Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

నరేంద్ర ఐ యామ్ విత్ యు-10

[శ్రీ బివిడి ప్రసాదరావు రచించిన ‘నరేంద్ర ఐ యామ్ విత్ యు’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]

[నరేంద్ర ఇంటికి వచ్చేసరికి కోటి వంట చేస్తుంటాడు. పది నిమిషాల్లో పూర్తవుతుందని, తినవచ్చని చెప్తాడు. అన్ని పనుల్లోనూ కోటి కనబరుస్తున్న నైపుణ్యాన్ని నరేంద్ర మెచ్చుకుంటాడు. నరేంద్రతో పని చెయ్యడం తనకీ బావుందని అంటాడు కోటి. ఇంతలో అప్పలనర్సయ్య ఫోన్ చేసి, వీలైనంత త్వరగా తన ఇంటికి రమ్మంటాడు. అన్నం తిని వస్తానని చెప్తుండగా, ఛార్జింగ్ అయిపోయి, నరేంద్ర ఫోన్ ఆగిపోతుంది. ఫోన్‍ని ఛార్జింగ్ పెట్టి, అన్నం తింటుండగా, తాను ఇకపై నరేంద్ర వద్దే పని చేయాలనుకుంటున్నాననీ, తనకి ట్రాక్టర్ పనులు, వంట పనులుతో పాటు పొలం పనులు కూడా వచ్చనీ, తాను వ్యవసాయ పనులకు రోజుకూలీగా కూడా వెళ్ళేవాడినని చెప్తాడు కోటి. ఆలోచించి చెప్తానంటాడు నరేంద్ర. తిన్నాకా, కోటిని తలుపు వేసుకోమని చెప్పి, అప్పలనర్సయ్య ఇంటికి వెళ్తాడు నరేంద్ర. అప్పలనర్సయ్య, అన్నపూర్ణ కూర్చుని ఉంటారు. అమ్మాజీ అక్కడ లేదు. ఎందుకు హఠాత్తుగా రమ్మన్నారని అడిగితే, అమ్మాయి పరీక్ష తప్పిందని చెప్తాడు. అప్పలనర్సయ్య చాలా హైరానా అవుతున్నట్టు గమనిస్తాడు నరేంద్ర. అన్నపూర్ణ లోపలికి వెళ్ళి అమ్మాజీని పిలుచుకు వస్తుంది. అమ్మాజీకి ధైర్యం చెప్తాడు నరేంద్ర. తాను కోచింగ్ ఇస్తాననీ, తరువాత బ్యాంకు పరీక్ష బాగా రాయవచ్చని చెప్తాడు. దాంతో అప్పలనర్సయ్య, అన్నపూర్ణ సంతోషిస్తారు. ఇంటికొచ్చి నిద్రపోతాడు నరేంద్ర. మర్నాడు ఉదయం పొలం దగ్గర ఉండగా, వర్షం పడుతుంది. సాయంత్రం మళ్ళీ కోటితో కలిసి పొలానికి వెళ్తాడు నరేంద్ర. పూర్తిగా ఎండ కాస్తే ఎల్లుండి విత్తనం కట్టేద్దామంటాడు కోటి. దగ్గర్లో పనులు చేసుకుంటున్న జోగులు కలుగజేసుకుని కోటి చెప్పినది సరైనదే అంటాడు. కోటి ఇంటికి వెళ్ళి వంట చేస్తాడు. కాసేపయ్యాకా, నరేంద్ర కూడా ఇంటికి వెళ్ళి స్నానం చేసి ఫ్రెష్ అవుతాడు. బయటకి వెళ్ళడానికి సిద్ధమవుతాడు. – ఇక చదవండి.]

“ఆ అబ్బాయి పాఠాలు చెప్పుతానన్నాడుగా. అమ్మాయి అడుగుతోంది.” చెప్పింది అన్నపూర్ణ.. అప్పలనర్సయ్యకి టీ గ్లాస్ అందిస్తూ.

“చెప్పలేదా. ఉదయం అబ్బాయే చెప్పాడు. పంతులు గారిని కనుక్కోమని, అమ్మాజీకి ఎప్పటి నుండి పాఠాలు చెప్పొచ్చని.” టీ చప్పరిస్తున్నాడు అప్పలనర్సయ్య.

“మరేం. కనుక్కోవచ్చుగా.” చికాకవుతోంది అన్నపూర్ణ.

