Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

నగ్మే, కిస్సే, బాతేఁ, యాదేఁ – ఆనంద్ బక్షి జీవితం, పాటలు-30

[శ్రీ రాకేశ్ ఆనంద్ బక్షి రచించిన ‘నగ్మే, కిస్సే, బాతేఁ, యాదేఁ – ది లైఫ్ అండ్ లిరిక్స్ ఆఫ్ ఆనంద్ బక్షి’ అనే ఆంగ్ల పుస్తకాన్ని అనువదించి పాఠకులకు అందిస్తున్నారు కొల్లూరి సోమ శంకర్.]

అధ్యాయం 11 – నివాళులు – రెండవ  భాగం

సుభాష్ ఘాయ్

మేరీ జంగ్’ సినిమాలోని ఒక పాట కోసం చర్చలో  కూర్చున్నప్పుడు, నేను బక్షీజీకి ‘జిందగీ హర్ కదమ్ ఏక్ నయీ జంగ్ హై’ అని ఒక వాక్యం సూచించాను, వెంటనే ఆయన ఒక సెకనులో, ‘జీత్ జాయేంగే హమ్, అగర్ తూ సంగ్ హై, జిందగీ హర్ కదమ్ ఇక్ నయీ జంగ్ హై’ అని ప్రతిస్పందించారు. అంతే, మా పాటకి పల్లవి వచ్చేసిందని అర్థమైంది.

1984 ఆగస్టు 3న ఒక సాయంత్రం నేను ఆయన్ని కలిసాను, అప్పట్లో మేము ‘కర్మ’ సినిమా పాటలపై పని చేస్తున్నాం. ఆయన ‘దిల్ దియా హై జాన్ భీ దేంగే, యే వతన్ తేరే లియే; హర్ కరమ్ అప్నా కరేంగే, యే వతన్ తేరే లియే’ అనే గీతాన్ని వినిపించారు. ఆ హృద్యమైన గీతాన్ని బక్షిజీ చదవడం పూర్తి చేసిన మరుక్షణం, నేను భావోద్వేగానికి గురై, ప్రశంసాపూర్వకంగా ఆయనకి ఓ 100 రూపాయల నోటును అందజేశాను. కృతజ్ఞతా చిహ్నంగా ‘ఆనంద్ బక్షి కలానికి అభినందనలతో, సుభాష్ ఘాయ్ కలం’ అని ఆ నోటు మీద రాసిచ్చాను.

(ప్రేమాస్పదమైన ఈ ఘటన జరిగిన ఇరవై తొమ్మిది సంవత్సరాల తరువాత, అంటే నాన్న మరణించిన పదకొండు సంవత్సరాల తరువాత, ఆ నోటు ఆయన వాడిన చివరి పర్సులో భద్రంగా దాచిపెట్టి ఉండడం చూశాను. ఈ కృతజ్ఞతా నోటును నాన్న ఎప్పుడూ విడిచి పెట్టలేదు – రాకేశ్.)

భావోద్వేగపరంగా తనకు అనుబంధం ఉన్న వస్తువులను భద్రపరిచే అలవాటు బక్షిజీకి ఉండేది, కానీ ఆ నోటును ఆయన జీవితాంతం వరకు దాచుకున్నారని నాకు తెలియదు. విన్నాకా విస్తుపోయాను. ఈ రోజుల్లో, చాలా విషయాలు డబ్బు గురించే; మీ సినిమా 100 కోట్ల రూపాయల మార్కును దాటడం కంటే ముఖ్యమైనది ఏదీ లేదు. కానీ ఈ సంఘటన నాకు 100 రూపాయలు కూడా అత్యంత విలువైనవనీ, మనోభావాలు ముఖ్యమైనవనీ భావించిన కాలాన్ని గుర్తు చేసింది. తన మరణం వరకు నేనిచ్చిన నోటును తనతో ఉంచుకోవడం ద్వారా, ఆనంద్ బక్షి నాకు జీవితాంతం గుర్తుచేసే ప్రశంసను ఇచ్చారు.

