Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

నాకు నచ్చిన మా నాన్నగారి కథలు

[బెహరా వెంకట సుబ్బారావు గారి ‘మద్యతరగతి మందహాసం’ పుస్తకం లోని కథల నుండి తనకు నచ్చిన 15 కథల గురించి వివరిస్తున్నారు వారి కుమారుడు శ్రీ బెహరా సత్యనారాయణ మూర్తి.]

01. కర్తవ్యం:

ఈ కథలో ఒక ఆదర్శ ఉపాధ్యాయుడికి అతని పాత విద్యార్థి భాస్కరం ఎదురుపడుతాడు. పెద్ద హోదాలో వున్న భాస్కరం తను గురువు యొక్క పరిస్థితి తెలుసుకొని వారి కుమారునికి తన సంస్థలో ఉద్యోగం ఇప్పించాలని నిర్ణయించుకొంటాడు. గురువు గారు ఇంటికి వస్తే సిఫార్సు చేయడానికి వచ్చాడు అనుకొన్న భాస్కరం, ప్రతిభను బట్టి ఉద్యోగము ఇవ్వాలని అని గురువు చేసిన కర్తవ్య భోదనకు సంశయంలో పడ్డా వారి కుమారునకు తగిన అవకాశం కల్పించి గురుభక్తీ, తన భాద్యత రెండిటికి న్యాయం చేస్తాడు. ఈ కథలో గురువుగారు, శిష్యుడు మాత్రమే కాదు శిష్యుడి భార్య కూడా ఉన్నత విలువలను చాటారు. మానవతా విలువలతో కూడుకున్న ఒక సందేశాత్మకమైన కథ.

ప్రజ్ఞకి ఎప్పుడు గుర్తింపు లభిస్తుంది. ప్రతిభావంతున్ని కాదు పొమ్మనలేరు!”..గురువు గారు.

(విజయ మాసపత్రిక జూన్ 1984 లో ప్రచురించబడింది)

02. వన్ మినిట్:

బెహరా వెంకట సుబ్బారావు గారు

ఈ కథలో రామనాథం తన కూతురి పెళ్లి ఖర్చు కొరకు పీఎఫ్ లోన్ సాంక్షన్ కోసం పై ఆఫీస్‌కి వస్తాడు. వన్ మినిట్ అంటూ ఆఫీసులో జరిగిన తాత్సారం వలన జరిగిన సంఘటనలతో ఆఫీసర్ ఇంటికి వెళ్ళిపోవడంతో రామనాథం గారి పని ఆలస్యమవుతుంది. రామనాథం, రామారావు, శేఖర్, హోటల్ సర్వర్ అనే నాలుగు పాత్రలతో చాలా ఆసక్తికరంగా కథనాన్ని రక్తి కట్టించారు.

వన్ మినిట్ అంటూ పని ఆలస్యం చేయడం వలన ప్రభుత్వ కార్యాలయాల్లో, ఇతర చోట్లా జరిగే అనర్థాలను ఈ కథలో మనం చూడవచ్చు. కాలం విలువను తెలియజేసే కథ ఇది. సర్వర్ పాత్రధారి ద్వారా వన్ మినిట్ యొక్క ప్రాముఖ్యతని, అది మన జీవితాల్లో ఎంతటి ప్రభావం చూపుతుందో రచయిత తన మాటల్లో చెప్పించారు.

చివరిగా శేఖర్ పాత్ర తన తప్పుని గ్రహించి ప్రాయశ్చిత్తంగా రామనాధం గారికి సహాయం చేయడం ద్వారా కథని సుఖాంతం చేసి, పాఠకుల మనసుని తేలిక పరచడమే కాక, సమయం యొక్క విలువ మస్తిష్కంలో స్థిరపడేలా ముగింపు పలకడం చాలా బావుంది.

(దీపావళి కథల పోటీలో ప్రథమ బహుమతి పొంది ఆంధ్రసచిత్ర వారపత్రిక తేదీ 18.11.1977న ప్రచురించబడిన కథ)

03. దోపిడి:

