[2025 ఆగస్ట్ 16న శ్రీకృష్ణాష్టమి సందర్భంగా ఈ రచనని అందిస్తున్నారు శ్రీ గోనుగుంట మురళీకృష్ణ.]
త్యాగరాజు, అన్నమయ్య, రామదాసు, సదాశివ బ్రహ్మేంద్ర స్వామి వంటి వాగ్గేయకారుల రచనల గురించి సామాన్యులకు పరిచయం కలిగినది చలన చిత్రాల ద్వారానే! నటి భానుమతి తన స్వంత చిత్రాల్లో అలాంటి సంప్రదాయ కీర్తనలు తప్పనిసరిగా ఒకటి ఉండేటట్లు సందర్భం కల్పించేవారు. ఆమె స్వయంగా రచయిత్రి కాబట్టి అలాంటి సందర్భం ఉండేటట్లు కథను రాసుకుని, తానే గానం చేసేవారు. తర్వాత తరంలో దర్శకుడు కె. విశ్వనాధ్ కూడా ఆ సంప్రదాయాన్ని కొనసాగించారు. ఆయన దర్శకత్వం వహించిన ప్రతి చిత్రంలోనూ తానే కథను సమకూర్చుకుని, అలాంటి గీతం ఒకటి చిత్రీకరించేవారు.
‘శ్రుతిలయలు’ (1987) చిత్రంలో ఒక చక్కటి గీతం ఉన్నది. అది నారాయణ తీర్థుల వారు రచించిన ‘కృష్ణ లీలా తరంగిణి’ లోని ఒక తరంగం. దీన్ని గాయని వాణీ జయరాం గానం చేయగా తెరమీద సుమలత, మాస్టర్ షణ్ముఖ శ్రీనివాస్ అభినయించారు. కె.వి.మహదేవన్ సంగీతం సమకూర్చారు.
17 శతాబ్దానికి చెందిన కవి, శ్రీకృష్ణ భక్తుడు నారాయణ తీర్థులవారు. వారివి ముఖ్యంగా పన్నెండు తరంగాలు ప్రచారంలో ఉన్నాయి. ప్రధమ తరంగంలో శ్రీకృష్ణుడి పుట్టుక గురించి వర్ణన, ద్వితీయ తరంగంలో కృష్ణుడి బాల్య క్రీడలు, తృతీయ తరంగంలో గోవత్స పాలన వర్ణనం, సప్తమ తరంగంలో రాసక్రీడా వినోదం.. ఇలా ఒక్కొక్క తరంగంలో శ్రీకృష్ణుడి ఒక్కొక్క లీలను గురించిన వర్ణనలు ఉంటాయి. ప్రస్తుత గీతం తృతీయ తరంగం లోనిది.
నారాయణ తీర్థుల వారి జీవితం గురించి, వారి రచనల గురించి 29-06-2025 నాటి ‘సంచిక’ అంతర్జాల పత్రికలో డా. జి.వి.పూర్ణచందు గారు రచించిన ‘హరిచరణ స్మరణ పరాయణ శ్రీ నారాయణ తీర్ధ’ వ్యాసంలో ఇంకా సమగ్రంగా తెలుసుకోవచ్చు. వాగ్గేయకారుల రచనలు కొన్ని వందల ఏళ్ల క్రితంవి. అప్పుడు వాడుకలో ఉన్న కొన్ని పదాలు ఇప్పుడు వాడుకలో లేవు. వాటికి అర్ధాలు నిఘంటువులలో కూడా దొరకవు. రచయితలు ఎవరి దృష్టి కోణంలో నుంచీ వారు విశ్లేషిస్తూ ఉంటారు. అలాగే నాకు అర్ధమైనంత వరకూ ఆ తరంగం గురించిన విశ్లేషణ ఇప్పుడు చూద్దాం.