“అరె. పంతులుకు కబురు పెట్టా. అతడు వస్తాడనే నేను ఈ పూట పొలాల వైపుకి పోలే.” చెప్పాడు అప్పలనర్సయ్య.

“సరి సరే.” అక్కడ నుండి వెళ్లిపోతుంది అన్నపూర్ణ.

అప్పలనర్సయ్య టీని ఊదుకుంటూ తాగుతున్నాడు.

***

సమయం.. ఐదు ముప్పై రెండు పియం.

శివాలయం వెనుక భాగం చేరాడు నరేంద్ర.

‘తన కోసమే చూస్తున్నట్టు’ అగుపించింది శ్యామల.

“పూలు కోయడం ఐందా.” అడిగాడు.

వినిపించుకోనట్టు.. “తమరికి సైగల భాష తెలియదా.” నిష్ఠూరమవుతోంది శ్యామల.

ఇబ్బందయ్యాడు నరేంద్ర.

“అర్థం కాలే.” నంగిలా కదిలాడు.

“నిన్న తమరే చెప్పారుగా.. ఏదో విన్నవించుకోవాలని. దానికి నేను ‘ఆప్టర్ నైన్ పియం’ అన్నానుగా.. పైగా ఇలా సైగ చేసానుగా.” గబగబా అంది. నిన్నటిలా ఫోన్ కాల్ సైగ తిరిగి చేసి చూపింది.

ఆ వెంబడే.. “ఇలా అంటే.. ఈ సైగకు అర్థం తెలియదా.” అడిగింది.

“ఊఁ. తెలుసు. ఫోన్ కాల్ సైగగా.” నసిగాడు నరేంద్ర.

తననే శ్యామల చూస్తుండడంతో.. చూపు తిప్పుకుంటూ..

“మీరు చేస్తారో.. నేను చేయాలో నాకు అర్థం కాలేదు. పైగా నా అంతట నేను ముందు పడలేను.” చెప్పాడు. అతడు నేలనే చూస్తూ ఉండిపోయాడు.

“శివ శివ.” అనుకున్నట్టు బయటకే అనేసింది శ్యామల.

అంతలోనే చిరు చినుకులు మొదలయ్యాయి.

“భలే. వాన రావచ్చనుకున్నాను. కానీ మీరు వస్తారనే ఇలా వచ్చాను.” అక్కడ నుండి కదిలింది శ్యామల తెచ్చి పక్కన పెట్టిన గొడుగును తీసుకొని.

ఆమె పక్కనే వస్తూ.. “మీతో మాట్లాడాలి.” చెప్పుతున్నాడు నరేంద్ర.

“వాన పెరిగితే ఇబ్బంది. మనం ఇళ్లకు వెళ్లి పోదాం. మనకు ఫోన్లు ఉన్నాయిగా మాట్లాడుకుందాం.” చెప్పింది శ్యామల.

చినుకులు పెరుగుతుండడంతో గొడుగు వేసుకొంది.

“మీరు తడుస్తారు. బైక్ మీదేగా.. త్వరగా బయలుదేరండి. బట్ టేక్‌ కేర్.” అంది. వడివడిగా నడుస్తోంది.

బైక్ స్టార్ట్ చేసి కదిలాడు నరేంద్ర.

శ్యామల పక్కనే బైక్ ని పోనిస్తూ.. “డ్రాప్ చేయవచ్చా.” అడిగాడు మెల్లిగా.

“ఛుఫ్. వెళ్లండి.” అనేసింది శ్యామల.

ఆ వెంబడే.. “ఇంటికి వెళ్లేక ఫోన్ చేయవచ్చు.” చెప్పింది.

నరేంద్ర బైక్‌ని శ్యామలతోనే పోనిస్తూ.. వాళ్ల దారులు మారే వరకు మెల్లిగా వెళ్లగలిగాడు.

ఆ తర్వాత.. ఎవరి ఇళ్ల దార్లు వాళ్లు పట్టారు.

***

పావు గంట సేపు చెల్లాచెదురుగా పడిన వాన మెల్లిగా తగ్గింది.

మబ్బులు మూలంగానేమో చీకటి తొందరగా అగుపిస్తోంది.

కోటి వంట పని కొవ్వొత్తుల వెలుగులో కానిస్తున్నాడు.

“నేను వాకిట అరుగు మీద ఉంటాను. ఫోన్ మాట్లాలి.” చెప్పాడు నరేంద్ర.

“సార్.. చల్లగా ఉంది. కరెంట్ లేక వీథి లైట్లు లేవు. మీ ఇష్టం.” అనేసాడు కోటి.

