[శ్రీ రాకేశ్ ఆనంద్ బక్షి రచించిన ‘నగ్మే, కిస్సే, బాతేఁ, యాదేఁ – ది లైఫ్ అండ్ లిరిక్స్ ఆఫ్ ఆనంద్ బక్షి’ అనే ఆంగ్ల పుస్తకాన్ని అనువదించి పాఠకులకు అందిస్తున్నారు కొల్లూరి సోమ శంకర్.]
ఉపసంహారం
ఆనంద్ బక్షికి అరవై ఎనిమిది సంవత్సరాలు నిండినప్పుడు (1998), వారి స్నేహితుడు, ఇండియన్ ఎక్స్‌ప్రెస్ జర్నలిస్ట్ అలీ పీటర్ జాన్ ఆయనతో సంభాషణ జరిపారు. నిపుణులు, సన్నిహితులుగా వారు జరిపిన ఆ హృదయపూర్వక, సందర్భోచిత సంభాషణ నుండి ఈ క్రింది విషయాలు అందిస్తున్నాను. – రాకేశ్ బక్షి.
***
‘మై వక్త్ కా మురీద్ హూఁ’ – నేను కాలం అడుగులో అడుగు కలుపుతూ సాగుతాను.
ఒకప్పుడు నేనో సాధారణ మనిషిని, ఎప్పటికీ మామూలు మనిషిలానే ఉంటాను, కాల ప్రవాహంలో తేలుతూ, కాలానికి అనుగుణంగా ఉండటానికినా వంతు ప్రయత్నం చేస్తున్నాను. కొన్నిసార్లు నా ఊహలో మాత్రమే, కాలం కన్నా ముందుకు పరిగెత్తడానికి ప్రయత్నిస్తాను. ఊహల్లో కాలానికి ముందుగా పరిగెత్తడం సరదాగా ఉంటుంది. కానీ రాబోయే మూడు ట్రిలియన్ సంవత్సరాలలో ఎంత తెలివైనవాడిగా మారినా, ఏ మనిషి అయినా కాలాన్ని అందుకోవడం సాధ్యం కాదు. మనిషి గతంలో ఎంత పురోగతి సాధించినా, భవిష్యత్తులో సాధించబోయినా – కాలం – ఏ మానవుడు సవాలు చేయలేని అంతుచిక్కని రంగురంగుల పక్షి వంటిది.
నేను కాలం గురించి ఎందుకు మాట్లాడుతున్నాను? సరే, చాలా కారణాలు ఉన్నాయి. వాటిని ఒక్కొక్కటిగా పరిశీలిద్దాం.
ఈ నూతన సంవత్సర దినోత్సవం నాడు, మనిషి రూపొందించిన ‘టైమ్ క్యాలెండర్’ ప్రకారం, ప్రపంచం 1998 సంవత్సరాలుగా సజీవంగా ఉంది. మనందరికీ కాలం గడిచిపోయింది. నా విషయానికొస్తే, కాలం ఎగురుతున్నట్లు నేను చూశాను. నేను చూడగలిగిన దానికంటే వేగంగా. కాలాన్ని అర్థం చేసుకోడానికీ, ఇంకా అది ఎందుకు ఎగురుతుందో అర్థం చేసుకోవడానికి నేను నా వంతు ప్రయత్నం చేశాను. అదెంత వేగంగా ఎగురుతుందంటే – ఏ మనిషి లేదా సూపర్‌మాన్, సూపర్‌సానిక్ జెట్ కూడా దాన్ని అందుకోలేవు. కొన్ని చిన్న, తెలివైన ఆటలు ఆడుతూ దేవతలను కూడా సవాలు చేసే మానసిక స్థితిలో ఉన్న మనిషి సాధించిన గొప్ప పురోగతి కూడా కాలన్ని పట్టి నిలిపి ఉంచడంలో విజయం సాధించలేదు. పట్టుకోవడం సంగతి మర్చిపోండి, అసలు కాలాన్ని పట్టుకోవడం ఎలా ఉంటుందో కూడా అనుభూతి చెందలేం. గొప్ప శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు, వ్యోమగాములు, కాల శక్తిని సవాలు చేయడానికి ధైర్యం చేసే వారిని ప్రయత్నిస్తూనే ఉండనివ్వండి. కానీ నేను ప్రయత్నించడానికి ధైర్యం చేయను.
మన కాలంలో ఎన్ని ట్రిలియన్ సంవత్సరాలు గడిచాయో నాకు తెలియదు, కానీ వాస్తవం ఏమిటంటే చాలా సమయం గడిచిపోయింది. అది ఏ శక్తి కోసం, ఏ చక్రవర్తి కోసం, ఏ సంస్కృతి కోసం, ఏ నాగరికత కోసం ఎప్పుడూ ఆగలేదు.
