Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

నగ్మే, కిస్సే, బాతేఁ, యాదేఁ – ఆనంద్ బక్షి జీవితం, పాటలు-6

[శ్రీ రాకేశ్ ఆనంద్ బక్షి రచించిన ‘నగ్మే, కిస్సే, బాతేఁ, యాదేఁ – ది లైఫ్ అండ్ లిరిక్స్ ఆఫ్ ఆనంద్ బక్షి’ అనే ఆంగ్ల పుస్తకాన్ని అనువదించి పాఠకులకు అందిస్తున్నారు కొల్లూరి సోమ శంకర్.]

అధ్యాయం 3: 1947-1950 – మొదటి భాగం:

‘నా జీవిత లక్ష్యం’

‘వతన్ పే జో ఫిదా హోగా, అమర్ వో నౌజవాన్ హోగా’ఫూల్  బనే  అంగారే

ఆనంద్ ప్రకాష్ పదిహేడేళ్ల వయసులో ఇండియన్ ఆర్మీ, కార్ప్స్ ఆఫ్ సిగ్నల్స్‌లో చేరారు. 1947 నవంబర్ 15న, జుబ్బల్‌పూర్ (ప్రస్తుతం మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్) లోని సిగ్నల్స్ శిక్షణా కేంద్రంలో అతనికి సిగ్నల్ మ్యాన్ ర్యాంక్ ఇచ్చారు.

సిగ్నల్స్ కార్ప్స్ సైన్యానికి మిలిటరీ కమ్యూనికేషన్ సేవలను అందిస్తుంది. ఫార్మేషన్లు, బెటాలియన్లు, రెజిమెంట్లు, ప్లాటూన్లు ఎక్కడ ఉన్నా -శాంతి సమయంలో యూనిట్ లైన్లలో,  లేదా కాన్‍ఫ్లిక్ట్ జోన్ పోస్టింగ్ సమయంలో – గమనంలో ఉన్న చోట – సిగ్నల్స్ కార్ప్స్ వారు సమాచార సేవలను అందిస్తారు. సిగ్నల్స్ కార్ప్స్ 1911లో లెఫ్టినెంట్ కల్నల్ ఎస్.హెచ్. పావెల్ ఆధ్వర్యంలో ఏర్పడింది. మొదటి ప్రపంచ యుద్ధంలోనూ, రెండవ ప్రపంచ యుద్ధం లోనూ ముఖ్యమైన కృషి చేసింది. నేడు, ఇరవై ఒకటవ శతాబ్దంలో భారత సైన్యపు సమాచార అవసరాలను తీర్చేందుకు అత్యాధునిక ‘స్టేట్ ఆఫ్ ది ఆర్ట్’ పద్ధతులను కలిగి ఉంది.

ఓ సైనికుడిగా ఆనంద్ బక్షి జీవితం ఎలా ఉండేదో అర్థం చేసుకోవడానికి, సంఘర్షణ లేని ప్రాంతంలో సగటు సైనికుడి దినచర్యను ఒకసారి చూద్దాం.

సాధారణంగా, ఒక యూనిట్, అంటే ఒక బెటాలియన్ లేదా రెజిమెంట్, ఒక ‘యూనిట్ లైన్’లో కలిసి ఉంటుంది, ఈ కాంప్లెక్స్‌లో సాధారణంగా దళాలకు బ్యారక్‌లు, ఆట స్థలం, ఆయుధశాల, కార్యాలయ భవనాలు, శిక్షణా కేంద్రం ఉంటాయి. ప్రతి యూనిట్‌లో ఒక చిన్న పాఠశాల ఉంటుంది, అక్కడ, వివిధ పరీక్షలకు సిద్ధం చేయడానికి జవాన్లకు, నాన్-కమిషన్డ్ ఆఫీసర్లకు పాఠాలు చెప్తారు.

