

“ఇక్కడికి మీ ఊరు ఎంత దూరం.” టక్కున అడిగాడు నరేంద్ర.

శ్యామల లెక్క కట్టుతున్నట్టు.. “ఇక్కడ బస్సు ఎక్కి.. జంక్షన్‌లో దిగి.. అక్కడ మా ఊరి బస్సు ఎక్కాలి..” అంటుండగా..

అడ్డై.. “మీరు తిరుగుతున్నారుగా మొత్తం ఎంత సమయం పడుతోంది.” అడిగాడు నరేంద్ర.

శ్యామల సుమారుగా.. “జంక్షన్‌కు అరగంట పడుతోంది. అక్కడ నుండి..” చెప్పుతోంది.

అడ్డై..”ఆ జంక్షన్ నుండి మీ ఊరికి బస్సులు ప్రీక్వంట్‌గా ఉంటాయా.” గబుక్కున అడిగాడు నరేంద్ర.

“ఆఁ. అది జంక్షన్ పాయింట్. మా ఊరి వైపుకు ఏదో ఒక బస్సు ప్రతి పది నిముషాలకి ఉంటుంది.” చెప్పింది శ్యామల.

“అవునా. ఐతే నేను వస్తాను. ఆ జంక్షన్ వద్దకి మిమ్మల్ని నా బైకు మీద చేరుస్తాను. ఇక్కడి టైం వేస్ట్ మీకు ఉండదు మరి.” నరేంద్ర హుషారయ్యాడు.

అతడి మాటలు విన్న కోటి చిన్నగా నవ్వుకున్నాడు.

“మీరు రడీగా ఉండండి. నేను పావుగంటలో వచ్చేస్తాను. తెలుగు మాస్టార్‌కి మీ లీవ్ లెటర్ అందించేసి.. మిమ్మల్ని ఆ జంక్షన్ వద్దకు తోడ్చుకు పోతాను.” గబగబా చెప్పాడు నరేంద్ర.

అటు జవాబు వినకనే.. ఆ కాల్ ని కట్ చేసేసాడు కూడా.

అప్పుడే కోటి.. కాఫీ గ్లాస్ అందించబోయాడు.

“స్నానం చేసి వచ్చేక తాగుతా.” నరేంద్ర బాత్రూంలోకి దూరేసాడు.

అతడు వచ్చే సరికి.. గోధుమపిండితో బెల్లం అట్లు వేసి.. కోటి టిఫిన్ సిద్ధపర్చాడు.

“టిఫిన్ వద్దులే. కాఫీ ఇచ్చేయ్.” చక చకా డ్రస్ మార్చుకుంటున్నాడు నరేంద్ర.

“ఐదు నిముషాలే పడుతోంది. నా మాట విని టిఫిన్ చేసి బయలు దేరండి.” కోటి రిక్వెస్ట్ చేసాడు.

టిఫిన్, కాఫీ పూర్తి చేసేసి.. బైక్ వైపు వెళ్తూ..

“నేను త్వరగానే తిరిగి వచ్చేస్తాను. నువ్వు పనులు చూసుకో.” చెప్పాడు నరేంద్ర.

“స్లోగా వెళ్లండి సార్.” చెప్పాడు కోటి.

నరేంద్ర బైక్ స్టార్ట్ చేసి.. శ్యామల ఇంటి వైపు కదిలాడు.

 ***

రాత్రి..

శ్యామలతో ఫోన్‌లో మాట్లాడేక.. వీథి వైపు తలుపు మూసి.. గడియ పెట్టి.. పక్క మీదకు చేరిన నరేంద్రతో..

“సార్.. మేడమ్ నాన్నగారికి ఎలా ఉంది.” అడిగాడు కోటి.

“నువ్వు ఇంకా పడుకోలేదా. ఆఁ. ఆయనను డిశ్ఛార్జ్ చేసేసారట. ఇంటికి వచ్చేసారట. ఇప్పుడు బాగానే ఉన్నారట.” చెప్పాడు నరేంద్ర.

“పాపం. ఏమై ఉంటుందో. దడిదడిన అనారోగ్యం పాలవుతున్నారు.” నొచ్చుకుంటున్నాడు కోటి.

“తాగుడు. ఎంత చెప్పినా వినిపించుకోరట.” అన్నాడు నరేంద్ర.

ఆ వెంబడే.. “హు. తన తాగుడు వలన అటు భార్యని.. ఇటు కూతురును అయన తెగ నలిపేస్తున్నారు.” దిగులవుతున్నాడు.

కోటి ఏమీ అనలేదు.

ఆ తర్వాత..

ఇద్దరూ నిముషాల తేడాన నిద్రపోయారు.

(ఇంకా ఉంది)

Exit mobile version