[శ్రీ రాకేశ్ ఆనంద్ బక్షి రచించిన ‘నగ్మే, కిస్సే, బాతేఁ, యాదేఁ – ది లైఫ్ అండ్ లిరిక్స్ ఆఫ్ ఆనంద్ బక్షి’ అనే ఆంగ్ల పుస్తకాన్ని అనువదించి పాఠకులకు అందిస్తున్నారు కొల్లూరి సోమ శంకర్.]
అధ్యాయం 10 – 2000-2002 – మొదటి భాగం
నేను బతికే ఉన్నాననేది గొప్ప శుభవార్త
2001లో ఎప్పుడో ఓసారి, నాన్నకు మొదటిసారి చిన్నగా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి పాక్షికంగా మాట పోయింది. మా అక్క సుమన్ వల్లే ఆయన త్వరగా మాట్లాడే సామర్థ్యాన్ని తిరిగి పొందగలిగారు. అక్క రోజూ నాన్నని చూడడానికి వచ్చి మాట్లాడటం నేర్పించేది: వారు నెమ్మదిగా ఇంగ్లీష్ అక్షరమాలను చదివి, ఆపై సంఖ్యలకు మారేవారు. కొన్ని వారాలలో, ఆయన తన మాటను తిరిగి పొందారు. అక్కకి దేవుడి ఆశీస్సులు లభించాలి.
నాన్న అనారోగ్యపు సమస్యలు ముఖ్యంగా గుండె సంబంధిత సమస్యలు 80వ దశకంలో మొదలయ్యాయి, 90వ దశకం చివరలో తిరిగి తలెత్తాయి. మార్చి 2002లో, బ్రెయిన్ స్ట్రోక్ కారణంగా ఆసుపత్రిలో చేరినప్పుడు, కొన్ని గంటల తర్వాత కోమాలోకి జారుకునే ముందు, నాన్న, ‘జీవితంలో ఏమి జరిగినా అది మన మంచికే జరుగుతుంది. దేవుడిపై నమ్మకం ఉంచండి.’ అని అన్నారు. బహుశా, ఇవే ఆయన నాకు చెప్పిన చివరి మాటలు.
నాన్నకి రక్త మార్పిడి అవసరమైనప్పుడు, మేము దాతల కోసం వెతకసాగాం. ఆయనది అరుదైన బ్లడ్ గ్రూప్: బి నెగెటివ్. స్నేహితులు, పరిచయస్థులు, బంధువులను అడిగాము, పోస్టర్లు అంటించాము, ఎస్.ఎం.ఎస్.లు, ఈమెయిల్స్ పంపాము. స్వచ్ఛందంగా ముందుకొచ్చిన వ్యక్తి నాన్నను చూసుకునే వార్డ్ బాయ్. అతనికి పాటలంటే ఇష్టం, నాన్న రాసిన పాటలు పాడుతూ నాన్నను అలరించేవాడు. రక్తదానం చేయడానికి వచ్చిన మరో అపరిచితుడు తన చిన్ననాటి ఆదర్శమూర్తికి తన రక్తాన్ని ఇవ్వడం గౌరవంగా భావిస్తున్నానని చెప్పాడు. జీవితంలో నాన్న సంపాదించినది – డబ్బు కొనలేని నిజమైన ప్రేమ అని ఇలాంటి హృద్యమైన క్షణాలే మాకు అర్థమయ్యేలా చేశాయి.
2002 మార్చి 30న నాన్న మరణించారు.