సైనికుల దినచర్య సూర్యోదయానికి చాలా ముందుగానే ప్రారంభమవుతుంది. రెవిల్లె (బ్యూగల్ లేదా డ్రమ్) మోగినప్పుడు, జవాన్లు అందరూ ఒకే చోట సమావేశమవుతారు. వారంతా శుభ్రంగా తయారై వచ్చారో లేదోనని వారి ప్లాటూన్ కమాండర్ తనిఖీ చేస్తాడు. తర్వాత, వారితో వేగంగా ‘మార్చ్ ఫాస్ట్’ చేయిస్తాడు, ఆపై నెమ్మదిగా జాగింగ్‌ చేస్తారు. తర్వాత కొన్ని కఠినమైన్న వ్యాయామాలకు, రన్నింగ్ డ్రిల్స్‌కి పంపుతారు. అల్పాహారం తర్వాత ఒక గంట తర్వాత, వారు వివిధ శిక్షణా కార్యక్రమాలు, పనుల కోసం (సైనికుడికి వర్తించే ఆయుధ శిక్షణ, డ్రైవింగ్, క్లాస్ రూమ్ సెషన్‌లతో సహా) మళ్ళీ సమావేశమవుతారు. తరువాత వారు భోజనం కోసం మెస్‌కి వెళతారు. భోజనం తర్వాత యూనిట్ ఒకటి లేదా రెండు గంటలు విశ్రాంతి తీసుకుంటుంది. సాయంత్రం హాకీ, ఫుట్‌బాల్ లేదా బాస్కెట్‌బాల్ వంటి ఏదైనా ఆట కోసం క్రీడా మైదానంలో సమావేశమవుతుంది. కొందరు బాక్సింగ్ లేదా ఈత కొట్టడానికి వెళతారు.

సూర్యాస్తమయానికి ముందు, రిట్రీట్ బ్యూగల్ మోగిస్తారు. నైట్ గార్డ్‌లు విధుల్లోకి వచ్చినప్పుడు యూనిట్ క్వార్టర్ గార్డ్‌లోని జెండాను దించుతారు. సూర్యాస్తమయం నాటికి, జవాన్లకు స్వేచ్ఛగా ఉండే కాస్త సమయం దొరుకుతుంది, అప్పుడు మఫ్టీలో ఉండవచ్చు అంటే – సాధారణ పౌర దుస్తులలో ఉండవచ్చు. తర్వాత వారు రోల్ కాల్, ఫిజికల్ కౌంట్‌కి సిద్ధమవుతారు, ఆ తర్వాత మరుసటి రోజు షెడ్యూల్ ప్రకటించబడుతుంది. తరువాత, వారు టెలివిజన్ చూడటానికి లేదా వార్తాపత్రిక చదవడానికి యూనిట్ లైన్ యొక్క రిక్రియేషన్ రూమ్స్‌కి వెళతారు. రాత్రి భోజనం తర్వాత, దాదాపు పది గంటలకు, ‘లైట్లు ఆపమని’ ఆర్డర్ బ్యూగల్ మోగిస్తారు. నైట్ గార్డ్‌లో ఉన్నవారు తప్ప ప్రతి జవాన్ తప్పనిసరిగా నిద్రపోవాలి. సైనికుడి జీవితంలోని ప్రతి గంట ఖచ్చితంగా నియంత్రించబడుతుంది, బ్యూగల్ కాల్స్ వారి దినవారీ నమూనాను నిర్ణయిస్తాయి.

తర్వాతి రోజుల్లో నాన్న పాత సంగతులు గుర్తు చేస్తుకుంటూ, “ఈ రోజుల్లో సినిమాల్లో డాన్స్ సీక్వెన్స్‌లలో హీరో హీరోయిన్‍ల వెనుక యాభై మంది డాన్సర్లతో పాటలను చిత్రీకరించడం చూస్తూంటే నా సైనిక రోజులు గుర్తొస్తాయి. మేము యాభై మంది సైనికులం, ముందు వరుసలో మా చీఫ్ ఫిజికల్ ట్రైనింగ్ ఆఫీసర్ నాయకత్వంలో ఉండేవాళ్ళం” అని చెప్పారు.

ఆనంద్ ప్రకాష్ భారత సైన్యంలో చేరడానికి ఒకే ఒక ఉద్దేశం ఉంది: ‘మీరు మీ మీద తప్ప మరెవరిపైనా ఆధారపడకండి. మీ కుటుంబాన్ని పోషించడానికి జీవనోపాధి సంపాదించండి.’

