Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

నగ్మే, కిస్సే, బాతేఁ, యాదేఁ – ఆనంద్ బక్షి జీవితం, పాటలు-20

[శ్రీ రాకేశ్ ఆనంద్ బక్షి రచించిన ‘నగ్మే, కిస్సే, బాతేఁ, యాదేఁ – ది లైఫ్ అండ్ లిరిక్స్ ఆఫ్ ఆనంద్ బక్షి’ అనే ఆంగ్ల పుస్తకాన్ని అనువదించి పాఠకులకు అందిస్తున్నారు కొల్లూరి సోమ శంకర్.]

అధ్యాయం 8 – దివ్య కాంతి, దైవిక శక్తి కలిగిన వ్యక్తి – 3వ భాగం

రాస్తే అన్నీ లేదంటే లేదు:

‘ఒక సినిమాకు ఒకే ఒక్క గీత రచయిత ఉంటే మంచిది, ఎందుకంటే ఒక సినిమా పాటలు కథనంలో ఒక సాధారణ ఆధారాన్ని ఏర్పరచాలి. అందుకే నేను వ్రాసే సినిమాల్లో నేనే ఏకైక గీత రచయిత అని నేను ఎక్కువగా పట్టుబడుతుంటాను. నిర్మాతలు, దర్శకులు, నటులు ఇంకా సంగీత దర్శకులు కూడా నాకు ఆ హక్కును ఇచ్చినందుకు సంతోషంగా ఉన్నారు.

నా పాటలు ప్రజాదరణ పొందటానికి కారణం నేను ఉద్దేశపూర్వకంగా సరళంగా రాయడం కావచ్చు. కొంతమంది ప్రముఖ గీత రచయితలు ఉపయోగించని పదాలను నేను ఉపయోగించాను. నేను అనుభవం నుండి రాశాను, కథ మరియు పాత్రలను ఎల్లప్పుడూ దృష్టిలో ఉంచుకున్నాను. పాట – పాత్రల ముద్రను (సినిమాలోని సాహిత్యం వ్యక్తపరుస్తుంది) శ్రోత మనస్సుపై వేస్తుంది. ఏదో ఒకవిధంగా, “జిందగీ కే సఫర్ మే గుజార్ జాతే హై జో ముకామ్” లేదా “జిక్ర్ హోతా హై జబ్ ఖయామత్ కా, తేరే జల్వోం కీ బాత్ హోతీ హై” వంటి కొన్ని అందమైన సాహిత్యం ఈ పద్ధతి నుండి పుట్టింది. అంతేకాకుండా, దర్శకుడికి, నాకు స్ఫూర్తినిచ్చే స్క్రిప్ట్‌లను రాసిన గొప్ప రచయితలు, స్వరకర్తలు, గాయకులు, సంగీతకారులు, దర్శకుల సహవాసం నాకు లభించడం నా అదృష్టం.

నేను ప్రేరణ పొందేందుకు నడకకు లేదా పర్వతాలకు వెళ్లను. నా పాటలు చాలా వరకు నా బెడ్‌రూమ్‌లోనే రాశాను. దర్శకుడు, స్వరకర్తతో కలిసి మ్యూజిక్ సిట్టింగ్‌ల సమయంలో వాటిని పూర్తి చేస్తాను. తరచుగా, నేను సిట్టింగ్‌లలో మొత్తం పాటలను రాస్తాను. సినిమా కథ, ఇంకా పాటలు రాయాలనే నా అవసరం – నాకు ప్రేరణ. నిర్మాతలు సినిమాల కోసం కోట్లు ఖర్చు చేస్తారు; మేము గీత రచయితలు ప్రేరణ పొందే వరకు వారు వేచి ఉండలేరు.

