[శ్రీ బివిడి ప్రసాదరావు రచించిన ‘నరేంద్ర ఐ యామ్ విత్ యు’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]
[తాను బ్యాంక్ జాబ్ ఇంటర్వ్యూకి వెళ్ళననీ, నరేంద్ర అడుగుజాడలలో నడిచి, ఒక ఎన్.జి.ఓ. స్థాపిస్తానని తల్లిదండ్రులకి చెప్తుంది అమ్మాజీ. ఆ విషయాలన్నీ నరేంద్రతో మాట్లాడి తుది నిర్ణయం తీసుకుందామని అంటాడు అప్పలనర్సయ్య. తల్లి మాత్రం విసుక్కుంటుంది, హాయిగా ఉద్యోగం చేసుకోక ఈ గొడవలన్నీ ఎందుకని అంటుంది. కానీ అమ్మాజీ తన నిర్ణయం మార్చుకోదు. శ్యామలకి ఫోన్ చేసి, వాళ్ళ నాన్న ఆరోగ్యం గురించి తెలుసుకుంటాడు నరేంద్ర. సాయంత్రం అప్పలనర్సయ్య నరేంద్రని తమ ఇంటికి తీసుకెళ్ళి కూతురి ప్రతిపాదనని చెప్పి, సలహా అడుగుతాడు. ఆలోచించి చెబుతానని అంటాడు నరేంద్ర. రాత్రి నరేంద్ర శ్యామలకి ఫోన్ చేసి వాళ్ళ నాన్న ఆరోగ్యం గురించి వాకబు చేస్తాడు. అమ్మాజీ ప్రతిపాదనని శ్యామలకి చెబితే, ముందు చిరాకు పడుతుంది. తాను అక్కడికి వచ్చకా ఆలోచిద్దామని అంటుంది. మర్నాడు తనని కల్సిన అప్పలనర్సయ్యతో, ఎన్.జి.ఓ. వ్యవహారం సున్నితమైనదనీ, ఆచి తూచి అడుగులు వేయాలని, తొందరపడొద్దని, తాను చెప్పేవరకు ఆగమని చెప్తాడు. రాత్రి శ్యామలతో వీడియో కాల్ చేసి మాట్లాడి నిద్రపోతాడు నరేంద్ర. – ఇక చదవండి.]
సెలవుల కంటే ఒక రోజు ముందుగానే శ్యామల తిరిగి వచ్చేసింది.
సాయంకాలం ఐదు ఇరవై అవుతోంది..
శ్యామలతో పాటు శివాలయం మండపంలో కూర్చొని ఉన్నాడు నరేంద్ర.
“అనుకున్న దాని కంటే ముందుగానే వరి పంటను చేచిక్కించుకున్నారే.” అంది శ్యామల.
“అవునవును. మొత్తం పంట పక్వంకి రావడం.. కోత, నూర్పిడి యంత్రం ఉండడం కలిసొచ్చింది. అన్నీ అనుకున్నట్టు చకచకా ఐపోయాయి.” నరేంద్ర తేలికయ్యి ఉన్నాడు.
“బాగు బాగు.” అంది శ్యామల.
“పొలాల వారీగా పొలాల్లోనే వాటాలేసుకోవడం చక్కగా అయ్యింది. నాకు లక్కీగా పంచాయితీ గోదాం అద్దెకు కుదిరింది. నా వాటాల పంట నిల్వ కూడా చక్కగా కుదిరింది.” చెప్పాడు నరేంద్ర.
“చెల్లింపు లెక్కలన్నీ రాసుకున్నారుగా.” అడిగింది శ్యామల.
“ఆఁ. పక్కా రాసి పెట్టుకున్నా.” చెప్పాడు నరేంద్ర.
“మీ వాట అమ్మకమయ్యేకే లాభ నష్టాల బేరీజు అవగతం అవుతోంది.” చెప్పింది శ్యామల.
“అంతేగా మరి.” అన్నాడు నరేంద్ర.
“ఇప్పటి వరకు జరిగిన దాని బట్టి మీ అనుభవసారమేమిటి.” నవ్వింది శ్యామల.
“అనుకున్న దాని కంటే బాగానే పంటందింది. నాతో కలిసిన వాళ్ల మస్తు ఖుషీ అవుతున్నారు.” నరేంద్ర గొప్పయ్యాడు.
