[శ్రీ రాకేశ్ ఆనంద్ బక్షి రచించిన ‘నగ్మే, కిస్సే, బాతేఁ, యాదేఁ – ది లైఫ్ అండ్ లిరిక్స్ ఆఫ్ ఆనంద్ బక్షి’ అనే ఆంగ్ల పుస్తకాన్ని అనువదించి పాఠకులకు అందిస్తున్నారు కొల్లూరి సోమ శంకర్.]
అధ్యాయం 8 – దివ్య కాంతి, దైవిక శక్తి కలిగిన వ్యక్తి – 5వ భాగం
మూఢనమ్మకాల పరిశ్రమ:
‘80ల చివర్లో, పాటల రికార్డింగ్‌లకి నేను షార్ట్ ప్యాంటు, హాఫ్ స్లీవ్ టీ-షర్టులు వేసుకుని వెళ్ళసాగాను. ఆ సినిమాలు బాగా ఆడాయి. ఆ కాలంలో, నేను ఎప్పుడైనా రికార్డింగ్‌లకి ఫుల్ ప్యాంటులో వెళ్తే నన్ను వెనక్కి పంపించి, నా లక్కీ షార్ట్స్‌లో తిరిగిరమ్మని అడిగిన సంగీత దర్శకులు, చిత్రనిర్మాతలు చాలామంది ఉన్నారు. ఇది మూఢనమ్మకాల పరిశ్రమ. నేను ఏదైనా సినిమాలో పాట పాడితే, ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలయ్యేది, దాంతో, మూఢనమ్మకాల కారణంగా, పరిశ్రమవారు నన్ను తమ సినిమాల్లో పాడమని అడగడం మానేశారు. షోలే తర్వాత నేను పాడటం మానేశాను. ఆ సినిమా బ్లాక్‌బస్టర్, కానీ నేను పాడిన ఖవ్వాలి సినిమాలో లేదు. నేను రాసిన హిట్ పాటల వల్ల ప్రజలు నన్ను ఖచ్చితంగా గుర్తుంచుకుంటారు, కానీ నేను పాడిన పాటలలో కనీసం ఒక్క పాటకైనా నన్ను గుర్తుంచుకోవాలని కూడా కోరుకుంటున్నాను.
తన కొడుకు రిషి కపూర్ తొలి సినిమా కోసం, రాజ్ కపూర్ నన్ను పాటలు రాయమని అడిగినప్పుడు నాకెంతో ఉత్సాహం కలిగింది. ఆయన లక్ష్మీకాంత్-ప్యారేలాల్‌ని, నన్ను తన స్టూడియోకి పిలిచారు. నేను కథ వినలేదు కానీ సినిమా పేరు బాబీ అని తెలుసు. మేము రాజ్ కపూర్‌ను కలిసినప్పుడు, నేను పల్లవి రాసి వినిపించాను: “హమ్ తుమ్, ఏక్ కమరే మే బంద్ హోఁ, ఔర్ చాబీ ఖో జాయే; తేరే నైనో కి భూల్ భూలైయా మే, బాబీ ఖో జాయే.” బాబీ అనేది హీరో పేరా, లేక హీరోయిన్ పేరా అనేది స్పష్టంగా తెలియదు, సినిమాలో పాట కోసం ఈ లైన్‌ను ఉపయోగించవచ్చా అని నేను రాజ్ కపూర్‍ని అడిగాను. ఆయనకు ఆ పల్లవి నచ్చింది, ఆ లైన్ హీరోయిన్‍కైనా, హీరోకైనా బాగా సరిపోతుందని అన్నారు. కథలో అలాంటి సన్నివేశం లేకపోయినా (అప్పటికి మేము ఇంకా వినలేదు), ఈ పాట కోసం ఒక సన్నివేశాన్ని సృష్టిస్తానని కూడా ఆయన చెప్పారు. జుహులోని లక్ష్మీకాంత్ కొత్త బంగ్లాకు మొదటిసారి వెళ్ళినప్పుడు ఈ పాట కోసం నాకు ఆలోచన వచ్చింది; అక్కడ చాలా గదులు ఉన్నాయి, ఆ ఇంట్లో నేను తప్పిపోయాను.
