Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

నగ్మే, కిస్సే, బాతేఁ, యాదేఁ – ఆనంద్ బక్షి జీవితం, పాటలు-25

[శ్రీ రాకేశ్ ఆనంద్ బక్షి రచించిన ‘నగ్మే, కిస్సే, బాతేఁ, యాదేఁ – ది లైఫ్ అండ్ లిరిక్స్ ఆఫ్ ఆనంద్ బక్షి’ అనే ఆంగ్ల పుస్తకాన్ని అనువదించి పాఠకులకు అందిస్తున్నారు కొల్లూరి సోమ శంకర్.]

అధ్యాయం 9 – ‘ముష్కిల్ మే హై కౌన్ కిసీ కా’ – రెండవ భాగం

మా చిన్నప్పుడు, రాత్రిపూట భోజనానికి ముందు కాసేపు అందరం బాల్కనీలో కూర్చునేవాళ్ళం. ఆ సమయంలో నాన్న తనకిష్టమైన రెడ్ లేబుల్ కొన్ని పెగ్గులు తాగుతూ, మాకు ఓ కథ చెప్పేవారు.

అనేక శతాబ్దాల క్రితం, అనేక దారులు కలిసే ఓ కూడలిలో ఒక ముఖ్యమైన మూలలో, ఒక మందిరం, ఒక గురుద్వారా, ఒక చర్చి. ఒక అగ్ని ఆలయం, ఒక మసీదు, ఒక యూదుల ఆలయం, ఇంకా కొన్ని ఇతర ప్రార్థనా స్థలాలు ఉండేవి. ఈ ముఖ్యమైన కూడలిలో, ఒక మతం పట్ల విద్వేషంతో వేలాది మంది ఇళ్లను తగలబెట్టారు, దోచుకున్నారు, ప్రాణాలు తీశారు. ‘శత్రు’ మతాల పురుషులని, మహిళలని, పిల్లలని చంపారు, చివరికి జంతువులను కూడా వదిలిపెట్టలేదు. నేల ఎరుపెక్కింది.  అన్ని జాతుల, మతాల ప్రజలు రక్తం ప్రవహించే దారుల గుండా నడిచారు.

ప్రార్థనా స్థలాల ఎత్తైన గోపురాలు, మినార్లు రక్తపాతాన్ని నిశ్శబ్దంగా చూస్తున్నాయి. చాలా సేపటి తర్వాత, ఒక మినార్ ఇతరులతో ఇలా వ్యాఖ్యానించింది – “మనలో ఒకరు మన ఉన్నతమైన, శక్తివంతమైన పీఠం నుండి దిగి, వాళ్ళ ఉనికి, స్పృహల స్థాయికి దిగి, ఈ మూర్ఖులకు అత్యున్నత సత్యాన్ని వెల్లడిస్తే ఎలా ఉంటుంది? మనమందరం ఒకటే! మన మధ్య, దేవుళ్ల మధ్య ఎటువంటి తేడా లేదు. వెళ్లి ‘మీ మతాలు వేరు, మిమ్మల్ని మా వైపుకు నడిపించే వారి మార్గాలు వేరు, కానీ అవన్నీ మా వైపుకు నడిపిస్తాయి, మేము వేరు కాదు, ఒకటే’ అని వాళ్ళకి వివరిద్దామా? మన అనుయాయులు కొనసాగిస్తున్న రక్తపాతానికి శతాబ్దాలుగా మనమందరం మౌన సాక్షులుగా నిలిచాం, మనలో ఒకరం వెళ్ళి చెబితే, ఇదంతా ఆగుతుందని నాకు నమ్మకం ఉంది. వాళ్ళెంత మూర్ఖులు! మనలో ఒకరం మాత్రమే ఇతరులకన్నా గొప్పవాళ్ళమని  నమ్ముతున్నారు. వారిలో కొందరు తాము మాత్రమే స్వచ్ఛమైన వారమని, ‘విశ్వాసుల’ మని; మిగతా వారందరూ అవిశ్వాసులు కూడా నమ్ముతున్నారు!”

