[శ్రీ రాకేశ్ ఆనంద్ బక్షి రచించిన ‘నగ్మే, కిస్సే, బాతేఁ, యాదేఁ – ది లైఫ్ అండ్ లిరిక్స్ ఆఫ్ ఆనంద్ బక్షి’ అనే ఆంగ్ల పుస్తకాన్ని అనువదించి పాఠకులకు అందిస్తున్నారు కొల్లూరి సోమ శంకర్.]
అధ్యాయం 11 – నివాళులు – మూడవ భాగం
ఏ.ఆర్. రెహమాన్
సరళమైన విషయాలు చాలా ఆకర్షణీయంగా ఉంటాయి, మన ఇంద్రియాలను వెంటనే ఆకట్టుకుంటాయి. ఎందుకంటే గందరగోళం, శబ్దాలు నిండి ఉన్న ప్రపంచంలో, సరళమైన విషయాలు బయటకు వచ్చినప్పుడు అవి వెంటనే తమ ప్రభావాన్ని ప్రదర్శిస్తాయి. బక్షిజీ అటువంటి సరళతకు రారాజు అని నేను ఆయనతో పనిచేస్తున్నప్పుడు గ్రహించాను. ఆయన చాలా లోతైన మనిషి, అయినప్పటికీ ఆయన సాహిత్యం ఎంతో సరళంగా ఉండేది! నా ఉద్దేశంలో అది మేధావుల స్వభావంలోని ఒక అంశం! ఎందుకంటే ఒక మేధావి మాత్రమే అన్ని మానవ సంక్లిష్టతలను తనలో ఉంచుకోగలడు; అత్యంత సరళమైన, మనోహరమైన, అతి సులభమైన వ్యక్తీకరణను బహిర్గతం చేయగలడు.
ఇందుకు ఉదాహరణలు తాళ్ (1999) లోని – ‘కరియే నా, కోయి వాదా కిస్సీ సే కరియే నా, కరియే తో వాదా ఫిర్ తోడియే నా’; ‘నహీఁ సామ్నే యే అలగ్ బాత్ హై, మేరే పాస్ హై తు మేరే పాస్ హై’ అనే మా పాటలు. ‘కరియే నా’ పాట ఆండ్రూ లాయిడ్ వెబ్బర్ వారి థియేటర్ ప్రొడక్షన్ కోసం తీసుకున్నాం; అది నాకు కూడా ఇష్టమైన పాట.
బక్షిజీకి మంచి సంగీత పరిజ్ఞానం ఉంది, ఆయన గొంతు కూడా బావుంటుంది, అందుకని సిట్టింగ్స్‌లో తాను రాసిన పాటలను తన సొంత బాణీలో పాడటం మొదలుపెట్టేవారు! పైగా, ఆయన స్వరం వినడానికి బాగుంటుంది. కాబట్టి, నేను ఆయనతో కలిసి పనిచేయడంలో కొంచెం టెన్షన్ పడేవాడిని. ఆయన సాహిత్యానికి బాణీలు కట్టడం ఆలస్యం చేస్తే, నా బాణీ కన్నా మెరుగైన ట్యూన్‍లో ఆయన పాడవచ్చు, నా దర్శకుడు సుభాష్ జీ దానిని ఆమోదించవచ్చు. మరి; స్వరకర్తగా అక్కడ నా పనేం ఉంటుంది? సంగీత దర్శకులు హిట్స్ అందించాలని భావిస్తారు. గీత రచయితకు ఆకర్షణీయమైన, ఆసక్తికరమైన పల్లవి రాయగల సామర్థ్యం ఉంటే అది మాకు సహాయపడుతుంది. బక్షి సాబ్‌తో అదెప్పుడూ సమస్య కాలేదు. ఆయన రాసిన ప్రతిదీ చాలా సరళంగా, ఆకర్షణీయంగా ఉండేది; స్వర సంబంధంగా ఆసక్తిగా ఉండేది. నిజాయితీగా చెప్పాలంటే, నేను పెద్దగా కష్టపడాల్సిన అవసరం ఉండేది కాదు. ‘చోళీ కే పీఛే’ పాటను ఉదాహరణగా తీసుకుంటే, ఆ పాట సాహిత్యం అర్థం తెలియకపోయినా, దాని ధ్వని అత్యంత శ్రావ్యంగా, ఆకర్షణీయంగా ఉంటుంది! ‘తాళ్ సే తాళ్ మిలా’ పాట ప్రాస కూడా అంతే. ఆయన లాంటి వ్యక్తులు తమ పనికి, శ్రోతలకు తమను తాము అంతగా సమర్పించుకోగలగడం భగవంతుని ఆశీర్వాదమే.
