[శ్రీ రాకేశ్ ఆనంద్ బక్షి రచించిన ‘నగ్మే, కిస్సే, బాతేఁ, యాదేఁ – ది లైఫ్ అండ్ లిరిక్స్ ఆఫ్ ఆనంద్ బక్షి’ అనే ఆంగ్ల పుస్తకాన్ని అనువదించి పాఠకులకు అందిస్తున్నారు కొల్లూరి సోమ శంకర్.]
అధ్యాయం 11 – నివాళులు – మొదటి భాగం
‘దీవానే తేరే నామె కే, ఖడే హైఁ దిల్ థామ్ కే’.
ప్యారేలాల్ శర్మ (లక్ష్మీకాంత్-ప్యారేలాల్)
మేము మొదట బక్షిజీని కలిసినది, పెద్దార్ రోడ్‌లోని కళ్యాణ్‌జీ-ఆనంద్‌జీ గారి మ్యూజిక్ రూమ్‌లో. అప్పట్లో మేము కళ్యాణ్‌జీ-ఆనంద్‌జీకి సహాయకులం. బక్షిజీ మా అందరి కంటే చక్కగా సమయపాలన పాటించేవారు. సమయపాలన, క్రమశిక్షణ ఆయన ప్రధాన లక్షణాలు. ఆయన తన మనోభావాలకు, కోరికలకు, లేదా వాతావరణానికి బానిస కాదు. ఆయన ఎక్కడ ఉన్నా, వారి సిట్టింగ్ రూమ్‌లో అయినా, రికార్డింగ్ స్టూడియోలో అయినా, అవసరమైనప్పుడు, ఎప్పుడూ సాకులు చెప్పలేదు. ఎన్నడూ.
కథ విన్న వెంటనే బక్షిజీ పాట పల్లవి లేదా ఉపపల్లవి రాసేవారు, మరుసటి రోజు అవసరమైన దానికంటే ఎక్కువ చరణాలతో పూర్తి పాటను మాకు అందించేవారు. అప్పుడు, వేటిని ఉంచాలి వేటిని తీసెయ్యాలలనేది దర్శకుడి, కొన్నిసార్లు స్వరకర్తల తలనొప్పిగా మారేది,ఎందుకంటే మేం మూడు చరణాల కంటే ఎక్కువ ఉపయోగించలేము. బక్షిజీ గాయకుడవ్వాలని, స్వరకర్త అవ్వాలనే కోరికతో ఇక్కడికి వచ్చారని నమ్ముతాను. పాటలు రాయడం కేవలం ఆయన అభిరుచి మాత్రమే అని నేను ఇప్పటికీ భావిస్తాను. కానీ గీత రచయితగా ఆయన వదిలివెళ్ళిన వారసత్వాన్ని చూడండి! ‘జిందగీ కీ సఫర్ మే గుజర్ జాతే హైఁ ముకామ్, వో ఫిర్ నహీఁ ఆతే’ అని ఆయన చెప్పింది అక్షరాలా నిజం! వారు లేని లోటు తెలుస్తోంది.
ధర్మేంద్ర (సింగ్ డియోల్)
నేను ఆయనను ‘రాజా’ అని పిలిచేవాడిని. మేము దాదాపు 70-71 సినిమాల్లో పనిచేశాము. లక్ష్మీకాంత్-ప్యారేలాల్, రఫీ, బక్షీజీ మాకు ప్రతిజ్ఞ (1975)లో ‘మై జాట్ యమ్లా పగ్లా దీవానా’ అనే అద్భుతమైన పాటను బహుమతిగా ఇచ్చారు. ఆజ్ బి బజ్తా హై యే గానా (ఈ పాట ఇప్పటికీ వినబడుతూనే ఉంటుంది). చాలా అలవోకగా రాసేవారు. 1970లలో, నా ముందు, ఎస్.డి. బర్మన్ ముందు కూర్చుని ఆయన ఐదు నిమిషాల కంటే తక్కువ సమయంలో ఈ పాట రాశారు – యే దిల్ దీవానా హై, దిల్ తో దీవానా హై, దీవానా దిల్ హై యే, దిల్ దీవానా! ‘ఇష్క్ పర్ జోర్ నహీఁ’ సినిమా కోసం దర్శకుడు రమేష్ సైగల్ చెప్పిన సంక్షిప్త సమాచారం ప్రకారం, దిల్ అనే పదం నాలుగు లేదా ఐదు సార్లు రావాలి పాటలో. బక్షి సాబ్ కేవలం ఒక గీత రచయిత కాదు. ఆయనో కవి. ఆయన లేని లోటుని ఎవరూ తీర్చలేరు.