“మీ ఇద్దరి ఫ్రెండ్స్ నుండి అందిన అప్పులు గురించి ఏమైనా ఆలోచన చేసి ఉన్నారా.” అడిగింది శ్యామల.
“అవును. చెప్పలేదు కదా. వాళ్లతో మాట్లాడేను. వాళ్లు అసలు ఉంచి ఆ పైది చెల్లించమంటున్నారు. అసలును మరో పంటకు కొనసాగించకోవచ్చంటున్నారు.” చెప్పాడు నరేంద్ర.
“ఎందుకు అనరు. బయట కంటే అందుతున్న ఆ పైది మంచిగా మీరు ముట్ట చెప్పుతున్నారుగా.” అంది శ్యామల.
ఆ వెంబడే.. “మీరేం చేస్తారు.” అడిగింది.
“మీ అభిప్రాయం కోరుకుంటా.” నవ్వేడు నరేంద్ర.
“శివ శివ. మీరు మరిన్నూ.” చిన్నగా సిగ్గు పడింది శ్యామల.
“మీ వాటా పంట అమ్మకం అయ్యేక వీటి గురించి మాట్లాడుకుందాం.” చెప్పింది.
తలాడించాడు నరేంద్ర.
“నా మాట మాత్రం.. సాధ్యమైనంత వరకు అప్పుల బెడద వద్దు.” అంది.
“తొలుత కదా. కొత్త. అవసరాలు అమర్చుకోవాలి. అందుకే అప్పు వైపు మొగ్గాను.” చెప్పాడు నరేంద్ర.
“సరిసరే. ఇష్టపడి దిగేక అటు ఇటు ఉంటాయి. మనమే నిర్దిష్ట సమీకరణలతో యోచిస్తూ సాగుతుండాలి.” చెప్పింది శ్యామల.
“అట్టి విషయాల్లో నేను సేఫ్.” అనేసాడు నరేంద్ర సునాయాసంగా.
“ఎలా.” కళ్ల రెప్పలు టపటపలాడిస్తోంది శ్యామల.
“మీరు నాకు అండగా ఉంటున్నారుగా.” భలేగా చెప్పాడు నరేంద్ర.
“అరె. మీరు మరిన్నూ.” మురిపెంగా మురిసిపోతోంది శ్యామల.
ఆ తర్వాత.. “మీకు నా మీద అంత గురేమిటి.” మెల్లిగా అడిగింది.
నరేంద్ర ఆమెనే చూస్తూ చెప్పుతున్నాడు.. “ప్రత్యక్షంగా అగుపిస్తోంది.. నేను తరుచూ అనుభవిస్తున్నాను. నా ఇంతటి చేతకు మీరే చేవ అవుతున్నారు. ఇంతకంటే ఏం చెప్పేది. నిజంగా మీరు నా..”
అడ్డై.. “ఆపుతారా.” అంది శ్యామల. తల దించుకుంది.
ఆ వెంబడే.. “ఏమిటో మన మధ్య ఈ ట్యూనింగ్. గమ్మత్తుగా కుదిరింది.” అంది.
“నిజం. ఆల్ ఇన్ ఆల్ యు ఆర్ మై లక్కీ జెమ్. థట్స్ ఇట్.” చెప్పాడు నరేంద్ర. అప్పుడు అతడు శ్యామలనే చూస్తున్నాడు.
శ్యామల తలెత్తింది. నరేంద్రని నిండుగా చూస్తోంది.
‘ఐనా నువ్వు బయట పెట్టలేవు. నేను బయట పడలేను. ఇద్దరం అవస్థ అవుతున్నాం.’ అనుకుంది. వెంటనే నొచ్చుకుంది.
తర్వాత ఆ ఇద్దరూ ఎక్కవ సేపు మాట్లాడుకోలేక పోయారు.
లేచారు.
ఎవరి ఇళ్లకు వాళ్లు యాంత్రికంగా కదిలిపోయారు.
***
రాత్రి..
డిన్నర్ కెలికినట్టు ముగించేసి.. త్వరగా పక్కేసుకొని పక్కేసాడు నరేంద్ర.
“ఏమైంది సార్.” అడుగుతాడు కోటి.. నరేంద్ర వాలకం పసికట్టి.
“ఏమిటో.. తలంతా తిమిరెక్కినట్టు ఉంది కోటీ.” నసిగాడు నరేంద్ర.
“అధికంగా ఆలోచించకండి సార్. ఆలోచనలు బుర్రని స్తిమిత పర్చవు.” ఆరిందలా చెప్పాడు కోటి.