మిలన్ లుథ్రియా
మీ జీవితంలోని ప్రధాన నిర్ణయాలు మిమ్మల్ని నిలబెట్టవచ్చు లేదా నాశనం చేయవచ్చు. కానీ ఆ నిర్ణయాలు తీసుకునే ముందు ఎక్కువగా ఆలోచించకండి; ఆ నిర్ణయాల ఫలితం మీ చేతుల్లో ఉండదు కాబట్టి వెంటనే తీసుకోండి. అయితే, చిన్న నిర్ణయాల కోసం.. ఈ రోజు నేను షేవ్ చేసుకోవాలా వద్దా, ఈ రాత్రి భోజనంలో ఏం తినాలి.. ఇటువంటివి.. వీటి కోసం ఒక రోజు లేదా వారం సమయం తీసుకున్నా నష్టం లేదు, ఎందుకంటే అలాంటి నిర్ణయం తీసుకోవడం వల్ల కలిగే ఫలితాలు మీ జీవితాన్ని ఏ రకంగానూ గొప్పగా ప్రభావితం చేయవు.
నేను ‘కచ్చే ధాగే’ తీస్తున్నప్పుడు, మొదటి పాట సిట్టింగ్‌లోనే, ‘ఖాలీ దిల్ నయీ జాన్ భీ యే మంగ్దా, ఇష్క్ దీ గలీ విచ్ కోయి కోయి లంగ్డా’ అని బక్షీజీ పల్లవి రాశారు. పల్లవిలో పంజాబీ పదాలను ఉపయోగించడానికి ఎవరో అభ్యంతరం చెప్పారు. దర్శకుడినైన నేను అతనితో ఏకీభవించనప్పటికీ హిందీలో రాయమని బక్షిజీని అభ్యర్థించాను.
బక్షిజీ నిర్మాతకు వివరించడానికి ప్రయత్నించారు, కానీ అతను వెనక్కి తగ్గలేదు. దాంతో బక్షిజీ నన్ను ఆ గది నుండి బయటకు రమ్మని పిలిచారు; ఆయన ఏకాంతంగా నాతో ఏదో చెప్పాలనుకున్నారు. బయటకి వచ్చాకా, బక్షిజీ నాతో అన్న మాటలు నేనెప్పటికీ మర్చిపోలేను. “నీ జీవితంలో నీకు రెండు ఎంపికలు ఉన్న సమయం ఇది. నువ్వు బానిసగా ఉండి, నీ నమ్మకాలకు వ్యతిరేకంగా జనాలు చెప్పేది వినాలి, లేదా నువ్వు దృఢ నిశ్చయంతో ఉండి దర్శకుడిగా మారాలి. బానిస లేదా ఫిల్మ్-మేకర్, ఈరోజు నువ్వు ఆ నిర్ణయం తీసుకోవాలి.” అన్నారు. మేమిద్దరం లోపలికి వెళ్ళాం, పాట పల్లవిలో ఆ పంజాబీ పదాలు ఉంచాలని నేను పట్టుబట్టాను. ఆ రోజు నేను ఓ ఫిల్మ్-మేకర్‍ని అయ్యాను. ఆ పాట హిట్ అయింది, శ్రోతలకు సులభంగా అర్థమయింది.