***
ఆత్మకి మరణం లేనట్టే, మన పని కూడా కలకాలం నిలవాలి
నాన్న చనిపోయిన తర్వాత, అమ్మ ఒంటరిగా ఉండకూడదని నేను ఆయన గదిలో నిద్రపోవడం మొదలుపెట్టాను. ఆ తర్వాత, మేం కాస్త తేరుకుని, ఇల్లు ‘సాధారణ స్థితికి’ వచ్చాకా, నేను, అన్నయ్య – నాన్న వ్యక్తిగత వస్తువులను పరిశీలించాం. నాన్న అల్మారా తెరిచినప్పుడు, అకస్మాత్తుగా తుఫానులా నన్ను తాకిన మొదటి విషయం – నాన్న వాడే అత్తరు, దాని పరిమళం, దాని నుండి కలిగిన జ్ఞాపకాలు. ఆయన బట్టలు ఇప్పటికీ పెర్ఫ్యూమ్‌ల సువాసనను కలిగి ఉన్నాయి. బాత్రూంలో ఆయన సబ్బు, లైఫ్‌బాయ్, ఇప్పటికీ ఆయన వదిలి వెళ్ళిన విధంగానే ఉంది. ఆయన సబ్బును పాడేయడానికి కూడా నాకు ధైర్యం రాలేదు.
క్రమంగా, మేము ఆయన వస్తువులలో కొన్నింటిని పేదలకు ఇవ్వసాగాము, మరికొన్నింటిని అర్హత ఉన్న సంస్థలకు విరాళంగా ఇచ్చాము. నేను నాన్న పర్సు తెరిచినప్పుడు, ఆయన ఆరాధ్య దైవం బన్సీ వాలే, సాయి బాబా, వైష్ణో దేవి మాత, వినాయకుడు, సరస్వతి మాత, మరికొందరి దేవీదేవతల ఛాయాచిత్రాలు కనిపించాయి. ఇతర ఆకర్షణీయమైన వస్తువులలో చిత్రనిర్మాత, నాన్న ఆప్తమిత్రులు సుభాష్ ఘాయ్ నాన్నకి బహుమతిగా ఇచ్చిన 100 రూపాయల నోటు; మా అన్నయ్య రాజేష్ తన మొదటి సంపాదన నుండి నాన్నకి కానుకగా ఇచ్చిన 100 రూపాయల నోటు; భాగవతం నుండి ఒక సేకరించిన కొన్ని వాక్యాలు ఉన్నాయి:
‘మానవ జన్మ పొందడం ఎంతో దుర్లభమైనా, ఈ దేహం ద్వారా భగవంతుణ్ణి పొందడం ఎంతో సులభం. ఇదొక నౌక లాంటిది. సంసార సాగరాన్ని దాటేందుకు ఈ నావ బాగా ఉపయోగపడుతుంది. నీ గురువే నీ నావికుడు. భగవంతుని కృప – నౌక ముందుకు సాగడానికి అనుకూలమైన వాయువు. దీన్ని ఉపయోగించుకొని, భవసాగరాన్ని దాటడానికి ప్రయత్నించని వాడు ఆత్మఘాతకుడు’.
దీనికి, నాన్న “మన ఆత్మకి మరణం లేనట్టే, మన పని కూడా కలకాలం నిలవాలి” అనే వాక్యాన్ని జోడించారు.
***
చెల్లించాల్సిన బిల్లు ఒకటి ఉంటూనే ఉంటుంది
నాన్న అప్పుడప్పుడు, పిల్లలమైన మాకు ఈ సలహా ఇస్తుండేవారు: ‘మీకు ఉచితంగా ఏదైనా లభించింది అని అనుకుంటే, మీకింకా బిల్లు రాలేదని అర్థం.’
2001 లో ఆస్తమా కమ్ముకుంటున్నప్పుడు, నాన్న ఎక్స్‌టర్నల్ సిలిండర్ లోని ఆక్సిజన్ ఉపయోగించి శ్వాస తీసుకోవలసి వచ్చింది. ‘నా కుటుంబం, వైద్యులు, స్నేహితులు నాకు పదే పదే ఇచ్చిన సలహాను పాటించనందుకు నాకు వస్తున్న బిల్లు ఇది. ధూమపానం ఆరోగ్యానికి హానికరం. నేను ఎంత బాధపడతానో నాకు తెలిసి ఉంటే, నేను మరెవరినీ పొగ త్రాగనివ్వను.’ అని అన్నారు.