నరేంద్ర ఏమీ అనలేదు.
కోటి పనులు చక్కపెట్టే సొదన ఉన్నాడు.
ఇంచుమించుగా రెండు నిముషాల్లోనే నరేంద్ర ఫోన్ రింగవుతోంది.
నరేంద్ర లేస్తున్నాడు.
“ఉండండి సార్. ఫోన్ ఇస్తాను.” కోటి ఆ ఫోన్ ఉన్న స్టూల్ వైపుకు వస్తున్నాడు.
“లేదులే. నీ పని చేసుకో.” అటు వెళ్లి ఫోన్ తీసుకున్నాడు నరేంద్ర.
అది రింగవుతూనే ఉంది.
ఫోన్ వైపు చూస్తూనే.. ‘శ్యామల..’ అనుకున్నాడు.
లైన్ కలుపుతూనే ఇంటి అరుగును చేరాడు గుమ్మం తలుపు మూసేస్తూ.
‘ఆ టీచరే కావచ్చు.’ అనుకున్నాడు కోటి.
శ్యామలతో మాట్లాడుతున్నాడు నరేంద్ర.
“మీ వలన నా మైండ్ స్తంభించి పోయింది.” అటు నుండి శ్యామల ఆరోపిస్తోంది.
“డిటో. నా మైండ్ కూడా దొబ్బింది.” నరేంద్ర వెంటనే అనేసాడు.
“హేయ్. ఏంటా లాంగ్వేజ్.” శ్యామల కసిరింది.
“తప్పు మాటాడానా.” నరేంద్ర నాలుక కర్చుకున్నాడు.
“కొన్ని పదాలు ప్రాంతాల వరకే పరిమితమైతేనే ముద్దు. యూనివర్స్ యూసేజ్ లో ఇబ్బంది పెడతాయి..” చెప్పుతోంది శ్యామల.
అడ్డై.. “సారీ.” అనేసాడు నరేంద్ర.
“ఇట్స్ ఓకే.” అనేసింది శ్యామల.
“ఇందాక మీతో ముచ్చటించవలసిన సంగతి ఒకటి ఈ మెండ్ గోలతో ప్రస్తావించ లేకపోయాను.” చెప్పింది శ్యామల.
“ఏంటంటా.” నరేంద్ర ఆసక్తయ్యాడు.
“అదే. మీరు ఒక మారు.. మీతో కలిసి పని చేస్తున్న వారిని కూడదీసి.. వాళ్లు బూస్టప్ అయ్యేలా మాట్లాడాలి. మీరు చేపట్టబోయే తదుపరి పనులను సాధ్యమైనంత మేరన వివరించాలి. తద్వారా మీ మీద వాళ్లకు గురి ఏర్పడుతోంది. మరింత మంది మీతో కలిసి పని చేసే పర్సన్స్‌ని వారే సమకూర్చి పెట్టొచ్చు. మీరు అనుకున్నది రీచ్ ఐయ్యే వరకు మీరే చొరవవుతుండాలి. గాటిట్.” శ్యామల ఆగింది.
“యయ. గాటిట్.” అన్నాడు నరేంద్ర.
ఆ వెంబడే.. “థాంక్స్. మీరు నా బంగారు కొండ.” చెప్పాడు.
“అయ్యా సార్.. ఎన్ని మార్లు నన్ను పొగుడుతారు.” సరదాగా చికాకయ్యింది శ్యామల.
ఆ వెంబడే.. “ఇవి బిస్కట్లు మచ్చు కాదుగా.” అనేసింది.
గాభరా పడ్డాడు నరేంద్ర.
“అయ్యెయ్యో.. అలా అనేయకండి. నేను మనసారా అంటున్నాను. ప్రామిస్.” ఎకాఎకీన చెప్పేసాడు.
‘ఏమిటయ్యా నీ గుంజులాట. నాకీ సతమతం ఎన్నాళ్లు.’ అనుకుంటుంది శ్యామల.
“భోజనం ఐందా.” అడుగుతున్నాడు నరేంద్ర.
తెములుకొని.. “ఆఁ. మీది.” అడగ్గలిగింది శ్యామల.
“ఆఁ. చెప్పాగా సాయంకాలం మీ నుండి వచ్చిన మొదలు నా బుర్ర రవ్వంత పని చేయలేదు. ఏదో అటు ఇటుగా పనులు కానిచ్చేసి త్వరగా పక్కేసాను. అంతలోనే మీ నుండి ఫోన్..” చెప్పుతున్నాడు నరేంద్ర.
