[శ్రీ రాకేశ్ ఆనంద్ బక్షి రచించిన ‘నగ్మే, కిస్సే, బాతేఁ, యాదేఁ – ది లైఫ్ అండ్ లిరిక్స్ ఆఫ్ ఆనంద్ బక్షి’ అనే ఆంగ్ల పుస్తకాన్ని అనువదించి పాఠకులకు అందిస్తున్నారు కొల్లూరి సోమ శంకర్.]
అధ్యాయం 3: 1947-1950 – రెండవ భాగం:
‘సైనిక జీవితం, నజ్మ్ రచన కొనసాగాయి. త్వరలో, 18 జూన్ 1949న, నేను జుబ్బల్‌పూర్‌లోని సిగ్నల్స్ శిక్షణా కేంద్రం నుండి క్లాస్ III “స్విచ్ బోర్డ్ ఆపరేటర్”గా పట్టభద్రుడయ్యాను.’
1949 నాటికి యువకుడిగా ఎదిగి, తన సహచరులు, సీనియర్లు సైన్యాన్ని విడిచిపెట్టమని ప్రోత్సహించడంతో, నంద్ పాటలు రాయడంపై దృష్టి పెడుతూ, సిపాయి యూనిఫాం వెనుక ఉన్న అసలు వ్యక్తిని ముందుకు తెచ్చారు. సైన్యాన్ని విడిచిపెట్టి, సినిమా పరిశ్రమలో చేరడానికి బొంబాయికి వెళ్లవచ్చని సూచిస్తూ ఆయన తన తండ్రికి ఉత్తరం రాశారు. తాను సైన్యంలో లేనట్లు భావిస్తున్నానని నంద్ పేర్కొన్నారు. ఆయన తాతగారు నంద్‌కి అనేక లేఖలు వ్రాశారు. సైన్యం వీడొద్దని హెచ్చరించారు. 1949 డిసెంబర్ 21 నాటి ఉత్తర ప్రత్యుత్తరాలలో, నంద్ తండ్రి తన ముద్దుల కొడుకును ‘కంజర్ వాలే కామ్’ ( కంజర్లు అంటే బంజారాలు. కంజర్ వాలే కామ్ అంటే, బంజారాల్లా స్థిరత లేని, తక్కువ స్థాయి పనులు చేసే వారని అర్ధం. ఆ కాలంలో సినిమా వాళాంటే గౌరవం లేదు సమాజంలో) నిలకడలేని వృత్తి కోసం – గౌరవప్రదమైన, భద్రతనిచ్చే హిందూస్థానీ ఫౌజ్‌లో ఉద్యోగాన్ని విడిచిపెట్టవద్దని హెచ్చరించారు. ఎవరూ తెలియని పరాయి ప్రాంతానికి వెళ్లడం తెలివితక్కువతనమని, అలా చేస్తే విలువలేని వృత్తిలో చేరాలనే ఈ ఫలించని కలలో విఫలమవుతావని, ఆ ప్రక్రియలో, ఇప్పటివరకు దాచుకున్న డబ్బుని పోగొట్టుకుంటావని తండ్రి నంద్‌తో చెప్పారు. దేశ విభజన వల్ల తమకి కలిగిన నష్టాల నుండి వారింకా కోలుకోలేదు. పైగా ఒకసారి బయటకు వచ్చేస్తే, సైన్యం తిరిగి చేర్చుకోదు.
‘సహజంగానే, వాళ్ళు చాలా ఆందోళన చెందారు, బాధపడ్డారు. నేను మా నాన్న స్థానంలో ఉంటే, నేను కూడా బాధపడేవాడిని. మేము నిరాశ్రయులమై మూడేళ్ళయింది, ఇప్పుడు నేను సురక్షితమైన సర్కారీ నౌకరీ (ప్రభుత్వ ఉద్యోగం) వదిలి వెళ్తున్నాను! వారి అభిప్రాయాలను , వారిని గౌరవించాను, కానీ నేను అనుసరించాల్సిన ఒక కల ఉంది. ఏదో ఒక రోజు వారందరూ తప్పు అని నిరూపించడానికి నేను చాలా కష్టపడాల్సి వచ్చింది!’
