[శ్రీ రాకేశ్ ఆనంద్ బక్షి రచించిన ‘నగ్మే, కిస్సే, బాతేఁ, యాదేఁ – ది లైఫ్ అండ్ లిరిక్స్ ఆఫ్ ఆనంద్ బక్షి’ అనే ఆంగ్ల పుస్తకాన్ని అనువదించి పాఠకులకు అందిస్తున్నారు కొల్లూరి సోమ శంకర్.]
అధ్యాయం 5: 1951-1956 – మొదటి భాగం
తండ్రికి, గీత రచయితకు జన్మనిచ్చిన ఓ కూతురు
కొద్దికాలానికే, ఆనంద్ ప్రకాష్ బక్షి, ఫిబ్రవరి 16, 1951న మధ్యప్రదేశ్‌లోని జుబ్బల్‌పూర్ డివిజన్‌లో సైన్యంలోకి తిరిగి చేరారు. రెండవసారి సిగ్నల్స్ కార్ప్స్‌లో చేరారు, ఇ.ఎమ్.ఇ. డివిజన్ (ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్ ఇంజనీర్ల కార్ప్స్)కి పంపబడ్డారు. తరువాతి రెండు సంవత్సరాలలో, అయన ఇక్కడ శిక్షణ పొందారు. 1953 సెప్టెంబర్ 11న ‘ఎలక్ట్రీషియన్, క్లాస్ III’ గా అర్హత సాధించారు.
***
‘నేను పదాతిదళ తుపాకుల భారీ శబ్దాలను భరించలేకపోయాను’
ఆటోమొబైల్ ఎలక్ట్రీషియన్‌గా అర్హత సాధించిన తర్వాత, బక్షిని పదాతిదళ విభాగానికి నెలకు రూ. 75 జీతంతో నియమించారు. ఆయనను పంపిన పోస్టింగ్‌లలో ఒకటి జమ్మూ కాశ్మీర్. పదాతిదళ విభాగంలోని సిపాయికి మొదట గుర్తుకు వచ్చేది తుపాకుల భారీ శబ్దం. ఆయన వాటిని ద్వేషించారు! నాన్న ఇంట్లో ఉండి పని చేసుకుంటున్నప్పుడు – ఎక్కువగా తన బెడ్‌రూమ్‌లో లేదా మా గదిలో కూర్చుని పాటలను రాశారని నాకు ఇప్పుడు గుర్తొస్తోంది – ఏదైనా అసాధారణమైన బిగ్గరైన శబ్దం ఆయన్ని విపరీతంగా కలవరపెట్టేది. వెంటనే రాయడం ఆపేసి, ఆ శబ్దం ఎక్కడి నుంచి వచ్చిందో వెతికేవారు. డోర్‌బెల్ చప్పుడు, వంటగదిలో కుక్కర్ ఈలలు, మేం తోబుట్టువులు అరుస్తున్నా లేదా గట్టిగా పాడుతున్నా, అవన్నీ ఆయనని ఇబ్బంది పెట్టేవి.
ఆయనకి అల్లరంటే అసలు నచ్చేది కాదు. 70ల మధ్యలో, మేము బాంద్రా వెస్ట్‌లోని కొత్త ఐదు బెడ్‌రూమ్‌ల ఇంటికి మారాము. మూడు నెలల్లోనే మేము అక్కడి నుండి బయటకు వెళ్లాల్సి వచ్చింది ఎందుకంటే బెస్ట్ పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ బస్సు చేసే ‘మృదువైన శబ్దం’ నాన్నని ‘డిస్టర్బ్’ చేసేది. ఈ నివాస భవనం మెయిన్ రోడ్ పక్కన ఉంది; కాబట్టి మేము సమీపంలోని, మెయిన్ రోడ్‍కి దూరంగా ఉన్న ఒక వింతైన వీధికి మారాము, అక్కడ భారీ వాహనాలు తిరగవు.
