Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

నగ్మే, కిస్సే, బాతేఁ, యాదేఁ – ఆనంద్ బక్షి జీవితం, పాటలు-21

[శ్రీ రాకేశ్ ఆనంద్ బక్షి రచించిన ‘నగ్మే, కిస్సే, బాతేఁ, యాదేఁ – ది లైఫ్ అండ్ లిరిక్స్ ఆఫ్ ఆనంద్ బక్షి’ అనే ఆంగ్ల పుస్తకాన్ని అనువదించి పాఠకులకు అందిస్తున్నారు కొల్లూరి సోమ శంకర్.]

అధ్యాయం 8 – దివ్య కాంతి, దైవిక శక్తి కలిగిన వ్యక్తి – 4వ భాగం

మారిన శైలి:

‘ట్యూన్ ఆకర్షణీయంగా ఉంటే, శ్రోతలు పదాలను పట్టించుకోరు. ఈ కారణంగా నేను నా హిందీ సాహిత్యంలో చాలా పంజాబీ పదాలను వాడాను, ఒక్కోసారి మొత్తం చరణమంతా కూడా వాడి తప్పించుకున్నాను. ఇందుకు “బిందియా చమ్కేగి” ఒక ఉదాహరణ. ఆ పాట చాలా పెద్ద హిట్ అయింది. అప్పటి నుండి నేను పంజాబీ పదాలను జొప్పిస్తూ అనేక పాటలు రాశాను. గుజ్రన్‌వాలాలో జన్మించిన డిఎన్ మధోక్, సినిమా పాటలు రాసిన మొదటి పంజాబీలలో ఒకరు. హిందీ సినిమా పాటలలో పంజాబీని పరిచయం చేసిన మొదటి గేయ రచయిత ఆయన. గీతము, నజ్మ్ సంబంధం కలిగి ఉంటాయి; గీతమనేది శ్రావ్యతలో వ్యక్తీకరించగల కవిత్వం. ఉర్దూ/హిందీ, ఇంకా సరళమైన హిందుస్తానీ భాషలలో ప్రావీణ్యం ఉన్నందున, పంజాబీలు సాహిర్ లాగా పాటలను సులభంగా రాయగలిగారు. శైలేంద్ర కూడా రావల్పిండిలో జన్మించాడు. మేము పంజాబీలు మా టప్పాలు, కాఫీయా లను మా సినిమా గీతాలలోకి తీసుకువచ్చాము.

ఒక రకంగా, జబ్ జబ్ ఫూల్ ఖిలే (1965) మాత్రమే కాదు, ఫర్జ్ (1967) సినిమా కూడా సంభాషణా పద్ధతిలో పాటలు రాయడంలో నాకు మలుపు లాంటిది. ఆ తర్వాత, నేను నా పాటలను సరళమైన రీతిలో, రోజువారీ సంభాషణా పదాలలో రాశాను. ఆ పాటలు, ఆ సినిమాలు చాలా పెద్ద హిట్‌లు అయ్యాయి, దాంతో అదే శైలిని కొనసాగించాను.’

ఫర్జ్‌ లోని పుట్టినరోజు పాట, ‘బార్ బార్ దిన్ యే ఆయే’, నేటికీ ప్రజాదరణ కలిగి ఉంది.’