అదే కాలంలో, జోధ్‌పూర్‍లో ఉంటున్న నంద్ మేనమామ డబ్ల్యూ.ఎం. మేజర్ బాలి ఓ ఉత్తరం రాశారు. సైన్యాన్ని విడిచిపెట్టవద్దని, అలా చేస్తే తరువాత పశ్చాత్తాపపడాల్సి వస్తుందని, తొందరపడి ఏ చర్యా తీసుకోవద్దని తన మేనల్లుడికి సూచించారు. అయితే, నంద్ మావయ్య ఇంకో ముఖ్యమైన సూచన చేశారు, ఒకవేళ సైన్యం వీడాలనే నిశ్చయించుకుంటే, నంద్ మొదట ఇంగ్లీషు ఫస్ట్ క్లాస్‌లో పాస్ అవ్వాలి. అది నగరాల్లోని పెద్దమనుషుల భాష, అది బొంబాయిలోని ప్రజలను ఆకట్టుకుంటుంది, నీలాంటి మాజీ సైనికుడికి సినిమాల్లో అవకాశం దొరకకపోతే మంచి జీతం వచ్చే, మంచి ఉద్యోగం దొరకడం సులభం అవుతుందని సలహా ఇచ్చారాయన.
‘నా స్వప్నం పట్ల వాళ్ళ కోపం, కఠినమైన మాటలు నన్ను బాధించడమే కాకుండా నాకు చాలా కోపం తెప్పించాయి. నేను బాగా రాయగలనని నాకు తెలుసు, కానీ మా లాంటి మధ్యతరగతి శరణార్థులకు ఫౌజ్ “సురక్షితమైన” ఉద్యోగం అని – మా కుటుంబ గౌరవం దృష్ట్యా, ఇంకా పూర్వీకుల ప్రభావం కారణంగా మావాళ్ళు నన్ను, నా ఆశలని అస్సలు పట్టించుకోలేదు. రెండు సంవత్సరాల క్రితం, మేము పిండిలోని సంపన్న కుటుంబాలలో ఒకరిగా ఉన్నాము. నేను ప్రతిరోజూ నా బట్టల జేబులన్నింటినీ ఖరీదైన డ్రై ఫ్రూట్స్‌తో నింపుకుని, వాటిని చాలా మంది స్నేహితులతో పంచుకునేవాడిని. దేశ విభజన గాయం, రాత్రికి రాత్రే మా సంపద, గౌరవాన్ని కోల్పోయామనే వాస్తవం మావాళ్ళని పిరికివాళ్ళను చేసిందని నేను భావించాను. అయితే, సైన్యంలో పనిచేయడం వల్లే – కేవలం కొద్దిపాటి ఆహారంతో, కనీస సౌకర్యాలతో, బొంబాయిలో జీవించగలిగే సామర్థ్యం నాకు అలవడిందని గట్టిగా నమ్మాను. మై సహారోఁ పే నహీ, ఖుద్ పే యకీన్ రఖ్తా హూఁ. గిర్ పడూంగా తో హువా క్యా, మై సంభాల్ జావూంగా (నేను ఇతరుల మద్దతు ఆధార పడను. ఎల్లప్పుడూ నన్ను నేను నమ్ముతాను. మరి నేను పొరపాట్లు చేస్తే? నా అంతట నేనే సరిదిద్దుకుంటాను). నా ఆశయాలను కాగితంపై రాసి, ఆ నోట్‌పై సంతకం చేసి గోడపై పెట్టాలని నిర్ణయించుకున్నాను, తద్వారా నేను దానిని ప్రతిరోజూ చూడగలను. నా కలను, నా భవిష్యత్తు మార్గాన్ని మరచిపోను. ఇకనుండి అది జీవితంలో నా ప్రాథమిక లక్ష్యంగా మారాలి.’
‘నంద్ సెలవులో మమ్మల్ని చూడటానికి వచ్చినప్పుడు, మా ఢిల్లీ కుటుంబపు ఇంట్లో, ఓ గోడపై – బొంబాయి – అనే ఒకే పదం రాశాడు’ అని నంద్ సవతి సోదరి షుబి ఖేమ్ దత్ గుర్తుచేసుకున్నారు.