{నేను ధర్మేంద్ర గారిని కలిసిన వారి ఇంటి నుంచి బయటకి వస్తుండగా, ఆయన సోదరుడు, ప్రతిజ్ఞ నిర్మాత అజిత్ సింగ్ డియోల్‌ను కలిశాను. ఆయన నాతో – బక్షి సాబ్ కేవలం గీత రచయిత మాత్రమే కాదని అన్నారు. వో హుమారే పీర్ థే. ఆయన పాటల్లో కొన్ని వాక్యాలు ఓ పీర్ (ఆధ్యాత్మిక మార్గదర్శి) సందేశంలా ఉండేవి అన్నారు.}
యష్ చోప్రా
నేను తరచుగా సినిమా ఫంక్షన్లలో, సినిమా పార్టీలలో బక్షిజీని కలుస్తుండేవాడిని. అప్పటికే ఆయన గొప్ప విజయవంతమైన పాటల రచయిత. ఆయనకి పాడటం ఇష్టం, బాగా పాడేవారు. ఒక రోజు మా పాటల రచయిత సాహిర్ నన్ను బక్షిగారికి పునఃపరిచయం చేశాడు. సాహిర్ నా పాటల రచయిత మాత్రమే కాదు, నా ప్రియమైన స్నేహితుడు కూడా. అతను నాతో, “మీ సినిమాలో ఏదో ఒక రోజు ఆనంద్ బక్షితో పాటలు రాయించుకోండి. అతను కూడా బాగా రాస్తాడు” అని చెప్పాడు. నా సొంత పాటల రచయిత సాహిర్ సాబ్ మరొక పాటల రచయితను సిఫార్సు చేయడం చూసి నేను ఆశ్చర్యపోయాను. సాహిర్ సాబ్ నా చిత్రాలలో పాటలు రాయడం పట్ల నేను చాలా సంతోషంగా ఉన్నాను, వేరొక పాటల రచయితను సిఫార్సు చేయమని నేను అతనిని అడగలేదు. అయినప్పటికీ అతనలా చేసాడు! ఆనంద్ బక్షిని సిఫార్సు చేశాడు.
బక్షిజీ గురించి గొప్ప విషయం ఏమిటంటే – 1980లలో సాహిర్ సాబ్‌తో, అంతకు ముందు కూడా, పార్టీలలో అప్పుడప్పుడు, కలిసే సమయానికి మేమిద్దరం మా రంగాలలో స్థిరపడిన నిపుణులం అయినప్పటికీ – ఆయన నా సినిమాలలో పాటలు రాయడానికి అవకాశం ఇవ్వమని ఎప్పుడూ అడగలేదు. సాహిర్ సాబ్ నాకిష్టమైన పాటల రచయిత అనీ, నా ప్రియమైన స్నేహితుడని కూడా బక్షిజీకి తెలుసని నేను భావిస్తున్నాను. మా సంబంధాన్ని బక్షిజీ గౌరవించారు, ఆదరించారు. నేను కలిసిన మంచి మనుషులలో బక్షిజీ ఒకరు. ఆయన నంబర్ వన్ పాటల రచయిత అని నేను చెప్పగలను. అయితే, మనకి చాలా మంది మంచి కవులు, పాటల రచయితలు ఉన్నారు. కానీ ఆనంద్ బక్షి వంటి పాటల రచయితా, కవీ ఒక్కరే ఉంటారు.