పాటల రికార్డింగ్‌లకు హాజరైనందుకు నాన్నకి కన్వేయన్స్ అలవెన్స్ వచ్చినప్పుడల్లా, ఆయన ఆ డబ్బుని మా డ్రైవర్‌కు లేదా ఆర్థిక సహాయం అవసరమని తెలిసిన సంగీతకారుడికి ఇచ్చేవారు. 70ల చివరలో, రికార్డింగ్‌ల కోసం చెల్లించిన పెట్రోల్ అలవెన్స్‌ని ఎందుకు సొంతానికి వాడుకోలేదని నాన్నని అడిగాను. “నా ప్రతిభ, కృషి మాత్రమే కాదు, వారి ఆశీర్వాదం కూడా నాకు అవసరం, అవకాశాలు పొందడానికి, విజయం సాధించడానికి వారి సహకారం కావాలి. నా ప్రతి రికార్డింగ్ నుండి వారికి నేనిచ్చే జీతం లేదా పారితోషికానికి అదనంగా ఏదైనా పైకం లభిస్తే, అంటే డ్రైవర్‌కు చెల్లించే జీతం లేదా సంగీతకారుడిగా ఎవరైనా సంపాదించే ఫీజులకు మించి, వారికి కొంత అదనంగా దొరికితే, వారు సంతోషిస్తారు. ప్రతిరోజూ తమ దేవుడిని ప్రార్థిస్తారు, ఇలాగే నాకు పాటల రికార్డింగ్‌లు రావాలని ఆశీర్వదించమని అడుగుతారు కదా. సబ్ కో సాథ్ మే లేకర్ చల్నా పఢ్తా హై (అందరినీ కలుపుకుని వెళ్ళాలి). బహుశా వారి ప్రార్థనల వల్లే నాకు అదృష్టం  దక్కుతోందేమో, అది కేవలం దేవుని ఆశీర్వాదం వల్లే కాదు.” అని అన్నారు.

కవి లేక గీత రచయిత?

‘కవిత్వం కంటే సినిమా సాహిత్యం రాయడం చాలా కష్టం. మీరు హద్దుల్లో రాయాలి. పాటల రచనకు కాలం, ఆలోచన, ఎవరి కోసమైతే పాట రాస్తామో ఆ పాత్రల వల్ల పరిమితులు విధించబడతాయి. ఈ రెండు వర్గాల మధ్య తేడాను మేము గుర్తించినప్పటికీ, గీత రచయిత కూడా కవే..

కవి అని పిలవబడటానికి మీకు కొన్ని ప్రత్యేక అర్హతలు ఉండాలి. మీరు ముషాయిరాలలో పాల్గొని హిందీ లేదా ఉర్దూ సాహిత్యానికి తోడ్పడాలి. సినీ గీత రచయితలకు కవులుగా గుర్తింపు లభించదు, ఎందుకంటే సాహిత్యానికి వీరు దోహదం చేయడం కనిపించదు.

కవిత్వంలా కాకుండా, పాటలను లక్షలు కోట్లు ఖర్చు చేసే సినిమాలకు రాస్తారు. బోలెడు డబ్బు ఖర్చు అవుతుంది. కాబట్టి, పాట తప్పనిసరిగా ప్రజాదరణ పొందాలి, తద్వారా సినిమాకి రిపీట్ వాల్యూ సంపాదించాలి, నిర్మాణ ఖర్చును తిరిగి రాబట్టడంలో తోడ్పడాలి. సినిమా పాటలు రాయడం ఒక సవాలు.

ఒక కవి ఒంటరిగా వస్తాడు, కానీ ఒక గీత రచయిత ఆర్కెస్ట్రాతో వస్తాడు. కవికి, పాటల రచయితకి మధ్య ఉన్న ప్రధాన వ్యత్యాసం ఏమిటంటే, ఒక కవి తన మానసిక స్థితిలో, తన స్వభావం ప్రకారం  రాస్తాడు, అయితే పాటల రచనలో, అదే సినిమాలో, మీరు ఒక ప్రేమ గీతం, ప్రార్థన, క్యాబరే నృత్యం, కథను ముందుకు తీసుకెళ్లే నేపథ్య సంగీతం రాయవలసి రావచ్చు. పాత్ర చిత్రణ, కాలపరిమితి మరియు కథాంశం యొక్క పరిమితుల్లో కథనాన్ని ముందుకు తీసుకెళ్లే పాట రాయడం అతిపెద్ద సవాలు. హజారోం రంగ్ మిల్కే, ఏక్ రంగ్ బన్తా హై (వేల రంగులు కలిసి ఒకే రంగును ఏర్పరుస్తాయి). దర్శకుడు, సంగీత దర్శకుడు, సంగీతకారులు అందరూ తమ అంచనాలు కలిగి ఉండి, వారి వారి గడియారాల వైపు చూస్తున్నప్పుడు మీరు అక్కడికక్కడే, వేగంగా ఆలోచించాలి. మంచి పాటల రచయిత మంచి కవి కంటే మంచి హస్తకళాకారుడిగా ఉండాలి. నాకు, ప్రాస చాలా ముఖ్యం. కానీ ఒక గీత రచయిత ఒకేసారి పాయింట్‌కి రావాలి. కవిలా కాకుండా, డొంకతిరుగుడుగా వ్యవహరించేలా, స్థలం సమయం ఉండవు. ఆయే దిన్ బహర్ కే సినిమాలోని ఒక పాటలో, హీరో నేరుగా తనని మోసగించిన ప్రియురాలిపై తన కోపాన్ని ముఖ్డాలో (పల్లవి) “మేరే దుష్మన్ తు మేరీ దోస్తీ కో తర్సే” అని మళ్ళిస్తాడు; ఆ ఆలోచన యొక్క కవితాత్మక వ్యక్తీకరణ “తూ ఫూల్ బనే పత్‌ఝడ్ కా, తుజ్ పె బహార్ నా ఆయే కభీ” అనే అంతరా (అనుపల్లవి)లో ఉంది.

