[శ్రీ రాకేశ్ ఆనంద్ బక్షి రచించిన ‘నగ్మే, కిస్సే, బాతేఁ, యాదేఁ – ది లైఫ్ అండ్ లిరిక్స్ ఆఫ్ ఆనంద్ బక్షి’ అనే ఆంగ్ల పుస్తకాన్ని అనువదించి పాఠకులకు అందిస్తున్నారు కొల్లూరి సోమ శంకర్.]
అధ్యాయం 1: 1930-1944 – రెండవ భాగం:
‘మేరే గీతోం మే మేరీ కహానియాఁ హైఁ, కలియోం కా బచ్‍పన్ హై, ఫూలోం కీ జవానియాఁ హైఁ’ – తేరీ కసమ్
‘ప్రతి ఒక్కరూ సంగీతప్రియులే. మనం సమయం, మానసిక స్థితి, అవసరాన్ని బట్టి కొన్ని లయలలో మాట్లాడుకుంటాం, నడుస్తాం, రాస్తాం. మన హృదయానికి ఒక లయ ఉంటుంది, మన శ్వాసకి కూడా ఉంటుంది; మన సంబంధాలకు కూడా – ప్రతి సంబంధానికి వేరే లయ ఉంటుంది, ప్రతి వ్యక్తితో ఒకేలా ప్రవర్తించము. మనం కొన్ని సాధారణ లయలను కొంతమంది పరిచయస్థులతో, కొన్నింటిని సన్నిహిత మిత్రుడితో, మరికొన్ని ఆత్మీయులతో పంచుకుంటాము. సంగీతం, లయ లేకుండా ఎవరైనా పుడతారంటే నేను నమ్మను. కొందరు తమలోని తీగలతో సంబంధాన్ని కోల్పోతారు, కొందరు ఏ కారణాల వల్లనైనా ఆ విషయంపై అభిరుచి కోల్పోతారు.
నేను పైరు కోతల పండగలను ఆస్వాదించాను, అన్ని మతాల పండుగలను జరుపుకున్నాను, మేళాలకు హాజరయ్యాను, వెన్నెలలో నిద్రపోయాను. శీతాకాలపు నెగడు చుట్టూ కబుర్లు చెప్పుకోవడానికి, పాడటానికి, నృత్యం చేయడానికి మేం గుమిగూడేవాళ్ళం. చిన్నప్పుడు నేను రేడియోకు బానిసను. యాక్షన్ సినిమాలు, మ్యాజిక్ ఉన్న సినిమాలు చూడటం నాకు ఇష్టం. సినిమాలు చూడటానికి నేను స్కూల్ పుస్తకాలని అమ్మేసాను. జాన్ కావాస్, నాడియాల సినిమాలను, ఇతర యాక్షన్ సినిమాలను నేను ఎప్పుడూ మిస్ అవ్వలేదు. నాకు పాడటం, ఇంకా బాంజో వాయించడం చాలా ఇష్టం. సినిమా పాటలు, పంజాబీ జానపద గీతాలు, గజల్స్ పాడుతూ నా స్నేహితులను అలరించేవాడిని.
వాస్తవం ఏంటంటే, నాకు టీనేజ్ నుంచే పాటల రచనలోని ఛందస్సు పరిజ్ఞానం ఉంది. నేను అప్పటికే ప్రసిద్ధ పాటల పేరడీలు, ఇంకా సొంతంగా ఒకటి నుండి రెండు వాక్యాల నజ్మ్‌లు (పద్యాలు) రాశాను. బడి రోజుల నుండే, నేను సినీ గాయకుడు, నటుడు అవ్వాలని కోరుకున్నాను. కానీ, అసలు అదేంటో, అది కెరీర్ లేదా జీవనోపాధికి మూలం అవుతుందో లేదో నాకు తెలియదు. అది సరదాగా అనిపించింది, అంతే! పైగా అది మా ఉమ్మడి కుటుంబంలోనూ, స్నేహితుల లోనూ నాకు చాలా గుర్తింపుని తెచ్చిపెట్టింది. అందరికంటే ఎక్కువగా తాతగారు దానిని అసహ్యించుకునేవారు, దాంతో ఆయన చుట్టుపక్కల ఉంటే నేనేప్పుడూ ప్రదర్శన ఇవ్వలేదు. 1947లో నేను సైన్యంలో చేరినప్పుడు, ఏదో ఒక రోజు నా పాటలు రేడియోలో ప్రసారమవుతాయని నాకు తెలుసు, కానీ దాన్నెలా సాధించాలో అప్పట్లో నాకు తెలియదు, అందుకని, బొంబాయికి వెళ్లి సినిమాల్లో ఏదైనా చేయాలని కలలు కనేవాణ్ణి; కానీ ఏం చేయాలో ఎలా చేయాలో నాకు స్పష్టంగా తెలిసేది కాదు.
