Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

నగ్మే, కిస్సే, బాతేఁ, యాదేఁ – ఆనంద్ బక్షి జీవితం, పాటలు-19

[శ్రీ రాకేశ్ ఆనంద్ బక్షి రచించిన ‘నగ్మే, కిస్సే, బాతేఁ, యాదేఁ – ది లైఫ్ అండ్ లిరిక్స్ ఆఫ్ ఆనంద్ బక్షి’ అనే ఆంగ్ల పుస్తకాన్ని అనువదించి పాఠకులకు అందిస్తున్నారు కొల్లూరి సోమ శంకర్.]

అధ్యాయం 8 – దివ్య కాంతి, దైవిక శక్తి కలిగిన వ్యక్తి – 2వ భాగం

తన శృంగార గీతాల గురించి:

‘నేను అంతగా శృంగారభరితమైన జీవితాన్ని గడపలేదు, అందుకే నేను శృంగార పాటలు రాయగలుగుతున్నాను. ఏదైనా సాధించిన తర్వాత, దానిపై ఆసక్తి క్షీణిస్తుంది లేదా ఆ ప్రేమ తగ్గిపోతుంది. బహుశా నేను ఇప్పటికీ శృంగార జీవితాన్ని కోరుకుంటున్నాను కాబట్టి, నేను రొమాంటిక్ పాటలు రాయగలను. బహుశా నా శృంగార గీతాలు నా అణచివేయబడిన భావాల ఫలితమే కావచ్చు, అవి నాలో లోతుగా ఉండవచ్చు కానీ ఎప్పుడూ తీవ్రంగా ఆలోచించలేదు. నా గీతాలు సున్నితంగా, ఉద్వేగభరితంగా ఉన్నప్పటికీ, వాటికి కనిపించని శృంగారవాదం జతచేయబడిందని నాకెప్పుడూ అనిపించలేదు. నాలో నేను చెప్పని, బహిర్గతం చేయని చాలా విషయాలు ఉన్నాయి, నేను వాటిని వ్రాస్తాను, అంతే.

నేను నా సొంత అనుభవాల నుండి నా పాటలన్నీ రాయను. నా కూతుళ్ల పెళ్లికి ముందు ‘రాజ్‌పుత్’ సినిమా కోసం ‘డోలి హో డోలి’ పాట రాశాను. ‘నామ్’ సినిమా కోసం ‘చిట్ఠీ ఆయీ హై’ పాట రాసిన తర్వాత, ఢిల్లీలో జరిగిన ఒక వివాహ కార్యక్రమంలో ఆ పాట పాడాను. అతిథులు నా దగ్గరకు వచ్చి నా పిల్లలు ఏ దేశంలో స్థిరపడ్డారని అడిగారు. వారిని మిస్ అవుతున్నందుకు ఈ పాట రాశారా? అని అడిగారు. నా పిల్లలు నాతోనే ఉంటున్నారని నేను వాళ్ళకి చెప్పాను. మనమందరం ఎదుర్కొనే జీవితంలో చాలా ప్రామాణిక పరిస్థితులు ఉన్నాయి, కవులు-రచయితలు ఈ పరిస్థితులలో ఉన్న భావోద్వేగాల గురించి రాశారు. నేను వాటిలో చాలా చదివాను. కాబట్టి వాటి గురించి వ్రాయడానికి – ఈ పరిస్థితులను నేనే అనుభవించాల్సిన అవసరం లేదు.’

నాన్న ‘డోలీ హో డోలీ’ అనే పాటలో ‘డోలీ హో డోలీ, జబ్ జబ్ గుజరీ, తూ జిస్ డగర్ సే, బిఛ్‌డా కోయీ హమ్‌జోలీ’ అని రాశారు. తండ్రీ-కూతుళ్ల సంబంధాన్ని అత్యంత ఆత్మీయుల మధ్య ఉండే అభిమానంతో పోల్చారు. కుటుంబ సభ్యులకు, స్నేహితులకు జరిగే పార్టీలలో దాదాపు ప్రతిసారీ ఆయన ఈ పాట పాడేవాడు, ఆయన కళ్ళలో నీళ్లు తిరిగేవి, ఆ రాత్రి అదే చివరి పాట అయ్యేది. నాన్న ఏడవడం నేను మొదటిసారి చూసింది మా అక్క సుమన్ పెళ్లిలో డోలీ ఫంక్షన్‌లో, ఆమె కారు ఎక్కి వెళ్తున్నప్పుడు. నేను అప్పుడు టీనేజర్‌ని.