‘ముష్‌కిల్ మే హై కౌన్ కిసీకా సమ్‌ఝో ఇస్ రాజ్ కో, లే కర్ అప్నా నామ్ కభీ తుమ్ ఖుద్ కో ఆవాజ్ దో’ – అంగార్

***

స్వేచ్ఛ

సిగ్నల్ కార్ప్స్‌లో, యూనిట్ యొక్క అంతర్గత టెలిఫోన్ ఎక్స్ఛేంజ్‌లోని ప్రతి ఆపరేటర్‌కు ఒక కోడ్ నేమ్ ఇస్తారు, తద్వారా శత్రువు వారి కమ్యూనికేషన్‌లను రహస్యంగా విన్నా, వారి వ్యక్తిగత గుర్తింపు తెలియకుండా ఉంటుంది. ‘ఆజాద్’ (స్వేచ్ఛ/స్వాతంత్రం) అనేది ఫౌజీ ఆనంద్ ప్రకాష్ కోడ్ నేమ్. ఆయన సైన్యంలో ఉన్నంత కాలం శిక్షణలోనూ, తరువాత పీస్ పోస్టింగ్‌లలో కొనసాగారు. ఆయన ఇప్పటికీ బొంబాయికి వెళ్లి సినిమాల్లో తన అదృష్టాన్ని ప్రయత్నించాలని కలలు కంటున్నారు, కానీ ప్రస్తుతానికి ఆ కలను పక్కన పెట్టారు. సిపాయి స్థాయి సైనికుడికి సైనిక జీవితం కష్టం.

అయినప్పటికీ ఆనంద్ ప్రకాష్ రోజువారీ కవాతులు, కసరత్తులతో పాటు తన సృజనాత్మకతను నిలుపుకోవడానికి ఒక మార్గాన్ని కనుగొన్నారు:

‘విరామ సమయాల్లో నేను నా స్వంత నజ్మ్‌లను రాసుకునేవాడిని. 1949లో, రాజ్ కపూర్ మరియు నర్గీస్ నటించిన ‘బర్సాత్’ చిత్రం విడుదలైంది, నేను దానిని ఇరవై సార్లు చూశాను! హస్రత్ జైపురి, శంకర్ జైకిషన్ పాటలు, ఇంకా ఆ రొమాన్స్ పట్ల నేను ఆకర్షితుడయ్యాను! నాలో ఎప్పుడూ రొమాంటిక్ స్పిరిట్ ఉండేది. సినిమా చూసిన ప్రతీసారి బ్యారక్‌లకు తిరిగి వెళ్లి, అప్పుడే చూసిన ఆ సినిమా పాటలను రాసుకునేవాడిని. కొన్ని నెలల్లో, నేను సినిమా పాటల రచయితనన్నట్లుగా నా స్వంత మాటలలో ‘బర్సాత్’ పాటలు రాయడం ప్రారంభించాను. నేను ఇష్టపడే చిత్రాల కోసం మాత్రమే అలా చేస్తాను. అప్పుడు నేను రాసిన ఈ పాటలను పాడి నా సహచరులకు వినిపించేవాడిని. వారు నా సృజనని ఇష్టపడేవారు, త్వరలోనే నా యూనిట్‌‌లోనే కాకుండా ఇతర యూనిట్ల నుంచి కూడా నాకు చాలా ఆదరణ లభించింది. శిక్షణ కష్టంగా ఉండేది, నా గీతాలు, గానం నా సహచరులు కావల్సినంత వినోదాన్ని అందించింది. నేను దేశభక్తి లేదా ప్రేమకథల నజ్మ్‌లను వ్రాసినప్పుడు, నా స్నేహితులు ఈలలు వేసేవారు, చప్పట్లు కొట్టేవారు.

తుపాకులతో కాకుండా, నా కలంతో కాల్చడం నాకిష్టం, సైనికుడిగా ఉండటం నాకు చాలా గర్వంగా అనిపించినప్పటికీ. స్వతంత్ర భారత్ అవతరించి రెండు లేదా మూడు ఏళ్ళే అయింది. మేము ఫౌజీలు ప్రయాణించిన ప్రతిచోటా, లేదా మేము సెలవలకి ఇంటికి తిరిగి వెళ్ళినప్పుడు కూడా, మా చుట్టూ ఉన్న వ్యక్తులు మమ్మల్ని చాలా ప్రత్యేకంగా చూసేవారు.