‘సైన్యంలో, మేము రోజంతా లెఫ్ట్-రైట్-లెఫ్ట్ రైట్ కవాతు చేయాల్సి వచ్చింది. నేను కవాతు చేయాలని కలలు కనడం కూడా మొదలుపెట్టాను! పదాతిదళ విభాగంలో భారీ ఫిరంగి తుపాకుల బిగ్గరైన శబ్దాలు నన్ను కలవరపెట్టాయి; పదిహేడేళ్ల బాలుడిగా దేశవిభజన సమయంలో నేను చూసిన హింసను అవి నాకు గుర్తు చేశాయి. ఇది నాకు నప్పే రంగం కాదని నేను మునుపటి కంటే బలంగా భావించడం ప్రారంభించాను. ముఖ్యంగా, నేను సైనికుడిగా కొనసాగితే కళాకారుడిగా ఉండాలనే అవసరం, సాహిత్యంపై నాకున్న ఇష్టంతో సంబంధం కోల్పోతానని భావించాను. నేను క్రితంసారి బొంబాయిలో ఉన్నప్పుడు ఎవరూ నన్ను కలవడానికి ఆసక్తి చూపలేదు. ఆర్మీ సీనియర్ నుండి సిఫార్సు లేఖ లభిస్తే, నాకు ప్రతిభ ఉందని; వారు నా కవితలను వినాలని బొంబాయిలోని సినిమా వ్యక్తులను ఒప్పించగలనని నేను అనుకున్నాను. కాబట్టి పాటలు రాయడం పట్ల నాకున్న మక్కువ, ప్రతిభ కోసం నేను రెండవసారి సైన్యం నుండి నిష్క్రమించాలని నిజంగా నమ్మే సీనియర్ నుండి సిఫార్సు లేఖను తీసుకోవాలని నిర్ణయించుకున్నాను. కెప్టెన్ వర్మ కీ జై హో (లాంగ్ లివ్ కెప్టెన్ వర్మ)!’
సైన్యంలో రెండవ దఫా పనిచేస్తున్న కాలంలో జరిగిన ఒక విషయం నాకు గుర్తుకు వస్తోంది. నాన్న తన బంధువును కలవడానికి హైదరాబాద్‌కు వ్యక్తిగత పర్యటనకు వెళ్లాల్సి వచ్చింది. రిజర్వ్ చేయని సీటు పొందడానికి రైల్వే యార్డ్‌లో ఉండగానే రైలు ఎక్కారు. కానీ నాన్న బోగీ లోపలికి వెళ్ళేలోపు, రైలు కదలడం ప్రారంభించింది. బోగీలోపలికి దారితీసే మెట్లపై నిలబడ్డారు, తలుపు లాక్ చేసి ఉండటంతో లోపలికి వెళ్ళలేకపోయారు.
ఒక చేతిలో కంపార్ట్‌మెంట్ రెయిలింగ్, మరో చేతిలో తన టిన్ సూట్‌కేస్ పట్టుకుని, ప్లాట్‌ఫామ్ తాను నిలబడి ఉన్న మెట్ల కంటే ఎత్తులో ఉందని గ్రహించినప్పుడు ఆయన భయపడ్డారు. వేగంగా సమీపిస్తున్న ప్లాట్‌ఫారమ్ కొన్ని మీటర్ల దూరంలోనే ఉండగా, రైలు ప్లాట్‌ఫారమ్ వద్ద ఆగేవరకు మరెవరూ లోపలికి రాకుండా తలుపు లాక్ చేసిన లోపల ఉన్న వ్యక్తులను చూసి నాన్న అరవడం, కేకలు వేయడం ప్రారంభించారు. ఆయన సైనిక దుస్తులు ధరించి ఉన్నారు. సహాయం కోసం వేసిన కేకలకు ఎవరో జాలిపడి, తలుపు తెరిచి ఆయనకి చేయందించారు. ఆయన బోగీ లోకి అడుగుపెట్టగానే, రైలు ప్లాట్‌ఫారమ్ పైకి చేరుకుంది. తలుపుని కొన్ని సెకన్ల పాటు తెరవకుండా ఉండి ఉంటే, తన రెండు కాళ్లను కోల్పోయేవాడినని ఆయన గ్రహించారు. ఇది తన జీవితంలో అత్యంత బాధాకరమైన క్షణాలలో ఒకటని తరువాత మాకు చెప్పాడు. మా దగ్గర ఇప్పటికీ టిన్ సూట్‌కేస్ ఉంది. నాన్న సైనిక మూలాలను గుర్తుచేసుకోవడానికి దానిని మా గదిలో ఉంచాము.
