Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

నరేంద్ర ఐ యామ్ విత్ యు-14

[శ్రీ బివిడి ప్రసాదరావు రచించిన ‘నరేంద్ర ఐ యామ్ విత్ యు’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]

[ఓ రోజు మధ్యాహ్నం మూడు గంటలకి శ్యామలకి ఫోన్ చేస్తాడు నరేంద్ర. అప్పుడామె క్లాసులో పాఠం చెప్తుంటుంది. ఫోన్ ఎత్తి, లెసన్ మధ్యలో ఉన్నానని చెప్పి, అర్జెంటా అని అడుగుతుంది. క్లాస్ అయిపోయాకా కాల్ చేయమని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు నరేంద్ర. ఆ రాత్రి, తల్లిదండ్రుల ఊర్లోని తమ ఇంటి గదిలో విశ్రాంతిగా పడుకుని, శ్యామలతో ఫోన్‍లో మాట్లాడుతాడు. ఇక్కడి వ్యాపారి, ధాన్యం బాగుందని మెచ్చుకున్నాడనీ, వ్యవహారం బాగా జరిగిందనీ, అందుకు శ్యామల సూచనలు ఉపకరించాయని అంటాడు. ప్రతీదానికి తన భజన చేయద్దని కోప్పడుతుంది. ఎప్పుడొస్తున్నారని అడిగితే, మర్నాడు సాయంకాలానికల్లా వచ్చేస్తానని చెప్తాడు. వ్యాపారి ఇంకా డబ్బులివ్వలేదా అని అడిగి, అయినా డబ్బు మీ బ్యాంక్ ఎకౌంట్‌లో పడేలా చూడమన్నానుగదా అంటుంది. వ్యాపారి సొమ్ముని ఎకౌంట్‍లోనే వేశాడని చెప్తాడు. కాసేపు మాట్లాడి పెట్టేస్తాడు. రాత్రి భోం చేసి, కోటి ట్రాక్టర్‍ తీసుకుని పల్లెకి వెళ్ళిపోతాడు. కోటిని అతిగా నమ్మడం మంచిది కాదేమో అని అంటాడు నరేంద్ర తండ్రి. తాను జాగ్రత్తగానే ఉన్నానని చెప్తాడు నరేంద్ర. అన్నం తిని విశ్రాంతి తీసుకుంటాడు. మర్నాడు బయల్దేరి పల్లెకి వెళ్తాడు. మొదట అప్పలనర్సయ్య ఇంటికి వెళ్ళి ఆ దంపతులకి తాను కొన్న బట్టలు పెట్టి, కాళ్ళకి దండం పెడతాడు. వాళ్ళు దీవిస్తారు. సాయంకాలం గుడిలో శ్యామలని కలిసి, ఆమె కోసం తీసుకున్న చీర ఉన్న కవర్‍ని అందిస్తాడు. అమ్మాజీకి ఇచ్చారా అని అడిగితే, ఆమెకెందుకు అని అంటాడు. మరి నాకు తెచ్చారుగా అంటుంది. శ్యామల సాటి ఎవరు లేరనీ, ఉండరనీ, ఉండబోరని అంటాడు. – ఇక చదవండి.]

శ్యామలనే చూస్తున్నాడు నరేంద్ర.

నరేంద్ర ఇచ్చిన బట్టల కవర్నే చూస్తోంది శ్యామల.

“ఇప్పటి వరకు నేను రాసిన లెక్కల చిట్టాను మీరు చూడాలి. ప్లీజ్. అందులో కూడా మీ అభిప్రాయాలు కావాలి.” చెప్పాడు నరేంద్ర.

ఆ వెంబడే.. “రేపు తేనా.” పొందికగా అడిగాడు.

అతడినే చూస్తోంది శ్యామల.

“అవసరమా.” అడిగింది.

“నాకు మాత్రం తప్పక.” చెప్పాడు నరేంద్ర.

“సరే తెండి.” శ్యామల ఒప్పేసుకుంది.

“రేపు ఆదివారం కదా. మీ ఇంటికి తేవచ్చా.” అడిగాడు నరేంద్ర.