ఆస్తమాతో పాటు, తన జీవితంలో చివరి రెండు సంవత్సరాలు నాన్న ఒంటరితనంతో బాధపడ్డారు. కుటుంబం మొత్తం తన పక్కన ఉన్నప్పటికీ, నేను ఆయనతో తగినంత సమయం గడపలేదని నాన్న భావించారు. ఆయన చెప్పింది నిజమే, అందుకు నేను బాధపడుతున్నాను. నేనిప్పుడు నా తోబుట్టువులకు మరింత నాణ్యమైన సమయాన్ని ఇస్తున్నాను.
2002లో, ఆనంద్ బక్షి గురించి ప్రచురితమైన ఓ కథనంలో, ఒక జర్నలిస్ట్ బక్షి ఏకాకిగా ఉన్నట్టు లేదా ఒంటరిగా ఉన్నట్లు తనకు అనిపించిందని, ఆయన కుటుంబం ఆయన విజయంలో భాగం కాలేదని రాశాడు. రచయితకు తన అభిప్రాయాలను వ్యక్తపరిచే హక్కు ఉన్నప్పటికీ, అపోహలు తొలగించటం ముఖ్యం అని నేను భావిస్తున్నాను. బక్షి తన విజయంలో తానొక ఒంటరినని భావించి ఉండాలి. కానీ అది మానవ పరిస్థితి – మనం పైన ఉన్నా, మధ్యలో ఉన్నా లేదా దిగువన ఉన్నా, మనలో ప్రతి ఒక్కరూ కొన్నిసార్లు ఒంటరిగా ఉన్నట్లు భావిస్తాం. అయినప్పటికీ, తన జీవితంలో చివరి రెండు సంవత్సరాలలో, నాన్న తన కుటుంబంతో, తన ఇద్దరు వైద్యమిత్రులు, సినీరంగపు ఆత్మీయులు సుభాష్ ఘాయ్, సునీల్ దత్ లతో కలిసే ఉన్నారు. అందరూ ఆయనకి అండగా నిలిచారు.
‘నా దీర్ఘకాలిక అనారోగ్యం సమయంలో సునీల్ దత్ సెకండ్ ఒపీనియన్ కోసం వైద్యులను ఏర్పాటు చేశాడు. నా గోడలు కూలిపోవడం ప్రారంభించిన తరుణంలో, నా జీవితంలో అత్యంత దారుణమైన సమయంలో, సుభాష్ ఘాయ్ నాకు మూలస్తంభమయ్యాడు, వెన్నెముక అయ్యాడు. అల్లోపతి మందులు నా ఆరోగ్యాన్ని మరింత నాశనం చేస్తున్నాయని భావించి, నాకు నయం చేయడానికి ఆయన తన సొంత ఖర్చుతో ఆయుర్వేద వైద్యులను ఏర్పాటు చేశాడు. నా స్నేహితుడు, దర్శకుడు మోహన్ కుమార్, న్యాయవాది శ్యామ్ కేస్వానీ, నా ఉస్తాద్ చితర్ మాల్ కుమారుడు కూడా నన్ను ఉత్సాహపరిచేందుకు ఇంటికి వచ్చేవారు.’
విజయం, వైఫల్యం రెండూ చాలా తరచుగా ఒంటరి ప్రయాణాలే. విజయంలో మనకు ప్రజల మద్దతు ఉంటుంది. కానీ వేదన, బాధలలో, కొద్దిమంది మాత్రమే మనకు తోడుగా ఉంటారు. కానీ చివరికి, మన జీవిత ప్రయాణంలో అత్యంత ముఖ్యమైన వారంటే – పుట్టినరోజు కేకులు కట్ చేసి, మనతో షాంపైన్ బాటిళ్లు పొంగించిన వారు మాత్రమే కాదు! ఆసుపత్రి వార్డులలో లేదా ఐసియుల బయట గడ్డకట్టిన కారిడార్లలో మన పక్కన రాత్రులు గడిపిన వారు; రక్త దాతలను పట్టుకోడానికి ఓ చోటు నుంచి మరో చోటుకి పరిగెత్తినవారూ; విదేశాల నుండి అరుదైన మందులను ఆర్డర్ చేసిన వారు కూడా! నాన్న కోసం మేమందరం, అతని కుటుంబం, సన్నిహితులం అలా చేసాము.
