[శ్రీ రాకేశ్ ఆనంద్ బక్షి రచించిన ‘నగ్మే, కిస్సే, బాతేఁ, యాదేఁ – ది లైఫ్ అండ్ లిరిక్స్ ఆఫ్ ఆనంద్ బక్షి’ అనే ఆంగ్ల పుస్తకాన్ని అనువదించి పాఠకులకు అందిస్తున్నారు కొల్లూరి సోమ శంకర్.]
నాంది:
అది 1947 అక్టోబర్ 2, ఆ తేదీనే ఇప్పుడు గాంధీ జయంతిగా జరుపుకుంటున్నారు. కొన్ని వారాల క్రితం, గర్హనీయమైన రాడ్‌క్లిఫ్ లైన్ ద్వారా ఉపఖండం ఏకపక్షంగా విభజించబడింది, లక్షలాది మంది రాత్రికి రాత్రే శరణార్థులుగా పారిపోవాల్సి వచ్చింది, వాళ్ళల్లో చాలామంది దగ్గర డబ్బు లేదు, ఆశ లేదు. చంపబడటానికి లేదా అత్యాచారానికి గురవడానికి లేదా కాలి బూడిదవడానికి ముందే తమ ఇళ్ళల్లోంచి ఏమేం దక్కించుకోవాలో వారికి తెలుసు. అమ్మ ముద్దుగా నంద్ అనీ, నాన్న అజీజ్ అనీ పిలుచుకునే ప్రకాష్ వైద్ బక్షి వారిలో ఉన్నారు.
అప్పుడతనికి పదిహేడేళ్లు, అతని కుటుంబం ప్రస్తుతం పాకిస్తాన్‌లో ఉన్న పిండి (రావల్పిండి)లో నివసిస్తోంది. బక్షి వంశస్థులు – ఘోర అవమానం, అగౌరవం, భావోద్వేగాల తీవ్రత, ఆర్థిక అనిశ్చితి, అభద్రతతో కూడిన జీవితం – వీటిని తప్పించుకునేందుకు రాత్రికి రాత్రే పూర్వీకుల ఇంటి భద్రతను గాలికి వదిలేసి పారిపోవలసి వచ్చింది. తుదకు జరిగిన నష్టం – జీవితంపై తీవ్రమైన గాయం. అంతకు పదకొండు సంవత్సరాల ముందు, నంద్ ఇంతకంటే పెద్ద, కోలుకోలేని నష్టాన్ని చవిచూశాడు: అతను ‘మాజీ’ అని పిలిచే అతని తల్లి మిత్రా గారిని కోల్పోయాడు. నంద్ ఆరేళ్ళ ‘చిన్నారి’గా ఉండగా, గర్భధారణ సంబంధిత సమస్యల కారణంగా ఆమె మరణించారు.
బక్షి కుటుంబం ఓ డకోటా విమానంలో పిండి నుండి ఢిల్లీకి సురక్షితంగా ప్రయాణించింది; మా నాన్న బౌజీ (తాత) లాహోర్, రావల్పిండిలోని పంజాబ్ జైళ్ల సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్‌గా ఉన్నందున వారు ‘సురక్షితంగా’ ఉన్నారు. ఉమ్మడి కుటుంబం సరిహద్దు దాటి తమ ప్రయాణాన్ని తొందరగా ప్రారంభించే ముందు, అతని సవతి తోబుట్టువులు, సవతి తల్లి, తండ్రిగారు, ఇంకా తాతామామ్మలు, తాత అమ్మమ్మలతో కూడిన అతని కుటుంబం – సైన్యం ఏర్పాటు చేసిన సురక్షిత ట్రక్కులో, డకోటా విమానంలో తమతో తీసుకెళ్లదగ్గవి, తమకు వీలైనంత డబ్బు, బట్టలు, వ్యక్తిగత వస్తువులను నిమిషాల్లోనే తీసుకోవలసి వచ్చింది. ఏ నిమిషంలోనైనా అల్లర్లు జరగొచ్చనీ, దోపిడీదారులు తమ మొహల్లాపై దాడి చేయబోతున్నారని పెద్దలకు అదే రోజు సమాచారం అందింది.