ఒకరోజు, ఒక పెద్ద నిర్మాత నన్ను తన సినిమాకి దర్శకత్వం వహించమని అడిగాడు – సంగీతం ఆర్.డి. బర్మన్. నిర్మాత గుల్షన్ రాయ్. ఆయనో, లేదా బర్మన్ గారో గుర్తు లేదు, ఆ సినిమా పాటల కోసం ఆనంద్ బక్షి సాబ్‌ని తీసుకోవాలని సూచించారు. తత్ఫలితంగా, నేను వెళ్ళి బక్షిజీని కలిశాను. ఈ సినిమాకి సాహిర్ గారు ఎందుకు రాయడం లేదు అని ఎటువంటి ప్రశ్నలు అడగకుండానే, నా సినిమాకి పాటల రచయితగా పనిచేయడానికి బక్షీజీ సంతోషంగా అంగీకరించారు.
అయితే, ఇంటికి తిరిగి వచ్చాకా, నాలో ఏదో అపరాధ భావన కలిగింది. చాలా బాధ అనిపించింది. సాహిర్ సాబ్ కూడా చాలా మంచి పాటల రచయిత కదా అని అనుకున్నాను, పైగా అతను చాలా సంవత్సరాలుగా నాకు చాలా మంచి మిత్రుడు. అందువల్ల, సాహిర్ సాబ్‌తో కలిసి పనిచేయడం కొనసాగించాలని అనుకున్నాను. ఇంతకు ముందొకసారి బక్షిజీతో కలిసి పనిచేయమని సాహిర్ సాబ్ స్వయంగా చెప్పిన విషయం గుర్తొచ్చింది. అయినా, నేను బక్షి సాబ్ వద్దకు తిరిగి వెళ్లి, అతనితో కలిసి పనిచేయలేకపోవడం పట్ల నాకు బాధగా ఉందని చెప్పాలని నిర్ణయించుకున్నాను. సిగ్గుతో, సంకోచంతో బక్షిజీని సంప్రదించాను. ఆయనకిచ్చిన మాటను వెనక్కి తీసుకున్నందుకు ఎన్నో క్షమాపణలు చెప్పాను. నా ప్రియమైన మిత్రుడు, గొప్ప ప్రతిభావంతుడైన గీత రచయిత సాహిర్ సాబ్‌కు నేను విధేయుడిగా ఉండాలనుకుంటున్నానని, కాబట్టి బక్షిజీ ప్రతిభను నా సినిమాలో ఉపయోగించలేనని నేను నిజాయితీగా ఆయనకి చెప్పాను. ముందు నా అంతట నేనుగా బక్షీజీ సంప్రదించిన మాట నిజం, అయినా ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదు.
బక్షిజీ ఎంతో దయగలవారు. నా నిర్ణయం పట్ల సంతోషించారు, సాహిర్ సాబ్‌తో కలిసి పనిచేయడం కొనసాగించాలని నేను కోరుకున్నందున, నేను ముందు రోజు ఆయనతో ఒప్పందం కుదుర్చుకున్నప్పటికీ, ఆయన తప్పుకున్నారు. దీనికి కారణం ఏమిటో నాకు తెలుసు – సాహిర్ సాబ్ బక్షిజీకి పాటల రచనపై కొన్ని సలహాలిచ్చాడు, 1950లలో, 60 లలో బక్షిజీ ఈ వృత్తిలో స్థిరపడాలని చూస్తున్నప్పుడు కొంతమంది మంచి నిర్మాతలకు, దర్శకులకు ఆయనని గట్టిగా పరిచయం చేశాడు. సాహిర్ సాబ్ సహాయాన్ని బక్షిజీ ఎన్నడూ మర్చిపోలేదని నేను భావించాను.
