Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

నన్ను ప్రోత్సహించిన మా టీచర్

[హైస్కూలు స్థాయిలో పాఠాలు చెప్పడమే కాకుండా, తన భావి జీవితానికి పునాది వేసిన తన టీచర్ సత్యగౌరి మోగంటి గారి గురించి వారి విద్యార్థిని వి. సుశీల ఉత్తరం రూపంలో వెలిబుచ్చిన కృతజ్ఞాతాభివందనాలు.]

గౌరవనీయులైన మేడమ్ గారికి,

మీ విద్యార్థిని వ్రాసుకుంటున్న గత స్మృతులు.

నా జీవిత గమనము, మీతో నా ఆత్మీయతానుబంధములు మరియు నా జీవిత సూచిక ఈ ఉత్తరంలో నిబిడీకృతమైంది.

నేను హైస్కూల్లో తొమ్మిదో తరగతి పూర్తి చేసుకుని పదో తరగతిలో అడుగుపెట్టాను. అప్పుడే మా ఇంటికి దగ్గరలో ఒక గృహములోకి అద్దెకు వచ్చారు. మిమ్మల్ని రోజూ పాఠశాలలో చూసేదాన్ని. కానీ అప్పటికి మీరు మా క్లాసుకు రాలేదు. కానీ నేను మిమ్మల్ని అనుకరణ చేసేదాన్ని. మీరు ఏదైనా ధైర్యంగా ఖండించి నిజాన్ని బయటకు తీసేవారు. ముఖ్యంగా ఆడపిల్లలతో ‘బాగా చదువుకుని మీ స్వశక్తితో పైకి రావాలి.

తప్పు చేయనప్పుడు ఎవ్వరికీ భయపడకూడదు’ అనేవారు. ఒక పోలీస్ ఆఫీసర్‌లా అనిపించేవారు.

మీరు అస్సెంబ్లీలో మైక్‌లో మాట్లాడితే నేను చాలా బాగా హాపీ ఫీల్ అయ్యేదాన్ని. మీలా ధైర్యంగా ఆడవాళ్లు మాట్లాడితే బావుండును అనిపించేది.

నేను చిన్నప్పటినుండీ భయపడుతూనే ఉండేదాన్ని. ఎందుకంటే మా చుట్టూ అనగా మేం పెరిగిన వాతావరణంలో స్త్రీలు చదువుకుని ధైర్యంగా మాట్లాడిన వారిని చూడలేదు.

ఆడవాళ్లు ఆచారాలు, మూఢవిశ్వాసాలతో మగ్గిపోవటం చూశాను.

మీరు ‘లా’ చదువుతున్నప్పుడు అనుకునేదాన్ని మీలాంటి వారు కరెక్టు లాయరైతే నిజాన్ని బయటకు లాగగలరని. స్త్రీలకు మీరు ఆదర్శప్రాయం.

~

నాకు 10th అయింది. ఫస్ట్ క్లాస్ వచ్చింది. అయితే మా ఇంట్లో ఆర్థిక పరిస్థితి బాలేక అమ్మ చదివించలేను అన్నది. అప్పటికే నా ఫ్రెండ్స్ అందరూ ఇంటర్‍లో జాయిన్ అయిపోతున్నారు. నేను చాలా చాలా ఏడ్చాను.

శ్రీమతి సత్యగౌరి మోగంటి

మేడమ్ గారూ ఒకరోజు సడన్‌గా మీరు అమ్మని పిలిచి ‘సుశీల ఏదీ కనబడటం లేదు’ అని అడిగారు. “ఇంటర్‍లో జాయిన్ చేయించలేనన్నానని రెండురోజుల నుండి ఏమీ తినకుండా ఏడుస్తూ ఇంట్లోనే ఉంది” అని మా అమ్మ మీతో చెప్పింది. వెంటనే మీరు స్పందించి విశాల హృదయంతో MLA గారితో మాటాడి ఇంటర్‌లో చేర్పిస్తాను అని చెప్పారని మా అమ్మ ఇంటికి వచ్చి చెప్పగానే నా ఆనందానికి అంతం లేదు.