***
గుర్తింపు దక్కని ప్రతిభాశాలి
సైన్యంలో రెండో దఫా చేరినప్పుడు ఆనంద్ ప్రకాష్ బక్షి – కవి, సంపాదకుడు అయిన బిస్మిల్ సయీదీతో సన్నిహితంగా ఉండటానికి, వారి పరిచయాన్ని స్నేహంగా పెంచుకోవడానికి, గురువుగా వారి నుంచి నేర్చుకోవడానికి అదనపు ప్రయత్నం చేశారు. బొంబయి వెళ్ళేందుకు మరొక ప్రయత్నం చేసే ముందు తన రచనను మెరుగుపరచుకోవాలని భావించారు.
సయీది మార్గదర్శకత్వం ఆ సిపాయిని, ఔత్సాహిక కవిని మంచి స్థితిలో నిలిపింది. 50వ, 60వ దశాబ్దాలలో కవిగా ఎదగడానికి సహాయపడింది. సయీది తనకి ‘మెహెర్బాన్ దోస్త్’ (ఉదార స్నేహితుడు) మాత్రమే కాదు, తన విజయగాథలో గుర్తుండిపోయే ఇద్దరు హీరోలలో ఒకరని కూడా బక్షి నమ్మారు. (రెండవది చితర్ మల్ స్వరూప్, వెస్ట్రన్ రైల్వే టికెట్ కలెక్టర్. నంద్ రెండవ తల్లిగా భావించే ఈ దేవదూతను నేను తదుపరి అధ్యాయంలో మీకు పరిచయం చేస్తాను. ఒక విధంగా, చితర్ మల్ చేసిన మంచి పని మనకు తెల్సిన సినిమా రంగానికి ఓ గీత రచయితను బహుమతిగా ఇచ్చింది.)
***
‘మేరే మెహెర్బాన్ దోస్త్, బిస్మిల్ సయీదీ’
బిస్మిల్ సయీదీ సాబ్ రాజస్థాన్‌లోని టోంక్‌కు చెందినవారు, ఢిల్లీలోని జామా మసీదు సమీపంలో నివసించేవారు. ఆయన ఓ సంపాదకుడు, ప్రధానంగా గజల్స్ రాసే ఉర్దూ కవి. చాలా కాలం క్రితం, ఆయన ప్రముఖ కవి నజీర్ అక్బరాబాది వద్ద శిష్యరికం చేశారు. చాలా కాలంగా, సయీదీ పురానీ దిల్లీ నుండి ప్రచురితమయ్యే ఉర్దూ మాసపత్రిక బీస్వీ సదీ (ఇరవయ్యవ శతాబ్దం)తో సంబంధం కలిగి ఉండేవారు. నాన్న తన చివరి సంవత్సరాల వరకు ఈ పత్రికను క్రమం తప్పకుండా చదివేవారు. నేను కొన్నిసార్లు నాన్నతో కలిసి ఖార్, ఇంకా బాంద్రాలోని ఆయనకు ఇష్టమైన న్యూస్ స్టాల్స్‌కు వెళ్లేవాడిని, అక్కడ ఆయన ప్రతి నెలా బీస్వీ సదీ మాసపత్రిక తాజా సంచికను కొనడానికి వెళ్ళేవారు. ఆయన ఈ పత్రికను చదవడంలో పూర్తిగా లీనమయ్యేవారు. సెలవుపై నాన్న ఢిల్లీకి వెళ్ళినప్పుడు సయీదీ సాబ్‌ను కలవడం, తాను కొత్తగా రాసిన నజ్మ్ లపై ఆయన అభిప్రాయాన్ని కోరడం ఒక అలవాటుగా చేసుకున్నారు.
1998లో, సుభాష్ ఘాయ్ నిర్వహించిన ఆనంద్ బక్షి అరవై ఎనిమిదవ పుట్టినరోజు వేడుకలలో, గీత రచయిత జావేద్ అక్తర్ – ఆనంద్ బక్షిని మన కాలపు నజీర్ అక్బరాబాది అని పిలిచారు. నజీర్ అక్బరాబాది పద్దెనిమిదవ శతాబ్దపు భారతీయ కవి, ఆయనని ‘నజ్మ్ పితామహుడు’ అని పిలుస్తారు; అతను ఉర్దూలో ‘నజీర్’ అనే పేరుతో గజళ్ళు, నజ్మ్‌లను రాశాడు. ఆ సమయంలో, కవి ఆనంద్ ప్రకాష్ బక్షి బిస్మిల్ సయీదీ శిష్యుడని, స్వయంగా అక్బరాబాది శిష్యుడని జనాలకు తెలియదు. కాబట్టి జావేద్ అక్తర్ ఆ పోలికని సరిగ్గా పట్టుకున్నారు.
