Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

నగ్మే, కిస్సే, బాతేఁ, యాదేఁ – ఆనంద్ బక్షి జీవితం, పాటలు-3

[శ్రీ రాకేశ్ ఆనంద్ బక్షి రచించిన ‘నగ్మే, కిస్సే, బాతేఁ, యాదేఁ – ది లైఫ్ అండ్ లిరిక్స్ ఆఫ్ ఆనంద్ బక్షి’ అనే ఆంగ్ల పుస్తకాన్ని అనువదించి పాఠకులకు అందిస్తున్నారు కొల్లూరి సోమ శంకర్.]

అధ్యాయం 1: 1930-1944 – ఒకటవ భాగం:

ప్రభవించిన ప్రమోదం

గీత రచయిత ఆనంద్ బక్షి అవిభక్త భారతదేశంలో జూలై 21, 1930న ఉదయం 7.55 గంటలకు జన్మించారు. ఆయన మాకు నాన్న, తన తల్లి సుమిత్రకి నంద్, తన తండ్రికి అజీజ్ లేదా అజీజీ, బంధువులకు నందో.

బక్షి కుటుంబ సభ్యులు రావల్పిండిలోని మొహల్లా కుతుబుద్దీన్‌లోని చిట్టియా హట్టియా లోని మూడు అంతస్తుల భవనంలో నివసించారు – ఆ ఇల్లు నేటికీ ఉంది. వారి ఇల్లు ‘దరోగా జీ కా ఘర్’ లేదా ‘దరోగా జీ కీ కోఠీ’ అని ప్రసిద్ధి చెందింది.

ఎందుకంటే నంద్ తాతగారు (బౌజీ) బ్రిటిష్ రాజ్ హయాంలో పోలీసు సూపరింటెండెంట్‌గా పనిచేశారు.

“మా ఇంటి పరిసరాల్లో ఒక మంచినీటి బావి, గురుద్వారా, మసీదు, హిందూ పాఠశాల ఉండేవి. నేను గురుద్వారాలో ‘కథా’ ప్రసాద్ (గోధుమ మిఠాయి) తినేవాడిని, గుర్బానీ షాబాద్ కీర్తనతో పాటు పాడేవాడిని, బావి లోని నీళ్ళు తాగేవాడిని. బడి నుండి ఇంటికి వచ్చేటప్పుడు మసీదు నుండి వినబడే శ్రావ్యమైన అజాన్‌కు ఈల వేస్తాను. మా ఇంటి దగ్గర అజాన్, ఇంకా శ్రీకృష్ణ మందిర్ గంటలు మోగడం ద్వారా నాకు రోజు సమయం తెలుస్తుంది. అది సెక్యులర్ భావనలున్న, సంతోషకరమైన లొకాలిటీ.”

“మా గ్రామంలో కొన్నే సైకిళ్ళు ఉండేవి, నేను నా సైకిల్‌ను మా పరిసరాల్లో ఎక్కడైనా వదిలేసి ఇంటికి తిరిగి వచ్చేవాడిని. నేను దాన్ని అక్కడ మర్చిపోయి వెళ్ళానని,  కొంతమంది పొరుగువారు సాయంత్రం వేళకి దానిని తీసుకొచ్చి ఇచ్చేవారు.

మా గ్రామంలో చాలామందికి ‘దరోగా జీ కీ కోఠీ’ గురించి తెలుసు – ‘ఇది దరోగా జీ మనవడి సైకిల్’ అనేవారు.

బక్షి వంశంవారు ఉమ్మడి కుటుంబంగా జీవించారు, ఇందులో నంద్ తాతగారు (బౌజీ) అంటే, బక్షి సుగడ్‌మల్ వైద్, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, పంజాబ్ జైల్స్, (పిండిలో ఉండేవారు);  నానమ్మ (బిజీ), నాన్న  (పాపాజీ) భక్షి మోహన్ లాల్ వైద్; ఇంకా అమ్మ (మా జీ), సుమిత్ర బాలి భక్షి ఉండేవారు.