ఈ కథ సమాజంలో ప్రబలంగా ఉన్న దోపిడీ యొక్క వివిధ రూపాలను విమర్శిస్తుంది. ఆనందరావు తన భార్య జానకి కోసం రైలు టిక్కెట్లను బుక్ చేయడానికి ప్రయత్నం చేయగా అక్కడ అదనపు రుసుముతో టిక్కెట్లను కొనడంలోను తరువాత, హోటల్‌లో, సినిమా థియేటర్‌లో ఆనందరావు అనుభవాలు, అధిక ధరలు మరియు బ్లాక్ మార్కెట్‌ల ద్వారా ప్రజలు ఎలా ‘దోపిడీ’ చేయబడుతున్నారో వివరిస్తాయి. రిక్షా డ్రైవర్ మాటలలో చెప్పాలంటే ‘దోపిడీ’ అనేది కేవలం వీధి నేరం మాత్రమే కాదు, రోజువారీ లావాదేవీలు మరియు వ్యవస్థలలో లోతుగా పాతుకుపోయిందని స్పష్టంగా సూచిస్తుంది. రైల్వే రిజర్వేషన్, సినిమా హాల్, హోటల్, రిక్షావాడు ఇలా ప్రతీ చోట సమాజంలో వ్యక్తి ఎలా దోపిడీకి గురి ఆవుతున్నాడో వివరించబడ్డది.

దోపిడి సినిమాలో సూసేదేదీ బాబూ. ఎక్కడ బడితే అక్కడే వుంది ఆఫీసుల్లో – ఆఫీసర్లలో వుంది! ఇళ్లలోనూ నడి రోడ్డు మీదా వుంది. రైళ్లలో, బస్సుల్లో, యాత్రా స్థలాల్లో, దేవుడి గుడుల్లో కూడా వుంది. మీరు సూడబోయే ఎనిమా ఎలావున్నా హాలోళ్లు టికెట్ట ధరల్ని రెండేసి మూడేసి రెట్లు పెంచేసి మిమ్మల్ని దోసేసు కొంటున్నారు. అయినా టిక్కెట్లు దొరకటం లేదు. అది ఆసరాగా తీసుకొని బ్లాకు మార్కెటోళ్లు మరీ దోసేసుకొంటున్నారు. పెద్దైనా, సిన్నెనా ఎప్పుడో ఒకప్పుడు దోపిడీకి గురి కాక తప్పదు బాబూ”..రిక్షావోడు

(20-26 జూన్ 1986 ఆంద్ర సచిత్ర వార పత్రిక లో ప్రచురించ బడింది)

04. కాకాలు – కాకరకాయలూ!:

ఉన్నతాధికారికి దగ్గరై స్వప్రయోజనాలు నెరవేర్చుకోవాలని చూసే ఉద్యోగుల మనస్తత్వాలను ఈ కథ వ్యంగ్యంగా, వాస్తవంగా కాస్త హాస్యం చేర్చి రాయబడింది. ఉపనయనం పేరుతో పై అధికారికి కానుకలిచ్చి ఆయన అభిమానాన్ని పొందాలని ఉద్యోగులు పడే తాపత్రయం హాస్యం పంచుతుంది. అయితే, అధికారి బదిలీ కావడంతో వారి ఆశలు అడియాశలయ్యాయి. ఈ కథ మధ్యతరగతి ఉద్యోగుల ఆశలు, భయాలు, మనస్తత్వాలు వారి రాజకీయాలను చక్కగా చూపించింది. అవినీతికి వ్యతిరేకముగా మాటల తూటాలను ఈ కథలో గమనించ గలరు.

(ఆంధ్రప్రభ సచిత్ర వార పత్రిక 13-6-1979 లో ప్రచురించబడింది)

05. నదీనాం సాగరో గతిః:

ఈ కథ సామాజిక అస్పృశ్యతను ప్రశ్నిస్తుంది. ఎండదెబ్బకు చనిపోయిన అనాథ వ్యక్తిని, హరిజనుడని భావించి ఆచార్యులు, కరణం వంటి గ్రామపెద్దలు శవాన్ని తాకడానికి కూడా నిరాకరించగా అభ్యుదయ భావాలు గల డాక్టర్ రఘు, అతని తమ్ముడు వేణు, కిష్టంనాయుడు వంటి యువకులు కులాలకు అతీతంగా ఆ శవాన్ని దహనం చేయడానికి ముందుకు రావడం కథకు ఒక సానుకూల ముగింపునిచ్చింది. చివరికి, గ్రామపెద్దలు కూడా వచ్చి వారితో కలియడం, యువకులలోని మానవత్వం పెద్దల మనసులను ఎలా మార్చిందో చూపించారు.

సమకాలీన ఆచార, వ్యవహారాలు, కట్టుబాట్లు, అంటరానితనం.. వీటితో అనామకుడి శవంపై జరిగిన, వాగ్వివాదాలు చక్కగా వివరించారు. చదువుకున్న వాళ్ళ ఆధునిక ఆలోచనలు, దానికి ముందు తరం వాళ్ళ వ్యతిరేకతలు, చివరగా డాక్టర్ చేత, కులమత భేదాలు లేని తన వృత్తి ధర్మాన్ని, చక్కగా తెలియపరిచారు.