తనుజ చంద్ర
బక్షి సాబ్ పరిచయమైనప్పుడు ఒక నిశ్శబ్ద వ్యక్తిగా అనిపించారు. తన స్నేహితులతో, కుటుంబ సభ్యులతో మాట్లాడేవారని ఖచ్చితంగా అనుకుంటున్నాను. కానీ, ఉదాహరణకు, ‘బక్షి సాబ్, ఆప్ అప్నే బారే మే కుచ్ బతాయియే’ అని అడిగితే, ఆయన ఎన్నో సంఘటనలతో కూడిన, వైవిధ్యమైన జీవితాన్ని గడిపినప్పటికీ, ‘బతానే కే లియే క్యా హై?’ అని అనేవారు. అయితే, పాటల రచయితగా ఆయన సిగ్గుపడలేదు. ఆయన సాహిత్యం ఆయన ఆలోచనలను, వారి ప్రాపంచిక దృక్పథాన్ని, హృదయ విశాలతను స్పష్టంగా వివరించింది. ఆయన పాటలు ఆయన గురించి చాలా చెప్పాయి.
నేను ‘దుష్మన్’ కథను ఆయనకి చెప్పినప్పుడు, అతను మౌనంగా వింటూ, ఇది పాటలు రాయడం చాలా కష్టమైన సినిమా అని, దాని గురించి ఆలోచించడానికి తనకి రెండు రోజులు పడుతుందని మాత్రమే చెప్పారు. మొదటిసారిగా దర్శకత్వం వహిస్తున్నందున కాస్త అభద్రతతో, ఆయనకి కథ నచ్చలేదని నేను అనుకున్నాను, పరోక్షంగా ప్రాజెక్ట్‌ను తిరస్కరించారని భావించాను. ఆయన లాంటి దిగ్గజ గీత రచయితకి ఏ కథకైనా సాహిత్యం రాయడం ఎందుకు కష్టమనిపిస్తుంది అని అని నేను అనుకున్నాను. ఆయనకి బహుశా ఆత్మవిశ్వాసం లోపించి ఉండవచ్చు, కాబట్టి మర్యాదగా రాయనని చెప్పడానికి ప్రయత్నిస్తున్నారేమో. నేను నిరాశకు గురయ్యాను. మరుసటి రోజు ఆయన నాకు ఫోన్ చేసి నన్ను రమ్మని పిలిచారు. మేము కలుసుకున్నప్పుడు, ఆయన ‘చిట్టీ నా కోయి సందేశ్. జానే వో కౌన్ సా దేశ్, జహాఁ తుమ్ చలే గయే!’ అనే పల్లవి పాడి వినిపించారు. ‘ఆమె సోదరి చనిపోయినప్పుడు ఈ పాట వస్తుంది. ఇప్పుడు నేను మీ చిత్రానికి న్యాయం చేయగలనని భావిస్తున్నాను. నేను మీ చిత్రానికి పాటలు రాస్తాను’ అని అన్నారు.
గుల్జార్
బక్షి సాహబ్ గురించి, ఒక విషయం ఏమిటంటే, ఆ కాలంలో రేడియోలో హిందీ పాటలు విన్న వ్యక్తికి ఆనంద్ బక్షి గురించి తెలియకపోతే, అతనికి హిందీ సినిమా గురించి పరిచయం లేదని నేను భావిస్తాను. ఆయన మన హిందీ సినిమా పాటలలో చాలా ముఖ్యమైన పేరు, ఆయనని విస్మరించకూడదు. అందువల్ల, బక్షి సాబ్ అనేది హిందీ సినిమా సంగీతపు పూర్తి యుగం. మీరు చాలా కాలం వెనక్కి వెళితే, రచయితలు డిఎన్ మధోక్ లేదా కేదార్ శర్మ పేర్లు వస్తాయి; కానీ ఈ మునుపటి కాలం, 20వ శతాబ్దం చివరి నాటికి, ఆనంద్ బక్షి వచ్చినప్పటి నుండి, 1960లలో, శతాబ్దం చివరి వరకు, ఆనంద్ బక్షి మాత్రమే ఉన్నారు. రేడియోలో వివిధ భారతి కార్యక్రమంలో ఆనంద్ బక్షి లేదా లతా మంగేష్కర్ ప్రస్తావన వినకుండా ఉండటం అసాధ్యం. ఈ ఇద్దరూ హిందీ సినిమా పాటల మైలురాళ్ళు, మైలురాళ్లతో ముడిపడి ఉన్న దిగ్గజాలు, ఇంతకుమించి ఆనంద్ బక్షి గురించి ఇంకేం చెప్పగలం?
