Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

నరేంద్ర ఐ యామ్ విత్ యు-13

[శ్రీ బివిడి ప్రసాదరావు రచించిన ‘నరేంద్ర ఐ యామ్ విత్ యు’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]

[శివాలయంలో కూర్చుని చేతికొచ్చిన పంట గురించి, వాటాల గురించి, పంట నిల్వల గురించి మాట్లాడుకుంటారు నరేంద్ర, శ్యామల. చెల్లింపు లెక్కలన్నీ జాగ్రత్తగా రాసుకున్నారా అని శ్యామల అడిగితే, రాసుకున్నానని చెప్తాడు. మీ ఇద్దరి ఫ్రెండ్స్ నుంచి తీసుకున్న అప్పు తీర్చడం గురించి ఏమనుకుంటున్నారని అడుగుతుంది. అసలు ఉంచి, వడ్డీ చెల్లించమంటున్నారని చెప్తాడు. మీ వాటా పంట అమ్మకం అయ్యాకా, దాని గురించి ఆలోచించవచ్చని నరేంద్రతో అంటుంది శ్యామల. తనకు అండగా ఉన్నందుకు ధన్యవాదాలు చెప్తే, మీకు నా మీద అంత గురి ఏమిటని అడుగుతుంది. తమ మధ్య ట్యూనింగ్ బాగా కుదిరిందని అంటాడు. ఇద్దరూ తమ ప్రేమని బయటపెట్టలేక అవస్థ పడుతున్నామని అనుకుంటుంది. ఇద్దరూ ఎవరిళ్ళకి వాళ్ళు చేరుకుంటారు. రాత్రి అన్నం తిని శ్యామల ఫోన్ కోసం ఎదురుచూస్తాడు నరేంద్ర. సాయంత్రం మాటల్లో చెప్పడం మరిచిపోయానని అంటూ, మీతో కలిసి పనిచేసేవాళ్ళు బూస్టప్ అయ్యేలా వారితో మాట్లాడాలనీ, మీ తదుపరి చర్యలను వాళ్ళకు వివరించాలనీ చెబుతుంది. సరేనంటాడు నరేంద్ర. కాసేపు మాట్లాడి కాల్ కట్ చేస్తుంది శ్యామల. మర్నాడు అందరినీ సమావేశపరిచి, తన ప్రణాళికలు వివరిస్తాడు. వాళ్ళు ఎప్పటిలానే సహకరిస్తామని అంటారు. అప్పలనర్సయ్య తన కూతురు అమ్మాజీ ఎన్.జి.ఓ. సంగతి ప్రస్తావిస్తాడు.  తాను ఇప్పటిదాకా తీరిక లేకుండా ఉన్నాననీ, త్వరలోనే తేలుద్దామనీ అంటాడు నరేంద్ర. మధ్యాహ్నం భోం చేస్తున్నప్పుడు అప్పలనర్సయ్య అమ్మాజీకి ఆ విషయం చెప్తాడు. పెళ్ళి చేసుకోక, ఈ గోలంతా ఎందుకని తల్లి అన్నపూర్ణమ్మ అంటుంది. ఇప్పట్లో పెళ్ళి చేసుకోనని చెప్పి భోం చేసి అక్కడ్నించి వెళ్ళిపోతుంది అమ్మాజీ. – ఇక చదవండి.]

మూడు గంటల ప్రాంతంలో..

శ్యామల క్లాస్ లో ఉంది. స్టూడెంట్స్‌కు పాఠం నేర్పుతోంది.

అప్పుడే తన ఫోన్ రింగవ్వుతోంది. హేండ్ బేగ్ నుండి ఫోన్ తీసి చూసుకుంది. నరేంద్ర కాల్ చేస్తున్నాడు.

కనెక్టై.. “క్లాస్‌లో ఉన్నాను. అర్జంటా.” మెల్లిగా మాట్లాడుతోంది శ్యామల.

“అలానా. క్లాస్ తర్వాత కాల్ చేస్తారా.” అటు నుండి అడుగుతున్నాడు నరేంద్ర.

“సరే.” కాల్ కట్ చేసేసి.. ఫోన్ ను టేబుల్ మీద పట్టేసి.. తిరిగి పాఠం లోకి వెళ్లింది శ్యామల.