బక్షిజీ, నేను కలిసి పద్నాలుగు సినిమాలను చేసాము: గౌతమ్ గోవింద, కర్జ్, క్రోధి, విధాత, హీరో, మేరీ జంగ్, కర్మ, రామ్ లఖన్, సౌదాగర్, ఖల్ నాయక్, శిఖర్, పర్‌దేశ్, తాల్, యాదేఁ. 150 నిమిషాల నిడివి ఉండే సినిమాలో నలభై ఐదు నిమిషాలు వ్రాసేది గీత రచయితే అని కొద్దిమందికి మాత్రమే తెలుసు. మన సినిమాలకు రిపీట్ వాల్యూని, జ్ఞాపకాలను ఇచ్చేది పాటల సాహిత్యమే. అభిమానులు పాటల ద్వారా సినిమా పేర్లను గుర్తుంచుకుంటారు, నటులు వారు అభినయించే పాటల ద్వారా ఉన్నత స్థాయికి చేరుకుంటారు, గాయకులు వారు పాడే సాహిత్యం ద్వారా గుర్తింపు పొందుతారు, కాబట్టి, గీత రచయితలకు ఇవ్వాల్సినవి – ఆర్థికపరమైనవీ, ఇంకా ఘనతలు తప్పక చెల్లించాలి.

అసంబద్ధమైన, వ్యంగ్య పరిస్థితులతో నిండిన ఈ పరిశ్రమలో ఆయన వివాదాలు లేకుండా బయటపడ్డారు. ఆయన ఉత్తమ లక్షణం ఆయన క్రమశిక్షణ – ఆయన ఎప్పుడూ పాట రాయడం ఆలస్యం చేయలేదు. మరొక విషయం: కొన్నిసార్లు, కొంతమంది గాయనీగాయకులు తాము పాట పాడిన విధానం నచ్చిందా అని నన్ను అడుగుతారు, కానీ ఈ పాటలను రాసిన వ్యక్తి – ఆనంద్ బక్షి – నన్నెప్పుడూ ఈ ప్రశ్న అడగలేదు. తన పనికి తాను న్యాయం చేశానని ఆయనకు నమ్మకం ఉండి ఉండవచ్చు.

ఆనంద్ బక్షి పాటలు భారతీయ సినిమా రంగంలో అత్యుత్తమ డాక్యుమెంట్లలలో తమ స్థానం నిలుపుకుంటాయి. భవిష్యత్ సంగీత విశ్వవిద్యాలయాల స్క్రీన్‌ప్లే, సాహిత్యం, సంగీత విద్యార్థులు ఆయన పాటలను క్షుణ్ణంగా అధ్యయనం చేస్తారు, మూల్యాంకనం చేస్తారు. ఆయన మరణం నా జీవితంలో అత్యంత క్రూరమైన విషాదం. నా ప్రాజెక్టులు విజయవంతమవడంలో బక్షిజీ నైపుణ్యం చాలా తోడ్పడింది. ఆయనకు భారతరత్న అవార్డు ఇవ్వాలి.

బక్షిజీ సినిమా కథను ఎంత ఆసక్తిగా వింటారంటే, మొత్తం కథను తనలో ఇంకించుకునేవారు. దర్శకుడి కంటే కూడా ఆయనకి కథ బాగా తెలుసు. నా ప్రతి సినిమాలోనూ, మౌలికంగా కథని ఇముడ్చుకునే థీమ్ సాంగ్ ఉంటుంది. బక్షిజీ సమగ్రమైన పాట రాసిన తర్వాత, దానిని  నేను ఆ సినిమాను చిత్రీకరించడానికి ఓ గైడ్‌గా ఉపయోగిస్తాను. అద్భుతమైన తక్దీర్ వర్సెస్ తద్బీర్ పాట ‘హాథోం కీ చంద్ లకీరోం కా..’ నాకు ‘విధాత’ సినిమా చిత్రీకరణలో అలా ఉపయోగపడింది, అది నాకు ఇష్టమైన పాట. మేమిద్దరం కలిసి పని చేసిన మొదటి చిత్రం ‘గౌతమ్ గోవింద’లోని ‘ఇక్ రితు ఆయే, ఇక్ రితు జాయే’ పాట కూడా నాకెంతో ఇష్టం. ఆయన గురించి మరో గొప్ప విషయం ఏమిటంటే, “ఉన్‌కే, గానే బిక్‌తే థే లేకిన్ వో బికావు నహీఁ థే. ఆనంద్ బక్షి పాటలు అమ్ముడయ్యేవి, ఆయన మాత్రం అమ్ముడుపోలేదు: బక్షిజీ పని కోసం ఎప్పుడూ తన విలువలతో రాజీ పడలేదు. నిజాయితీపరుడు, అరుదైన వ్యక్తి.