ఆరోజు నేను మరచిపోలేను. అయితే అప్పటికే మీ ఇంటికి రోజూ వచ్చేదాన్ని.

మీ ఇంట్లో అందరూ నాకు మీ పిల్లలతో సమానంగా ప్రేమను పంచుతూ ఉన్నారు.

మీ బంధువులు వచ్చినా నన్ను చాలా బాగా చూసేవారు. అక్కడే ఒక్కోసారి నిద్రపోయేదాన్ని. అలానే మీ వంటలు బాగా ఇష్టపడేదాన్ని. నేను అప్పటికీ నాన్‍వెజ్, ఎగ్ ఏమీ తినేదాన్ని కాను. మీ ఇంట్లో వండిన కందిపొడులు, గోంగూర పచ్చడి, పులిహోరలు, పల్లీ ఉండలు, వినాయక చవితికి ఉండ్రాళ్లు నాకు చాలా ప్రీతిగా పెట్టేవారు. బామ్మగారు, తాతగారూ కూడా నన్ను సొంత మనవరాలిలా చూసేవారు. మా ఇంట్లో ఒక్క స్నానం, బట్టలు వేసుకోవడం, స్కూలుకి వెళ్లిపోవడం. సాయంత్రం నుండి రాత్రి 10 గంటలవరకూ మీ ఇంట్లోనే ఉండిపోయేదాన్ని.

~

మేడమ్ గారూ, డిసెంబర్ 31 వస్తే ఇంట్లో అందరినీ ఉల్లాసంతో, న్యూ ఇయర్ ముగ్గులు, అంత్యాక్షరి, ఇంకా ఎన్నో ఆటపాటలతో ఉండేవాళ్లము. ఆత్మీయులిగా, నాకెంతో ధైర్యం చెప్పేవారు. ఎందుకంటే నాకు బాల్యంలోనే తండ్రి ప్రేమ దక్కలేదు. కుటుంబ బంధాలు తెలియవు. నాకు లోకజ్ఞానం అప్పుడు అస్సలు లేదు. ప్రతి చిన్న విషయానికి ఏడవడం, చనిపోవాలనుకోవడం లాంటి ఆలోచనలే ఉండేవి.

మేడమ్ గారూ, మాధురి, పృథ్వి, బంధువులు, బామ్మగారు, తాతగార్లతో మీ ఇంట్లో నిత్యం ఆనందపరవశంగా ఉండేది. మేడమ్ గారూ, సార్ కూడా నాకు అతి మిక్కిలి శ్రేయోభిలాషులు. నన్నెప్పుడూ ఆయన వారి అమ్మాయి లాగనే “ఏమిటమ్మా తల్లీ సుశీలా చెప్పరా” అనేవారు.

ఏమిటమ్మా తల్లి అనే పిలుపు నా గుండెల్లో ఒక ఆదరం తెచ్చేది. ఆ విధంగా మేడమ్ గారు, సారూ మీ ఇద్దరూ గురువులుగా కాదు, అతి ముఖ్యమైన జీవితబంధు ప్రేమను పంచారు.

మేడమ్ గారు మీరు ఎమ్.ఎల్.ఏ గారింటికి తీసుకెళ్లి నా పరిస్థితి చెప్పి ఇంటర్‌లో జాయిన్ చేయించారు.

అంతేకాదు మీరు చేర్పించడమే కాదు ఇంటర్ చదవమని ప్రోత్సాహించి చేయూతనిచ్చారు.

అయితే, ఒక ఉపాధ్యాయుడు డ్రిల్ మాష్టారి రుణం కూడా నేను తీర్చుకోలేను. ఎందుకంటే, సార్ కూడా ఎం.ఎల్.ఎ. గారితో మాట్లాడారు. ఊరి ఆడపిల్లగా, ఇంటర్ చదువుతుండగా ఊళ్లో ఎవ్వరూ నన్ను కామెంట్స్ చేయకుండా నా పట్ల మంచి తండ్రి పాత్ర పోషించారు.

