Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

నగ్మే, కిస్సే, బాతేఁ, యాదేఁ – ఆనంద్ బక్షి జీవితం, పాటలు-18

[శ్రీ రాకేశ్ ఆనంద్ బక్షి రచించిన ‘నగ్మే, కిస్సే, బాతేఁ, యాదేఁ – ది లైఫ్ అండ్ లిరిక్స్ ఆఫ్ ఆనంద్ బక్షి’ అనే ఆంగ్ల పుస్తకాన్ని అనువదించి పాఠకులకు అందిస్తున్నారు కొల్లూరి సోమ శంకర్.]

అధ్యాయం 8 – దివ్య కాంతి, దైవిక శక్తి కలిగిన వ్యక్తి – 1వ భాగం

“గత మూడు దశాబ్దాలలో మిమ్మల్ని మీరు అతిపెద్ద లేదా అత్యంత ప్రజాదరణ పొందిన పాటల రచయితగా భావిస్తున్నారా?” అని ఒకసారి ఆనంద్ బక్షిని అడిగారెవరో, దానికి ఆయన సమాధానం,

మైఁ హమేషా యే సమజ్తే ఆయా హూఁ కి వక్త్ సబ్ సే బడా ఫన్‌కార్ హై. వహీ హుమేఁ ఉఠాతా హై, వహీ గిరతా. ఇసీలియే, మైఁ హమేషా వక్త్ కా మురీద్ రహా హూఁ (కాలం ఓ గొప్ప కళాకారుడని నేను ఎప్పటినుంచో నమ్ముతున్నాను. అది మనల్ని ఎదిగేలా చేస్తుంది, పతనమయ్యేలా చేస్తుంది. అందుకే నేనెప్పుడూ కాలానికి అభిమానిని).

ఈ అధ్యాయంలో, ఆనంద్ బక్షి పాటల రచన గురించి కొన్ని నమ్మకాలను, ఆలోచనలను మీతో పంచుకుంటాను. వీటిల్లో కొన్ని వ్యాఖ్యానాలు మూలం హిందీ, ఉర్దూ భాషల నుండి అనువదించబడ్డాయి, కాబట్టి అనువాదంలో లోపాల వల్ల కొన్ని భావాలు యథాతథంగా తర్జుమా అయి ఉండకపోవచ్చు. వాటిని పాఠకులు క్షమించవలసి ఉంటుంది. బక్షి వృత్తి జీవితమంతా విస్తరించిన ఆలోచనల సమాహారం లోని ఒక భాగం ఇక్కడ ఉంది. కాబట్టి, ఆయన డైరీ లోని మొదటి పేజీలో వ్రాసే ఈ పంక్తులతో ప్రారంభిద్దాం: ‘నేను దివ్య కాంతి, దైవిక శక్తి యొక్క జీవిని. విశ్వం అందించే ప్రతిదానికీ నాకు ప్రాప్యత ఉంది. నేను ఎప్పుడైనా చేయిజాచి నాకు కావలసినది తీసుకోగలను లేదా చేయగలను.’

ఆయన సాహిత్యం కాల పరీక్షకు తట్టుకుంది. ఎలా అంటారా! 50ల చివరలో, విజయవంతమైన గీత రచయితలు కూడా అయిన కొంతమంది కవులు ఆనంద్ బక్షిని చిన్నచూపు చూసేవారు. ఆయన విజయం సాధించి తన కెరీర్‌లో అత్యున్నత స్థాయికి చేరుకున్న తర్వాత కూడా, కొంతమంది పాత తరం గీత రచయితలు ఆయన రచనలను తమ రచనల కంటే తక్కువ స్థాయిగా పరిగణించారు. “ఆనంద్ బక్షి తుక్బందీ కర్తా హై. వో తో షాయర్ హీ నహీ” (బక్షి, ఏదో నాలుగు ముక్కలు రాస్తాడు, అసలు కవే కాదు). ఇటువంటి విమర్శలకు బక్షి ఎల్లప్పుడూ ప్రతిస్పందనగా “నేను ఎప్పుడూ కవినని చెప్పుకోలేదు. అంతేకాకుండా, ఎవరి ఇష్టం వారిది, ఎవరి ప్రతిభ వారిది” అని అనేవారు.