ప్రేమ గీతాలు

‘నాకు జంటల కోసం రాయడం చాలా ఇష్టం. దిలీప్ కుమార్ – సైరా, శశి కపూర్ – నందా, రాజేష్ ఖన్నా – ముంతాజ్, రిషి కపూర్ – డింపుల్, కుమార్ గౌరవ్ – విజయేత, సన్నీ డియోల్ – పూనమ్ ధిల్లాన్, దేవ్ ఆనంద్ – జీనత్ అమన్, సన్నీ డియోల్ – అమృత, రాజేష్ ఖన్నా – షర్మిలా ఠాగూర్, ధర్మేంద్ర – హేమ, అమితాబ్ బచ్చన్ – పర్వీన్ బాబి, కమల్ హాసన్ – రతి అగ్నిహోత్రి, ఫర్దీన్ – అమృత అరోరా, హృతిక్ – కరీనా, ఇంకా ఈషా డియోల్, సంజయ్ దత్ మరియు టీనా మునిమ్, అనిల్ కపూర్ – పద్మిని, ఇలా అనేక ఇతర జంటలు.. నేను ధర్మేంద్ర నటించిన 70 చిత్రాలకు, జితేంద్ర నటించిన 62 చిత్రాలకు, రాజేష్ ఖన్నా నటించిన 45 చిత్రాలకు, అమితాబ్ బచ్చన్ నటించిన 44 చిత్రాలకు, హేమ మాలిని నటించిన 42 చిత్రాలకు, రేఖ నటించిన 36 చిత్రాలకు, ముంతాజ్ నటించిన 26 చిత్రాలకు, మాధురి దీక్షిత్ నటించిన 23 చిత్రాలకు, శ్రీదేవి నటించిన 21 చిత్రాలకు పాటలు రాశాను.

నేను విధిని నమ్ముతాను. ఒక ఉదాహరణ చెబుతాను. ఎస్.డి. బర్మన్ దాదా నన్ను గొప్ప దర్శకుడైన గురు దత్‌కు పరిచయం చేశాడు, కాగజ్ కే ఫూల్ సినిమాకి పాటలు రాయమని చెప్పాడు. కానీ గురు దత్ కైఫీ అజ్మీ సాబ్‌తో కలిసి పనిచేయడానికి ఇష్టపడ్డాడు. ఆ సినిమాకి రాయడానికి అవకాశం లేకపోవడం నన్ను నేను దురదృష్టవంతుడిని, అదృష్టం లేదని అనుకున్నాను. ఒక సంవత్సరం పాటు నా దురదృష్టాన్ని తిట్టుకున్నాను. ఆ సినిమా విడుదలై బాక్సాఫీస్ వద్ద ఘోరంగా పరాజయం పాలైంది. దేవుడు నన్ను కాపాడాడని, విధి నన్ను కాపాడిందని అప్పుడు భావించాను. ఎందుకంటే, అప్పటికే నాకొక అపజయం ఉంది, భలా అద్మీ. కాగజ్ కే ఫూల్ సినిమాకి పాటలు రాసుంటే, నా పేరుకు రెండవ అపజయం జోడించేవారు, నా కెరీర్ మొదలవక ముందే ముగిసిపోయేది. ఈ పరిశ్రమలో, జనాలు ఉదయించే సూర్యుడిని పూజిస్తారు. వారు మిమ్మల్ని పూజించరు; వారు మీ విజయాలను పూజిస్తారు, మీ ప్రతిభను కాదు.