***
‘నా జీవిత లక్ష్యం’
1950 జనవరి 24న, సైన్యంలో ఉండగా, ఆనంద్ ప్రకాష్ బక్షి తన మొదటి పర్సనల్ మ్యానిఫెస్టోను రాశారు, దానిని ‘ఎయిమ్ ఇన్ లైఫ్’ అని పేర్కొన్నారు:
ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరికీ, ధనవంతులైనా, పేదవారైనా, జీవితంలో ఒక నిర్దిష్ట లక్ష్యం ఉండాలి. జీవితంలో ఎటువంటి స్థిర లక్ష్యం లేని వ్యక్తి చుక్కాని లేని ఓడ లాంటివాడు. కేవలం గాలుల దయ మీద ఆధారపడి, ఓడ గమనాన్ని నియంత్రించలేని శక్తిహీనుడు. కాబట్టి, జీవితంలో ఎటువంటి లక్ష్యం లేని వ్యక్తికి తన చర్యలను నడిపించడానికి లేదా తన ప్రవర్తనను నియంత్రించడానికి ఏమీ ఉండదు. నేను, క్రింద సంతకం చేసిన ఆనంద్ ప్రకాష్ బక్షి (AZAD), సంగీతం నేర్చుకోవాలని అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక కళాకారుడిగా మారడమనేది జీవితంలో నా లక్ష్యం. దీనిని సాధించడానికి, నేను సినిమాలు, రేడియో లేదా థియేటర్‌లో చేరాలి, గాయకుడు, పాటల స్వరకర్త, సంగీత దర్శకుడు, దర్శకుడు మొదలైనవాటిగా మారాలి.
మూడు దశాబ్దాలకు పైగా తర్వాత, 10 అక్టోబర్ 1988న, ఆయన తన ‘ఎయిమ్ ఇన్ లైఫ్’కి ఒక ఫుట్‌నోట్‌ను జోడించారు:
అలా జరిగింది: నేను విజయవంతమైన పాటల రచయితని అయ్యాను. పేరు, కీర్తి, డబ్బు, ఫ్లాట్లు, కార్లు, ఇంకా మరెన్నో సంపాదించాను. కానీ ఈ జీవిత మార్గంలో ఎందుకో నా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయాను. ఆనంద్ ప్రకాష్ నుండి నేను ఆనంద్ బక్షి అయ్యాను. ఇప్పుడు నేను మళ్ళీ ఆనంద్ బక్షి నుండి ఆనంద్ ప్రకాష్ అవ్వాలనుకుంటున్నాను. ఇలా ఇంతకు ముందొకసారి చేశానని అనుకుంటున్నాను, కాబట్టి నేను మళ్ళీ చేస్తాను. దేవుడా, నాకు సహాయం చెయ్యి. ఈ ముప్పై ఎనిమిది సంవత్సరాలలో, నేను తప్పులు చేసాను. వీటికి నన్ను క్షమించాలని కోరుకుంటున్నాను. నేను ఏమి చేస్తున్నానో నాకు తెలియదు.
ఈ ఫుట్‌నోట్‌ను నిశితంగా పరిశీలిద్దాం. 70ల నుండి ఆయనని ముంచెత్తిన – వదిలివేయబడ్డామనే, ఒంటరిగా మిగిలిపోతామనే భయాన్ని ఇది ప్రతిబింబిస్తుంది. ఆయన మేనమామ, మేజర్ బాలి, నంద్ బాల్యంలోనే తన తల్లిని కోల్పోవడం వల్ల, ఇంకా చిన్న వయసులోనే ఇంటికి దూరంగా ఉండటం ప్రారంభించినందున నంద్ ఒక బాధను అనుభవించాడని నమ్మారు. నంద్ స్నేహితుడు పిఎన్ పూరి, పదిహేడేళ్ల చిన్న వయసులో – కళ్ళారా చూసిన దేశ విభజన నంద్‌ని గాయపరిచిందని నమ్మారు. మనకు ఖచ్చితమైన నిజం ఎప్పటికీ తెలియదు.