నేను టీనేజర్‌గా ఉన్నప్పుడు పిండి నుంచి వెలువడే ‘క్వామి’ అనే వార్తాపత్రికలో నా మొదటి కవిత ప్రచురితమైంది. నేను దాని గురించి పెద్దగా ఆలోచించలేదు, కానీ చాలా ఉత్సాహంగా అనిపించింది, దానిని స్నేహితులకు మాత్రమే చూపించాను. అమ్మ బతికి ఉంటే, నేను ఆమెకు చూపించేవాడిని, ఆమె దానిని ఇష్టపడి ఉండేది. సినిమాల్లో పాటలు ఎలా రాస్తారో అప్పట్లో నాకు తెలియదు, అందుకని పాటల రచయితగా కాకుండా, సినిమాల్లో గాయకుడు అవ్వాలని కోరుకున్నాను. నా మెట్రిక్యులేషన్ తర్వాత, గాయకుడిగా, నటుడిగా పనిచేయటం కోసం లాహోర్ చిత్ర పరిశ్రమకు కూడా వెళ్లాను. తాతగారు అక్కడ ఉద్యోగంలో ఉన్నారు, కాబట్టి ఇల్లు ఉంది, పైగా నేను నానమ్మని మిస్ అవుతున్నాను, ఆమెతో సమయం గడపాలని కోరుకున్నాను. నన్ను అర్థం చేసుకున్న ఏకైక వ్యక్తి నానమ్మ మాత్రమే.
సైన్యంలో చేరిన తొలినాళ్ళల్లో, 1947లో, ఆసక్తిగా కవిత్వం రాయడం మొదలుపెట్టాను. అప్పటికి, నేను పాడిన పాటలను రాసిన వ్యక్తుల పేర్లు నాకు తెలిసాయి, సంగీత స్వరకర్త, సినిమా నిర్మాత అంటే ఏమిటో కూడా అర్థమైంది. నేను నా కవితలను చక్కని ఛందస్సులో పాటలుగా స్వరపరిచి, బ్యారక్‌లలో నా సహచర సైనికులకు, సీనియర్‌లకు పాడి వినిపించాను. ముఖ్యంగా సీనియర్ల నుండి లభించిన ప్రశంసలు నాలో ప్రతిభ ఉందని నాకు నమ్మకం కల్గించాయి. క్రమంగా, నేను మా వార్షిక రంగస్థల కార్యక్రమాలు – ‘బఢా ఖానా’లో పాటలు పాడడం ప్రారంభించాను. సైన్యం చెక్ పోస్టుల వద్ద, ఆర్మీ క్యాంపులలో జరిగే జాతీయ దినోత్సవాల సందర్భంగా ‘బఢా ఖానా’ కార్యక్రమాలు నిర్వహించబడతాయి.
చిన్నప్పుటి నుంచే పాటలు పాడటం, నా స్వంత కవితలను స్వరపరచడం నాలో కవిత్వం పట్ల, సంగీతం పట్ల ఆసక్తిని పెంచాయి. నా చిన్ననాటి అనుభవాలు, పెద్దయ్యాకా, నాకెంతో ఉపయోగపడ్డాయి, దశాబ్దాల తర్వాత నా సాహిత్యాన్ని సుసంపన్నం చేశాయి. 1950 నుండి, సైన్యం నుంచి బయటకొచ్చేసి, ‘కళాకారుడు’ కావాలనేది నా జీవిత లక్ష్యం. అప్పట్లో సినిమాలు, పాటలను ఇష్టపడే వారిలో ఇది చాలా గౌరవనీయమైన పదం, – కీ యే ఏక్ ‘కళాకార్’ హై; ఇన్ లోగోం కీ కుచ్ ఔర్ హి తబియత్ హోతీ హై (ఇతనొక ‘కళాకారుడు’; ఈ వ్యక్తులు భిన్నమైన స్వభావాన్ని కలిగి ఉంటారు). నన్ను పోస్ట్ చేసిన పట్టణాలలోని కంటోన్మెంట్ నుండి దొరికే వారపు విరామాల సమయంలో నేను అలాంటి ‘కళాకారుల’ గురించి ఉర్దూ, హిందీ పత్రికలలో మరింత చదవడం ప్రారంభించాను.
