[యామిని కోళ్ళూరు గారు రచించిన ‘నన్ను కోరే’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము. సంచిక సాహితి ప్రచురణలు సంయుక్తంగా నిర్వహించిన 2025 శ్రీ విశ్వావసు ఉగాది కవితల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కవిత.]
కాలంతో పరిగెడుతు చంచలమైనది
కనపడనిది మాటున దాగివుండేది
ఊసరవెల్లిలా రంగలు మార్చేది
ఎదురుగ రాక ఈచోట ఏచోటైనా సంచరించేది
శిఖరాలు ఎక్కిస్తూనే పాతాళంలోకి తోసేది
సౌఖ్యంతో ఆనందిస్తూ ఓడితే ధైర్యం కోల్పోయేది
అంతలో పలాయనంతో చిత్తగించేది..
దేనికోసమో అన్వేషిస్తూ పరితపిస్తూ
మధురమైన భావనలకు స్పందిస్తూ
ప్రకృతిలోని ప్రతిఅందాన్ని తిలకిస్తూ
మోయలేని భారాలెన్నింటినో అవలీలగా మోస్తూ
రోజూ ఇలానే అనేలా ఆలోచింపచేయిస్తూ
ఒంటరివేళ పదాలవెంట పరుగులు తీయిస్తూ
విడదీయలేని బంధంలా నిత్యం చిగురిస్తూ..
శిల్పి చెక్కిన శిల్పం కన్న మిన్నగా
నిత్యం మదిలో మెదిలే దీపకాంతిలా
గుండెలో తట్టిలేపేటి సవ్వడిలా
నిస్సహాయత నైరాశ్యం బద్ధకం వీడమనేలా
జీవితమనే పుస్తకంలో ప్రతిపేజీలా
పొత్తిళ్ళలో ఊపిరిపోస్తూ లాలిస్తూ అమ్మలా
మెరుగులు దిద్దుతూ రోజు పుష్పించే కుసుమంలా
నా ఆధీనంలో వున్న ఏమాత్రం
చేజారనీయక శృతి తప్పనివ్వక
అరమరికలకి తావీయక ఆల్చిప్పలోని
ముత్యంలాంటి అక్షరాలని సాధన చేస్తూ
రమణీయ సొగసుల కవితలల్లుతూ
సుధా ధారలా ప్రవహింపచేస్తూ నన్ను
కోరే నా మనసు..