90ల మధ్యలో, ఒంటరితనం లేదా వదిలివేయబడడమనే భయాన్ని పోగొట్టుకోవడానికి, నంద్ ప్రతి వారం ముంబైలో స్థానిక రైళ్లలో ఒంటరిగా ప్రయాణించడం మొదలుపెట్టారు. సిపాయి ఆనంద్ ప్రకాశ్‌గా తన జీవితాన్ని మళ్ళీ జీవించడానికి ఆయన చేసిన ప్రయత్నం ఇది. ఇందుకోసం, దాదాపు ముప్పై సంవత్సరాల తర్వాత, ఆయన మొదటిసారి మార్చి 9, 1995న లోకల్ ట్రైన్‌లో ప్రయాణించారు. తాను రాసిన పాటను తన కోసమే పాడుకుంటూ – ఖార్ స్టేషన్ నుండి బాంద్రా వరకు ప్రయాణించారు:
‘గాడీ బులా రహీ హై, సీటీ బజా రహీ హై, చల్నా హీ జిందగీ హై, చల్తీ హీ జా రహీ హై’ – దోస్త్.
***
కవి జననం
నంద్ సైన్యంలో ఉన్న రోజుల్లో, తమ ముద్దుల మనమడు, సైనిక జీవితంలో తన స్థానాన్ని స్థిరపరుచుకున్నాడని అతని తాతగారు, తండ్రి భావించారు. వారికి తెలియని విషయం ఏమిటంటే, వారి ‘ఫౌజీ బేటా’ క్రమం తప్పకుండా కవితలు, నాటకాలు రాసేవాడని, ఆనంద్ ప్రకాష్ బక్షి అనే కలం పేరు పెట్టుకున్నాడని. జీవితంలోని ప్రతీ దశలో ఆయన్ని అందరూ వేర్వేరు పేర్లతో పిలిచేవారు – తల్లిదండ్రులు ఆయనకి ఆనంద్ అని పేరు పెట్టారు; కానీ అతని తల్లిదండ్రులు, కుటుంబం, ఇంకా ఆయన కూడా తన పేరును భిన్నంగా పేర్కొన్నారు: తల్లిదండ్రులు, దూరపు బంధువులు ఆయనని – నంద్, నందో అనే పిలిచేవారు; ఆయన కూడా తనని తాను అదే పేరుతో పేర్కొన్నారు; బడిలోవిద్యార్థిగా, నౌకాదళంలో కాడెట్‍గా ఆనంద్ ప్రకాష్; సిపాయిగా బక్షి ఆనంద్ ప్రకాష్ వైద్; ఇంకా కవిగా ఆనంద్ ప్రకాశ్ బక్షి, చివరగా, గీత రచయితగా ఆనంద్ బక్షి! (ఒక సినిమా నిర్మాత ఆనంద్ బక్షి ఇంటిపేరును తప్పుగా వ్రాసి, Bakhshi నుంచి ‘h’ని తొలగించాడు! Bakshi గా ఆ పేరు, కలిసొచ్చింది. అయితే, ఆయన చట్టపరమైన పత్రాలలో, అభిమానులకు తన సంతకంతో అందజేసిన ఫొటోలలో, ఎల్లప్పుడూ Bakhshi అనే పేరును ‘h ́తోనే రాశారు.)