“ఇంటికా.” ఆగింది శ్యామల.

“మీరు అనుమతి ఇస్తేనే.” మెల్లిగా చెప్పాడు నరేంద్ర.

అర నిముషంలోపే.. “సరే. మా ఇల్లు తెలుసా.” అడిగింది శ్యామల.

“ఆనవాలు చెప్పండి. రాగలను.” సర్రున చెప్పాడు నరేంద్ర.

శ్యామల చాలా సులభతరంగా తన ఇంటికి రావడానికి గుర్తులు చెప్పగలిగింది.

“రేపు పది తర్వాత రావచ్చా.” నరేంద్ర అడిగాడు.

“రేపు మీకు పనులు లేవా.” అడిగింది శ్యామల.

“లేకపోవచ్చు. ఐనా వస్తాను.” చెప్పాడు నరేంద్ర.

“సరే. రండి.” చెప్పింది శ్యామల.

కొద్ది నిముషాల లోపే ఆ ఇద్దరూ అక్కడి నుండి కదిలారు.. ‘రేపు కలుద్దాం.’ అనుకొని.

అంతలోనే.. తన చేతి లోని బట్టలు కవర్ చూపుతూ.. “దీనికి నేను మీకు థాంక్స్ చెప్పలేదు. చెప్పాలిగా.” హస్కీగా అంది శ్యామల.

“నో నో ప్లీజ్. మీ నుండి అట్టివి ఆశించను. చెప్పితే భరించలేను.” సీరియస్‌గా చెప్పాడు నరేంద్ర.

‘నీ లెక్కే వేరబ్బాయ్.’ అనుకుంది శ్యామల.

బయటికి.. “పదండి పదండి.” అనేసింది చకచకా కుడి చేతితో ముందును చూపుతూ.

ఆ ఇద్దరూ మండపం దిగారు. ఎప్పటిలాగానే తమ తమ ఇళ్లకు బయలుదేరారు.

***

శ్యామల నుండి విడి.. నరేంద్ర ఇంటిని చేరాడు.

తమ డిన్నర్‌కి వంట చేస్తున్నాడు కోటి.

“కర్రీ ఏమి చేస్తున్నావు.” అడిగాడు నరేంద్ర.. రిప్రెషై కోటిని చేరి.

“ఉలవ కట్టు చేసాను. వడియాలు వేపుతాను.” చెప్పాడు కోటి.

“అబ్బ. భలే కాంబినేషన్. నోరూరుతోంది.” నరేంద్ర చంటి పిల్లాడయ్యాడు.

“అన్నం ఉడుకుతోంది. నిముషాల్లో వడ్డన చేసేస్తాను.” కోటి తల్లయ్యాడు.

నరేంద్ర కదిలి గోడకు చేరబడి నేలన కూర్చున్నాడు.

“పొలాలు రడీ అయ్యాయి. ఈసారికి ‘సమ భాగాలుగా పెసలు.. మినుములు పండిద్దాం’ అన్నారు. ఆ విత్తనాలు తెప్పించొచ్చు సార్.” చెప్పాడు కోటి. అతడు వడియాలు వేపుతున్నాడు.

“తడి సరిపోతోందా. ఒక వర్షం పడే వరకు ఆగాలేమో.” నరేంద్ర సందిగ్ధమగుతాడు.

“లేదు సార్. ప్రస్తుతం అనుకూలంగానే ఉంది. ఆపై.. చెరువులో నీళ్లు ఉన్నాయి.. బోరు ఉండనే ఉంది. పైగా అప్పలనర్సయ్యగారితో పాటు మన వాళ్లని అడిగాను. వాళ్ల అభిప్రాయం అదే.” కోటి ఆశాజనకం ప్రదర్శించాడు.

“సరే. ఇప్పుడే పురంలోని డీలర్‌కు ఫోన్ చేస్తాను. ఆయా విత్తనాలు రేపటి బస్సు ద్వారా పంపమని కోరతాను.” చెప్పాడు నరేంద్ర.