“ఆలోకయే శ్రీ బాలకృష్ణమ్
సఖి ఆనంద సుందర తాండవ కృష్ణమ్”
ఆలోకము అంటే చూడటం, దర్శించటం అని అర్ధం. అటు చూడు సఖీ! ఆనంద స్వరూపుడైన బాలకృష్ణుడు చేసే సుందరమైన తాండవం అని మొదలు పెడుతున్నారు తీర్థుల వారు ఈ తరంగంలో. తాండవం అంటే నృత్యం అని అర్ధం. శ్రీకృష్ణుడు కాళీయుడి పడగల మీద తాండవం చేయటం భాగవతంలో వర్ణిస్తాడు పోతన. ఆ నర్తకుడికి కాళీయుడి పడగలే నర్తన మంటపం. యమునా జలాలే రంగస్థలం. యమునా నదీ తరంగాలు మద్దెల వాయిస్తూ ఉన్నాయట. బృందావన పుష్ప లతికలపై తూగాడుతున్న తుమ్మెదలు పాట పాడుతున్నాయి. రాజహంసలు, బెగ్గురు పక్షులు తాళాలు వేస్తున్నాయి. ఆకాశంలోని దేవతలు ప్రేక్షకుల లాగా చూస్తున్నారు. ప్రేక్షకులు ఆనందంతో పుష్పవర్షం కురిపిస్తూ కరతాళ ధ్వనులు చేశారు. ఆ తాండవం భరించలేక కాళీయుడి తల ప్రాణం తోకలోకి వచ్చింది. రక్షించు, రక్షించు అని దీనంగా వేడుకున్నాడు.
కాళీయుడు ఇతరులకు అపకారం చేసే విషసర్పం కాబట్టి ఆ విధంగా అతడి గర్వం అణచి వేశాడు కృష్ణుడు. కానీ గోపికలతో చేసే ఆనంద తాండవం మరో విధంగా ఉంటుంది. ఎందుకంటే వారు కృష్ణుడికి భక్తులు గానీ విరోధులు కాదు. తర్వాత చరణంలో గోపికలతో కూడి నాట్యం చేసేటప్పుడు శ్రీకృష్ణుడి స్వరూపం ఎలా ఉన్నదో చెబుతున్నాడు ఇలా.
“చరణ నిక్వణిత నూపుర కృష్ణమ్
కర సంగత కనక కంకణ కృష్ణమ్
కింకిణీ జాల ఘణ ఘణిత కృష్ణమ్
లోక శంకిత తారావళి మౌక్తిక కృష్ణమ్”
ఇక్కడ నిక్వణము అంటే ధ్వని, సంగతము అంతే చేరిక, కింకిణి అంటే గజ్జలు, జాలము అంటే సమూహము, మౌక్తికము అంటే ముత్యము అని అర్ధాలు. పాదాల మీద అందెల ధ్వనులతో, చేతికి ఉన్న బంగారు కంకణాల, కాలి గజ్జల సమూహం చేసే ఘణ ఘణ సవ్వడులతో, ముత్యాల హారం మెరుస్తూ ఉండగా నాట్యం చేసే శ్రీకృష్ణుడిని చూడండి అని చెబుతున్నారు. ఇంతక్రితం చరణంలో రంగస్థలం యమునా నది అయితే, ఈ చరణంలో యమునా తీరం రంగస్థలం అయింది. పొన్నచెట్టు తెల్లటి పూలు పూసి చాందినీ కట్టినట్లుంది. ఈసారి ప్రేక్షకులు ఎవరంటే ఆకాశంలోని చంద్రుడు, తారకలు, చెట్ల మీద పక్షులు. ప్రతి గోపికా కృష్ణుడి పక్కన మెరుస్తూ సమంగా నృత్యం చేస్తున్నది. గోపికలు కృష్ణుడి వేణుగానానికి శ్రుతి కలిపి పాడుతున్నారు. కృష్ణుడితో కలసి నృత్యం చేస్తున్న గోపికలంతా మేఘంతో కూడిన మెరుపు తీగల్లాగా ఉన్నారు.