దాదాపు ఇరవై ఐదు సంవత్సరాల తరువాత, 2001 లో, చాలా నెలలుగా ఆస్తమాతో బాధపడుతూ, చాలా బలహీనంగా మారి తన స్వేచ్ఛని చాలా వరకు కోల్పోయానని నాన్న కన్నీళ్లు కార్చడం చూశాను. బహుశా దీనిని తన గౌరవం కోల్పోవడంగా నాన్న భావించి ఉంటారు.

జానపద గీతాలు (లోక్ గీత్) వ్రాయడం గురించి:

‘లోక్ గీత్ జానపదాలు కాబట్టి అర్థం చేసుకోవడం సులభం. అవి శ్రోతలలో ‘ఏక్ అప్నాపన్’ (తమవనే భావన) అనుభూతిని కలిగిస్తాయి. చాలా మంది శ్రోతలు సాహిత్యంతో సులభంగా కనెక్ట్ అవ్వగలరు, కాబట్టి పాట ప్రజాదరణ పొందుతుంది. అత్యంత మధురమైన పాట సామాన్యుల కోసం పాడేది. నా సాహిత్యంలోని సరళతను అభినందిస్తూ భారతదేశం అంతటా ఉన్న సామాన్యుల నుండి నాకు ప్రతిరోజూ ఉత్తరాలు వస్తుంటాయి. ధనవంతులైన నా స్నేహితులు, బంధువులు కూడా అదే చెబుతారు. ఉన్నత విద్య లేకపోవడం వల్ల నేను సాధారణ పదాలను ఉపయోగించి మాత్రమే రాయగలను. నా హిందీ పదజాలం చాలా పరిమితమైనది, పాఠశాల స్థాయిది. నేను నా పాటలన్నింటినీ ఉర్దూ లిపిలో వ్రాస్తాను. మై సీధీ బాత్ లిఖాతా హూఁ, లేకిన్ మై నే గెహారీ బాత్ లిఖ్నే కీ కోషిష్ హమేషా కీ హై’ (నేను సరళమైన విషయాలను వ్రాస్తాను, కానీ అదే సమయంలో నేను ఎల్లప్పుడూ లోతైన అర్థం కలిగి ఉండేవాటిని కూడా వ్రాయడానికి ప్రయత్నిస్తాను).

‘నాకు నచ్చని బాణీకి సాహిత్యం రాయడానికి నేను చాలాసార్లు నిరాకరించాను. నేను పనిచేసిన చాలామంది సంగీత స్వరకర్తలు ఇష్టపూర్వకంగా మరొక బాణీ కట్టేవారు. అది గొప్ప స్వరకర్తలో చాలా మంచి లక్షణం. ఒక గీత రచయిత తమ ట్యూన్‌లను తిరస్కరిస్తే వారు బాధపడరు. నాకు నచ్చిన, నేను బాగా పని చేయడానికి సహాయపడే ట్యూన్‌ను సృష్టించడానికి ఆర్. డి. బర్మన్ ఎప్పుడూ అభ్యంతరం చెప్పడు.

