[శ్రీ రాకేశ్ ఆనంద్ బక్షి రచించిన ‘నగ్మే, కిస్సే, బాతేఁ, యాదేఁ – ది లైఫ్ అండ్ లిరిక్స్ ఆఫ్ ఆనంద్ బక్షి’ అనే ఆంగ్ల పుస్తకాన్ని అనువదించి పాఠకులకు అందిస్తున్నారు కొల్లూరి సోమ శంకర్.]
ఈ రోజుల్లో ఆనంద్ బక్షి ప్రాసంగిత
విజయ్ అకేలా (కవి, గేయ రచయిత, రేడియో హోస్ట్)
‘యూఁ తో సబ్నే గీత్ లిఖే సబ్హీ మే ఔకాత్ థీ
బక్షి మే ఇక్ బాత్ హై ఔర్ బక్షి మే ఇక బాత్ థీ’
(‘అందరూ పాటలు రాశారు, అందరికీ సామర్థ్యం ఉంది/బక్షిలో వేరే ఒక విషయం ఉంది, బక్షిలో ఒక విషయం ఉండేది’)
బక్షి 20 సంవత్సరాల క్రితం జీవించి పాటలు రాసేటప్పుడు ఎంత సమకాలీనులో నేటికీ అంతే సమకాలీనులు.
ఆయన తన పాటలను స్థానిక భాషతో అలంకరించారు, అది ఆయన కాలపు అంతిమ సత్యాన్ని మాత్రమే కాకుండా, ప్రతి యుగం లోని అంతిమ సత్యాన్ని ప్రతిబింబిస్తుంది. ఆయన కష్టమైన పదాలను సాహిత్యపు లోతైన కుట్రగా అర్థం చేసుకున్నారు, అందువల్ల తన పాటల విధిని రూపొందించడానికి ఎల్లప్పుడూ సాధారణ పదాలను గుర్తించడానికి ప్రయత్నించారు.
బక్షిని అర్థం చేసుకోవాలంటే, ముంబై బయటకు అడుగు పెట్టండి. ఆనంద్ బక్షికి అప్పటి కంటే ఇప్పుడే మరింత ప్రజాదరణ ఉందనీ, గౌరవం దక్కుతోందని గ్రహిస్తారు.
పాటల్లో దాగి ఉన్న బక్షి అద్భుతమైన ఆలోచనలను తమవిగా చెప్పుకునే దర్శకులు నేడు ఎక్కడికి పోయారు? ‘మన స్క్రిప్టులోని సందర్భాలు బాగున్నాయి కాబట్టి, పాటలు బాగున్నాయి. అదే సందర్భాలు బాలేకపోతే, బక్షి ఇంత బాగా రాసేవాడు కాదు’ అని చెప్పుకునేవారు కొందరు స్క్రిప్ట్ రైటర్లు. నేడు ఆ సందర్భాలు ఎక్కడకి పోయాయి? బక్షి నిష్క్రమణతో వారి కోటలు ఎందుకు బీటలువారాయి?
బక్షిని గౌరవించడానికి వెనుకాడే మన దేశంలో, ఏదైనా ఉద్యమం జరిగినప్పుడల్లా, ‘కర్మ’ సినిమా లోని ‘దిల్ దియా హై జాన్ భీ దేంగే ఏ వతన్ తేరే లియే’ పాటను ప్లే చేస్తారు. నేటికీ, ప్రతి పుట్టినరోజున, ‘ఫర్జ్’ లోని ఈ పాటను ప్లే చేస్తారు: ‘బార్ బార్ దిన్ యే ఆయే’.
‘చిట్ఠీ నా కోయి సందేశ్/జానే వో కౌన్ సా దేశ్/జహాఁ తుమ్ చలే గయే’, ఇది ఇప్పటికీ ఎక్కువగా ప్లే చేయబడే పాటల్లో ఒకటి, దీనిని జగ్జీత్ సింగ్ కాదు ఆనంద్ బక్షి రాశారు.
భారతదేశంలో అత్యంత విజయవంతమైన రెండు చిత్రాలు, ‘షోలే’, ‘దిల్వాలే దుల్హనియా లే జాయేంగే’ (నేటికీ ప్రదర్శితమవుతున్నాయి), బక్షి పాటలతో ప్రకాశిస్తాయి. కాదా?