నరేంద్ర గుమ్మం తలుపు తీసాడు. గాలి కొట్టింది.

“తలుపు దగ్గరగా మూస్తాను. కొవ్వొత్తులు ఆరిపోతాయి.” చెప్పాడు నరేంద్ర. ఆ వెంబడే తలుపు దగ్గరగా లాగేసి.. అరుగు మీద కూర్చున్నాడు.

శ్యామలకు ఫోన్ చేసాడు.

అటు శ్యామల లైన్ కలిపి.. “ఇంటికి చేరారా. తడిచిపోయారు కదూ.” చక చకా అనేక..

“ఇంటినే ఉన్నాను. బట్టలు తడిచాయి. మార్చుకున్నాను. పర్వాలేదు.” చెప్పాడు నరేంద్ర.

ఆ వెంబడే.. “ఏం చేస్తున్నారు. మీ పనికి ఆటంకం అవుతున్నానా.” అడిగాడు నరేంద్ర.

“లేదు లేదు. తమరు ఫోన్ చేయమన్నా చేస్తారో లేదో అని ఆలోచిస్తున్నాను.” అటు శ్యామల నవ్వుతున్నట్టు నరేంద్ర పోల్చుకున్నాడు.

“మీరే చేయమన్నారుగా.” అన్నాడు.

“అయ్యో. ఇంత మొగమాటం ఏమిటండీ.” అనేసింది శ్యామల.

నరేంద్ర ఏమీ అనలేదు.

“కోటి డిన్నర్ తయారు చేసి పెట్టాడా.” అడిగింది శ్యామల.

“వంట చేస్తున్నాడు.” చెప్పాడు నరేంద్ర.

“సీజన్ మారింది. వేడి వేడివి తినండి. పైగా ఇక్కడి వైద్య సదుపాయం అంతంత మాత్రమే.” చెప్పింది శ్యామల.

“నేను అన్నింటా ఆచి తూచి వహిస్తుంటాను.” చెప్పాడు నరేంద్ర.

‘తెలుసుకున్నాను నాయనా.’ అనుకుంది శ్యామల.

బయటికి మాత్రం.. “ఆఁ. చెప్పండి. ఏదో మాట్లాడాలన్నారుగా.” అడిగింది.

“అదే. అదే. రెండింటిన మీ అభిప్రాయాలు కావాలి.” చెప్పాడు.

తుష్ మంది శ్యామల. నరేంద్ర విన్నపాలు వదిలి, అభిప్రాయాలు కోరడంతో తను నిజంగా స్థిరం కోల్పోతోంది.

“హలో.. హలో..” ఇటు నుండి అంటున్నాడు నరేంద్ర.

ప్రయత్నంతో నిశ్చలంని కూడతీసుకుంటూ.. “అడగండి.” అంది శ్యామల.

“మొదటిది.. కోటి పనిని వదలడానికి ఇష్టపడడం లేదు. నాతోనే కలిసి పని చేస్తానంటున్నాడు. తనకు ట్రాక్టర్ పనులే కాదు.. పొలం.. పంట పనులు కూడా తెలిసినట్టు అగుపడుతోంది. ఇంటి.. వంట పనులు కూడా చేయగలుగుతున్నాడు. పైగా జీతంకై డిమాండ్ చేయనంటున్నాడు. ఏమంటారు.” ఆగాడు నరేంద్ర.

“ఉఁ. రెండోది.” అడిగింది శ్యామల.

“మొదటి దానికి మీ అభిప్రాయం తెల్పండి.” అడిగాడు నరేంద్ర.

“ఆలోచిస్తుంటాను బాబూ. రెండోది కూడా కానీయండి.” చిరాకయ్యింది శ్యామల. కానీ దానిని బయట పడనీయలేదు.

“రెండోది.. అప్పలనర్సయ్యగారి కూతురు అమ్మాజీ మీకు తెలుసుగా..” చెప్పుతున్నాడు నరేంద్ర.

అడ్డై.. “ఆఁ. అసలు సంగతికి రండి సార్.” విసురుగా అటు నుండి అంది శ్యామల.

“అదే. తన బ్యాంక్ ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చాయి. తను క్వాలిఫై కాలేదు. పాపం తను బాగా డిప్రెసయ్యింది. ఇప్పుడు నా కోచింగ్‌తో తను క్వాలిఫై అవుతోందని వత్తాసు పలికాను. దాంతో తను కుదురయ్యింది..” చెప్పుతున్నాడు నరేంద్ర.

