Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

నగ్మే, కిస్సే, బాతేఁ, యాదేఁ – ఆనంద్ బక్షి జీవితం, పాటలు-27

[శ్రీ రాకేశ్ ఆనంద్ బక్షి రచించిన ‘నగ్మే, కిస్సే, బాతేఁ, యాదేఁ – ది లైఫ్ అండ్ లిరిక్స్ ఆఫ్ ఆనంద్ బక్షి’ అనే ఆంగ్ల పుస్తకాన్ని అనువదించి పాఠకులకు అందిస్తున్నారు కొల్లూరి సోమ శంకర్.]

అధ్యాయం 10 – 2000-2002 – రెండవ  భాగం

నాన్న డైరీ

ప్పుడు, నాన్న తన పర్సనల్ డైరీలో రాసిన కొన్ని సందర్భోచితమైన, ముఖ్యమైన నోట్స్ మీతో పంచుకుంటాను, ఇందుకు నా తోబుట్టువుల అనుమతి తీసుకున్నాను. నేను ఇక్కడ పంచుకుంటున్న ప్రతి నోట్ పై నేను కాలక్రమానుసారంగా వ్యాఖ్యానించబోవడం లేదు. ప్రతి ఒక్కరూ తమ గోప్యతకు అర్హులు కాబట్టి, ముఖ్యంగా తమ మాటలని, చర్యలని వివరించడానికి లేదా సమర్థించుకోవడానికి అవకాశం లేని స్వర్గస్థులైనవారివి, కొన్ని నోట్స్ బహిర్గతం చేయకూడదని నిర్ణయించుకున్నాను.

1982

ఆగస్టు 20:

‘మిమ్మల్నందరినీ ప్రేమించేందుకే దేవుడు ఈ రోజు నన్ను కాపాడాడు. ఏమైనా, ఇది నేను అందుకున్న బెస్ట్ కార్డు. అలాగే, డాక్టర్ గాంధీ, డాక్టర్ శరద్ పాండే, డాక్టర్ ఎస్.జి. గోఖలే, డాక్టర్ శరద్ ఆప్టేలకు ధన్యవాదాలు.’

(ఆ నోట్ నాన్న తన మొదటి గుండెపోటు నుండి కోలుకున్న తర్వాత మేము – ఆయన సంతానం – బహుమతిగా ఇచ్చిన “గెట్ వెల్ సూన్” కార్డుపై రాశారు.)

1997

మే 1:

‘నా పిల్లలకి, కమలకి నేను కిళ్ళీ తినడం, సిగరెట్ తాగడం ఇష్టం ఉండదు. నేను వారి కోసం, నా పిల్లల కోసం, నేను వారిని ప్రేమిస్తున్నాను కాబట్టి నేను మానేయాలి.’

(ఆ తర్వాత, నాన్న కిళ్ళీ, సిగరెట్ మానేస్తానని తనకు తాను, మాకు కూడా చాలా వాగ్దానాలు చేసారు, కానీ వాటిని నిలుపుకోడంలో విఫలమయ్యారు.)

2000

జనవరి 4:

‘నాకు సమయం మించిపోతోంది. రచయితగా, తండ్రిగా నిర్వర్తించాల్సిన బాధ్యతలు ఇంకా చాలా ఉన్నాయి.’

మే 15:

‘ఈరోజు మళ్ళీ నాకు నీరసంగా, ఒంట్లో బాలేనట్టు అనిపిస్తుంది. నేను మూడు సిగరెట్లు కూడా తాగాను. నువ్వు మళ్ళీ ఆసుపత్రికి వెళ్లాలనుకుంటున్నావా బక్షి? లేదు, నేను ఆసుపత్రికి వెళ్లను. దానికన్నా చనిపోవడం మంచిది.’

మే 29:

‘నేను ధూమపానం మానేశాను. కానీ మళ్ళీ పొగాకు నమలడం మొదలుపెట్టాను. బక్షి, నువ్వు బాధపడతావు.’

