Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

నగ్మే, కిస్సే, బాతేఁ, యాదేఁ – ఆనంద్ బక్షి జీవితం, పాటలు-23

[శ్రీ రాకేశ్ ఆనంద్ బక్షి రచించిన ‘నగ్మే, కిస్సే, బాతేఁ, యాదేఁ – ది లైఫ్ అండ్ లిరిక్స్ ఆఫ్ ఆనంద్ బక్షి’ అనే ఆంగ్ల పుస్తకాన్ని అనువదించి పాఠకులకు అందిస్తున్నారు కొల్లూరి సోమ శంకర్.]

అధ్యాయం 8 – దివ్య కాంతి, దైవిక శక్తి కలిగిన వ్యక్తి – 6వ భాగం

ఫిబ్రవరి 2002 లో ఒకసారెప్పుడో, నాన్న  ఈ ఉత్తరాన్ని నాకు డిక్టేట్ చేశారు:

గదర్: ఏక్ ప్రేమ్ కథ సినిమాలో నా పాట, ‘ఉడ్‌జా కాలే కావాఁ’ కి అవార్డు రాలేదు. చాలా సంవత్సరాల క్రితం, ‘మిలన్’ సినిమాలోని మా పాటకు మేము అర్హులమని భావించినా, అవార్డులు దక్కకపోవడంతో నేను, గాయకుడు ముఖేష్ ఏడ్చాము; ఎందుకంటే మా పాట ‘సావన్ కా మహీనా’ ఆ సంవత్సరం బాగా ప్రజాదరణ పొందింది, ప్రశంసలు దక్కించుకుంది. అలాగే, ‘మేరే దేశ్ కి ధర్తీ’ పాట కూడా ప్రసిద్ధి చెందిన, అర్హత కలిగిన పాట. మా కన్నీరు ఇంకిన తర్వాత, లక్షలాది మంది తరపున ‘అధికార’ స్థానాల్లో ఉన్న కొంతమంది చేసిన ఎంపికల పట్ల మేమిద్దరం మౌనంగా ఉండిపోయాం. అది ఎంతవరకు న్యాయమనేది ప్రశ్నార్థకం, ఆ ప్రశ్న ఎప్పటికీ మిగిలే ఉంటుంది. తరువాత కొన్ని దశాబ్దాలుగా నేను మౌనంగా ఉన్నాను, నలభై సార్లు ఫిల్మ్‌ఫేర్ అవార్డుకు నామినేట్ అయ్యాను, చివరికి నాలుగు అవార్డులు అందుకున్నాను. ఫిల్మ్‌ఫేర్ పత్రికకూ, ఫిల్మ్‌ఫేర్‌ అవార్డుకు ఎంపిక చేసిన వ్యక్తులకు ధన్యవాదాలు..

నేను ఇంతకు ముందు ఇలా చేయలేదు, కానీ ఇప్పుడు చేయాలనుకుంటున్నాను, గతంలో అవార్డులు గెలుచుకోవడం నాకు సంతోషాన్నిచ్చింది, నా శ్రోతల కోసం ఇంకా మెరుగైన పని చేస్తూండడానికి నన్నుప్రేరేపించింది. అయినప్పటికీ నేను ఈ ‘పోటీ’ నుండి లేదా అవార్డుల ‘రేసు’ నుండి అధికారికంగా వైదొలగాలనుకుంటున్నాను. అంతేకాకుండా, నేను అవార్డు గ్రహీత కావడానికి ఇక్కడికి రాలేదు. నాకు సినిమా పాటలు రాయడం ఇష్టం కాబట్టి నేను ఇక్కడికి వచ్చాను. అది నా చిన్ననాటి కల – నా కుటుంబ పోషణకై నాకు డబ్బు అవసరం కాబట్టి, ముఖ్యంగా భారతదేశ విభజన తర్వాత, మేము అక్షరాలా నిరాశ్రయులమై ఆర్థికంగా క్రుంగిపోయాం కాబట్టి డబ్బు కావాలి.

ఇకపై నా పేరును ఏ అవార్డు కోసం నామినేషన్లలో చేర్చవద్దని నేను అభ్యర్థిస్తున్నాను. నేను నౌషాద్, ఎస్.డి. బర్మన్ నుండి ఎ.ఆర్. రెహమాన్ వరకు ప్రసిద్ధ స్వరకర్తలతో కలిసి పనిచేశాను. నేను సంతోషంగా ఉన్నాను; అది కూడా ఓ పెద్ద అవార్డే.