మిగతా అన్ని మినార్లు నవ్వుకున్నాయి. తమలో ఒకరు వివేకంతో చెప్పిన ఈ అంతిమ సత్యాన్ని అవి అంగీకరించాయి. కానీ అవి నిశ్శబ్దంగా రక్తపాతాన్ని చూస్తూనే ఉన్నాయి.

ఇంతలో, ఒక మినార్ జనసమూహంపై అరుస్తూ, వారి దేవుళ్ల కోసం ఒకరినొకరు చంపుకోవడం ఆపమని ఆదేశిస్తుంది. అయితే, మిగతా మినార్లన్నీ వెంటనే ఆ ‘బోళాభొళి’ మినార్‌ను ఆగమంటాయి. మిగతా అన్ని మినార్లు నిరసన తెలుపుతూ: “వెర్రిదానా! మనందరికీ మాత్రమే తెలిసిన సత్యాన్ని – ఈ మహా మూర్ఖులకు చెప్పకు. అయితే ఈ పరమసత్యం కొద్దిమంది మానవులకు తెలుసు, కానీ వారు తోటివారిచే చంపబడ్డారు. ఈ మూర్ఖులని కొట్టుకోనివ్వు. ఎందుకంటే మనమందరం ఒకటేనని, మనమందరం నిజంగా ఒకటేనని వారు గ్రహించిన రోజు, మన అవసరం వాళ్ళకిక ఉండదు; అప్పుడు వాళ్ళు మనల్ని తొలగిస్తారు. ఇప్పుడు వాళ్ళు తమ అజ్ఞానంతో, భయంతో మనకు నమస్కరిస్తారు. ఈ విశ్వంలో మరెవరు మనకు ఇంత ప్రాముఖ్యత ఇస్తారు? మనం వారి భయాలు, అజ్ఞానం కారణంగానే శతాబ్దాలుగా వారి కంటే ఎత్తున ఉన్నతంగా ఉంటున్నాము. మనమందరం ఒకటే అనే సత్యాన్ని వారు తెలుసుకుంటే, వారికి ఇక మన అవసరం ఉండదు. శతాబ్దాలుగా వారి ఖర్చుతో మనం అనుభవించిన ప్రాముఖ్యతని, ఆధిపత్యాన్ని మనం కోల్పోకూడదు! అంతకు ముందు, వాళ్ళకి మనకంటే ప్రకృతి ముఖ్యమైనది! ఈ మూర్ఖులే మనకు జన్మనిచ్చి, మనకి అమరత్వం కల్పించి, తమ కంటే పైకి – ఆకాశానికి ఎత్తారు. మన ప్రయోజనం కోసం యథాతథ స్థితిని కొనసాగిద్దాం.” అంటాయి.

ఈ మూర్ఖ మానవులకు సత్యాన్ని వెల్లడించడం వల్ల కలిగే పరిణామాల గురించి అవన్నీ గంభీరంగా ఆలోచిస్తాయి. ‘తెలివైన మానవులు’ తమను నేలకూల్చకుండా ఉండటానికి అవి ఎప్పటికీ మౌనంగా ఉండటానికి నిశ్చయించుకుంటాయి. ఆ విధంగా, యుద్ధం కొనసాగింది, శతాబ్దాలుగా కొనసాగుతోంది.’

ఇదీ ఆ కథ..