ఆశ్చర్యకరంగా, ఈ సినిమాలో లేదా మరే సినిమాలో కలిసి పనిచేయకపోయినా, మనం స్నేహితులుగానే ఉండాలని బక్షిజీ నాతో అన్నారు. బక్షి సాబ్ ఎప్పుడూ ఇతర ప్రత్యర్థి రచయితల గురించి, లేదా తను పని చేయని వ్యక్తుల గురించి, లేదా తనతో పనిచేయడానికి ఇష్టపడని వారి గురించి చెడుగా మాట్లాడలేదు. ఆయన ఎప్పుడూ మౌనంగా ఉండేవారు, తన పనిని నిశ్శబ్దంగా చేసేవారు, ఆపై తన పని పూర్తయిన వెంటనే వెళ్ళిపోయేవారు. తరువాతి కాలంలో, మేము కలిసి చేసిన అనేక సినిమాల ద్వారా స్నేహితులుగా మారినప్పుడు కూడా, ఆయన ఎప్పుడూ అనవసరమైన కబుర్లు లేదా పుకార్లలో మునిగిపోలేదు. ఆయన ఎప్పుడూ అక్కడే వేళ్ళాడేవారు కాదు; పాట పూర్తయిన వెంటనే వెళ్ళిపోయేవారు.
దేవుడు సాహిర్ సాబ్‌ను మా నుండి దూరం చేసినప్పుడే నా సినిమా కోసం బక్షిజీని సంప్రదించాడు. ఆయనతో నా మొదటి సినిమా ‘చాందినీ’. తర్వాత ఆయన నేను తీసిన సినిమాలకు, మా సంస్థ తీసిన సినిమాలకు అద్భుతమైన పాటలని, గొప్ప సాహిత్యాన్ని కానుకగా ఇచ్చారు! మర్చిపోలేని సహకారం వారిది! ‘చాందినీ’ సినిమా ఆడకపోవచ్చని నేను చాలా భయపడ్డాను. ఆయన ప్రివ్యూ చూసి, నేను సూపర్ హిట్ సినిమా చేశానని చెప్పారు. ఆయన కథను అద్భుతంగా అర్థం చేసుకున్నారు.
బక్షిజీ నా కోసం నిమిషాల్లో పాటలు రాసేవారు. కొన్నిసార్లు తన కారులో బాంద్రాలోని తన ఇంటి నుండి జుహులోని నా ఇంటికి చేరే పదిహేను నిమిషాల వ్యవధిలో పాటలు రాసేవారు. కొన్నిసార్లు నేను ఫోన్‌లో సన్నివేశం చెబుతూ ఉన్నప్పుడు నాలుగు నిమిషాల కంటే తక్కువ సమయంలో పాటలు రాసేవారు. పాట రికార్డింగ్ సమయంలో మేము చిక్కుకుపోయి ఒక చరణం లేదా పదాన్ని మార్చాలని భావించినప్పుడు, నేను ఆయనకి ఫోన్ చేసేవాడిని. ఆయన ఎప్పుడూ కాదని చెప్పరు, రేపు ఫోన్ చేస్తానని అనరు. అక్కడిక్కడ, నా కోసం పదాలు లేదా పంక్తులను రాసిచ్చి, అవసరమైన మార్పులు చేసేవారు! ఎంత ప్రొఫెషనల్! బక్షిజీ ప్రతిభ, వేగం, లోతు, అంకితభావం, ఉత్సాహం అలాంటివి. నేను ముందుగా ఆమోదించిన తర్వాత కూడా నేను ఏదైనా ఎందుకు మార్చాలనుకుంటున్నానని ఆయన నన్నెప్పుడూ ప్రశ్నించలేదు లేదా ఇబ్బంది పెట్టలేదు. ఎల్లప్పుడూ, అలాంటి పరిస్థితి తలెత్తిన ప్రతి సందర్భంలో, ఎప్పుడైనా, ఏ రోజునైనా సహాకరం అందించారు.