నాన్న తన కుటుంబాన్ని ప్రేమించారు, మా మధ్య విభేదాలు, అపరాధాలు, లోపాలు ఉన్నప్పటికీ మేము ఆయనను ప్రేమించేవాళ్ళం. మాలో ప్రతి ఒక్కరూ (ఆయన భార్య, నలుగురు పిల్లలు, ఇద్దరు అల్లుళ్ళు) ఆయనకు నమ్మకమైన వాళ్ళం, నేటికీ అలాగే ఉన్నాము, అందుకే ఆయన చాలా సంతోషంగా ఉండేవారు. నాన్న తన జీవితంలో చివరి సంవత్సరంలో, ‘నేనెప్పుడూ మీ అందరినీ వరల్డ్ టూర్‍కి పంపలేదు. మీలో ప్రతి ఒక్కరూ గత ఒక సంవత్సరం నుంచి లేదా అంతకంటే ఎక్కువ కాలంగా నన్ను చాలా జాగ్రత్తగా చూసుకున్నారు కాబట్టి ఈసారి నేను ఆసుపత్రి నుండి ఇంటికి తిరిగి వచ్చి మళ్ళీ బాగున్నప్పుడు, మీ అందరినీ ప్రపంచ పర్యటనకు పంపాలనుకుంటున్నాను’ అని మా అన్నయ్యతోనూ, నాతోనూ అన్నారు. మేము అలాంటి ప్రయాణం కోసం ఎప్పుడూ అడగలేదు, కానీ నాన్న మమ్మల్ని నిజంగా పంపాలనుకున్నారు, అసలు ఆ ఆలోచనే మా అందరికీ పెద్ద బహుమతి.
***
నా జీవితం, నా పని, నా షరతులు
ఆనంద్ బక్షి అభిమానులు, స్నేహితులు, ఇంకా బంధువులు ఆయన చాలా త్వరగా చనిపోయారని అంటున్నారు. అయితే, ఆయన కోరుకున్న సమయంలో, ఆయన కోరిక మేరకు ఆయన వెళ్లిపోయారు. నాన్న తన సొంత షరతుల ప్రకారం జీవితాన్ని గడిపారు, చివరి వరకు పని చేస్తూ ఉండటం ముఖ్యమని అనుకునేవారు. ‘నేను పని చేస్తూనే చనిపోవాలనుకుంటున్నాను.’ అన్నారు.
చనిపోయే వరకు పాటలు రాయడంలో నిమగ్నమై ఉండాలని కోరుకున్నారు నాన్న. ఆయన చనిపోవడానికి రెండు నెలల ముందు దర్శకులు అనిల్ శర్మకి, సుభాష్ ఘాయ్‌కి తొమ్మిది పాటలు రాశారు. ఈ మాజీ సిపాయి ఎల్లప్పుడూ గౌరవపూర్వక మరణాన్ని కోరుకున్నారు, పదవీ విరమణ లేదా వ్యాధి కారణంగా క్షీణించిన ఉనికిని కాదు.
‘ఇండస్ట్రీ నన్ను విస్మరించే ముందే నేను ఇండస్ట్రీని వదిలేయాలని అనుకుంటున్నాను.’