“తాతగారు పోలీసు విభాగంలో ఉండటం, నాన్న బ్యాంక్ మేనేజర్ కావడం వల్ల పిండిలోని మా ఇల్లు చాలా పద్ధతిగా, క్రమబద్ధంగా మరియు క్రమశిక్షణతో ఉండేది. తాతగారు సన్నని ముల్ముల్‌ (నూలు వస్త్రం)తో చేసిన తెల్లటి తలపాగా ధరించేవారు. దానికి గంజి పెట్టేవారు. ఆయనలానే దృఢంగా ఉండేది, పైన కుచ్చులా ఉండేది. నా వ్యవస్థీకృత మనస్సును రాయల్ ఇండియన్ నేవీలోనూ, సైన్యం లోనూ నేను పనిచేసిన కాలం, దృఢపరిచింది. మంచి పనిని సృష్టించగలది వ్యవస్థీకృత మనస్సు మాత్రమే.

నంద్ తల్లిగారు ఇరవై ఐదు సంవత్సరాల వయసులో గర్భధారణ సమయంలో లేదా బహుశా ప్రసవ సమయంలో అనారోగ్యంతో మరణించారు. నాన్న, మేనమామ మేజర్ డబ్ల్యు.ఎం. బాలి మధ్య జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలలో, నంద్ మావయ్య ‘..నంద్, నువ్వు మానసికంగా చాలా బాధపడ్డావని, తల్లి లేకుండా పెరిగావని, చాలా చిన్న వయసులోనే  నిన్ను ఇంటి నుండి పంపించేశారని నాకు తెలుసు..’ అని రాశారు.

తల్లి చనిపోయిన తర్వాత, తన తండ్రితో కాకుండా నానమ్మ (బిజీ)తో ఉండటానికి ఇష్టపడ్డారు నంద్. అప్పట్లో, తాతగారు లాహోర్‌లో కొన్ని సంవత్సరాల పాటు మహిళా జైలుకి బాధ్యత వహించారు. తల్లి లేని నంద్, నానమ్మతో ఉండొచ్చని, ఆయనతో పాటు అక్కడికి వెళ్ళారు. ‘ఆమె ప్రేమ తల్లి ప్రేమకు సమానం.’ నంద్ తండ్రి త్వరలోనే మరో వివాహం చేసుకున్నారు. యశోద దేవి బాలి ఆయనకి రెండవ భార్య అయ్యింది. ఆమె నంద్ దివంగత తల్లి సుమిత్రకి సమీప బంధువు. కీర్తిప్రతిష్ఠలు సాధించినా, ఎంచుకున్న విజయం సాధించినా, తనకు నలుగురు పిల్లలు పుట్టిన తర్వాత కూడా నంద్ తన తల్లి మిస్ అవుతూనే ఉన్నారు. పిండిలో తన బాల్యం గురించి, అమ్మ గురించి చెదిరిన కలలా మాట్లాడుకునేవారు.

నాన్నగారి పిన్ని శ్రీమతి నిర్మల్ మెహతా చిబ్బర్ నాతో, ‘మీ నాన్నగారి – అమ్మని ఆమె కుటుంబంలో మిత్రి లేదా మిత్ర అని ముద్దుగా పిలిచేవారు. ఆమె ఉల్లాసభరితంగా ఉండేది, సంగీతం ఇష్టపడేది. పంజాబీ పాటలు బాగా పాడేది” అని అన్నారు. “ఆమె మగవాడిలా వేషం వేసుకునేది, వివాహాల సమయంలో కుటుంబ వేడుకలలో జరిగే నాటక ప్రదర్శనలలో ఎప్పుడూ మగ పాత్రలు పోషించేది”. వెనక్కి తిరిగి చూస్తే, నానమ్మకి  పాడటం, నాటక ప్రదర్శనల పట్ల ఉన్న అభిమానం ఖచ్చితంగా చిన్నారి నంద్ ఉపచేతన మనస్సులోకి చొచ్చుకుపోయి ఉండాలి – అతనో ఆకర్షణీయమైన పిల్లవాడు. తల్లి సుమిత్రకు మొదటి, ఏకైక సంతానం.