ప్రేరణ ఏ క్షణంలోనైనా రావచ్చు. ఒకసారి, శక్తి సామంత, ఆర్.డి. బర్మన్, నేను జుహులోని సన్-ఎన్-సాండ్ హోటల్‌లో ఒక సినిమా పార్టీలో ఉన్నాము. పార్టీ అయిపోయింది, మా కార్ల కోసం ఎదురుచూస్తున్నాం, పెద్ద వాన పడుతోంది, నేను సిగరెట్ వెలిగించి, తర్వాత, ఆ కుండపోత వర్షంలో మండుతున్న అగ్గిపుల్లని ఆపివేశాను. అప్పుడే నాకు “చింగారీ కోయి భడ్కే, తోహ్ సావాన్ ఉసే బుజాయే, సావన్ జో, అగన్ లగాయే, ఉసే కౌన్ బుజాయే..” అనే లైన్లు స్ఫురించాయి. శక్తి సామంతకి అవి నచ్చాయి, వాటిని తరువాత నేను రాసిన ఓ పాటకి పల్లవిలా ఉపయోగపడేలా అమర్ ప్రేమ్ చిత్రంలో ఒక సన్నివేశాన్ని సృష్టించాడు.
మేరీ ఏక్ హీ కమ్‌జోరీ హై కి మేరే గీత్ జన్ భాషా మే హోతే హైఁ (నా ఏకైక బలహీనత ఏమిటంటే నా పాటలు సామాన్య ప్రజల భాషలో ఉండటం). నాన్నగారి ఈ వ్యాఖ్యలు చదివినప్పుడల్లా నేను ఆశ్చర్యపోతాను. కొంతమంది విమర్శకులు, గేయ రచయితలు నాన్న అసలు గీత రచయితే కాదని, కవి కూడా కాదని నిందించారు, అది ఆయనను బాధించింది. బహుశా అందుకే ఆయన తనని తాను ‘రక్షించుకున్నట్టు’గా, ‘మై షాయర్ తో నహీ’, ‘మై షాయర్ బద్నామ్’ వంటి పాటలు రాశారు. ఆయన బలం అని దేన్నైతే ఆయన శ్రోతలు, ఎంతోమంది జర్నలిస్టులు పదే పదే చెప్పారో, ఆయన దానిని తన బలహీనతగా భావించారు.
కొంతమంది నిజంగా మంచి గీత రచయితలు తమ ఇళ్ళు గడవడానికి సినిమా పాటలు “బలవంతం”గా రాయాల్సి వస్తోందని ఎందుకు అంటున్నారు? సినిమా పాటలను జనాలెందుకు తక్కువగా చూస్తారు? ఒక సినిమా గీత రచయిత తన రచనను గర్వించదగ్గ విషయంగా చూడకూడదా? నేను పెద్దగా చదువుకోలేదు కాబట్టి సరళంగా వ్రాస్తాను, కానీ సరళమైన సాహిత్యం రాయడం ద్వారా భారతదేశం అంతటా పెద్దగా చదువుకోనివాళ్ళని, నా పాటలను ఇష్టపడే చాలామందిని ఆకర్షించగలనని నాకు తెలుసు.
సీనియర్ రచయితల నుండి నేను తెలిసో తెలియకో చాలా నేర్చుకున్నాను, కాబట్టి వారందరినీ ఎల్లప్పుడూ గౌరవిస్తాను. నేను విస్తృతంగా చదువుతాను కాబట్టి నా పాటల్లో కొత్త ఆలోచనలని వ్యక్తపరచగలను, కొత్త విషయాలను వ్రాయగలను. చదవని వ్యక్తికి కొత్తగా మాట్లాడటానికి ఏమీ ఉండదు. నాకు ఉర్దూ సాహిత్యం ప్రాణం, నాకు ఇష్టమైన పత్రిక రీడర్స్ డైజెస్ట్.
ఏక్ దుజే కే లియే కోసం “మేరే జీవన్ సాథీ, ప్యార్ కియే జా” అనే పాటను సంగీత దర్శకులు లక్ష్మీకాంత్-ప్యారేలాల్ సహాయంతో, దాదాపు 200-250 హిందీ సినిమా పేర్లని ఉపయోగిస్తూ రాశాను. ఆ సినిమాలో హీరో పాత్రధారి (కమల్ హాసన్) హిందీ మాట్లాడలేడు, హీరోయిన్ (రతి అగ్నిహోత్రి) “నువ్వు నన్ను ప్రేమిస్తే, హిందీ మాట్లాడటం నేర్చుకోవాలి” అని అతనితో చెబుతుంది. దాంతో ఆమెను ఆకట్టుకోవడానికి, ప్రసిద్ధ హిందీ సినిమా పేర్లను ఉపయోగించి ఆమె కోసం ఒక పాట పాడతాడు. ఈ పాటలోని ప్రతి పదం ఓ సినిమా టైటిల్. ఈ సందర్భోచితమైన పాట వారి స్నేహాన్ని ప్రేమ వైపు తీసుకెళుతుంది, వారి ప్రేమకథను ముందుకు తీసుకెళుతుంది. ఏక్ దుజే కే లియే గురించి, ఒక సినిమా పాటలు దాని విజయానికి అందించగల సహకారం గురించి, గీత రచయిత హస్రత్ జైపురి సాబ్, “ఏక్ దుజే కే లియే నుండి పాటలను తొలగిస్తే, సినిమా క్రాష్ అవుతుంది.” అన్నారు. నేను ఆయనతో ఏకీభవించను, కానీ ఆయన మా గీత రచయితల తరఫున మాట్లాడుతున్నారని అర్థమైంది. నా దృష్టిలో, హస్రత్ సాబ్ ప్రేమకు రారాజు.