బక్షి ఒక దీపం లాంటివారు, అతని రచనా శైలి లెక్కలేనన్ని కొవ్వొత్తులను వెలిగించింది. నేను వ్యక్తిగతంగా ఆయన నుండి పాటలు రాయడం నేర్చుకున్నాను, నేను లోతుగా పరిశీలించినప్పుడు, బక్షి పాటలు, బక్షి రచనా శైలి – మనస్సుని, హృదయాన్ని ప్రశాంతపరిచే వైద్యం లాంటి శక్తి తప్ప మరేమీ కాదని నేను గ్రహించాను.
డాక్టర్ రాజీవ్ ఎం. విజయకర్ (జర్నలిస్ట్, రచయిత, చలనచిత్ర చరిత్రకారుడు)
ఆనంద్ బక్షి ఇప్పటికీ ప్రాసంగిత కలిగి ఉన్నారు. ఆయన కేవలం గీత రచయిత కాదని మనం గ్రహించే కొద్దీ ప్రతి సంవత్సరం ఆ ప్రాసంగిత స్థాయి పెరుగుతుంది – ఆయన ఒక దార్శనికుడు, అనుచరులు లేని తత్వవేత్త, వర్తమానంలో చాలా కాలం జీవించారు. ఐదు దశాబ్దాల పాటు బహుళ తరాల స్వరకర్తలతో పనిచేసినప్పటికీ, ఆయన ఆలోచనలు, ఆయన కలం – ఆరోగ్యకరమైన భవిష్యత్తు నాణ్యత తోనూ, కాలాతీతంగానూ – సదా సమకాలీనంగా ఉన్నాయి. అందుకే, నేటి తరం కూడా ఆనంద్ బక్షిని, ఆయన ఆలోచనలను సమయోచితంగా భావిస్తుంది (ఇంకా పుట్టని వారిలాగే). అది దార్శనికుడి నిర్వచనం.
‘గాడీ బులా రహీ హై’, ‘చిట్ఠీ ఆయీ హై’, ‘పరదేసియోం సే నా అంఖియాన్ మిలానా’, ‘చింగారి కోయి భడ్కే’, ‘దిల్ క్యా కరే జబ్ కిసికో’, ‘ఘర్ ఆజా పరదేశి’, ‘రూప్ తేరా మస్తానా’ వంటి పాటలలో బక్షి పాండిత్యం ప్రతిఫలించింది. ‘స్టోరీ సున్కర్ హీ మైండ్ చల్తా హై!’ అనేది ఆయన నాకు చెప్పిన చిరస్మరణీయ వాక్యం. కానీ, స్వరకర్త ఇస్మాయిల్ దర్బార్ ఒకసారి చెప్పినట్లుగా, ‘ఓరి దేవుడా! ఎంత గొప్ప వ్యక్తి ఈ బక్షి సాబ్!’ అనిపిస్తారు.
కారణం ఏమిటంటే, బక్షి పాట అవసరాలకు అనుగుణంగా ఎప్పుడూ రెండు లేదా మూడు పల్లవులు మాత్రమే ఇవ్వలేదు. ఆయన రాసిన 6000 పాటలలో ప్రతిదానికీ – కనీసం ఎనిమిది నుండి పది వరకు పల్లవులు ఇచ్చేవారు, వాటి నుండి ఎంచుకోమని చెప్పేవారు. మనమందరం కోల్పోయిన సంపదను చూడండి – బక్షిజీ పూర్తి రచనల్లో 20 శాతం మాత్రమే మనం విన్నాము!
ఆయన వ్రాసిన పల్లవిలన్నీ సందర్భానికి సంబంధించినవి అని చెప్పనవసరం లేదు, అవి సినిమా స్క్రిప్ట్‌లో లేదంటే పాట చిత్రీకరణను రూపొందించడంలో కూడా చాలా మందికి సహకరించాయి! దక్షిణాది సూపర్‌హిట్ సినిమాకి రీమేక్‌గా తీసిన ‘స్వరగ్ సే సుందర్’ సినిమాలోని టైటిల్ సాంగ్‌ని గమనిస్తే, ఇందులో ఆయన హీరో కోసం ‘అప్నా ఘర్ హై స్వరగ్ సే సుందర్’ అనే పంక్తిని వ్రాసారు. హీరోయిన్ ‘స్వరగ్ మే కహాఁ సే ఆయే మచ్ఛర్?’ అని అంటుంది. బదులుగా హీరో, ‘అరే, మచ్ఛర్ భీ ఆషిక్ హై తేరే, క్యా కరూఁ!’ అంటాడు.