నాకు లభించిన అతి పెద్ద బహుమతి – నా కల నిజమవడమే! నా కుటుంబాన్ని ఆర్థికంగా కాపాడుకోగలిగేలా చేసినందుకు, చాలా మంది నా పాటలను ఇష్టపడేలా చేసినందుకు దైవానికి, కాలానికి కృతజ్ఞతలు. నా కుటుంబం, బంధువులు, సన్నిహితులు, సహచరులు – అలాగే సుభాష్ ఘాయ్, జావేద్ అక్తర్, సమీర్ వంటి ప్రముఖులు నా సాహిత్యం గురించి నన్ను సదా ప్రశంసిస్తారు. ఏ అవార్డులు ఎవరికీ సంపాదించిపెట్టలేని బహుమతులు ఇవి.

నేను రాసిన 3500-4000 పాటల్లో వెయ్యికి పైగా మంచి, ప్రజాదరణ పొందిన/హిట్ పాటలు రాసిన తర్వాత; ఇప్పుడు అవార్డులు అనే ఈ వార్షిక ‘పరీక్ష’లో కూర్చోవడం నాకిష్టం లేదు. ‘సావన్ కా మహీనా’ పాట ఒక్క అవార్డు కూడా గెల్చుకోకపోవడంతో నేను వాటిపై నమ్మకం కోల్పోయాను. అప్పట్లో, ‘ఇంత మంచి పాట నాకు అవార్డును సంపాదించిపెట్టలేకపోతే, నా జీవితకాలంలో ఈ పాట కంటే మెరుగ్గా ఏమీ రాయలేనని నేను అనుకుంటున్నాను. కాబట్టి ఇకపై నేను అవార్డును ఆశించకూడదు’ అని అనుకున్నాను. నేను, ఇంకా ఈ ప్రపంచంలోని చాలా మంది, మేం రాసే మంచి పాటలకి అందే రివార్డులకి ఎన్నటికీ సరిపోలని అవార్డులకై ప్రతీ ఏడాది నిర్వహించే ‘అవార్డుల పరీక్షల’ కోసం పరీక్షా హాళ్లలో కూర్చోకూడదు. ప్రజలు నాకు ఇచ్చే అవార్డులు లేదా ఇప్పటికే ఇచ్చిన అవార్డులు, నా తదనంతరం మా ఇంటిని అలంకరించడానికి ఉపయోగపడతాయి, అంతే. అవార్డులు నాకు అందించలేని బహుమతి – ఒక మనిషి జీవితాన్ని కాపాడిన నా పాట లాగా – నా ఆత్మ ఈ శరీరమనే బోను నుండి బయటకు వచ్చినప్పుడు మోస్తుంది, అది ప్రస్తుతం అనారోగ్యంతో ఉందని; శాశ్వతంగా ఉండదని నేను భావిస్తున్నాను.

నాలో ఇంకా చెప్పని భావాలు, పాటలు వందలాది ఉన్నందున నేను ఇంత త్వరగా చనిపోవాలనుకోవడం లేదు. నేను చనిపోతానని నాకు బాధ లేదు; ఇంకా రాయబడని, పాడబడని ఆ పాటలను నేను వెళ్ళే ముందు నా బిడ్డలతో సహా ఎవరికీ ఇవ్వలేకపోవడం బాధగా ఉంది. ఎందుకంటే నాతో వచ్చినది నాతోనే వెళ్లిపోవాలి. ఎవరూ అలాంటి వాటిని వారసత్వంగా లేదా దాతృత్వంతో లేదా మూర్ఖత్వంతో ఎవరికీ బహుమతిగా ఇవ్వలేరు.

గతంలో, నా పాటకు అవార్డు వచ్చినప్పుడల్లా, నేను వేదికపైకి వెళ్లి దానిని కృతజ్ఞతతో స్వీకరించాను, ఆ సందర్బాలలో – రెండు లేదా మూడు పదాల కంటే ఎక్కువ మాట్లాడలేదు. చాలా మంది నాతో, “మీరు అవార్డు గురించి, పాట గురించి, మీ జీవితం గురించి కూడా ఏదైనా మాట్లాడి ఉండాల్సింది” అనేవారు. నేను వారికి ఎల్లప్పుడూ, “మాట్లాడటానికి నాకు ఎటువంటి కారణం కనిపించడం లేదు. అయినా నా పనినే మాట్లాడనివ్వండి” అని సమాధానం ఇచ్చేవాడిని. ఏమైనా, నా కుటుంబం, స్నేహితులు, లక్షలాది మంది శ్రోతల నుండి నాకు చాలా ప్రేమ లభించింది. అయితే, “హలో, వినండి, నేను కూడా ఓ అవార్డు గెల్చుకున్నాను” అని ఎవరికైనా చెప్పగలిగే అవార్డులు నాకు చాలా తక్కువ.