తోటివారి కంటే భిన్నమైన గీత రచయిత

భారతీయ చలనచిత్ర గీతం – భక్తి, శాస్త్రీయ, జానపద, పాశ్చాత్య సంగీతాల మధ్య అంతరాన్ని తగ్గించింది. అందువల్ల, ఒకే పాట వివిధ వర్గాల ప్రజలందరికీ నచ్చింది, క్లాస్, మాస్, ఇంకా దేశాల మధ్య అడ్డంకులను, సరిహద్దులను అధిగమించింది. అయితే, సినిమా పాటలని ఇప్పటికీ కొన్నిసార్లు కవిత్వానికి పేద గ్రామీణ బంధువుగా పరిగణిస్తారు. మతపరమైన పాటలను, షాయరీలను మెచ్చుకునేవారు – ఒకప్పుడు సినిమా పాటని అపవిత్రమైనదిగా తీసిపారేశారు.

ఒక గీత రచయిత ప్రత్యేక రకమైన వ్యక్తి కాకపోవచ్చు, కానీ ఒక గీత రచయిత ఒక ప్రత్యేక రకమైన కవి. సినిమా కథ అతను లేదా ఆమెతో కలిసి పనిచేయడానికి అవసరమైన భాగం; కథలో రూపకాలు, కవిత్వం మరియు తత్వశాస్త్రంతో కూడిన సాహిత్య వ్యక్తీకరణను అల్లుకోవాలి. బక్షిని తరచుగా ఆయన విజయానికి మూలం లేదా రహస్యం గురించి, ఆయన రాసిన అనేక పాటల వెనుక ఉన్న ప్రేరణ గురించి అడిగేవారు. నిజానికి, ఆయన ఎటువంటి సంకోచం లేకుండా తన రహస్యాన్ని తన పోటీదారులతో పంచుకుంటూ, “స్టోరీ సున్ కే హి దిమాగ్ చల్తా హై” (కథ విన్న తర్వాతే నా మనస్సు పనిచేయడం ప్రారంభిస్తుంది) అని చెప్పేవారు. ఇంకా, “అవును, రీడర్స్ డైజెస్ట్ మాసపత్రిక నన్ను రచయితగా, ఓ తండ్రిగా ప్రేరేపించింది” అన్నారు.

బక్షి ఒక పాటపై పని ప్రారంభించే ముందు, మొత్తం కథను తనకు మళ్లీ మళ్లీ చెప్పమని అడుగుతారని చాలా మంది దర్శకులు నాతో చెప్పారు. సినిమా కథాంశాన్ని గ్రహించిన తర్వాత, భూకంపం వచ్చినా కూడా ఆయన దృష్టి మరల్చలేదు.

ఆయనకి కథ అత్యంత ముఖ్యమైనదే అయినప్పటికీ, గీత రచయిత – సంగీత స్వరకర్త పాత్రను అర్థం చేసుకుని గౌరవించారు. ఒక పాటను ఒకచోట చేర్చేది స్వరకర్త, గాయకుడు, గీత రచయిత అనే ముగ్గురని ఆయనికి తెలుసు.