గీతరచయిత ఆనంద్ బక్షి తన చివరి పాటను నిర్మాత సుభాష్ ఘాయ్ కోసం, స్వరకర్త అను మాలిక్ కోసం ఫిబ్రవరి 2002లో రాశారు. అది ‘బుల్లే షా తేరే ఇష్క్ నచాయా, వా జీ వా తేరే ఇష్క్ నచాయా’. జ్వరంతో, మంచానికి పరిమితమై, మూడు వెచ్చని దుప్పట్లు కప్పుకుని ఈ పాట రాశారు; జ్వరం, బలహీనత వల్ల ఆయన వణికిపోతున్నారు, ఉబ్బసం కారణంగా ఊపిరి ఆడలేదు. అదే వారం, నాన్న ఆసుపత్రిలో చేరారు, కానీ ఇక ఇంటికి తిరిగి రాలేదు.
యష్ చోప్రా మొహబ్బతే, సుభాష్ ఘాయ్ యాదేఁ వరుసగా 2000, 2001 సంవత్సరాలలో విడుదలయ్యాయి. రెండు సినిమాలలో గొప్ప పాటలు ఉన్నాయి, అగ్రశ్రేణి సంగీత దర్శకులు స్వరపరిచారు, ప్రధాన పాత్రలలో పెద్ద తారలు నటించారు. 2002, 2003లో, బక్షి పాటలు రాసిన మొత్తం ఎనిమిది చిత్రాలు విడుదలయ్యాయి.
నాన్న ఎప్పుడూ ఒకరిపై ఆధారపడ్డవాడిగా జీవించాలని అనుకోలేదు. అమ్మ మీద తప్ప, నాన్న మరెవరిపైనా ఆధారపడలేదు. చనిపోవడానికి ఒక నెల ముందు, సహాయం లేదా మద్దతు లేకుండా ఆయన నడవలేకపోయారు, తినలేకపోయారు, నిద్రపోలేకపోయారు. మరణానికి ఒక వారం ముందు, నాన్న సెమీ కోమాలోకి వెళ్ళారు. ఒక రోజు ముందు, తీవ్ర కోమాలోకి వెళ్ళారు. ఆయన మెదడు దెబ్బతిని ఉండవచ్చని వైద్యులు చెప్పారు.
నాన్న బ్రెయిన్ డెడ్ అయినట్లు ప్రకటించిన రోజు ఉదయం ఒక డాక్టర్ మిత్రుడు నాకు చెప్పిన మాటలు నాకు గుర్తున్నాయి: “మీ నాన్న ఇక కవి కాదు. అంటే, ఆయన కోమా నుండి బయటకు వచ్చినా, తను ఎవరో ఆయనకి ఎప్పటికీ తెలియదు”. ఇది ఉదయం 10 గంటల ప్రాంతంలో జరిగింది, అదే రోజు రాత్రి 8.30 గంటల ప్రాంతంలో నాన్న మరణించారు.
ఒక నెల కన్నా తక్కువ కాలం మాత్రమే నాన్న ఎవరిమీదైనా ఆధారపడి జీవించారు. ఎల్లప్పుడూ స్వతంత్రంగా ఉండాలని కోరుకునే వ్యక్తికి ఇదొక వరం అని నేను భావిస్తున్నాను. నాన్న చివరి సంవత్సరంలో, నేను ఆయనకి మంచి ఆరోగ్యం, దీర్ఘాయువు కోసం ప్రతిరోజూ ప్రార్థించాను. నాన్న చివరి రోజున – నా డాక్టర్ మిత్రుడు నాన్న బ్రెయిన్ డెడ్ అయ్యారని; బహుశా వెంటిలేటర్ ఆయన్ని ‘బ్రతికించి’ ఉంచుతుందని నాకు చెప్పినప్పుడు – భౌతిక శరీరం నుంచి నాన్నకి విముక్తి కల్గించమని నేను దేవుడిని వేడుకున్నాను. ఆయన మరణం కోసం ప్రార్థించిన ఏకైక సందర్భం అదే. ఆ బన్సీ వాలే నా ప్రార్థన విన్నాడని నేను అనుకుంటున్నాను.