బహుశా కాలం దేవుని కంటే అంతుచిక్కనిది కావచ్చు. లేదా బహుశా, కాలమే దైవం కావచ్చు. మనం ఒంటరిగా ఉన్నప్పుడు కాలం, దేవుడు మనతో బాగా మాట్లాడతారు.
నేను కూడా కాలం గురించి చాలా ఆలోచిస్తున్నాను ఎందుకంటే నేను (ఎలాగోలా) అరవై ఎనిమిది సంవత్సరాలు జీవించానని ఆశ్చర్యపోతున్నాను! నేను కుటుంబ పరంగా, ఆరోగ్యపరంంగా, వృత్తిపరంగా అన్ని రకాల ఒడిదుడుకులను ఎదుర్కొన్నాను. వీటికి నేనేం మినహాయింపు కాదు; అందరం ఏదో ఒక భారం మోస్తున్నవాళ్ళమే. గత రెండు దశాబ్దాలుగా నాకు కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నాయి, అవి నన్ను ముందుకు పోనీయడం లేదు, నా అత్యుత్తమ రచనా వ్యాసంగాన్ని అందివ్వనీయడం లేదు. నేను ఉండాల్సిన దానికంటే ఎక్కువ కాలం జీవించానని భావిస్తున్నాను. అవును, నిజానికి ఈపాటికే నేను చనిపోయి ఉండాలి. కానీ, కాలం, అవును, ఆ అంతుచిక్కని పక్షి, నా కోసం కూడా ఒక ప్రణాళికను కలిగి ఉందని భావిస్తున్నాను; నిజానికి, కాలం ప్రతి పురుషుడికి, ప్రతి స్త్రీకి ఒక డిజైన్‌ను కలిగి ఉంటుంది. ఎప్పుడూ బహిర్గతం కాని డిజైన్, పైగా ప్రతి ఒక్కరూ మాస్టర్ ఆర్టిస్ట్-టైమ్ ద్వారా వారి కోసం రూపొందించిన వారి స్వంత డిజైన్‌లను విప్పాలి. వక్త్. కాలం యొక్క డిజైన్ల ప్రకారం, ఇప్పుడు అరవై ఎనిమిది సంవత్సరాల వయసులో మాత్రమే, నాకు స్పష్టంగా తెలుస్తుంది, ఆ గొప్ప ‘అంతకు మించి’ వెళ్ళడానికి నాకు ఇంకా కొంత సమయం ఉంది, అక్కడ ఎట్టకేలకు, కాలానికి పట్టింపు లేదు. అది నేను కాలంలో ‘లీనమయ్యే’ ప్రదేశం.
ఒక విషయం నేను ఒప్పుకోవాలి, ఆ కాలం నా పట్ల చాలా దయగా ఉంది. నిజానికి, కాలం దయాళువు. అందుకే నేను ఈ రోజు, అరవై ఎనిమిదేళ్ల వయసులో, కాలం గురించి తాత్వికంగా మాట్లాడుతున్నాను. ‘కాలానికి’ కృతజ్ఞతలు చెప్పడానికి సమయం ఇచ్చినందుకు నేను చాలా కృతజ్ఞుడను. నేనో విషయం ఒప్పుకోవాలి, నాకు బహుమతిగా లభించిన కాలంలో ప్రతి క్షణాన్ని నేను ఆస్వాదించాను – నా కుటుంబంతో, నా శ్రోతలతో గడిపిన సమయం, నాతో కలిసి పనిచేసిన వ్యక్తులతోనూ, నేను పనిచేసిన వ్యక్తులతోనూ గడిపిన సమయం; నా అంతర్లీన స్వీయ వ్యక్తీకరణల ద్వారా నేను ఎప్పుడూ కలవకపోయినా విన్న వ్యక్తులతోనూ, నా ప్రపంచం నుండి, నా స్వంత చిన్న ప్రపంచానికి వెలుపల ఉన్నవారి తోనూ సమయం గొప్పగా గడిపాను. నాకు ఎన్నెన్నో ఆశీర్వాదాలు లభించాయి, బహుమతులు అందాయి. కాలం యొక్క అందమైన, మార్మికమైన, వివేకవంతమైన డిజైన్లు, ఇంకా ప్రణాళికల ప్రకారం సమయం వచ్చినప్పుడు కాలం నన్ను తీసికెళ్ళిపోయినా నేనేం చింతించను.