మానవులు అంతా ఒకటేనని, వారిలో ప్రవహించే రక్తం ఒక రంగేనని, ఎవరైనా చివరికి వెళ్ళేది శ్మశానానికేనని, ఏ నదైనా చివరికి కలిసేది సముద్రంలోనే కదా! అనే జీవిత సత్యాన్ని ప్రకృతి నైజాన్ని తెలిపారు రచయిత. బడుగు వర్గాలను సమర్థిస్తూ కూడా వారిలోనూ వర్గ బేధాలను ఖండించిన సామాజిక ప్రయోజనం ఉన్న కథ.

మనకన్నా ఆ రాబందులే నయం! శవం ఏ కులంది అని ఆలోచించకుండా తింటాయి”.

మేం చదువుకొనే రోజుల్లో ఎన్నో శవాల్ని కోసి చూశాం! అవి ఏ కులానికి చెందినవో తెలీదు! ఆది మా కననసరం. అందరి శరీరాలు ఒక్కలాగే వుంటాయ్. స్నానం చేయమని మీరెప్పుడూ దండించలేదు. స్నానం రెండుపూటలా చేస్తాను. కానీ మీ కన్నట్టు వారినెవరినో తాకినందుకు మాత్రం కాదు, శవాల్ని ముట్టినందుకూ కాదు! శరీర పరిశుభ్రత కోసం! ఆత్మ శుద్ధిలేని ఆచారం ఎందుకు చెప్పండి?” ..డాక్టర్

06. దొడ్డమనసు:

పుట్టింటి నుంచి ఆశించిన గౌరవాన్ని సుజాత తన ఆడపడుచుకు చూపక తన స్వభావాన్ని బయట పెట్టుకుంది. కానీ పనిమనిషి అయిన గౌరీ మాత్రం ఆడపిల్లను ఆనందంగా గడప దాటించాలని ఆచరణలో పెట్టి చూపించి తన ‘దొడ్డమనసు’ను ప్రదర్శిస్తుంది. సుజాతకు కళ్ళు తెరిపించి సిగ్గుపడేలా చేసింది. దొడ్డ మనసు అంటే స్వార్థం లేని ఆలోచనలు, ఇతరులకు ఇవ్వడంలోనే ఆనందం అని అది పెద్దవారికే కాదు పేదవారి కైనా ఉండవచ్చు అని చెప్పారు.

ఆశ లేకపోతే నిరాశ వుండదు” ..శంకరం.

చీర నేను కట్టుకున్నా అంత ఆనందం వుండదు అమ్మగోరు”.. గౌరి పాత్ర ఔదార్యం.

07. కోటేసు:

తండ్రి ప్రమాదంలో కాలు కోల్పోయిన తర్వాత అప్పులు తీర్చాలనే తపనతో 14 ఏళ్ల కోటేసు రైలులో టీ వ్యాపారం చేస్తూ, ప్రమాదవశాత్తు చక్రాల కింద పడి మరణించడం విషాదభరితంగా ఉంది. చనిపోతూ షావుకారు అప్పు తీర్చడంలో కోటీసు చూపించిన నిజాయితీ మనసును కదిలించింది.

(విజయ మాస పత్రిక డిసెంబర్ 1982 ఆసియన్ లాంగ్వేజ్ బుక్ సొసైటీ వారి ముద్రణ)

శ్రీ బెహరా సత్యనారాయణ మూర్తి

08. మ్రొక్కుబడి:

తండ్రి మొక్కుబడి వెండి కడియాన్ని పార్వతి తన కూతురికి పట్టీలుగా మార్చడం, భాస్కరాన్ని నిరాశకు గురిచేస్తుంది. అయితే కూతురి పట్టీలను తిరుమల హుండీలో వేసి తద్వారా భాస్కరం తన తండ్రి మొక్కుబడి తీర్చాడు. ఏడుకొండల స్వామిని వడ్డీ కాసుల వాడు అనేది అందుకే. మొక్కుకున్న తర్వాత ఊరుకుంటాడా? వడ్డీతో సహా రాబట్టుకున్నాడు.. తండ్రి మొక్కు తీర్చడానికి భాస్కరం పడిన తపన, వెంటనే కుమార్తెకు పట్టీలు కొనడం అతని కుటుంబ విలువలను సూచిస్తుంది. కథకు ఒక పరిపూర్ణమైన, ముగింపును ఇచ్చింది.