1936లో అతని తల్లి మరణం తర్వాత నానమ్మ (బిజీ)త్ అతన్ని నంద్ అని పిలవడం ప్రారంభించింది (అంతకుముందు ఆమె నందో అనేది). ఆరు సంవత్సరాల వయస్సు నుండి నంద్‌ని తల్లిలా పెంచిందామె.

“నానమ్మ ఓ చెక్క దువ్వెనతో నా జుట్టుని నెమ్మదిగా దువ్వేది. మజ్జిగ, ఇంట్లో తయారుచేసిన తెల్లటి నెయ్యిని, క్రితం రోజు తయారు చేసిన గోధుమ పరాఠాలపై వేసి  ఇచ్చేది. నేను బడినుంచి వచ్చాకా, వీధుల్లో ఆడుకోవడానికి పరిగెత్తే ముందు చాలా ఇష్టంగా తినేవాడ్ని. నానమ్మ చేసే వంటకాలలో, గాజర్ దా హల్వా, ఆతే దా హల్వా (గురుద్వారాలో చేసేది) వంటివి నాకిష్టం. ఒక్కోరోజు, నన్ను ఆశ్చర్యపరిచేందుకు, ఆనందపరిచేందుకు నా బడి భోజనం డబ్బాలో రహస్యంగా పెట్టేది. ఆమె నన్ను నా సొంత తల్లిలా ప్రేమించినప్పటికీ, నా కన్నతల్లి అక్కడ ఉంటే బాగుండు అని నేను కోరుకునేవాడిని.”

మా ఖుదా తో నహీఁ. లేకిన్ మా, తు ఖుదా సే కమ్ నహీఁ. (అమ్మా, నువ్వు దేవతవి కాదు, కానీ నువ్వు దేవత కంటే తక్కువా కాదు) అని మా నాన్న వాళ్ళ అమ్మని ప్రశంసిస్తూ, తరువాత తన పిల్లల తల్లిని ప్రశంసిస్తూ చెప్పేవారు.

దశాబ్దాల తరువాత, ఆయన భారత సైన్యంలో పనిచేస్తున్నప్పుడు, 1956లో తన మొదటి బిడ్డగా కుమార్తెను పొందినప్పుడు, అది ఆయనకి దేవుడు ప్రసాదించిన అదృష్టానికి సంకేతం. ఎందుకంటే బిజీ ఆయనకి బేటియాన్, పియోహ్ దే లియే అచ్చా నసీబ్ లాండి హై (కూతుళ్లు తమ తండ్రులకు అదృష్టాన్ని తెస్తారు) అని చెప్పారని తెలిపారు. అతని కుమార్తె జననం అతను సైన్యం నుండి వచ్చేసి ‘తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి’ రెండవసారి సినిమాల్లో దూకడానికి ఉత్ప్రేరకంగా మారింది.

బిజీ కూడా మీ పిల్లలను ప్రేమించడానికి ఉత్తమ మార్గం వారి తల్లిని ప్రేమించడమే అని చెప్పేది. నేను కొన్నిసార్లు మా అమ్మతో దురుసుగా ప్రవర్తించినప్పుడు, నాన్న నాతో, ‘నీకు తల్లి ఉంది కాబట్టి నువ్వు ఆమెతో దురుసుగా ప్రవర్తిస్తావు. కాబట్టి నువ్వు ఆమెకు విలువ ఇవ్వవు. నేను ఆరేళ్ల వయసులో నా తల్లిని కోల్పోయాను. అమ్మ విలువ ఏమిటో నన్ను అడగండి. ఆమె కౌగిలింత కోసం నేను దాహంతో వేచివున్నాను, అప్పటి నుండి నేను అలాగే భావిస్తున్నాను’ అని అంటాడు.