వారి ఉత్తర ప్రత్యుత్తరాలలో సయీదీ బక్షిని ఆప్యాయంగా ‘అజీజీ-ఓ-ముహిబ్బి’ అని సంబోధించారు. బక్షి “తుమ్హారా తాలిమ్” (తాలిమ్ అంటే విద్యార్థి) అని సంతకం చేసేవారు. ఔత్సాహిక కవి జీవితానికి కీలకమైన మద్దతునిచ్చిన మౌలికమైన పునాదులలో సయీదీ సాబ్ ఒకరనిగా నేను భావిస్తాను. బక్షి త్వరలో తన జీవితంలో మరొక ఉన్నతమైన, తనకి అపూర్వమైన మద్దతు ఇచ్చే వ్యక్తిని స్వాగతించారు, ఆమెను ‘నా జీవిత స్తంభం, తన మద్దతుతో నేను ఉన్నతంగా నిలబడ్డాను’ అని ఆయన అభివర్ణించారు: ఆమే ‘కమల’.
***
‘లడ్కీ సైకిల్ వాలీ, ఓయ్ లడ్కీ సైకిల్ వాలీ’
సుబేదార్ అమర్ సింగ్ మోహన్, వారి కుటుంబం 1947లో రావల్పిండి నుండి శరణార్థులుగా వచ్చారు. ఒకప్పుడు పిండిలో వారు బక్షిలు నివసించిన వీధిలోనే నివసించారు, వారు ఒకే మోహ్యాల్ వంశానికి చెందినవారు కాబట్టి పరిచయస్థులు. దేశవిభజన తర్వాత, అమర్ సింగ్ మోహన్, వారు కుటుంబం మొదట అంబాలాకు, తరువాత నాగ్‌పూర్‌కు ప్రయాణించి చివరికి లక్నోలో స్థిరపడ్డారు. అమర్ సింగ్ నాగ్‌పూర్‌లో సైన్యంలో సుబేదార్‌గా పనిచేశారు. వారి కుటుంబం లక్నోలోని అలంబాగ్‌లో స్థిరపడింది. ఇది ఆనంద్ ప్రకాష్ బక్షి కాబోయే అత్తమామల నివాసంగా మారింది.
బక్షి మేనత్త (వారి తండ్రి సోదరి) శాంతత్త, అమర్ సింగ్ కుటుంబంలో వివాహం చేసుకుంది. శాంతత్త ఒకసారి అమర్ సింగ్ ఇంటికి వెళ్ళగా తమ చిన్న కుమార్తె కమలను పరిచయం చేశారు. వెంటనే ఆమె- కమల – తన మేనల్లుడు సిపాయి బక్షికి సరైన జోడి అని గ్రహించారు. శాంతత్త 1954 సెప్టెంబర్ 2న ఇంటికి పంపిన పోస్ట్‌కార్డ్ ద్వారా తన ఉద్దేశాన్ని వెల్లడించారు, ‘నంద్ వివాహం చేసుకోవడానికి నేను ఒక మోహ్యాల్ అమ్మాయిని చూశాను. ఆమె పేరు కమల. ఆమె లక్నోలో నివసిస్తున్న రిటైర్డ్ ఆర్మీ సుబేదార్ కుమార్తె. ఆయన, నా కోడలు తండ్రితో కలిసి సైకిల్ దుకాణం నడుపుతున్నారు. ముగ్గురు అక్కచెల్లెళ్ళలో కమల అందరి కంటే చిన్నది, పెళ్ళికి సిద్ధంగా ఉంది. కమల తెలుపు రంగుతో అందంగా ఉంటుంది, కొంచెం బొద్దుగా ఉంటుంది, కుట్టుపని మరియు టైలరింగ్ తెలుసు, ఇంకా, సైకిల్ తొక్కుతుంది.’
