[బాలబాలికల కోసం ‘నైపుణ్యంతో విజయం’ అనే కథ అందిస్తున్నారు కంచనపల్లి వెంకట కృష్ణారావు.]
తల్పగిరి రాజు కేశవవర్మ మంచి పరిపాలనాదక్షుడే కాక మంచి ఆలోచనాపరుడు. ఆయన ప్రజలకు మేలు చేసే ఎన్నో ఉత్తమమైన పనులు చేస్తూ ప్రజల మన్ననను పొందాడు.
తల్పగిరి రాజ్యానికి పక్కరాజ్యం కందర్పపురం. ఆ రాజ్యం రాజు భుజంగవర్మ తల్పగిరిని ఆక్రమించుకుని తన రాజ్యంలో కలుపుకోవాలని కలలు కంటూ అందుకు తగిన ఎత్తులు ఆలోచించసాగాడు. యుద్ధం చేయాలంటే తల్పగిరి రాజుకి విశేష సైన్యం ఉంది, అదిగాక రాజుకి ప్రజల సంపూర్ణ మద్దతు ఉంది, ఈ కారణాల వలన తల్పగిరిని యుద్ధంలో గెలవడం అసాధ్యం. అందుకే తన రాజ్యంలోని ఒక అటవిక జాతి వాళ్ళకు తగిన శిక్షణ ఇచ్చి ప్రశాంతమైన తల్పగిరిలో ప్రజల మధ్య అశాంతి సృష్టించి అల్లకల్లోలం సృష్టించాలని ఒక దుష్ట ప్రణాళిక వేశాడు భుజంగవర్మ.
అలా ఆ అటవికులు తల్పగిరి రాజ్యంలోకి ప్రవేశించి ప్రజలలో అశాంతి కొంత కల్లోలం సృష్టంచసాగారు!
యుద్ధం జరిగితే సైన్యాన్ని ఉపయోగించవచ్చు కానీ దొంగచాటుగా ప్రవేశించిన అటవికులను ఏవిధంగా ఎదుర్కోవాలో తల్పగిరి రాజుకి అర్థం కావడంలేదు.
ఈ విషయంమీద రాజు కేశవవర్మ మంత్రితో ఆ అటవికులను నిర్మూలించేందుకు తగిన ప్రణాళికను ఆలోచించమని చెప్పాడు. అనేక ఆలోచనల తరువాత మంత్రి సుచేతుడు ఒక మంచి ఆలోచన రాజుగారికి చెప్పాడు.
“రాజామన సైన్యం సమర్థవంతమైంది! కానీ కేవలం కత్తులతో, ఫిరంగులతో యుద్ధాలే కాదు బుద్ధి బలాన్ని కూడా ఉపయోగించి విజయం పొందాలి. దీని కోసం నేను ఒకటి ఆలోచించాను. మన రాజ్యంలో గురుముఖి అనే గురువు ఒక గురుకులాన్ని నడుపుతున్నాడు.
ఆయన ఘనాపాటే కాకుండా అనేక ఇతర విద్యలలో నిష్ణాతుడు. ఆయనకు ఒక విచిత్ర విద్య తెలుసు ఎవరైనా నడచివస్తే వారు ఏ బరువు మోస్తున్నారు అన్నది వారి అడుగుల ఒత్తిడిని బట్టి చెప్పగలడు, అదిగాక వారి మానసిక స్థితి, ఆలోచనలు కూడా కొంతవరకు చెప్పగల దిట్ట. ఆయన వద్దకు మనం మంచి యువకులను ఎంపికచేసి పంపి తగిన శిక్షణ ఇప్పిస్తే, రాజ్యంలోకి ప్రవేశించే దొంగలు రాజ్యాన్ని అల్లకల్లోలం చేయాలని వచ్చేవారిని కూడా కనిపెట్టగలరు. మనం అభివృద్ధి చెందాలంటే కొత్తనైపుణ్యాలతో విజయాలు సాధించాలి. అలా నేర్చుకుంటే ఇటు రాజ్యం, అటు అనేకమంది అనేక విధాల అభివృద్ధి చెందుతారు” వివరించాడు సుచేతుడు.
“అమాత్యా తమరు చక్కగా ఆలోచించి మంచి సలహా ఇచ్చారు. మనం ఆ గురువు గురుముఖి సహాయం తీసుకుందాం, ఇదే కాదు ప్రజలకు ఇప్పుడు ఉపయోగపడుతున్న అనేక విద్యల్లో మరిన్ని నైపుణ్యాలు జోడిస్తే మన రాజ్యం మరింత అభివృద్ధి చెందుతుంది. గురుముఖి వద్దకు పంపడానికి మంచి యువకుల్ని ఎంపిక చేయండి వారు మరికొంత మందికి తాము నేర్చుకున్న నైపుణ్యాలను నేర్పిస్తారు” చిరునవ్వుతో చెప్పాడు కేశవవర్మ రాజు.
“తప్పకుండా. ఈ రోజునుండే యువకులను ఎంపిక చేసి గురుముఖుడి వద్దకు పంపుతాను. ఆయన వద్ద అటువంటి నైపుణ్యాలు నేర్చుకున్న నలుగురు ఉన్నట్టు నాకు తెలిసింది. తక్షణం వారి నైపుణ్యం మనం ఉపయోగించుకుందాం” చెప్పాడు సుచేతుడు.
రాజు సంతోషంతో సుచేతుణ్ణి అభినందించాడు.