***
పఢాయీ సే జాన్ ఛూటీ.
ఆనంద్ ప్రకాష్ (ఆ పేరుతోనే ఆయన కాలేజీలో చేరారు) ఉర్దూ-మీడియం కేంబ్రిడ్జ్ కళాశాలలో చదువుకున్నారు. హిందీ ఎప్పుడూ అయన క్రమం తప్పకుండా చదివే లేదా వ్రాసే భాష కాదు. ఇంగ్లీష్ లోనూ, ఉర్దూలోనూ రాయడం, చదవడం ఆయనకు మరింత సౌకర్యవంతంగా ఉండేది. ఒక దశాబ్దం తరువాత, సైన్యంలో ఉన్న కాలంలో కవితలు రాయడం ప్రారంభించినప్పుడు, ఆయనెప్పుడూ ఉర్దూ లిపిలోనే రాశారు. ఆయన సినిమాలకు పాటలు రాయడం ప్రారంభింంచేంత వరకు ఈ అలవాటు కొనసాగింది. దాంతో ఆయన ప్రతిసారీ వాటిని తన దర్శకులకు, స్వరకర్తలకు అర్థమయ్యేలా చెప్పాల్సి వచ్చేది, వారు వాటిని హిందీ లేదా రోమన్ హిందీ లిపిలో వ్రాసుకునేవారు.
సరళమైన, రోజువారీ హిందీ పదాలను ఉపయోగించి చాలా సమర్థవంతంగా పాటలు రాసినందుకు తరచూ ఆయనను ప్రశంసించేవారు. కొందరు ఈ ‘ప్రతిభ’ వెనుక ఉన్న రహస్యం గురించి అడిగారు. 2001లో ఒక ఇంటర్వ్యూలో, ఆయన జర్నలిస్ట్ దేవమణి పాండేతో, “నేను తొమ్మిదవ తరగతి వరకు మాత్రమే చదువుకున్నాను. నాకు పెద్దగా హిందీ పదజాలం తెలియదు. భావాలను వ్యక్తీకరించడానికి అవసరమైన కొన్ని పదాలను ఉపయోగించడం తప్ప నాకు వేరే మార్గం లేదు. నా పరిమిత పదజాలమే బహుశా నాకు ఉపయోగపడినట్లు అనిపిస్తుంది; గీత రచయితగా నాకు అనువుగా ఉండేది. చాలా మంది ఈ పాటలను అర్థం చేసుకుని పాడగలరు, అదే నా విజయానికి కారణం.”
నాన్న తన నైపుణ్యాలను తక్కువ చేసి చూపిస్తున్నారని నేను నమ్ముతున్నాను. సంభాషణా వాక్యాలలో సరళమైన సత్యాలను చేర్చడం చాలా సులభం. ఆయన రాసిన 3300 కంటే ఎక్కువ పాటల నుండి, నాకు బాగా ఇష్టమైన క్లాసిక్‌లలో ఒకటైన ‘కుచ్ తో లోగ్ కహెంగే’ (అమర్ ప్రేమ్) నుండి ఒక వాక్యం ఉటంకిస్తాను, ‘..తూ కౌన్ హై, తేరా నామ్ క్యా హై, సీతా భీ యహాఁ, బద్‍నామ్ హుయీ.’
***
‘చలో, సింగర్ బన్తే హైఁ.’
టీనేజ్‍లో ఉండగా ఆనంద్ ప్రకాష్ మొదట సినిమాల్లోకి రావాలని కలలు కన్నప్పుడు, అది గీత రచయితగా కాదు, గాయకుడు కావాలని.