***

చిట్టీ నా కోయీ సందేశ్, జానే వో కౌన్‌సా దేశ్, కహాఁ తుమ్ చలే గయే’ – దుష్మన్

తల్లి ప్రేమను కీర్తిస్తూ లెక్కలేనన్ని,  బహుశా ఇతర గీత రచయితల కంటే ఎక్కువగా, చిరస్మరణీయమైన పాటలు రాశారు ఆనంద్ బక్షి. వారి చాలా పాటలు ముఖ్యంగా – ఖల్ నాయక్ (‘మా తుఝే సలామ్’), ఛోటా భాయ్ (‘మా ముజే అప్నే ఆంచల్ మే ఛుపా లే’), రాజా ఔర్ రంక్ (‘తూ కిత్నీ అచ్ఛీహై’,  ‘మేరే రాజా మేరే లాల్ తుజ్కో ధూండూఁ మై కహాఁ’), ఆస్రా, మా, మస్తానా (‘మైనే మా కో దేఖా హై మా కా ప్యార్ నహీఁ దేఖా’), అమర్ ప్రేమ్ (‘బదా నఠ్‌ఖట్ హై రే’), వంటి పాటలలో తల్లి-బిడ్డల అనుబంధంపై అత్యుత్తమ గీతాలు వెలువరించారు.

***

బాతేఁ, భూల్ జాతీ హైఁ, యాదేఁ, యాద్ రహ్ జాతీ హైఁ, యె యాదేఁ, కిసీ దిలో-జనమ్ కే, చల్ జానే కే బాద్ ఆతీ హైఁ, యాదేఁ మీఠీ మీఠీ యాదేఁ’ – యాదేఁ.

నంద్ నాన్నగారికి రెండవ భార్య యశోదా దేవి ద్వారా ఆరుగురు పిల్లలు – ఉమ, శుభ్, ఇందిర, జీవన్, అశోక్, వేద్. శుభ్, ఆమె భర్త స్వర్గీయ ఖేమ్ రాజ్ దత్ – మా నాన్నతో ఆత్మీయంగా ఉండేవారు. 1970లలో, నాన్న తన సవతి సోదరులలో ఒకరి కళాశాల గ్రాడ్యుయేషన్‌లో సాయం చేశారు, మా తాతయ్యకి, 1971లో ఢిల్లోలో ఆయన చనిపోయే వరకూ, ఆర్థికంగా తోడ్పడ్డారు. నాన్న సవతి సోదరులు, సోదరీమణులు నాన్నని అభిమానించేవారు, అయినా, తన తల్లి నుండి తనకు సొంత తోబుట్టువులు జన్మించలేదే అని నాన్న బాధపడేవారు.

నంద్ రావల్పిండిలోని కేంబ్రిడ్జ్ కళాశాలలోని ఉర్దూ-మీడియం పాఠశాలలో చేరారు. ఆ తరువాత, రాయల్ ఇండియన్ నేవీలో చేరారు. తరువాత ‘ఆనంద్ ప్రకాష్’ గా భారత సైన్యంలో చేరారు. ఆనంద్ ప్రకాష్ సైన్యంలో తన మొదటి పోస్టింగ్ సమయంలో మొదటిసారి ఓ ఫౌజీగా కవితలు రాయడం ప్రారంభించినప్పుడు, ‘ఆనంద్ ప్రకాష్ బక్షి’ అని సంతకం చేశారు. గీత రచయితగా ఆయన మొదటి చిత్రం ‘భలా ఆద్మీ’ విడుదలైన తర్వాత 1959 నుండి మాత్రమే ఆయన్ని ‘ఆనంద్ బక్షి’ అని పిలవడం ప్రారంభించారు, ఎందుకంటే ఒక్కోసారి ‘Bakshi’ అనీ, మరోసారి ‘Buxi’ అనీ వారి ఇంటిపేరును సినిమా క్రెడిట్ టైటిల్స్‌లో తప్పుగా ప్రస్తావించారు, చివరికి, ‘Bakshi’ శాశ్వతంగా నిలిచిపోయింది.