అకస్మాత్తుగా నిరాశ్రయులై, బాధలో ఉన్న ఆ కుటుంబ సభ్యులు (ఇప్పటి పరిస్థితుల వల్ల వారిపై ‘శరణార్థులు’ అని ముద్ర వేయబడుతుంది) మరుసటి రోజు ఢిల్లీకి చేరుకున్నారు. నంద్ తాతగారి సోదరి వంతి కుమారుడు వారిని ఆహ్వానించాడు. వారు దేవ్ నగర్‌లో ఆ కుటుంబంతో కొన్ని గంటలు గడిపి, ఆపై శరణార్థుల నమోదు కోసం పూనా (పూనె)కి వెళ్లారు. కుటుంబం స్థిరపడిన తర్వాత, తమ భావోద్వేగాలు అదుపు చేసుకున్నాకా, అరుదైన వ్యక్తిగత వస్తువులను భద్రం చేసుకున్న తర్వాత, మా నాన్న తాతగారు, నాన్నగారు అందరు పెద్దలను – సరిహద్దు దాటించి ఏమేం తీసుకువచ్చారని అడిగారు. పదిహేడేళ్ల నంద్‌ను సైనిక ట్రక్కు ఎక్కే ముందు ఏమి తేగలిగావని వాళ్ళ తాతగారు అడిగారు. తన కుటుంబసభ్యుల ఫోటోలను తీసుకొచ్చానని మా నాన్న చెప్పారు. ఇది విన్న కుటుంబ పెద్దలు నాన్నని బిగ్గరగా తిట్టిపోశారట: “నువ్వు ఎన్ని పనికిరాని వస్తువులు నీతో మోసుకొచ్చావు! విలువైన వస్తువులు లేకుండా మనం ఎలా బ్రతుకుతాము?” అన్నారట.
అప్పుడు నంద్ ఇలా జవాబిచ్చాడు: “పైసే తో హమ్ నౌకరీ కర్ కె కమా సక్‍తే హైఁ, మగర్ మా కీ తస్వీర్ అగర్ పీఛే రహ్ జాతీ తో మై కహాఁ సే లాతా? ముఝే తో మా కా చెహరా భీ యాద్ నహీఁ. ఇన్ తస్వీరోం కె సహారే హీ ఆజ్ తక్ జీతా అయా హూఁ.” (పని చేయడం ద్వారా డబ్బు సంపాదించవచ్చు. కానీ నేను నా తల్లి ఫోటోను అక్కడ వదిలివేసి ఉంటే, నాకది ఇక్కడ ఎలా దొరుకుతుంది? నాకు మా అమ్మ ముఖం కూడా గుర్తు లేదు. నేను ఈ ఫోటోల సాయంతోనే బ్రతికి ఉన్నాను).
పదిహేడేళ్ల వయసులో కూడా, ఇంట్లో గందరగోళంగా ఉన్నా, మొహల్లాలో అల్లర్లు జరగబోతున్నప్పటికీ, తన దివంగత తల్లి ఫోటోలను సరిహద్దు దాటించి తీసుకెళ్ళాల్సిన అత్యంత విలువైన వస్తువులుగా భావించే సున్నితమైన మనసు నంద్‌ది.
(మళ్ళీ కలుద్దాం)
కొల్లూరి సోమ శంకర్ రచయిత, అనువాదకులు. బి.ఎ.డిగ్రీతో గ్రాడ్యుయేషన్. మానవ వనరుల నిర్వహణలో పిజి డిప్లొమా చేసారు. దక్షిణ భారత హిందీ ప్రచార సభ వారి భాషా ప్రవీణ పాసయ్యారు. ప్రస్తుత నివాసం హైదరాబాదు.
సోమ శంకర్ 2001 నుంచి కథలు రాస్తున్నారు. 2002 నుంచి కథలను అనువదిస్తున్నారు. కేవలం కథలే కాక ‘ది అడ్వెంచర్స్ ఆఫ్ పినోకియో’ అనే పిల్లల నవలను ‘కొంటెబొమ్మ సాహసాలు’ అనే పేరుతోను, ‘మాజిక్ ఇన్ ది మౌంటెన్స్’ అనే పిల్లల నవలను ‘కొండలలో వింతలు’ అనే పేరుతోను, వినయ్ జల్లా ఆంగ్లంలో రాసిన ‘వార్స్ అండ్ వెఫ్ట్’ అనే నవలని ‘నారాయణీయం’ అనే పేరుతోను, వరలొట్టి రంగసామి ఆంగ్లంలో రాసిన ‘లవ్! లవ్! లవ్!’ నవలను ‘సాధించెనే ఓ మనసా!’ పేరుతోనూ, అజిత్ హరిసింఘానీ రచించిన ట్రావెలాగ్ ‘వన్ లైఫ్ టు రైడ్’ను ‘ప్రయాణానికే జీవితం’అనే పేరుతోను, డా. చిత్తర్వు మధు ఆంగ్లంలో రచించిన ‘డార్క్ అవుట్పోస్ట్స్’ అనే స్పేస్ ఒపేరా నవలను ‘భూమి నుంచి ప్లూటో దాకా’ అనే పేరుతోనూ; అమర్త్యసేన్ వ్రాసిన ‘ది ఐడియా ఆఫ్ జస్టిస్’ అనే పుస్తకాన్ని, మరో నాలుగు పుస్తకాలను తెలుగులోనికి అనువదించారు. ‘దేవుడికి సాయం’ అనే కథాసంపుటి, ‘మనీప్లాంట్’, ‘నాన్నా, తొందరగా వచ్చెయ్!!’, ‘ఏడు గంటల వార్తలు’ అనే అనువాద కథా సంపుటాలను ప్రచురించారు.