ఒక్క క్షణం ఆగి, కాలంతో నాకున్న సంబంధం గురించి ఆలోచించండి. నేను యువకుడిగా ఉండగానే కవిత్వంతో ప్రేమలో పడ్డాను. నా కవితలకి ‘బాణీ’లు కట్టి పాడుకునే వాడిని. కవిత్వం నా అభిరుచిగా మారింది, అయినప్పటికీ రాయడం అనేది అప్పటికి నాకు జీవనోపాధిగా మారలేదు. నేను దేశవిభజనకు ముందు రాయల్ ఇండియన్ నేవీలో చేరాను. కరాచీ ఓడరేవులో 1944 నావికా తిరుగుబాటులో పాల్గొంటున్నప్పుడు నన్ను ‘పట్టుకున్న’ దయాళువైన ఇంగ్లీష్ కమాండింగ్ ఆఫీసర్ ఎసి మూర్ జాలిగా నాతో “నువ్వింకా పిల్లాడివి, జైలుకు వెళ్లడానికి చాలా చిన్నవాడివి, నేను నిన్ను జైలులో పెడితే, నీ జీవితం శాశ్వతంగా నాశనం అవుతుంది. కాబట్టి బ్రిటిష్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా నీ సహచరులతో కలిసి ప్రవర్తించావనే ఆరోపణపై నిన్ను అరెస్టు చేయకుండానే నేను నిన్ను సర్వీసు నుండి తొలగిస్తాను.” అని అన్నారు.
దేశవిభజన తర్వాత, నేను భారత సైన్యంలో చేరాను. అప్పట్లో మేము శరణార్థులుగా జీవిస్తున్నాము, నా కుటుంబం ఢిల్లీలో, లక్నోలో చెల్లాచెదురుగా ఉంది. నేను సైన్యంలో ఓ సాధారణ సిపాయిగా చేరాను. నేను అక్కడ ఉన్నప్పుడు శత్రువుల బుల్లెట్ దెబ్బ తిని ఉండేవాడిని అని దేవుడికి తెలుసు, ఎందుకంటే తరువాత నాకు పదాతిదళ విభాగంలో పోస్టింగ్ లభించింది, కానీ బుల్లెట్ గాయం లాంటిదేమీ జరగలేదు. నా కోసం, నా తరఫున సొంత నిర్ణయాలు తీసుకోడానికి నేను కాలాన్ని అనుమతించాను.
కాలం నా కోసం ఓ నిర్ణయం తీసుకుంది. నేను సైనిక వృత్తిని వదిలి ముంబైకి వచ్చాను, అక్కడ సినిమా పరిశ్రమ కారణంగా కవిత్వం మనుగడ సాగించే అవకాశం ఉందని నాకెవరో చెప్పారు. కవిత్వం మనుగడ సాగిస్తే, సహజంగానే కవి కూడా సాగిస్తాడు. నేనెప్పుడూ నన్ను గొప్ప కవిగా, సినిమాల పాటల రచయితగా భావించలేదు, కానీ నేను కాగితంపై నింపిన నా హృదయ స్పందనలను నా స్నేహితులు కవిత్వం అని పిలిచారు, శ్రేయోభిలాషులు నేను కూడా కవిని అని చెప్పారు. నేను వాటిని నమ్మడానికి ఇష్టపడలేదు. నేను నా కవితలను అమ్మడానికి ప్రయత్నించాను, అభిమానులను, ప్రోత్సాహాన్ని, ఇంకా కవితల కొనుగోలుదారులను కనుగొనడానికి ప్రయత్నించాను, తద్వారా నేను నన్ను, నా కుటుంబాన్ని పోషించుకోగలిగాను. దేశవిభజన సమయంలో, మేము ఒక రాజభవనం లాంటి ఇంటిని వదిలి రాత్రికి రాత్రే శరణార్థులమయ్యాము. ఆహారం అందించి, ఆశ్రయం కల్పించవలసిన ఒక పెద్ద ఉమ్మడి కుటుంబం ఉంది మాకు.