“సుందర నాసా మౌక్తిక శోభిత కృష్ణమ్
నందనందన అఖండ విభూతి కృష్ణమ్
కంఠోప కంఠ శోభి కౌస్తుభ కృష్ణమ్
కలి కల్మష తిమిర భాస్కర కృష్ణమ్”
విభూతి అంటే మహత్త్వము, గొప్పతనము అని, కంఠోపము అంటే సమీపము, తిమిరము అంటే చీకటి అని అర్ధాలు. అందమైన నాసికకు అలంకరించిన ముత్యంతో శోభిస్తున్నాడు శ్రీకృష్ణుడు. నందుడి యొక్క కుమారుడు, గొప్పదైన మహత్త్వము కలవాడు. బాల్యంలోనే పూతన, శకటాసురుడు. తృణావర్తుడు వంటి రాక్షసులను హతమార్చాడు కాబట్టి మహత్త్వము అనే మాట ఉపయోగించాడు కవి. కంఠానికి సమీపంలో కౌస్తుభ మణితో శోభిస్తున్నాడు. కలిపురుషుడి ప్రభావంతో కలిగే పాపాలు అనే చీకటిని పారద్రోలే సూర్యుని వంటి వాడు శ్రీకృష్ణుడు అని వర్ణిస్తున్నాడు.
నారాయణ తీర్థుల వారి వర్ణన, లీలాశుకులు రచించిన ‘శ్రీకృష్ణ కర్ణామృతం’ లోని వర్ణనను గుర్తుకుతెస్తుంది. అందులో ఇలా వర్ణిస్తాడు లీలాశుకులు.
“కస్తూరీ తిలకం లలాట ఫలకే వక్ష:స్థలే కౌస్తుభం,
నాసాగ్రే నవమౌక్తికం కరతలే వేణుం కరే కంకణం,
సర్వాంగే హరిచందనం ఛ కలయం కంటే చ ముక్తావళీ
గోపస్త్రీ పరివేష్టితో విజయతే గోపాల చూడామణి:”
(నుదుటన కస్తూరి బొట్టు, వక్షస్థలం మీద కౌస్తుభ మణి, ముక్కున కొత్త ముత్యం, చేతిలో పిల్లన గ్రోవి, హస్తాలకు కంకణాలు, శరీరంలో ప్రతి అవయవమునకు శ్రీచందనం దాల్చినవాడు, కంఠంలో ముత్యాలహారం ధరించినవాడు, గోపికలతో కూడియున్న వాడు, గోపాలురందరి లోనూ శిరోరత్నమైన వాడును, సర్వోత్క్రుష్టుడు అయిన హరిని ధ్యానించుచున్నాను).
ఇక మూడవ చరణంలో ఇలా చెబుతున్నారు తీర్థుల వారు.
“గోవత్స బృంద పాలక కృష్ణమ్
కృత గోపికా జాల ఖేలన కృష్ణమ్
నంద సునందాది వందిత కృష్ణమ్
శ్రీనారాయణ తీర్థ వరద కృష్ణమ్”
ఇక్కడ కృతము అంటే కల్పించ బడినది, ఖేలనము అంటే ఆట అని అర్ధాలు. గోవులను, వత్సాలను (దూడలు) పాలించే గోపాలుడు శ్రీకృష్ణుడు. బృదావనంలో శ్రీకృష్ణుడు గోవులను పాలించటం, తోటి గోపాలురతో కలసి చల్దులు ఆరగించటం చాలా బాగా వర్ణిస్తాడు పోతన భాగవతంలో. దూరంగా గడ్డిమేస్తున్న గోవులను “పూర్ణ చంద్రికా! సుధా జలరాశీ! మేఘమాలికా! సురభీ! మనోహారిణీ! సర్వమంగళా! శుభాంగీ! చింతామణీ! మంద మారుతీ! రండి!రండి!” అంటూ రకరకాల పేర్లు పెట్టి శ్రీకృష్ణుడు పిలుస్తూ ఉంటే ఆ పిలుపులలోని మాధుర్యానికి గోవులు కుండ పొదుగులతో పరుగెత్తు కుంటూ వస్తాయట.