ఇప్పుడు, సమయం ఆసన్నమైంది. నాకు అనారోగ్యంగా ఉంది, నేను నిజం చెప్పాలి. అవార్డుల గురించి చర్చలు కొనసాగించడం నాకు ఇష్టం లేదు, అవి ఎప్పటికీ ముగియవు లేదా ఎటువంటి ముగింపుకు చేరవు. అవార్డుకు ఎవరు అర్హులో, ఎవరు బహుమతికి అర్హులో శ్రోతలనే నిర్ణయించనివ్వండి. ఈ లేఖ చదువుతున్న మిమ్మల్ని, ‘పురస్కారాల నిర్ణేతల’ని – దయచేసి నన్ను క్షమించమని; మీ భవిష్యత్తు పోటీలలో, ఎక్కడికీ చేరని మీ పరుగుపందాలలో నన్ను పరిగణించవద్దని అభ్యర్థిస్తున్నాను. నేను ఎక్కడికో చేరుకోవాలి, ఎక్కడికో వెళ్ళాలి. కాబట్టి, ‘అవార్డుల వాణిజ్య పోరు’ నుండి నా పేరును ఉపసంహరించుకుంటున్నాను. నేను అనామకుడిగా ఉండగా, చాలా సహాయం చేసిన గొప్ప ప్రజాదరణ పొందిన కవి, నాకు తెలిసిన ఏకైక కవి-గీత రచయిత కూడా ‘అవార్డుల వాణిజ్య పోరు’ గురించి ఇదే చెప్పాడు. అందరికీ వందనాలు. బహు కృతజ్ఞలు. అచ్ఛా, తో హమ్ అబ్ చల్తే హైఁ.

మీ సొంత గొంతు, మీ సొంత కథ

ఒకసారి, నా స్నేహితుడు సిద్ధార్థ్ మా ఇంటికి వచ్చాడు, మా నాన్న తన పాట వినాలని, తన పాటల గురించి మార్గదర్శనం చేయాలని అతను కోరుకున్నాడు. అతను నాన్నతో తాను మహమ్మద్ రఫీ లాగా పాడతానని చెప్పాడు. నాన్న – నా మిత్ర గాయకుడితో, అతని పాటలు వినడానికి పెద్దగా ఆసక్తి లేదని, రఫీ గొంతు వినాలనుకుంటే, మా దగ్గర రఫీ పాటల సిడిలు, వినైల్స్ చాలా ఉన్నాయని చెప్పారు. అనుకరణ స్వరాలని వినడమెందుకు? నాన్న నా స్నేహితుడికి – “వెళ్ళి నీ సొంత స్వరాన్ని కనుక్కో. అప్పుడే నేను నీ గొంతు వినడానికి ఆసక్తి చూపిస్తాను, ఆ తర్వాతే నీకు మార్గదర్శనం చేయగలను. ఇతరుల నుండి వేరుగా నిలబడటానికి నీకంటూ నీ సొంత, ప్రత్యేకమైన స్వరం ఉండాలి” అని సలహా ఇచ్చారు.

‘ఆదిత్య చోప్రా నాకు ‘దిల్‌వాలే దుల్హనియా లే జాయేంగే’ కథ చెప్పినప్పుడు, నేను అతనితో, “ఆది, నువ్వు నాకు చెప్పిన దానిలో 50 శాతం చేసినా, నీ సినిమా పెద్ద హిట్ అవుతుంది” అని అన్నాను. ప్రీమియర్ తర్వాత, నేను ఆదికి ఫోన్ చేసి, “నువ్వు నాకు చెప్పినదాన్ని, 100% సినిమాగా తీశావు. నీ సినిమా చాలా పెద్ద హిట్ అవుతుంది” అని అన్నాను. ఆ సినిమా చాలా సంవత్సరాలు నడిచింది.’

కథల విషయంలో నాన్న మంచి న్యాయనిర్ణేత అని గ్రహించవచ్చు. 90ల మధ్య నాటికి, ఆయన కనీసం 500 చిత్రాలకు పాటలు రాశారు, అలాగే కథలు విన్న తర్వాత కనీసం 200-500 చిత్రాలను తిరస్కరించి ఉంటారు. మీరు చాలా సినిమాల కథలు విన్నాకా, ఆ అనుభవం మీ ఎంపికలను పదును చేస్తుంది.

