[తెలుగు సాహిత్యం పట్ల కొన్ని తరాలలో ఆసక్తి రగిలించి, ఆధునిక తరానికి వ్యక్తిత్వ వికాస పాఠాలు చెప్తూ, యువతకు ఉత్తమ సాహిత్యం ద్వారా ఉత్తమ వ్యక్తిత్వాన్నివ్వాలని నిరంతరం తపించే యువభారతి సంస్థ స్థాపించి వచ్చే దసరాకు 60 సంవత్సరాలు పూర్తవుతాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని తెలుగు సాహిత్యానికి, సమాజానికి యువభారతి చేసిన సేవను తెలుగు పాఠకులకు పరిచయం చేసే ఉద్దేశంతో ప్రతి ఆదివారం సంచికలో యువభారతి ప్రచురించిన పుస్తకాల పరిచయం వుంటుంది. ఈ శీర్షిక వచ్చే విజయదశమి వరకూ సాగుతుంది.]
నన్నెచోడుని కవితా వైభవం
ఆంధ్ర సాహిత్యంలో పురాణేతిహాసాలు వెలువడుతున్న రోజుల్లో వర్ణనా ప్రధానమైన అలంకారిక రచనకు అంకురార్పణ చేసి కావ్య మార్గాన్ని రసకుసుమోపేతంగా తీర్చిదిద్దినవాడు నన్నెచోడ దేవుడు.
తెలుగు సాహిత్యమున నన్నయ కావ్య సంప్రదాయమునకు ఆది కవిగా ప్రసిద్ధికెక్కగా, నన్నెచోడ కవి ప్రబంధ కవితకు ప్రథమాచార్యుడు. ఈయన రచించిన కుమార సంభవము నవ రసములతో, దశ కావ్య గుణములతో, అష్టాదశ వర్ణనలతో, ముప్పది యారు అలంకారములతో సర్వలక్షణ సమన్వితయై విరాజిల్లుచున్నది. ఈయన రచించిన ‘కుమార సంభవము’ అవతరించినది మొదలు, పాల్కురికి సోమనాథుడు, కేతన, తిక్కన, మంచెన, శ్రీ కృష్ణదేవరాయలు వంటి ఎందఱో తరువాతి కవులు ఆయనను అనుసరించారు.
నన్నెచోడుడు సింహాసనమును అధిష్టించి రాజ్యము నేలెనో లేదో తెలియదు కానీ, కావ్య సింహాసనమును అధిష్టించి కవితా సామ్రాజ్యమేలిన మాట తథ్యము. అతడు కవి సార్వభౌముడే కాదు. రాజ కవి సార్వభౌముడు. అతని కృతి ఆంధ్ర సరస్వతికి మణి కిరీటము.
క్రింద ఇవ్వబడిన link ను క్లిక్ చేసి ఈ పుస్తకాన్ని ఉచితంగానే చదువుకోండి.
లేదా క్రింద ఇవ్వబడిన QR code ను scan చేసినా ఆ పుస్తకాన్ని ఉచితంగా చదువుకోవచ్చు.
శ్రీ పత్రి అశ్వనీ కుమార్ గారి నివాసం నవీ ముంబై, మహారాష్ట్ర.
విద్యాభ్యాసం అంతా విజయవాడ లోనే జరిగింది. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం నుండి MBA పట్టా పుచ్చుకుని, ఉద్యోగార్ధం హైదరాబాద్ వచ్చిన తర్వాత యువభారతి సంస్థతో (1982) నలభై ఏళ్ళ అనుబంధం.
వృత్తిరీత్యా రిలయన్స్ ఇండస్ట్రీస్ లో Finance & Accounts లో Senior Management Team లో పనిచేసి 2016 లో పదవీ విరమణ చేసినా, ప్రవృత్తి మాత్రం – సంగీత సాహిత్యాలే. ప్రస్తుతం ఒక Youtube Channel కి Voice Over artiste గా, స్వరమాధురి సంగీత సంస్థకు అధ్యక్షునిగా వారి విశ్రాంత జీవితాన్ని బిజీ గా, ఆనందంగా గడుపుతున్నారు.