ఇంట్లోని పెద్దలు – నాన్నగారు, తాతగారు, తరువాత కాలంలో, మామగారు అమర్ సింగ్ మోహన్ – ఆనంద్‌ని ‘అజీజ్’ (అత్యంత ప్రియమైన వ్యక్తి) అని సంబోధించేవారు, వారి ఉత్తర ప్రత్యుత్తరాలలో. ముఖ్యంగా సైన్యం వంటి స్థిరమైన ఉద్యోగాన్ని వదిలి (విభజన తర్వాత కుటుంబానికి సొంత ఇల్లు కూడా లేకపోవడంతో) బంబై వంటి పరాయి నగరంలో అనిశ్చిత జీవితం, వృత్తి కోసం వెళ్ళినందుకు వాళ్ళంతా నంద్‌ని తమ తమ ఉత్తరాలతో తీవ్రంగా మందలించారు. ‘నేను పోలీసులు, ఫౌజీలు, జమీందార్ల వంశానికి చెందినవాడిని, కానీ కుటుంబంలో నేను మాత్రమే వేరే వృత్తి ఎంచుకున్నాను!’

ఉత్తర భారతదేశంలో ఉద్భవించినవారిలా చెప్పబడే యుద్ధకళకారుల మోహయల్స్ అనే సముదాయంలో, వృత్తిగా ‘సినిమా రంగం’ తక్కువగా పరిగణించబడింది.

***

మేరే దేశ్ మే, పవన్ చలే, పూర్వాయ్..

1988లో ఎప్పుడో ఓసారి, ఓ స్నేహితుడు – గేయ రచయితగా నైపుణ్యాలను ఎప్పుడు, ఎలా అభివృద్ధి చేసుకున్నావని ఆనంద్ బక్షిని అడిగాడు. అప్పుడాయన ఇలా చెప్పారు:

‘సినిమా పాటల పట్ల నాకున్న ప్రేమ – బాంజో వాయించడం, పాడటం అనే అభిరుచితో మొదలైంది. పాటలు రాయడం అనేది నేర్పించలేము. కాలక్రమేణా, మీరు ఈ నైపుణ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు. అయితే, ఈ రోజు సృజనాత్మకత అని దేన్నైతే అంటున్నారో ఆ ప్రతిభ పుట్టుకతోనే అబ్బాలి. వెనక్కి తిరిగి చూస్తే, గీత రచయితగా, గాయకుడిగా నా అభివృద్ధి పిండిలోని నా బాల్యంలో ప్రారంభమైంది. మేరా గావ్, మేరీ మా, మేరీ మిట్టి థీ వో (అది నా గ్రామం, నా తల్లి, నా నేల). నాకు సినిమా పాటలు పాడటం, బాంజో వాయించడం చాలా ఇష్టం. మా పరిసరాల్లో పండుగ సందర్భాలలో క్రమం తప్పకుండా జరిగే రామ్ లీల, సోహ్ని-మహివాల్, లైలా~మజ్ను నౌటంకీలు/నాటకాలకు సంభాషణలు, పద్యాలు నేను అప్రయత్నంగా రాసేవాడిని. ఇంటి బయట వీధిలో నేను రాసిన పద్యాలను పాడేవాడిని. వాటిని వేదికపై కూడా ప్రదర్శించేవాడిని. అప్పట్లో నటులకు పాడగలిగితే తప్ప మంచి పాత్రలు ఇచ్చేవారు కాదు. ఆఘా కాశ్మీరీ,