నేను 1947 నుండి 1956 వరకు భారత సైన్యంలో ఉండగా – ఎవరైనా తమ మాటలతో, తమ ఆలోచనలతో, తమ అంతరంగిక భావాలతో జీవనోపాధి పొందగలరని నేనెప్పుడూ అనుకోలేదు. బొంబాయి, ముఖ్యంగా సినీ పరిశ్రమ, 60ల చివరి నాటికి నా పాటల రచనకు లేదా కవిత్వానికి చాలా మంచి అవకాశంగా నిలిచిందని నాకర్థమైంది. నేను మీర్జా గాలిబ్ లేదా మీర్ లేదా సాహిర్ లుధియాన్వి లేదా రాజేంద్ర కృష్ణన్‌ను కాదని నాకు తెలుసు, కానీ నాకు కొంతమంది స్నేహితులు ఉన్నారు, నా గురువు కవి బిస్మిల్ సయీది, నా టికెట్ కలెక్టర్ స్నేహితుడు ఉస్తాద్ చితర్ మాల్ స్వరూప్, సైన్యంలో నా సహచరులు, ఇంకా సీనియర్లు – వీళ్ళంతా ఓ పూర్తిస్థాయి గీత రచయితకు కావలసిన అన్ని లక్షణాలు నాలో ఉన్నాయని నాకు చెప్పారు. రచయితలు, దర్శకులు, నిర్మాతలు, కొన్నిసార్లు నిరక్షరాస్యులైన ఫైనాన్షియర్లు, పంపిణీదారులు సృష్టించిన పరిస్థితులకు అనుగుణంగా సినిమాలకు పాటలు రాసే ఒక కవి నాకు తెలుసు, వాళ్ళకి కవిత్వం అనే పిచ్చి ఏమిటో తెలియదు కానీ ఎప్పుడూ ‘ఫిల్మ్ మే కుచ్ అచ్చా గానా వానా హో జానా చాహియే, నహీఁ తో క్యా మజా హై ఫిల్మ్ బనానే మే’ (ఒక సినిమాలో కొన్ని మంచి పాటలు ఉండాలి, లేకపోతే సినిమా తీయడంలో సరదా ఏముంది) అని అంటారు. వీళ్ళకీ, సాధారణ ప్రజలకు పాటలు చాలా ముఖ్యమైనవి. చిన్నప్పుటి నుంచే నాకు కూడా పాటలు ఎంతో ముఖ్యమైనవి. నేను చిన్నప్పటి నుంచీ కాలం నాకు పాటలను అందించిది. మా అమ్మ మిత్రా (సుమిత్ర) నాకోసం పాటలు పాడటం నాకు గుర్తుంది. ఆమె నాకు ఐదేళ్ళప్పుడో ఆరేళ్ళప్పుడో చనిపోయింది, కానీ ఆమె పాటలు ఎల్లప్పుడూ నాతోనే ఉన్నాయి. నేను రాసిన తల్లి-బిడ్డ పాటలు ఆమె జ్ఞాపకాల నుండే వచ్చాయి.
నా జీవితంలోనే అతిపెద్ద సినిమా దొరికినప్పుడు కాలం నా పట్ల చాలా దయగా ఉంది. బాక్సాఫీస్ వద్ద విజయవంతం కాకపోయినా, అది నా తొలి సినిమా: భలా ఆద్మీ, స్టార్ యాక్టర్ భగవాన్ దాదా రూపొందించిన ‘భలా ఆద్మీ’. నాకు మరో సినిమా ‘జబ్ జబ్ ఫూల్ ఖిలే’ లో అన్ని పాటలు రాసే అవకాశం వచ్చినప్పుడు, కాలం మరోసారి నా మీద చాలా దయ చూపించింది. భారతదేశం అంతటా మా పాటల విజయవంతమై, రాత్రికి రాత్రి ‘ఆనంద్ బక్షి ఏక్ బిక్నే వాలీ చీజ్’ (అమ్ముడుపోయే, అంటే డిమాండ్ ఉన్న వస్తువు) గా చేసింది! అయితే, అమ్మకానికి వచ్చినవి నా పాటలు మాత్రమే, నేను కాదు. ఈ వైఖరి నాకు గౌరవాన్ని కూడా తెచ్చిపెట్టిందని నేను భావిస్తున్నాను. ‘జబ్ జబ్ ఫూల్ ఖిలే’ నా కలల సరికొత్త ప్రపంచానికి ముత్యాల ద్వారాలను తెరిచింది. మొదటిసారిగా నేను నా ప్రధాన లక్ష్యం.. నా కుటుంబానికి అన్నీ అమర్చడం.. సాధించుకున్నాను. అంతకు ముందు, నా జేబుల్లో డబ్బు లేకుండా, ఒక దశాబ్దానికి పైగా సినీరంగంలో ప్రవేశించాలనే అభిరుచితో చేసిన ప్రయత్నాల పట్ల నిరాశ చెందానని భావించాను. త్వరలోనే, ముఖ్యంగా ‘మిలన్’ తర్వాత ఎక్కువ మంది నిర్మాతలు, దర్శకులు నా దగ్గరకు వచ్చారు; మిలన్ నే మేరీ తక్దీర్ కే దర్వాజే ఖోల్ దియే (మిలన్ నా అదృష్టపు తలుపులు తెరిచింది).