అడ్డై.. “సర్లెండి. చెప్పాలన్నది చెప్పేసాను. నేను పడుకుంటాను. మీరు బుర్రను నిమ్మళం పర్చుకొని పడుకోండి.” అంది శ్యామల.
“అంతేనంటారా.” దీనంగా అడిగాడు నరేంద్ర.
“ముమ్మాటికి.” అనేసింది శ్యామల.
ఆ ఫోన్ కాల్ కట్ ఐంది.. శ్యామల వైపు నుండే.
నరేంద్ర నిద్రకి తెములుకుంటున్నాడు.
***
మర్నాడు..
ఉదయం తొమ్మిదవుతోంది.
శ్యామల సూచన అమలుకై.. పొలంలో ఉన్నాడు నరేంద్ర తన సహచరులుతో.
“లక్కీగా ఈ మధ్యన వర్షాలు పడలేదు. పంట బాగా చేచిక్కింది. ఇక వర్షం కావాలి. చూస్తే ఒకటి రెండు రోజుల్లో వర్షాలు కురిసేలా ఉంది. ఆ తడి రాగానే అపరాలు పంటకు సిద్ధమవుదాం.” చెప్పాడు నరేంద్ర.
ఆ వెంబడే.. “నేను చాలా చోట్ల విన్నాను. మన వరి పంట దిగుబళ్లు అన్ని చోట్ల కంటే మెరుగ్గా బాగున్నాయట. మనం యంత్రాలు వాడుకున్నాం కనుక.. ఖర్చులు తగ్గాయి. సకాలంగా.. తొందరగా పనులు ముగిసాయి. దాంతో దిగుబళ్లు మంచి స్థాయిన స్థిర పడ్డాయి. మీ సహకారం బాగుంది. మనం ఇలానే కలిసి పని చేద్దాం. అనుకున్నది సాధిద్దాం. మనం ఆదర్శంగా నిలవాలి.” చెప్పుతున్నాడు నరేంద్ర.
మిగతా వాళ్లు స్తిమితంగా వింటున్నారు.
“నా వాటా పంటను వీలు చేసుకొని అమ్మేస్తాను. అలా వచ్చిన మొత్తం లోంచి కొంత మేరకు మన అభివృద్ధికై వెచ్చిస్తాను. మీతో పాటు నేనుగా.. నాతో పాటు మీరుగా మనం కలిసి మెలిసి ముందుకు కదులుదాం.” చెప్పడం ఆపాడు నరేంద్ర.
అప్పుడు అప్పలనర్సయ్య.. “బాబూ.. మీరు మాకు అందిన ఒక వరం. మిమ్మల్ని ఎరుగుతున్న మేము మిమ్మల్ని వదులుకోలేం. మీ వెంటే మేము.” అన్నాడు.
ఆ వెంబడే.. “మీరు అన్నట్టు వర్షం పడగానే తదుపరి పొలం పనులు మొదలెడదాం. మీరు మాత్రం ఇప్పటిలాగే ఆ నిపుణుల సలహాలతో తదుపరి పంట మంచిగా వచ్చేలా పనులు చేపట్టండి. మరో మారు అందరి పక్షాన చెప్పుతున్నాను.. మీ పని మాకు బాగుంది. మేమంతా మీతోనే ఉంటాం.” చెప్పాడు.
“తప్పక. అలాగే.. కొత్త వాళ్లు కూడా కలవాలనుకుంటున్నారుగా. వాళ్లతో మనం మాట్లాడాలి. వాళ్లనీ మనం కలుపుకు నడుద్దాం. అందరం సమిష్టిగా అభివృద్ధవుదాం. అప్పటి అవసరాల మేరకు బోరులు, మిగతావి సమకూర్చుస్తుంటాను.” చెప్పాడు నరేంద్ర.
అక్కడి వారు సరదా పడుతున్నారు.
“కోటీ.. ఈ లోగా ఇక్కడి పొలాల్లోకి కరెంట్ కనెక్షన్స్‌కై ప్రయత్నాల్ని ముమ్మరం చేయ్. నా అవసరం పడ్డప్పుడు చెప్పు. మనం చేయవలసింది చేద్దాం.” చెప్పాడు నరేంద్ర.. కోటితో.