***

సమగ్రత, స్వీయ-విలువలు

నాన్న మాకు ఇంకో కథ కూడా చెప్పారు: పంజాబ్‌లోని ఒక మారుమూల ప్రాంతంలో ఒక సినిమా యూనిట్ షూటింగ్ చేస్తోంది. ఒక సన్నివేశానికి పల్లకి కావాలి. యూనిట్, మొత్తం గ్రామమంతా వెతికింది కానీ దొరకలేదు. మరికొంత దూరంలోని ప్రాంతాలలో వెతకగా, ఓ గ్రామంలో ఒక మహిళ దగ్గర పల్లకి ఉందని తెలిసింది. వాళ్ళక్కడికి పరుగెత్తుకుంటూ వెళ్లి ఆ మహిళని కలిశారు: ఆమె ఓ వృద్ధ వితంతువు. ఆమె పల్లకిని ఇవ్వడానికి అంగీకరించింది. వధువు ఎవరు, పెళ్ళి ఏ గ్రామంలో జరగబోతోందని అడిగింది. పల్లకి సినిమా షూటింగ్ కోసమనీ; వధువు, వరుడిలా నటిస్తున్న జంటకి నకిలీ వివాహం జరగబోతోందని, నిజమైన వధువు లేదని సినిమా యూనిట్ వాళ్ళు ఆమెకు చెప్పారు. పెళ్ళిళ్ళకు పల్లకి అద్దెకి ఇచ్చి సంపాదించే ఆదాయంతో జీవించే ఆ వృద్ధురాలు, ‘నకిలీ’ వధువు కోసం సినిమా యూనిట్‌కు దానిని అద్దెకి ఇవ్వడానికి నిరాకరించింది. ఆమె మామూలుగా తీసుకునే మొత్తానికి పది రెట్లు ఎక్కువ రుసుం ఇస్తామన్నారు. కానీ ఆ మహిళ ఒప్పుకోలేదు. గర్వంగా, “క్షమించండి, నిజమైన వధువులు మాత్రమే పల్లకికి అర్హులు” అని చెప్పింది.

నాన్న తరువాత నాతో , ‘దీన్నే నేను నిజాయితీగా, వ్యక్తిత్వంగా పరిగణిస్తాను. మీ విలువలకు బదులుగా ఇవ్వజూపే డబ్బు ద్వారా తప్పుదారి పట్టకండి. మీరు మీ చుట్టూ ఉన్న ప్రపంచానికి అనుగుణంగా ఉండవలసిన అవసరం లేదు. మీ ప్రత్యేకతని నిలుపుకోండి.’ అని అన్నారు.

***

మీరు మీ చుట్టూ ఉన్న ప్రపంచానికి అనుగుణంగా ఉండవలసిన అవసరం లేదు

నాన్న తన మొదటి కారు, 1964 మోడల్, సెకండ్ హ్యాండ్ ఫియట్ కొనడానికి వెళ్ళినప్పుడు, షాపు యజమాని ఆ కారును డిస్కౌంట్ రేటుకు ఇవ్వడానికి అంగీకరించాడు. తాను ధనవంతుడిని కాదని, ఇప్పుడిప్పుడే సినిమాల్లో పాటల రచయితగా కుదురుకుంటున్నానని అతనికి చెప్పారు నాన్న. ధర మరికొంచెం తగ్గించమని కోరారు. షాప్ యజమాని ఆఖరి తగ్గింపు ధరను చెప్పాకా, నాన్న ఖచ్చితంగా కారు కొంటానని అన్నారు, కానీ మర్నాడు వచ్చి కొంటానని అన్నారు. ఎందుకంటే తన నిర్ణయం గురించి ఓసారి ఆలోచించాల్సి ఉంది. తన కెరీర్ ఇప్పుడిప్పుడే ఊపందుకున్న సమయంలో, కారు కోసం, అందునా సెకండ్ హ్యాండ్ కారు కోసం అంత డబ్బు ఖర్చు చేయడం సరైనదేనా అని తాను నిర్ణయించుకోలేకపోతున్నానని షాపు యజమానితో అన్నారు.

ఆ షాపు యజమాని నాన్నతో “చూడండి సోదరా, మీరు ఈ కారు రేపు కొంటే ధర ఎక్కువగా ఉంటుంది. నేను రేపు మీకు డిస్కౌంట్ ఇవ్వను. మీరు ఇప్పుడిప్పుడే  కెరీర్ మొదలుపెట్టానన్నారు కాబట్టి నేను ప్రత్యేక ధరకి అంగీకరించాను. అయితే ఈ డిస్కౌంట్ ధర ఈరోజే కారు కొంటేనే చెల్లుతుంది! అలాగే, నాకు ఈరోజే ఇంకో మంచి ఆఫర్ వస్తే, రేపటి వరకు మీ కోసం వేచి ఉండను! కాబట్టి ఇప్పుడే తీసుకోండి లేదా రేపు ఎక్కువ చెల్లించాలి” అని అన్నాడు.