నేను రాజేష్ ఖన్నా కోసం రాసినప్పుడల్లా, కిషోర్ కుమార్ స్వరాన్ని దృష్టిలో ఉంచుకుని, ఉద్దేశపూర్వకంగా అతని కోసం మృదువైన సాహిత్యాన్ని రాశాను. కొంతమంది నేను రాజేష్ ఖన్నాకు హిట్ పాటలు ఇచ్చానని అంటారు. కాకా (రాజేష్ ఖన్నా) కూడా అతనికి గొప్ప పాటలు ఇవ్వడం ద్వారా నేను అతని సినీ జీవితానికి తోడ్పడ్డానని చెబుతాడు. కానీ రాజేష్ ఖన్నా వాటిని పాడటం (లేదా లిప్-సింక్ చేయడం) ద్వారా నా పాటలను హిట్‌లు చేసాడని నేను నమ్ముతున్నాను. నటుడు మన పాటల ముఖమని మనం మర్చిపోకూడదు. మనం గీత రచయితలం కనబడకుండా ఉంటేనే ఉత్తమం. ప్రేక్షకులు అది బక్షి పాట కాదని, ఆర్‌డి బర్మన్ పాట కాదని భావించాలి, పాత్ర పాట అని అని అనుకోవాలి.

జయాపజయాలు

‘విజయం ఉదాసీనతకి తావివ్వకూడదు. రేసులో మీరు ఒకసారి గెలిస్తే, తదుపరి రేసు కూడా గెలుస్తారని ఎటువంటి హామీ ఉండదు. తదుపరి రేసు కోసం మీరు మరింత కష్టపడచ్చు. నా పాటలలో, నేను ఎప్పుడూ సినిమా కథను పణంగా పెట్టి నన్ను నేను ప్రదర్శించుకోవడానికి ప్రయత్నించలేదు. గీత రచయితగా నా విజయం కంటే లేదా నా రచనా “శైలి” కంటే కథ చాలా ముఖ్యమైనది. ప్రేక్షకులు ఒక పాటలోని నా పదాలను గుర్తిస్తే, ఆ పాట హిట్ అయినా కూడా నేను విఫలమయ్యానని భావిస్తాను. ఎందుకంటే నా పదాలు ఆ కథలోని, ఆ సినిమాలోని పాత్రల నుండి ఉద్భవించి, వాటికి చెందాలి, గీత రచయితగా నాకు కాదు. ఒకసారి, నా పాటను మిలన్ సినిమా నుండి తొలగించాలని సూచించాను. మిలన్ సినిమా ప్రీమియర్ షో చూశాం, ఎందుకో నా పాట – ఆ పాత్ర పాడటం సరిపోలేదు. ఆ పాట, “ఆజ్ దిల్ పే కోయి, జోర్ చల్తా నహీఁ, ముస్కురానే లగే థే, మగర్ రో పఢే.” నేను పాత్రను దృష్టిలో ఉంచుకోకుండా దానిని కవిత్వంగా రాశాను. నేను దానిని తెరపై చూసినప్పుడు, ఆ చిత్రంలోని పాత్ర ఇటువంటి “సాహిత్య” కవితలను పాడగలదని నేను నమ్మలేకపోయాను. ఆ పాటని తొలగించమని కోరాను. చిత్రనిర్మాతలు నా సూచనతో ఏకీభవించి దానిని తీసేశారు.