ఆయన ఒకసారి నాతో మాట్లాడుతూ, గత కొన్ని సంవత్సరాలుగా విషాద గీతం దాదాపుగా కనుమరుగైందని, సినిమా సంగీతం ఎలా సాగుతుందో వివరించే సరళమైన సత్యమిదేనని అన్నారు: ‘ఎందుకంటే మీరు విషాద గీతం పాడుతూ నాట్యం చేయలేరు!’ అని ఆగి, తన కళ్ళలో కొంటె మెరుపుతో, ‘లేదా బహుశా ప్రజలు ఇక విచారంగా లేరని అనుకోవాలి!’ అని కూడా అన్నారు.
బక్షి ఎప్పుడూ పాతబడకపోవడానికి ఒక కారణం, వివిధ కాలాలు వేర్వేరు ప్రతిభను మాత్రమే కాకుండా విభిన్న ధోరణులను చూస్తాయని ఆయన దృఢంగా నమ్మడమే. 50ల చివరి నుండి (ఆయన వ్రాయడం ప్రారంభించినప్పుడు) శతాబ్దం చివరి వరకు ఎందరో స్వరకర్తలతో కలిసి పనిచేశారు. వయసులో తన కంటే చాలా చిన్నవారితో కలిసి పనిచేయాలని ఆయనకి తెలుసు, ఆయన దానిని ఎప్పుడూ తిరస్కరించలేదు. బదులుగా, ఆస్వాదించారు.
2000 సంవత్సరంలో, హిమేష్ రేషమ్మియాతో కలిసి పనిచేసేందుకు ఒక సినిమాకి సంతకం చేసారు బక్షి, కానీ ఆ సినిమా ఆగిపోయింది. నదీమ్-శ్రవణ్, జతిన్-లలిత్, శివ్-హరి, విజు షా, ఎం ఎం క్రీమ్, ఎ.ఆర్. రెహమాన్, దిలీప్ సేన్-సమీర్ సేన్, సాజిద్-వాజిద్, నుస్రత్ ఫతే అలీ ఖాన్, నీరజ్-ఉత్తంక్ లతో బక్షి విజయగాథలు బాగా ప్రసిద్ధి చెందాయి. రాజీవ్ రాయ్, ఆదిత్య చోప్రా నుండి మిలన్ లుథ్రియా, జాయ్ అగస్టిన్, ఇంకా ఇతరుల వరకు యువ దర్శకులతో బక్షి ప్రాజెక్టులు కూడా అలాగే ఉన్నాయి. వీరిలో చాలా మంది, 1957లో బక్షి పనిచేయడం ప్రారంభించిన తర్వాత, పుట్టినవాళ్ళే!
నేడు, చాలా ‘రీక్రియేషన్స్’ (సృజనాత్మక పేదరికాన్ని సూచిస్తూనే, అసలైన వాటి శాశ్వత నాణ్యతను హైలైట్ చేసే ఒక విచారకరమైన ధోరణి) బక్షి పాటలతో రూపొందించబడ్డాయి: ‘మై జాట్ యమ్లా పగ్లా దీవానా’, ‘మెహబూబా ఓ మెహబూబా’, ‘ఓ మేరీ మెహబూబా’, ఆ దేఖేఁ జరా’, ‘దమ్ మారో దమ్’, ‘పైసా యే పైసా’, ‘తేరా బీమర్ మేరా దిల్’, ‘ఏక్ హసీనా థీ’, ‘తయ్యాబ్ అలీ’, ‘తు చీజ్ బడి హై మస్త్ మస్త్’, ‘ఆంఖ్ మారే’, ‘టిప్ టిప్ బర్సా పానీ’, ఇంకా మరెన్నో. అలాంటి పాటలు ఆయన పదాలు జెన్ వై, జెన్ జెడ్ లతో తక్షణ ప్రతిధ్వనిని కలిగి ఉన్నాయని మనకు తెలుస్తోంది. అందువల్ల, యువత కూడా విలక్షణమైన ఆనంద్ బక్షి పాటలతో – వాటిలో వ్యక్తీకరించబడిన భావాల కారణంగా – వెంటనే తాదాత్మ్యం చెందగలరు.