బక్షిజీ ఒక కవి. ఆయన ఉత్సాసంగా, ఉల్లాసమైన హృదయంతో ఉండేవారు. మన దగ్గర, ఉర్దూ కవి అనగానే పొడవాటి గడ్డం, పైజామాని పైకి లాక్కుంటూ, జీవితాన్ని గడుపుకోడానికి కష్టపడుతున్న పేద కవి స్ఫురిస్తాడు. కొంతమంది మనస్సులలో ఉన్న చిత్రం ఇది. కానీ బక్షి సాబ్ అలాంటివారు కాదు. ఈ వ్యక్తి భారత సైన్యానికి చెందినవారు. బక్షిజీ వ్యక్తిత్వంలో, పాటలలో సైనికుడి దయ పూర్తిగా ప్రతిబింబిస్తుంది.
ఆయన రచనలకి సంబంధించి.. ఫల్‍సఫే కో ఉన్హే ఫల్‌సఫే కీ తరహ్ కభీ నహీఁ కహా (ఆయన ఎప్పుడూ తత్త్వశాస్త్రాన్ని తత్త్వశాస్త్రంలా చెప్పలేదు). ఆయన దేనిని నమ్మారో, దానిని నమ్మారు; కానీ ఆయన దానిని నిర్వచించడానికి ప్రయత్నించలేదు, ఎటువంటి నిర్వచనాన్ని రూపొందించడానికి ప్రయత్నించలేదు, దానిని మేధోపరంగా కూడా రూపొందించలేదు. ఫల్‍సఫే అంటే తత్వశాస్త్రం. జవాన్ దిల్ ఔర్ ఉసీ తరహ్ హఁస్ కే బాత్ కీ ఔర్ బడీ సే బడీ బాత్ కీ (హృదయంలో యువకుడాయన, హృదయంలో సంతోషంగా ఉన్నారు. అదే విధంగా ఆయన చిరునవ్వుతో పెద్ద పెద్ద విషయాల గురించి మాట్లాడారు). ఆయన పాట ‘చింగారీ కోయీ భడ్‌కే, తో సావన్ ఉసే బుఝాయే, సావన్ జో ఆగ్ లగాయే, ఉసే కౌన్ బుఝాయే’ అద్భుతమైనది. ఇది పూర్తిగా వ్యక్తిగత ప్రతిచర్య, కానీ నా అభిప్రాయం ప్రకారం, అమర్ ప్రేమ్ ఆయన గొప్ప ఆల్బమ్. అప్పుడు, పంజాబీ జానపదం ఆయన పెదవులపై ఉండేది, ఆయన చాలా బాగా పాడేవారు, ఆయన గొంతు శ్రావ్యంగా ఉండేది. ఆయన లతాజీతో కలిసి ఒక పాట కూడా పాడారు. ఆనంద్ బక్షి అంటే ఇదే. ఆనంద్ బక్షిని ఒక్క మాటలో నిర్వచించాలంటే, నేను ‘చీర్స్!’ అని చెబుతాను.
బక్షిజీ తన పాటల రచనను కవిత్వంగా పరిగణించలేదు, తనని తాను మేధావినని అనుకోలేదు. ఆయన దృష్టి సినిమాల పైనే ఉన్నందున ఆయన కెరీర్ గేయ రచయిత కావడం పైనే సాగింది. లేకిన్ యే నహీ కి వో షాయర్ నహీ థే. బిల్కుల్ ఏక్ షాయర్ థే. ఉర్దూ మేగజైన్స్ మే ఛపే హైఁ ఉన్‌కీ నజ్మే, మైనే పఢీ హై. ఆయన కవిత్వాన్ని వృత్తిగా తీసుకోలేదు, కానీ పాటలు రాయడం కూడా కవిత్వంలో ఒక భాగం. ఆయన పాటల రచయిత, సినిమా పాటల రచయిత కావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అందుకే ఇక్కడ అత్యంత విజయవంతమైన వ్యక్తి అయ్యారు.