‘పిండిలో నా మెట్రిక్యులేషన్ తర్వాత, 1943లో, నా ప్రియమైన నానమ్మతో కలిసి ఉండాలనే నెపంతో నేను లాహోర్‌కు వెళ్లాను. తాతగారు అక్కడ లాహోర్ మహిళా జైలుకు అధికారిగా ఉన్నారు. సినిమాలు తీసే భవనాన్ని కనుక్కోడానికి నేను లాహోర్ అంతా తిరిగాను. ఆ స్థలం ఒకే భవనంలో ఉంటుందని, అక్కడ వారందరూ కలిసి పాటలు పాడతారని, అక్కడే సినిమాలు తీస్తారని నేను అనుకున్నాను. లాహోర్‌లో నేను ఎటువంటి పురోగతి సాధించలేకపోయాను. నేను నిరాశ చెందాను, కానీ నేను ఇంకా ఆశ నిలుపుకున్నాను, నేను బంబయికి వెళ్లి అక్కడ నా అదృష్టాన్ని ప్రయత్నించడం మంచిదని అనుకున్నాను.’
‘కాహె కో రోయే, చాహే హో జాయె, సఫల్ హోగీ తేరీ ఆరాధనా’ – ఆరాధన
***
‘ఎటూ సాగని నా ప్రయాణం’
తన కలను అంత తేలికగా వదులుకోని ఆనంద్ ప్రకాష్ త్వరలోనే మరో ప్రయత్నం చేశారు, ఈసారి సుదూర ‘బంబయి’ చేరుకోవడానికి.
‘పిండికి చెందిన నా ఇద్దరు స్నేహితులు, నాటక ప్రదర్శనలు ఇచ్చేవారు, వాళ్ళిద్దరూ, నేను ఇంట్లోంచి పారిపోయి సినిమాలలో పని కోసం రైల్లో బంబయికి వెళ్లాలని ప్లాన్ చేసుకున్నాము. మాలో ఎవరికీ ఇంటివారి నుండి ఎటువంటి మద్దతు లభించలేదు. మేము కలిసి ఉంటామని, సమస్యలపై కలిసి పోరాడతామని ఒకరికొకరు వాగ్దానం చేసుకున్నాం. మేము ముగ్గురం ఆదర్శాలపై చాలా ఉన్నతంగా ఉన్నందున మేము ఒకరికొకరు ధైర్యం (విశ్వాసం) ఇచ్చుకున్నాము.
మా స్నేహ బంధాన్ని, బంబయిలో కలిసి ‘పోరాడాల’నే ఆశయాన్ని దృఢపరచడానికి, మేము మా ముంజేతులపై తోటి ఇద్దరి పేర్లను పచ్చబొట్టు వేయించుకున్నాము! ప్రణాళిక ప్రకారం, నేను నా స్కూల్ పుస్తకాలను కూడా అమ్మేసి, మా కలల భూమికి రైలు ప్రయాణం ప్రారంభించడానికి రావల్పిండి రైల్వే స్టేషన్ చేరుకున్నాను. నా స్నేహితుల కోసం రోజంతా వేచి ఉన్నాను. అయితే, వాళ్ళిద్దరూ రానేలేదు. ఒంటరిగా, ఒక తెలియని దూర ప్రాంతానికి బయలుదేరే ధైర్యం నాకు లేదు. అప్పుడు నా వయసు కేవలం 13-14 సంవత్సరాలు. మళ్ళీ, నా కల చెదిరిపోయింది, సూర్యాస్తమయానికి ముందే నేను ఇంటికి తిరిగి వచ్చాను.
నేను నా పుస్తకాలన్నీ అమ్మేశానని నాన్నగారికీ, తాతగారికీ సహజంగానే, తొందరలోనే తెలిసిపోయింది. తాతాగారు నన్ను చితకబాదారు. నేను వేదికపై నటించడం చూసినప్పుడు కొట్టిన దానికంటే ఇది దారుణంగా ఉంది. మా సముదాయంలోని పెద్దలలో ఒకరు నేను ప్రదర్శన ఇస్తున్నట్లు తెలుసుకుని తాతగారిని అక్కడికి తీసుకొచ్చారు. నేను నాటకాన్ని మధ్యలో వదిలి, నాన్నగారి దగ్గరకి పారిపోయాను.