తర్వాతి రోజుల్లో, ఐదు సంవత్సరాల కన్నా తక్కువ వ్యవధిలో – ఫర్జ్, ఆరాధన, దో రాస్తే సినిమాలు వరుసగా సూపర్ హిట్ అయ్యాయి. అప్పటి నుండి నాకు చక్కని అవకాశాలొచ్చాయి, డబ్బుకు లోటు లేకపోయింది, ఇదంతా దేవుని దయ వల్ల మాత్రమే. కాబట్టి, కాలం నా పట్ల చాలా దయతో ఉంది. నేటికీ, అరవై ఎనిమిది సంవత్సరాల వయసులో, నేను పరిశ్రమలోని అగ్రశ్రేణి దర్శకులు, నిర్మాతలు, నటుల కోసం టీనేజర్ల కోసం రొమాంటిక్ పాటలు రాస్తున్నాను. నెలకి 75 రూపాయలు సంపాదించే ఒక మెట్రిక్యులేట్ సైనికుడి నుండి, ఇల్లు లేని శరణార్థి నయ్యాను, మూడేళ్ళ పాటు రైల్వే స్టేషన్ వెయిటింగ్ రూమ్‌లలో నివసించిన వ్యక్తిగా ఉన్న నేను, ప్రస్తుతం రెండు ఇళ్ళు ఉన్న వ్యక్తినయ్యానంటే, అందుకు నేను కాలానికి ఋణపడి ఉంటాను. ఇప్పుడు నిర్మాతలు దర్శకులు – అన్ని సినిమాలకు, పెద్దవి, చిన్నవి, సోషల్, థ్రిల్లర్స్, ఏ శైలి వైనా, అన్ని వయసుల వారికి, అన్ని మతాల వారికి నేను పాటలు రాయాలని కోరుకుంటున్నారు.
నేనిది చేయగలనని వాళ్ళు భావిస్తున్నారు, అందుకే నేను దానికి కట్టుబడి ఉన్నాను. నాకింకేం కావాలి? మరిన్ని పాటలు రాయడానికి నేను మరొక అవకాశం కోసం చూస్తున్నాను. విజయం నా ప్రయత్నాల తర్వాతే వచ్చింది. నేను విజయం కోసం పని చేయలేదు. నా కుటుంబాన్ని – ముఖ్యంగా నా మొదటి సంతానం, నా కూతురు, పప్పీ; నా రెండవ సంతానం, కుమారుడు గోగి కోసం; ఇంకా నా పునాది కమల కోసం పనిచేశాను.
అప్పట్లో కూడా, నేను ఏ సందర్భానికైనా పాటలు రాయగలనని నాకు తెలుసు. కానీ నా ఆత్మవిశ్వాసం ఇతరులకు చూపించడానికే ఉండేది. నా అంతరంగంలో, ఏదైనా పాట రాసే ముందు నేను రహస్యంగా భయపడేవాడిని. నేను ఎవరికీ చెప్పలేదు. నా టీనేజ్ నుండి నేను నిస్సహాయతతో బాధపడ్డాను. 60ల చివరలో నేను విజయం సాధించిన తర్వాత కూడా ఏదో భయం ఉండేది. నేను గీత రచయితగా మరింత విజయవంతమయ్యాను, ప్రజాదరణ పొందుతూనే ఉన్నాను. అయితే జనాలు నన్ను సుడిగాడు అని అన్నందుకు బాధపడ్డాను, కానీ నేను వారికి వ్యతిరేకంగా ఎప్పుడూ మాట్లాడలేదు. నేను ఎప్పుడూ భావించేది చెప్పాను – నేను కవిని కాదు, నేను కేవలం పాటల రచయితని. మరియు నా ప్రతిభను లేదా విజయాన్ని నేను ఎప్పటికీ ప్రదర్శించకూడదని నేను గట్టిగా నిర్ణయించుకున్నాను, ఎందుకంటే దేవుడు, కాలం నాకు ఇచ్చిన బహుమతిని దుర్వినియోగం చేసిన రోజున, నేను ఎక్కడా ఉండను, నేను అంతమైపోతానని నాలో ఏదో భావన నాకు చెప్పింది! దీవెన లేదా బహుమతిని ఎప్పుడూ దుర్వినియోగం చేయవద్దు. వినయంగా ఉండండి, ‘క్యూంకి, హమ్నే దేఖే హై బడే బడే, గిర్ జాతే హైన్ ఖడే ఖడే.’(ఎంతో మంది గొప్ప గొప్ప వాళ్ళు శిఖరంనుండి క్రిందకు జారి పతనమవటం చూశాను) అత్యంత బలీయమైన మరియు ప్రతిభావంతులైన వ్యక్తులు తమ పని పట్ల, వారి విజయం పట్ల అనుచితమైన వైఖరి కారణంగా రాత్రికి రాత్రే పతనమవుతారని నేను చదివాను, కళ్ళారా చూశాను కూడా. ఎందుకంటే వారు తమని ఈ స్థాయికి తీసుకొచ్చిన కాలాన్ని గౌరవించలేదు.