(భారతి మాసపత్రిక 01.05.1982 లో ప్రచురించబడింది)

09. పుత్రోత్సాహం:

చెల్లెలి వివాహాన్ని ఆపుచేసిన కొడుకు ఆనంద్‌ని అపార్థం చేసుకొన్న మేజర్ భవానీశంకరం గారు, దానికి గల అసలు కారణం పెళ్లి కొడుకు లంచగొండి అని తెలుసుకుని పుత్రోత్సాహం పొందడమే కాకుండా కూతురికి ఇంకా మంచి సంబంధం దొరకడంతో కథ సుఖాంతం అవుతుంది. కుటుంబ సంబందాలను కడు రమ్యంగా చిత్రీకరించారు.

లంచగొండి ఉద్యోగులు సంఘానికే కాదు దేశానికే ఎంతో శత్రువులు” ..ఆనంద్

(ఆంద్రప్రభ వార పత్రిక 18.05.1977 ప్రచురించబడింది)

10. విలువలు-2:

అన్యాయపు సొమ్ము మనకొద్దని భార్య మొత్తుకుంటున్నా పద్దతి మార్చుకోని పోలీసు వెంకటస్వామి టాక్సీ డ్రైవర్ కోటీశు దగ్గర అన్యాయంగా ఎనభై రూపాయలు తీసుకుంటాడు. అయినా మాటకు కట్టుబడి డబ్బులు ఏర్పాటు చేసుకొని వెళ్లి రక్షించిన వ్యక్తి వెంకటస్వామి భార్య కావడం ఒక ట్విస్ట్. వెంకటస్వామి తన నిజాయితీ లేని ప్రవర్తనను గ్రహించి, పశ్చాత్తాపపడతాడు.నిజాయితీ, నైతిక విలువలు, వృత్తి ధర్మాలు, మానవత్వం వంటి అంశాలను ఈ కథలో స్పృశించారు.

మనిషికి అసలు విలువలేదండి! అతని మాటకే విలువ ఉంటుంది!”..ఓబులేసు

(శ్రీమతి మాదిరెడ్డి సులోచన ప్రథమ వర్థంతి సందర్భంగా అభ్యుదయ వేదిక, హైదరాబాద్ వారు నిర్వహించిన కథల పోటీలో ద్వితీయ బహుమతి పొంది ఆంద్రప్రభ వారపత్రిక 28.03.1984 లో ప్రచురించ బడింది).

11. చెయ్యి వూచమ్మా చేయి వూచు:

ఒక ప్రభుత్వ కార్యాలయంలో సెలవు కోసం ఉద్యోగులు పడే పాట్లు, పాపారావు అత్తవారింటికి వెళ్ళినప్పుడు ఎరువు వాచీతో పడ్డ ఇబ్బందులను హాస్య భరితంగా చెప్పారు.

(ఆంద్ర జ్యోతి వార పత్రిక 28.02.1975 లో ప్రచురించ బడింది)

నవభారతి సాహితీవేదిక కథారచయితల సమ్మేళనం

12. ఓపెన్ జోకర్:

విద్యార్ధిగా వున్నప్పుడు చదువుపై శ్రద్ధ పెట్టకుండా ఇతర విషయాల్లో తల దూర్చితే పిల్లలు తమ జీవితకాలం నష్టపోతారు అన్న విషయాన్ని చంద్రం, ప్రతాప్ పాత్రల ద్వారా వివరిస్తుందీ కథ.

చంద్రశేఖరం పాత్రలో అహంకారాన్ని, నిర్లక్ష్యాన్ని ప్రతాప్ పాత్రలో నిజాయితీ, విలువలు చూపిస్తారు. ఈ కథలో ప్రతాప్ ఆర్థిక అవసరాల కోసం స్నేహితుడు చంద్రశేఖరం కోసం కాలేజీ ఎన్నికలలో తలదూర్చి తన జీవితాన్ని నాశనం చేసుకొంటాడు. ఈ కథలో, కాలేజీ రాజకీయాలు, స్నేహితుల మధ్య ద్రోహం వలన ప్రతాప్ జీవితంలో జరిగే అనూహ్య సంఘటనలను వివరిస్తుంది.