సెప్టెంబర్ 29:

‘డాక్టర్ శరద్ ఆప్టే, ఎస్.జి. గోఖలే, వారి కుటుంబం ఎల్లప్పుడూ నాకూ, నా కుటుంబానికి అండగా ఉన్నారు, దేవుడు వారిని దీవించుగాక. ధన్యవాదాలు డాక్టర్ ఆప్టే, డాక్టర్ గోఖలే.’

డిసెంబర్ 31:

‘వచ్చే సంవత్సరం, నేను నా విజయాల గురించి రాస్తాను. నా జీవిత కథను సునీల్ దత్‌కి, సుభాష్ ఘాయ్‌కి వివరిస్తాను. చాలా సంవత్సరాల క్రితం నేను నా కథను యష్ చోప్రాకు చెప్పాను; కరాచీ, బొంబాయిలలో జరిగిన నావికాదళ తిరుగుబాటు సంఘటన ఆయనకు బాగా నచ్చింది, ఏదో ఒక రోజు ఈ సబ్జెక్ట్‌తో సినిమా తీస్తానని చెప్పారు.’

డిసెంబర్ 31:

‘దేవుడా దయచేసి నాకు సహాయం చెయ్యి. నన్ను నేను కాపాడుకోనివ్వు. 2001 నాకు ఆరోగ్యకరమైన సంవత్సరంగా ఉండాలి. ఇక చెడు అలవాట్లు ఉండవు. గత ముప్పై ఐదు సంవత్సరాలలో కాలం చాలా మారిపోయింది.’

2001

జనవరి 1:

‘నా విధిని మార్చుకోడానికి చివరిసారిగా ‘మిత్రా జీ’ (మా అమ్మ) పై ప్రమాణం చేస్తున్నాను. 2001 లో ఏం జరిగినా, నేను బ్రతుకుతాను, వేడుక జరుపుకుంటాను. నేను అనారోగ్యంతో ఉండను. దేవుడు నాకు సహాయం చేస్తాడు. నేను జబ్బు పడను. అందుకు మొదటి అడుగు, ఈ రోజు నుండి ధూమపానం – అలవాటుని మానేయాలి.’

ఫిబ్రవరి 17:

‘కమలా, నేను దాదాపు గెలిచిన యుద్ధంలో ఓడిపోతున్నాను. లేదు, నేను లొంగిపోను. రేపటి నుండి నాకు నేను చివరి అవకాశం ఇచ్చుకుంటాను. నేను గెలుస్తాను.’

(తేదీ పేర్కొనబడలేదు):

‘నన్ను నేను రక్షించుకోవడం, నన్ను నేను చంపుకోవడం – ఒకేసారి! ఇది ఎలా సాధ్యం? నేను నన్ను నేను రక్షించుకోవచ్చు లేదా నన్ను నేను చంపుకోవచ్చు. ఇది నా భీతి, విపరీత భయాలు, నా భావాల యొక్క ఒత్తిడి అని నేను అనుకుంటున్నాను. అయితే దీన్ని మార్చగలనా? లేదు. కానీ, నేను నన్ను నేను ఆజ్ఞాపించుకుని ఈ అర్ధంలేని విషయాలను వదిలివేస్తే, ఈ భావాలను,  బాధలను జయించగలను. కానీ నేను.. కాదు, నేను అదృష్టవంతుడిని.’

మార్చి 30:

‘ఈ రోజు ఒక సిగరెట్.’

మార్చి 31:

‘చివరి మూడు సిగరెట్లు.’

ఏప్రిల్ 4:

‘సుభాష్ ఘాయ్‌కి చివరి సిగరెట్.’

మే 1:

