[శ్రీ రాకేశ్ ఆనంద్ బక్షి రచించిన ‘నగ్మే, కిస్సే, బాతేఁ, యాదేఁ – ది లైఫ్ అండ్ లిరిక్స్ ఆఫ్ ఆనంద్ బక్షి’ అనే ఆంగ్ల పుస్తకాన్ని అనువదించి పాఠకులకు అందిస్తున్నారు కొల్లూరి సోమ శంకర్.]
అధ్యాయం 9 – ‘ముష్కిల్ మే హై కౌన్ కిసీ కా’ – మొదటి భాగం
‘నన్ను నాకంటే ఎక్కువ ఇబ్బంది పెట్టిన వ్యక్తిని నేనెప్పుడూ కలవలేదు.’
కిళ్ళీ నమలడం, సిగరెట్లు కాల్చడం అనే అలవాట్ల నుండి బయటపడటానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఇలా అనేవారు నాన్న. 80లలో ఆయనకు రెండవసారి గుండెపోటు వచ్చినప్పుడు, ఆయన ఛాతీలో పేస్‌మేకర్ అమర్చారు. అప్పుడు డాక్టర్ ఆయనతో, “మిస్టర్ బక్షి, గత ముప్పై సంవత్సరాలుగా మీరు పెంచుకుంటున్న చెడు అలవాట్లు, కిళ్ళీ నమలడం, ధూమపానం మానేయాలి. అవి మీ గుండెకు హాని కలిగించాయి” అని సలహా ఇచ్చాడు.
డాక్టర్ వెళ్ళిపోయిన తర్వాత, ‘ఈ డాక్టర్‌కి ఏమీ తెలియదు. నా గుండెకు హాని కలిగించింది కిళ్ళీ, పొగాకులు కాదు. నా పాటలు నా గుండెపై తీవ్ర ప్రభావాన్ని చూపాయి.’ అని అన్నారు నాన్న.
***
ద్వైధీభావం
ఓ పాట రాయటం ప్రారంభించే ముందు నాన్న ఆత్మవిశ్వాసం కోల్పోయేవారు, తన మీద తనకే ఎన్నో సందేహాలు కలిగేవి. అయినప్పటికీ, రచయితగా లేదా ఓ మనిషిగా తన ‘విలువ’ని ఎవరైనా సవాలు చేస్తే, దానికి బదులు ఎలా తిరిగి ఆయనకు బాగా తెలుసు. ప్రకృతిని ప్రతిబింబించే రెండు సంఘటనలు నాకు ప్రత్యేకమైనవిగా నిలుస్తాయి. అవి మానవ స్వభావపు ద్వైధీభావాన్ని ప్రదర్శిస్తాయి.
మొదటిది – మా రెండవ ఇంటికి సంబంధించినది. ముంబై నుండి ఐదు గంటల ప్రయాణ దూరంలో ఉన్న పంచగని కొండలలోని భిలార్‌లోని మా ఇంటికి సంబంధించినది.
నాన్న, అమ్మ కలిసి ఐదు సంవత్సరాల పాటు దీన్ని నిర్మించారు, మేము ప్రతీ ఏడాది వేసవి సెలవుల్లో మాత్రమే ఇక్కడికి వచ్చేవాళ్ళం. అందులో అన్ని ప్రాథమిక అవసరాలు ఉన్నాయి, కాకపోతే ‘విలాసవంతమైనవి’గా పరిగణించబడే ఏ సౌలభ్యాలు లేవు – ఆనంద్ బక్షి వంటి పబ్లిక్ ఫిగర్ ఇంట్లో ఉండాలని జనాలు ఆశించే వస్తువులు ఏవీ లేవు. పూణేకు చెందిన ఒక పారిశ్రామికవేత్తకి మా ఇంటి సమీపంలోనే ఓ అద్భుతమైన సంపన్నమైన ఇల్లు ఉంది. కొన్నిసార్లు, అతను మా ఇంటికి వచ్చేవాడు, లేదా మేమే అతనిని చూడటానికి వాళ్ళ ఇంటికి వెళ్ళేవాళ్ళం. అతను ఒకసారి మా ఇంటికి వచ్చినప్పుడు, నాన్నతో “మిస్టర్ బక్షి, మీరు ఇక్కడ నివసించే విధానం చూసి నాకు చాలా ఆశ్చర్యంగానూ, విస్మయంగానూ ఉంది! మీరు కనీసం గచ్చు మీద గ్రానైట్ రాళ్ళు పరిపించాలి. ఇంటీరియర్స్ కోసం కొంత డబ్బు ఖర్చు చేయాలి. ఇదంతా ఇప్పుడు ఫ్యాషన్. పై కప్పుని సిమెంట్‌తో కట్టండి, పెంకులు పాత ఫ్యాషన్! మీరు ఇంటీరియర్ డిజైనర్‌ను నియమించుకోవాలి, కావాలంటే మా ఇంటిని అలంకరించిన డిజైనర్‌ను సిఫార్సు చేస్తాను. మీలాంటి వ్యక్తి మంచిగా కనిపించే ఇంటికి అర్హుడు!” అని అన్నాడు.