ఈ రోజుల్లో, గాయకులకు ఇతరులకన్నా ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వబడుతోంది, కొన్ని వేదికలపై, సంగీత స్వరకర్తలకు, గీత రచయితలకు కూడా గుర్తింపు లభించదు. మంచి పాట కథను సమర్థించాలి, స్క్రిప్ట్‌లోని అంశాలను ప్రతిబింబించాలి. కానీ ఇప్పుడు అది చాలా అరుదుగా జరుగుతోంది. బక్షికి, సినిమా సాహిత్యం రాయడం ఒక సవాలు, ఎందుకంటే రచయిత స్క్రిప్ట్ పరిమితుల్లో పని చేయాలి, పరిమిత ఆలోచనను, పరిమితమైన వ్యక్తీకరణ స్వేచ్ఛను ఇష్టపూర్వకంగా అంగీకరించాలి, గౌరవించాలి. వాస్తవానికి, గీత రచయిత కూడా కవిలా ఆకాశంలో ఎగరగలడు, కానీ కథాకాశంలో మాత్రమే! కవిత్వంతో పోలిస్తే ఇది కష్టమైన రంగంగా మారుతుంది.

కవిలా కాకుండా, సినిమా పాటల రచయిత తన స్వంత వ్యక్తిత్వాన్ని కోల్పోకుండా ఇతరులతో కలిసిపోవాలి.

పండిట్ నరేంద్ర శర్మ సినిమా సాహిత్య కళను చాలా అందమైన పదాలలో వర్ణించారు: “సినిమా పాటల రచయిత శ్రోతను ప్రేరేపిస్తాడు, అలరిస్తాడు. తానే బహుశా దాని రచయిత, దాని గాయకుడు లేదా దాని సంగీత స్వరకర్త కావచ్చు అని నమ్మేలా ప్రోత్సహిస్తాడు.”

గీత రచన, అంతకు మించి

‘నా కుటుంబానికి భద్రత కల్పించడమే నా అంతిమ లక్ష్యం. నా నూతన సంవత్సర సంకల్పం ఎల్లప్పుడూ నా కుటుంబం సంతోషంగా ఉండటం. మనస్సు, హృదయం, చేతులు నిండేలా పని దక్కించుకోడటం నాకు ముఖ్యం.

నేను బాల్యంలో ఒక సరదాగా, తరువాత, యుక్తవయస్సులో, ఒక అభిరుచిగా, వృత్తిగా పాటలు రాసినా – త్వరలోనే నా కుటుంబ ఆర్థిక భద్రత కోసం రాయడం ప్రారంభించాను, ఇప్పుడు అది లేకుండా నేను లేను కాబట్టి కొనసాగిస్తున్నాను. కొన్ని పాటలు జీవిక కోసం రాశాను, కొన్ని నా హృదయం కోసం. నా సంగీత దర్శకులు, నిర్మాతలు, ఇంకా నా కుటుంబం కోసం నా వంతు కృషి చేయడం నా పరమ కర్తవ్యం (ప్రధాన బాధ్యత). అన్నింటికంటే ముఖ్యం, నేను జీతం తీసుకుంటున్న పనివాడిని.

ఏదో ఒక రోజు, ఈ షో ముగుస్తుంది. నా ముగింపు – ప్రతి రకమైన ముగింపు – తార్కికమే. నేను ఇతరులను అధిగమించినప్పుడు, మరో రోజున మరికొందరు నన్ను అధిగమించి, నా అభిమానులను వారి కొత్త లేదా మెరుగైన శైలులతో, వారి మాటలతో తమ వైపు తిప్పుకుంటారు. జీవితం ఒక చక్రభ్రమణం – తిరుగుతూనే ఉంటుంది. నా పాటలు బాగా ఆడుతుంటే, నేను సంతోషంగా ఉన్నాను. అవకాశాలు రాకపోతే? పర్వాలేదు. దీని వల్ల ప్రపంచమేమీ అంతమైపోదు కదా? కవులు శాశ్వతంగా కవితలు రాయవచ్చు, కానీ నేను, గీత రచయితని, నిర్దిష్ట సినిమా కథలకు, పరిస్థితులకు అనుగుణంగా రాశాను. కథ స్ఫూర్తిదాయకంగా లేనప్పుడు, నా సాహిత్యంలో కొంత ప్రాణం పెట్టడానికి నేను మరింత కష్టపడాల్సి వచ్చింది.