ఆర్.డి. బర్మన్, లక్ష్మీకాంత్-ప్యారేలాల్ వంటి భారతదేశపు అతిపెద్ద సంగీత దర్శకుల విజయంలో బక్షి కూడా కీలక పాత్ర పోషించారు. ప్రతి హిట్ లేదా నిలిచిపోయే పాట, మనందరికీ తెలిసినట్లుగా, అలా మారడానికి ఒక కారణం ఉంటుంది. ఆ కారణం పదాలతో ప్రారంభమవుతుంది..
బక్షి మాటల మాయాజాలాన్ని పెద్దవాళ్ళు ఇప్పటికే అనుభవించారు. ఒకప్పుడు వారు ఆస్వాదించిన బక్షి పాటలు కూడా పాత్ర, పరిస్థితి, ఇంకా జీవితం గురించి లోతైన అంతర్దృష్టిని కలిగి ఉంటాయని ఇప్పుడు చాలామంది గ్రహించారు. ‘నాస్తిక్’ లోని పాట లాగా, ‘ఆజ్ కా యే దిన్ కల్ బన్ జాయేగా కల్, పీచే ముఢ్కే న దేఖ్ ప్యారే, ఆగే చల్.’
(నేటి రోజు రేపు నిన్న అవుతుంది, ప్రియా, వెనక్కి తిరిగి చూడకు, ముందుకు నడు)
బక్షి పాటలు మనకు బోధించేది అదే – వర్తమానంలో జీవించడం, కాలంతో సమకాలీకరించడం, ఆనందాన్ని ఎంపిక చేసుకోవడం. ‘అమృత్’ చిత్రంలోని ఆయన క్లాసిక్, ‘దునియా మే కిత్నా ఘమ్ హై/మేరా ఘమ్ ఇత్నా కమ్ హై/లోగోఁ కా ఘమ్ దేఖా తో/ మేన్ అప్నా ఘమ్ భూల్ గయా.’
(ప్రపంచంలో ఎంతో దిగులు ఉంది, దాంతో పోలిస్తే, నాది చాలా తక్కువ. జనాల దిగులు చూస్తుంటే, నేను నా దిగులుని మరచిపోయాను.)
హిందీ సినిమా సంగీతం ఉన్నంత కాలం, బక్షి కూడా సందర్భోచితంగానే ఉంటారు. హిందీ సినిమా సంగీతం ఎప్పటికీ నిలిచి ఉండటానికి ప్రధాన కారకులలో ఆయన ఒకరు!
మానెక్ ప్రేమ్‌చంద్ (రచయిత మరియు చలనచిత్ర చరిత్రకారుడు)
సందర్భోచిత ఆవశ్యకత
మన మనసులు ఎలా పనిచేస్తాయనేది ఓ వింత, కదా? తరచుగా అనుబంధాలను పెంచుకుంటూ. నేను బొంబాయిలో నివసిస్తున్నాను, ఇది అనేక విధాలుగా అద్భుతమైన నగరం. కానీ దీనికి కొన్ని లోపాలు ఉన్నాయి, వాటిలో ఒకటి ప్రతి వీధి, ట్రాఫిక్ కూడలి వద్ద బిచ్చగాళ్ళు ఉండటం. ఆ బిచ్చగాళ్లను చూసినప్పుడల్లా, నేను ఒక ప్రసిద్ధ జోక్ గుర్తు చేసుకుంటాను, ఆపై నిశ్శబ్దంగా నవ్వుకుంటూ, అద్భుతమైన పాటల రచయిత ఆనంద్ బక్షి గురించి ఆలోచిస్తాను. మీరు బహుశా ఇంతకు ముందు ఈ జోక్ విని ఉండవచ్చు, కానీ ఇక్కడ చెప్తాను, ఈ సందర్భంలో నేను ఆనంద్ బక్షి గురించి ఆలోచించడానికి కారణం ఉంది.
రద్దీగా ఉండే వీధిలో ఒక బిచ్చగాడు బిచ్చం అడుగుతున్నాడు. ఒక బాటసారి వచ్చి ఎంత డబ్బు కావాలని అడుగుతాడు. ఆ బిచ్చగాడు 20 రూపాయలిస్తే బాగుంటుందని అంటాడు. ఆ వ్యక్తి బిచ్చగాడిని, ‘నీకు డబ్బు ఎందుకు కావాలి? డ్రగ్స్ తీసుకోడానికా లేక సిగరెట్/బీడీ తాగడానికి?’ అని అడుగుతాడు.