అడగకుండానే దొరికిన సలహా గురించి కాస్త ఆలోచించిన తర్వాత, “మీ ఇల్లు నా సాధారణమైన ఇంటి కంటే అందంగా ఉండటం సంతోషంగా ఉంది” అని అన్నారు నాన్న. “గత కొన్ని సంవత్సరాలుగా, నేను ఈ ఇంటికి వచ్చినప్పుడు, నా మామూలు పెంకుల కప్పు కింద ఈ సాధారణ వరండాలో కూర్చుని, మీ ఇంటిపైన ప్రసరించే అదే సూర్యరశ్మిని ఆస్వాదిస్తున్నాను. నేను ఒక విషయం గమనించాను: ఇంటి ముందరి రోడ్డు మీదుగా వెళ్ళే వ్యక్తులు ఆగి కొన్నిసార్లు నన్ను లేదా ఇంటిని చూపిస్తూ, “ఇది ఆనంద్ బక్షి ఇల్లు” అని అంటారు. వారు నా ఇంటిని ప్రశంసాపూర్వకంగా చూస్తారు. నా మీద అసూయగా ఉందా?!” అన్నారు నాన్న.
రెండవ సంఘటన ఓ ఆదాయపు పన్ను అధికారి నిర్వహించిన పార్టీలో జరిగింది. ఆయన నాన్నను ఓ పాట పాడమని కోరారు. “బక్షిజీ, మీరు చాలా బాగా పాడతారని విన్నాను. ఈ రాత్రి మీకు ఇష్టమైన కొన్ని పాటలు మా కోసం పాడండి.” అని అడిగారు.
నాన్న, “నేను బాగా పాడలేకపోయినా, నాకు పాడటం చాలా ఇష్టం. కానీ ఈ రోజు నా ఒంట్లో బాగా లేదు. నా స్నేహితుడు, హోస్ట్‌ని గౌరవించడానికి మాత్రమే నేను ఈ సమావేశానికి వచ్చాను. నేను ఈ రోజు పాడలేను. కానీ ఖచ్చితంగా మరో రాత్రి, ఏదో ఒక రోజు మన స్నేహితుడి ఇంట్లో కలిసినప్పుడు పాడతాను” అని బదులిచ్చారు.
“మిస్టర్ ఆనంద్ బక్షి, ఇది ఆదాయపు పన్ను అధికారుల కోసం ఆదాయపు పన్ను అధికారి ఏర్పాటు చేసిన పార్టీ. నేను మా కోసం పాడమని చెప్పే ఆదాయపు పన్ను అధికారిని. కాబట్టి దీనిని ఒక అభిమాని అభ్యర్థనగా కాకుండా ఒక ఆదేశంగా పరిగణించండి!” అన్నారు ఆ ఆదాయపు పన్ను అధికారి.
నాన్న నెమ్మదిగా తన డ్రింక్ తాగి, 555 సిగరెట్‌ను గాఢంగా పీల్చారు. ఆ అహంకారపూరిత అధికారి వైపు చూసి “సార్, దయచేసి, ఆదాయపు పన్ను శాఖలో మీ ర్యాంక్ ఎంతో చెప్పండి?” అని అడిగారు.