పాటలు – నా పద్ధతులు
పాటను రాసే ముందే, ఆ పాటను ఎవరిపై చిత్రీకరిస్తారో (ఎవరు లిప్-సింక్ చేస్తారో) అడుగుతాను, దాని ప్రకారం పాట రాస్తాను. రాజేష్ ఖన్నా పాటల కోసం, నేను కిషోర్ కుమార్ స్వరాన్ని దృష్టిలో ఉంచుకుని రాస్తాను..
మైనే కభీ హిట్ గానా నహీ లిఖా; గానా పబ్లిక్ హిట్ యా ఫ్లాప్ కర్తీ హై (హిట్ పాట రాసేది నేను కాదు; పాట హిట్ అవుతుందా లేదా ఫ్లాప్ అవుతుందా అని నిర్ణయించేది ప్రజలే). నిర్మాతలు లేదా దర్శకులు నన్ను హిట్ పాట రాయమని అడిగినప్పుడు, వారు తప్పు వ్యక్తి వద్దకు వచ్చారని చెబుతాను. ఈ దుకాణం హిట్‌లను అమ్మదు. ఇస్ దుకాన్ పే హిట్ గానే నహీ మిల్తే.
సైనిక జీవితం, గీత రచయిత పని ఒకేలా ఉంటాయి. రెండింటికీ – ఒక బృందంలా సామరస్యంగా పనిచేయడానికి మంచి ప్రవర్తన అవసరం, ఈ రెండు రంగాలలో మీకు మీ సీనియర్లు, సహచరుల నుండి సిఫార్సులు అవసరం.
శ్రోతలపై మన భాషా నైపుణ్యాలను బలవంతంగా రుద్దలేమని నేను చిన్నప్పుడే నేర్చుకున్నాను; వారు అర్థం చేసుకోలేని వాటిని పాడకుండా తిరస్కరిస్తారు. జనాలు సులభంగా పాడగలిగితే, ఆ పాట ప్రజాదరణ పొందుతుంది.
నా పాటలు నాకు గుర్తుండవు, ఒక్కోసారి రాసిన వెంటనే కూడా మర్చిపోతుంటాను. బహుశా నా మనసు దానంతట అదే ఆ పలకను తుడిచిచేస్తుందేమో, తదుపరి పాట కోసం.
మై సమాజ్ కో జోడ్నే వాలే గీత్ లిఖ్తా హూఁ, తోడ్నే వాలే నహీఁ (నేను ప్రజలను కలిపే పాటలు రాస్తాను, ప్రజలను విడదీసేవి రాయను). ఒక ఉదాహరణ దేశ్ ప్రేమి సినిమా నుండి “మేరే దేశ్ ప్రీమియోఁ, ఆపస్ మే ప్రేమ్ కరో, దేశ్ ప్రీమియోఁ”.
అవార్డుల కోసం పోటీ
ఒకసారి, ఒక వ్యక్తి నన్ను సంప్రదించాడు – అతనికి రూ. 11,000 ఇస్తే, ఆ సంవత్సరపు ప్రధాన చిత్రానికి నాకు అవార్డు వచ్చేలా చేస్తానని హామీ ఇచ్చాడు. ఇది 70లలో జరిగింది. నా పాటలు చాలా బాగా నడుస్తున్నాయి, నేను అగ్రస్థానంలో ఉన్నాను, కానీ నాకు అవార్డులు రావడం లేదు. నేను అతనిని, “నేను మీకు రూ. 11,000 చెల్లిస్తే, మీరు నాకు అవార్డు తప్పక ఇప్పిస్తానని అంటున్నారు. కానీ మీ అవార్డు నాకు మరిన్ని అవకాశాలకు హామీ ఇస్తుందా?” అని అడిగాను. దానికి అతను, “లేదు, నేను అవార్డుకి మాత్రమే హామీ ఇవ్వగలను” అని సమాధానం ఇచ్చాడు. మరిన్ని అవకాశాలు పొందాలంటే, పని చేయడమే మంచిదని నేను అతనికి చెప్పాను.’