త్వరలో, 1943లో, నన్ను జమ్మూలోని ఒక బోర్డింగ్ స్కూల్‌కు పంపారు, అది ఒక గురుకులం – మా కుటుంబ పెద్దల ప్రకారం పిండి లోని ‘వికర్షణ’కు దూరంగా ఉంది. పాడటానికి, నటించడానికి నన్ను ప్రోత్సహించే నా ‘పిండి దె కంజర్ దోస్త్’ల నుండి దూరంగా ఉంచటం నన్ను ‘సౌమ్యుడి’గా మారుస్తుందని వారు భావించారు. పిండిని, నానమ్మని విడిచివెళ్ళాల్సి వచ్చినందుకు నా గుండె బద్దలయింది. పైగా, అమ్మ లేకపోవడం ఇప్పుడు మరింత లోటు అని అనిపించింది. మా అమ్మే బ్రతికుంటే, ఆమె వారిని ఇలా చేయనిచ్చేది కాదు. మా ఇంట్లో నానమ్మ అసహాయురాలు. నేను తప్పక వెళ్ళవలసి వచ్చింది.’
‘ఆజ్ కా ఏ దిన్, కల్ బన్ జాయేగా యహ్ కల్; పీఛే ముఢ్ కే నా దేఖ్, ప్యారే, ఆగే చల్.’ – నాస్తిక్
***
‘ఉచితంగా ఇచ్చే పాలు నాకు వద్దు!’
మొదటి టర్మ్ ప్రారంభమైన కొన్ని రోజుల్లోనే, నేను నా గురుకులంలో బాక్సింగ్ తరగతులలో చేరాను, ఎందుకంటే బాక్సర్లకు రోజూ ఒక గ్లాసు పాలు ఉచితంగా ఇచ్చేవారు. బాక్సింగ్ నేర్పే మా స్పోర్ట్స్ టీచర్, నేర్పించడంలో క్రూరమైన పద్ధతిని పాటించేవాడు. ప్రతిరోజూ, ఆయన యాదృచ్ఛికంగా ఓ విద్యార్థిని ఎంచుకుని, ఆ విద్యార్థి స్పృహ కోల్పోయే వరకు అతన్ని కొట్టేవాడు. ఏదో విధంగా, ప్రతిరోజూ విద్యార్థులను ఎంపిక చేసుకోడంలో అతని దృష్టి నుండి నేను తప్పించుకోగలిగాను. నేను తెలివిగా అతని దారికి దూరంగా ఉండి, బాక్సింగ్ గ్లోవ్స్ ధరించాల్సిన అవసరం లేకుండా రోజు ఉచితంగా పాలు తాగాను.
అతని దృష్టిలో పడకుండా, చాలా నెలల పాటు ఉచిత పాలను విజయవంతంగా ఆస్వాదించిన తర్వాత, ఒకరోజు అతను నన్ను గమనించాడు! “ఓయ్! నేను ఇంతకు ముందెప్పుడూ నిన్ను గమనించలేదు. నువ్వు ఇప్పుడే స్కూల్లో చేరావా? కాదా? సరే! గ్లౌజులు వేసుకో. ఓ మనిషిలా ఎలా నిన్ను నువ్వు రక్షించుకోవాలో నేర్పుతాను!” అంటూ నేను క్రింద పడే వరకు నన్ను కొట్టాడు. ఉచిత పాల కోసం నేను ఆరాటపడిన చివరి రోజు అదే. దారుణంగా కొట్టబడే ఆ క్రూరమైన ఆచారంలో భాగం కావడానికి మేము నిరాకరిస్తే, మేము అలసటతో కుప్పకూలిపోయే వరకు ఎండలో ‘ముర్గా’లా (కాళ్ళ కింద చేతులు పెట్టి నిల్చోవడం, చతికిలబడి చెవులు పట్టుకోవడమనే శిక్ష) మారాల్సి వచ్చేది. ఇది నా మునుపటి బడి కంటే దారుణంగా ఉంది, అక్కడ మా ప్రధానోపాధ్యాయుడు ఒక అల్లరి విద్యార్థిని రెండు చెవులతో పట్టుకుని నేల నుండి పైకెత్తేవాడు. త్వరలోనే, చదువు మధ్యలోనే, నేను గురుకులం నుండి పారిపోయి పిండికి తిరిగొచ్చేశాను. ఉన్నత చదువులను వదులుకున్నందుకు నాకు జీవితాంతం శిక్ష విధించబడింది’.