‘నేను ఖార్ వెస్ట్‌లోని ఒక గెస్ట్ హౌస్‌లో బస చేస్తున్నప్పుడు పక్క గదిలో ఒక అస్థిరమైన అతిథి ఉండేవాడు. అతను వరండాలో కూర్చుని అల్పాహారం తీసుకునేవాడు. నేను అవకాశాల అన్వేషణలో వెళుతుండగా, అతను తన చిన్న వెన్న ప్యాకెట్‌ను తీసుకొని నాపై విసిరినట్లు నటించేవాడు. బహుశా నేను నా సమయాన్ని చదవడంలోనూ, రాయడంలోనూ గడుపుతున్నందుకూ, అతన్ని పట్టించుకోనందుకేమో అతను నన్ను ఇష్టపడలేదు. ఒక రోజు, అతను నన్ను వెన్న పాకెట్‌తో కొడతాడని అనిపించింది, భయమేసింది. తర్వాత, ఒక రోజు, అతను నిజంగానే వెన్న పాకెట్‌ని నా మీదకి విసిరాడు, కాని గురి తప్పాడు. భయపడ్డాను, వెంటనే గది మార్చాలని నిర్ణయించుకున్నాను. అయితే, ఈ ఉదంతం నుండి నేను నేర్చుకున్న పాఠం ఏమిటంటే – మఖన్ సే మారో, యా పత్తర్ సే, లేకిన్ నిషానా లగ్నా చాహియే (అది వెన్న అయినా లేదా ఎవరిపైనైనా విసిరే రాయి అయినా, మీరు లక్ష్యాన్ని చేధించాలి). మీరు ఏ పదాలను ఎంచుకున్నా, ఒక గీత రచయిత స్క్రీన్‌ప్లేలో ఆ క్షణపు కథను తెలియజేయగలగాలి. మీకు మంచి లక్ష్యం ఉండాలి, మీ లక్ష్యాన్ని ఎప్పుడూ కోల్పోకూడదు. నేనెప్పుడూ కథ ప్రకారమే పాటలు రాస్తాను. చాలా అరుదుగా నా గురి తప్పేది.

గౌరవం – విభేదాలు

‘గౌరవం. చాలా మందికి అది అవసరం. వారు ప్లేట్ మీల్స్ తిన్నప్పటికీ, పుల్ రెస్పెక్ట్ కోరుకుంటారు. ఒకసారి రెడ్ లైట్‌ సిగ్నల్‌ను ఉల్లంఘించినందుకు ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ నన్ను ఆపాడు. నేను నా కారు దిగి, అతని దగ్గరకు వెళ్ళి, కాస్త దూరంలో ఆగి, అతనికి నా సైనిక శైలిలో గౌరవప్రదంగా శెల్యూట్ చేశాను. అతను నవ్వుతూ తిరిగి శెల్యూట్ చేశాడు. బజ్ ఆఫ్ చేయమని, ఇంకెప్పుడూ సిగ్నల్ జంప్ చేయద్దని చెప్పాడు. అతను నన్ను గుర్తుపట్టాడు, అయినా నన్ను వదల్లేదు. నా సామర్థ్యం మేరకు పనిచేయాలని ఆశించే, నా పనికి నాకు జీతం ఇచ్చే నిర్మాతలకు నేను ఎల్లప్పుడూ ఇలాంటి గౌరవం చూపించాను. తక్కువ చెల్లించేవాళ్ళనీ లేదా నా నుంచి ఎక్కువ అడిగి చాలా తక్కువ చెల్లించే వ్యక్తులలా నేను వారినెప్పుడూ అగౌరవంగా చూడలేదు.