90లలో ఎప్పుడో, ఓసారి నేను, “మీకు నామినేషన్లు చాలా వచ్చాయి, కాని అవార్డులు కొన్నే వచ్చాయి. ఎందుకు?” అని నాన్నగారిని అడిగాను. ఓ పబ్లిక్ రిలేషన్స్ ప్రతినిధిని ఏర్పాటు చేసుకోగలిగితే, మరిన్ని అవార్డులు గెలుచుకునే అవకాశం ఉందని నేను అన్నాను. అప్పుడు నాన్న ఇలా చెప్పారు:
విధి అనేది సర్వశక్తిమంతమైనది. అవకాశాల కోసం లేదా అవార్డుల కోసం చేసే కుట్రలను నేను నమ్మను. అవార్డులు అందుకోవడం ఖచ్చితంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది, కానీ నేను ఇకపై వాటి కోసం ఆరాటపడను. భూమ్మీద నుంచి వెళ్ళిపోయే సమయం వస్తే, గెలుచుకున్న అవార్డులను ఇక్కడే వదిలి వెళ్ళాలి; నేను పోయాక అవి చాలా కాలం పాటు మన గదికి అలంకారంగా ఉంటాయి. 70/80లలో నేను గెలుచుకున్న ఓ అవార్డు నా తదుపరి జన్మ వరకు నాతో ఉండే అవార్డు. ఒక గ్రామంలో నివసించే ఒక అపరిచితుడి నుండి నాకు ఒకో ఉత్తరం వచ్చింది. తాను ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నానని, తన గ్రామం మీదుగా వెళ్ళే రైలుపట్టాలపై పడుకున్నానని రాశాడు. కానీ అప్పుడే, ఒక పాట అతనికి వినిపించిందట. బహుశా దగ్గరలో ఎవరైనా రేడియో పెట్టారేమో. గాలి ఆ పాటను మోసుకెళ్లి ఉండవచ్చు. రైలు కోసం ఎదురు చూస్తున్న అతని చెవుల్లోకి దూరిన ఆ పాట లోని వాక్యాలు ఏమిటంటే, “గాడీ కా నామ్, నా కర్ బద్నామ్, పత్‌రీ పే రఖ్ కే సర్ కో; హిమ్మత్ న హార్, కర్ ఇంతేజార్, ఆ లౌట్ జాయేఁ ఘర్ కో; యే రాత్ జా రహీ హై, వో సుభా ఆరహీ హై.” ఆ వ్యక్తి పట్టాల మీద నుంచి లేచిన కొద్ది క్షణాలకే, రైలు అతడిని దాటేసిందట. నా సాహిత్యం తన ప్రాణాలను కాపాడిందని చెప్పడానికి ఆ ఉత్తరం రాశాడు. అదే నేను గెలుచుకున్న అతి పెద్ద అవార్డు. దునియా మే ఐసా కోయి కామ్ నహీ, జిస్ మే హర్ సాల్ బోనస్ మిల్నా హీ చాహియే, యా ఫిర్ మిల్తా హీ హై.
మంచి సాహిత్యం రాయడం ముఖ్యం, అయితే అది తప్పనిసరిగా ప్రజాదరణ పొందకపోవచ్చు లేదా అవార్డులు గెలుచుకోకపోవచ్చు. ఏక్ దుజే కే లియేలో, నేను “సోలా బరస్ కీ, బాలి ఉమర్ కో సలాం, ప్యార్ తేరి పెహ్లీ నజర్ కో సలాం” పాట లిరిక్‌ని ఇష్టపడ్డాను. కానీ అది కనీసం నామినేట్ కాలేదు. బదులుగా, అదే చిత్రంలోని “తేరే మేరే బీచ్ మే, కైసా హై యే బంధన్ అంజానా, మై నే నహీ జానా, తునే నహీ జానా” పాటకు నాకు అవార్డు వచ్చింది. దిల్‌వాలే దుల్హనియా లే జాయేంగే విషయంలో కూడా ఇలాగే జరిగింది – “తుఝే దేఖా తో యే జానా సనమ్” పాటకు నాకు అవార్డు వచ్చింది కానీ నేను “ఘర్ ఆజా పరదేశి” పాటని ఇష్టపడ్డాను. అయితే, నేను బాధపడలేదు, ఎందుకంటే కొన్ని అవార్డులలో, జడ్జిలకు నాణ్యత కంటే ప్రజాదరణ ముఖ్యం. అంతేకాకుండా, ఒక పాట హిట్ అయి అవార్డులు గెలుచుకుంటే సరిపోదు. అవార్డుకు అర్హమైన పాట కూడా కథను ముందుకు నడిపించేదిగా ఉండాలి. ఇంకా, సరైన పాట సన్నివేశం, సరైన చిత్రీకరణ విజయవంతమైన పాటకు బదులుగా చిరస్మరణీయమైన పాటను రూపొందించడంలో సహాయపడుతుంది..