నా కొన్ని పాటల లయలు హృదయ స్పందనలలాగా వినిపిస్తాయి. నా హృదయ స్పందనల ఛందస్సుకు అనుగుణంగా కొన్ని పాటలు రాశాను. మన హృదయ స్పందనల మాదిరిగానే నా పాటలు కూడా స్పందిస్తాయి.

నా పాటలు నా హృదయంపై ప్రభావం చూపాయి. ఒకరోజు, నేను రాయలేకపోవచ్చు, లేదా ప్రజలకు నా అవసరం ఉండదు. అయితే పరిశ్రమ నన్ను వదిలేసే ముందే, నేను పరిశ్రమని వదిలివేస్తాను. వెళ్ళిపోయేటప్పుడు, నేను విజేతగా మాత్రమే వెళ్తాను, రన్నరప్‌గా కాదు. నేను బూట్లు వేసుకునే చనిపోతాను; అదే మాకు సైన్యంలో నేర్పించారు.

నేను ఇక్కడికి చాలా ప్రతికూలతలతో వచ్చాను. నాకు మొదట్లో ఎవరూ అండగా లేరు, నా కుటుంబం నుండి కూడా మద్దతు లేదు. అయితే, ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే, నాకు పెద్ద ప్రయోజనం ఉందని గ్రహించాను: నా సాహిత్యంతో పంజాబీ జానపద గీతాలను పాడగలను, బాణీలను సూచించగలను; ఈ రెండూ నాకు సహజంగానే వచ్చాయి. నేను చిన్నప్పటి నుండి నా మిత్రుల కోసం నా స్వంత కవితలను పాడేవాడిని, స్వరపరిచేవాడిని; సైన్యంలోని నా సహచరుల కోసం కూడా నేను అలాగే చేశాను. అది నాకు ప్రయోజనం చేకూర్చడానికే అని నాకు అప్పుడు తెలియదు. అంతేకాకుండా, నేను చిన్నప్పటి నుండి చేస్తున్న పాటలే నా టీనేజ్‌లో కవిత్వం రాయాలని నన్ను ప్రేరేపించాయి.

నేను సినిమా పాటలు ఎలా రాస్తాను? ఎల్లప్పుడూ మొదట పూర్తి కథను వింటాను, కథాంశాన్ని, పాత్రలను లోతుగా అర్థం చేసుకుంటాను, ఆపై పాటకు సంబంధించిన స్వకీయమైన పరిస్థితి. నేను చాలా మంచి శ్రోతని అని అనుకుంటున్నాను. మంచి కథలలోనే మంచి పాటలు ఉంటాయి. వాటిని పరిస్థితుల నుండి బయటకు తీసుకురావడమే ముఖ్యం. స్క్రిప్ట్ రైటర్, డైరెక్టర్ నాకు అందించిన సూచనల నుండి నేను నా పాటలను అన్‌లాక్ చేస్తాను. తర్వాత నేను విన్నవన్నీ సంగీత దర్శకుడితో, దర్శకుడితో పలుమార్లు చర్చిస్తాను; ఆ తర్వాతే మేము కలిసి బాణీ కట్టడంలో, పాట రాయడంలో ముందుకు వెళ్తాము. స్టోరీ మే హి గానే హోతే హైఁ (పాటలు కథలో ఉంటాయి). పాట తెరపై ఎలా ప్రదర్శితమవుతుందో నేను ఎల్లప్పుడూ మనసులో ఊహిస్తాను, దర్శకుడు దానిని ఎలా చిత్రీకరిస్తాడో నాకు తెలియకపోయినా నేను దానిని దృశ్యమానం చేయగలను. సుభాష్ ఘాయ్ వంటి చిత్రనిర్మాతలు నా సాహిత్యాన్ని చాలా బాగా చిత్రీకరించడం ద్వారా అసాధారణ స్థాయికి తీసుకెళ్తారు.

