[డా. చెళ్లపిళ్ల సూర్య లక్ష్మి గారి ‘Soul-searching’ అనే ఆంగ్ల కవితను అనువదించి అందిస్తున్నారు కొల్లూరి సోమ శంకర్.]
నా వెన్ను విపరీతంగా నొప్పెట్టింది, ఆశ్చర్యం కలిగింది
‘ఈ మధ్య తగిన దెబ్బ వల్ల కావచ్చు’ అనుకున్నా.
కాని నా మనసు నమ్మకంగా చెప్పింది,
‘నిన్ను పొడిచిన అన్ని వెన్నుపోట్ల ఫలితం అది’
నా కడుపు తీవ్రమైన మంటతో విలవిల్లాడింది
ఈమధ్య ఏర్పడిన అసిడిటీ వల్ల అనుకున్నాను
కాని నా మనసు నమ్మకంగా చెప్పింది,
‘సమాజం నీలో నింపిన నెగటివిటీ ఫలితం అది’
నా అవయవాలు బాధతో మూలిగాయి, నేను చిరాకుతో భుజాలెగరేస్తూ
మీద పడుతున్న వయసుపై నింద మోపాను.
కాని నా మనసు నమ్మకంగా చెప్పింది,
‘ఋజువర్తన కోసం నువ్వు తిన్న అన్ని గట్టి దెబ్బల ఫలితం అది’
నేను నా ఆత్మని అడిగాను, జవాబిచ్చింది ఉదాసీనంగా
‘విశ్వాసం ఉన్న చోట, వెన్నుపోటుంటుంది;
సానుకూలత ఉన్న చోట; ప్రతికూలత కూడా ఉంటుంది;
‘నిజాయితీ ఉన్న చోట, అన్యాయపు పీడన ఉంటుంది.’
ఇంకా చెప్పింది, ఆనందంగా, ‘గుర్తుంచుకో
ఇతరులు అనుమానించినప్పుడు నువ్వు నమ్మావు;
ఇతరులు మూర్ఖంగా ఉన్నప్పుడు నువ్వు హేతుబద్ధంగా ఉన్నావు;
ఇతరులు స్వార్థంతో ప్రవర్తించినప్పుడు, నువ్వు సత్యం కోసం నిలిచావు.’
‘అందుకే, సదా సంతోషాన్ని ఎంచుకో, చెడుని విస్మరించు;
నీకు ఎదురైన మంచికంతటికి కృతజ్ఞత చూపించు.
వాంఛనీయమైన ఈ వైఖరి, అంత సులువుగా అలవడదు;
అలవర్చుకుంటే, శారీరక బాధ – నీ హృదయంలోని పరమానందం ముందు దూదిపింజయి పోతుంది.’
~
ఆంగ్ల మూలం: డా. చెళ్లపిళ్ల సూర్య లక్ష్మి
అనువాదం: కొల్లూరి సోమ శంకర్.
కొల్లూరి సోమ శంకర్ రచయిత, అనువాదకులు. బి.ఎ.డిగ్రీతో గ్రాడ్యుయేషన్. మానవ వనరుల నిర్వహణలో పిజి డిప్లొమా చేసారు. దక్షిణ భారత హిందీ ప్రచార సభ వారి భాషా ప్రవీణ పాసయ్యారు. ప్రస్తుత నివాసం హైదరాబాదు.
సోమ శంకర్ 2001 నుంచి కథలు రాస్తున్నారు. 2002 నుంచి కథలను అనువదిస్తున్నారు. కేవలం కథలే కాక ‘ది అడ్వెంచర్స్ ఆఫ్ పినోకియో’ అనే పిల్లల నవలను ‘కొంటెబొమ్మ సాహసాలు’ అనే పేరుతోను, ‘మాజిక్ ఇన్ ది మౌంటెన్స్’ అనే పిల్లల నవలను ‘కొండలలో వింతలు’ అనే పేరుతోను, వినయ్ జల్లా ఆంగ్లంలో రాసిన ‘వార్స్ అండ్ వెఫ్ట్’ అనే నవలని ‘నారాయణీయం’ అనే పేరుతోను, వరలొట్టి రంగసామి ఆంగ్లంలో రాసిన ‘లవ్! లవ్! లవ్!’ నవలను ‘సాధించెనే ఓ మనసా!’ పేరుతోనూ, అజిత్ హరిసింఘానీ రచించిన ట్రావెలాగ్ ‘వన్ లైఫ్ టు రైడ్’ను ‘ప్రయాణానికే జీవితం’అనే పేరుతోను, డా. చిత్తర్వు మధు ఆంగ్లంలో రచించిన ‘డార్క్ అవుట్పోస్ట్స్’ అనే స్పేస్ ఒపేరా నవలను ‘భూమి నుంచి ప్లూటో దాకా’ అనే పేరుతోనూ; అమర్త్యసేన్ వ్రాసిన ‘ది ఐడియా ఆఫ్ జస్టిస్’ అనే పుస్తకాన్ని, మరో నాలుగు పుస్తకాలను తెలుగులోనికి అనువదించారు. ‘దేవుడికి సాయం’ అనే కథాసంపుటి, ‘మనీప్లాంట్’, ‘నాన్నా, తొందరగా వచ్చెయ్!!’, ‘ఏడు గంటల వార్తలు’ అనే అనువాద కథా సంపుటాలను ప్రచురించారు.