షూటింగ్ సమయంలో, సాధారణంగా నేను ఆర్టిస్టులకు సంభాషణలనో, సన్నివేశాన్నో వివరించేటప్పుడు ఆయన మాటలలోని నిజమైన లోతు నాకు అర్థమవుతుంది. ఆయన తన చివరి పాట – ‘బుల్లే షాహ్ తేరే ఇష్క్ నచాయా, వా జి వాహ్ తేరే ఇష్క్ నచాయా’ అని నా సినిమా కోసం రాశారు. ఆయన దానిని రాసినప్పుడు, 101 డిగ్రీల జ్వరంతో, మూడు వెచ్చని దుప్పట్లతో కప్పుకుని, వణుకుతూ, ఉబ్బసం కారణంగా ఊపిరి ఆడక, హిమోగ్లోబిన్ కౌంట్‌ఏడు కన్నా తగ్గిపోయి, ఆయన మంచం మీద ఉన్నారు. అదే వారం ఆయన ఆసుపత్రిలో చేరారు, ఇక.. ఇంటికి తిరిగి రాలేదు. గొప్ప దిగ్గజ గీత రచయిత బక్షిజీని కోల్పోవడం మాకు ఒకే ఒక శబ్దాన్ని మిగిల్చింది. అదే నిశ్శబ్దం.

[మిస్టర్ ఘాయ్ (‘క్రమశిక్షణ, చురుకుదనం’ గల) ఆనంద్ బక్షికి ఇచ్చిన నివాళి నాకు నాన్నలోని ఓ గుణాన్ని గుర్తు చేస్తుంది, అది బహుశా చిన్నప్పుడు నాకు కూడా స్ఫూర్తినిచ్చింది. ఆయన ఎప్పుడూ ఖాళీగా కూర్చోలేదు. ఒక నెల తర్వాత ఒక పాటను అందించాల్సి ఉంటే, ఆయన దానిని ఎలాగైనా రాసేవారు. ఆయన ఖాళీగా ఉంటే, ఇంటి ఫర్నిచర్ శుభ్రం చేసేవారు, అది పూర్తయిన తర్వాత, అభిమానులు రాసిన ప్రతి ఉత్తరానికి స్వయంగా ప్రత్యుత్తరం ఇచ్చేవారు. ఆయన తన అభిమానులను, శ్రోతలను తనను రాయడానికి నియమించుకున్న నిర్మాతల మాదిరిగానే, విలువైనవారిగా భావించేవారు – రాకేశ్.]

శక్తి సామంత

బక్షిజీకి పాటలు రాయడంలోనూ, వాటితో పాటు బాణీలు కట్టడంలోనూ గొప్ప ప్రతిభ ఉంది. కొన్నిసార్లు గాయకులు పాడే విధానం కంటే కూడా ఆయన తన పాటలను బాగా పాడేవారు. పార్టీలలో ఆయన తన హాస్య చతురతతో, పాటలతో మనల్ని అలరించేవారు.

(‘ఆరాధన’ సినిమా బాక్సాఫీస్ వద్ద విజయం సాధించిన తర్వాత శక్తి సామంత, దిగుమతి చేసుకున్న మొట్టమొదటి బ్రాండ్ న్యూ కారు, షెవర్లె బెల్ ఎయిర్‌ను ఆనంద్ బక్షికి బహుమతిగా ఇచ్చారు. కానీ బహుమతిగా దానిని స్వీకరించననీ, దానికి డబ్బు చెల్లిస్తాననీ నాన్న పట్టుబట్టారు. శక్తి దా ఎంతో హుందాగా అంగీకరించారు – రాకేశ్.)