ఈ ప్రపంచం తానే కల్పించాడు. తానే ఆడుకుని, తానే లయం చేస్తూ ఉంటాడు భగవంతుడు. తన చేతనే కల్పించబడిన గోపికల బృందాలతో నాట్యం చేస్తున్నాడు అని చెబుతున్నాడు నారాయణ తీర్థుల వారు. గోపికలు పూర్వ జన్మలో తపస్సు చేసుకునే ఋషులు. భగవంతుడిని ఆలింగనం చేసుకోవాలన్న కోరిక తీర్చటానికి కృష్ణావతారంలో వారికి గోపికల జన్మ లభించింది. ఈ విధంగా కారణ జన్ములైన గోపికలు భర్తలను, సకల బంధాలను వదిలించుకుని శ్రీకృష్ణుడి పాదాల చెంత పడి ఉండటమే జీవిత పరమార్ధమనీ, ఇంకేమీ అవసరం లేదనీ భావించే అనన్య భక్తులు. ఆయనతో ఆడి, పాడి, తమ మనసులను, తనువులను అర్పించుకోవటమే రాసక్రీడ. అంతే తప్ప రాసక్రీడ అనగానే తప్పుగా అర్ధం చేస్తుకోకూడదు. ఆనాడు నందుడు (కృష్ణుడి పెంపుడు తండ్రి), సునందుడు (యాదవ శ్రేష్టుడు) వంటి వారి చేత స్తుతించ బడినవాడు, ఈనాడు నారాయణ తీర్థుల వారికి వరము (మోక్షం) ఇచ్చేవాడు అయిన శ్రీకృష్ణుడికి నమస్కరిస్తున్నాను అని అర్ధం.
సినిమాలో ఉపయోగించుకుంది ఇంత వరకే! అసలు కీర్తనలో మరొక చరణం కూడా ఉన్నది. అది —
“నవనీత ఖండ దధి చోర కృష్ణమ్
భక్త భవ పాశ బంధ మోచన కృష్ణమ్
నీల మేఘ శ్యామ సుందర కృష్ణమ్
నిత్య నిర్మలానంద బోధ లక్షణ కృష్ణమ్”
నవనీతము అంటే వెన్న, దధి అంటే పెరుగు అని అర్ధాలు. ఇరుగు పొరుగు ఇళ్ళలో నుంచీ పాలు,పెరుగు, వెన్న దొంగిలించిన వాడు, భక్తుల యొక్క ఇహలోక బంధాల నుంచీ విమోచన కల్పించిన వాడు, నీలి మేఘం వంటి వర్ణంతో శోభిల్లే సుందరమైన ఆకారం కలవాడు, దర్శించిన వారికి నిత్యమూ నిర్మలమైన ఆనందం కలిగించే లక్షణం కలవాడు అయిన కృష్ణునికి నమస్కరించుచున్నాను అని భావం.. ఇదీ ఆ తరంగం యొక్క భావం.
Image Courtesy: Internet
గోనుగుంట మురళీకృష్ణ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. జన్మస్థలం గుంటూరు జిల్లా లోని తెనాలి. M.Sc., M.A. (eng)., B.Ed., చదివారు. చదువుకున్నది సైన్స్ అయినా తెలుగు సాహిత్యం పట్ల మక్కువతో విస్తృత గ్రంధ పఠనం చేసారు. ఇరవై ఏళ్ల నుంచీ కధలు, వ్యాసాలు రాస్తున్నారు. ఎక్కువగా మానవ సంబంధాలను గురించి రాశారు. వాటితో పాటు బాలసాహిత్యం, ఆధ్యాత్మిక రచనలు కూడా చేసారు. సుమారు 500 వరకు కధలు, వ్యాసాలు వివిధ పత్రికలలో ప్రచురిత మైనాయి. గురుదక్షిణ, విద్యాన్ సర్వత్ర పూజ్యతే, కధాంజలి వంటి కధా సంపుటులు, నవ్యాంధ్ర పద్యకవి డా.జి.వి.బి.శర్మ (కూర్పు) మొదలైనవి వెలువరించారు. ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం, స్ఫూర్తి పురస్కారం, సర్వేపల్లి రాధాకృష్ణన్ అవార్డ్, నాళం కృష్ణారావు సాహితీ పురస్కారం వంటి పలు అవార్డ్ లతో పాటు సాహితీ రత్న బిరుదు వచ్చింది.