నిర్మాతలు, దర్శకులను అవమానించకుండా లేదా వారిపై అరవకుండానే మీరు వారితో విభేదిస్తున్నారని వాళ్ళకి తెలియజెప్పటానికి మంచి మార్గాలు ఉన్నాయి. ఒకసారి నా డ్రైవర్ వర్లి సీ ఫేస్ వద్ద అతివేగంగా వెళ్తున్నాడు, అలా చేయవద్దని అంతకు ముందు చాలాసార్లు చెప్పానతనికి. ఈసారి, కారుని ఓ సైడ్‌కి ఆపమని చెప్పి, నేను దిగిపోయాను. ఓ టాక్సీ ఎక్కాను, నేను లేకుండా కారులో ఇంటికి చేరుకోమని అతనికి చెప్పాను. అతను నిశ్శబ్దంగా మమ్మల్ని అనుసరించాడు, ఆ తర్వాత అతను ఎప్పుడూ అతివేగంతో వెళ్ళలేదు. ఒకసారి, బిఆర్ చోప్రా సాబ్, నేను ఒక సినిమా కోసం పని చేయాలనుకున్నాం, ఆ సినిమా కథ నాకర్థం కాలేదు. అది నా పరిమితి, ఆయనది కాదు. అందువల్ల ఆయన నాతో ఈ సినిమా చేయడం నాకిష్టం లేకపోయింది. గతంలో మేము పతీ పత్ని ఔర్ వో సినిమా కోసం కలిసి పని చేసాము. నన్ను క్షమించమని, ఈ ప్రాజెక్ట్ నుండి  నుండి నన్ను తప్పించమనీ అడిగాను. అయితే – మా స్నేహం కొనసాగాలనీ, నన్ను వాళ్ళ ఇంటికి భోజనానికి ఆహ్వానించడం ఆపకూడదని షరతు విధించాను. ఎందుకంటే వాళ్ళ ఇంటి మాంసాహారం రుచే వేరు. నేను ఇప్పటివరకు తిన్న అత్యుత్తమ మాంసాహారం వాళ్ళింట్లో వండినదే. చోప్రా సాబ్ ఆనందంగా నవ్వాడు. ఆ తర్వాతం మేము కలిసి పని చేయకపోయినా, ఆయనా, ఆయన కుమారుడు, చిత్రనిర్మాత రవి నా స్నేహితులుగా కొనసాగుతున్నారు.

విలువైన సమయమూ, ఎంతో డబ్బు ఖర్చు చేసినప్పటికీ మీ నమ్మకాలకు విరుద్ధంగా ఉండే వాటితో ముందుకు సాగద్దు. ఉదాహరణకు, నాకు ఎత్తులంటే భయం, విమానాలు ఎక్కలేను. నేను చాలాసార్లు ఎయిర్‍పోర్ట్‌కి వెళ్ళి విమానం ఎక్కకుండానే తిరిగి వచ్చాను; టికెట్ కొన్నాకా కూడా నేను విమానం ఎక్కకూడదని భావించాను. నా మనస్సు భయంతో నిండిపోయింది కాబట్టి నేను అలా చేసాను. నా విమాన టికెట్ ఖర్చు కంటే, విమానం గాలిలో ఉండగా భయాందోళనలతో నేను సృష్టించే గందరగోళం తోటివారికి ఇబ్బంది కలిగించవచ్చు. ఇతరుల గురించి ఆలోచించండి.

నేను చాలా మంది వ్యక్తులను కలిశాను. చాలా విభిన్న పాత్రలకు, కథలకు పాటలు రాశాను. అది నన్ను మంచి రచయితగా, మంచిమనిషిగా మార్చింది. ప్రతి పాట నుండి నేను నేర్చుకున్నాను. అదే విధంగా, ప్రతి బిడ్డ జననం తర్వాత తండ్రిగా మెరుగవుతూ ఉన్నాను. ఎందుకంటే, అంతకుముందు నేనలా లేను.’

***

ఆయన చెప్పిన వాటిలో ఏదీ సినిమా పరిశ్రమకు, ఆయన వృత్తికి సంబంధించిన పరమ సత్యం కాదు. ఈ ప్రకటనలు ఆయన ఆలోచనా విధానం, పని తీరు, ఆయన అవగాహన, నమ్మకాల గురించి మనకు ఒక గ్రహింపుని ఇస్తాయి. ఇప్పటిదాకా చెప్పిన వాటన్నిటి నుండి, ఈ అధ్యాయం చివరలో నాకు ప్రత్యేకంగా కనిపించేవి – ఆయన ఏకాగ్రతా, ఆచరణాత్మకతా! ఆయన మాటలను పునరుద్ఘాటిస్తూ, ‘నేను మొదట హాబీగా రాయడం ప్రారంభించాను, తరువాత నా కుటుంబ పోషణ కోసం, ఆర్థిక భద్రత కోసం రాశాను. పాటలు రాయకుండా జీవించలేను కాబట్టి కొనసాగించాను. కొన్ని పాటలు ఆహారం కోసం, మరికొన్ని హృదయం కోసం రాశాను. నా సంగీత స్వరకర్తలు, చిత్రనిర్మాతలు, నా కుటుంబం కోసం అత్యుత్తమ పనితీరు కనబరచడం నా పరమ కర్తవ్యం. పైగా, నా పాటల రచన అనుభవాలు కూడా నన్ను మంచి వ్యక్తిగా మార్చాయని నేను అనుకుంటున్నాను.’

(మళ్ళీ కలుద్దాం)

Exit mobile version