జె. ఓం ప్రకాష్

మా సాంగ్ సిట్టింగ్ సమయాల్లో బక్షిజీతో నా కథ గురించి, స్క్రీన్‌ప్లేల గురించి వివరంగా చర్చించడం నాకు చాలా ఇష్టం, ఎందుకంటే ఆయనకి మానవ భావోద్వేగాల పట్ల మంచి అవగాహన ఉండేది, నాకెప్పుడూ చాలా మంచి సూచనలు ఇచ్చేవారు. కథను చాలా ఆసక్తిగా వినేవారు. తనను సవాలు చేసే కథల పట్ల, పరిస్థితుల పట్ల ఆయనకి నిజంగా ఆసక్తి ఉండేది.  మంచి సాహిత్యం రాయడానికి అదే ఆయనని తీవ్రంగా ప్రేరేపించేది. ‘ఆప్ కీ కసమ్’ కథ విన్న తర్వాత, ఆయన మంచి స్నేహితులలో ఒకరు తన భార్య వివాహేతర సంబంధం కలిగి ఉందని అనుమానించి ఆమెను విడిచిపెట్టారని బక్షిజీ గుర్తుచేసుకున్నారు. కొన్ని సంవత్సరాల తర్వాత, ఆ వ్యక్తి తాను పొరపాటు పడ్డానని గ్రహించి, ఆమెకు క్షమాపణ చెప్పడానికి వెళ్ళాడట. ఆమెను మళ్ళీ పెళ్ళి చేసుకుందామనుకున్నాడట. కానీ ఆమె వేరే వ్యక్తిని ఎంచుకుని, పెళ్లి చేసుకుందట. దాంతో ఆ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడట. ఆ తర్వాత కొంత సమయానికి, బక్షిజీ ‘జిందగీ కే సఫర్ మే గుజార్ జాతే హై జో ముకామ్, వో ఫిర్ నహీఁ ఆతే’ అనే పాటను రాశారు. ఆ పాట కథకి, స్క్రీన్ ప్లేకి, ఇంకా పాత్రలకి చాలా బాగా నప్పింది, నేను అప్పటికే చిత్రీకరించిన రెండు సన్నివేశాల పనిని అది చేసింది. దాంతో ఎడిట్ సమయంలో నేనా సన్నివేశాలను తొలగించాను. ఈ పాట నా వ్యక్తిగత జీవితంలో కూడా నాకు సహాయపడింది.

ఆయే దిన్ బహార్ కే’ సినిమాలో నేను ఆయనకి సన్నివేశం గురించి చెప్పినప్పుడు, ప్రజలు మోసానికి గురైనప్పుడో, లేదా విడిచిపెట్టబడినప్పుడో నిజంగా ఎలా బాధపడతారో – ఆ వేదనని పాటలో వ్యక్తపరచమని, కానీ పదాలలో అవి ఉండకూడదని చెప్పాను. మనకు హాని చేసే ఎవరినైనా మనం మన హృదయంలో శపిస్తాము. ఆయన అత్యంత అద్భుతమైన, సాటిలేని శాప గీతం ‘మేరే దుష్మన్, తు మేరీ దోస్తీ కో తర్సే’ ను కేవలం రెండు గంటల్లోనే రాసిచ్చారు.