ఆ అధికారి గర్వంగా “అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ఇన్‍కమ్ టాక్స్” అని జవాబిచ్చాడు.
నాన్న మరో గుక్క తాగుతూ “ఈ నగరంలోనే 10,000 మంది ఎక్కువ లేదా తక్కువగా, ఇన్‍కమ్ టాక్స్ అసిస్టెంట్ కమిషనర్లు ఉంటారు. భారతదేశం అంతటా వేల సంఖ్యలో ఇంకా ఉంటారు. డియర్ ఇనకమ్ టాక్స్ అసిస్టెంట్ కమిషనర్, ఈ దేశంలో ఒకే ఒక్క ఆనంద్ బక్షి ఉన్నాడని జనాలు నాకు చెబుతారు. మీరు మీ వృత్తిలో మీరే ఏకైక వ్యక్తి అనే స్థాయికి చేరుకున్నప్పుడు, మీరు నన్ను పాడమని ఆదేశించవచ్చు. అవసరమైతే సంతోషంగా మీ కోసం ఒంటరిగా పాడతాను. కానీ ముందుగా, మీ స్వంత వృత్తిలో ఆ స్థాయికి చేరుకోండి!” అన్నారు నాన్న.
ఆ అధికారి మళ్ళీ నాన్న జోలికి రాలేదు.
***
‘మై కోయీ బర్ఫ్ నహీఁ హూఁ జో పిఘల్ జావూంగా’
ఇప్పటిదాకా మీరు నాతో ఇంత దూరం ప్రయాణించారు కాబట్టి, మా నాన్న – ప్రత్యేకమైన స్వీయ-వ్యక్తీకరణను మీకు పరిచయం చేస్తాను, ‘మై కోయీ బర్ఫ్ నహీఁ హూఁ జో పిఘల్ జావూంగా’. 90వ దశకంలో, నాన్నలో ఆందోళన తీవ్రతరమైంది. నిజానికి 70ల ప్రారంభం నుండి ఆయన దానితో బాధపడుతున్నారు. ఉదాహరణకు, ఒంటరిగా ఇంట్లో ఉండటానికి నాన్న ఇష్టపడరు. పని కోసం లేదా కుటుంబ సెలవులకు నగరం నుండి బయలుదేరినప్పుడు ఎల్లప్పుడూ ఒక సహచరుడితో ప్రయాణించేవారు. తన రచనా సామర్థ్యాలపై నాన్నకి నమ్మకం లేదు. గీత రచయితగా విజయం సాధించినప్పటికీ, తాను అంత సమర్థుడిని కాదని భావించడం కొనసాగించారు. కాబట్టి, తన ధైర్యాన్ని పెంచుకోవడానికి, తనను తాను ప్రేరేపించుకోవడానికి నాన్న రెండవ కవిత రాశారు. సినిమాలకు, ఇతరులకు దాదాపు 3300 పాటలు రాశారు. కానీ దీన్ని మాత్రం ఆయన తన కోసం రాసుకున్నారు. అయితే తన జీవితంలో చివరి సంవత్సరంలో, ఆయన ఈ కవితను తన ప్రియమైన స్నేహితుడు, చిత్రనిర్మాత సుభాష్ ఘాయ్‌కి ఇచ్చారు:
మై కోయీ బర్ఫ్ నహీఁ హూఁ జో పిఘల్ జావూంగా
మై కోయీ హర్ఫ్ నహీఁ హూఁ జో బదల్ జావూంగా..
మై సహారోం పే నహీఁ ఖుద్ పే యకీన్ రఖతా హూఁ
గిర పడూంగా తో హువా క్యా మై సంభాల్ జావూంగా..
చాంద్ సూరజ్ కీ తరహ్ వక్త్ పే నికలా హూఁ మై
చాంద్ సూరజ్ కీ తరహ్ వక్త్ పే ఢల్ జావూంగా..
కాఫిలే వాలే ముఝే ఛోఢ్ గయే హైఁ పీఛే
కాఫిలే వాలోం సే ఆగే మై నికల్ జావూంగా..