సంబంధం త్వరగానే కుదిరింది, కొద్ది రోజుల్లోనే ముహూర్తం ప్రకటించారు. సిపాయి బక్షికి వార్షిక సెలవులు పరిమిత సంఖ్యలో ఉన్నందున పెళ్ళి ఒక నెల కంటే తక్కువ సమయంలోనే జరగాల్సి వచ్చింది. లక్నోలో జరిగిన తన వివాహంలో, ఆనంద్ బక్షి తన మంచి స్నేహితుడు, పిండికి చెందిన భగవంత్ మోహన్‌ను కలిశారు. ‘పిండివాలా’ని కలవడానికి ఉత్సాహంగా ఉన్న బక్షి – ఈ పెళ్ళిలో ఏం చేస్తున్నావని భగవంత్‌ను అడిగారు. భగవంత్, ‘నా సోదరి కమల పెళ్ళికి వచ్చాను’ అని చెప్పి, ‘మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు?’ అని అడిగితే, బక్షి, ‘మీ సోదరిని వివాహం చేసుకుంటున్న పెళ్ళికొడుకు నేనే అనుకుంటా!’ అని బదులిచ్చారు.
భగవంత్ మామా తరువాత ఓసారి నాతో, ‘మీ నాన్న టీనేజర్‌గా ఉన్నప్పుడు, సినిమా పాటల పేరడీలు, తాను రాసి, ట్యూన్ చేసిన పాటలు తన ఇంటి బయట కూర్చొని పాడుతూ స్నేహితులను, లేదా వినడానికి ఇష్టపడే వారిని అలరించేవారు. మా నాన్నగారు, అమ్మగారు తమ అల్లుడు సినిమాల కోసం సైన్యాన్ని విడిచిపెట్టినందుకు కాస్త కినుక చూపారు, కానీ నేను ఆశ్చర్యపోలేదు.’ అని అన్నారు.
(మళ్ళీ కలుద్దాం)
కొల్లూరి సోమ శంకర్ రచయిత, అనువాదకులు. బి.ఎ.డిగ్రీతో గ్రాడ్యుయేషన్. మానవ వనరుల నిర్వహణలో పిజి డిప్లొమా చేసారు. దక్షిణ భారత హిందీ ప్రచార సభ వారి భాషా ప్రవీణ పాసయ్యారు. ప్రస్తుత నివాసం హైదరాబాదు.
సోమ శంకర్ 2001 నుంచి కథలు రాస్తున్నారు. 2002 నుంచి కథలను అనువదిస్తున్నారు. కేవలం కథలే కాక ‘ది అడ్వెంచర్స్ ఆఫ్ పినోకియో’ అనే పిల్లల నవలను ‘కొంటెబొమ్మ సాహసాలు’ అనే పేరుతోను, ‘మాజిక్ ఇన్ ది మౌంటెన్స్’ అనే పిల్లల నవలను ‘కొండలలో వింతలు’ అనే పేరుతోను, వినయ్ జల్లా ఆంగ్లంలో రాసిన ‘వార్స్ అండ్ వెఫ్ట్’ అనే నవలని ‘నారాయణీయం’ అనే పేరుతోను, వరలొట్టి రంగసామి ఆంగ్లంలో రాసిన ‘లవ్! లవ్! లవ్!’ నవలను ‘సాధించెనే ఓ మనసా!’ పేరుతోనూ, అజిత్ హరిసింఘానీ రచించిన ట్రావెలాగ్ ‘వన్ లైఫ్ టు రైడ్’ను ‘ప్రయాణానికే జీవితం’అనే పేరుతోను, డా. చిత్తర్వు మధు ఆంగ్లంలో రచించిన ‘డార్క్ అవుట్పోస్ట్స్’ అనే స్పేస్ ఒపేరా నవలను ‘భూమి నుంచి ప్లూటో దాకా’ అనే పేరుతోనూ; అమర్త్యసేన్ వ్రాసిన ‘ది ఐడియా ఆఫ్ జస్టిస్’ అనే పుస్తకాన్ని, మరో నాలుగు పుస్తకాలను తెలుగులోనికి అనువదించారు. ‘దేవుడికి సాయం’ అనే కథాసంపుటి, ‘మనీప్లాంట్’, ‘నాన్నా, తొందరగా వచ్చెయ్!!’, ‘ఏడు గంటల వార్తలు’ అనే అనువాద కథా సంపుటాలను ప్రచురించారు.