‘నేను ధూమపానం చేస్తున్నాను. నాకు నేనే నాలో ఆందోళనలు, ఉద్రిక్తతలను సృష్టించుకుంటున్నాను. నేను ప్రకృతి నియమానికి విరుద్ధంగా వెళ్తున్నాను. ఇది ఇలాగే కొనసాగడం ఆత్మహత్యాసదృశం. జీవితంలో ఇక నేనెందుకూ పనికిరాకపోవచ్చు. నేను ఇలాగే చేస్తుంటే చచ్చిపోతాను. కానీ నన్ను నేను రక్షించుకోవాలనుకుంటున్నాను, జీవించాలనుకుంటున్నాను. ఇది చాలా వింతగా ఉంది. నన్ను నేను కాపాడుకోవాలనుకుంటున్నాను, అదే సమయంలో నన్ను నేను చంపుకుంటున్నాను. దేవా, దయచేసి నేను బ్రతకడానికి సహాయం చేయి. ఈ చెడు అలవాట్ల కోసం నా పనిని, కీర్తిని, ప్రతిష్ఠని, నా భార్యాపిల్లలని త్యాగం చేయాలనుకోవడం లేదు. బక్షి, నువ్వు ఎప్పుడూ గెలిచే ఆటలో ఓడిపోకు. నా కమల కోసం, పిల్లల కోసం నన్ను నేను కాపాడుకునే ప్రయత్నం చేస్తాను.’

‘ముఝ్‌కో చునా హాలాత్ నే, యా మై నే చునా హాలాత్ కో? భగవాన్ బన్సీ వాలే మేరీ మదత్ కరేగా; హిమ్మత్-ఎ-మర్దా, మద్దత్-ఎ-ఖుదా.’

మే 15:

‘నాకు మళ్ళీ నీరసంగా ఉంది, అనారోగ్యంగా ఉంది. నేను మళ్ళీ ఆసుపత్రికి వెళ్లాలనుకోవడం లేదు. నేను చనిపోవడమే మంచిది.. కానీ నేను బ్రతకాలనుకుంటున్నాను, మరిన్ని పాటలు రాయాలనుకుంటున్నాను. నాకు నా కుటుంబం కావాలి.’

మే 18:

‘గత దాదాపు నలభై సంవత్సరాలలో, ఈ రోజు కిళ్ళీ నమలని, సిగరెట్ తాగని మొదటి రోజు. ఎందుకంటే నిన్న రాత్రి నాకు ఆస్తమా తీవ్రంగా వచ్చింది!’

మే 29:

‘నేను ధూమపానం మానేశాను, కానీ మళ్ళీ కిళ్ళీ నమలడం ప్రారంభించాను. బక్షి, నువ్వు బాధపడతావు!’

జూన్ 3:

‘మళ్ళీ నేను ఇదివరకట్లా పొగాకు నమలడం ప్రారంభించాను. నేను మరొక స్ట్రోక్ కోసం ఎదురు చూస్తున్నానా? ఈ వారంలోపు ఇది మారాలి!’

జూన్ 11:

‘కవితా, పిల్లలు జైపూర్‌కు వెళ్ళిపోయాకా, నేను వాళ్ళందరినీ చాలా మిస్ అయ్యాను – కొద్దిగా ఏడ్చాను కూడా. వచ్చే ఏడాది వాళ్ళు ఎప్పుడు వస్తారో, అప్పటికి నేను ఉంటానో ఉండనో తెలియదు. Dady. (నాన్న ‘Daddy’ అనే పదాన్ని ‘Dady’ అని రాసేవారు. మా చెల్లెలు కవిత [రాణి], ఆమె పిల్లలు వార్షిక వేసవి సెలవులు మాతో గడిపిన తర్వాత జైపూర్‌లోని వాళ్ళ ఇంటికి తిరిగి వెళ్ళినప్పుడు నాన్న ఇలా రాసుకున్నారు. మళ్ళీ ఏడాది సెలవలకి వాళ్ళొచ్చినప్పుడు నాన్న జీవించిలేరు.)

జూలై 15:

‘నా ఆందోళనలు, బెంగలు, కిళ్ళీలు, అతిగా తినే అలవాట్లు ఆగడం లేదు. ఈ చెడు అలవాట్లను నేనే మానేయాలి.’