ఆ ఫోన్ కాల్ కి.. ఆ కాల్ కట్ కి.. మధ్యన.. అక్కడి స్టూడెంట్స్ లో కొద్ది మంది శ్యామలనే చూస్తూ గమ్మత్తుగా నవ్వుకున్నారు. మరి కొద్ది మంది ఒకరిని ఒకరు చూసుకుంటూ కనుబొమలు ఎగరవేసుకున్నారు.

ఇవేవీ శ్యామలకు తెలియవు.

‘ఎప్పుడు పీరియడ్ ముగుస్తుందా..’ లోలోపల అనుకుంటుంది. బయటికి పాఠం బోధించగలుగుతోంది.

***

రాత్రి..

తన తల్లిదండ్రుల ఊరులో.. తమ ఇంటి గదిలో.. పక్క మీద ఉన్నాడు నరేంద్ర.

ఫోన్ లో శ్యామలతో మాట్లాడుతున్నాడు.

“అన్నీ ఓకేగా.” అడుగుతోంది శ్యామల.

“పెర్ఫెక్ట్‌గా.” హాయవుతున్నాడు నరేంద్ర.

ఆ తోవనే.. “ఇక్కడి వ్యాపారి మనుషులు మొత్తం ధాన్యం చూసి అబ్బురపడ్డారు.” చెప్పేసాడు.

“మరే. అంతా అన్నారన్నారుగా. ప్రతి గింజ బింకంగా ఉందని.. పంటలో పిసరంత పొల్లు కూడా లేదని.. అందుకే తూకంకి నికరంగా ధాన్యం నిలిచి.. మంచిగా దస్కం చేతికి వచ్చింది. గుడ్.” సంతసిస్తోంది శ్యామల.

సరదాలో కొనసాగుతున్నాడు నరేంద్ర.

ఆ వెంబడే.. “ఇట్టి పంటకై అంతా బాగా సహకరించారు. ముఖ్యంగా సంబంధిత నిపుణుల సూచనలు బాగా ఫలించాయి.” చెప్పాడు.

“అంతంతే.. రసాయనికవి తగ్గిస్తూ.. సేంద్రియవి వాడించడం వాళ్ల చలవే. అలాగే మీరు కూడా వాటిని చక్కగా వాడడం ఒక కారణమే.” గుర్తు తెస్తున్నట్టు చెప్పింది శ్యామల.

“వీటితో పాటు మీ అభిప్రాయాలు నాకు బాగా సాయపడ్డాయి.” అప్పుడే అనేసాడు నరేంద్ర.

“అరె. వాట్ ఈజ్ దిస్.. సందు దొరికితే చాలు.. నా భజన జొప్పిస్తారు. ఆపండి మీ బడాయి.” అటు నవ్వుతూనే సన్నగా చిరాకయ్యింది శ్యామల.

ఇటు నరేంద్ర ఏమీ అనలేదు.

అప్పుడే మాట మార్చింది అటు శ్యామల.

“ఎప్పుడు ఇక్కడికి వస్తారు.” అడిగింది.

“ఊఁ. రేపు సాయంకాలంకి వచ్చేస్తాను.” చెప్పాడు నరేంద్ర.

“ఏం. ఇంకా ఆ వ్యాపారి డబ్బు ముట్ట చెప్పలేదా.” అడిగింది శ్యామల.

ఆ వెంబడే.. “ఐనా.. ఆ మొత్తంని అతడి చేతే మీ బ్యాంక్ అకౌంట్‌లో వేసేలా చూడమన్నానుగా.” అంది.

“అయ్యో. మీ అభిప్రాయం ప్రకారమే కానిచ్చాను. అతడు నా అకౌంట్‌కే ఆ మొత్తంని వెంటనే ట్రాన్స్‌ఫర్ చేసేసాడు. నేను చూసుకున్నాను కూడా.” గబగబా చెప్పేడు నరేంద్ర.

“మరి.” అంది శ్యామల.