ఇలాంటిదే మరో ఉదంతం నాన్న నాకు చెప్పారు. ‘అంధా కానూన్’ సినిమాలో కథానాయకుడు “రోతే రోతే హస్నా సీఖో, హస్తే హస్తే రోనా, జిత్నీ చాబీ భరీ రామ్ నే, ఉత్నా చలే ఖిలోనా” అంటూ పాడటం చూసిన తర్వాత, తాను ఆ సినిమాలో పాటల రచనలో బాగా రాణించలేదని నాన్నకి అనిపించింది. కథానాయకుడు హిందువు కాదు, కానీ హిందూ దేవుడి పేరును ఉపయోగిస్తాడు. నాన్న నాతో, ‘ఈ పాట కోసం నేను రాస్తున్న పాత్ర పేరు, మతం గురించి దర్శకుడిని అడగకపోవడం ద్వారా నేను తప్పు చేశాను. దర్శకుడు నాకు కథని, సన్నివేశాన్ని వివరిస్తూ, ప్రధాన పాత్రను నటుడి పేరు మిస్టర్ బచ్చన్ ద్వారా సూచిస్తూనే ఉన్నాడు. అమితాబ్ బచ్చన్ ఈ చిత్రంలో ముస్లిం పాత్రను పోషిస్తున్నాడని నాకు తెలిసి ఉంటే, ఆ పాత్ర విశ్వాసాలు, సంస్కృతికి తగిన పదాలను నేను వాడేవాడిని’ అని అన్నారు.

ఒక ముస్లిం కథానాయకుడు ఒక పాటలో హిందూ దేవుడి పేరును తీసుకోవడం లేదా హిందూ దేవుడి పేరును ముస్లిం పాత్రకు వాడటం భారతీయ సంస్కృతిలోనూ, సినిమాలలో అసాధారణం కాదని చెప్పాలి. ఇది మన సంస్కృతిలో అంతర్లీనంగా ఉన్న లౌకికవాదానికి ఒక ఉదాహరణ. గీత రచయిత దీనిని తన వైఫల్యంగా భావించడానికి కారణం, దర్శకుడు కథానాయకుడి లౌకిక స్వభావాన్ని సాహిత్యంలో సూక్ష్మంగా చూపించమని సూచించి ఉంటేనే అతను అలా రాసేవాడు. బక్షి క్లయింట్ సంక్షిప్త వివరణకు కట్టుబడి ఉండే గీత రచయిత.

వయస్సు కేవలం ఒక అంకె

‘ప్రేమ పాటలు రాయడంలో వయస్సు ముఖ్యం కాదు. నేను నా 44 సంవత్సరాల వయసులో బాబీ కోసం, 52 సంవత్సరాల వయసులో ఏక్ దుజే కే లియే కోసం, 61 సంవత్సరాల వయసులో సౌదాగర్ కోసం, 60 సంవత్సరాల వయసులో దిల్‌వాలే దుల్హనియా లే జాయేంగే ఇంకా దిల్ తో పాగల్ హై కోసం రాశాను. అదేవిధంగా తాత్విక పాటల కోసం కూడా. నా 30 సంవత్సరాల వయసులో ఆప్ కీ కసమ్ కోసం “జిందగీ కే సఫర్ మే గుజార్ జాతే హై జో ముకామ్” రాశాను.. స్వరకర్తలతో నా అనుబంధానికి వయస్సు ఒక కారణం కాదు. నేను రోషన్, ఎస్డీ బర్మన్ దాదాతో విజయవంతంగా పనిచేసినప్పుడు నా వయసు ముప్పై కంటే తక్కువ. ఇప్పుడు నేను విజు షా, ఆనంద్-మిలింద్ వంటి యువ స్వరకర్తలతో లేదా నాకు చాలా కాలంగా తెలిసిన చిత్రనిర్మాతల పిల్లలతో కలిసి పనిచేసినప్పుడు, వారు నా సాహిత్యంలో తప్పులు వెతకడానికి వెనుకాడతారు. అది నా పనిని దెబ్బతీస్తుంది. అన్నింటికంటే, తగిన విధంగా రాయడానికి నాకు ఆరోగ్యకరమైన విమర్శ అవసరం. కాబట్టి, నన్ను రాయడానికి ప్రేరేపించేది సన్నివేశం, కథ, పాత్ర, ఒక ట్యూన్. నా వయస్సు కాదు.’