పిండిలోనే ఉంటే నంద్ మళ్ళీ నాటకరంగంలోకి దిగుతాడని ఆయన నాన్నగారు, తాతగారు భయపడ్డారు. ఓ సోమరిబోతు అవుతాడని భావించి కరాచీలోని రాయల్ ఇండియన్ నేవీలో నావల్ క్యాడెట్‌గా చేర్చాలని నిర్ణయించుకున్నారు. అంతేకాకుండా, మోహ్‍యాల్స్ యుద్ధ సమాజం – సాయుధ దళాలలో భాగమవడానికి గర్వపడుతుంది. కాబట్టి వారి అజీజ్ పుత్తర్ తన పూర్వీకుల ఆశయాలకు అనుగుణంగా జీవించే సమయం ఆసన్నమైంది.
ఈసారి ఇల్లు వదిలి వెళ్తున్నందుకు నంద్ చాలా సంతోషించారు. కరాచీ – లాహోర్ లేదా రావల్పిండి నుండి జమ్మూ ఉన్నంత దూరంలో లేదు, పైగా తాతగారిని, నానమ్మని తరచు కలుసుకోవచ్చు. తాతగారు, మరికొందరు పెద్దలు అతన్ని గురుకులంలో చేర్చినప్పుడు, తన కుటుంబం తనని వదిలేసినట్లు నంద్ భావించారు. వారు తనను ‘భావోద్వేగాలకు’ దూరం చేశారని, అపరిచితుల మధ్య ‘ఒంటరిగా’ వదిలేశారని ఆయన భావించారు. ఈ వదిలిపెట్టబడమనే భయం లేదా ఒంటరిగా ఉండాలనే ఆందోళన తరువాత నంద్ జీవితకాలపు భయాలలో ఒకటిగా మారింది, ఇది 70లలో క్రమంగా కనిపించడం ప్రారంభించింది, 90ల మధ్యకాలం నుండి ఆయన్ని పూర్తిగా ముంచెత్తింది.
తన తండ్రి నుంచి, సవతి తల్లి నుండి తాను ఆశించిన లేదా పొందాల్సిన ఆప్యాయత తనకు లభించడం లేదని నంద్ భావించారు. అతను పగటిపూట ఎక్కువ సమయం ఇంటి బయటే ఉండి, సాయంత్రం వేళల్లో, నాన్న, తాతగారు ఇంటికొచ్చే వేళకి కాస్త ముందుగా మాత్రమే, తిరిగి వచ్చేవారు. నా అభిప్రాయం ప్రకారం, ఆయన నౌకాదళంలో చేరడానికి ఇష్టపడేలా చేసిన ప్రధాన అంశాలలో ఇది ఒకటి, అతిపెద్ద ప్రేరణ కూడా: అతను నియమించబడిన శిక్షణా నౌక కరాచీ రేవులో డాక్ చేయబడింది. అందుబాటులోని సమాచారం సేకరించారు. దాని ప్రకారం బంబయి లోని చలనచిత్ర పరిశ్రమకు చేరుకోవడానికి కరాచీ నౌకాశ్రయం ఒక మార్గం అని గ్రహించారు!
బొంబాయిలో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ఇది అతనికి రెండవ, బహుశా చివరి అవకాశం. కాబట్టి అవకాశాలు కల్పించుకోడానికి ఆసక్తిగా ఉన్నారు.
తన తల్లి మరణం తర్వాత తండ్రి తనని పెంచిన తీరు పట్ల నంద్ అసంతృప్తిగా ఉన్నప్పటికీ, తనకు కీర్తి, ధనం వచ్చిన తర్వాత కుటుంబం పట్ల తన కర్తవ్యాన్ని నెరవేర్చారు. ఆనంద్ బక్షి తన తండ్రి ఢిల్లీలో ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నప్పుడు ఆయన ప్రాణాలను కాపాడటానికి తన శాయశక్తులా ప్రయత్నించారని, అయినా, చివరికి తండ్రిని దక్కించుకోలేకపోయారని ఓ కజిన్ రాసిన ఉత్తరం ఉంది.