ఆయనతో, “ఈ రోజుకి మాత్రమే చెల్లుబాటు అయ్యే డిస్కౌంట్ ఇచ్చి నన్ను వెంటనే కారు కొనమని బలవంతం చేయలేరు. అదే మీ షరతు అయితే, నేను ఎక్కువ ధరకు కారు కొనడానికి సిద్ధంగా ఉన్నాను. కానీ ఈ పగలు, ఈ రాత్రి గడిచిన తర్వాత మాత్రమే దాన్ని కొంటాను. మీ కారును అమ్మడం మీకు పెద్ద నిర్ణయం కాకపోవచ్చు, కానీ కొనడం నాకు ఓ పెద్ద నిర్ణయం. కాబట్టి, నేను దాని గురించి మళ్ళీ ఆలోచించాలి, అందుకు ఒక రాత్రి కావాలి! ఈ ఆలస్యం వల్ల కలిగే నష్టం ఏదైనా సరే.” అన్నారు నాన్న.

మర్నాడు, జూన్ 21, 1966న, నాన్న తన మొదటి వాహనమైన ఆ కారును ఎక్కువ ధరకు కొన్నారు! తన సొంత నిబంధనల ప్రకారం కొన్నందుకు ఆయన ఎప్పుడూ బాధపడలేదు. ఆ ఏడాదే మా చెల్లి కవిత పుట్టడంతో పాటు, సినీరంగంలో మరిన్ని అవకాశాలు లభించినందున, ఈ ఫియట్ కారు తనకు అదృష్టసూచకమని నాన్న నమ్మారు. ఆ కారు ఇప్పటికీ ఉంది – 2002లో నాన్న మరణించిన తర్వాత దానిని కవితకు బహుమతిగా ఇచ్చాం.

ఈ ఫియట్ గురించి చెప్పడం ముగించిన తర్వాత, “తన అవసరాల కోసం ప్రపంచాన్నెప్పుడూ నిన్ను తొందరపెట్టనివ్వకు. నువ్వు తొందరపడాల్సి వస్తే, నీ అవసరాల కోసం ఒంటరిగా, లేదా నీ కుటుంబ అవసరాల కోసం తొందరపడు.. నీ విలువలను నమ్ము, నీపై నమ్మకం ఉంచు” అని నాతో అన్నారు నాన్న.

తనకు అత్యంత ప్రియమైన కారు కోసం నాన్న రాసిన కవిత:

బక్షీ హమ్ యారోం కే యార్
అప్నీ యార్ యె ఫియట్ కార్
బాకీ సబ్ కారేఁ బేకార్
యే మేరీ పహలీ చిత్‍చోర్
మోడల్ 1964
అబ్ తక్ ఉస్ సే మేరా ప్యార్
ఫియట్ మేరా లేటెస్ట్ రొమాన్స్
సడకోం పర్ యే కర్తీ డాన్స్
తేజ్ హవా జైసీ రఫ్తార్
బక్షీ హమ్ యారోం కే యార్
అప్నీ యార్ యె ఫియట్ కార్
బాకీ సబ్ కారేఁ బేకార్

***

రామ్ లఖన్ సినిమాలో ఆనంద్ బక్షి పాటలలో ఒకటైన ‘వన్ టూ కా ఫోర్, ఫోర్ టూ కా వన్, మై నేమ్ ఈజ్ లఖన్’ పాట గురించి ఒక కాలమిస్ట్ ఇలా వ్యాఖ్యానించాడు: “వన్ టూ కా ఫోర్ ప్రపంచంలో ఫోర్ డైమెన్షనల్ సక్సెస్ సాధించాలంటే, వన్ డైమెన్షనల్, టు డైమెన్షనల్ నియమాలను ఉల్లంఘించాలి అనే ఆలోచనను సూచిస్తుంది. ఫోర్ టూ కా వన్ అనేది మీరు ఎక్కువగా పెట్టుబడి పెట్టేదాన్ని సూచిస్తుంది కానీ మీరు ఊహించిన దానికంటే చాలా తక్కువ రాబడిని ఇస్తుంది.”