నేను ఏ బాధ అయినా ఆయనతోనే చెప్పుకునేదాన్ని. ఆయన కాకినాడ ట్రాన్స్‌ఫర్ మీద వెళ్లిపోతుంటే బాధ తట్టుకోలేకపోయాను. కాకినాడ వెళ్ళి సార్‍ని స్కూల్లో కలిసి వస్తుండేదాన్ని.  వాళ్ళ అమ్మాయి అనిత అక్క అంటే నాకు బహు ప్రీతి. అలాగే, నేను టి.టి.సి ఫీజు కట్టలేనపుడు ఆయనే కట్టారు. ఇంటర్‌లో కూడా పుస్తకాలు కొన్నారు. పాఠశాల విద్యార్థులతో ఎక్స్‌కర్షన్‌కి కూడా నన్ను తీసుకెళ్లారు.

నేను ఇంటర్ లో ఉండగా కాలేజీ వార్షికోత్సవము సందర్భంగా స్కిట్ వేశాను. అది సోది చెప్పే వేషం. మేడమ్ గారూ మీరు ఆ వేషం చాలా బాగా వేశారు. నాకు ట్రెయినింగ్ కూడా ఇచ్చారు. ప్రదర్శన అయ్యాకా, బాగా వేశానని అన్నారు.

మేడమ్ గారు ఎప్పుడో ఇదే పాత్ర వేసిన ఫోటో చూపిస్తే భలే ఉంది నేను వేయగలనా అనుకున్నాను.

మేడమ్ గారూ మీ అంత బాగా ఏక పాత్రాభినయం చేయకపోయినా పరవాలేదు, మీ ఇన్‍స్పిరేషన్‌తో చేశాను.

క్రమేపి నా కుటుంబ పరిస్థితులు కరడుగట్టాయి. ఇంటర్ ఫస్ట్ క్లాస్ వచ్చింది. ఆ టైమ్‌లో విద్యాశాఖ మంత్రిగా చేసిన బాలయోగిగారు నన్ను అభినందించారు. ఆడపిల్లలు బాగా చదువుతున్నారన్నారు. అయితే నన్ను ప్రోత్సహించిన ఆ గురువులదే ఈ ఘనత అనుకున్నాను.

మట్టిలోనున్న రాయిని పదనుపెడితేనే ప్రకాశిస్తుంది. నన్ను ప్రకాశింపజేసింది మేడమ్ గారూ మీరే.

ఇంటర్ బేసిక్ లేకపోతే క్లర్క్ పోస్టు కూడా రాదు. ఇంటర్ అయ్యేలోగా మా తమ్ముడి అల్లరి, చెడు స్నేహాలు ఎక్కువైనాయి. ఇంట్లో అన్నీ పగలగొట్టడం, నన్ను తిట్టడం, అమ్మని ఏడిపించడం చేసేవాడు. ఆ టైమ్‌లో ఇంటర్ పాసవ్వడమే కష్టమనిపించేది వాడు పెట్టే చిత్రహింసలకు. నేను మా జయబాబు మాస్టారింటికి పోయి ఏడ్చేదాన్ని. ఆయన ఇచ్చే ధైర్యంతో బ్రతుకు మీద గెలవాలనే పట్టుదల, కసి పెరిగాయి. తమ్ముడిని పిలిచి తిడితే కొంతకాలం బాగున్నాడు. అలా నా పయనంలో మేడమ్ గారు కొన్ని సంవత్సరాలు కాకినాడ తరలిపోయారు.

శ్రీమతి సత్యగౌరి మోగంటి

నేను ఇంట్లో సంవత్సరం ఖాళీగా ఉండిపోయాను. తర్వాత కష్టపడి అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటి డిగ్రీ కట్టాను. అలాగే విద్యావాలంటీరుగా పనిచేస్తూ డిగ్రీ చదివాను.