నాకు స్ఫూర్తి నిచ్చేది ఏది అనే దాని వెనుక రహస్యం లేదు. ప్రతి మానవ హృదయంలో భావోద్వేగాలు ఉంటాయి, అవి జీవించే ప్రక్రియలో కలిసిపోతాయి. తెలియకుండానే, అవి గీతాలలోకి ప్రవహిస్తాయి. ప్రతిఫలించని ప్రేమ కంటే నిగూఢమైనది మరొకటి లేదు, అది నాకు ప్రేరణ కల్గించే మరొక గొప్ప వనరు. జానపద పాటలు కూడా నన్ను ప్రేరేపిస్తాయి. ప్రతిజ్ఞ చిత్రంలోని “మై జాట్ యమ్లా పగ్లా దివానా” పాట కోసం, నేను ఓ పంజాబీ కొటేషన్ నుంచి ప్రేరణ పొందాను. ‘మేరా గావ్ మేరా దేశ్‌’ లోని “మార్ దియా జాయే, కే చోఢ్ దియా జాయే” పాట కోసం, రాజు పురుషోత్తముడు, అలెగ్జాండర్ ది గ్రేట్‍ల మధ్య జరిగిన సంభాషణ నుండి ప్రేరణ పొందాను, పురుషోత్తముడి ప్రాణాలతో వదిలేయాలా లేక చంపాలా అని ఆలోచిస్తున్నప్పుడు అలెగ్జాండర్ దాదాపు ఇవే పంక్తులను ఉపయోగించాడు: “తుమ్హారే సాథ్ క్యా సలూక్ కియా జాయే?”

నిర్మాత-దర్శకుడు విజయ్ ఆనంద్ ఒకసారి నాతో, “బక్షి సాబ్, మీ పాటలు కథను ముందుకు తీసుకెళ్తాయి, అవి సినిమా సంభాషణల పాత్రను పోషిస్తాయి” అని అన్నారు. “మార్ దియా జాయే..” అనేది అనేక ఉదాహరణలలో ఒకటి. ‘ఆన్ మిలో సజ్న” చిత్రం కోసం ఒక పాట సిట్టింగ్ సమయంలో, లక్ష్మీకాంత్-ప్యారేలాల్ మరియు నేను చాలా గంటలు ప్రయత్నించి విఫలమయ్యాము. అలసిపోయిన నేను సిట్టింగ్ నుండి నిష్క్రమించడానికి లేచి, “అచ్ఛా తో హమ్ చల్తే హైఁ” అని చెప్పాను. ప్రతిస్పందనగా లక్ష్మీకాంత్, “ఫిర్ కబ్ మిలోగే?” అని అడిగాడు, అందుకే నేను దాని నుండి పాట యొక్క ముఖ్డా (పల్లవి)ను వ్రాయడానికి మార్గం దొరికింది. అది పెద్ద హిట్ అయింది.

‘బేతాబ్’ సినిమాలోని పాట “జబ్ హమ్ జవాన్ హోంగే, జానే కహాఁ హోంగే” కోసం నేను దాదాపు యాభై చరణాలు రాశాను. సాధారణంగా నేను నా అన్ని పాటలకు కనీసం పది అనుపల్లవులు రాస్తాను, ఆ తర్వాత దర్శకుడు వారి పాట పరిస్థితిని బట్టి, కథకు తగినట్లుగా ఉన్నాయనుకున్న వాటిలో మూడు లేదా నాలుగు ఎంచుకుంటారు. జఖ్మ్ లోని “తుమ్ ఆయే తో ఆయా ముఝే యాద్, గలీ మే ఆజ్ చాంద్ నిక్లా” పాట కోసం నేను మహేష్ భట్‌కి పదిహేను అనుపల్లవులు ఇచ్చాను. అతనికి మూడు మాత్రమే అవసరమైనప్పుడు నేను ఎందుకు ఎక్కువ రాశానని నన్ను అడిగాడు. కానీ ఒక అమ్మకందారునిగా, సరైన నిర్ణయం తీసుకోవడంలో సహాయపడటానికి నేను నా కొనుగోలుదారునికి అనేక ఎంపికలు ఇవ్వాలి అని నేను నమ్ముతాను. ఒక అమ్మకందారుడు తన వస్తువును కొనుగోలుదారునిపై బలవంతంగా రుద్దడం, అలాగే కొనుగోలుదారుడు కూడా తనకు చెల్లించాలని ఆశించడం నాకు ఇష్టం ఉండదు. ప్రజలు తమ కష్టపడి సంపాదించిన డబ్బును వినోదం కోసం చెల్లిస్తారు, కాబట్టి వారు సాహిత్యం, సంగీతంతో సహా చిత్రనిర్మాణంలోని అన్ని విభాగాల నుండి ఉత్తమమైన వాటికి అర్హులు.’