కవితలు, పాటలు రాయడం, నా సహచరులను అలరించడానికి వాటిని పాడటం –  కఠినమైన శిక్షణని; నానమ్మకీ, ఇంటికి దూరంగా ఉండటంలోని బాధని తట్టుకునేలా చేశాయి. బారా ఖానా కార్యక్రమాలు కూడా నన్ను కాపాడాయి. యూనిట్ లైన్లలోని ప్రతిభావంతులు స్కిట్‌లు, మ్యూజికల్ డ్రామాలు వేశారు. నేను సైన్యంలో ఉన్న కాలంలో  నేను ప్రతిదానిలోనూ పాల్గొన్నాను. త్వరలోనే, యూనిట్లలోని సీనియర్లు కూడా నా గురించి తెలుసుకున్నారు. నన్ను “యే హై వో ఫౌజీ జో నజ్మ్ లిఖ్తా హై ఔర్ గాతా భీ హై” (ఇతనే నజ్మ్‌లు రాసి పాడే సైనికుడు) అని పరిచయం చేసేవారు. క్రమంగా, నేను జీవితాంతం సైన్యంలో ఉండకూడదని, నేను  అనుకున్న విధంగా సినీ గేయ రచయితగా ఎదగాలంటే  ఇక్కడ ఎక్కువ కాలం ఉండకూడదనీ   నేను చాలా బలంగా భావించడం ప్రారంభించాను.

మేరే బన్సీ వాలే నే మేరే కోనే కోనే మే సంగీత్ కా ప్రేమ్ భర్ దియా థా (నా శ్రీకృష్ణుడు తన వేణువుతో నాలోని ప్రతి రంధ్రాన్ని సంగీత ప్రేమతో నింపాడు). ఆ భావోద్వేగాలను తీర్చుకోవడానికి సైన్యం సరైన స్థలం కాదు. నేను త్వరగా బయటకు వెళ్లాలనుకున్నాను, కానీ నా కుటుంబ మద్దతు లేకుండా సురక్షితమైన ఉద్యోగాన్ని వదిలి కొత్త పట్టణానికి ఎలా ప్రయాణించాలో నాకు తెలియదు. వారు నన్ను సైన్యాన్ని వదిలి ఎప్పటికీ వెళ్ళనివ్వరు. రేడియో నా సహచరుడిగా మారింది, మధోక్ సాబ్ వంటి రచయితల పాటలను వినడానికి నేను ఎదురు చూసేవాడిని. గీత రచయితగా ఆయన నాపై తొలి ప్రభావం చూపారు. మహాకవి దీననాథ్ మధోక్ (1902-1982) – కిదర్ శర్మ, ప్రదీప్‌లతో పాటు హిందీ సినిమా గీత రచయితలలో తొలి తరంలో ఉన్నారు.’

***

తొలి ప్రభావాలు

డి.ఎన్. మధోక్ పాటలను ఆసక్తిగా విన్నప్పుడు ఆనంద్ బక్షి సినిమా పాటలలోని సాహిత్యాన్ని నిజంగా అభినందించడం ప్రారంభించారు. కాబట్టి మహాకవి మధోక్ గేయ రచయితగా ఆయన తొలి ప్రభావం అయ్యారు.

