Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

నగ్మే, కిస్సే, బాతేఁ, యాదేఁ – ఆనంద్ బక్షి జీవితం, పాటలు-8

[శ్రీ రాకేశ్ ఆనంద్ బక్షి రచించిన ‘నగ్మే, కిస్సే, బాతేఁ, యాదేఁ – ది లైఫ్ అండ్ లిరిక్స్ ఆఫ్ ఆనంద్ బక్షి’ అనే ఆంగ్ల పుస్తకాన్ని అనువదించి పాఠకులకు అందిస్తున్నారు కొల్లూరి సోమ శంకర్.]

అధ్యాయం 4: 1950-1951

‘యహా మై అజ్‍నబీ హూఁ’

‘కైసే కోయీ జానే భలా, ఖ్వాబోం కీ తాబీర్, ఆకాశ్ పే భైఠా హువా లిఖ్‍తా హై వో తక్‍దీర్, కిస్ రంగ్ సే జానే బనే, జీవన్ కీ తస్వీర్, ఆకాశ్ పే భైఠా హువా లిఖ్‍తా హై వో తక్‍దీర్.’ -తక్‍దీర్

ఆనంద్ ప్రకాష్ బక్షి ఇంతకు ముందు ఒకసారి, 1947 అక్టోబర్‌లో, బక్షి కుటుంబం పూనాలోని పోలీసు సూపరింటెండెంట్ కార్యాలయంలో తమ శరణార్థి సర్టిఫికెట్ల కోసం నమోదు చేసుకోవలసి వచ్చిన సందర్భంలో, బొంబాయిలో ఒకటి లేదా రెండు రోజులు ఉన్నారు.

ముఝే గానే కా షౌక్ బచ్‌పన్ సే థా, లేకిన్ మై గీత్‍కార్ బన్నే కా సప్నా లియే బంబై ఆయా (చిన్నప్పటి నుంచి పాటలు పాడడమంటే ఎంతో ఇష్టం, కానీ గీత రచయిత కావాలనే కలతోనే నేను బొంబాయికి వచ్చాను). 1950లో, దాచుకున్న డబ్బులు, 300-400 రూపాయలతో, కొన్ని కవితలతో నేను దాదర్ స్టేషన్‌కు వచ్చాను, వాటిలో కొన్ని చాలా సంవత్సరాల తరువాత సినిమా పాటలుగా రికార్డ్ చేయబడ్డాయి. మేరీ హిమ్మత్, మేరా హౌస్లా, మేరీ ప్రతిభ ఔర్ మేరీ జరూరత్ మేరే సాథ్ థీ (నా ధైర్యం, నా ఆత్మవిశ్వాసం, నా ప్రతిభ, నా అవసరం నాతో ఉన్నాయి). నా రెండు సంవత్సరాల నావికాదళ శిక్షణ, సైన్యంలో మూడు సంవత్సరాలు శిక్షణ – నేను ఎక్కడైనా జీవించగల సామర్థ్యాన్ని కలిగించగలవని కూడా నాకు నమ్మకం ఉంది. నేను ఇక్కడకు వచ్చిన మొదటి రోజున, దాదర్ స్టేషన్‌లో, జనసమూహాన్ని చూసి బెదిరిపోయాను. నేను ఇంత మందిని ఎప్పుడూ చూడలేదు.. ఈ నగరంలో ఎవరూ కళ్ళలో కళ్ళు పెట్టి చూడరు.. నాకు ఇక్కడ ఎవరూ తెలియదు! ఒంటరినైపోయినట్టు అనిపించింది. నా లక్ష్యాన్ని సాధించడంలో నేనొక్కడిని సరిపోనని అనిపించింది, అందుకని నా బన్సీ వాలేను (కృష్ణుడిని) సహాయం అడిగాను. నేను స్టేషన్ నుండి బయటకు అడుగు పెట్టే ముందు నాలో ఆత్మవిశ్వాసం, ధైర్యం నింపమని ఒక ప్రార్థనా గీతం రాశాను.