సమీర్ అన్‍జాన్
ఉస్ ముకమ్మల్ ఫన్‍కార్ కే నామ్ చాంద్ అల్‌ఫాజ్ జిసే మై అపనా ముర్షీద్ మాన్తా హూఁ..
రూహానీ మహకే హుయే ఓ ఖ్యాలాత్ కహాఁ సే లాయె, లఫ్జ్ తో ఢూంఢ్ లె ఓ జజ్బాత్ కహాఁ సే లాయె, జో అపనే ఫన్ కే జదూ సే సబ్ కో హసాతా ఔర్ రూలాత హై, ఐసా కలమ్ కా జాదూగర్ దునియా మే బస్ ఏక్ బార్ ఆతా హై..
ఇర్షాద్ కామిల్
బక్షి గారివి నాకు ఇష్టమైన మూడు పాటలు:
‘కుచ్ తో లోగ్ కహెంగే’ అనేది కేవలం ఒక పాట కాదు, మన సమాజం గురించి చాలా ముఖ్యమైన మరియు లోతైన సత్యాన్ని వ్యక్తపరిచే నాలుగు చరణాల కవిత. ఇది ఆనంద్ బక్షి సాహబ్ పాటల లక్షణం. ఆయన తన పాటల ప్రామాణికతను కాపాడుకుంటారు, తన పాటలలోని తియ్యదనాన్ని కాపాడుకుంటూనే సమాజంలోని పెద్ద పెద్ద సత్యాలను అలవోకగా చెప్తారు. ‘అమర్ ప్రేమ్’ చిత్రంలోని ఈ పాట దానిలోని సత్యం వల్లే చిరస్థాయిగా నిలిచింది. పైగా పాటలో ‘సీతా భీ యహాఁ బద్నామ్ హుయీ’ అనే చారిత్రకమైన పల్లవి ఈ చేదు వాస్తవాన్ని మరింత బలపరుస్తుంది. ఈ పాట నాకు సాహిర్ సాబ్‌ని కూడా గుర్తు చేస్తుంది. ఆయన ‘జిన్హేఁ నాజ్ హై హింద్ పర్ వో కహాఁ హై’లో ‘యహాఁ పీర్ భీ ఆ చుకే హైఁ, జవాన్ భీ/తనో-మంద్ బేతే భీ అబ్బా మియాఁ భీ’ అని రాశారు. అదే స్థాయికి వెళ్లి, బక్షి సాబ్, ‘హమ్‍కో జో తానే దేతే హైఁ, ఇన్ రంగరేలియోం మే, హమ్ నే ఉన్‍కో భీ ఛుప్-ఛుప్ కే ఆతే దేఖా ఇన్ గలియోం మే.’ అని వ్రాశారు. ‘కుచ్ తో లోగ్ కహెంగే’ పాట ఎప్పటికీ పాతబడదు.
‘గాడీ బులా రహీ హై’ అనేది కేవలం రైలు గురించి కాదు, జీవితం గురించి. ఇక్కడ కూడా, బక్షి సాబ్ ఒక లోతైన భావనను నాలుగు సరళమైన పదాలలో అద్భుతంగా వెల్లడించారు, అవే ‘చల్‍నా హీ జిందగీ హై!’ ముష్కిల్ విచార్ కో ఆసాన్ బనానా ఔర్ ఆసాన్ బాత్ కో ఆమ్ లోగోం కీ జుబాన్ పర్ చఢా దేనా ఏక హునర్ హై జో అజీమకద్ గీత్‍కార్ బక్షీ సాహబ్ కే తకరీబన్ హర్ గీత్ మే హై. ఈ పాటలో, ఆయన సరదాగా, ‘సీఖో సబక్ జవానోఁ’ అని అన్నారు. మై ఇస్ బాత్ కో ‘ఏక్లా చలో రే’ కే బరక్స్ రఖ్ కే బీ దేఖ్‌తా హూఁ. బల్కి ఇస్ మే సిర్ఫ్ ‘చల్‍నా’ హై. ఔర్ ఛోటీ లేకిన్ ఔర్ భీ బడీ బాత్.