ఈ పాటలోని సాహిత్యం వినడానికి చాలా అర్థరహితంగా అనిపించినా, సినిమా చూస్తే, అనిల్ కపూర్ పోషించిన పాత్రకు కాలమిస్ట్ చెప్పిన అన్వయం సరిగ్గా సరిపోతుందని మీరు గ్రహిస్తారు. కథ, ఇంకా పాత్ర గురించి దర్శకుడు చెప్పిన మాటలకే గీత రచయిత కట్టుబడి ఉన్నారనడానికి ఇది మరో ఉదాహరణ.

నాన్న ఒకసారి ఋతుస్రావం గురించి ఒక పాట రాయవలసి వచ్చింది. ఆప్ కీ కసమ్ సినిమాలోని ఈ పాట గురించి ఆయన ఇలా అన్నారు, ‘జంటల మధ్య ఏకాంత సమయం మీదో, మన సంస్కృతిలోని నిషిద్ధమైన విషయం గురించో పాట రాయాల్సి వచ్చిన సందర్భాలలో, నాకు ఎదురైన అత్యంత సవాలుతో కూడిన పరిస్థితులలో ఇది ఒకటి. ఇద్దరు ప్రేమికుల మధ్య “సంతోషకరమైన” పరిస్థితి, ఆ అమ్మాయి తన భర్తకు ఆ రోజు తామెందుకు దగ్గర కాలేరో చెప్పాల్సి వచ్చింది. సూపర్ స్టార్లు రాజేష్ ఖన్నా, ముంతాజ్ తెరపై అభినయించడం వలన, ఈ పాట ఆనేకమంది ప్రేక్షకులను ఆకర్షిస్తుందని, ఓ మహిళ (లతాజీ) దానిని పాడుతుందని నాకు తెలుసు. కుటుంబ సభ్యులు కూడా తమ ఇళ్లలో మౌనం వహించే ఒక విషయాన్ని నేను బహిరంగంగా తెలియజేయాల్సి వచ్చింది. మరి సినిమాలేమో కుటుంబమంతా కలిసి చూసేవి, నా విషయంలోనూ అంతే. చాలా ప్రయత్నం తర్వాత నేను “పాస్ నహీఁ ఆనా, భూల్ నహీఁ జానా, తుమ్ కో సౌగంధ్ హై కే ఆజ్ మొహబ్బత్ బంద్ హై” అని రాశాను.’

బక్షి లోతైన తాత్విక గీత రచయిత. ఉదాహరణకు, ఆయన రాసిన ఆయా సావన్ ఝూమ్ కే పాటలలో ఒకదాన్ని తీసుకోండి, దాంట్లో ఆయన మహాత్మా గాంధీ తత్వాన్ని ప్రదర్శిస్తారు: ‘కిసీ నే కహా హై, మేరే దోస్తోం, బురా మత్ కహో, బురా మత్ దేఖో, బురా మత్ సునో’.

“నొప్పికి నివారణ బాధలోనే ఉంది” అంటారు కవి రూమి. దోస్త్ సినిమాలోని ‘ఆ బతా దేఁ యే తుఝే కైసే జియా జాతా హై’ పాటలో కూడా ఇలాంటి భావమే వ్యక్తీకరించబడింది: ‘ఆ బతా దేఁ, యే తుఝే కైసే జియా జాతా హై.. కైసే నాదాన్ హైఁ ఓ, ఘమ్ సే అన్‍జాన్  హైఁ జో, రంఝ్ న హోతా అగర్, క్యా ఖుషీ కీ థీ కదర్, దర్ద్ ఖుదా హై మసీహా దోస్తోం, దర్ద్ సే భీ దవా కా దోస్తోం, కామ్ లియా జాతా హై మై నే భీ సీఖ్ లియా, కైసే  జియా జాతా హై’.