జూలై 20:

‘ఈ రోజు నా బిపి ఎక్కువగా ఉంది. మా అబ్బాయిలు గోగి, డాబూలతో చర్చలు జరిపాను. నాకు టెన్షన్‌గా ఉంది. రేపు నా పుట్టినరోజు పార్టీ. జనాలు ఇంటికి వస్తున్నారు. అన్ని ఏర్పాట్లు జరిగిపోయాయి. మరి నాకెందుకు టెన్షన్‌? ఇది ఒక పరిపూర్ణమైన వేడుక అవుతుంది. నేను ఒంటరిగా లేను. మొత్తం కుటుంబం ఇక్కడే ఉంది, సహాయకులు ఉన్నారు, మా స్నేహితులు వస్తున్నారు. పెద్దమ్మాయి పప్పీ, అల్లుడు వినయ్, పిల్లలు వస్తున్నారు. మరి ఈ భయం ఏమిటి? బెంగ పడడం నాకో అలవాటుగా మారింది. నేను పార్టీ ఇచ్చి టెన్షన్‌గా ఉండడానికీ, ఆందోళన చెందడానికీ చాలా డబ్బు ఖర్చు చేస్తున్నానా? లేదు, నేను నా పుట్టినరోజు వేడుకను ఆస్వాదించబోతున్నాను..  నా పుట్టినరోజున వారు నాపై ప్రత్యేక చిత్రాన్ని ప్రదర్శిస్తున్నారు. జనాలు ఉన్నారు. విస్కీ ఉంది. మంచి ఆహారం ఉంది. నాకు ఇంకా ఏమి కావాలి?’

ఆయన పుట్టినరోజు నాడు, రాత్రి 9-10 గంటల ప్రాంతంలో అతిథులకు స్వాగతం పలికిన తర్వాత, సినిమా నిర్మాణ పనులు పూర్తి చేయడానికి నేను నా గదికి తిరిగి వెళ్ళాను. గత సంవత్సరం నాన్నకు చాలా కష్టంగా ఉంది – ఆయన ఆస్తమా మరింత తీవ్రమైంది, ఆ సంవత్సరం కనీసం రెండుసార్లు ఆయన ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది. మేమందరం ఒత్తిడికి గురయ్యాము. నేను సినిమా నిర్మాణ వృత్తిలో చేరి కేవలం మూడేళ్ళే అయింది, సుభాష్ ఘాయ్ సినిమాలు – తాల్, యాదేఁ లకు సహాయకుడిగా పనిచేశాను. నేను వ్యాపారంలో విఫలమయ్యాను, వైవాహిక జీవితంలో ఒడుదుడుకుల వల్ల విడాకులు తీసుకోవాల్సి వచ్చింది. అందుకని నేను బాగ ఒత్తిడికి లోనయ్యాను. నా ఆర్థిక స్థితి, నా మీద నా భరోసా, నా ఆత్మవిశ్వాసం, నా ఆత్మగౌరవం తీవ్రంగా దెబ్బతిన్నాయి. నాన్న, అమ్మ, అన్నయ్య గోగి, అక్క పప్పి, చెల్లి రాణి, సన్నిహితులు రోహిత్, అంబిక – మరికొందరు నాకు అండగా ఉన్నారు.

నాన్న రాత్రి 11.30 గంటల ప్రాంతంలో నా గదిలోకి వచ్చి, వేడుకల్లో పాల్గొనమని అడిగారు. ఈ సందర్భంగా తాను రాసిన కవితను వినాలని అన్నారు. నేను పనిలో బిజీగా ఉన్నానని, త్వరలో వచ్చి వాళ్ళతో చేరతానని చెప్పాను. కానీ నా సొంత జీవిత పరిస్థితుల కారణంగా నేను ఒత్తిడికి, నిరాశకు గురయ్యాననీ, అంత బిజీగా లేనని నాన్న గమనించారు. ఆయన నాతో, ‘బేటా, ఇది నా చివరి పుట్టినరోజు కావచ్చు. వచ్చే ఏడాది నేను ఉండను. అగ్లే సాల్ ఇస్ టైమ్ పర్ పంచీ పింజరే సే ఉడ్ గయా హోగా (వచ్చే సంవత్సరం ఈ సమయానికి పక్షి [ఆత్మ] పంజరం [శరీరం] నుండి తప్పించుకుంటుంది)’ అన్నారు. మరుసటి సంవత్సరం, మార్చి 30, 2002న నాన్న మమ్మల్నందరిని విడిచి వెళ్ళిపోయారు.

(మళ్ళీ కలుద్దాం)

Exit mobile version