‘సాబ్, నేను డ్రగ్స్ తీసుకోను. అలాగే పొగ తాగను.’
‘మరేంటి? మందు కొడతావా?’
‘నేను వీటిలో ఏవీ చేయను. నేను తిని బ్రతకడానికి ప్రయత్నిస్తున్నాను. మైఁ షరీఫ్ ఆద్మీ హూఁ, యే సబ్ నహీన్ కర్తా.’ (నేను మర్యాదస్థుడిని, ఇవేవి చేయను.)
ఆ వ్యక్తి, ‘సరే, నేను నీకు ఒక విషయం చెబుతాను. నేను నీకు 20 రూపాయలు ఇవ్వను. బదులుగా 100 రూపాయలు ఇస్తాను. కానీ అందుకు నువ్వు నాతో పాటు మా ఇంటికి రావాలి, అది దగ్గర్లోనే ఉంది’ అని అంటాడు.
బిచ్చగాడు అంగీకరిస్తాడు. ఇంటి యజమాని అతన్ని తీసుకెళ్ళి తన ఇంటి తలుపు వద్ద ఉండే కాలింగ్ బెల్ నొక్కుతాడు. అతని భార్య వచ్చి తలుపు తెరుస్తుంది. అతను ఆమెతో ఈ వ్యక్తిని చూడమని చెబుతాడు, ఇతను తాగడు లేదా ధూమపానం చేయడు, మర్యాదస్థుడట.. అని బిచ్చగాడిని చూపిస్తాడు. విషయం ఏంటంటే, మద్యం తాగడం, ధూమపానం చేయడం మానేయమని ఆమె భర్తకి ఎప్పుడూ సలహాలిస్తుంది. ఆ వ్యక్తి బిచ్చగాడికి డబ్బు ఇచ్చి పంపించేసి, తలుపు మూసివేసి భార్యతో, ‘ప్రజలు ఇంత బోరింగ్ జీవితాన్ని గడుపుతుంటే ఇలాగే జరుగుతుంది’ అని చెబుతాడు.
జోక్ అయిపోయింది, నా ఊహ ఇప్పుడు సన్నివేశంలోకి ప్రవేశిస్తుంది. ఇప్పుడు ఒక సమర్థన దొరికిన తర్వాత, ఇంటి యజమాని తనకు తానుగా గ్లాసులో మందు పోసుకుంటాడు. ఒకసారి ఆ ప్రభావంలో చిక్కుకున్న తర్వాత, అతను ‘షరీఫోం కా జమానే మే అజీ బస్ హాల్ వో దేఖా కే షరాఫత్ చోడ్ ది మైనే’ అనే సందర్భోచిత పాటను పాడటం ప్రారంభిస్తాడు. దీనిని మొదట లతా మంగేష్కర్ షరాఫత్ (1970)లో లక్ష్మీకాంత్-ప్యారేలాల్ కోసం పాడారు. ఆనంద్ బక్షి రాశారా పాటని.
ఇది సరదాగా చెప్పిన ఉదంతం. మరింత గంభీరంగా చెప్పాలంటే, ఈ ప్రతిభావంతుడైన రచయిత గొప్పతనాన్ని పరిగణించండి, సినిమాల్లోని పరిస్థితులకు నప్పేలా, ఆయన చాలా సందర్భోచితమైన పాటలు రాశారు.
జిందగీ జిందగీ (1972) లో, ‘తు నే హమేఁ క్యా దియా రి జిందగీ’ అనే పాటను ఎస్.డి. బర్మన్ స్వరపరచగా కిషోర్ కుమార్ పాడారు. ఇక్కడ, రచయిత జీవితాన్ని స్వయంగా ప్రస్తావిస్తూ, తనకు జరిగిన దాని గురించి విచారం వ్యక్తం చేస్తారు. ఆసుపత్రి జనరల్ వార్డులో మంచం పట్టి పడుకున్న రోగి దేబ్ ముఖర్జీ అనే పాత్ర ఈ పాటని పాడింది. కెమెరా ఫరీదా జలాల్, వహీదా రెహ్మాన్, సునీల్ దత్, ఇంకా ఇతర రోగులపైకి కదులుతుంది, వారందరూ తమ వ్యక్తిగత సమస్యల చీకట్లతో పోరాడుతున్నందువల్ల ఆ సాహిత్యాన్ని స్పష్టంగా అనుభూతి చెందుతారు.