ఒకసారి, ఆయన పేస్‌మేకర్ కోసం నానావతి ఆసుపత్రిలో చేరినప్పుడు, నేను కలవడానికి వెళ్ళాను. ‘చాందినీ’ లోని ఒక పాట కోసం కొన్ని కొత్త చరణాల గురించి ఆలోచించానని అన్నారు. నిజానికి ఆ సినిమా పాటలు అప్పటికే పూర్తి చేసి నాకు అందించారు. అప్పటికే రాసిన దానిలో మెరుగులు దిద్దమని నేను ఎప్పుడూ అడగలేదు. అంటే, గుండె జబ్బుతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నప్పుడు కూడా ఆయన – తన దర్శకులు, నిర్మాతల గురించి ఆలోచిస్తున్నారు: అలాంటి వ్యక్తులు, అంత అంకితభావం, అంత ప్రతిభ, అంత నిజాయితీ, అంత ఉత్సాహం, నేడు ఎవరికి ఎక్కడ ఉన్నాయి?
నేటికీ, నాకూ, నా కొడుకు ఆదిత్యకూ బక్షీ సాబ్ మరవలేని మనిషి.
లతా మంగేష్కర్
మేము మా పాటలను రికార్డ్ చేసిన తర్వాత స్టూడియోలో ఎప్పుడైనా కలుసుకున్నఫ్ఫుడు, బక్షీజీ ఒక్కరే నన్ను ‘వాహ్ జీ వాహ్’ అంటూ పంజాబీలో మెచ్చుకునేవారు! నేను పాడిన ఆయన పాటలు కొన్ని ప్రస్తుతం నా మనసుకి తట్టాయి: ‘జానే క్యూఁ లోగ్ మొబబ్బత్ కియా కర్తే హైఁ’, ‘బాఘోఁ మే బహార్ హై, కలియోం పే నిఖార్ హై, తుమ్‌కో ముజ్ కే ప్యార్ హై’,’తు మేరే సామ్నే మై తేరే సామ్నే,తుజ్‍కో దేఖూఁ కే ప్యార్ కరూఁ’, ‘తేరే మేరే హోంటో పే మీఠే మీఠే గీత్ మిత్వా’, ‘ప్యార్ తేరీ పహ్లీ నజర్ కో సలామ్’.
రికార్డింగ్ సమయంలో ఆయన ఎవరితోనూ ఎప్పుడూ జోక్యం చేసుకోలేదు. ఆయన చాలా నిశ్శబ్దంగా ఉండే వ్యక్తి, తన అన్ని పాటల రికార్డింగ్‌లకీ హాజరవవడం; అవసరమైనప్పుడు, తన పదాలను పూర్తిగా అర్థం చేసుకోలేదన భావించినప్పుడో లేదా పదాలను తప్పుగా ఉచ్చరించే అనుభవజ్ఞులైన గాయకులకు కూడా వ్యక్తీకరణలలో మార్పులు అవసరమని భావించినప్పుడో అలా సూచించే అతి కొద్దిమంది గీత రచయితలలో బక్షీజీ ఒకరు. ‘చాందినీ’ సినిమాలోని ‘తేరే మేరే హోంటో పే,మీఠే మీఠే గీత్ మిత్వా’ పాట రికార్డ్ చేస్తున్నప్పుడు, ఆయన నా దగ్గరకు వచ్చి ‘మీఠే’ అనే పదాన్ని మృదువుగా కాకుండా ‘ఠ’ని ఒత్తిపెట్టి బలంగా గట్టిగా ఉచ్చరించమని చెప్పారు. ఆయన సూచన ఆ పాటకు గొప్ప తేడాను కలిగించింది! గాయకుడిగా ఆయన తన మొదటి పాటను రికార్డ్ చేస్తున్నప్పుడు, ఆయన ఒక ప్రొఫెషనల్ లాగా పాడారని తెలుసుకుని నేను ఆశ్చర్యపోయాను, ఎందుకంటే కొన్నిసార్లు కొత్త గాయకులు మొదటిసారి నాతో పాడటంలో భయపడ్డారు. ఆయన బాగా పాడారు, చక్కగా ధున్ కూడా చేశారని అనుకుంటున్నాను.