సినిమా నిర్మాణంలోని ఇతర సృజనాత్మక వ్యక్తుల్లానే, నేను కూడా దుర్బలంగా ఉంటాను, ఎందుకంటే మన పాటల విజయం కూడా – దర్శకుడు, సంగీత దర్శకుడు, కొరియోగ్రాఫర్, సినిమాటోగ్రాఫర్ తదితరలు దాన్ని ఎలా కో-ప్రెజెంట్ చేశారనే దానిపై ఆధారపడి ఉంటుంది. ఇది జట్టుకృషి. కాబట్టి, ఒక పాటకు అవార్డు రాకపోతే, మనలో ప్రతి ఒక్కరూ – ఈ వ్యాపారంలో వివిధ అనూహ్య కారకాలు విసిరే సవాళ్లును ఎదుర్కుంటూ – ఉన్నత స్థాయికి ఎదగడానికి మరింత కష్టపడాలి. సినిమా నిర్మాణం, పాటలు అన్నీ జట్టుకృషికి చెందినవి, ఔర్ హమే ఏక్ ఆర్కెస్ట్రాకి తర్హా సాథ్ చల్నే కీ హిమ్మత్ ఔర్ కాబ్లియత్ హోనీ చాహియే (మనమంతా ఓ ఆర్కెస్ట్రాలా ధైర్యంతో, నైపుణ్యంతో కలిసి పనిచేయాలి).’
(మళ్ళీ కలుద్దాం)
కొల్లూరి సోమ శంకర్ రచయిత, అనువాదకులు. బి.ఎ.డిగ్రీతో గ్రాడ్యుయేషన్. మానవ వనరుల నిర్వహణలో పిజి డిప్లొమా చేసారు. దక్షిణ భారత హిందీ ప్రచార సభ వారి భాషా ప్రవీణ పాసయ్యారు. ప్రస్తుత నివాసం హైదరాబాదు.
సోమ శంకర్ 2001 నుంచి కథలు రాస్తున్నారు. 2002 నుంచి కథలను అనువదిస్తున్నారు. కేవలం కథలే కాక ‘ది అడ్వెంచర్స్ ఆఫ్ పినోకియో’ అనే పిల్లల నవలను ‘కొంటెబొమ్మ సాహసాలు’ అనే పేరుతోను, ‘మాజిక్ ఇన్ ది మౌంటెన్స్’ అనే పిల్లల నవలను ‘కొండలలో వింతలు’ అనే పేరుతోను, వినయ్ జల్లా ఆంగ్లంలో రాసిన ‘వార్స్ అండ్ వెఫ్ట్’ అనే నవలని ‘నారాయణీయం’ అనే పేరుతోను, వరలొట్టి రంగసామి ఆంగ్లంలో రాసిన ‘లవ్! లవ్! లవ్!’ నవలను ‘సాధించెనే ఓ మనసా!’ పేరుతోనూ, అజిత్ హరిసింఘానీ రచించిన ట్రావెలాగ్ ‘వన్ లైఫ్ టు రైడ్’ను ‘ప్రయాణానికే జీవితం’అనే పేరుతోను, డా. చిత్తర్వు మధు ఆంగ్లంలో రచించిన ‘డార్క్ అవుట్పోస్ట్స్’ అనే స్పేస్ ఒపేరా నవలను ‘భూమి నుంచి ప్లూటో దాకా’ అనే పేరుతోనూ; అమర్త్యసేన్ వ్రాసిన ‘ది ఐడియా ఆఫ్ జస్టిస్’ అనే పుస్తకాన్ని, మరో నాలుగు పుస్తకాలను తెలుగులోనికి అనువదించారు. ‘దేవుడికి సాయం’ అనే కథాసంపుటి, ‘మనీప్లాంట్’, ‘నాన్నా, తొందరగా వచ్చెయ్!!’, ‘ఏడు గంటల వార్తలు’ అనే అనువాద కథా సంపుటాలను ప్రచురించారు.