మైం అంధేరోం కో మిటా దూంగా చిరాగోం కీ తరహ్
ఆగ్ సీనే మేఁ లగా దూంగా మైఁ జల్ జావూంగా..
హుస్న్ వాలోం సే గుజారిష్ హై కీ పరదా కర్ లేఁ
మై దీవానా మై ఆషిక్ హూఁ మచల్ జావూంగా.
రోక సకతీ హై ముఝే రోక్ లే దునియా ‘బక్షి’
మై తో జాదూ హూఁ జాదూ హూఁ చలా జావూంగా..
90ల మధ్యలో, గీత రచయితగా దాదాపు మూడు దశాబ్దాలుగా ఒంటరిగా ఉండటం, ఆత్మవిశ్వాసం లేకపోవడం వల్ల తనలో కలిగిన ఆందోళనకు నివారణగా, అవకాశాల కోసం బొంబాయి వచ్చి ఒక ‘స్ట్రగులర్’గా ఉన్నప్పుడు చేసిన పనులనే ఇప్పుడూ చేయమని కుటుంబ వైద్యుడు నాన్నకి సూచించారు. బక్షి తన తొలినాళ్ళను, అంటే 50లు, 60ల నాటి జీవితాన్ని తిరిగి గడిపినట్లయితే, తాను కోల్పోయిన ఆత్మవిశ్వాసాన్ని తిరిగి పొందగలరని వైద్యుడు అభిప్రాయపడ్డాడు. కాబట్టి, నేను ఇంతకు ముందు చెప్పినట్లుగా, నాన్న తన పోరాట రోజుల్లో చేసినట్లుగా, బొంబాయి లోకల్ ట్రయిన్స్‌లో ఒంటరిగా ప్రయాణించడం ప్రారంభించారు. వెస్ట్రన్ రైల్వే వారి ఫస్ట్-క్లాస్ లోకల్ ట్రైన్ పాస్‌ను కొనుగోలు చేశారు, వారానికి ఒకసారి మధ్యాహ్నం ఖార్ స్టేషన్ నుండి మెరైన్ లైన్స్‌కు రైలులో ప్రయాణించేవారు; చాలా నెలల పాటు ఇలాగే చేశారు.
ఆ ప్రయాణాలకు సంబంధించి నాన్న తన పర్సనల్ డైరీలో వ్రాసుకున్న కొన్ని నోట్సులు ఇవి:
‘ఈ రోజు నేను మెరైన్ డ్రైవ్ ప్రొమెనేడ్ వద్ద ‘సీ-ఫేస్’ వద్ద నిలబడి సముద్రాల దేవుడిని ప్రార్థించాను, ఏడు సముద్రాలు నిండి ఉన్న ఆయనలా కాకుండా నేను కేవలం ఒక నీటి బిందువునని సముద్రానికి విన్నవించాను. దేవుని సహాయంతో, ఈ జీవితం ముగిసేలోపు నా భయాల నుండి విముక్తి పొందాలనుకుంటున్నాను.’ (డిసెంబర్ 6, 1995)
‘ఈ రోజు నేను దాదర్ స్టేషన్ నుండి భగవాన్ దాదా పాత ఆఫీసుకి నడిచాను, అక్కడే నేను నా సినీ జీవితాన్ని ప్రారంభించాను, సినిమాల్లో నాకు మొదటి బ్రేక్ దొరికింది, వీరి ‘భలా ఆద్మీ’ సినిమాతోనే. తర్వాత నేను మాహీం వద్ద దిగి నిర్మాత హిరేన్ ఖేరా పాత ఆఫీసుకి వెళ్ళాను, అక్కడ నా మొదటి విజయవంతమైన సినిమా ‘మెహందీ లగీ మేరే హాత్’లో రాసేందుకు అవకాశం పొందాను, అందులో అన్ని పాటలు నేనే రాశాను. నా గతానికి సంబంధించిన ఈ భావోద్వేగ జ్ఞాపకాలను తిరిగి పొందిన తర్వాత, నా భయాలు నశిన్నాయని నేను భావిస్తున్నాను. నేను ఈ ప్రయాణాలను ముందుగానే చేసి ఉండాలి, కానీ నేను విధితో పోరాడలేను. నేను ఇంతకాలం బాధపడాల్సి వచ్చింది. నాకు అత్యంత ఇబ్బంది కలిగించిన ఏకైక వ్యక్తి నేనే.’ (31 జనవరి 1996)