ఉమ్మడి కుటుంబంలో పెరుగుతున్నప్పుడు, బాల్యంలో నంద్ పొడ గిట్టేది కాదు ఈ కజిన్‍కి. నంద్ పట్ల అసంతృప్తి చెంది, అతనిని వదిలించుకోవడానికి ఆ కజిన్ నంద్‍ని బెల్ట్ బకిల్‍తో కొట్టేవాడు. ఆ తర్వాత తనని తాను బెల్ట్‌తో కొట్టుకునేవాడు. కుటుంబ పెద్దలకు ఆ గాయం గుర్తులను చూపిస్తూ, సోమరిపోతు నంద్ ఇలా చేశాడని చెప్పేవాడు. నంద్ బాల్యం, టీనేజ్ సంవత్సరాలలో ఇది చీకటి కాలం. ఇంటి నుండి, కుటుంబం నుండి తనను వెళ్లగొట్టడానికే ఆ కజిన్ ఇలా చేశాడని నంద్ అనుమానించాడు. నంద్‌ని ఇలా ఎందుకు కొట్టారో నాకు తెలియదు, తోటి కుటుంబ సభ్యుడిని బాధపెట్టినందుకు తప్పుగా ఇరికించబడ్డారని నాకు అర్థమైంది. కానీ, కుటుంబ పెద్దలు ఆ కజిన్నే నమ్మేవారు. దాంతో, తాను చేయని నేరానికి శిక్షగా నంద్ తరచుగా తిట్లు లేదా తన్నులు తినాల్సి వచ్చేది.
ఆరేళ్ల వయసులో తల్లిని కోల్పోవడం ఎలా ఉంటుందో నాకు తెలియదు. మా అమ్మ మాతో పూర్తి జీవితాన్ని గడిపింది. తల్లి ఇంత త్వరగా చనిపోవడం, ఆ తర్వాత తండ్రి మళ్ళీ పెళ్ళి చేసుకోవడం వంటి వల్ల నంద్ లాంటి సున్నితమైన బిడ్డకు మరింత శ్రద్ధ, ఆప్యాయత అవసరమా అనేది నాకు తెలియదు. నాన్న ఎప్పుడూ వివరాల్లోకి వెళ్ళలేదు; ఆ సంవత్సరాల గురించి మాట్లాడటం తనకు బాధ కలిగించిందని ఆయన అన్నారు. తనకి సంభవించిన రెండు నష్టాలు – ఒకటి తన తల్లిని కోల్పోవడం, రెండు తన జన్మస్థలం పిండికి దూరమవటం గురించి ఆయన తరచుగా మాతో మాట్లాడేవారు. ‘ఆ తర్వాత ఎంత కీర్తి, డబ్బు, ఆప్యాయత లభించినా, మేరీ మాజీ ఔర్ మేరీ మిట్టీ – (తల్లినీ, మాతృభూమిని) రెండింటినీ భర్తీ చేయలేకపోయాయి. మేరీ మిట్టి థీ, జీలం మే వో బెహే గయీ (నా భూమి జీలం నదిలోకి కొట్టుకుపోయింది).’
***
‘కితాబ్-ఎ-గమ్ మే ఖుషీ కా కోయీ ఫసానా ఢూంఢో
అగర్ జీనా హై జమానే మే తో ఖుషీ కా కోయీ బహానా ఢూంఢో
సయనా ఓ హై జో పత్‍ఝడ్ కో భీ బనా లే గుల్‍షన్ బహారోం జైసా
కాగజ్ కే పూలోం కో భీ జో మహకా కర్ దిఖ్‍లాయె
ఇక్ బంజారా గాయే..’