శ్యామల గిలగిలాడిపోతోంది.

“చాలు ఆపండి. ఇక్కడ నా అభిప్రాయం ఏమిటో.” అంది జోరుగా.

“అదే. అప్పటికి ఆ అమ్మాయిని కూల్ పర్చాలని.. పైగా అప్పలనర్సయ్యగారిని చూసి ఒప్పేసుకున్నాను.. కానీ.. రోజూ గంటసేపైనా ఆ ఇంటికి ఆమె కోసమే వెళ్లాలి. వెళ్లినా నేను ఇచ్చిన కోచింగ్ తనకు మేలు చేయగలదా.” తంటా పడుతున్నాడు నరేంద్ర.

“మహానుభావా.. ఎవరో అన్నట్టు.. మీలో మస్తు షేడ్స్ ఉన్నాయి సార్.” అనేసింది శ్యామల.

“అయ్యో.. అలా అనేసారేమిటండీ.” విస్మయమయ్యాడు నరేంద్ర.

ఆ వెంబడే.. “ప్లీజ్.. ఈ రెండింటికి మీ అభిప్రాయాలు కావాలి. మీ వలనే నేను కుదురవ్వగలను.” మెల్లి మెల్లిగా అన్నాడు.

అప్పుడే కోటి తలుపు తీసాడు.

“వంట ఐంది. భోంచేద్దామా సార్.” అడిగాడు.

“ఫ్యూ మినిస్ట్. వచ్చేస్తాను.” చెప్పాడు నరేంద్ర.

కోటి తలుపు మూసేసాడు.

“ఏంటి భోజనంకి పిలుపా.” అడుగుతోంది శ్యామల.

“అవును.” అన్నాడు నరేంద్ర.

“సరే వెళ్లండి.” చెప్పింది శ్యామల.

“మరి.. మీ అభిప్రాయాలు.” నసిగాడు నరేంద్ర.

“కోటి విషయం.. మరి కొన్నాళ్లు అతడి పనులను కొనసాగించుకోవచ్చు. ఆ అమ్మాయి..” ఆగింది శ్యామల.

“ఆమె పేరు అమ్మాజీ.” చెప్పాడు నరేంద్ర.

“అబ్బ.. మీకు ఇలాంటి వన్నీ భలే గుర్తుంటాయి.” వెటకారంగా అంది శ్యామల.

ఆ వెంబడే.. “నా మీద.. ఐ మీన్.. నా అభిప్రాయం మీద మీకు మంచి గురే ఉంటుంది కదా.” అడిగింది.

“అమ్మో. నిజంగా. తప్పక గట్టి గురి నాకు. మీ మూలంగానే నేను బ్రైట్ కాగలుగుతున్నాను.” చెప్పాడు గొప్పగా నరేంద్ర.

శ్యామల కుదుటపడుతూ.. “ఇక మీదట మీరు నా అభిప్రాయం కోరే ముందు.. మీరు ఆ పనిని పెడింగ్‌లో పెట్టి.. నా అభిప్రాయం తర్వాత మీ నిర్ణయం ప్రకటించండి.” చెప్పింది.

ఆ వెంబడే.. “ఇంతకీ మీకు బ్యాంక్ ఎగ్జామ్ తీరు తెలుసా.” అడిగింది శ్యామల.

“ఆఁ. మునుపు నేను బ్యాంక్ జాబ్ ప్రయత్నం కూడా చేసాను. ఆ పద్ధతి నాకు తెలుసు.” చెప్పాడు నరేంద్ర.

“ఓహో. సరే కానీయండి. తనను గట్టెక్కించేలా శ్రమించండి. పిమ్మట కామ్ అవ్వండి. అన్నింటా ఇక తల దూర్చక..   మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారో మాత్రమే యాదిన పెట్టుకుంటూ మెసలండి.” సరసరా చెప్పింది శ్యామల.

“హమ్మయ్య. థాంక్సండీ. నేను మీ చేత మంచిగా తీర్చిదిద్దబడగలను.” అన్నాడు ఒక రకమైన భరోసా దొరికినట్టు.

‘లేదు సామీ.. మిమ్మల్ని మరింత చెక్కాలి.’ అనుకుంది శ్యామల.

“మరి. భోజనంకి వెళ్తాను.” చెప్పాడు నరేంద్ర.

“ఇంకా నయం. భోజనంకి నా అభిప్రాయం కోరడం లేదు.” గొణుక్కుంది శ్యామల.