నేను కాకినాడ వెళ్లడమంటే గగనంగా ఉండేది. వెళ్తే మేడమ్ గారూ మీ ఇంటికి వచ్చేదాన్ని.

నా ప్రయాణంలో చాలా ఆటుపోట్లు, దెబ్బలు, నిందలు, అవమానాలను భరించి ముందుకు సాగాను.

నా జీవిత రథసారథులు మా మేడమ్ గారు మీరు, మీ ఫామిలీ ప్రేమ బంధాలు, డ్రిల్ మాష్టారి ఆప్యాయత, ఆత్మీయత ఒక కారణము.

గురువులు అజ్ఞానం పోగొట్టి జ్ఞాన జ్యోతిని వెలిగిస్తారు. కానీ నా గురువులు నా జీవితంలోనే వెలుగులు నింపారు.

నేను ఇంటర్ చదవలేకపోయినా, వారి సపోర్టు నాకు లేకపోయినా ఈరోజు డి.ఎస్.సి లో సోషల్ స్కూల్ అసిస్టెంట్ గా 2వ రాంకు తెచ్చుకుని ఒక ఉపాధ్యాయినిగా వెలిగేదాన్ని కాను.

నన్ను వెలిగించిన నా గురువుకు శిరసు వంచి నమస్కరిస్తున్నా.

నా కలంతో రాసిన ఈ రాతలు ఇన్నాళ్లకు పంచుకొనే అవకాశం వచ్చింది. మా మేడమ్ గారికి నిండు కృతజ్ఞతలు.

~

మేడమ్ గారూ మీతో నా మధుర స్మృతులు మరియు నా లక్ష్యా నిర్దేశ మార్గంలో ముందుకు నడిపించినవి మరికొన్ని గుర్తుకొస్తున్నాయి.

మీతో నా మధుర స్మృతులు సెలయేరులా ప్రవహిస్తూ ఆనందాన్ని తీసుకు వస్తున్నాయి.

ఆ రోజుల్లో మీరు మంచి నాటికలు, నాటకాలు వేయించారు.

నేను మీ ఇంట్లో  మీతో ఉన్న అనుబంధాన్ని బట్టి మీ యొక్క యాక్టివిటీస్, అవార్డుల ఫోటోస్ చూసి చాలా ఇన్‍స్పైర్ అయ్యాము.

అలాగే స్కూల్ యానివర్సరీ జరిగితే అందరినీ ఉల్లాసపరిచేవారు. మీ ఇంట్లో కోయ యువతి, కోయడాన్స్ ఫోటోలు చూశాను. చదువుకోని స్త్రీలకు అక్షరగోదావరి, చైతన్య టీమ్ వంటి ప్రోగ్రామ్‌లు, మీ ఫోటోలు చూశాను. అలానే ఒకరోజు మా అమ్మను పిలిచి  “ఆడవాళ్లకు చదువు చాలా అవసరం. స్త్రీకి అక్షర జ్ఞానమే, సంస్కారమే ముందుకు నడిపస్తుంది” అన్నారు.

ముఖ్యంగా మీరు ప్రతి విషయంలో స్త్రీలను ప్రోత్సహించేవారు. వాళ్లతో మమేకం అయిపోయేవారు. ఆ రోజు అంత టెక్నాలజీ లేని కాలంలో మీరు మా ఊరులాంటి పల్లెటూరులో అలా మమేకం అయిపోవడం నాకు చాలా స్ఫూర్తినిచ్చింది.

అందుకే మీలో సాంఘిక ఉపాధ్యాయినిని మాత్రమే కాదు ఒక మహిళా స్ఫూర్తిదాయిని కనిపించారు. నేను మీలాంటి టీచర్‌ను ఆదర్శంగా తీసుకున్నాను.