మంచి దర్శకులు నాతో మంచి పాటలు రాయిస్తారు ఎందుకంటే వారు మంచి కథలతో నన్ను ప్రేరేపిస్తారు, కొన్నిసార్లు వారి జీవిత అనుభవాలను పంచుకుంటారు. మంచి దర్శకుడు నేను పాట రాయడం ప్రారంభించే ముందే నా మనసులో ఆ పాటను చూడటానికి సహాయం చేస్తాడు. మంచి దర్శకులు గీత రచయితలను, స్వరకర్తలను ప్రేరేపిస్తారు, కాబట్టి వారు మంచి సంగీతానికి కూడా అర్హులు. మంచి సంగీతం, మంచి సినిమాలు ఒకదానికొకటి పూరకంగా ఉంటాయి. నాకు, పాట రాయడం కంటే భావనను స్పష్టంగా తెలుసుకోవడానికి ఎక్కువ సమయం పడుతుంది.

కథ, పాత్ర చిత్రణ, నటుడు పాటకి పెదాలు కదపటం, గాయకుడు వంటి అంశాలన్నింటినీ నేను పోషించుకుంటాను. జానపద పాటల లయలు, ఛందస్సు కూడా నాకు ప్రేరణ. రావల్పిండిలో నా పదిహేడేళ్ల కాలంలో నేను చాలా జానపద పాటల్ని, సినిమా పాటల్ని విన్నాను. నేను వ్రాసిన వాటిని చాలా సులభంగా స్వరపరచగలిగాను. అయితే, కథ నా ప్రాథమికమైనది, నా చేతన ప్రేరణకు మూలం. మిగతావన్నీ – నా అనుభవాలు మొదలైనవి – ద్వితీయమైనవి, ఉపచేతనమైనవి. నేను కవిత్వం, షాయరీ, రచనలో ఎప్పుడూ ప్రయత్నించలేదు; అలా జరిగితే, అది నా ఉపచేతన నుండి ఉద్భవించిన సహజమైన స్వీయ వ్యక్తీకరణ మాత్రమే. నేను రాసేటప్పుడు కొన్నిసార్లు ఈలలు వేస్తాను లేదా కూనిరాగాలు తీస్తూ రాస్తాను (గున్-గునాతా లిఖ్తా హూఁ), ఎందుకంటే అది నాకు రాయడంలో తోడ్పడుతుంది, నేను రాసే మాటలని పాడటం వల్ల సరైన ఛందస్సుని గ్రహించడానికి సహాయపడుతుంది.

నేను కొన్నిసార్లు ఆ ట్యూన్‌ని స్వరకర్తలకు సూచిస్తాను; తర్వాత దాన్ని ఉపయోగించాలా వద్దా అనేది వారి ఇష్టం. కొన్నిసార్లు నేను రాసిన దాన్ని ఉట్టిగా చదవకుండా పాడమని అడుగుతారు. ఆ విధంగా నా సాహిత్యం కోసం నా మనసులో ఏ ట్యూన్ ఉందో వారు వింటారు. అప్పుడు వారు దానిని ఉపయోగించుకుంటారు లేదా తిరస్కరిస్తారు. మరికొందరు రచయితల మాదిరిగా కాకుండా, ముందుగా సెట్ చేసిన ట్యూన్లకు పాటలు రాయడానికి నాకు అభ్యంతరం లేదు; 80 శాతం సార్లు నేను ముందుగా సెట్ చేసిన ట్యూన్లకే వ్రాసాను.