‘1950లలో మధోక్ సాబ్ సినీ గీత రచనకు ప్రమాణాలను నిర్దేశించారు. నేటి గీత రచయితలం,  మేమంతా ఆయన అడుగుజాడల్లో నడుస్తున్నాం; కనీసం నేనైనా. మై డి.ఎన్. మధోక్ సాబ్ కా ఫ్యాన్ థా (నేను ఆయన అభిమానిని). ఆయన ప్రజల మనిషి. గీత రచయిత మొదటి లక్ష్యం ప్రజలకు చేరువ కావడమేనని, ఆ ప్రయోజనం కోసం సరళమైన పదాలు ప్రభావవంతంగా ఉంటాయని ఆయన నాకు నేర్పించారు. సరళమైన పదాలు సరళమైన సంగీతాన్ని రూపొందించడంలో సహాయపడతాయి, అది సులభంగా అర్థమవుతుంది. మధోక్ సాబ్ పాటలు నాకు నేర్పిన మొదటి, అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే మొదట విన్నప్పుడే పాట ప్రజలకు చేరువ కావాలని. మధోక్ సాబ్ కా రంగ్ హి కుచ్ ఔర్ థా (ఆయన శైలి వేరే). సాహిత్య రచనలో ఆయన సరళత నా స్వంత సాహిత్య రచనా శైలికి ప్రేరణనిచ్చింది. ఆయన నాకు సలహా ఇచ్చారు, “బక్షి, సరళమైన పదాలను ఎంచుకోండి. మీ పాటలు దేశవ్యాప్తంగా వివిధ రకాల ప్రజలు విని అర్థం చేసుకుంటారని ఎప్పటికీ మర్చిపోవద్దు.” నా సాహిత్యంలోని సరళతను ప్రజలు అభినందిస్తారు, ఎందుకంటే నేను ఎనిమిదో తరగతి దాటి చదువుకోలేదు, పైగా నేను ఉర్దూలో చదువుకున్నందున హిందీ పదాలు ఎక్కువగా తెలియవు, కానీ సరళమైన భాషను ఉపయోగించమని ఆయన ఇచ్చిన సలహా నన్ను అదుపులో ఉంచింది. ఆయన నుండి నేను ఒకే కవితలో ప్రాస పదాలను ఉపయోగించడం నేర్చుకున్నాను. ఉదాహరణకు, “చుప్ గయే సారే నజారే, ఓయే క్యా బాత్ హో గయ్” పాటలో, నేను అదే గీతంలో, “చోఢ్ మేరీ బైయ్యాఁ’, పడూఁ తేరీ ‘పైయ్యాఁ’, తారోం కి ‘చైయ్యాఁ’ మే ‘సయ్యాఁ’” వంటి చాలా అర్థవంతమైన పదాలను ప్రాస చేసాను. నేను కొన్నిసార్లు పంజాబీ సంగీత మీటర్లను ఉపయోగించి రాశాను కాబట్టి, నా సంగీత స్వరకర్తలకు నా సాహిత్యంతో పాటు పంజాబీ జానపద ట్యూన్‌లను సూచించాలని మధోక్ సాబ్ నుండి కూడా నేర్చుకున్నాను.’

ఆనంద్ బక్షిపై ప్రభావం చూపిన ఇతర ముఖ్యమైన గీత రచయితలు సాహిర్ లుధియాన్వి, శైలేంద్ర.

‘సాహిర్ లూధియాన్వి నన్ను కొంతమంది నిర్మాతలకు పరిచయం చేసి, నన్ను రాయమని ప్రోత్సహించాడు. శైలేంద్ర కూడా అలాగే చేశాడు. సాహిర్ సాబ్  గొప్ప మనసు నాకు వ్యక్తిగతంగా ఇష్టం. కవిత్వాన్ని సినిమా పాటలలో జోడించే ఆయన పద్ధతి వృత్తిపరంగా నాకు చాలా ఇష్టం. సరళమైన పదాలతో కవితలెలా అల్లాలో నేను అతని నుండి నేర్చుకున్నాను. ఒకసారి, నేను అవకాశాల కోసం ఎదురు చూస్తున్నప్పుడు, నిరాశకు గురైనప్పుడు, ముందుకెలా సాగాలో తెలియనప్పుడు – నేను సాహిర్ సాబ్‌ను సినిమా పరిశ్రమలోకి ఎలా ప్రవేశించాలని, అవకాశం ఎలా దొరుకుతుందని అడిగాను. సాహిర్ నాతో, “బక్షి, నువ్వే జనాలని అడగాలి, లేదా జనాలు నిన్ను అడగాలి. ఈ రంగంలో అవకాశం పొందడానికి వేరే మార్గం లేదు!” అని అన్నాడు. కాబట్టి అతని సలహా మేరకు నేను ప్రతిరోజూ ఐదు నుండి ఆరుగురు సినిమా వ్యక్తులను కలిసి పని కోరడం అలవాటు చేసుకున్నాను. దాదాపు రెండు నుండి మూడు సంవత్సరాలుగా – ప్రతిరోజూ కనీసం ఐదు నుండి ఆరుగురు – నటులు, నిర్మాతలు, దర్శకులు, సంగీత స్వరకర్తలు, వారి సహాయకులు, మేనేజర్లు, సౌండ్ రికార్డిస్టులు, సంగీతకారులు వంటి సినిమా వ్యక్తులను కలిసిన తర్వాత – కొంతమంది నిర్మాతలు, దర్శకులు నా పాటలు వినడానికి ఆసక్తి చూపారు. క్రమంగా, వారి చిత్రాలకు ఒకటి లేదా రెండు పాటలు రాయడం ప్రారంభించాను. కానీ నేను సాహిర్ సాబ్‌ను సినిమా-పాటల సందర్భాలలో కవిత్వాన్ని  మిళితం చేసినందుకు ఎక్కువగా ఆరాధిస్తాను. షాయారీని, అంటే కవిత్వాన్ని, సినిమా గీతాలలో ఎలా అల్లుకోవాలో నేను అతని నుండి నేర్చుకున్నాను.