నేను విజయం సాధించిన వెంటనే, ముఖ్యంగా కాలం నా పట్ల చాలా దయతో ఉందని గ్రహించాను. విజయం కూడా నా పట్ల దయతో ఉంది. నేను పాఠశాల విద్యార్థిగా ఉన్నప్పుడు, తరువాత నేవీ క్యాడెట్‌గా, ఆ తరువాత సైనికుడిగా ఉన్నప్పుడు విన్న స్వరకర్తలు, నటులు, నిర్మాతలు, గాయకులు, సంగీత దర్శకులందరికీ నేను పాటలు రాస్తున్నాను. నాది సైన్యంలో చాలా తక్కువ ర్యాంక్. నా మెట్రిక్యులేషన్ అర్హతతో నేను సైన్యం నుండి పదవీ విరమణ చేస్తే, నేను బహుశా సుబేదార్‌గా రిటైర్ ఉండేవాడిని. కానీ నాకు అవకాశాలు వరదలా వచ్చాయి, నేను వాటిలో దేనినీ వదులుకోలేదు. నేను చేసే పనిలో రాబడి ఉందని నాకు తెలుసు కానీ డబ్బు కంటే ముఖ్యమైనది ఏదో ఉందని కూడా తెలుసు – నన్ను గీత రచయితగా గంభీరంగా పరిగణించాలని కోరుకున్నాను; నన్ను ‘పదాలముక్కలతో పాటలల్లేవాడు’ అని పిలవాలని కోరుకోలేదు. నా పాటలోని మాటలు ఎంతో సరళంగా ఉండాలని, ప్రతి పురుషుడు, స్త్రీ, ఇంకా పిల్లల హృదయాన్ని తాకాలని కోరుకున్నాను. దేవుని దయ, కాలం సహకారం ద్వారా, నా కలం, నేను విజయం సాధించాం. నాతో కలిసి పనిచేసినందుకు చాలా మంది దర్శకులకు, స్వరకర్తలకు, గాయకులకు, కథా రచయితలకు, అదృష్టానికి, కాలానికి నా ధన్యవాదాలు.
60ల చివర్లో, 70ల, 80ల, 90ల కాలంలో మరికొంతమందితో పాటు నేను కూడా అగ్రస్థానంలో ఉన్నాను. నేను 90ల దశకం చెప్పానా? అవును, నేను 90లకు చేరుకున్నాను, కానీ ఎలాగో నాకు తెలియదు. దిల్‌వాలే దుల్హనియా లే జాయేంగే, దిల్ తో పాగల్ హై.. అన్నీ చాలా పెద్ద సినిమాలు! గొప్ప సంగీత విజయాలు. నేను మొదటిసారి నా కలంతో, డైరీతో ఇక్కడికి వచ్చినప్పటి నుండి మంచి గీత రచయితలు రాస్తున్నప్పుడు చాలా పోటీ ఉంది. నాకంటే చాలా మంచి గీత రచయితలు ఉన్నారు. గీత రచయితలుగా ఉండటానికి ప్రయత్నించిన చాలా మంది మంచి కవులు ఉన్నారు, కొందరు డబ్బు కారణంగా మాత్రమే, అది తప్పనిసరి. నా కుటుంబ భద్రత కోసం నాకు డబ్బు అవసరం. వారు రచయితలుగా నాకంటే చాలా పెద్దవారు కావడానికి అర్హులు. కానీ వారు అలా ఎందుకు కాలేకపోయారో? బహుశా అదృష్టం, కాలం, రెండూ వారికి వ్యతిరేకంగా ఉండటం వల్ల కావచ్చు.
నేడు మంచి కవిత్వం కంటే ఎక్కువ డబ్బు సంపాదిస్తున్న యువ రచయితలు కూడా చాలా మంది ఉన్నారు. నేను ఉద్దేశపూర్వకంగానే ఆ ప్రకటన చేశాను ఎందుకంటే ఇది నిజంగానే గీత రచయితల యుగం. చాలా పాటలు ఉన్నాయి, అన్ని రకాల పాటలు, సినిమాలు తయారవుతున్నాయి. ఈ పాటలకి గీత రచయితలుంటారు, అన్ని రకాల గీత రచయితలు ఉన్నారు. సినిమా పాటలు రాసే వ్యక్తి, అది కవిత్వం అయినా కాకపోయినా, భారతదేశం అంతటా ప్రజలను ఆకర్షించే పాటలు రాయాలి, పాటలలోని పదాల అర్థాలను నిఘంటువులలో చూడటానికి వారికి సమయం లేదు. మీరు సినిమా పాటల రచయిత అయితే సాధారణ పదాలను ఉపయోగించి రాయండి, చాలా మంది జనాలు తమ రోజువారీ సంభాషణలలో సాధారణంగా ఉపయోగించని పదాలు కథకు నిజంగా అవసరమైతే తప్ప, అలాంటి పదాలను వాడకండి.