నాన్న గురించి, మహేష్ భట్ ఒకసారి నాతో ఇలా అన్నారు, “బక్షి సాబ్ స్థిరమైన జ్వాల, మంచి మనస్సు కలిగినవాడు. ఆయన ఒక లివింగ్ రిఫరెన్స్ పాయింట్ నుండి ఉద్భవించే జ్ఞానం నుండి రాశాడు. మరో నిగూఢమైన ఆలోచన లేదు. ఆశ్చర్యకరంగా, ఆయన తన సొంత ఇమేజ్‌ని పెద్దగా పట్టించుకోలేదు. ఆయనది పుస్తక జ్ఞానం కాదు, వ్యవహార  జ్ఞానం. ఆయన కథ నుంచి, ప్రకృతి నుండి ప్రేరణ పొందాడు. నేను ఆయనని ‘జఖ్మ్’ కోసం ఒక పాట రాయమని అడిగాను. ఆయన కథలోని పాత్రల గురించి అడిగాడు: ఇంటి యజమాని తనకంటూ కుటుంబాన్ని, ప్రేమించే  స్త్రీని, ముద్దులొలికే బిడ్డను కలిగి ఉన్నా – వివాహం చేసుకోని స్త్రీ వద్దకు ఎంత తరచుగా వెళ్తాడు? అని అడిగాడు. మా నాన్న పున్నానికోసారి మమ్మల్ని చూడాడానికి ఇంటికి వచ్చేవారని నేను ఆయనతో చెప్పాను, దాంతో బక్షీ జీ వెంటనే, “తుమ్ ఆయే తో ఆయా ముఝే యాద్, గలీ మే ఆజ్ చాంద్ నిక్లా” అని రాశారు. అతను పున్నానికోసారి ప్రయోగాన్ని – అప్పుడప్పుడు వచ్చే ‘ఈద్ కా చాంద్‌’తో సమానం చేశాడు.

బహుముఖ ప్రజ్ఞ

‘నేను ఏ ఒక్క సంగీత దర్శకుడితోనూ అనుబంధం పెంచుకోను. సినిమా అవసరాలకు న్యాయం చేయగలరని నేను భావించే ప్రతి ఒక్కరితో నేను పని చేస్తాను,  పాటల రచయితగా అది నాకు రాశిని, బహుముఖ ప్రజ్ఞని, నాణ్యతను అందిస్తుంది. ఇంత వైవిధ్యమైన సృజనాత్మక వ్యక్తులతో సంభాషించడం వల్ల నేను సినిమా సంగీతపు మొత్తం వర్ణపటంతో, ఇంకా దాని శ్రోతలతో సన్నిహితంగా ఉంటాను.’

ఆయన తరతరాలుగా స్వరకర్తలతో కలిసి పనిచేశారు, వారిలో తండ్రులతో పాటు కుమారులు కూడా ఉన్నారు: ఎస్. డి. బర్మన్, ఆ.డి. బర్మన్; రోషన్, రాజేష్ రోషన్; కళ్యాణ్‌జీ–ఆనంద్‌జీ, విజు షా (కళ్యాణ్‌జీ కుమారుడు), చిత్రగుప్త్ అండ్ ఆనంద్-మిలింద్, నదీమ్-శ్రవణ్, సంజీవ్-దర్శన్ (శ్రవణ్ రాథోడ్ కుమారులు), అనిల్ బిశ్వాస్ ఇంకా అతని కుమారులు అమర్-ఉత్పల్.

‘నేను ఏమి రాస్తానో దాని గురించి నాకు అహం ఉండదు కాబట్టి చాలా మంది సంగీత దర్శకులతో నేను కలివిడిగా ఉంటాను. నేను చాలా పాటలు త్వరగా రాస్తాను కాబట్టి, వారు నాతో పనిచేయడానికి సంతోషంగా ఉన్నారు. నేను ఏ నిర్మాతను కూడా తమ సినిమా పాటలు రాయడానికి ఒక కొండ ప్రాంతానికి, విదేశాలకు లేదా నది ఒడ్డున ఉన్న లాడ్జికి తీసుకెళ్లమని ఎప్పుడూ అడగలేదు, ఇది వారికి డబ్బు ఆదా చేస్తుంది. కాబట్టి వారు నాతో పనిచేయడానికి ఇష్టపడతారు.’

(మళ్ళీ కలుద్దాం)

Exit mobile version