మేరే భగవాన్, బన్సీవాలే
తూ నే ముఝే జజ్బాత్ దియే
సంగీత్ కా ప్రేమ్ మేరే జిస్మ్ కే కోనే-కోనే మే భర్ దియా
మై తేరా అహసాన్‍మంద్ హూఁ
ఔర్ అబ్ మై తేరే సామ్‍నే ఝుక్‍కర్,
అప్నే ఉన్ హసీన్ ఖ్వాబోం కీ తాబీర్ మాంగ్‍తా హూఁ
జో తూనే మేరీ    మాసూమ్ ఆంఖోం మే బసాయే.
– తేరా నంద్

దాదాపుగా ఇరవై సంవత్సరాల తర్వాత, ఫిబ్రవరి 12, 1971న, గీత్‍కార్ ఆనంద్ బక్షి తన రెండవ ప్రార్థన రాశారు. జీవితంలో తన లక్ష్యాన్ని సాధించడంలో సాయం చేసినందుకు శ్రీకృష్ణుడికి కృతజ్ఞతలు తెలిపారు. ఆయన తన మొదటి ప్రార్థనా గీతంపై ‘నంద్’ అని సంతకం చేశారు, రెండవ ప్రార్థనా గీతంపై, 1956 తర్వాత సినిమా ప్రపంచంలో అతను సంపాదించిన పేరు ‘ఆనంద్ బక్షి’ అని కాకుండా ‘ఆనంద్ ప్రకాష్ బక్షి’ అని సంతకం చేశారు. తన మూలాలతో సంధానమవాలని అనుకున్నప్పుడల్లా, ఆయన తనను తాను నంద్ అని సంబోధించుకునేవారు, తన ఫౌజీ జీవితంతో కనెక్ట్ కావాలనుకున్నప్పుడు, దేవుని సహాయం అవసరమైనప్పుడు తనను తాను ఆనంద్ ప్రకాష్ బక్షి అని సంబోధించుకునేవారు. Anand Bakhshi ఎప్పుడూ ‘Anand Bakshi’ అనే భావనకు (సినీ ప్రపంచం కల్పించిన పేరు ప్రతిష్టలకు) లోబడలేదు.

భగవాన్ బన్సీవాలే, మై తేరా బచ్చా హూఁ. యే షాయద్ మేరీ దూసరీ ప్రేయర్  హై. ముఝే అప్నా aim in life మే కామ్‍యాబీ మిలీ. యే తేరీ కృపా సే హువా. వర్నా మై ఇక్ కాబిల్ కహాఁ కీ మై ఇత్నా మషూర్ ఆద్మీ బన్ జావూఁ. హజారోం లాఖోం రూపయె కమావూఁ.

ఆజ్ మై తేరే సామ్నే ఝుక్ కే ఏక్ ప్రార్థనా కర్తా హూఁ. మేరే దిల్ మే యే డర్ ఔర్ వహమ్ నికాల్ దే. ముఝే హౌస్లా, హిమ్మత్ దే. మైనే అప్నే పాఁవ్ మే ఆప్ కీ జో డర్ కీ బేడీ డాలీ హైఁ జల్ద్ కాట్ కే ఫేంక్ దే. ముఝే ఆజాద్ కర్ దే.

ముఝే మేరీ బీబీ-బచ్చోంకే సాథ్ సుఖ్ సే జీనే దే.

మేరా ఖోయా హువా విశ్వాస్ వాపస్ దే.

12 ఫిబ్రవరి 1971. Anand Bakhshi.

బొంబాయి చేరుకున్నాకా, ఆయన దాదర్ రైల్వే స్టేషన్‌లోని ప్రయాణీకుల వెయిటింగ్ రూమ్ లో కొద్దిసేపు ఉండి, ఆపై బయటకు అడుగు పెట్టారు. సమీపంలోని, దాదర్ వెస్ట్‌లోని వలసదారుల కోసం ఉద్దేశించిన డార్మిటరీలో దిగారు.