ఆ వెంబడే.. “అన్నట్టు.. గతంలో అతడికి ఇచ్చిన ఇండెంట్ ప్రకారం పంపమంటే చాలా.. లేదా ఏవైనా విత్తనాలు పెంచాలా. పెంచవలసి వస్తే వాటి మొత్తం పంపాలిగా.” అన్నాడు.

“చాలు చాలు. అప్పుడు చెప్పినట్టే విత్తనాలు పంపమనండీ. పెంచవలసిన అవసరం లేదు.” చెప్పాడు కోటి.

“సరే.” అనేసి.. లేచాడు నరేంద్ర. బల్ల మీద తన ఫోన్ తీసుకున్నాడు. ఆ డీలర్‌కు ఫోన్ చేసి.. అతడితో మాట్లాడుతున్నాడు.

కాల్ కట్ చేసాక.. ఫోన్ ని తిరిగి బల్ల మీద పెట్టేసి.. వచ్చి తిరిగి కూర్చున్నాడు.

“రేపు బస్సుకు అప్ప చెప్తాడట. ఏ టైం బస్సో ఫోన్ చేసి చెప్తాడు.” చెప్పాడు.

“సరే. ఆ టైంకి నేను వెళ్తాను. ఆ సరుకు కలెక్ట్ చేసుకుంటాను.” చెప్పాడు కోటి. వడియాల పనిని ముగించాడు.

“కోటీ.. నువ్వు భలే చేయూత అవుతున్నావు.” చెప్పాడు నరేంద్ర చాలా సంతృప్తిగా. అతడు కోటిని మెచ్చుకోలుగా చూస్తున్నాడు.

“అంతా మీ చొరవ.. మీ కలుపుగోలు.. ల్లాంటివి కారణాలు సార్. నాదేముంది.” అన్నాడు కోటి.

అప్పుడే కుక్కర్ చివరి విజిల్ ఇచ్చింది.

“లేవండి సార్. భోంచేద్దాం.” చెప్పాడు కోటి.

నరేంద్ర లేచాడు.

***

మర్నాడు.. ఉదయం తొమ్మిదవుతోంది.

అప్పలనర్సయ్య ఇంటికి వెళ్లిన నరేంద్రను.. హాలులో కుర్చీలో కూర్చోబెట్టి..

“కాఫీ తాగారా.” అడిగాడు అప్పలనర్సయ్య.

“ఇప్పుడే. టిఫిన్ చేసి కాఫీ తాగాను. మీతో మాట్లాడడానికి ఇలా వచ్చా.” చెప్పాడు నరేంద్ర.

అప్పలనర్సయ్య మరో కుర్చీలో కూర్చుంటూ..

“చెప్పు బాబూ.” అన్నాడు.

“పెసలు, మినుములు విత్తనాలు ఈ రోజు వస్తున్నాయి. రేపటి నుండి ఆ పనులు మొదలెడదాం.” చెప్పాడు నరేంద్ర.

“అలానే బాబూ. అదును ఉంది. నీళ్లు కుదురుతాయి. కోటి, మేము కూడా అదే మాట్లాడుకున్నాం.” చెప్పాడు అప్పలనర్సయ్య.

“అదదే. రాత్రి కోటి నాతో చెప్పాడు..” చెప్పుతున్నాడు నరేంద్ర.

అప్పుడే.. అక్కడికి అమ్మాజీ వచ్చింది.

“నమస్కారం సార్.” చేతలు జోడించింది. చిన్నగా నవ్వుతోంది. నరేంద్రనే చూస్తోంది.

“మీరు నన్ను ‘సార్’ అనడమేమిటి.” విడ్డూరమవుతున్నాడు నరేంద్ర.

అప్పలనర్సయ్య కలగచేసుకున్నాడు.

“ముందు ‘మీరు’.. ‘సార్’.. అనుకోవడాలు మీరు వదలండి. ఇద్దరూ నా పిల్లలు కనుక.. తండ్రిలా చెప్పుతున్నా. నా మాట వినుకోండి.”

నరేంద్రలాగానే అమ్మాజీ కూడా తల తిప్పి అప్పలనర్సయ్యను చూస్తోంది. ఇద్దరూ ఆసక్తి పడుతున్నారు. ‘అప్పలనర్సయ్య ఏం చెప్పబోతాడా.’ అనుకుంటున్నారు.