ఇండియన్ ఆర్మీ లోని కార్ప్స్ ఆఫ్ సిగ్నల్స్ యూనిట్ – ఆయన తన రచనా నైపుణ్యాలను, ప్రతిభను పెంపొందించుకున్న ప్రదేశం. తన సహచరులు, సీనియర్ల నుండి ఆయనకి లభించిన ప్రోత్సాహం – సైన్యం నుండి బయటకు వెళ్లి బొంబాయిలో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలనే కలను సాకారం చేసుకునేలా ప్రేరేపించింది, ధైర్యాన్నిచ్చింది. ఆయన సైన్యంలో ఉండగా, జుబ్బల్‌పూర్, హైదరాబాద్ డివిజన్‌లలో గణనీయమైన సమయం గడిపారు. ఎల్లప్పుడూ తన సీనియర్లను అభిమానిస్తూ, వారి గౌరవాన్ని సంపాదించాలనే ఆసక్తి కలిగి ఉండేవారు – సైనికులు అలాగే తయారవుతారు. సైన్యంలో, అధికారులలో ఎంతో పేరుపొందిన జనరల్ దూబే అనే అధికారి, రచయితగా సినిమాల్లో కెరీర్ కోసం సైన్యాన్ని విడిచిపెట్టమని ప్రోత్సహించి, ఆనంద్ ప్రకాష్ బక్షికి ఎంతో ప్రేరణనిచ్చారు. అయితే తన రచనపై అభిప్రాయాన్ని, విమర్శలను అందించడానికి – ప్రసిద్ధ కవి అయిన వ్యక్తి కూడా తనకు అవసరమని బక్షి భావించారు. డిఎన్ మధోక్, శైలేంద్రలను తన గురువులుగా భావించినప్పటికీ, వారి అభిప్రాయాన్ని పొందడానికి వారు అతనికి అందుబాటులో లేరు.
తన రచనలో తనకు మార్గనిర్దేశం చేయగల; మాస్టర్స్ కవిత్వం ఎలా రాస్తారో అధికారికంగా నేర్పించగల ప్రొఫెషనల్ మెంటార్ కోసం ఆయన వెతకడం ప్రారంభించారు. త్వరలో – పురానీ దిల్లీలోనూ, భారతదేశం అంతటా తన ప్రచురణల ద్వారా ఇతర ప్రదేశాల సాహిత్య వర్గాలలో గౌరవించబడిన ఒక సంపాదకుడు, కవిని కలవనున్నారు. ఆయన పేరు బిస్మిల్ సయీది. బక్షికి సయీది గారు తెలుసు; బక్షి సయీది సంపాదకత్వం వహించే ఉర్దూ మాసపత్రిక ‘బీస్వి సదీ’ని క్రమం తప్పకుండా చదివేవారు. తర్వాతి కాలంలో బక్షి, సయీది అత్యంత సన్నిహితులు అవుతారు, సయీది సాబ్ యువ ఔత్సాహిక కవి, సిపాయికి గురువుగా మారినప్పుడు వారి స్నేహం ప్రారంభమైంది. మీరు ఆనంద్ బక్షి అభిమాని అయితే, బక్షి కలలని సాకారం చేయడంలో సయీది సాబ్ అందించిన సహకారాన్ని మీతో పంచుకుంటాను.
‘ఉర్దూ, ఫార్సీ కవిత్వానికి చెందిన దిగ్గజాలు రాసిన మరిన్ని కవితా సంపుటాలను చదవమని సూచించి, ప్రోత్సహించిన మొదటి వ్యక్తి బిస్మిల్ సయీదీ సాబ్. నేను సైన్యంలో ఉన్నప్పుడు ఆయన నాతో క్రమం తప్పకుండా ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపేవారు, నేను సెలవులో ఉన్నప్పుడల్లా పురానీ దిల్లీలో ఆయనను సందర్శించేవాడిని. ఆయన ఉదారంగా సమయం ఇచ్చేవారు, చక్కని విమర్శలు చేసేవారు. ఇలా దశాబ్దం పాటు, అంతకంటే ఎక్కువ కాలమే మా ఈ బంధం కొనసాగింది. 1950 నుండి నేను ఉద్వేగంతో, మరింత తీవ్రంగా కవిత్వం రాయడం ప్రారంభించిన తర్వాత ఆయన నా కలం పట్టుకుని మార్గనిర్దేశం చేశారు.’
వీరిద్దరి ప్రత్యేక సంబంధం గురించి, ఇంకా 1951 నుండి 1956 వరకు బక్షి సైన్యంలో రెండవసారి పనిచేసిన సమయం గురించి 5వ అధ్యాయంలో నేను మరింత వివరిస్తాను. ఆ సమయంలోనే వారి పరిచయం స్నేహంగా మారింది. ఇప్పటివరకు బక్షికి అందకుండా ఉన్న అదనపు ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చి; యూనిఫాంను, తుపాకీని అప్పగించేసి – ఆ సిపాయిని కలంతో శాశ్వత సంబంధం ఏర్పర్చుకునేలా చేశారు సయీదీ.