2001 లో నాకు పద్మ విభూషణ్ పురస్కారం లభించినప్పుడు, ఆయన నాకు ప్రశంసగా రాసిన కవితను బహుకరించాడు. అప్పటికే ఆయన ఆరోగ్యం అంత బాగా లేదని తెలుసు, అయినప్పటికీ ఆయన ఆ కార్యక్రమంలో నన్ను చూడటానికి వచ్చారు. నేను వేదిక దిగి వెళ్ళినప్పుడు ఆ కవితను నాకు అందించారు. వారి ఆప్యాయతా, ఈ చర్య నన్ను చాలా కదిలించింది. ఆ కవిత:
యే గుల్షన్ మే బాద్-ఏ-సబా గా రహీ హై
కే పర్బత్ పే కాలీ ఘటా గా రహీ హై।
యే ఝరనోం నే పైదా కియా హై తరన్నుమ్
కే నదియా కోఈ గీత్-సా గా రహీ హై।
యే మహివాల్ కో యాద్ కరతీ హై సోహ్నీ
కి మీరా భజన్ శ్యామ్ కా గా రహీ హై।
ముఝే జానే క్యా క్యా గుమాన్ హో రహే హైఁ
నహీఁ ఔర్ కోయీ, లతా గా రహీ హై।
యూఁ హీ కాష్ గాతీ రహేఁ యే హమేషా
దువా ఆజ్ ఖుద్ యే దువా గా రహీ హై।
[నాన్న రాసిన పాటలని లతాజీ అత్యధికంగా పాడారు. నేను పూర్తి లెక్క చెప్పలేను, కానీ అక్టోబర్ 1990 వరకు, ఆమె 309 చిత్రాలకు నాన్న రాసిన 679 పాటలు పాడారు.]
(మళ్ళీ కలుద్దాం)
కొల్లూరి సోమ శంకర్ రచయిత, అనువాదకులు. బి.ఎ.డిగ్రీతో గ్రాడ్యుయేషన్. మానవ వనరుల నిర్వహణలో పిజి డిప్లొమా చేసారు. దక్షిణ భారత హిందీ ప్రచార సభ వారి భాషా ప్రవీణ పాసయ్యారు. ప్రస్తుత నివాసం హైదరాబాదు.
సోమ శంకర్ 2001 నుంచి కథలు రాస్తున్నారు. 2002 నుంచి కథలను అనువదిస్తున్నారు. కేవలం కథలే కాక ‘ది అడ్వెంచర్స్ ఆఫ్ పినోకియో’ అనే పిల్లల నవలను ‘కొంటెబొమ్మ సాహసాలు’ అనే పేరుతోను, ‘మాజిక్ ఇన్ ది మౌంటెన్స్’ అనే పిల్లల నవలను ‘కొండలలో వింతలు’ అనే పేరుతోను, వినయ్ జల్లా ఆంగ్లంలో రాసిన ‘వార్స్ అండ్ వెఫ్ట్’ అనే నవలని ‘నారాయణీయం’ అనే పేరుతోను, వరలొట్టి రంగసామి ఆంగ్లంలో రాసిన ‘లవ్! లవ్! లవ్!’ నవలను ‘సాధించెనే ఓ మనసా!’ పేరుతోనూ, అజిత్ హరిసింఘానీ రచించిన ట్రావెలాగ్ ‘వన్ లైఫ్ టు రైడ్’ను ‘ప్రయాణానికే జీవితం’అనే పేరుతోను, డా. చిత్తర్వు మధు ఆంగ్లంలో రచించిన ‘డార్క్ అవుట్పోస్ట్స్’ అనే స్పేస్ ఒపేరా నవలను ‘భూమి నుంచి ప్లూటో దాకా’ అనే పేరుతోనూ; అమర్త్యసేన్ వ్రాసిన ‘ది ఐడియా ఆఫ్ జస్టిస్’ అనే పుస్తకాన్ని, మరో నాలుగు పుస్తకాలను తెలుగులోనికి అనువదించారు. ‘దేవుడికి సాయం’ అనే కథాసంపుటి, ‘మనీప్లాంట్’, ‘నాన్నా, తొందరగా వచ్చెయ్!!’, ‘ఏడు గంటల వార్తలు’ అనే అనువాద కథా సంపుటాలను ప్రచురించారు.