ఒక నిర్దిష్ట శ్రావ్యతకు అనుగుణంగా రాయడం వల్ల కలిగే ప్రయోజనం: ఇది రచయితకు వ్రాయడానికి వివిధ రకాల మీటర్లను ఇస్తుంది. మొదట పదాలను వ్రాసి, ఆపై వాటిని ఒక శ్రావ్యతకు అనుగుణంగా మార్చడం వల్ల కలిగే ప్రతికూలత: పాట పాడటానికి అంత శ్రావ్యంగా ఉండకపోవచ్చు. గీత రచయిత రాసేటప్పుడు పదాలు – బాణీ మధ్య చక్కటి సమతుల్యతను కొనసాగించాలి.

సైన్యంలో ఉన్నప్పుడు పలు రాష్ట్రాలు, ఎన్నో గ్రామాలలో విస్తృతంగా ప్రయాణించడం నాకు లభించిన మరో ప్రయోజనం. ఈ బహిరంగ అనుభవాలు నన్ను వివిధ రకాల వ్యక్తులను కలిసేలా చేశాయి, వారికి ఇష్టమైన పాటల గురించి వినడం ద్వారా, ఒక పాటను ప్రజాదరణ పొందేలా చేసేది ఏమిటో నేను క్రమంగా, ఎఱుకతో నేర్చుకున్నాను.

నాకు తెలియకుండానే నాకు సహాయపడిన మరో విషయం: నా భయాలు. నా తల్లి చనిపోయిన తర్వాత నేను ఒంటరిగా ఉండాలంటే భయపడడం సాగాను. 1947 అక్టోబర్ 2 రాత్రి – రాత్రికి రాత్రి మేము శరణార్థులుగా మారిపోయినప్పుడు మొదటిసారి ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నాను. ఇక, చాలా సంవత్సరాల తరువాత 1970లలో, నేను చాలా విజయం సాధించిన తర్వాత కూడా, నేను తదుపరి పాటను అందించలేనేమోననీ, ఇక అంతేననీ, నా పనైపోయిందని అనుకునేవాడిని నా విజయం గాలివాటుదనీ, నాది అదృష్టమని జనాలు అనుకుంటారమోననే భయం నన్ను పీడించసాగింది. విచిత్రమేమిటంటే, యహీ డర్ ముఝే శక్తి భీ దేతా హై (ఇదే భయం నాకు బలాన్ని ఇస్తుంది), రాణించడానికి ప్రోత్సహిస్తుంది. వైఫల్య భయం నన్ను ముంచెత్తినప్పుడల్లా, పాడుకోవడానికి “మై కోయి బర్ఫ్ నహీ హూఁ జో పిఘల్ జావుంగా” అనే కవిత రాసుకున్నాను. దశాబ్దాల తర్వాత 2002 ఫిబ్రవరిలో నా ప్రియమైన స్నేహితుడు సుభాష్ ఘాయ్‌కి నేను దానిని బహుమతిగా ఇచ్చాను. కానీ నా అంతరంగిక భావాలను వ్యక్తపరచాలనే నా అవసరం నుండి నాకు రాయాలనే మక్కువ వచ్చింది. నేను వేరే విధంగా పెద్దగా మాట్లాడను, కానీ నేను చెప్పాలనుకుంటున్నది చాలా ఉంది, పాటలు రాయడం నా మార్గం.

యువతకు నా సలహా: పాటలో ఛందస్సు, లయ ఉండాలి. నేను పాటలు రాసేటప్పుడు ఎక్కువ సమయం ఈల వేస్తాను. కొన్ని ట్యూన్‌లను సంగీత దర్శకుడు నాకిస్తారు, కొన్ని రాసేటప్పుడు సహజంగా నాకు తడతాయి. ఇంకా, యువకులకి చాలా చదవమని నేను సలహా ఇస్తాను. రోజూ. సాహిత్యం. జోకులు. ఇతిహాసాలు, కవిత్వం చదవండి. మీరు గీత రచయిత కావాలనుకుంటే సంగీతం నేర్చుకోండి. హిందీ, ఉర్దూ నేర్చుకోండి. బాక్సాఫీస్ ఊహించలేనిది, మన రచయితల మాదిరిగానే రంగీన్ మిజాజ్ (రంగురంగుల స్వభావం) కలిగి ఉంటుంది. సరసమైన, అత్యంత సున్నితమైన మనస్సు కలిగి ఉండకపోతే. మీరు వ్రాయలేరు, ముఖ్యంగా, మీలోని ధైర్యాన్ని పోషించాలి.