కోటి.. “ఆ పనుల్లోనూ ఉన్నాను.” చెప్పాడు.
అందరూ కొద్దిసేపు అక్కడ గడిపి.. తర్వాత అక్కడ నుండి ఇళ్ల వైపు కదిలారు.
అప్పుడే అప్పలనర్సయ్య మరో మారు తన కూతురు విషయమై నరేంద్రని కదిపాడు.
“నేను ఈ మధ్య పనుల్లో పడ్డాను. ఆలోచించే సమయం లేకపోయింది. త్వరలోనే మనం ఆ విషయం తేలుద్దాం.” చెప్పాడు నరేంద్ర.
అప్పలనర్సయ్య.. “అవునవును. చూస్తున్నానుగా. మీకు ఖాళీ లేదు. అందుకే నేను ఇప్పటి వరకు ఆ ఊసు ఎత్తలేదు.” చెప్పాడు.
పిమ్మట వాళ్లూ అక్కడ నుండి కదిలారు.
***
మధ్యాహ్నం..
అప్పలనర్సయ్య ఇల్లు..
భోజనాలవుతున్నాయి.
“పనులు వలన నువ్వు చెప్పిన దాని గురించి నరేంద్ర బాబు ఆలోచించ లేక పోతున్నాడటమ్మా. ఉదయమే చెప్పాడు. త్వరలోనే చెప్తాడులే.” చెప్పాడు అప్పలనర్సయ్య.
“సర్లే నాన్నా.” అనేసింది అమ్మాజీ.
“చక్కగా వచ్చిన దానికి పోక.. ఈ దేవులాటలు ఎందుకే.” కూతురుతో అంది అన్నపూర్ణ.
అమ్మాజీ ఏమీ అనలేదు.
“సర్లేవే. తనకు నచ్చింది చేయనీ.” కలగచేసుకున్నాడు అప్పలనర్సయ్య.
“ఎంత చేసినా.. పెళ్లి తప్పదుగా. ఆ వచ్చిన వాడికి నచ్చకపోతే ఇవన్నీ దండగేగా.” గుణుస్తోంది అన్నపూర్ణ.
“అలాంటి మొగుడు నాకు వద్దు.” టక్కున అనేసింది అమ్మాజీ.
ఆ వెంబడే.. “పెళ్లికి ముందే అతడితో నేను పూర్తిగా మాట్లాడతాగా.” అనేసింది.
“ఏంటి నీ చోద్యం. పెళ్లికి ముందు పెళ్లికొడుకుతో మాటలా.” నోరు నొక్కుకుంది అన్నపూర్ణ.
అప్పలనర్సయ్య నవ్వుతాడు.
“ఓసే మొద్దూ.. నీ కాలం కాదే. ఇది ఈ పిల్లల కాలం.” అనేసాడు.
“ఏమో. నేను ఇప్పటికీ ఎరగను. ఇలాంటివేమిటి.” అంది అన్నపూర్ణ.
“మన పక్క లేదు కానీ. చాలా చోట్ల ఇప్పుడు ఇది మామూలే. పేపరు, టివి చూడవు నువ్వు. నీకెలా ఇట్టివి ఎరికవుతాయ్.” అన్నాడు అప్పలనర్సయ్య.
“నాన్నా.. అమ్మతో కాదు కానీ. మీరు భోజనం చేయండి.” ఈజీగా చెప్పింది అమ్మాజీ. అన్నంలో పెరుగు వేసుకుంటుంది.
“అయ్యో. ఏమిటమ్మా నీ తిండి. ఏం తిన్నావు.” ఆందోళనయ్యాడు అప్పలనర్సయ్య.
“ఆఁ. అడగండి. దానితో కలిసి మీరు ఈ మధ్య ఎప్పుడు తిన్నారు కనుక.. తెలియడానికి. తనట.. అదేదో.. ఆఁ. డయిట్ పరిమితులు పాటిస్తోందట. అప్పుడే ఒళ్లు బాగుంటుందట. చదువు కెళ్లిందిగా.. అక్కడి వాటం మరిగింది.” నొచ్చుకుంటుంది అన్నపూర్ణ.
తండ్రి, కూతురు ఏమీ మాట్లాడలేదు.
అమ్మాజీ భోజనం ముగించింది. తను లేచింది.
ఆ భార్యాభర్తల భోజనం కొనసాగుతోంది.
(ఇంకా ఉంది)