ఆనంద్ బక్షి తన అసాధారణమైన సాహిత్యానికి గుర్తుండిపోతారు. జబ్సే తుమ్హే దేఖా హై (1963)లో ఖవ్వాలీ పాడే స్త్రీలను పురుషులతో పోటీ పెట్టడాన్ని పరిగణించండి. ‘తుమ్హే హుస్న్ దేకే ఖుదా నే సితంగర్ బనాయా బనాయా’ అంటూ షమ్మీ కపూర్, శశి కపూర్ సారథ్యంలోని పురుషులు పాడతారు. కానీ ఈ పంక్తి ఒక భయంకరమైన ఎత్తుగడతో ప్రారంభమవుతుంది, దాంతో పురుషులకి ఎదురుదెబ్బ తగులుతుంది. శ్యామా, కుంకుమ్ నేతృత్వంలోని మహిళలు – ‘ఛలో ఇస్ బహానే తుమ్హే భీ ఖుదా యాద్ ఆయా జీ ఆయా’ అంటూ ఇంకా సమర్ధవంతంగా ప్రతిస్పందిస్తారు. మాస్ట్రో దత్తారామ్ స్వరకల్పనలో ఆ రోజు ఒక స్టూడియోలో గాయకులు రఫీ, మన్నా డే, లత మరియు ఆశా ఆలపించారా పాటని.
బక్షి ‘హుమేఁ క్యా జో హర్సు ఉజాలే హుయే హై’ (రఫీ/జిఎసి కోహ్లి/నమస్తే జీ, 1965), ‘సావన్ కా మహీనా పవన్ కరే సోర్’ (ముఖేష్, లతా/లక్ష్మీకాంత్-ప్యారేలాల్/మిలన్, 1967), ‘కాహే కో రోయే’ (ఎస్.డి.బర్మన్/ఎస్.డి.బర్మన్/ఆరాధన, 1969), ‘ఖిలోనా జాన్ కర్ తుమ్ తో’ (రఫీ/లక్ష్మీకాంత్-ప్యారేలాల్/ఖిలోనా, 1970), ‘ముహబ్బత్ కే సుహానే దిన్’ (రఫీ/కళ్యాణ్‌జీ–ఆనంద్జీ/మర్యాద, 1971), ‘మార్ దియా జాయే యా ఛోడ్ దియా జాయ్’, (లత రఫీ/లక్ష్మీకాంత్-ప్యారేలాల్/గావ్ మేరా దేశ్, 1971), ఇంకా ‘ముజ్కో హుయీ నా ఖబర్’ (ఆశా/ఉత్తమ్ సింగ్/దిల్ తో పాగల్ హై, 1997) వంటి సందర్భానుసారమైన పాటలను రాశారు. కానీ బహుశా బక్షి మనసులోంచి వచ్చిన అంతిమ పదాలను ఆయన రాసిన అమర్ ప్రేమ్ (1971) కోసం ఉపయోగించారు, ఈ చిత్రానికి ఆర్డి బర్మన్ సంగీతం అందించారు. కిషోర్ కుమార్ పాడిన ‘కుచ్ తో లాగ్ కహెంగే’ పాటలో, రాజేష్ ఖన్నా – విధి ఆడే ఆటలో చిక్కుకున్న వేశ్య పాత్రను పోషిస్తున్న షర్మిలా ఠాగూర్‌ను ఓదార్చడానికి ప్రయత్నిస్తాడు. ఈ పాటలోని బక్షి సాహిత్యం సర్వోత్కృష్టమైనది, సామాజిక వాస్తవికతలో పాతుకుపోయింది. సినిమాలోని ఒక పాత్రకు మాత్రమే కాకుండా, మనందరికీ, మన స్వంత శిలువను మోస్తూ, మన స్వంత స్థితి గురించి ఏడుస్తూ, ఏదో ఒక విధంగా ముందుకు సాగి జీవించడానికి ప్రేరణ కోసం చూస్తున్న సార్వత్రిక సత్యాలను, రామాయణం స్ఫూర్తితో ఆయన పదాలను రూపొందించారు.