ఆ వర్ధమాన కవి సైన్యాన్ని విడిచిపెట్టాలని నిశ్చయించుకున్నారు, అయితే ఆయన అదృష్టాన్ని బాగా నమ్మేవారు. తనకి అదృష్టం తోడవడం కోసం ఎదురు చూస్తున్నారు. తన ‘ఎయిమ్ ఇన్ లైఫ్’ నోట్ రాసిన రెండు నెలల్లోనే, ఆయన కోరుకున్న అదృష్ట చిహ్నంగా మారిన ఒక సంఘటన జరిగింది. సైన్యం నుండి బయటకు రాకుండా ఆయనను అడ్డుకున్న బలమైన ఆనకట్టను అది బద్ధలుకొట్టింది.
***
అదృష్టం తోడవడం: ‘లక్ భీ జరూరీ హై’
ఫౌజీ ఆనంద్ ప్రకాష్ బక్షి రెండవ కవిత 1950 మార్చి 25న సైన్యం యొక్క ప్రతిష్ఠాత్మక పత్రిక సైనిక్ సమాచార్‌లో ప్రచురించబడింది (మొదటిది ఆయన రావల్పిండిలో నివసిస్తున్నప్పుడు ప్రచురించబడింది). ఆయన తన సహచరులను మరియు సీనియర్లను ఆకట్టుకోవడానికి తన పేరుతోపాటు తన హోదాను పేర్కొనమని సైనిక్ సమాచార్ ఎడిటర్‌ను అభ్యర్థించారు. వరదలా ముంచెత్తుతున్న దురదృష్టం నుంచి, దీర్ఘకాలిక దురదృష్టకర పరిస్థితుల నుండి విరామం కోసం ప్రార్థించే వ్యక్తి యొక్క విచారాన్ని, బాధను ఈ కవిత ప్రతిబింబిస్తుంది. కవి దేవుడిని, ప్రకృతిని, పరిస్థితులను సవాలు చేస్తున్నాడు.
అతను ఒక ప్రశ్న అడుగుతున్నాడు: ‘నా ప్రతిభ, ప్రార్థనలు ఎందుకు తిరస్కరించబడుతున్నాయి?’. అతనికి వ్యతిరేకంగా ఉన్న అన్ని శక్తులు అతన్ని అంగీకరించి, అతని కలని, ఆశయాన్ని నెరవేర్చుకోవడానికి సహాయపడే రోజు వస్తుంది.
గిరేంగీ బిజలియాఁ కబ్ తక్, జలేంగే ఆషియానే కబ్ తక్
ఖిలాఫ్ అహల్-ఎ-చమన్ కే తు రహేగా ఆసమాన్ కబ్ తక్
సతాయేగా, రులాయేగా జహాఁ కబ్ తక్
జమీర్, జహానోఁ-జిస్మ్, జాన్ సే నిక్లేగా ధున్ కబ్ తక్
నిజామ్-ఎ-గులిస్తాన్, అహల్-ఎ-గులిస్తాన్ హీ సంభాలేంగే
తేరీ మన్‍మానియాఁ, తేరీ హుకుమత్ బాగ్‍బన్ కబ్ తక్
హమారీ బద్‍నసీబీ కీ ఆఖిర్ కోయీ హద్ హోగీ,
రహోగె హమ్ పర్ తుమ్, నా-మెహరబాన్ యె మెహరబాన్ కబ్ తక్
మేరీ ఆంఖేం బరసతీ హైఁ, ముసల్‌సల్ హిజ్ర్ మె బక్షి
ముకాబిల్ ఇన్‍కే బర్‍సేంగీ భలా యే బదలియాఁ కబ్ తక్
రెండు దశాబ్దాల తర్వాత, 1976లో, సైనిక్ సమాచార్ పత్రిక గీత రచయిత ఆనంద్ బక్షిపై ఒక ఫీచర్ ప్రచురించింది. ఈ ఫీచర్‌లో, బక్షి తన 1950 నాటి కవిత ప్రచురణ ‘అదృష్టానికి నిదర్శనం’ అని పేర్కొన్నారు, ఇది ‘సినిమాల్లో అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి’ తనను ప్రేరేపించింది.