‘యహాఁ మై అజ్‌నబీ హుఁ’ అనేది బక్షి సాబ్ రాసిన నాకు ఇష్టమైన పాట. ఈ పాటలో ఆయన రెండు తరగతులను, రెండు సమాజాలను అనుసంధానించిన అద్భుత విధానం – కనిపించేంత సులభం కాదు. భారతీయ, పాశ్చాత్య నాగరికతల మధ్య ఉద్రిక్తత, దిగువ-మధ్యతరగతి మరియు ఉన్నత వర్గాల మధ్య తేడాలు, అమాయకత్వం మరియు మోసపూరితత మధ్య వ్యత్యాసం – ఈ పాటలో ఏమి తక్కువ? వీటన్నిటితో పాటు, ప్రేమలో అధికారం గురించి, ‘తేరి బాహోఁ నే దేఖూఁ సనమ్ గైరోన్ కీ బాతేఁ, మై లావూంగా కహాఁ సే భలా ఐసీ నిగాహేఁ?’.
శిక్వా, షికాయత్, ఔర్ గిలే కీ బాత్! ఈ పాట మాత్రమే కాదు, జబ్ జబ్ ఫూల్ ఖిలే పాటలన్నీ కూడా మెరుగుపెట్టిన రత్నాల్లాంటివే.
అమితాబ్ భట్టాచార్య
చిన్నప్పటి నుంచి బక్షి సాహిబ్ రాసిన పాటలను నేను కంఠస్థం చేసుకున్నాను. ఎందుకంటే అవి వినడానికి మరియు పాడటానికి ఎల్లప్పుడూ సులభంగా అనిపించాయి. కానీ నేను ఆయనలా రాయడానికి విఫలయత్నం చేసినప్పుడు, బక్షి సాహిబ్ అంత కష్టమైన పనిని ఎంత సులభంగా సాధించారో నేను గ్రహించాను. లెజెండ్ ఆనంద్ బక్షికి నా వందనం!
మనోజ్ ముంతాషిర్
రచన యొక్క మాయాజాలం – సంధానమయ్యే శక్తిలో ఉంటుంది, బక్షి సాబ్ చాలా సూక్ష్మంగా, గొప్ప ఉపచేతన స్థాయిలో శ్రోతలతో సంధానమయ్యే కళలో ప్రావీణ్యం సంపాదించారు. అదే ఆయన అనేక పాటలను జాతీయాలుగా సామెతలుగా మార్చింది. అలాంటి పాటలలో ఒకటి ‘యహాఁ మై అజ్‍నబీ హూఁ’. మనం ఎంత సామాజికంగా చురుకుగా ఉన్నా లేదా అంగీకరించబడినా, ఏదో ఒక సమయంలో మనం ఒక పరాయి ప్రపంచంలో జీవిస్తున్నట్లు అనిపిస్తుంది. నా విషయంలో, ఇది చాలా సాధారణ దృగ్విషయం. అప్పుడప్పుడు నేను ఈ వైరాగ్యంలో పడతాను, నా చుట్టూ ఉన్న మంచి చెడు ప్రతిదాని నుండి తప్పించుకోవాలనే బలమైన కోరిక కలుగుతుంది, నాకు దానితో సంబంధం లేదు. అది జరిగినప్పుడు, ఒక వింత ప్రపంచంలో ఉన్న అనుభూతి మరింత బాధాకరమైనదిగా మారుతుంది, అప్పుడు నేను ఆశ్రయించే ఏకైక పాట ‘యహాఁ మై అజ్‍నబీ హూఁ’. నేను ఉత్తరప్రదేశ్‌లోని నా చిన్న పట్టణంలోని గౌరీగంజ్ నుండి ముంబైకి మారినప్పుడు ఒక వింత ప్రపంచంలో ఉన్న ఈ వెంటాడే అనుభూతి మరింత బాధాకరంగా మారింది. వ్యవస్థకు బ్రేక్‌లు లేకుండా, యాక్సిలరేటర్‌లు మాత్రమే ఉన్న నగరానికి నేను అలవాటు పడలేకపోయాను. ఎవరికీ మరొకరికై సమయం లేదు. అదే గౌరీగంజ్‌లో అయితే, ప్రతి ఒక్కరూ అందరికీ తెలుసు; ముంబైలో, ఒకే భవనంలో నివసించే వ్యక్తులు – ఒకరి గురించి ఒకరు తెలియకుండా ఉన్నారు. అంధేరీ హట్‌మెంట్‌లో ఉంటూ ఈ క్రింది చరణాలను లూప్‌లో ప్లే చేయడం నాకు గుర్తుంది: ‘కహాఁ షామో-సహర్ యే, కహాఁ దిన్-రాత్ మేరే.. బహుత్ రుస్వా హుయె హై యహాఁ జజ్‌బాత్ మేరే. నయీ తహజీబ్ హై యే, నయా హై యే జమానా.. మగర్ మై ఆద్మీ హూఁ, వహీ సదియోం పురానా.’