***
దేవుడు, విశ్వాసం
‘నీవు ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వు దేవునితో ఉంటావు. ఒంటరితనంలో నాకు దైవం తోడు. అది నేను నా దేవునితో మాట్లాడే సమయం. దేవుడే సత్యం. ఇదే పరమ సత్యం. ఈ జీవితం ఒక నాటకరంగం. మనమందరం నటులం. మనకు, మనం ప్రేక్షకులం. మన స్వంత నటనను మనం చూడవచ్చు. ఇతరులకు, మనం నటులం. ఈ వేదికపై మన నటనలలో మనం కనిపించి, తర్వాత అదృశ్యమవ్వాలి. రాజులు, రాణులు, అత్యంత ధనవంతులు, ధైర్యవంతులు, బలవంతులు, దయగల వ్యక్తులు వచ్చి వెళ్ళారు. నేను కూడా అలాగే చేస్తాను. ప్రపంచం అనే వేదికలో వారు ఈ చర్యను తమకు అనుకూలంగా మార్చుకోలేకపోయారు. నేను కూడా చేయలేను. కాబట్టి సంతోషకరమైనవి, బాధాకరమైనవీ – రెండిటినీ ఆస్వాదించండి మంచి ఆరోగ్యాన్నీ, అలాగే అనారోగ్యాన్ని కూడా.’ (21 జూలై 2001)
(మళ్ళీ కలుద్దాం)
కొల్లూరి సోమ శంకర్ రచయిత, అనువాదకులు. బి.ఎ.డిగ్రీతో గ్రాడ్యుయేషన్. మానవ వనరుల నిర్వహణలో పిజి డిప్లొమా చేసారు. దక్షిణ భారత హిందీ ప్రచార సభ వారి భాషా ప్రవీణ పాసయ్యారు. ప్రస్తుత నివాసం హైదరాబాదు.
సోమ శంకర్ 2001 నుంచి కథలు రాస్తున్నారు. 2002 నుంచి కథలను అనువదిస్తున్నారు. కేవలం కథలే కాక ‘ది అడ్వెంచర్స్ ఆఫ్ పినోకియో’ అనే పిల్లల నవలను ‘కొంటెబొమ్మ సాహసాలు’ అనే పేరుతోను, ‘మాజిక్ ఇన్ ది మౌంటెన్స్’ అనే పిల్లల నవలను ‘కొండలలో వింతలు’ అనే పేరుతోను, వినయ్ జల్లా ఆంగ్లంలో రాసిన ‘వార్స్ అండ్ వెఫ్ట్’ అనే నవలని ‘నారాయణీయం’ అనే పేరుతోను, వరలొట్టి రంగసామి ఆంగ్లంలో రాసిన ‘లవ్! లవ్! లవ్!’ నవలను ‘సాధించెనే ఓ మనసా!’ పేరుతోనూ, అజిత్ హరిసింఘానీ రచించిన ట్రావెలాగ్ ‘వన్ లైఫ్ టు రైడ్’ను ‘ప్రయాణానికే జీవితం’అనే పేరుతోను, డా. చిత్తర్వు మధు ఆంగ్లంలో రచించిన ‘డార్క్ అవుట్పోస్ట్స్’ అనే స్పేస్ ఒపేరా నవలను ‘భూమి నుంచి ప్లూటో దాకా’ అనే పేరుతోనూ; అమర్త్యసేన్ వ్రాసిన ‘ది ఐడియా ఆఫ్ జస్టిస్’ అనే పుస్తకాన్ని, మరో నాలుగు పుస్తకాలను తెలుగులోనికి అనువదించారు. ‘దేవుడికి సాయం’ అనే కథాసంపుటి, ‘మనీప్లాంట్’, ‘నాన్నా, తొందరగా వచ్చెయ్!!’, ‘ఏడు గంటల వార్తలు’ అనే అనువాద కథా సంపుటాలను ప్రచురించారు.