నా పాట విజయానికి నేను కాకుండా చాలా మంది ప్రతిభావంతులు దోహదపడతారు. ఒక సినిమా విజయానికి, దాని పాటలకు సంగీత దర్శకుడు, గాయకుడు, పాటల రచయిత సహకారం చాలా ముఖ్యం, ఎందుకంటే సినిమా యొక్క దీర్ఘకాలిక విలువ సంగీతం ద్వారా నిర్ణయించబడుతుంది. ఒక చిత్రనిర్మాత లేదా నటుడు మరణించినప్పుడు, వారి సినిమా పాటలను టీవీ, రేడియోలో నివాళిగా చూపించడం/వినిపించడం నేను చూశాను, వారి సినిమా సన్నివేశాలను కాదు. మంచి పాటను అందించిన గీత రచయితలు, దర్శకులు, ఇంకా స్క్రిప్ట్ రైటర్లు కూడా ఆ క్రెడిట్‌కి అర్హులే. నేను ఇప్పటివరకు కనీసం 250 మంది దర్శకులతో పనిచేసి ఉంటాను, ముఖ్యంగా రామారావు, రాజ్ ఖోస్లా, సుభాష్ ఘాయ్‌లతో పనిచేశాను. ఆ ముగ్గురితో పాటు యష్ చోప్రాకి కూడా చక్కని మ్యూజిక్ సెన్స్ ఉంది. కథ, కథలోని పరిస్థితి, పాత్రల స్వభావాలను నాకు లోతుగా వివరించినప్పుడే పాట రాయడం సులభం అని నేను భావిస్తున్నాను. బహుశా అందుకే ప్రతిభావంతులైన దర్శకులు మాత్రమే నానుంచి ఉత్తమ ఫలితాన్ని రాబట్టగలరు – వారు నేను పాటలని బాగా దృశ్యమానం చేయడంలో సహాయపడతారు.

కొంతమంది చిత్రనిర్మాతలు సంగీతం పట్ల చక్కని అభిరుచి ఉంటుంది, కాబట్టి వారు అందుబాటులో ఉన్న ఎంపికల నుండి మంచి బాణీలను ఎంచుకుంటారు. వారు తమ ఎంపికకు క్రెడిట్ పొందాలి, ఉత్తనమైన పనితీరు కనబరిచేందుకు వారు నన్ను ప్రేరేపిస్తారు. తమ పనేంటో తెలుసుకోకుండానే నా పనిలో జోక్యం చేసుకునే సినీనిర్మాతలు నాకు నచ్చరు.

ఏ వృత్తిలోనైనా ప్రతి రచయిత లేదా వ్యక్తి మూడు దశల గుండా వెళతారు. మొదటి దశలో, గుర్తింపు మరియు విజయం కోసం ప్రయత్నిస్తారు. రెండవ దశలో, వారు కష్టపడి పనిచేసి విజయాన్ని సాధిస్తారు. మూడవ దశ, ఆ విజయాన్ని కొనసాగించడం లేదా కోల్పోవడం. మూడవ దశ అత్యంత కఠినం. మొదటి దశలో, మీరు చాలా దృఢ నిశ్చయంతో, దృష్టి కేంద్రీకరించి, ఆకలితో ఉంటారు! రెండవ దశలో, మీరు మీ సామర్థ్యాన్ని గ్రహిస్తారు కానీ చాలా శ్రద్ధ, ప్రశంసలు, ముఖస్తుతి కూడా పొందుతారు; ప్రతి ఒక్కరూ తమ పార్టీలకు, ఫంక్షన్లకు మిమ్మల్ని ఆహ్వానిస్తారు. మూడవ దశలో, మీరు ఆ రెండవ దశ పరధ్యానాలను నివారించాలి; మీరు ఆ పార్టీలకు వెళతారు కానీ అక్కడ దారి తప్పకుండా ఉండటానికి ప్రయత్నించాలి, రెండవ దశకు వెళ్ళేటప్పుడు మొదటి దశలో ఉన్నంత దృష్టి కేంద్రీకరించడం కొనసాగించాలి. ఒక వ్యక్తి విజయం సాధించినప్పుడు, అతను లేదా ఆమె తన ఆరోగ్యం మరియు వ్యక్తిత్వం గురించి ఎక్కువ ఆందోళన చెందుతారు. తమని ఆ స్థానానికి లేదా విజయపు వాకిలికి తీసుకువచ్చినది ఏమిటో మరచిపోతారు. విజయం సాధించడం అంత సులభం కాదు, కానీ దానిని నిలబెట్టుకోవడం కష్టం.

ఎనభై శాతం సార్లు, సంగీత దర్శకుడు తగిన ట్యూన్‌ను సృష్టిస్తాడు, ఆపై నేను ఆ ట్యూన్‌కు తగిన సాహిత్యాన్ని రాస్తాను. కొన్నిసార్లు, నేను పాట రాసిన తర్వాత సంగీత దర్శకుడు ట్యూన్‌ కడతాడు. తరచుగా, నేను రాస్తున్నప్పుడు నాకు తగిన ట్యూన్‌ను నేనే ఈల వేస్తాను. ‘తాళ్’ సినిమా కోసం “ఇష్క్ బినా క్యా జీనా యారోఁ” పాటను ట్యూన్ లేకుండానే రాశాను.