‘ఇంతకుముందు, ఎప్పుడూ.. అది సైన్యంలో కావచ్చు లేదా ఇంట్లో మా కుటుంబం కావచ్చు నా చుట్టూ నా సహచరులు ఉండేవారు. బొంబాయి అనేది నేను సినిమాల్లో చూసిన, పత్రికలలో చదివిన ప్రదేశం మాత్రమే. సైన్యంలోని నా సహచరులు చేసినట్లుగా, ఆ నగరం చేతులు చాచి నా ప్రతిభని ఆహ్వానిస్తుందని భావించాను. సైన్యంలోని మావాళ్ళు – నేను రాసినవి చదివి, పాడినవి విని నన్నెంతో అభిమానించి, నన్ను నేను యుద్ధవీరుడిగా భావించేలా చేశారు. కానీ అవకాశం వెతుక్కుంటూ బొంబాయికి వచ్చినప్పుడు, నేను సముద్రంలో కనిపించని నీటి బిందువులా ఉన్నాను. నా ఉనికిని ఎవరూ గుర్తించలేదు. సినీ గీతరచనా రంగాన్ని శాసిస్తున్న గొప్ప కవులు, గేయ రచయితల సహవాసంలోకి ప్రవేశించడం కూడా నాకు అసాధ్యం. గీత్‍కార్ బన్‌నే కా మాసూమ్ సప్నా లియే మై బొంబై కి సడకోఁ పే ఘూమ్తా థా, ఫిల్మ్ స్టూడియోస్ ఢూండ్తా థా, ఆంఖోఁ మే మాసూమ్ సప్నా ఔర్ దిల్ మే చోటా సా హౌస్లా లియే (గీత రచయిత కావాలనే నా అమాయకమైన కల నన్ను బొంబాయి వీధుల్లో తిరిగేలా చేసింది, అక్కడ నేను సినిమా స్టూడియోల కోసం వెతుకుతున్నాను, నా కళ్ళలో ఈ అమాయకపు కల, నా హృదయంలో కాస్త ధైర్యం ఉన్నాయి).

త్వరలోనే, నేను బొంబాయికి నేనొక అపరిచితుడిలా భావించసాగాను. మరో దారుణమైన సంగతి ఏంటంటే, నాకు పని దొరికే వరకు కనీసం ఒకటి లేదా రెండు వారాల పాటు నాకు సహాయం చేయగలరని నేను ఆశించిన మా బంధువు, ఏ కారణం చేతనో అందుకు అంగీకరించలేదు. నా సైనిక జీవితాన్ని, ఇంటిని మిస్ అవుతున్నట్లు అనిపించసాగింది. ‘జబ్ జబ్ ఫూల్ ఖిలే’ సినిమా లోని నా పాట “కభీ పెహేలే దేఖా నహీఁ యే సమా, కి మై భూల్ సే ఆగయా హూఁ కహాఁ. యహా మై, అజ్‍నబీ హూఁ” లాగా నాకు అనిపించింది.’

అపరిచిత నగరంలో, తన ఇంటి ఆప్యాయతని కోల్పోయిన ఈ అపరిచితుడి భావాలని ఆనంద్ బక్షి ‘దర్ద్ కా రిష్తా’ సినిమా కోసం రాసిన మరో పాటలో వ్యక్తపపరిచారు: ఇస్ షహర్ సే అచ్ఛా థా, బహుత్ అప్నా ఓ గాఁవ్, పన్ ఘట్ హై యహాఁ కోయీ నా పీపల్ కీ వో ఛావోఁ.