టెక్నాలజీ అంతగా లేని ఆ రోజుల్లోనే సైన్స్ ఫెయిర్లు, విజ్ఞాన యాత్రలు, నాటికలు వేయించడం, అలాగే సౌరకుటుంబం లాంటి మోడల్స్ తయారు చేయించడం అన్నీ ఇప్పటికీ జ్ఞాపకమే.

వి. సుశీల

అందుకే నాకు కూడా మంచి మోడల్స్‌తో విద్యార్థులకు బోధించడం ఇష్టమైనది.

మరికొంత టెక్నాలజీ జోడించి యూట్యూబ్ చానల్ క్రియేట్ చేసిపిల్లలతో మంచి మోడల్స్, ఏకపాత్రాభినయాలు, భువన విజయం వంటివి చేయించాను. ఒక టీచర్ అంటే కేవలం టెక్స్ట్ బుక్ పాఠాలు బోధించడమే కాదని మీ ద్వారా తెలుసుకున్నాను మేడమ్.

జీవితమును ధైర్యంతో పోరాడి గెలవాలని నేర్చుకున్నాను. మీలో ఉండే ధైర్యం నాకాదర్శం.

స్కూల్లో  10వ తరగతిలో వార్షికోత్సవం జరిగినపుడు మీరే వేదిక మీద అధ్యక్షులుగా ఉన్నారు. ఎన్నో చక్కటి సందేశాలను పేరెంట్స్‌కి కూడా ధైర్యంగా అందించారు.

ఆడపిల్లలను చదివించండని చెబుతూ మంచి నాటిక కన్యాశుల్కం వేయించారు (చిన్న స్కిట్). అలా దాని ద్వారా పిల్లలకు, పేరెంట్స్ కు కూడా  మంచి మెసేజ్ అందించారు.

అందుకే మిమ్మల్ని టీచర్ గానే కాకుండా మంచి మార్గ నిర్దేశకురాలిగా భావిస్తాను.

చిన్నప్పుడు అందుకే ‘కర్తవ్యం’ సినిమాలో విజయశాంతిగా ఊహించుకున్నాను.

జనవరి 1వ తేదీన మీకు గ్రీటింగ్ విజయశాంతిదే ఇచ్చి విష్ చేశాను.

నా అనుభూతులు, అనుభవాల చుట్టూ మీ ఆదర్శాలు చాలా ముడిపడి ఉన్నాయి మేడమ్.

మీలా తారాజువ్వలా ముందుకు దూసుకుపోవాలనిపిస్తుంది. కానీ నేనింకా అంత వరకూ చేరలేకపోతున్నాను మేడమ్. గ్రామంలో మూఢాచారాల వ్యక్తుల మధ్య మీలాంటి మహిళా మణికర్ణికలు అవసరం మేడమ్.

స్కూల్లో పిల్లలను పిలిచి ఇంటి దగ్గర టిఫిన్ చేశారా అని అడిగి తెలుసుకొని ఒక్కొక్కసారి మీరు తెచ్చుకున్న పులిహోర పెట్టేవారు. నేనూ నా ఫ్రెండ్స్ కూడా తిన్నాము.

అలాగే పిల్లలు ఎవరైనా డల్‌గా ఉంటే వ్యక్తిగతంగా పిలిచి వాళ్ల ఇంటి పరిస్థితి తెలుసుకుని వారి పేరెంట్స్‌తో మాట్లాడేవారు. వారి అవసరాన్ని బట్టి సహాయ సహకారాలు అందించేవారు.

అందుకు నేనే ప్రత్యక్ష ఉదాహరణ. మా అమ్మతో మాటాడి ఇంటర్ చదివేలా చేసింది మీరే.

ఒక చిన్న కొవ్వొత్తి వేల కొవ్వొత్తులను వెలిగించగలదనపిస్తుంది.

మీ దగ్గర చదువుకున్న వారు చాలా మంది మంచి స్థాయిల్లో ఉన్నారు ఇప్పటికీ మేడమ్.

మీ విధేయురాలు,

వి. సుశీల

సోషల్ స్కూల్ అసిస్టెంట్.

Exit mobile version