***
‘లోగోంకా కామ్ హై కహ్నా’
1950 ఏప్రిల్ 10న, తన ‘ఎయిమ్ ఇన్ లైఫ్’ స్టేట్‌మెంట్ రాసిన మూడు నెలల లోపు, సైనిక్ సమాచార్‌లో కవిత ప్రచురితమైన ఒక నెలలోపే, సిపాయి ఆనంద్ ప్రకాష్ తన కుటుంబ పెద్దల అభిప్రాయాలను పట్టించుకోకుండా సైన్యం నుండి తనని విడుదల చేయాలని పై అధికారులను అభ్యర్థించారు.
ఇది నంద్ తన కుటుంబ సభ్యుల ఇష్టానికి వ్యతిరేకంగా తీసుకున్న అత్యంత సాహసోపేతమైన నిర్ణయం. ఇది తొలి అడుగు. తక్దీర్ (ముందే నిర్ణీతమైన విధి) కంటే తద్బీర్ (మన విధిని రూపొందించే చర్యలు) ను నమ్మినందున, ఆయన జీవితంలో తీసుకునే మరింత సాహసోపేతమైన, కఠినమైన చర్యల వరుసలో ఇది మొదటిది.
(మళ్ళీ కలుద్దాం)
కొల్లూరి సోమ శంకర్ రచయిత, అనువాదకులు. బి.ఎ.డిగ్రీతో గ్రాడ్యుయేషన్. మానవ వనరుల నిర్వహణలో పిజి డిప్లొమా చేసారు. దక్షిణ భారత హిందీ ప్రచార సభ వారి భాషా ప్రవీణ పాసయ్యారు. ప్రస్తుత నివాసం హైదరాబాదు.
సోమ శంకర్ 2001 నుంచి కథలు రాస్తున్నారు. 2002 నుంచి కథలను అనువదిస్తున్నారు. కేవలం కథలే కాక ‘ది అడ్వెంచర్స్ ఆఫ్ పినోకియో’ అనే పిల్లల నవలను ‘కొంటెబొమ్మ సాహసాలు’ అనే పేరుతోను, ‘మాజిక్ ఇన్ ది మౌంటెన్స్’ అనే పిల్లల నవలను ‘కొండలలో వింతలు’ అనే పేరుతోను, వినయ్ జల్లా ఆంగ్లంలో రాసిన ‘వార్స్ అండ్ వెఫ్ట్’ అనే నవలని ‘నారాయణీయం’ అనే పేరుతోను, వరలొట్టి రంగసామి ఆంగ్లంలో రాసిన ‘లవ్! లవ్! లవ్!’ నవలను ‘సాధించెనే ఓ మనసా!’ పేరుతోనూ, అజిత్ హరిసింఘానీ రచించిన ట్రావెలాగ్ ‘వన్ లైఫ్ టు రైడ్’ను ‘ప్రయాణానికే జీవితం’అనే పేరుతోను, డా. చిత్తర్వు మధు ఆంగ్లంలో రచించిన ‘డార్క్ అవుట్పోస్ట్స్’ అనే స్పేస్ ఒపేరా నవలను ‘భూమి నుంచి ప్లూటో దాకా’ అనే పేరుతోనూ; అమర్త్యసేన్ వ్రాసిన ‘ది ఐడియా ఆఫ్ జస్టిస్’ అనే పుస్తకాన్ని, మరో నాలుగు పుస్తకాలను తెలుగులోనికి అనువదించారు. ‘దేవుడికి సాయం’ అనే కథాసంపుటి, ‘మనీప్లాంట్’, ‘నాన్నా, తొందరగా వచ్చెయ్!!’, ‘ఏడు గంటల వార్తలు’ అనే అనువాద కథా సంపుటాలను ప్రచురించారు.