‘మా సమీప బంధువొకామె బొంబాయిలో నివసిస్తున్నారు. కొత్త నగరంలో నా కాళ్ళూనుకునే వరకూ, సినిమాలలో పని కోసం నేను వెళ్ళాల్సిన ప్రాంతానికి దగ్గరలో ఒక గెస్ట్ హౌస్ దొరికే వరకు, ఆమె నాకు కొన్ని రోజులు వాళ్ళింట్లో ఆశ్రయం ఇస్తుందని ఆశించాను. ఆమె కుటుంబం వారు మా నానమ్మకి, నాన్నగారికి దగ్గరి బంధువులు. నేను ఆమె ఇంటికి వెళ్ళగా, ఆమె నన్ను స్వాగతించింది, కానీ కొన్ని రోజులు వారి అతిథిగా ఉండదలచానని గ్రహించాకా, నా పట్ల ఆమె వైఖరి నాటకీయంగా మారిపోయింది. నేను కొద్దిగా ఆహారం తీసుకుని, ముఖమూ చేతులూ కడుక్కోగానే, వాళ్ళ వాష్‌బేసిన్‌ని మురికి చేసి పాడు చేశానని ఆరోపించింది, హైక్లాస్ మనుషుల్లా ఉండడం నేను నేర్చుకోవాలని చెప్పింది. ఆర్మీ జవాన్లు ఎంత గౌరవప్రదంగా, క్రమశిక్షణతో ఉంటారో ఆమెకు తెలియదు. అయితే నన్ను ఎలా తిప్పిపంపాలో తెలియకపోవడంతోనే ఆమె అకస్మాత్తుగా క్రూరంగా ప్రవర్తిస్తున్నట్లు నాకు తొందరగానే అర్థమైంది. అందుకే, ఓ సైనిక సహచరుడి వద్ద బస ఏర్పాటు చేసుకున్నానని ఆమెకు చెప్పి, ఆ ఇంట్లోంచి బయటకు వచ్చాను. విచిత్రంగా, రెండు దశాబ్దాల తర్వాత, ఆమె మా కుటుంబ స్నేహితురాలిగా మారింది, కానీ నేను ఓ “సున్నా”గా ఉన్నప్పుడు ఆమె నన్ను ఎలా చూసిందో నేను ఆమెకు ఎన్నడూ గుర్తు చేయలేదు.

దాదర్‌లోనే ఒక ప్రసిద్ధ స్టూడియో ఉందని తెలుసుకున్నాను. నా బంధువు వాళ్ళింట్లో నన్ను ఒక రాత్రి కూడా ఉండనివ్వకపోవడంతో, దాదర్‌లోని ఒక గెస్ట్ హౌస్‌లో దిగాను. వెంటనే నేను సమీపంలోని ఫిల్మ్ స్టూడియోని వెతికి, గుర్తించాను. అయితే గేట్‌మ్యాన్ నన్ను లోపలికి రానివ్వలేదు. నేను వేచి ఉన్నాను. డ్యూటీ అవర్ మారి మరో గేట్‍మ్యాన్ వచ్చాకా, ఓ టాక్సీ ఎక్కి స్టూడియో లోపలికి వెళ్ళాను. స్టూడియోలో ప్రవేశించటానికి కొన్ని రోజులు ముందు బయట వేచి చూస్తూ, టాక్సీలలో వచ్చేవాళ్ళని ఏ ప్రశ్నలు వేయకుండా గేట్‌మెన్ లోపలికి అనుమతిస్తారని గ్రహించాను. నేను టాక్సీలో కాంప్లెక్స్‌లోకి ప్రవేశించాను. అదృష్టం కొద్దీ నేరుగా కర్దార్ స్టూడియో యజమాని – నటుడు, నిర్మాత మరియు దర్శకుడు – అబ్దుల్ రషీద్ కర్దార్‌ గారిని కలిశాను! భారతీయ సైన్యానికి ధన్యవాదాలు, అక్కడి ఆ అనుభవంతో, చక్కని దుస్తులు ధరించి, ఆత్మవిశ్వాంతో ఆయన వద్దకు నడిచి, “మై షాయర్ హూఁ, దిల్లీ సే ఆయా హూఁ. గీత్ లిఖ్నా చాహ్తా హూఁ” (నేను కవిని. ఢిల్లీ నుండి వచ్చాను. సినిమా పాటలు రాయాలనుకుంటున్నాను) అని చెప్పాను. ఓ సినీ దిగ్గజంతో ఇది నా మొదటి సమావేశం. ఇది చాలా సులభమని అనుకున్నాను, ఇప్పుడు సినిమా ప్రపంచంలోని ఈ కోటలను ఎలా చేరుకోవాలో, లోపలికి ఎలా ప్రవేశించాలో నాకు తెలిసిపోయింది. నేను పని కోసం వెతుకుతున్న “స్ట్రగులర్”ని అని గ్రహించాకా, మిస్టర్ కర్దార్ మానసిక స్థితి కొద్దిగా మారింది. కానీ ఆయన దయతో నన్ను తన మేనేజర్లు లేదా సహాయకులలో ఒకరికి అప్పగించి వెళ్ళిపోయారు.