టోనీ జునేజా

బక్షి సాబ్ సాధారణంగా సాయంత్రం సరిగ్గా ఆరు గంటలకు తన 1964 మోడల్ ఫియట్‌లో రాజు (సంగీత స్వరకర్త రాజేష్ రోషన్) ఇంటికి పొగాకు నింపిన పాన్ డబ్బాతోనూ, 555 సిగరెట్ ప్యాకెట్‌తో వచ్చేవారు. మేమందరం పాట గురించి ఆలోచించడానికి కూర్చునేవాళ్ళం. ఆయన దగ్గర మరో రెండు లేటెస్ట్ మోడల్ ఇంపోర్టెడ్ కార్లు ఉన్నాయి, అయినప్పటికీ సినిమా ప్రీమియర్‌లకు కూడా ఆయన తన మొదటి కారు ఫియట్‌లో వెళ్ళడానికి ఇష్టపడేవారు. ఒక సాయంత్రం, ఎప్పటిలాగే, ఆయన 555 సిగరెట్ తాగుతూ, ఒక పాటను హమ్ చేయసాగారు. దాని సాహిత్యం ‘పర్‌దేశియా, యే సచ్ హై పియా, సబ్ కహతే హై తూ నే, మేరా దిల్ లే లియా’. మేమందరం ఆశ్చర్యపోయాము, కానీ అది మా అందరికీ చాలా బాగా వినిపించింది. రాజు, అతని సంగీతకారులు అందరూ ఉత్సాహంగా బక్షి సాబ్‌తో కలిసి వాయిద్యాలు వాయించారు. మిగిలిన మూడు చరణాలను కిళ్ళీ నములుతూ, సిగెరెట్ పొగలు గుప్పుగుప్పుమని పీలుస్తూ, ఆయన పదిహేను నిమిషాల్లో మా అందరి ముందే రాశారు.

అమితాబ్ బచ్చన్ సినిమాల్లో పాడటానికి ఆయనే కారణం. ‘మేరే పాస్ ఆవో, మేరే దోస్తోఁ’ రాసినప్పుడు, “ఈ సినిమాలో ఈ పాటను అమితాబ్ ఎందుకు పాడకూడదు? నటుడు తన సొంత గొంతులో పాడితే ఆ పాట మరింత ప్రేక్షకులకు మరింత దగ్గరవుతుంది, ముఖ్యంగా అతను పిల్లలతో కలిసి పాడడం వల్ల” అని సూచించారు. ఇది అమితాబ్ సినిమాల్లో పాడిన మొదటి ప్లేబ్యాక్ సాంగ్.

బక్షిజీ అందరి కోసం రాసేవారు, చాలా మంది నిర్మాతలుండేవారు. ఎప్పుడూ ‘క్యాంప్’లను నమ్మలేదు లేదా ఏ సినిమా వంశానికో అనుకూలంగా లేరు. కొన్ని రోజుల్లో లేదా గంటల్లో మాకు పాటలు అవసరమైనప్పుడు ఆయన మమ్మల్ని ఎప్పుడూ నిరాశపరచలేదు: ఆయన వృత్తి నైపుణ్యం, వేగం అలాంటివి! ప్రతి ఒక్కరి డబ్బు ముఖ్యమైనదే, అందరి డబ్బుకీ ఒకే విలువ ఉంటుందనేవారు. ఆయన నుండి నేర్చుకోవాలి. మీరు ఎవరినీ ఎప్పుడూ నిరాశపరచకూడదు, ఎప్పటికీ ఎవరినీ తక్కువ చేయకూడదు. స్వయంగా, చిరునవ్వుతో సేవ చేయాలి. మీరు అందరితో సర్దుబాటు చేసుకోవాలి, అందరికీ మీ సేవలు అందించాలి. ఆయన నాతో “నా పాటల లయ ఎల్లప్పుడూ హృదయ స్పందనలా ధ్వనిస్తుంది. నా హృదయ స్పందన‌కు అనుగుణంగా నేను కొన్ని పాటలు రాశాను. మన హృదయ స్పందనలాగే నా పాటలు కూడా ధ్వనిస్తాయి” అని చెప్పేవారు. ఆయనలాంటి వారు ఎవరున్నారు? ఉండనే ఉండరు.