నేను స్థిరపడిన తర్వాత చాలా మంది కొత్త సంగీత దర్శకులను ప్రోత్సహించాను, వారితో పనిచేశాను, ఎందుకంటే కభీ మై భీ తో నయా థా (నేను కూడా ఒకప్పుడు కొత్తవాడినే). ప్రసిద్ధ నిర్మాతలు, స్వరకర్తలు, గీత రచయితల నుండి నాకు లభించిన ప్రోత్సాహానికి ఇది నా కర్తవ్యం.

ఎస్.డి. బర్మన్ దాదాకు ఉర్దూ లేదా హిందీ పెద్దగా రాదు, నేను నా కెరీర్ ప్రారంభంలోనే ఆయన నుండి నేర్చుకున్నాను. ఆయన కథను, సాహిత్యాన్ని అర్థం చేసుకోవడానికి చాలా కష్టపడ్డాడు, సాహిత్యాన్ని పాటగా మార్చే ముందు, కథను జాగ్రత్తగా విని పాటకు న్యాయం చేస్తాననే నా నమ్మకాన్ని ఆయన మళ్ళీ ధృవీకరించారు.’

ఇక్కడ, నేను నా కాలేజీ రోజుల్లో జరిగిన ఓ సంఘటనని పాఠకులతో పంచుకోవాలి. అప్పట్లో నేను ఒక అమ్మాయిని ప్రేమించాను, ఆ విషయం నాన్నకి తెలిసింది. “ఈ ‘నాన్సెన్స్’ అంతా వెంటనే ఆపు” అని అన్నారు. “అయితే నాన్నా, మీరు రాసిన ప్రేమ పాటల సంగతేంటి? బేతాబ్‌లో ‘జబ్ హమ్ జవాన్ హోంగే’ అని, రాకీలో ‘క్యా యాహీ ప్యార్ హై’ అని, జూలీలో ‘దిల్ క్యా కరే, జబ్ కిసీ కో, కిసీ సే ప్యార్ హో జాయే’, బాబీలో ‘మెయిన్ షాయర్ తో నహీం, మగర్ ఏ హసీన్, జబ్ సే దేజ్ఖా ఇన్ జబ్ సే దేజ్ఖా’ అని చెప్పింది మీరే కదా..” అన్నాను.

అప్పుడు నాన్న, “నేను ఈ పాటలను సినిమాల్లోని పాత్రల కోసం రాస్తాను. అది కల్పితం. నీకు యుక్త వయసు వచ్చినప్పుడు, చదువు పాడుచేసుకుంటూ ప్రేమ వ్యవహారం నడపడానికి ఉదాహరణగా నిలవాలని నేను వాటిని రాయలేదు!” అని జవాబిచ్చారు.  అంటే, నాన్నలోని గీత రచయిత – కుటుంబ జీవితానికి, వృత్తికి మధ్య ఒక గీత గీసాడు. నాన్న వాదనను సమర్థించేలా, నేను మరో విషయం చెప్తాను. ఆయన హైస్కూల్ చదువు పూర్తి చేయలేదు; నాకు కాలేజీకి వెళ్ళే అవకాశం ఉన్నందున, నా జీవితంలో ఆ దశలో స్నేహం చేసే అమ్మాయిలు కాకుండా, ‘గర్ల్‌ఫ్రెండ్’ ఉండి ఉండవచ్చని నాన్న భావించి ఉండాలి. దాన్నే నాకు అర్థమయ్యేలా చెప్పాలని అనుకున్నారు.

(మళ్ళీ కలుద్దాం)

Exit mobile version