నాన్న అదృష్టవంతులు, ధన్యులు అని నేను నమ్ముతున్నాను. తన బన్సీ వాలే కారణంగా 60వ దశకం చివరి కాలం తర్వాత ఆయన ఎప్పుడూ ఎవరినీ పని అడగాల్సిన అవసరం రాలేదు. ఆయన కష్టపడి పనిచేశారు, ఇష్టపడి ఆడారు, మనసుకు నచ్చినవి తిన్నారు, ఇక తన ఆరోగ్య పరిస్థితి కారణంగా తనకు ఇష్టమైన ఆహారాన్ని తీసుకోడం అరుదుగా తగ్గించారు. ఆయన తన సొంత షరతుల ప్రకారం జీవించారు, తన షరతుల ప్రకారం వెళ్లిపోయారు.
తన ‘ఎయిమ్ ఇన్ లైఫ్’ నోట్‌లో చెప్పినట్లుగా, ఆ బన్సీ వాలే దీవెనలతో, తాను నమ్మిన మార్గదర్శక విశ్వాసంతో తాను కోరుకున్న దానికంటే చాలా ఎక్కువ సాధించగలిగారు నాన్న. మన పనులు విధి లానే ముఖ్యమైనవని ఆయన భావించారు. తన వ్యక్తిగత డైరీలో “నా పరిస్థితుల కంటే ఉన్నతమైనది, జీవితంలోని ప్రతి పరిస్థితి కంటే బలమైనది నాలో ఉంది.” అని రాసుకున్నారు.
(మళ్ళీ కలుద్దాం)
కొల్లూరి సోమ శంకర్ రచయిత, అనువాదకులు. బి.ఎ.డిగ్రీతో గ్రాడ్యుయేషన్. మానవ వనరుల నిర్వహణలో పిజి డిప్లొమా చేసారు. దక్షిణ భారత హిందీ ప్రచార సభ వారి భాషా ప్రవీణ పాసయ్యారు. ప్రస్తుత నివాసం హైదరాబాదు.
సోమ శంకర్ 2001 నుంచి కథలు రాస్తున్నారు. 2002 నుంచి కథలను అనువదిస్తున్నారు. కేవలం కథలే కాక ‘ది అడ్వెంచర్స్ ఆఫ్ పినోకియో’ అనే పిల్లల నవలను ‘కొంటెబొమ్మ సాహసాలు’ అనే పేరుతోను, ‘మాజిక్ ఇన్ ది మౌంటెన్స్’ అనే పిల్లల నవలను ‘కొండలలో వింతలు’ అనే పేరుతోను, వినయ్ జల్లా ఆంగ్లంలో రాసిన ‘వార్స్ అండ్ వెఫ్ట్’ అనే నవలని ‘నారాయణీయం’ అనే పేరుతోను, వరలొట్టి రంగసామి ఆంగ్లంలో రాసిన ‘లవ్! లవ్! లవ్!’ నవలను ‘సాధించెనే ఓ మనసా!’ పేరుతోనూ, అజిత్ హరిసింఘానీ రచించిన ట్రావెలాగ్ ‘వన్ లైఫ్ టు రైడ్’ను ‘ప్రయాణానికే జీవితం’అనే పేరుతోను, డా. చిత్తర్వు మధు ఆంగ్లంలో రచించిన ‘డార్క్ అవుట్పోస్ట్స్’ అనే స్పేస్ ఒపేరా నవలను ‘భూమి నుంచి ప్లూటో దాకా’ అనే పేరుతోనూ; అమర్త్యసేన్ వ్రాసిన ‘ది ఐడియా ఆఫ్ జస్టిస్’ అనే పుస్తకాన్ని, మరో నాలుగు పుస్తకాలను తెలుగులోనికి అనువదించారు. ‘దేవుడికి సాయం’ అనే కథాసంపుటి, ‘మనీప్లాంట్’, ‘నాన్నా, తొందరగా వచ్చెయ్!!’, ‘ఏడు గంటల వార్తలు’ అనే అనువాద కథా సంపుటాలను ప్రచురించారు.