మున్షీ ప్రేమ్‌చంద్‌ల నాటకాలు ఆధునికమైనవి, వాటిని చాలా మంది ఇష్టపడ్డారు; లైలా – మజ్ను, హీర్ – రాంజా, షిరీన్ – ఫర్హాద్, సోహ్ని -మహివాల్ అనే కథలు వందలాది మందిని ఆకర్షించాయి. దాదాపు అన్నింటిలోనూ నేను పాత్రలు పోషించాను. నటుడు, దర్శకనిర్మాత సునీల్ దత్ నా మోహయల్ బంధువు, మరియు మా ఆత్మీయుల వివాహాల సమయంలో మేము కలిసి పాడేవాళ్ళం, నాటకాలు వేసేవాళ్ళం. “సుహే వే చీరే వాలేయా మైన్ కెహెని ఆన్” అనేది చాలా ప్రజాదరణ పొందిన పెళ్ళి పాట. నేను పాడటానికి, డాన్స్ చేయడానికి ఇష్టపడతాను. కొంతమంది పంజాబీ అమ్మాయిలు మాత్రమే నటించడానికి లేదా పాడటానికి ధైర్యం చేయడం వలన పురుషులు స్త్రీపాత్రలు పోషించడం సాధారణం.

‘మేము స్నేహితులతో కలిసి పిండి మార్కెట్‌కి వెళ్లి, తాజా చెరకు కొనుక్కుని, కత్తితో కోయకుండా పళ్లతో చీల్చుకుని తినేవావాళ్ళం – అలా చేయగలిగినందుకు మాకు కొంత గర్వంగా అనిపించేది. పత్తే వాలీ (ఆకు) కుల్ఫీ అమ్మే వ్యక్తి రోజూ మా వీధికి వచ్చి, తన రాకను ప్రకటించడానికి గంట మోగిస్తూ, బరువు కొలత కోసం త్రాసును తీసుకువెళుతుండేవాడు. సంత ఉండే రోజులలో పట్టణంలో ఒంటెలు నడిచేవి, మేం పిల్లలం, దాన్ని చూడటానికి ఇష్టపడేవాళ్ళం. మాకు అదొక మనోహరమైన దృశ్యం. మాకు తెలియని మొహల్లా చేరేవరకు మేం వాటిని వెనుకే వెళ్ళేవాళ్ళం. బడి వేళ అయిపోయాకా, తిన్నగా ఇంటికి వెళ్ళకుండా, దారిలో చార్టర్ అనే పాచికల ఆటను ఆడుకుంటూ కాలక్షేపం చేసేవాళ్ళం. అది మాకు బాగా ఇష్టమైన ఆట. పిండి శివార్లలోని ఒక స్నేహితుడి పొలంలో ఎద్దులను ఉపయోగించి బావి నుండి నీటి తోడి స్నానం చేసేవాళ్ళం. అపరిచితుల చెట్ల నుండి పండ్లు దొంగిలించడం మా అలవాటు. పైగా దొంగిలించబడిన పండ్లు ఎల్లప్పుడూ ఉత్తమ రుచిని కలిగి ఉంటాయి.

‘నేటి నగరాల్లో, మన పొరుగువారి పేర్లు మనకు తెలియవు. నా చిన్నప్పుడు, మా మొహల్లా అంతా నాకు తెలుసు. అలాగే మేము కూడా అందరికీ తెలుసు.  నేను నాటకం చూస్తున్నప్పుడో లేదా వేస్తున్నప్పుడో ఎవరైనా చూసి నాన్నకో, తాతగారికో చెప్తే, వాళ్ళూ నన్ను కర్రతో కొట్టేవారు. తాతగారు తన వాకింగ్ స్టిక్‌తో కొట్టిన దెబ్బలు చాలా గట్టిగా తగిలేవి, నేటికీ వాటిని గుర్తుచేసుకుంటే నాకు నొప్పితో వణుకు పుడుతుంది. తల్లి లేని బిడ్డ దారి తప్పుతాడేమో అని భయపడి, అమ్మ చనిపోయాకా, వాళ్ళు నా పట్ల మరింత కఠినంగా మారారు.