వారి మేనేజర్ నా కవితలు విని, మిస్టర్ కర్దార్‌కు రిపోర్ట్ చేస్తానని చెప్పాడు. స్టూడియోలలోని గేట్‍మెన్ల నుండి చిట్కాలు తీసుకొని నేను సినిమా నిర్మాతలను, సంగీత స్వరకర్తలను కలవడానికి ప్రయత్నించాను. కొందరు గేట్‍మెన్ దయగా ఉండేవారు, నిర్మాతలు, సంగీత దర్శకుల చిరునామాలు ఇచ్చేవారు, మరికొందరు నన్ను వెళ్ళగొట్టారు. అయితే ఆ తర్వాత నేను సినిమా సంబంధిత ఒక్క వ్యక్తిని కూడా కలవలేకపోయాను. వచ్చిన మూడు నెలల్లోనే డబ్బు అయిపోవడంతో ఆశ కోల్పోయాను. గది అద్దె ఆదా చేయడానికి, టికెట్ చెక్ చేసే సిబ్బందికి కనబడకుండా, తెలివిగా దాక్కుని, దాదర్ స్టేషన్‌లోని ప్రయాణీకుల వెయిటింగ్ రూమ్‍లో ఉండసాగాను.

నాటక రంగంలో కూడా నేను ముందుకు వెళ్ళలేకపోయాను. నాటకరంగ ప్రముఖులను ఎలా కలుసుకోవాలో – నాకు తెలిసినవారెవరూ ఎటువంటి సూచనలు ఇవ్వలేదు. అయితే, నా జీవిత లక్ష్యం నన్ను కాపాడింది. అది నా మనసులో బలంగా నాటుకుపోయింది. నేను బొంబాయిని వీడి నా స్వస్థలం ఢిల్లీకి తిరిగి వెళ్ళవలసి వచ్చినప్పటికీ, సినిమాలతో కనెక్ట్ అవ్వడానికి ఒక అవకాశం ఇప్పటికీ నా కోసం వేచి ఉందని నాకు తెలుసు. అందుకని నేను రేడియో అనౌన్సర్‌గా మారాలని నిర్ణయించుకున్నాను. పరిస్థితులు ఇంకా దారుణంగా లేవు అని అనుకున్నాను. ఢిల్లీకి టికెట్ బుక్ చేసుకున్నాను. నా జీవిత లక్ష్యానికి నన్ను రేడియో అనుసంధానిస్తుందని భావించాను, ఉద్యోగం సాధించి రేడియోలో స్థిరపడిన తర్వాత, బొంబాయికి తిరిగి రావడానికి మరొక ప్రయత్నం చేస్తాను.’

ఆనంద్ ప్రకాష్ బక్షి డిసెంబర్ 1950లో ఢిల్లీకి తిరిగి వచ్చారు. ఆ రైలు ప్రయాణంలోనే ‘గాడీ బులా రహీ హై’ అనే పాట రాశారని మా అత్త (నాన్నగారి సవతి సోదరి) నాకు చెప్పింది. ఈ పాటను ఆయన అప్పట్లో రాసి ఉండవచ్చు. అందులోని స్ఫూర్తిదాయకమైన వాక్యాలను నిశితంగా పరిశీలిస్తే, నా అభిప్రాయంతో మీరు ఏకీభవించవచ్చు.