కుఛ్ తో లోగ్ కహేంగే, లోగోం కా కామ్ హై కహనా
ఛోడో బేకార్ కీ బాతోం మేం కహీం బీత్ నా జాయే రైనా
కుఛ్ రీత్ జగత్ కీ ఐసీ హై, హర్ ఏక్ సుబహ్ కీ శాహ్ హుయీ
తూ కౌన్ హై, తేరా నామ్ హై క్యా, సీతా భీ యహాఁ బద్నామ్ హుయీ
ఫిర్ క్యూఁ సంసార్ కీ బాతోం సే, భీగ్ గయే తేరే నైనా
(జనాలు ఏదో ఒకటి అంటూనే ఉంటారు, ఏదో ఒకటి అనడమే వాళ్ళ పని
పనికిరాని ఇవన్నీ వదిలేయ్, లేదంటే, రాత్రి వాటి చుట్టూనే ముగుస్తుంది
ప్రపంచంలోని కొన్ని పద్ధతులు ఎలా ఉంటాయంటే, ప్రతి ఉదయానికీ ఓ సాయంత్రం ఉంటుంది
సీతాదేవికి కూడా ఇక్కడ నిందలు తప్పలేదు, మరి నువ్వెవరు, నీ పేరేమిటి?
మరి ఎందుకీ లోకపు వ్యర్థమైన మాటలతో నీ కంట కన్నీరేల ఒలుకు?)
సువార్ణాక్షరాలతో వ్రాసుకోవాల్సిన పదాలు.
ధన్యవాదాలు ఆనంద్ బక్షిజీ. మీరు మా జీవితాలను ఇంత అద్భుతమైన కవిత్వంతో సుసంపన్నం చేసారు!
(మళ్ళీ కలుద్దాం)
కొల్లూరి సోమ శంకర్ రచయిత, అనువాదకులు. బి.ఎ.డిగ్రీతో గ్రాడ్యుయేషన్. మానవ వనరుల నిర్వహణలో పిజి డిప్లొమా చేసారు. దక్షిణ భారత హిందీ ప్రచార సభ వారి భాషా ప్రవీణ పాసయ్యారు. ప్రస్తుత నివాసం హైదరాబాదు.
సోమ శంకర్ 2001 నుంచి కథలు రాస్తున్నారు. 2002 నుంచి కథలను అనువదిస్తున్నారు. కేవలం కథలే కాక ‘ది అడ్వెంచర్స్ ఆఫ్ పినోకియో’ అనే పిల్లల నవలను ‘కొంటెబొమ్మ సాహసాలు’ అనే పేరుతోను, ‘మాజిక్ ఇన్ ది మౌంటెన్స్’ అనే పిల్లల నవలను ‘కొండలలో వింతలు’ అనే పేరుతోను, వినయ్ జల్లా ఆంగ్లంలో రాసిన ‘వార్స్ అండ్ వెఫ్ట్’ అనే నవలని ‘నారాయణీయం’ అనే పేరుతోను, వరలొట్టి రంగసామి ఆంగ్లంలో రాసిన ‘లవ్! లవ్! లవ్!’ నవలను ‘సాధించెనే ఓ మనసా!’ పేరుతోనూ, అజిత్ హరిసింఘానీ రచించిన ట్రావెలాగ్ ‘వన్ లైఫ్ టు రైడ్’ను ‘ప్రయాణానికే జీవితం’అనే పేరుతోను, డా. చిత్తర్వు మధు ఆంగ్లంలో రచించిన ‘డార్క్ అవుట్పోస్ట్స్’ అనే స్పేస్ ఒపేరా నవలను ‘భూమి నుంచి ప్లూటో దాకా’ అనే పేరుతోనూ; అమర్త్యసేన్ వ్రాసిన ‘ది ఐడియా ఆఫ్ జస్టిస్’ అనే పుస్తకాన్ని, మరో నాలుగు పుస్తకాలను తెలుగులోనికి అనువదించారు. ‘దేవుడికి సాయం’ అనే కథాసంపుటి, ‘మనీప్లాంట్’, ‘నాన్నా, తొందరగా వచ్చెయ్!!’, ‘ఏడు గంటల వార్తలు’ అనే అనువాద కథా సంపుటాలను ప్రచురించారు.