రాజ్ కుమార్ బర్జాత్య

బక్షిజీ ‘జీవన్ మృత్యు’ కోసం ‘ఝిల్‌మిల్ సితారోం కా ఆంగన్ హోగా, రిమ్‌ఝిమ్ బరస్తా సావన్ హోగా’ అనే చరణం రాసినప్పుడు, నేను మర్యాదగా అభ్యంతరం చెప్పాను. వర్షం పడితే నక్షత్రాలు కనిపించవు, ఎందుకంటే ఆకాశం మేఘాలతో కప్పబడి ఉంటుంది అని వాదించాను. బదులుగా, “పదాలను అక్షరాలా అనుసరించవద్దు. నేను వ్రాసిన దానిలోకి అంత లోతుగా వెళ్లవద్దు. ఒక కవి లాగా, గీత రచయిత ఏం చెబుతున్నాడో ఆలోచించండి, ఎందుకంటే ఈ పాట సన్నివేశంలో శృంగారం ఉంటుంది. ఇంకా, నిశితంగా పరిశీలిస్తే నేను “న”, “మ” అనే రెండు అక్షరాలతో ఆట ఆడినట్లు గ్రహిస్తారు. ‘ఝిల్ మిల్’ లో “మ”, ‘ఆంగన్ హోగా’లో “న” ఉన్నాయి. ‘రిమ్‌ఝిమ్’ లో “మ”, ‘సావన్ హోగా’లో “న” ఉన్నాయి. “న”, “మ” శబ్దాల ఆటనే మీరు వినాలని నేను కోరుకుంటున్నాను, అది ఈ పాటను వినడాన్ని, పాడటాన్ని ఆహ్లాదకరం చేస్తుంది, దాంతో పాట ప్రజాదరణ పొందుతుంది” అని బక్షిజీ జవాబిచ్చారు. ఆయన చెప్పింది నిజమేనని నేను గ్రహించాను. ఆ పాట సూపర్-డూపర్ హిట్ అయింది.

బక్షిజీ మా సినిమాల కోసం రాసిన ప్రతి పాటకు మాకు మూడు చరణాలు సరిపోయినా, ఆయన కనీసం ఆరు రాసేవారు. 1967లో ‘తక్దీర్’ కోసం ఆయన నన్ను మొదటిసారి కలిసినప్పుడు, తనని తాను ఓ కొత్త గీతరచయిత లాగా, పాటలు రాయడానికి ఇష్టపడే మాజీ సిపాయిగా పరిచయం చేసుకున్నారు. సూపర్ హిట్ జబ్ జబ్ ఫూల్ ఖిలే, మెహందీ లగీ మేరే హాత్, హిమాలయ్ కీ గోద్ మే, ఆయే దిన్ బహార్ కే, ఫూల్ బనే అంగారే, మిస్టర్ ఎక్స్ ఇన్ బాంబే, ఆస్రా, దేవర్, చోటా భాయ్, ఫర్జ్ వంటి ఇతర హిట్ సినిమా పాటల రచయితనని ఆయన ఎప్పుడూ ప్రస్తావించలేదు. ఎంత వినయం!

ఆయన తన పాటల్లో ఉపయోగించిన సరళమైన పదాలు ఒక వరం లాంటివి – ఎవరైనా పాటలను  సులువుగా అర్థం చేసుకోగలరు, అంతేకాదు ఆయన ఉపయోగించిన పదాలు – పాటలను చిత్రీకరించడంలో దర్శకులకు సహాయపడేవి. ఆయన మాటలు మన చుట్టూ కనిపించే దృశ్యాలను ప్రేరేపించేవి, ఆయన ఆ పాటల్లో ఉపయోగించిన కొన్ని పదాల ప్రకారం పాటలను చిత్రీకరించడానికి మేము ప్రదేశాలను ఎంచుకునేవాళ్ళం. ఆయన సాహిత్యం దర్శకులకు పాటలకు ఎలా దర్శకత్వం వహించాలో, వాటిని ఎక్కడ చిత్రీకరించాలో, పాత్రలను ఒక నిర్దిష్ట మార్గంలో ఎలా ప్రవర్తించేలా చేయాలో చెబుతుంది. అదే ఆయన రచనలో అత్యుత్తమమైనది. ఆయన జ్ఞానం ఆయన ఉపయోగించిన పదాల కంటే చాలా ఎక్కువ; ఆయన రోజువారీ, సాధారణ, మూమూలు మాటల్లో వాడే పదాలను, భాషను ఉపయోగించారు. అది ఆయన రచన శైలిలో అత్యంత అందమైన విషయం.

మా సినిమాలలో ఆయన రాసిన ఆఖరి మాటలు ‘పియా కా ఘర్’ సినిమాలోని ‘యే జీవన్ హై, ఇస్ జీవన్ కా, యహీ హై, యహీ హై, యహీ హై రంగ్ రూప్, థోడే గమ్ హై, థోడీ ఖుషియాఁ, యహీ హై, యహీ హై, యహీ హై చావోఁ ధూప్’.