“ఉఁ. మరే. రేపు బజారు కెళ్లి.. అమ్మకు, నాన్నకు బట్టలు కొని పెడతాను. ఈ ఫీల్డ్‌లో ఇది నా మొదటి  సంపాదన కదా. అలాగే అప్పలనర్సయ్యగారికి, అన్నపూర్ణమ్మగారికి కూడా బట్టలు పెట్టాలనుకున్నాను. వాళ్లకీ ఇక్కడే కొని తెస్తాను. అలాగే.. ఆఁ. మరేం లేదు. అంతంతే. ఇవి చూసుకొని వచ్చేస్తాను.” చెప్పి టక్కున ఆగాడు నరేంద్ర.

అటు శ్యామల చిన్నగా నవ్వుకుంటుంది.

“వీటికి మీ అభిప్రాయం కోరలేదు. సారీ.” ఇటు నరేంద్ర చెప్పేసాడు.

“ఏమో.” శ్యామల గమ్మత్తయ్యింది.

“అడిగినా ఇట్టివి మీరు కాదనరనే నమ్మకం. అలానే ఏదో బెరుకు. అంతే.” నరేంద్ర తేల్చేసాడు.

“భలే. మీరు మంచివే చేస్తున్నారు.” చెప్పింది శ్యామల.

“థాంక్స్.” చెప్పాడు నరేంద్ర.

అంతలోనే పద్మావతి కేకలా నరేంద్రని పిలిచింది.

“అమ్మ పిలుస్తోంది.” చెప్పాడు నరేంద్ర మంచం దిగుతూ.

“సరే.” అనేసింది శ్యామల.

శ్యామలే ఆ కాల్‌ని కట్ చేసేసింది.

గది బయటికి వచ్చాడు నరేంద్ర.

“ఇతని భోజనం ఐంది. బయలుదేరుతాడట.” చెప్పింది పద్మావతి.

హాలులో.. తన తల్లిదండ్రులతో పాటు కోటీ ఉన్నాడు.

“బాగా చీకటయ్యిందిగా. ఇతణ్ణి రేపు పంపించవచ్చుగా.” చెప్పాడు నారాయణరావు.

“సార్ చెప్పలేదు సార్. నేనే వెళ్తున్నాను. రేపు ఉదయంకి పనులు ఉన్నాయి. సార్ రేపు సాయంకాలం రాగలనన్నారు.” చెప్పాడు కోటి.

“సర్లే. స్లోగా వెళ్లు. ట్రాక్టర్ జాగ్రత్త.” చెప్పాడు నారాయణరావు.

“అయ్యో. కోటీ పనిమంతుడు. ప్రతిదీ ‘తనది’ అన్నట్టే నడుచుకుంటున్నాడు.” చెప్పాడు నరేంద్ర.

ఆ వెంబడే.. “ఇంటి తాళం ఇచ్చానుగా.” అడిగాడు.

“ఆఁ సార్. మరి బయలుదేర్తాను.” కోటీ అక్కడ నుండి కదిలాడు.

అతడి వెనుకే వెళ్లి.. ట్రాక్టర్ కదిలేక.. ఇంట్లోకి వచ్చాడు నరేంద్ర.

“నాన్నా.. ప్రతి మారూ నమ్మకం మంచి చేయకపోవచ్చు.” నాన్చాడు నారాయణరావు.

“కావచ్చు నాన్నా. మీరు ఇప్పుడు ఎందుకు చెప్పారో గుర్తించాను. ఏమైనా నా జాగ్రత్తలో నేను మెసులుతాను. సరేనా.” చెప్పాడు నరేంద్ర.

“భోంచేద్దామా.” అడిగింది పద్మావతి.

“వడ్డించమ్మా. అలసటగా ఉంది. పడుకుంటాను.” చెప్పాడు నరేంద్ర.

సాయంకాలం.. రెండున్నరప్పుడు.. పొలంలో ఉండగా.. నరేంద్రకు ఫోన్ వచ్చింది.. తన పురం నుండి.

ఆ ఫోన్ చేసింది ఓ వ్యాపారి. ఆయన రెండు రోజులు క్రితం నరేంద్ర కోరిక మేరకు పల్లె వచ్చాడు. నరేంద్రను కలిసాడు.