కాలం మారిపోయింది

‘అశ్లీల సాహిత్యాన్ని తిరస్కరించడానికి మనకు సెన్సార్ బోర్డు అవసరం లేదు. ప్రేక్షకులే ఆ పని చేస్తారు. నా పాట “చోళీ కే పీచే క్యా హై” (ఖల్ నాయక్) పై వివాదం నన్ను బాధించింది, ఎందుకంటే నేను దానిని సూచనాత్మక శైలిలో రాశాను. నేను పదాల కంటే సూచనను ఇష్టపడతాను, ఎందుకంటే పదాలు అసభ్యంగా అనిపించవచ్చు, నేను మన జానపద పాటల నుండి ప్రేరణ పొందాను, అవి అలాంటి మనశ్చిత్రాలు, సూచనలతో నిండి ఉన్నాయి. నా పిల్లలే నా కొలమానం. నా పిల్లలు ఈ పాటలను పాడే అవకాశం ఉందని నేను గుర్తుంచుకుని రాస్తాను.’

‘చోళీ కే పీచే క్యా హై’ రాసినందుకు వచ్చిన విమర్శల గురించి మీ అభిప్రాయాలేమిటని నాన్నని ఎవరో అడిగారు. ఆయన నవ్వి, వెంటనే, ఎలాంటి చిరాకు లేదా కటుత్వం లేకుండా, ‘ద్వంద్వార్థాల పాటలు రాస్తున్నానని నన్ను నిందించే వారి నజర్ (చూపు), ధ్యాన్ (ధ్యాస) ఆమె చోళీపైనే ఉన్నాయి, నా పాట మీద కాదు’ అని అన్నారు.

‘కాలం మారిపోయింది; మన సినిమాలు మారాయి, కాబట్టి మన పాటలు కూడా మారుతాయి. నేడు, మన తెరపై ఉన్న జంటలు ఒకరిపై ఒకరు ప్రేమను చాలా త్వరగా ప్రకటిస్తారు, ఎటువంటి కారణం లేకుండా. కోపం, ద్వేషం, అసూయ, నిరుత్సాహం, తిరస్కరణ, సంతృప్తి వంటి ఇతర భావోద్వేగాలకు కూడా ఇది వర్తిస్తుంది. నేడు, చాలా సినిమాలు వేగంగా రూపొందుతున్నాయి, దర్శకులకు భావోద్వేగాలను పెంపొందించడానికి తక్కువ అవకాశం ఉంది, కాబట్టి సహజంగానే, మన పాటలు కూడా వేగవంతమైన సన్నివేశాలకు అనుగుణంగా వేగవంతమైనవిగా మారాయి. సంగీతంలో వేగవంతమైన బీట్‌లు ఉంటాయి కాబట్టి, వాటితో పాటు మనం చిన్న, చిన్న పంక్తులను కంపోజ్ చేస్తాము. బిమల్ రాయ్ వంటి చిత్రనిర్మాతలు – పాత్రలు సంభాషణలో చెప్పాల్సిన అవసరం లేకుండానే “ఐ లవ్ యు” అని వ్యక్తపరచగలిగే కాలమొకటి ఉండేది. నేటి చిత్రనిర్మాతలలో చాలామందికి ఈ సున్నితమైన సూక్ష్మ నైపుణ్యాల గురించి తెలియదు..

సినిమా నిర్మాణం వెనుక ఆర్థిక, వాణిజ్యపరమైన కారణాలు ఉంటాయి, అందువల్ల, గీత రచయిత ఒక పాటను త్వరగా అందించాలి. రికార్డింగ్ సమయంలో మార్పులు చేయాలి. ఎందుకంటే నిర్మాత డబ్బు లైన్‌లో ఉంది. వారు డబ్బు సంపాదిస్తేనే, మీరు డబ్బు సంపాదిస్తారు.

నేను విషాద గీతాలు రాసి చాలా ఏళ్ళయింది. విషాద గీతాలు రాయడం నాకు చాలా కష్టంగా ఉంది. ఈ రోజుల్లో మన సినిమాల్లో విషాద గీతాలు చాలా తక్కువ. అంటే ఈ రోజుల్లో ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారని, విచారకరమైన పరిస్థితులు మన కథల్లో ప్రతిబింబించడం లేదనా అర్థం? లేదా జీవితంలో చాలా విషాదం ఉందని, దానిని తెరపై చూడకూడదని లేదా పాటల్లో వినకూడదని మనం కోరుకుంటున్నామా?’

(మళ్ళీ కలుద్దాం)

Exit mobile version