“ఏమంటున్నారు.” అడిగేసాడు అటు శ్యామల మాటలు వినీ వినిపించినట్టు కావడంతో.

“గుడ్‌నైట్. నేను వండుకోవాలి.” అటు నుండి అనేసింది శ్యామల.

అప్పుడే కరెంట్ వచ్చింది.

అంతలోనే వాళ్ల ఫోన్ల సంభాషణ ఆగింది.

***

మూడు నెలలు గడిచిపోయాయి.

ఆ గడిచిన కాలంలో క్రమంగా జరిగిన వాటి ఫలితాలు..

విత్తనాలు మొదలు కొని.. ఎరువుల వరకు.. నిర్దిష్ట నిపుణుల సూచనల ప్రకారం.. ఎప్పటికప్పటి శ్యామల అభిప్రాయాల మేరకు.. తన కఠిన పరివేక్షణలతో.. తను సాగుకు పెట్టిన పొలాల్లో ఏపుగా పండిన పంటలను చూస్తూ నరేంద్ర ఎంతగానో పొంగిపోతున్నాడు.

నరేంద్రతో చేతులు కలిపిన మిగతా పొలందార్లు తొలిసారిగా ఘనమైన ఫలసాయ ఫలితాలను గొప్పగా అందుకోగలమని మిక్కిలి ఆనందపడిపోతున్నారు.

ఇవన్నీ చూస్తున్న ఆ గ్రామంలోని మిగతా పొలందారులులో చాలా మంది నరేంద్ర చెంతకు చేరాలని ఉవ్విళ్లూరిపోతున్నారు.

అలాగే నరేంద్ర అందించిన కోచింగ్ మూలంగా అమ్మాజీ బ్యాంక్ ఎగ్జామ్‌లో సునాయసంగా క్వాలిఫై ఐ.. ఇంటర్వ్యూ కై ఎదురు చూస్తోంది.

నరేంద్ర సంరక్షణలో కొనసాగుటకు కోటి ఎట్టి శ్రమను లెక్కచేయడం లేదు.

తన మనసెఱగలేక పోతున్నా.. తనను తన లక్కీ పెర్సన్ గానే ట్రీట్ చేస్తున్న నరేంద్రను చిన్నబుచ్చలేకపోతోంది శ్యామల.

***

ఉదయం ఆరున్నర  ప్రాంతం..

నరేంద్ర ‘మోర్నిగ్ వాకింగ్’లో ఉన్నాడు.

అతడి ఫోన్ రింగవుతోంది.

కాల్‌కు కనెక్టై..

‘ఈ సమయంలో ఫోన్ చేసారేమిటి శ్యామల గారూ.’ నరేంద్ర ఆందోళన పడుతున్నాడు.

“అమ్మ నుండి ఫోన్ వచ్చింది. నాన్న నిద్ర నుండి లేవడం లేదట. కోమా ఏమో.” వణుకుతోంది శ్యామల.

“అరె. మీరు కూల్ అవ్వండి.” చెప్పగలిగాడు నరేంద్ర.

ఆ వెంబడే.. “మీ ప్లాన్ ఏమిటి.” అడిగాడు.

“ఏడింటికి బస్సు వస్తోందిగా.  నాకు దగ్గరలోనే తెలుగు టీచర్ ఉన్నారు. వారి ద్వారా హెడ్మాస్టార్ గారికి  వారం రోజులుకు లీవ్ లెటర్ పంపి.. ఊరికి బయలుదేరతాను.” చెప్పింది శ్యామల.

“అలానా.” అనేసి..

“రానా.” అడిగాడు నరేంద్ర.

“వద్దు.” నానుస్తోంది శ్యామల.

“పర్వాలేదు. అప్పలనర్సయ్యగారికి, కోటికి పనులు పురమాయించేసి రాగలను.” చెప్పాడు నరేంద్ర.

“అలా అంటారా.” అనేసి..

“వద్దులెండి. నేను వెళ్లేక ఫోన్ చేస్తాను.” చెప్పింది శ్యామల.

“మీ ఇష్టం.” అనేసాడు నరేంద్ర.

ఆ తర్వాత.. శ్యామల తన అమ్మ వాళ్లింటికి ఎకాఎకీన బయలుదేరింది.

నరేంద్ర పనుల్లో పడ్డా అన్యమనస్కుడిగా కదలాడుతున్నాడు.

(ఇంకా ఉంది)

Exit mobile version