నరేంద్ర తన వాటా ధాన్యాన్ని చూపాడు. ఆయన ఆ ధాన్యం కొనడానికి వెంటనే సమ్మతి తెలిపాడు. కొనుగోలు ధర కూడా చెప్పాడు. అడ్వాన్స్ ఇస్తానన్నాడు. నరేంద్ర వద్దన్నాడు. ఫోన్ చేసి తన అభిప్రాయం చెప్తానన్నాడు.  ఆయన కొన్ని శాంపిల్స్ తీసుకొని తిరిగి వెళ్లి పోయాడు.

అప్పలనర్సయ్య, కోటి, మిగతా వారు ‘ధర బాగుంది.. అమ్మేయ వచ్చు’ అన్నారు.

నరేంద్ర ఏమీ అనక.. ఈ విషయమై శ్యామలతో మాట్టాడేడు. అందుకు శ్యామల.. కొద్ది ధాన్యంతో కోటిని పురం పంపమంది. వచ్చిన వ్యాపారిని కాక మరి కొంత మంది వ్యాపారులును కలవమంది. వాళ్ల ధరలు తెలిసాక నిర్ణయంకి రావచ్చని అభిప్రాయ పడింది.

నరేంద్ర ఆ పనిని పూర్తి చేసాడు. మొదటి వ్యాపారి ధరనే ఎక్కువ మంది కూడా చెప్పడంతో మొదటి వ్యాపారికే తన ధాన్యం అమ్మాలనుకున్నాడు. ఆయనకి ఫోన్ చేసి తన సమ్మతిని తెల్పాడు.. శ్యామల సూచన మేరకు.

ఆ వ్యాపారి తన వద్దకు ధాన్యం తెమ్మని కోరాడు. ట్రాన్స్‌పోర్ట్ చార్జీలు ఇస్తానన్నాడు. పైగా తనకు సరుకు వెంటనే కావాలన్నాడు.

దాంతో ఆయన నుండి ఫోన్ రాగానే.. ధాన్యం బస్తాలను వేయించుకొని.. తన ట్రాక్టర్‌తో.. కోటీతో కలిసి పురం బయలుదేరేసాడు నరేంద్ర. వ్యాపారం ముగిసేక.. తిరిగి కోటిని వెనుక్కు పంపేసి.. తను రేపు ప్రయాణంకై ఉండి పోయాడు.

భోజనం ముగించేసి.. తన గదిలోకి వెళ్లిపోయాడు నరేంద్ర.. నిద్రపోవడానికై.

***

మర్నాడు.. సాయంకాలం మూడు నలభై..

అప్పటికే ఫోన్ చేసి తను బయలుదేరానని నరేంద్ర చెప్పడంతో.. ఆ బస్సు వచ్చే వేళకు బస్సు లాగే చోట వేచి ఉన్నాడు కోటి.

కోటి నుండి ఇంటి తాళం తీసుకొని.. అప్పలనర్సయ్య గురించి వాకబు చేసాడు నరేంద్ర.

“ఆయన ఈ పూట పొలాల వైపు రాలేదు” కోటి చెప్పాడు.

నరేంద్ర చేతిలోని లెదర్ బేగ్ ను తీసుకోబోయాడు కోటి.

“నువ్వు పొలాల వైపు వెళ్లాలా.” అడిగాడు నరేంద్ర.

“ఆఁ. సార్. పని మధ్యన వదిలి వచ్చాను.” చెప్పాడు కోటి.

“నేను పొలాల వైపు రావాలా.” అడిగాడు నరేంద్ర.

“వద్దొద్దు. మీ పొలాల గట్ల మీది పెరిగిన కలుపును తీయడమే పని. అది నేను చూసుకుంటాను.” చెప్పాడు కోటి.

“ఒక్కడివే చేస్తున్నావా.” అడిగాడు నరేంద్ర.

“లేదు. మీ పక్క పొలాల వాళ్లలో ముగ్గురిని పిలిచాను. వాళ్లు వచ్చి పని సాయం చేస్తున్నారు.” చెప్పాడు కోటి.

“గుడ్. సరే నువ్వు వెళ్లు. నేను ఇంటికి వెళ్లగలను. ఇదేం పెద్ద బరువు కాదులే.” చెప్పాడు నరేంద్ర. ఇంటి వైపు కదిలాడు.

కోటీ తిరిగి పొలం వైపు కదిలాడు.