నాన్న ఠాగూర్ కి పెద్ద అభిమాని. నాలుగు దశాబ్దాలకు పైగా మా లివింగ్ రూమ్ గోడ పైన ఠాగూర్ ఫోటో ఉండేది. ఒకసారి, ఎప్పటిలాగే, కుటుంబ సభ్యుల, స్నేహితుల సమావేశంలో నాన్నగారి పాటలలో ఒకదాన్ని పాడమని అడిగారు. ఆయన మిలన్ సినిమా లోని ‘ఆజ్ దిల్ పే కోయి జోర్ చల్తా నహీఁ, ముస్కురానే లగే థే, మగర్ రో పడే’ అనే భావోద్వేగపు పాటను పాడాలని నిర్ణయించుకున్నారు. ఆయన ఈ పాట పాడతానని ప్రకటించినప్పుడు, ఆయన సన్నిహితులలో ఒకరు, ‘బక్షిజీ, విషాద గీతం పాడకండి. మాకు ఉల్లాసకరమైన పాట పాడండి. ఇది ఒక పార్టీ’ అని అన్నారు.

అప్పుడు నాన్న, ‘రవీంద్రనాథ్ ఠాగూర్‌ గారు, “విషాద గీతాలే అత్యంత సంతోషకరమైన పాటలు” అని చెప్పారు,’ అని అన్నారు.

దాంతో అక్కడున్న వారందరూ హర్షధ్వానాలు చేశారు, ఆయన మాకు ఇష్టమైన పాటలు రాజ్‌పుత్‌ లోని ‘డోలి, హో డోలి’, ‘దునియా మే కిత్నా ఘమ్ హై’ (అమృత్), ‘చింగారి కోయి భడ్కే’ (అమర్ ప్రేమ్)లతో సహా ఒకదాని తర్వాత ఒకటి విషాద గీతాలను పాడారు. రెండోది ఆయనకు ఇష్టమైన పాటలలో ఒకటి.

నాన్నకి పవిత్ర గ్రంథాలు బాగా తెలుసు. ‘ఎన్నడు పాపం చేయని వాడు ముందుగ రాయి విసరాలి!’ అని బైబిల్ చెబుతోంది. తన ‘యార్ హమారీ బాత్ సునో’ (రోటీ) పాటలో, నాన్న, ‘ఇస్ పాపన్ కో ఆజ్ సఝా దేంగే, మిల్‍కర్ హమ్ సారే, లేకిన్ జో పాపీ న హో, వో పహలా పత్థర్ మారే.’ అని వ్రాశారు. అదే విధంగా, యుద్ధ్‌ సినిమాలోని ఒక పాటలో ఆయన ‘డంకే పే చోట్ పడీ హై, సామ్నే ఫౌజ్ ఖడీ హై, కృష్ణ్ నే కహా అర్జున్ సే, నా ప్యార్ జతా దుష్మన్ సే, యుద్ధ్ కర్’ అని భగవద్గీత నుండి ఉటంకించారు.

ఒకసారి ఎప్పుడో, ‘ఇది హిట్ సినిమాలు తీయడం లేదా హిట్ స్క్రిప్ట్ రాయడం గురించి కాదు. హిట్స్, ఫ్లాప్‌లు – రెండిటి నుంచీ నేర్చుకోవాల్సిందే. ఈ పరుగు చివరన, హిట్స్, ఫ్లాప్‌ల ఎత్తుపల్లాలను దాటుతున్నప్పుడు మీరు ఎలాంటి వ్యక్తిగా పరిణమిస్తారన్నది నిజంగా ముఖ్యమైనది. ఈ మార్గంలో మీరు సంపాదించుకునేవి, నిలుపుకునేవి కుటుంబం, స్నేహితులు. అదే జీవితంలో అత్యుత్తమ బహుమతి.’ అని అన్నారు ఆనంద్ బక్షి.

(మళ్ళీ కలుద్దాం)

Exit mobile version