ఒక పాట 15-20 నిమిషాల కంటే తక్కువ సమయంలో పుట్టవచ్చు, లేదా 5-6 రోజులు కూడా పట్టవచ్చు. నా వృత్తిలో, షూటింగ్ షెడ్యూల్‌లు ముందుగానే నిర్ణయించబడినందున, ఒక రచయిత ప్రేరణ కోసం వేచి ఉండలేడు. కవితా సంపుటి రాసే కవికి ఒక పేజీ రాయడానికి నెలలు పట్టే స్వేచ్ఛ ఉంటుంది. గీత రచయిత కాదు. గడువుకు ముందే నేను సాహిత్యాన్ని అందించాలి. గీత రచయిత లయను అర్థం చేసుకోవాలి, సంగీతంపై అవగాహన ఉండాలి. దర్శకుడికి మంచి సంగీత జ్ఞానం ఉంటే, నా పని సులభం అవుతుంది, ఎందుకంటే అతను ఆలస్యం చేయకుండా మంచి ఎంపికలు చేసుకుంటాడు. పల్లవి, ముఖ్దా వచ్చిన తర్వాత, మిగిలినది రాయడం నాకు చాలా సులభం అనిపిస్తుంది. పాట రాయడానికి పదిహేను నిమిషాలు పట్టినా లేదా ఐదు రోజులు పట్టినా, అది పాట నాణ్యతను ప్రతిబింబించదు; ఒకరు పది నిమిషాల్లో స్నానం ముగించి ముప్పై నిమిషాలు స్నానించే వ్యక్తి కంటే శుభ్రంగా బయటకు రావచ్చు. ఒక చిత్రనిర్మాత మంచి కవిత్వాన్ని స్వీకరించడం, లయపై జ్ఞానం కలిగి ఉండటం, స్వయంగా సున్నితమైన వ్యక్తిగా ఉండటం ద్వారా మాత్రమే గీత రచయితను ప్రేరేపించగలడు. రాజ్ కపూర్‌కి “హమ్ తుమ్ ఏక్ కమరే మే బంద్ హో, ఔర్ చాబీ ఖో జాయే” ఎంతగానో నచ్చింది, దాని కోసం అతను తన చిత్రం బాబీలో ఒక సన్నివేశాన్ని రూపొందించాడు. అదేవిధంగా, సంజయ్ ఖాన్ నేను పాడిన “మైనే పూచా చాంద్ సే, కే దేఖా హై కహీఁ, మేరే యార్ సా హసీన్” విన్నప్పుడు, అతను దానిని ‘అబ్దుల్లా’ సినిమాలో ఉపయోగించాడు. ఈ రెండు పాటలు ఏ సినిమా కోసం రాసినవి కావు.

నేను “మూడ్” ప్రకారం పని చేయను. నాకు మూడ్ మీద నమ్మకం లేదు. నేను చేయగలిగినది, నాకు వీలైనప్పుడు చేయాలి అని నేను నమ్ముతాను, ఒక నిర్దిష్ట వైఖరి, ప్రేరణ కోసం వేచి ఉండను. మూడ్ ఔర్ మహోల్, లిఖ్నే కా, దోనో ఖుద్ దిమాగ్ మే బన్‍నా పడ్తా హై, యే దిమాగీ బాతేఁ హైఁ, సారా ఖేల్ దిమాగ్ కా హై. ఇన్‌స్పిరేషన్ యే హ్యా కోతా హై? (మూడ్ మరియు వాతావరణం, ఇదంతా మనసు గురించే. ఇది మైండ్ గేమ్. ప్రేరణ? అది ఏమిటి?). మీకు పని ముఖ్యం; మీకు డబ్బు చెల్లించే వ్యక్తికి అది ముఖ్యమైనప్పుడు, మనస్సు స్వయంచాలకంగా దాని వైపు పనిచేస్తుంది; అప్పుడు గొప్ప ప్రేరణ లేదా రోజులోని నిర్దిష్ట సమయం లేదా మానసిక స్థితి అవసరం లేదు.’

(మళ్ళీ కలుద్దాం)

Exit mobile version