ఆయన గొప్ప ప్రతిభతో, వేగంగా రాస్తారు. ఆయన మా సినిమాలకు, ముఖ్యంగా ‘మిలన్’, ‘జీనే కీ రాహ్’ వంటి సినిమాలకు కూడా ఇరవై లేదా ముప్పై నిమిషాల్లో నా ముందే పాటలు రాశారు. ఆయనకు అదెప్పుడూ సమస్యగా అనిపించలేదు, ఎక్కడికి అక్కడే రాసేవారు. ఆయన ట్యూన్ విన్న వెంటనే రాసేవారు, ఆ ట్యూన్‌లో విన్న ప్రతి నోట్‌‍కు నప్పే పదాలను రాసేవారు, ఎప్పుడూ ఏ నోట్‌ను మిస్ చేయరు, చాలా ప్రభావవంతంగా, బాగా రాసేవారు. పాత్ర పాడగలిగే పదాలను ఉపయోగించేవారు, అంతే తప్ప తన ఉర్దూ లేదా హిందీ పరిజ్ఞానంతో ఇతరులను ఆకట్టుకోవడానికి ఎప్పుడూ పదాలను ఉపయోగించలేదు. ఆయన పాత్రల భౌగోళిక స్థానం, పరిస్థితులు, హోదా ప్రకారం రాశారు. ‘మిలన్’ సినిమాలో, ఆయన తన ‘సావన్ కా మహీనా’ పాటలో ‘పూర్వైయా’ అనే పదాన్ని ఉపయోగించారు, అంతేకానీ హవా అనే పదాన్ని వాడలేదు, ఎందుకంటే పడవ నడిపే వ్యక్తి తన పడవను ముందుకు నడిపే గాలికి ‘పూర్వైయా’ అనే పదాన్ని ఉపయోగిస్తాడు. కథలోని వాతావరణం గురించి ఆయన అవగాహన అంత లోతుగా ఉంది.

ఆయన మా కోసం రాసిన అన్ని పాటల, ప్రసాద్ ప్రొడక్షన్స్ సినిమా పాటల సిట్టింగ్ లకు కూడా నేను హాజరయ్యాను. ఆయన రచన ఎంత బాగుంటుందంటే, నలభై ఎనిమిది సంవత్సరాల తర్వాత కూడా ఆయన పాటలన్నింటిలోని ప్రధాన చరణాలు నాకు గుర్తున్నాయి. ఆయన చరణాలు చాలా కాలం నిలిచి ఉంటాయి. ‘రాజా ఔర్ రంక్’ లోని ‘ఓ ఫిర్కీవాలీ, తు కల్ ఫిర్ ఆనా, నహీఁ ఫిర్ జానా’ అనే పాటలో, ఆయన ఫిర్ అనే పదాన్ని మూడు సందర్భాలలో ఉపయోగించారు. మొదటి ‘ఫిర్’ ఫిర్కీవాలీ అనే పదంలో, రెండవ ఫిర్ అంటే ‘మళ్ళీ’ అనే అర్థంలో; మరియు మూడవ సారి ‘ఫిర్ జానా’లో, ‘నీ వాగ్దానాన్ని వెనక్కి తీసుకోవద్దు’ అనడంలో. ఒకే పదం, మూడు అర్థాలతో! మాటలతో ఏం ఆట! ఎంత ప్రతిభావంతుడైన రచయిత! ‘యే దిల్ దీవానా హై’ పాటలో ‘దిల్ తో దీవానా హై, దీవానా దిల్ హై యే, దిల్ దీవానా’ అని అంటూ, ఒకే చరణంలో ‘దిల్’, ‘దీవానా’ అనే పదాలను ఏడుసార్లు ఉపయోగించారు, ఎందుకంటే దర్శకుడు ఆ పదాలు చాలాసార్లు పునరావృతమయ్యే పాటను కోరుకున్నాడు.

(మళ్ళీ కలుద్దాం)

Exit mobile version