శైలేంద్ర, అతని సరళమైన జానపద పాటలు అద్భుతం! అవి మొదటిసారి విన్నప్పుడే మీ హృదయాన్ని తాకుతాయి! క్యా బాత్ హై ఉన్ కీ (వాటి గురించి మనమేం చెప్పగలం)! జానపద పాటలు సరళమైనవి, ఎల్లప్పుడూ కవితాత్మకంగా ఉండవు, కానీ వాటిలో చాలా లోతు ఉంటుంది – నేను దానిని శైలేంద్ర సాహిత్య రచనా శైలి నుండి నేర్చుకున్నాను. అతను కూడా నన్ను నిర్మాతలకు సిఫార్సు చేశాడు, అతనితో ఉంటే ఏదో సురక్షాభావం కలుగుతుంది, గొప్ప మనిషి. శైలేంద్ర సాహిత్యం కూడా సినీ సాహిత్యానికి దోహదపడిందని నేను భావిస్తున్నాను, కేవలం “కవులం” అని చెప్పుకునే గీత రచయితల సాహిత్యం మాత్రమే కాదు.

బిస్మిల్ సయీదీ సాబ్ కాకుండా, ఈ ముగ్గురూ నా గురువులు కూడా. కాబట్టి, నేను ఈ రోజు ఈ స్థితిలో ఉన్నందుకు వారికి ధన్యవాదాలు చెప్పుకుంటాను. గీత రచయిత రామ్ ప్రకాష్ అష్క్ కూడా నన్ను చాలా ప్రోత్సహించారు. నా అనేక పాటల విజయానికి ఈ కవులు మరియు రచయితలందరికీ నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. హస్రత్, సాహిర్, నీరజ్, మజ్రూహ్, జాన్ నిసార్, నరేంద్ర శర్మ, శైలేంద్ర, ఇంకా మరికొందరు వంటి గొప్ప వ్యక్తుల స్థాయికి నేను ఇప్పటికీ రాలేదు. కైఫీ అజ్మీ పాటలు వినడం కూడా నాకు చాలా ఇష్టం.

కొంతమంది నన్ను తుక్బందీ, అంటే, రైమింగ్ మాత్రమే చేస్తున్నానని విమర్శించారు. కానీ నేను ఎప్పుడూ కవినని చెప్పుకోలేదు. నేను మౌలికంగా సాంగ్ స్పెషలిస్ట్‌ని, సినిమా పాటల రచయితని, కవిని మాత్రం కాదు, కొంతమంది నన్ను కవిగా భావిస్తున్నప్పటికీ. సాహిర్ సాబ్ నిజమైన కవి. నేను కేవలం పాటల రచయితని. ఈ విషయాన్ని నేను ‘బాబీ’ సినిమాలోని – “మై షాయర్ తో నహీఁ” పాటలో కూడా అంగీకరించాను. ఆపై మళ్ళీ శక్తిదా గారి ‘అజ్‌నబీ’ సినిమాలోని “జానేమాన్, జాన్-ఎ-జిగర్, హోతా  మై  షాయర్ అగర్, లిఖ్తా గజల్ తేరీ అదావోం పర్” పాటలో కూడా ఒప్పుకున్నాను.