తాను సైన్యాన్ని విడిచిపెట్టడం పట్ల తన కుటుంబం కోపంగా ఉందనీ, కలత చెందిందని నంద్‌కు తెలుసు, అయితే మాజీ సైనికుడెవరైనా తన వ్యక్తిగత అభ్యర్థన మేరకు తన నమోదు గడువు ముగిసేలోపు డిశ్చార్జ్ అయి ఉంటే సైన్యంలోకి తిరిగి వచ్చే అవకాశం ఉందని జనరల్ దూబే నంద్‌కి చెప్పారు.

అయితే, చిన్నప్పటి నుంచి తాను అడిగిన వారందరి కోసం పాటలు పాడుతూనే ఉన్నాడు కాబట్టి, తనకు రేడియోలో ఉద్యోగం వస్తుందని నంద్ నమ్మకంగా ఉన్నారు.

ఢిల్లీ వచ్చేశాకా, తను కార్ప్స్ ఆఫ్ సిగ్నల్స్‌లో తిరిగి చేరబోతున్నానని కుటుంబ పెద్దలకు అబద్ధం చెప్పి భరోసా ఇచ్చారు. తాను స్వచ్ఛందంగా డిశ్చార్జ్ తీసుకున్నందున ఇది సాధ్యమేనని, నావికాదళం నుండి దురదృష్టవశాత్తు నిష్క్రమించినట్లు కాకుండా, సైన్యం నుండి తాను తొలగించబడలేదని వారికి చెప్పారు. అందుకని, ఎవరికీ చెప్పకుండా, ఎల్లప్పుడూ ఆశావాదియైన ఆనంద్ ప్రకాష్ బక్షి అల్ ఇండియా రేడియో (AIR)లో మాండేటరీ వాయిస్ టెస్ట్ కోసం రహస్యంగా దరఖాస్తు చేసుకున్నారు. ఆయన మేనమామ మేజర్ బాలి ఈ పరీక్షకు అవసరమైన అపాయింట్‌మెంట్ పొందడానికి సహాయం చేశారు.

డిసెంబర్ 22, 1950న, ఆనంద్ ప్రకాష్ బక్షి, ఇండియా గేట్ సమీపంలోని ఆకాశవాణి కార్యాలయంలో వాయిస్ టెస్ట్‌కి హాజరయ్యారు. ఆశ్చర్యకరంగా, ఆ పరీక్షలో ఆయన విఫలమయ్యారు. చిన్నప్పటి నుంచి జనాలు తన పాటలను ఎంతగానో ఇష్టపడటం చూసిన నంద్ – దీన్ని నమ్మలేకపోయారు. ఆర్మీ వారి బారా ఖానా కార్యక్రమాలలో కూడా నంద్ అందరికీ ఫేవరెట్. అయినా..

‘సైన్యాన్ని విడిచిపెట్టిన తర్వాత మొదటిసారిగా, మళ్ళీ సైన్యంలో చేరిపోదామా అని ఆలోచించసాగాను. నేను జబ్బల్‌పూర్‌కి ట్రైన్ టికెట్ బుక్ చేసుకున్నాను.’

‘మై షాయర్ బద్‍నామ్, మై చలా
మెహ్‍ఫిల్ సే నాకామ్, మై చలా
మై చలా
మేరే ఘర్ సే తుమ్ కో, కుఛ్ సామాన్ మిలేగా
దీవానే షాయర్ కా ఏక్ దీవాన్ మిలేగా
ఔర్ ఏక్ ఛీజ్ మిలేగీ, టూటా ఖాలీ జామ్
మై చలా, మై చలా
మై షాయర్ బద్‍నామ్.
– నమక్ హరామ్

(మళ్ళీ కలుద్దాం)

Exit mobile version