చాలా తేలికగా. వారు నన్ను ‘కంజర్ అని పిలిచేవారు – అది ఒక సంచార తెగ పేరు. కానీ కొన్నిసార్లు అప్పట్లో సినిమా, నాటకాల కళాకారులను అవమానించే పదంగా ఉపయోగించేవారు. మా ఇంట్లో సినిమాలకి, నాటకాలకి, అస్సలు ప్రోత్సాహం లేదు, అయినప్పటికీ మాకు గ్రామోఫోన్ ఉంది. నాన్న భక్తి పాటలు, సైగల్ పాటలు ఇష్టంగా వినేవారు. మొహయల్స్‌గా మేము సైన్యంలోనైనా ఉండాలి, లేదా, బ్యాంకింగ్‌ రంగంలో ఉండాలి; మేము ఉగ్యోగంలో, వృత్తిలో నిపుణులుగా ఉండాలి. వ్యాపారం చేసుకోడం కూడా ఆమోదనీయం కాదు. “హమారీ ఖూన్ మే నహీఁ హై” (ఇది మా రక్తంలో లేదు).

‘నాకు సంగీతం చాలా ఇష్టం! మా పరిసరాల్లో రోజంతా రామాయణం, భగవద్గీతలను సంగీతపరంగా పఠించడం, గురు గ్రంథ్ సాహిబ్ పాఠ్, శ్రావ్యమైన అజాన్ వినిపించడం నాకు చాలా ఇష్టం. రైతులు విత్తనాలు చల్లేటప్పుడు లేదా పంట కోసేటప్పుడు లేదా సూర్యాస్తమయం తర్వాత తమకి తాము వినోదం కల్పించుకునేందుకు తమ పొలాల్లో వారు పాడే పాటలు వినడం నాకు చాలా ఇష్టం. బహుశా అందుకే నేను “మేరే దేశ్ మే పవన్ చలే, పూర్వాయ్” లేదా “లిఖా హై యే ఇన్ బవావోఁ మే, మై హూఁ తేరే లియే, తు హై మేరే లియే” లాంటివి అలవోకగా రాయగలిగాను.

‘రోజువారీ గ్రామీణ జీవితం, ప్రకృతి, జానపద సంగీతం, పంజాబ్‌కి చెందిన ప్రతిదీ నన్ను ఆకర్షించాయి. రేడియో వినడం, తాతగారి గ్రామోఫోన్‌లో భక్తి పాటలు వినడం నాకు చాలా ఇష్టం. ముఖేష్, లత, మహమ్మద్ రఫీ కూడా నాకు ప్రేరణ. వేదికపై సైగల్ పాటలను పాడటం నాకు బాగా ఇష్టం. మా గ్రామంలో జరిగే అన్ని వివాహాలకు, కొన్నిసార్లు ఆహ్వానం లేకుండానే, అక్కడ వినిపించే సంగీతం వినడానికి, పాడటానికి నేను హాజరయ్యేవాడిని. పదిహేడు సంవత్సరాలుగా నా మనసు మా ప్రాంతం లోని, నా సహజ వాతావరణం లోని ప్రతి శబ్దాన్ని, వాసనను, రంగును గ్రహిస్తూనే ఉంది. అప్పట్లో నేను దీన్ని ఎప్పుడూ గ్రహించలేదు, కానీ నా కుటుంబ వాతావరణం, తల్లి లేకపోవడం, నా పరిసరాలు నా సున్నితమైన, భావోద్వేగ స్వభావాన్ని రూపొందించాయి. నేను చాలా సులభంగా బాధపడతాను. కాబట్టి దీనికి నేను  మూల్యం కూడా చెల్లించుకున్నాను.

(మళ్ళీ కలుద్దాం)

Exit mobile version