నేను బొంబాయికి వచ్చినప్పుడు, నేను సినిమాలకు పాటలు రాయడం మొదలుపెట్టాను. కానీ నేను పరిశ్రమలో గుర్తించబడటానికి ముందు, మధోక్ సాబ్, తరువాత శైలేంద్ర కూడా దయతో నా పాటలను దేశవ్యాప్తంగా వినిపించి ప్రశంసించగలిగేలా నా సాహిత్యంలో సాధరణ్ లఫ్జ్ (మామూలు పదాలు), సరళ్ హిందుస్తానీని ఉపయోగించమని, ఉర్దూలో ఎక్కువగా ఉపయోగించవద్దని సలహా ఇచ్చారు.

అప్పటి వరకు, నేను నా పాటలలో చాలా ఉర్దూ పదాలను ఉపయోగించేవాడిని. బహుశా నేను ఉర్దూ లిపిలో చదువుకున్నందున, 50లలో సినీరంగాన్ని ఏలుతున్న వారితో పోటీ పడటానికి నేను లోలోపల ప్రయత్నిస్తున్నందున – కొంతమంది గేయ రచయితలు, ప్రసిద్ధ కవులు కూడా ఉర్దూను అధికంగా ఉపయోగించారు కాబట్టి నేను 60ల ప్రారంభం నుండి నా ప్రారంభ రచనలలో చాలా ఉర్దూను ఉపయోగించాను. కానీ ముఖ్యంగా జబ్ జబ్ ఫూల్ ఖిలే (1965), ఫర్జ్ (1967) సినిమాల విజయంతో, నా హిందీ పదజాలం పరిమితులలో రాయడం యొక్క నిజమైన విలువను నేను గ్రహించాను. ఒకప్పుడు నేను నా లోపంగా భావించినదే, కొన్ని సంవత్సరాల తరువాత నా ‘మేధ’ అని పిలవబడింది. నేను సైన్యం లోని బారా ఖానాల కోసం నజ్మ్‌లు, నాటకాలు రాసినప్పుడు కూడా, ఉర్దూని ఎక్కువగా ఉపయోగించాను. నా సహచరులు చాలా మంది పంజాబ్‌లో చదువుకున్నారు, పైగా ఉర్దూ మాధ్యమంలో చదువుకున్నారు కాబట్టి నా ఉర్దూ కవితలను అభినందించారు, కాబట్టి నేను సినిమా పాటలు రాసేటప్పుడు సరళ హిందుస్తానీని ఉపయోగించాలని గ్రహించలేదు.

సంభాషణా హిందుస్తానీలో నేను రాసిన ‘ఫర్జ్’ సినిమా పాటలు సూపర్ హిట్ అయ్యాక, నేను చాలా పాటలలో మామూలు హిందీ పదాలను వాడసాగాను. కానీ అదే సమయంలో, కథలోని పాత్రలను ఎల్లప్పుడూ దృష్టిలో ఉంచుకున్నాను, తద్వారా ఆ పాత్ర పాడుతున్న పదాలు అతనికి చెందినవి కావు, అవి గీత రచయితవి అని శ్రోత భావించడు. ఒక పాటలో నేను కనిపిస్తే, కవిగా నేను విజయం సాధించినప్పటికీ, సినిమా పాటల రచయితగా విఫలమయినట్లే. నాకు పరిమితమైన హిందీ పదజాలం ఉన్నందున నేను అప్రయత్నంగా “సరళంగా” రాశాను. 50లలో నేను ఇక్కడికి వచ్చినప్పుడు, నా బలహీనతగా నేను భావించినది – ఉర్దూ ముషైరా షాయర్ కాకపోవడం – వాస్తవానికి నా బలం అవుతుందని నాకు తెలియదు. అది నా పాటలను సామాన్యుల పాటలుగా మార్చింది. కొంతమంది జర్నలిస్టులు నన్ను ప్రజల కవి అని పిలవడం ప్రారంభించారు.’

(మళ్ళీ కలుద్దాం)

Exit mobile version