భారతదేశం లాంటి సమాజంలో, 5000 సంవత్సరాల పాటు మన భుజాలపై మోయడానికి నైతిక విలువలు, సంస్కారాలు అని పిలవబడేవి ఉన్నాయి, బక్షి సాబ్ వీటన్నింటికీ వ్యతిరేకంగా తిరుగుబాటు చేసే సృజనాత్మక ధైర్యాన్ని కలిగి ఉన్నారు. ఒకే సరళమైన వాక్యంలో, ఆయన ఆడంబరమైన సామాజిక గతిశీలత బుడగను బద్దలు కొట్టారు: ‘కుచ్ తో లోగ్ కహెంగే లోగోం కా కామ్ హై కెహ్నా’. భారతదేశంలోని టాప్ టెన్ ఆల్-టైమ్ గ్రేటెస్ట్ పాటలను ఎంచుకోమని నన్ను అడిగితే, ఇది అత్యున్నత స్థానంలో ఉంటుంది. ‘కుచ్ రీత్ జగత్ కీ ఐసీ హై, హర్ ఏక్ సుబా కి షామ్ హుయీ.. తు కౌన్ హై, తేరా నామ్ హై క్యా? సీతా భీ యహాఁ బద్నామ్ హుయీ’. ఈ పాటను ఒక్కసారైనా విన్నవారు, ఆలోచించినవారు ఎవరైనా వెంటనే ప్రపంచం పట్ల శ్రద్ధ వహించడం మానేస్తారు. అలాగే, ఈ పాట సినిమాటిక్ రచనకు ఒక అద్భుతమైన ఉదాహరణ. అమర్ ప్రేమ్ సినిమాలోని యాభై సన్నివేశాలు రాజేష్ ఖన్నా పాత్రను వర్ణించడంలో ఈ పాటలోని కొన్ని పదాలు ఉన్నంత ప్రభావవంతంగా ఉండేవి కావు. బక్షి సాబ్ అన్ని కాలాలలోనూ అత్యుత్తమ స్క్రీన్ లిరిసిస్ట్ అనేదానికి మరొక ఉదాహరణ ‘డర్’ చిత్రం. సినిమా విడుదలయ్యే కాలానికి షారుఖ్ పాత్ర చాలా సంక్లిష్టంగా ఉందేది, పొరలుపొరలుగా ఉండేది. ‘తు హై మేరీ కిరణ్’ పాట లేకపోతే ప్రేక్షకులు సినిమా కథాంశాన్ని ఎప్పటికీ అర్థం చేసుకోలేరు లేదా యష్ చోప్రా గారి యాంటీ-హీరో ఫిలాసఫీకి సర్దుబాటు చేసుకోలేరు అని నేను పందెం కాయగలను. స్క్రిప్ట్ లోని 150 పేజీలను అద్భుతంగా సంగ్రహంగా వెల్లడించిన ‘తు హాఁ కర్ యా న కర్, తు హై మేరీ కిరణ్’ అనే ఈ తొమ్మిది సాధారణ పదాలను చూడండి.