(విజయ మాస పత్రిక మార్చ్ 1980 లో ప్రచురించ బడింది)

13. పరివర్తన:

నూకరాజు మద్యానికి బానిస అయితే రత్తాలు కష్టపడి పిల్లలను పోషిస్తుంది. ఒకసారి కుమారుడు నాగులు స్కూల్ పుస్తకాలు కొనడానికి రత్తాలు ఇచ్చిన డబ్బును నూకరాజు లాక్కోవాలని ప్రయత్నించగా, నాగులు ధైర్యంగా తండ్రిని ఎదిరించి ఇల్లు వదిలి వెళ్తాడు. దీనితో నూకరాజులో పశ్చాత్తాపం వచ్చి మళ్లీ తాగనని ప్రమాణం చేస్తాడు.

ఈ కథలో అధిక సంతానం, మద్యపానం వల్ల వచ్చే కష్టాలు చిత్రీకరించబడినవి.

(యువ మాస పత్రిక 01.04.1978 లో ప్రచురించ బడింది)

14. ప్రాణం ఖరీదు:

ఈ కథ, ధనవంతుడు, పేదవాడు ఇద్దరికీ తమ జీవితంలో ఒకే రకమైన విషాద సంఘటన ఎదురైనప్పుడు దాని వెనుక ఉన్న వ్యత్యాసాలను వివరిస్తుంది. ధనవంతుడు, తన భార్యను రక్షించుకోవడానికి ఎంత డబ్బునైనా ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉన్నప్పుడు, పేదవాడు, తన భార్యను కాపాడుకోవడానికి రెండు వందల రూపాయల కోసం ప్రాధేయ పడతాడు. డబ్బులు కోసం భార్య ఆపరేషన్ చేయని డాక్టర్‌ను ప్రాణాలకు తెగించి రిక్షా లాగి సమయానికి ట్రైన్ అందిస్తాడు రావులు. రావులు భార్యకు పురుడు వచ్చి పండంటి కొడుకు పుట్టడం ఒక భావోద్వేగ ముగింపునిచ్చింది. ప్రాణం ఖరీదు ఎవరిదైనా ఒకటేననీ, దానికి మనం ఇచ్చే విలువే మనకు ఫలితాన్ని ఇస్తుందనీ రచయిత చెప్పారు.

(భారతి మాస పత్రిక 01.01.1986 లో ప్రచురించ బడింది)

15. అత్తగారూ-అరటిచెట్టూ:

అరటిచెట్లు ఇంట్లో వేస్తే అచ్చిరావని నమ్మే అత్తగారు. మొలిస్తే పరవాలేదుట. మూఢనమ్మకాలు మరియు సమయాన్ని బట్టి మారే మనుషుల స్వభావం ఈ హాస్య కథలో ప్రస్ఫుటమవుతాయి.

బ్రాహ్మణ కుటుంబాల్లో తద్దినానికి అరిటాకు ప్రాముఖ్యత చక్కగా వివరించారు. అరిటాకు కోసం ఆరాటపడిన అత్తగారు, అదే అరిటాకును ఇతరులకు తను ఇవ్వాల్సిన స్థితిలో ప్రవర్తించిన తీరు హాస్యయుతంగా చెప్పారు.

(ఆంధ్రప్రభ సచిత్రవారపత్రిక, 3 ఏప్రిల్ 1985 లో ప్రచురించ బడింది)

~

ఈ కథలతో పాటు మరికొన్ని కథలు, నవలల గురించి తెలుసుకునేందుకు ‘మధ్య తరగతి మందహాసం – బెహరా వెంకట సుబ్బారావు సర్వలభ్య రచనలు’ అనే పుస్తకాన్ని చదవవచ్చు.

***

మధ్య తరగతి మందహాసం (బెహరా వెంకట సుబ్బారావు సర్వలభ్య రచనలు)
సంపాదకులు: బెహరా పేరిందేవి, బెహరా సత్యనారాయణమూర్తి, డా. వి. వి. వెంకట రమణ
ప్రచురణ: అభ్యుదయ రచయితల సంఘం, విజయనగరం జిల్లా
పేజీలు: 480
వెల: ₹ 500
ప్రతులకు:
అన్ని ప్రముఖ పుస్తక విక్రయ కేంద్రాలు
~
బెహరా పేరిందేవి
ఫ్లాట్ నెం. 1B, శ్రీనివాసా ఎన్‍క్లేవ్,
ప్రహ్లాదపురం, విశాఖపట్టణం 530027
ఫోన్: 9848318204, 8309574116
~
బెహరా లక్ష్మీ దివ్య స్ఫూర్తి, ఫోన్: 7396627924
~
ఆన్‍లైన్‌లో:
https://www.amazon.in/Madhya-Taragati-Mandahasam-Behara-Venkata/dp/B0FHQQ84LD

Exit mobile version