ఇంటిని చేరిన నరేంద్ర.. రిప్రెసయ్యి.. లెదర్ బేగ్ నుండి రెండు బట్టల కవర్లు తీసుకొని.. బైక్‌ మీద.. అప్పలనర్సయ్య ఇంటికి బయలుదేరాడు.

“ఉదయం పొలంలో కోటి చెప్పాడు. మీరు ఈ సాయంకాలంకి వస్తారని. వచ్చేసారా.” పలకరించాడు అప్పలనర్సయ్య.

ఆ ఇద్దరూ హాలులో కుర్చీలు లాక్కొని కూర్చున్నారు. ఆ అలికిడికి గదిలోంచి అన్నపూర్ణ అక్కడికి చేరింది.

అమ్మాజీ గదిలో పడుకొని ఉంది.

తన ధాన్యం అమ్మకం గురించి క్లుప్తంగా వివరించాడు నరేంద్ర.. అప్పలనర్సయ్యకు.

“సంతోషం బాబూ. మీ శ్రమ ఫలితం.” అన్నాడు. సంతోషమయ్యాడు.

అప్పుడే తన చేతిలోని బట్టల కవర్లుతో లేచి నిల్చున్నాడు నరేంద్ర.

ఆ దంపతులను కూడా లేచి పక్క పక్కగా నిల్చోమని కోరాడు.

వాళ్ల అలా చేయగానే..

తన చేతిలోని బట్టల కవర్లును చెరొకటిగా వాళ్ల చేతుల్లో పెట్టి.. వంగి.. ఆ ఇద్దరి కాళ్లకి నమస్కరించాడు నరేంద్ర.

ఈ తలవని తలంపు పరిణామంకి ఆ దంపతులు గమ్మున నిశ్చేష్టితులయ్యారు.

ముందుగా అప్పలనర్సయ్యే తేరుకుంటూ.. “ఏమిటి బాబు ఇది.” అడగ్గలిగాడు.

“ఈ ఫీల్డ్‌లో నా తొలి సంపాదన అందింది. అందుకే మా అమ్మానాన్నలతో పాటు.. మీకూ కొత్త బట్టలు పెట్టాను. మీ దీవెనలు కోరుకుంటున్నాను.” చెప్పాడు నరేంద్ర.

ఆ దంపతులు మొహాలు చూసుకున్నారు. తర్వాత.. వాళ్లు తమ తమ మిక్కిలి అనురాగాన్ని నరేంద్రకు వంతులు వారిగా అగుపర్చారు.

నరేంద్ర సంతోషపడ్డాడు.

పిమ్మట వాళ్లకు చెప్పేసి.. ఇంటికి బయలుదేరాడు.

***

ఇంటికి చేరేక.. ఫోన్‌లో టైం చూసుకున్నాడు నరేంద్ర.

ఐదు దాటేసింది.

‘తెములుకోవాలి.’ అనుకున్నాడు నరేంద్ర.

లెదర్ బేగ్ నుండి ఒక బట్టల కవర్ తీసుకొని.. బైక్ మీద.. నేరుగా పొలాల వైపు కదిలాడు.

అక్కడ కోటికి ఇంటి తాళం ఇచ్చేసి..

“పని ఐయ్యేక ఇంటకి వెళ్లు. నేను నా పని చూసుకొని అటు నుండి ఇంటికి వస్తాను.” చెప్పాడు. వెంటనే అక్కడ నుండి బయలుదేరాడు.

నేరుగా శివాలయంని చేరాడు. ఫోన్ లో టైం చూసుకున్నాడు.

ఐదు ఇరవై ఎనిమిది.

బైక్‌ని నిలిపి.. శ్యామలకై ఆలయం వెనుకకు వెళ్లాడు.. బట్టల కవర్‌తో.

శ్యామల అగుపించ లేదు.

కోటి కంటే ముందే శ్యామలకు ఫోన్ చేసాడు. తను బయలుదేరినట్టు.. ‘సాయంకాలం శివాలయంలో కలుద్దాం.’ అని చెప్పాడు.

అటు నుండి వెను తిరిగాడు. మండపంలో కూర్చున్నాడు. పక్కనే బట్టల కవర్‌ని పొందికగా పెట్టుకున్నాడు.