నేను, ఆనంద్ ప్రకాష్ బక్షి, నంద్, అన్ని రకాల పాటలు రాశాను. నేను ఎప్పుడూ చెప్పేటట్లుగా, ఒక గీత రచయిత స్క్రీన్ ప్లే కోరుకునే ఏ క్షణానికైనా పాట రాయగలగాలి. అయితే, నేను మనిషిలో మౌలికంగా ఉండే వికృత సహజాతాలకు, కుటుంబమంతా కూర్చుని చర్చించలేని ప్రవృత్తులకు అనుగుణంగా రాయలేదు. ఎప్పుడూ కూడా. నేను కొంటె పాటలు, అల్లరి పాటలు రాశాను కానీ అరవై ఎనిమిదవ ఏట నేను – నా కుటుంబ సభ్యులు వినలేని పాటలు రాయడానికి సిద్ధమవుతానని అనుకోను. నా సొంత పిల్లలే నా కొలమానం.
నాకన్నా చాలా చిన్నవాళ్ళు ఆదిత్య చోప్రా లేదా తనూజ చంద్ర నా దగ్గరికి వచ్చి తమ సినిమాలకు పాటలు రాయమని అడిగినప్పుడు నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. నాకు వాళ్ళ గురించి తెలియదు. వాళ్ళ మనసు ఎలా పనిచేస్తుందో, ఎలాంటి సినిమాలు ప్లాన్ చేస్తున్నారో నాకు తెలియదు, కానీ ఈ కొత్త సినిమా నిర్మాతలలో ఏదో ఉంది. వాళ్ళు ఏమి కోరుకుంటున్నారో చాలా స్పష్టంగా ఉంటారు, నాలాంటి సీనియర్ రచయిత నుండి వాళ్ళు ఏమి కోరుకుంటున్నారో వారు చూసుకుంటారు. వాళ్ళు ఆనంద్ బక్షి అనే పేరును గౌరవిస్తారు, కానీ పని విషయానికి వస్తే, ఆనంద్ బక్షి తన అత్యుత్తమ ప్రతిభతో ముందుకు రావాలని కోరుకుంటారు, పైగా ఈ వృత్తిలో వయస్సు పట్టింపు లేదు. ప్రతిభ, క్రమశిక్షణ, సమయపాలన, కృషి, హృదయ స్వచ్ఛత ముఖ్యం. వాళ్ళు మార్పులను సూచిస్తారు, నేను మార్పులు చేయాలి ఎందుకంటే ఇది వాళ్ళ తరం. మనం ‘పెద్ద’ రచయితలు వాళ్ళ మాట వినాలి, లేకపోతే ఎవరూ మన మాట వినరు. సింపుల్. వక్త్ కే సాథ్ చల్నా జరూరీ హై. ఇస్ లియే, మై వక్త్ కా మురీద్ హూఁ. నేను సైన్యం నుండి వచ్చేసినప్పటి నుండి ఇప్పటివరకు – కాలం – దేనిని మా ఇంటికి తీసుకొచ్చినా, నేను ఎల్లప్పుడూ గౌరవించాను.
మహానుభావుడు సాహిర్ లుధియాన్వి, గొప్ప స్క్రిప్ట్ రచయితలు సలీం-జావేద్ లకు నేను ఎల్లప్పుడూ కృతజ్ఞుడను. సాహిర్ సాబ్ ఎల్లప్పుడూ సంగీత దర్శకుడు వసూలు చేసిన దానికంటే ఒక రూపాయి ఎక్కువగా తీసుకుంటానని చెప్పేవారు. ఆయన మాకు ఆత్మగౌరవాన్ని నేర్పించారు, రచయితలు మనం సినిమాకు చేసిన కృషికి గర్వపడాలి, మనం బృందంగా పనిచేసే వారి కంటే మనల్ని మనం తక్కువ భావించకూడదు. సలీం-జావేద్ లాంటి రచయితలు మనకు, అలాగే దర్శకులకు, గొప్ప, స్ఫూర్తిదాయకమైన స్క్రీన్‌ప్లేలను ఇవ్వడం ద్వారా – గీత రచయితలను కవులను స్టార్‌లుగా మార్చారు కాబట్టి నేను వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. వారు తమ ప్రయత్నాలు, విజయం మరియు వైఖరి పట్ల వారి హక్కుతో గర్విస్తారు, మీ పని బాగుంటే, మీరు మీకు రావల్సిన పారితోషికాన్ని గట్టిగా అడగవచ్చు. మీరు మీ కోసం, మీ నైపుణ్యం, ప్రతిభల కోసం నిలబడితే, నిర్మాతలు, ప్రపంచం దానిని మీకు ఇస్తారు.