– జీనే కీ రాహ్
పద్నాలుగు సంవత్సరాల వయసులో, ఆనంద్ ప్రకాష్ 1944లో కరాచీ హార్బర్‌లోని రాయల్ ఇండియన్ నేవీలో సాయుధ దళాలలో చేరి దేశానికి సేవ చేయాలనే ఉద్దేశంతో చేరారు. పెద్దలు అతను తమ మోహ్‍యాల్ వంశపారంపర్య విధానానికి అనుగుణంగా జీవించాలని ఆశించారు. అయితే, విధి (తక్దీర్); నంద్ ప్రయత్నాలు, పనులు (తద్బీర్) దీనికి విరుద్ధంగా నడిచాయి.
‘తక్దీర్ హై క్యా, మై క్యా జానూ, మై ఆషిక్ హూఁ తద్బీరోం కా.’ – విధాత
***
పిండిలో యుక్తవయసులో ఉండగా ఆనంద్ బక్షి రాసిన మొదటి ప్రచురిత కవిత:
‘అయే ఖుదా, ఘమ్ తేరీ దునియా కే మై పీ సక్తా నహీఁ
మాంగ్‍తా హూఁ ఆజ్ కుఛ్, అబ్ హోంఠ్ సీ సక్తా నహీఁ
జిందగీ! ఇస్ వాస్తే జీనే కో భీ కర్తా హై దిల్
ఔర్ మౌత్! ఇస్ ఖాతిర్ కే మే ఔర్ జీ సక్తా నహీఁ
హాఁ, ఇస్ గుల్షన్ పే ఆయీ హైఁ బహారేఁ లాఖ బార్
హాఁ, ఇసీ వాదే పే బర్సీ హై ఘాటేఁ బార్ బార్.
ఆజ్ జో బస్తీ తుఝే దిఖ్‍తీ హై రేగిస్తాన్ సీ
హమ్ నక్షీన్, ఏక్ దిన్ యహీఁ సే ఫూతే థే, ఆబ్‍షార్.’
(మళ్ళీ కలుద్దాం)
కొల్లూరి సోమ శంకర్ రచయిత, అనువాదకులు. బి.ఎ.డిగ్రీతో గ్రాడ్యుయేషన్. మానవ వనరుల నిర్వహణలో పిజి డిప్లొమా చేసారు. దక్షిణ భారత హిందీ ప్రచార సభ వారి భాషా ప్రవీణ పాసయ్యారు. ప్రస్తుత నివాసం హైదరాబాదు.
సోమ శంకర్ 2001 నుంచి కథలు రాస్తున్నారు. 2002 నుంచి కథలను అనువదిస్తున్నారు. కేవలం కథలే కాక ‘ది అడ్వెంచర్స్ ఆఫ్ పినోకియో’ అనే పిల్లల నవలను ‘కొంటెబొమ్మ సాహసాలు’ అనే పేరుతోను, ‘మాజిక్ ఇన్ ది మౌంటెన్స్’ అనే పిల్లల నవలను ‘కొండలలో వింతలు’ అనే పేరుతోను, వినయ్ జల్లా ఆంగ్లంలో రాసిన ‘వార్స్ అండ్ వెఫ్ట్’ అనే నవలని ‘నారాయణీయం’ అనే పేరుతోను, వరలొట్టి రంగసామి ఆంగ్లంలో రాసిన ‘లవ్! లవ్! లవ్!’ నవలను ‘సాధించెనే ఓ మనసా!’ పేరుతోనూ, అజిత్ హరిసింఘానీ రచించిన ట్రావెలాగ్ ‘వన్ లైఫ్ టు రైడ్’ను ‘ప్రయాణానికే జీవితం’అనే పేరుతోను, డా. చిత్తర్వు మధు ఆంగ్లంలో రచించిన ‘డార్క్ అవుట్పోస్ట్స్’ అనే స్పేస్ ఒపేరా నవలను ‘భూమి నుంచి ప్లూటో దాకా’ అనే పేరుతోనూ; అమర్త్యసేన్ వ్రాసిన ‘ది ఐడియా ఆఫ్ జస్టిస్’ అనే పుస్తకాన్ని, మరో నాలుగు పుస్తకాలను తెలుగులోనికి అనువదించారు. ‘దేవుడికి సాయం’ అనే కథాసంపుటి, ‘మనీప్లాంట్’, ‘నాన్నా, తొందరగా వచ్చెయ్!!’, ‘ఏడు గంటల వార్తలు’ అనే అనువాద కథా సంపుటాలను ప్రచురించారు.