మిలన్ లూథ్రియా దర్శకత్వం వహించిన బాద్షాహో కోసం పాటలు రాసినట్లు నాకు గుర్తుంది. మేము పాట రూపొందించటానికి కూర్చున్న ప్రతిసారీ, అతను బక్షి సాబ్‌ను మిస్ అవుతున్నానని నిట్టూర్చేవాడు. నిజానికి, ఇది నా కెరీర్‌లో అత్యంత సవాలుతో కూడిన చిత్రాలలో ఒకటి, ఎందుకంటే నేను దిగ్గజ గీత రచయిత బక్షి సాబ్ పదాలకు అలవాటు పడిన దర్శకుడి కోసం రాస్తున్నాను. భారతదేశం కవుల, రచయితల దేశం. ఇంకా చాలా మంది వస్తారు, కానీ బక్షి సాబ్‌ను ఎల్లప్పుడూ అదే నిట్టూర్పుతో మిస్ అవుతారు, ఎప్పటికీ.
విజయ్ అకేలా
ఆనంద్ బక్షి ఆధునిక కాలంలో మీర్ తాకి మీర్, నజీర్ అక్బరాబాదీ, ఇంకా కబీర్ దాస్ కూడా. యూఁ తో సబ్నే గీత్ లిఖే, సబ్ మే భీ ఔకత్ థీ, బక్షి మే ఎక్ బాత్ హై ఔర్ బక్షి మే ఎక్ బాత్ హై.
(మళ్ళీ కలుద్దాం)
కొల్లూరి సోమ శంకర్ రచయిత, అనువాదకులు. బి.ఎ.డిగ్రీతో గ్రాడ్యుయేషన్. మానవ వనరుల నిర్వహణలో పిజి డిప్లొమా చేసారు. దక్షిణ భారత హిందీ ప్రచార సభ వారి భాషా ప్రవీణ పాసయ్యారు. ప్రస్తుత నివాసం హైదరాబాదు.
సోమ శంకర్ 2001 నుంచి కథలు రాస్తున్నారు. 2002 నుంచి కథలను అనువదిస్తున్నారు. కేవలం కథలే కాక ‘ది అడ్వెంచర్స్ ఆఫ్ పినోకియో’ అనే పిల్లల నవలను ‘కొంటెబొమ్మ సాహసాలు’ అనే పేరుతోను, ‘మాజిక్ ఇన్ ది మౌంటెన్స్’ అనే పిల్లల నవలను ‘కొండలలో వింతలు’ అనే పేరుతోను, వినయ్ జల్లా ఆంగ్లంలో రాసిన ‘వార్స్ అండ్ వెఫ్ట్’ అనే నవలని ‘నారాయణీయం’ అనే పేరుతోను, వరలొట్టి రంగసామి ఆంగ్లంలో రాసిన ‘లవ్! లవ్! లవ్!’ నవలను ‘సాధించెనే ఓ మనసా!’ పేరుతోనూ, అజిత్ హరిసింఘానీ రచించిన ట్రావెలాగ్ ‘వన్ లైఫ్ టు రైడ్’ను ‘ప్రయాణానికే జీవితం’అనే పేరుతోను, డా. చిత్తర్వు మధు ఆంగ్లంలో రచించిన ‘డార్క్ అవుట్పోస్ట్స్’ అనే స్పేస్ ఒపేరా నవలను ‘భూమి నుంచి ప్లూటో దాకా’ అనే పేరుతోనూ; అమర్త్యసేన్ వ్రాసిన ‘ది ఐడియా ఆఫ్ జస్టిస్’ అనే పుస్తకాన్ని, మరో నాలుగు పుస్తకాలను తెలుగులోనికి అనువదించారు. ‘దేవుడికి సాయం’ అనే కథాసంపుటి, ‘మనీప్లాంట్’, ‘నాన్నా, తొందరగా వచ్చెయ్!!’, ‘ఏడు గంటల వార్తలు’ అనే అనువాద కథా సంపుటాలను ప్రచురించారు.