“మీరు అన్నాచెల్లెల్లా మెసులుకుంటే నాకు నిండుగా ఉంటుంది.” గొప్పగా చెప్పాడు అప్పలనర్సయ్య.

ఆ ఇద్దరూ మొహాలు చూసుకున్నారు.

మొదటగా అమ్మాజీ మాట్లాడింది.

“అన్నయ్య పోయిన లోటు పూడ్చారు నాన్నా.” అంది అప్పలనర్సయ్యతో తనివిగా.

ఆ పిమ్మట తల తిప్పి నరేంద్రని చూస్తోంది.

అప్పటికే ఆమెనే చూస్తున్నాడు నరేంద్ర.

అమ్మాజీ చూపులోని అనురాగాన్ని చవి చూస్తూ.. “చెల్లి లేని లోటు తీరుస్తున్నావు తల్లీ.” చెప్పాడు.

అప్పలనర్సయ్య గుంభనంగా నవ్వుకుంటున్నాడు.

అర నిముషం తర్వాత..

“అన్నా.. మీ మాటలు విన్నాను. రేపటి నుండి మళ్లీ మీకు పనులు మొదలవు తున్నాయి. ఇంకా నా సంగతి ఆలస్యమవుతోందా.” నరేంద్రతో అంది అమ్మాజీ.

“లేదు తల్లీ. ఆలస్యం కానీయను.” అనేసాడు నరేంద్ర.

“అన్నా.. ఎన్జీవో తీరు నాకు నచ్చింది. అందుకు నాకు సాయపడండి.” చెప్పి.. అమ్మాజీ అక్కడ నుండి వెళ్లిపోయింది.

అప్పలనర్సయ్య, నరేంద్రల ఆ మాటలు, ఈ మాటలు తర్వాత..

“నేను వెళ్లాలి. మళ్లీ కలుస్తాను.” లేచాడు నరేంద్ర.

నేరుగా ఇంటికి వెళ్లాడు బైక్ మీద.

పద్దుల పుస్తకం తీసుకున్నాడు.

“కోటీ.. నేను బయటికి వెళ్తున్నాను. నువ్వు ఇంటినే ఉండు. డీలర్ నుండి ఫోన్ వస్తే నీకు చెప్తాను.” చెప్పాడు.

“అలాగే సార్. నేను బస్సుకు వెళ్తాను.” చెప్పాడు కోటి.

“వచ్చే సరుకు బరువవుతోందేమో. ఒక్కడివి. ఎవరినైనా పురమాయించనా.” అడిగాడు నరేంద్ర.

“అక్కర లేదు సార్. నేను చూసుకుంటానుగా.” చెప్పాడు కోటి.

నరేంద్ర పద్దుల పుస్తకంతో శ్యామల ఇంటికి బయలుదేరాడు బైక్ మీద.

శ్యామల తెలిపిన విధంగా మూడు మలుపులు తర్వాత.. శ్యామల వీథిని చేరగలిగాడు.

బైక్‌ని  స్లో చేస్తూ.. అటు ఇటు చూస్తూ.. శ్యామల ఇంటి ఆనవాలను నెమర వేసుకుంటూ ముందుకు వెళ్తున్నాడు.

ఓ ఇంటి ముందు తెలుగు టీచర్, ఎవరో కొందరు నిల్చుని మాట్లాడుకోవడం చూసాడు.

అక్కడ ఆగాడు.

తెలుగు టీచర్ నరేంద్రని చూసి.. పలకరింపులా నవ్వేడు.

అప్పుడే ఆ గుంపు నుండి ముందుకు వస్తూ సోషల్ టీచర్ కనిపించాడు.

అతడు నరేంద్రని చూస్తూ తన కుడి చేయి ఎత్తి ఊపాడు.

నరేంద్ర మాత్రం.. “శ్యామల టీచర్ ఇల్లు..” నసిగాడు.

“ఓ. అటా. అదిగో అదే.” చెప్పాడు తెలుగు టీచర్ చేతితో అటు చూపుతూ.