ఐదారు నిముషాలు గడిచాక అక్కడికి వస్తూనే.. నరేంద్రని చూస్తూ చిన్నగా నవ్వుతూ కుడి అర చేతిని ఎత్తి ఊపింది శ్యామల.

తను మండపం దరికి రాగానే.. “పదండి. పూలు కోసుకు వద్దాం.” లేవబోయాడు నరేంద్ర.

“లేదు. లేదు. పూలు పూత అంతగా లేదు. ఈ రోజుకు వద్దు కూడా.” చెప్పింది. మండపం మీదకి వచ్చింది. నరేంద్ర దరిన కూర్చుంది.

నరేంద్ర పక్కనే ఉన్న బట్టల కవర్‌ని చూస్తూనే..

“అప్పలనర్సయ్యగారి వాళ్లకి బట్టలా.” అడిగింది నవ్వుతూ.

“వాళ్లకి అల్రడీ అందచేసేసాను.” చెప్పాడు నరేంద్ర.

“మరి ఈ కవర్ ఏమిటి.” అడిగింది శ్యామల.

ఆమె మాటలు ఆలకించనట్టు కదిలి..

“అమ్మా, నాన్నలకి  బట్టలు పెడితే బాగా ఎమోషన్ అయ్యారు.” గబుక్కున చెప్పాడు నరేంద్ర.

ఆ వెంబడే.. “అప్పలనర్సయ్యగారికి, అన్నపూర్ణమ్మకు బట్టలు పెడితే బాగా రిసీవ్ చేసుకున్నారు.” చెప్పాడు.

‘మాట దాట వేసాడు’ అనుకుంది శ్యామల. ముభావంగా అతడినే చూస్తోంది.

పక్కనున్న బట్టల కవర్‌ని శ్యామలకు అందిస్తూ..

“ఇది మీకు. ప్లీజ్ యాక్సెప్ట్ దిస్.” పొందికగా చెప్పాడు నరేంద్ర.

“నాకా. ఎందుకు.” చిన్నగా చలించింది శ్యామల.

“మీకే ఇవ్వాలి. ఎంతిచ్చినా తక్కువే.” అన్నాడు నరేంద్ర.

ఆ వెంబడే.. “మీ పరిచయం లభించకపోయి ఉంటే నాకు ఈ అనతి నిలదొక్కుకోవడం సాధ్యపడేది లేదు. నా సత్తువ నాకు తెలుసు.” చెప్పాడు. అప్పుడు అతడు శ్యామలనే చూస్తున్నాడు.

ఆమె చూపు దింపుకుంది.

“మీరు మరీ నన్ను ఎక్కువగా భావించేసుకుంటున్నారు.” అంది. ఐనా ముద్దుగానే అంది.

“లేదు శ్యామలగారూ.. నిజం చెప్తున్నాను.” చెప్పాడు నరేంద్ర.

ఆ తర్వాత.. ఇంకేదో చెప్పబోయాడు.

ఆ టాపిక్ మార్చాలని అడ్డై.. “అమ్మాజీకి ఇచ్చారా.” మాట్లాడింది శ్యామల తమాషాగా.

సడన్‌గా డంగయిపోయాడు నరేంద్ర.

“తనకా.. తనకెందుకు.” చిత్రంగా అడిగాడు.

శ్యామల చిన్నగా నవ్వుతోంది.

“మరి నాకు ఇచ్చారుగా.” ఊరింపుగా అంది.

“మీతో తనకు పోలికేమిటి. నాన్సెన్స్.” నరేంద్ర చిరచిరలాడేడు.

శ్యామల లోలోపల నవ్వుకుంటుంది. బయటికి నిదానంగా ఉంది.

“మీరు మీరే. మీ సాటి ఎవరు లేరు.. ఉండరు.. ఉండబోరు.. ఉండరాదు..” అనేస్తున్నాడు నరేంద్ర.

శ్యామల అతడినే చూస్తూ ఉండిపోతోంది.

అతడు మాటలాపేక..

ఆ ఇద్దరి మధ్య నిముషం పాటు మాటలు లేవు.

ఆ సమయంలో..

(ఇంకా ఉంది)

Exit mobile version