ఒక సర్వే ప్రకారం, నేను ముప్పై సంవత్సరాలలో దాదాపు 4000 పాటలు రాశాను. నాకు ఖచ్చితంగా తెలియదు. కానీ నేను ఇప్పటికీ రాస్తున్నందుకు నేను ధన్యుడిగా భావిస్తున్నాను! వాటిలో చాలా వరకు యువత కోసం పాటలు.
అయితే, కాలం కోరుకునే వరకు మాత్రమే నేను వ్రాస్తాను. కాలానిది, నాది జన్మజన్మల బంధం. నేను కాలానికి స్నేహితుడిని. నేను ఈ లోకం నుండి మరో లోకానికి వెళ్ళే వరకు, కాలంతోనూ, మీతోను ఉంటాను. అక్కడ, నేను యక్షిణుల కోసం పాటలు వ్రాస్తాను, నేను ఖచ్చితంగా వాటిని వ్రాస్తాను. ఎందుకంటే, పాటలు రాయడం పుట్టుక నుండి నా విధి. మానవులకు కాకపోయినా, కనీసం యక్షిణులకు, దేవదూతలకు రాస్తాను, నా విధి, నా కర్మ, కాలం నాకు అవకాశం ఇస్తే, అది నన్ను ఈ లోకాన్ని దాటించి తీసుకువెళుతుంది.
ఆనంద్ ప్రకాష్ బక్షి.
(మళ్ళీ కలుద్దాం)
కొల్లూరి సోమ శంకర్ రచయిత, అనువాదకులు. బి.ఎ.డిగ్రీతో గ్రాడ్యుయేషన్. మానవ వనరుల నిర్వహణలో పిజి డిప్లొమా చేసారు. దక్షిణ భారత హిందీ ప్రచార సభ వారి భాషా ప్రవీణ పాసయ్యారు. ప్రస్తుత నివాసం హైదరాబాదు.
సోమ శంకర్ 2001 నుంచి కథలు రాస్తున్నారు. 2002 నుంచి కథలను అనువదిస్తున్నారు. కేవలం కథలే కాక ‘ది అడ్వెంచర్స్ ఆఫ్ పినోకియో’ అనే పిల్లల నవలను ‘కొంటెబొమ్మ సాహసాలు’ అనే పేరుతోను, ‘మాజిక్ ఇన్ ది మౌంటెన్స్’ అనే పిల్లల నవలను ‘కొండలలో వింతలు’ అనే పేరుతోను, వినయ్ జల్లా ఆంగ్లంలో రాసిన ‘వార్స్ అండ్ వెఫ్ట్’ అనే నవలని ‘నారాయణీయం’ అనే పేరుతోను, వరలొట్టి రంగసామి ఆంగ్లంలో రాసిన ‘లవ్! లవ్! లవ్!’ నవలను ‘సాధించెనే ఓ మనసా!’ పేరుతోనూ, అజిత్ హరిసింఘానీ రచించిన ట్రావెలాగ్ ‘వన్ లైఫ్ టు రైడ్’ను ‘ప్రయాణానికే జీవితం’అనే పేరుతోను, డా. చిత్తర్వు మధు ఆంగ్లంలో రచించిన ‘డార్క్ అవుట్పోస్ట్స్’ అనే స్పేస్ ఒపేరా నవలను ‘భూమి నుంచి ప్లూటో దాకా’ అనే పేరుతోనూ; అమర్త్యసేన్ వ్రాసిన ‘ది ఐడియా ఆఫ్ జస్టిస్’ అనే పుస్తకాన్ని, మరో నాలుగు పుస్తకాలను తెలుగులోనికి అనువదించారు. ‘దేవుడికి సాయం’ అనే కథాసంపుటి, ‘మనీప్లాంట్’, ‘నాన్నా, తొందరగా వచ్చెయ్!!’, ‘ఏడు గంటల వార్తలు’ అనే అనువాద కథా సంపుటాలను ప్రచురించారు.