అక్కడికి దగ్గరిలోనే ఆ ఇల్లు ఉంది.

“థాంక్స్” చెప్పేసి.. అటు కదిలాడు నరేంద్ర.

శ్యామల ఇంటి ముందు బైక్ నిలిపి.. పద్దుల పుస్తకంతో.. వసారా లాంటి చోటును దాటి.. ఆ ఇంటి గుమ్మం తలుపు తట్టాడు. అతడు అప్పటికే రమారమీ నెర్వస్ ఆడని స్థితిన ఉన్నాడు.

శ్యామల తలుపు తీసింది. నరేంద్రని చూసింది.

“రండి.” అంది చక్కగా.

లోనికి నడిచాడు నరేంద్ర.

శ్యామల చూపిన కుర్చీలో కూర్చున్నాడు.

తర్వాత.. శ్యామల వెళ్లి గ్లాస్‌తో మంచి నీళ్లు తెచ్చి ఇచ్చింది.

నరేంద్ర కొద్దిగా నీళ్లు తాగాడు. గ్లాస్‌ను ఎక్కడ పెట్టాలా అన్నట్టు కదులుతాడు.

ఆ గ్లాస్‌ను అతడి నుండి తీసుకొని పక్కన పెట్టి అతడికి దరినే ఉన్న కుర్చీలో కూర్చుంది శ్యామల.

“ఇంటిని పట్టడంలో తంటాలు పడలేదుగా.” చిన్నగా నవ్వుతోంది శ్యామల.

“రాగలిగాను. పైగా తెలుగు టీచర్ కనిపించారు. మీ ఇంటిని చూపారు.” చెప్పాడు నరేంద్ర.

“అవునా. ఆయన ఇల్లు ఇక్కడే.” చెప్పింది శ్యామల.

“అవును. అతడి ఇంటి ముందు ఒక గుంపు ఉంది. ఏదో దీర్ఘంగా చర్చించు కుంటున్నట్టు ఉంది.” చెప్పాడు నరేంద్ర.

“బహుశా. వాళ్లింటిలో ఫంక్షన్ ఒకటి జరగనుంది. ఆ కబురులేమో.” అంది శ్యామల.

నరేంద్ర తన చేతిలోని పుస్తకాన్ని శ్యామల కందిస్తూ..

“ఒకసారి చూడరూ.” అన్నాడు.

శ్యామల పది నిముషాల్లోపే ఆ పుస్తకాన్ని చూడగలిగింది.

ఆ పుస్తకం మూస్తూ.. “బాగుంది. తీరుగానే రాసారు.” అంది. ఆ పుస్తకాన్ని నరేంద్రకి అందించింది.

“ఐనా నాదో సూచన. మీ దినసరి ఖర్చులను కూడా కలిపి రాసారు. వాటిని వేరేగా రాసి ఆ మొత్తాన్ని మాత్రమే ఫైనల్ బేలన్స్ షీట్ న ‘నా సొంత ఖర్చులు’గా చూపడం సరైనది.” చెప్పింది.

“అవునా. ఇకపై మార్చుకుంటాను.” చెప్పాడు నరేంద్ర.

“ప్రారంభ దశ కనుక చివరాఖరి పద్దులు పొంతన కావు. సహజం. గో హెడ్.” అంది శ్యామల చక్కని ప్రోత్సాహ రీతిగా.

అంతలోనే నరేంద్ర ఫోన్ మోగుతోంది.

డీలర్ ఫోన్ చేస్తున్నాడు.

అతడితో మాట్లాడేక.. కోటికి ఫోన్ చేసాడు నరేంద్ర.

“కోటీ.. పదకొండున్నర బస్సుకు సరుకు వస్తోంది.” చెప్పాడు.

కాల్ కట్ చేసి..

“విత్తనాలు వస్తున్నాయి. రేపటి నుండి తిరిగి పంట పనులు మొదలవుతున్నాయి. ఇక్కడి ఆనవాయితినే కొనసాగిస్తున్నాను. పెసలు, మినుములు పండించ బోతున్నాను. ఇక మీదట మాత్రం కొత్త పంటలు చేపట్టాలి. ఆ లోగా మరిన్ని పొలాలదారులని కూడ తీసుకోగలగాలి.” చెప్పాడు నరేంద్ర.

“ఇలానే నడవండి. తొందర వద్దు. ఈ సారి పంటలను కూడా ధాన్యం పంటలా ఏపుగా వచ్చేలా కృషి చేయండి. దాంతో అన్నీ ఒక దాని వెంట ఒకటిగా సమకూరి పోతాయి.” మంచిగా మాట్లాడుతోంది శ్యామల.

ఆ రీతినే.. “ఇంతకీ ఈ 75:25 రేషియో ఏ ప్రాతిపదికన అనౌన్స్ చేసారు.” అడిగింది.

“నేను ఇక్కడికి వచ్చిన మొదట్లో అప్పలనర్సయ్యగారిని కలిసాను. ఇక్కడి పంటలను, ఖర్చులను, రాబడులను అడిగి తెలుసుకున్నాను. ఆయన చెప్పినవి క్రోడీకరించుకొని నేనే 75:25 రేషియోని ఫిక్స్ చేసుకున్నాను.” చెప్పాడు నరేంద్ర.

“అవునా. సరే.. రాబోవు రోజుల్లో మీ కొత్త పంటలు ఏమై ఉంటాయి.” అడిగింది శ్యామల.

“మొక్క జొన్న, రాగులు, చిరుధాన్యాలు లాంటివి.” చెప్పాడు నరేంద్ర.

ఆ వెంబడే.. “ఇవన్నీ వాణిజ్య పంటలు. వీటి మార్కెట్ బహుళంగా ఉంది.. ఉంటుంది.” చెప్పాడు.

“గుడ్. ప్రోసీడ్.” అంది శ్యామల.

ఆ వెంబడే.. “ఇట్టి పంటలకు ఖర్చులు ఎలా ఉంటాయి.” అడిగింది.

“నేను అల్రడీ తెలుసుకున్నాను. వీటికి అధిక నీళ్లవసరం ఉండదు. అంతగా ఎరువులు అవసరం ఉండదు. పరిమిత పనులతో పంటను పొందవచ్చు. మొత్తమ్మీద వీటి దిగుబళ్లు వరకు జాస్తీ హైరానాలు ఏమీ ఉండవు.” చెప్పాడు నరేంద్ర.

ఆ వెంబడే.. “వీటిని కూడా ముందుగా అంచనా వేసుకొనే ఈ 75:25 రేషియోని అనుకున్నాను. ఇట్టి వాటికి మదుపులు తక్కువ.” చెప్పాడు.

“సరే. కానీయండి. కొత్త కదా. పక్కా అంచనాలకు రాలేం. అనుభవం సరిదిద్దుతోంది. ముందుకు సాగండి.” చెప్పేసింది శ్యామల.

“హమ్మయ్య. మీరు ‘ఎస్’ అంటే చాలు. నాకు అన్నీ విజయాలే.” నరేంద్ర రిలీఫ్ అవుతాడు.

“మీరొకరు. అన్నింటికీ.. అన్నింటనా నన్నే ‘మైల్‌స్టోన్’ చేస్తారు.” శ్యామల అంది బిడియంగా.

“ఏమో. నేను మాత్రం మిమ్మల్ని నా ‘లక్కీస్టోన్’..” చెప్పుతున్నాడు నరేంద్ర.

ఆడ్డై.. “ఆపండి మీ దండకం.” చిరు కోపం ప్రదర్శించింది శ్యామల. వెంటనే చిన్నగా నవ్వేసింది.

“థాంక్సండీ. నాకై ఇంత సమయం కేటాయించారు.” అన్నాడు నరేంద్ర.

“కోటీ వంట చేసి ఉంటాడా.” అడిగింది శ్యామల.

“ఆఁ. చేస్తాడు.” చెప్పాడు నరేంద్ర.

శ్యామల ఏమీ అనలేదు.

నరేంద్ర మాత్రం అప్పుడే గుర్తొచ్చినట్టు..

“మరో విషయం.” అన్నాడు.

(ఇంకా ఉంది)

 

Exit mobile version